
నా జీవన యానంలో- రెండవభాగం- 59
-కె.వరలక్ష్మి
కార్యక్రమం మధ్యలో గునుపూడి అపర్ణగారి పుస్తకం ‘ఘర్షణ’ ను నాచేత ఆవిష్కరింపజేసారు. ఇండియా నుంచి పిలిచిన టి.వి.9 ఆర్టిస్టులు కొన్ని మిమిక్రీ కార్యక్రమాలు చేసారు, సినిమా నటుడు నారా రోహిత్ కి ఇక్కడ ఏవో షూటింగ్స్ ఉన్నాయట. అతన్ని పిలిచేరు. అతని చేత నాకు షాల్ కప్పించి సన్మానం చేసారు. మస్తుగా యాపిల్ ముక్కలు వేసిన ఉగాది పచ్చడి తిని తిరిగొచ్చాం. ఆ మర్నాడు అపర్ణగారింట్లో వీక్షణం మంత్లీ కార్యక్రమం జరిగింది. ‘ఘర్షణ’ పుస్తకాన్ని ఇంకోసారి ఆవిష్కరించాం. చక్కని సంభాషణలు, క్విజ్, సాహిత్య కార్యక్రమాల మధ్య చక్కగా గడిచింది. నా కథలు అప్పటికే అందరూ చదివి ఉండడం వల్ల సాహిత్య కార్యక్రమాల్లో నాకొక ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చేవారు, ఇండియాలో కన్నా అమెరికాలో సాహిత్యానికి, నాట్యంలాంటి కళలలకూ మంచి ఆదరణ, గౌరవం ఉన్నాయి.
ఆ మార్చి నెల చివరి వీకెండ్ సాటర్ డే ఉదయాన్నే బయలుదేరి సౌత్ లో ఉన్న గిల్ రాయ్ లో నర్సరీలు, మొక్కలు చూసి, మౌంట్ మడొన్నాలో ఉన్న సంకట్ మోచన్ హనుమాన్ గుడి చూసి కిందికి దిగి వాట్సన్ విల్లోలో పాండా ఎక్స్ ప్రెస్ లో లంచ్ చేసి సముద్రపు వొడ్డునే ప్రయాణిస్తూ మోంటరే చేరుకున్నాం. అక్కడి సముద్రపు వొడ్డున చాలాసేపు గడిపి సీసైడ్ లో ఉన్న హోటల్ హోవర్డ్స్ సూట్ కి చేరుకుని రాత్రికి ఇండియన్ రెస్టారెంట్ ఏంబ్రోసియాలో నిద్రపోయాం. ఉదయం తిరిగి మోంటరే వెళ్లి బే ఆక్వేరియంలో ఒక్కొక్కరికి 40 డాలర్లు చొప్పున టిక్కెట్లు కొనుక్కుని మధ్యాహ్నం వరకూ తిరిగి చూసి 17 మైల్ డ్రైవ్ సీషోర్ చూస్తూ కేరమిల్ బీచ్ లో కొంతసేపు గడిపి తిరిగి రాత్రి 9 కి ఇంటికి చేరుకున్నాం.
ఆ సంవత్సరం ఏప్రెల్ 15 న సియాటిల్ ప్రయాణం పెట్టారు. అప్పటి వరకూ ఎక్కడికెళ్లినా కారులోనే. సియాటిల్ దూరం కాబట్టి ఫ్లైట్ లో జర్నీ. పొద్దున్నే 6.20 కి ఫ్లైట్. రాత్రి అలారం పెట్టుకుని 3కి లేచేసాం. శానోజే ఎయిర్ పోర్ట్ కి 4.30 కి చేరుకున్నాం. తీరా చెకింగ్ లో నుంచున్నప్పుడు తెలిసింది, నా పాస్ పోర్ట్ తేలేదని, ఇంట్లో నా బేగ్ లో ఉందది, తేవాలని తెలీని అజ్ఞానం నాది, పాపం సత్యవెంటనే బైటికి పరుగెత్తేడు. ఎయిర్ పోర్ట్ లోనే కార్ పార్క్ చేసిన చోటికి బోలెడు దూరం. కారు తీసేక అరగంట పైన డ్రైవ్. నేను నివ్వెరపోయి నిలుచున్నాను. టైంకి తేలేకపోతే టిక్కెట్లు వేస్ట్ అయిపోతాయి. మొత్తానికి వగరుస్తూ పాస్ పోర్ట్ పట్టుకుని వచ్చేడు సత్య. ఈ లోపల ఒకటే టెన్షన్. హమ్మయ్య అనుకుని పరుగెత్తి ఫ్లైట్ ఎక్కేం. ఉదయం 8.20 కి వాషింగ్టన్ స్టేట్ లో ఉన్న సియాటిల్ సిటీలో దిగేం. రెంటల్ కారు పికప్ చేసుకుని ఎయిర్ పోర్ట్ నుంచి బైటికొచ్చేసరికి 12 కావచ్చింది. సముద్రపు వొడ్డునే ఉన్న ఒక ఓల్డ్ మార్కెట్ పైక్ ప్లేస్ లో ఇండియన్ రెస్టారెంట్ లో రోటీలు, ఫ్రైడ్ రైస్ తిని, నీడిల్ టవర్ పైకెక్కి సిటీ వ్యూ చూసాం. పక్కనే ఉన్న గ్లాస్ మ్యూజియంలో అద్భుతమైన రకరకాల గాజుపూల ఆకారాల్ని చూసాం. ఆ రాత్రికి హేంప్టన్ గ్రూప్ హోటల్లో బస. ఉదయం seatak(సియాటిల్-టకోమా) ఎయిర్ పోర్ట్ లో దిగిన వెంటనే రెంటల్ కారు కోసం బైటికి రావడానికి ట్రెయిన్ ఎక్కేటప్పుడు తలుపులు మూసుకునేలోపల అందరూ ఎక్కేరు. నేను ఎక్కలేకపోయాను. రౌండప్ ట్రెయిన్ కాబట్టి గీత వచ్చి తీసుకెళ్లింది. 16వ తేదీన బ్రేక్ ఫాస్ట్ తర్వాత స్కాజిట్ వేలీ – స్కాజిట్ కౌంటీలో ఉన్న తులిప్ గార్డెన్స్ కి వెళ్లేం. అక్కడ తులిప్ గార్డెన్స్, తులిప్ టౌన్ అనే రెండు ప్రదేశాల్లో తులిప్స్, డాఫోడిల్స్ పూల తోటలలోకి వెళ్లి చూసేం. సినిమాల్లో తరచుగా కన్పించే రంగురంగుల తులిప్ పూలు కన్నుల పండుగ చేసాయి.అక్కడే లంచ్ ముగించి నార్త్ కి 50 మైళ్లు ప్రయాణించి బ్లెయిన్ అనే ఊళ్లో ఉన్న కెనడా సరిహద్దు ‘పీస్ఆర్క్ స్టేట్ పార్క్’ చేరుకున్నాం. ఒకే గార్డెన్ లో లాన్ కి ఇవతల అమెరికా, అవతల కెనడా ఉన్నాయి. అర్థచంద్రాకారంలో ఉన్న పసిఫిక్ ఓషన్ వొడ్డున నిల్చుని సాయం సూర్యకాంతిలో అవతలికొండ మీది కెనడా టౌన్ చూసాం. ‘పీస్ ఆర్క్’ దగ్గర రెండువైపులా నిలబడి ఫోటోలు తీసుకున్నాం. ఎన్ని పీస్ ఆర్క్ లు సరిహద్దుల్లో ఉన్నా రాజకీయనాయకులు యుద్ధాలు తలపెడితే సామాన్య జనం ఏమీ చెయ్యలేరు కదా! అక్కడి సముద్రపు వొడ్డు మడ్ సీ. ఉత్త బురదమయంగా ఉంది. ఓడల తయారీ చూసి వెనక్కి మళ్లేం. రాత్రి 12 కి తిరిగి సియాటిల్ లో రూంకి చేరుకున్నాం. ఆ మర్నాడు అంటే ఏప్రిల్ 17న సియాటిల్ నుంచి దేవనగంలా మబ్బుల్తో దోబూచులాడుతూ కన్పించే మౌంట్ రెయినీర్ ను 80 మైళ్లు డ్రైవ్ చేసుకుని కొండలు, పొడువైన పైన్ చెట్లు దాటుకుని వెళ్లి చూసేం. దట్టమైన మంచుతో కప్పబడిన అందమైన అగ్ని పర్వతమట అది. తిరిగి వెనక్కి బయలుదేరి 130 మైళ్లలో ఉన్న స్నోకాల్మీ అనే చిన్న వాటర్ ఫాల్స్ చూసాం. అక్కడొక పవర్ ప్రాజెక్ట్ ఉంది. ఆ చుట్టు పక్కల ప్రాంతాలకి కరెంట్ సప్లైచెయ్యడానికి. తిరిగి వస్తూ మేం బయలుదేరినప్పటి నుంచీ పిలుస్తున్న, 20 నిమిషాల డ్రైవ్ లో ఉన్న కాసానిసోమయ్య గారి అబ్బాయి ఇంట్లో డిన్నర్ చేసాం. కొంతసేపు వాళ్లతో కబుర్లతో గడిపి, దారిలో మైక్రోసాఫ్ట్ మెయిన్ ఆఫీసు చూసి తిరిగి వచ్చేం. ఆ మర్నాడు బ్రేక్ ఫాస్ట్ తర్వాత రూం వెకేట్ చేసేసి సియాటిక్ నగరాన్ని ఆనుకుని ఉన్న ‘పుగెట్ సౌండ్’ అనే సముద్రం మీద పెద్ద కార్గోషిప్ లో కారుతో బాటు ఎక్కి ఆర్కాస్ ఐలేండ్ కి వెళ్లేం. నడిచి తిరిగేసేంత చిన్న ఐలేండ్ అది. కాస్సేపు ఐలేండ్ లో తిరిగి చాలా రుచిగా ఉన్న థాయ్ వెజ్ లంచ్ చేసి తిరిగి సియాటిల్ వచ్చేం. అలా సిటీలో తిరుగుతూ మరికొన్ని ప్రదేశాలు చూసి, 8.20 కి ఫ్లైట్ ఎక్కి 10.20 కి శానోజేలో దిగేం.
ఆ మర్నాడే మధ్యాహ్నం 3 కి వీక్షణం సమావేశం ఫ్రీమౌంట్ లో ఉన్న బి.పి. కరుణాకర్ గారమ్మాయి జయశ్రీ ఇంట్లో జరిగింది. కరుణాకర్ గారు జనవరిలో వచ్చారట. తన కథలగురించి మాట్లాడేరు. గీత ఆయన కథ ఒకటి చదివింది, చదివించే లక్షణమున్న చిన్న కథలు ఆయనవి, జీవితాల్ని ఎంత వరకూ ప్రతిబింబిస్తాయో చెప్పలేం, సరదాగా నాకూ అలాంటి చిన్న కథ ఒకటి రాయాలన్పించింది, ఆయన కొత్త పుస్తకం ‘రెల్లు’ ఇచ్చారు. జయశ్రీ రకరకాల రుచికరమైన వంటల్తో సమావేశానికి వచ్చినవారందరికీ ఆతిథ్యమిచ్చింది.
ఆ ఏప్రెల్ 24న నేపాల్ లో 7.5 దాటి భారీ భూకంపం వచ్చింది. టివిలో ఆదృశ్యాలు చూసి చాలా దుఃఖం కలిగింది. అప్పటికి గనిశెట్టి లక్ష్మీనారాయణ గారు ఫ్రీమౌంట్ లో వారి అబ్బాయి ఇంట్లో ఉన్నారు. వారి మనవరాలి పుట్టిన రోజుకి పిలిచేరు. వెళ్లేటప్పుడు టంబర్డన్ బ్రిడ్జి చూపించింది గీత. తను ఆ బ్రిడ్జి గురించి ఒక పోయెమ్ రాసింది. ఒక రోజు శాన్ ఫ్రాన్సిస్కో వెళ్లేం, ముందుగా సిటీహాల్ కి వెళ్లేం. లోపల ఒక రాజభవనం లాగా అద్భుతంగా ఉంది. వాషింగ్టన్ డిసి లోని డోమ్ కన్నా ఈ భవనపు డోమ్ పెద్దదట, మేం వెళ్లిన టైంకి ‘గే’ లు తమను వేరుగా చూడొద్దని బిల్డింగ్ బైట ధర్నా చేస్తున్నారు. చాలామంది ఉన్నారు. బిల్డింగ్ ఎదుట ఉన్న పార్క్ లో చైనీస్ ట్రెడిషనల్ ఆర్ట్ లో యానిమల్స్ ఆకారాలు రంగురంగులవి పెద్దవి పెట్టేరు. వాటిని చూసి, గోల్డెన్ గేట్ బ్రిడ్జి దగ్గరకు వెళ్లేం, ఏప్రెల్ నెలలో అక్కడి చలి భరించలేకుండా ఉంది. ఇక సీషోర్ మాట చెప్పక్కర్లేదు.
మే నెలలో బాటా వాళ్ల స్కూల్స్ వార్సికోత్సవం శాన్ రోమన్ మిడిల్ స్కూల్ లో జరిగింది. ఉదయం పదినుంచి రాత్రి పొద్దుపోయేవరకూ అక్కడే గడిచింది, పిల్లలందరూ తెలుగులో రకరకాల కార్యక్రమాలు చేసేరు, ఎంతో కష్టపడి తెలుగు పలకగలుగుతున్నారు. గీత ఆ స్కూల్స్ కి కో ఆర్డినేటర్, ప్రోగ్రామ్స్ కి ఎనౌన్సర్ గా కూడా చేసింది, వరు కూడా రెండు ప్రోగ్రామ్స్ లో పాల్గొంది. సాయంకాలం మన టీవీ ఎనౌన్సర్ సుమ వచ్చింది. తన మాటల్తో అలరిస్తూ పిల్లలకి గ్రాడ్యుయేషన్ పతకాలు, సర్టిఫికెట్లు పంచింది. ‘కొత్తావకాయ్’ పేరుతో రాస్తున్న సుస్మిత అనే అమ్మాయి నా దగ్గర కొచ్చి పరిచయం చేసుకుంది. నా కథలు చదువుతుంటానని చెప్పింది, తన రచనలు నాకూ ఇష్టమే, అప్పటికి ఐదారేళ్ల వాళ్లబాబు చక్కగా కరుణ శ్రీ పద్యాలు చెప్పేడు స్టేజిమీద.
మే 15న సన్నీవేల్ లో గీత వాళ్లింటి ఎదుట ఉన్న కంబర్ లాండ్ ఎలిమెంటరీ స్కూల్లో ఫంక్షన్ కి వెళ్లేం. అమెరికాలో ప్రపంచదేశాలన్నిటినుంచీ వచ్చిన వాళ్లు ఉన్నారు కాబట్టి విద్యార్థులు కూడా అన్ని దేశాల వాళ్లూ ఉంటారు. విద్యార్థుల పేరెంట్స్ తమ పిల్లలు చిన్న క్లాసుల్లో ఉన్నా సరే స్కూల్లో జరిగే ఈవెంట్స్ లో శ్రద్ధగా పాల్గొంటారు. ఉద్యోగస్తులకి ఇబ్బంది లేకుండా అలాంటివన్నీ వీకెండ్స్ లోనే పెడుతుంటారు. విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ల వంటకాలు కొన్ని చేసుకొని వచ్చి ఏ దేశానికాదేశం టెంట్ వేసుకుని వాళ్ల జెండా పెట్టేరు. అటు తూర్పు దేశాలైన చైనా, జపాన్, కాంబోడియా, థాయ్ లేండ్, ఇండియా, శ్రీలంక మొదలు గల్ఫ్ లోని ఇరాక్ మొదలైన ముస్లిమ్ కంట్రీస్, యూరప్, రష్యాల్లోని కొన్ని దేశాలు వాళ్ల వాళ్ల ట్రెడిషనల్ డ్రెసెస్ లో స్టేజిపైన వాకింగ్, తర్వాత ప్రదర్శనలు ఇచ్చేరు. చాలా పెద్ద స్కూలది, ఓపెన్ ప్లేస్ లో పెట్టడం వలన చలికి తట్టుకోలేక 6.30 తర్వాత ఇంటికొచ్చేసాను. స్వెట్టరు, మఫ్లరు ఉన్నా గడ్డకట్టినంత చలి అన్పించింది.
మూర్ఖ చిహ్నాని షడితి
గర్వో దుర్వచనం ముఖే
విరోధీ విషవాదీచ
కృత్యాకృత్యం నమన్యతే
మూర్ఖుని లక్షణాలు ఆరు : గర్వం, పరుషవాక్కు, విరోధం, చెడుగా వాదించడం, యుక్తాయుక్త పరిజ్ఞానం లేకపోవడం. కొన్ని సందర్భాల్లో చిన్నప్పుడు చదువుకున్న ఇలాంటి శ్లోకాలు గుర్తుకొస్తాయి.
నేను వచ్చేసేలోపల ఇదివరకు చూడని మరికొన్ని ప్రదేశాలు చూపించాలని గీత తాపత్రయం. మే 22న మళ్లీ ప్రయాణం పెట్టేరు. కోమల్ కి కాలేజి సెలవు దొరకలేదు, మిగిలిన ఐదుగురం కారులో సౌత్ కి బయలుదేరేం శుక్రవారం సాయంత్రం 4కి రాత్రి 11 కి కాలిఫోర్నియా బోర్డర్ లో ఉన్న బార్ స్టో సిటీలోని ‘హాలిడే ఇన్’ హోటల్లో దిగేం. మర్నాడు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసి తిరిగి బయలుదేరాం. ఒక గంట ప్రయాణం చేసాక తెలిసింది సత్య కూల్ డ్రింక్స్ తో బాటు ఐస్ బాక్స్ రెస్టారెంట్లో వదిలేసాడని, వెళ్లేది చాలా వేడి ప్రదేశమట, మధ్యాహ్నం 2.30 కి గ్రాండ్ కేన్యాన్ సౌత్ రిమ్ ఎంట్రన్స్ చేరుకున్నాం. వర్షం ప్రారంభమైంది. ఎంట్రన్స్ లో చాలా పెద్ద క్యూ ఉంది. నాలుగు గంటలకి టిక్కెట్టు కౌంటరు దగ్గరకు చేరుకున్నాం. కారుకి 25 డాలర్లు. బస్సెక్కి బయలుదేరేసరికి కొండల నిండా మబ్బులు కమ్మేసి ఏమీ కన్పించలేదు. క్రమంగా కాస్సేపటికి మబ్బులు తొలగి అద్భుతమైన పర్వత దృశ్యాలు వెలువడ్డాయి. నిజంగా అది భూమిపైన ఒక అద్భుతం. కొన్నివందల మైళ్ల మేర కొండల్ని ఎవరో శిల్పి ఆలయాలుగా మలిచినట్టు రంగురంగుల రాతిపొరల అందాల దృశ్యాలు. వాటి మధ్యనుంచి వంపులు తిరిగి ప్రవహిస్తూన్న కొలరాడోనది. సంథ్యవాలే వరకూ చూసి అక్కడే డిన్నర్ ముగించి 175 మైళ్లు ప్రయాణం చేసి కింగ్ మేన్ అనే ఊళ్లో హేంప్టన్ ఇన్ హోటల్లో బసచేసేం. మర్నాడు ఉదయాన్నే బయలుదేరి గ్రాండ్ కెన్యాన్ వెస్ట్ రిమ్ చేరేం. మనిషికి 80 డాలర్లు టిక్కెట్టు. వాళ్ల బస్సెక్కి స్కైవాక్ బ్రిడ్జి చేరేం.
ఒక కొండ కొమ్మున అద్దంతో గుర్రపునాడా ఆకారంలో కింద ఏ ఆధారం లేకుండా నిర్మించిన పెద్ద బ్రిడ్జి అది. దాని మీద నడిచేటప్పుడు తెలుస్తుంది ఆకాశాన్నంటే కొండ అంచున ఉన్నామని. క్రింద అద్దం కావడం వల్ల భయం కలుగుతుంది. ఆ బ్రిడ్జి మీద నడిచేసాహసం కూడా చేసేసి, అటువైపు కెన్యాన్ పర్వతాలు, రెండో పాయింట్ కూడా చూసేసి, వాళ్లిచ్చిన లంచ్ తిని బయలుదేరేం. దారిలో కొలరాడో నదిపైన కట్టిన హూవర్ డేమ్ చూసి రాత్రి 7 కి లాస్ వేగాస్ చేరుకున్నాం. అద్భుతమైన వెనీషియన్ కాస్ట్లీ హోటల్లో బస. అదే పనిగా కారులో కూర్చోవడం వల్ల కొంత, మధ్యాహ్నం డేమ్ దగ్గర తగిలిన ఎండవల్ల కొంత నాకు ఆరోగ్యం చెడినట్టైంది. కాని, పైకి చెప్తే పిల్లల ఉత్సాహం చెడుతుందని ఓర్చుకున్నాను. లాస్ వేగాస్ పూర్తిగా జూదం మీద ఆధారపడి నడుస్తున్న నగరం. చీకటి పడింది మొదలు తిరిగి తెల్లవారే వరకూ వెలుగులు విరజిమ్ముతూ, మనుషుల్ని మోహావేశాల్లో, ఆశనిరాశల్లో ముంచి తేలుస్తూ తన ప్రభావాన్ని చూపించే నగరం. అన్ని హోటల్స్, భవంతులూ కేసినోలే. బహుశా జూదం ఆడేవాళ్లని రాత్రికి రాత్రి ధనవంతులుగానో, పాపర్లుగానో మార్చేస్తుంది కాబోలు!
ఇంచుమించు అన్ని దేశాల అద్భుతమైన భవనాలు అక్కడ చూడొచ్చు. ఇక వీధుల్లో సందడి చెప్పనక్కర్లేదు. రకరకాల కార్నివాల్స్ నడుస్తూ ఉంటాయి. నగ్నంగానూ అర్థనగ్నంగానూ రంగుల్లో మెరిసిపోతూ తిరిగే అమ్మాయిలు, అబ్బాయిలు, చెవులు హోరెత్తే జాజ్ సంగీతపు మోతలు. తమపైన తమకి అదుపు లేని వాళ్లకి స్వర్గంలా కన్పిస్తూ మోసగించే లోకం అది. అర్థరాత్రి దాటే వరకూ ఆ నగరపు జిలుగువెలుగుల్ని నడుస్తూ చూసి వచ్చేం. మర్నాడు లేస్తూనే మేం బస చేసిన హోటల్ని చూడడానికి వెళ్లేం. పగటి వెలుగుల్లో ఆ మరో ప్రపంచాన్ని చుట్టి వచ్చేసరికి లంచ్ టైం దాటింది. అప్పుడు బయలుదేరి 600 మైళ్లు (1000 కి.మీ.) ప్రయాణించి రాత్రి 2 కి సన్నీవేల్ చేరుకున్నాం.
*****

కె వరలక్ష్మి జన్మస్థలం, ప్రస్తుత నివాసం తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట. ప్రస్తుత నివాసం హైదరాబాద్. ప్రముఖ కవయిత్రి, “నెచ్చెలి” సంస్థాపకసంపాదకురాలు డా||కె.గీత వీరి అమ్మాయి. నాలుగు నవలికలు, 200 పైగా కథలు, చాలా కవితలు, రేడియో నాటికలు, వ్యాసాలు రచించారు. జీవరాగం (1996), మట్టి బంగారం (2002), అతడు నేను- (2007), క్షతగాత్ర (2014), పిట్టగూళ్లు (2017) కథా సంపుటులు, ఆమె (2003) కవితా సంపుటి, కథ, కథావార్షిక, రంజని, రచన, విశాలాంధ్ర, కవిత, కవితా వార్షిక, నీలిమేఘాలు మొ.లైన వెన్నో సంకలనాలు. అజో విభో విశిష్ట సాహితీ మూర్తి, ఆంధ్రప్రదేశ్ 2025 ఉగాది గౌరవ పురస్కారం, చాసో స్ఫూర్తి పురస్కారం, రంగవల్లి, విమలా శాంతి పురస్కారం, సహృదయ సాహితీ, బి.ఎస్ రాములు, హసన్ ఫాతిమా పురస్కారాలు, పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్శిటీ ధర్మనిధి పురస్కారం , రంజని, పులికంటి, ఆర్.ఎస్ కృష్ణమూర్తి అవార్డులు, అప్పాజోస్యుల- విష్ణుభొట్ల పురస్కారం, శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి సాహితీ పురస్కారం, ఆటా, తానా పురస్కారాలు మొ.నవి కథలకు అవార్డులు. శ్రీ శ్రీ, దేవుల పల్లి కృష్ణ శాస్త్రి అవార్డు మొ.నవి కవితలకు అవార్డులు. శాస్త్రీయ సంగీతం, గజల్స్ వినడం, మంచి సాహిత్యం చదవడం అభిరుచులు.
