
శబ్దాల శాంతి
(నెచ్చెలి-2025 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
– డా.లక్ష్మీ రాఘవ
పార్వతి మరో సారి పిలిచింది కూతురు వాణిని..
దగ్గరలోకూర్చుని ఉన్నా మౌనంగా తలతిప్పిన వాణితో
“ఏమిటో ఎప్పుడూ రెండుసార్లు పిలవాలి నిన్ను. మొదటి సారి పలకనే పలకవు..” విసుగ్గా అంది.
ఎవరు మాట్లాడినా వాణికి ప్రతి పదం చెవికి అస్పష్టంగా వినిపించేది… గొల్లగొల్లు, బద్దలైన రేడియోలా. కానీ, వాళ్ల మనసులో ఏముందో మాత్రం ఆమెకు స్పష్టంగా వినిపించేది. అందుకేనేమో చిన్నప్పటి నుండీ వాణికి మాత్రం ప్రపంచం చాలా భిన్నంగా వినిపించేది. అమ్మతో తనకు మాటల కంటే ముందే శబ్దాలు వినిపిస్తాయని చాలా చెప్పాలనిపించేది. కానీ అవకాశమే ఇవ్వకుండా వాణి చలాకీగా ఉండదని చాలా అమ్మ ఆరాటపడేది. అందుకే పార్వతి వాణికి ఆ వయసు పిల్లలకన్నా స్పందన తక్కువని, ఇదేదో జబ్బు డాక్టర్ కు చూపిద్దామని భర్త ముకుందాన్ని పోరింది. చిన్న చిన్న విషయాలకు డాక్టర్ దగ్గరికి తిరిగేంత డబ్బు మనకెక్కడిది“ అని ముకుందం వారించాడు. పార్వతి ఏమైనా నరే వెళ్ళాల్సిందే అని పట్టుబడితే ఒకరోజు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు.
అన్ని టెస్టులూ అయ్యాక అంతా నార్మల్ గానే ఉన్నట్టు తేల్చాడు డాక్టర్. పైగా అమ్మాయికి మాటలు వస్తాయి. వినికిడిలో లోపం లేదు. కాస్త నిదానం అంతే .. మీరే కాస్త కలివిడిగా ఉండేలా వాతావరణం కల్పించాలి అని చెప్పి పంపేశాడు ఆయన.
ఆ రోజు “అనవసరంగా వెళ్ళాము డాక్టర్ దగ్గరికి “అంటూ చాలా కోపం చేసుకున్నాడు పార్వతిని ముకుందం. తల్లిగా పిల్లల ఆరోగ్యం గురించి తనకు ఎంత బాధగా ఉంటుందో ఎలా తెలుస్తుంది అని మనసులోనే రోధించింది పార్వతి. వాణి అమ్మను జాలిగా చూస్తూ పక్కన చేరింది. దగ్గరగా వచ్చిన వాణిని గుండెలకి హత్తుక్కునది పార్వతి. అమ్మలో ఒక వర్షం కురిసిన శబ్ధం…స్పష్టంగా వినిపించింది.. అంటే అమ్మ బాధలో ఉంది అని.. అప్పుడు తన శబ్ధ అనుభవం అమ్మతో చెప్పాలనిఉన్నా…విడమర్చి చెప్పడం తెలీలేదువాణికి. వయసుతో బాటు క్రమంగా వాణికి ఒక అవగాహన వచ్చింది. తల్లి బాధగా ఉన్నప్పుడు .. ఆ శబ్దం ఒక తడిగా, వర్షంలా వినిపించేది. తండ్రి కోపంగా ఉన్నప్పుడు … అది గర్జనగా, ఉరుములా. మనసు ఆనందంగా ఉన్నప్పుడు… చక్కటి సంగీతమై అంటే మాటల కన్నాభావన శబ్ధ తరంగాలు మనసుని తాకుతాయి అన్న స్పష్టత వచ్చింది.
ఇది ఒక అసాధారణమైన విషయం కావచ్చు. కానీ ఎవరు నమ్ముతారు ?
***
తల్లికి తెలియ చెప్పడానికే వీలుకానప్పుడు స్కూల్ లో టీచర్చెప్పగలదా?.
స్కూల్ లో టీచర్ ‘“ఏదైనా అర్థమవుతుందా? అనే ప్రశ్న అడిగితే, వాణి వెంటనే స్పందించేది కాదు. ఎందుకంటే ప్రశ్నలోని మాట కంటే టీచర్‌లో ఉన్న చిరాకు మాత్రం ఆవిరిగా వినిపించేది.
చెవి తుడుచుకుంటూంటే పక్కన కూర్చున్న స్నేహితురాలు “చెవికి మంట వచ్చిందా” అని కిసుక్కున నవ్వింది. ఇంకా కొందరు ఎగతాళిగా మాట్లాడారు. దాంతో తన గురించి ఎవరికీ తెలియక్కర లేదని నిర్ధారించుకుంది. ఎవరూ తనను గమనించకుండా జాగ్రత్త పడింది. కానీ తనలో ఉన్న తపనను అరికట్ట లేకపోయెది. ఎవ్వరికీ అర్థం కానీ తనను ఒంటరితనమే వెంబడించింది.
ఎలాగో చదువు పూర్తి అయి ఉద్యోగంలో చేరింది. కొత్త వాతావరణంలో ఎటువంటి ఇబ్బందీ లేకుండా పని చేసుకు పోయేది. ఆఫీసులో ‘కలివిడి మనిషి కాదు’ అన్న ముద్రపడినా లెక్క పెట్టుకోలేదు. పక్క సీటులో ఉండే ఉషతో స్నేహం అయ్యింది. ఒకరోజు ఉష పొద్దున నుండీ మౌనంగా కూర్చుంది. పక్కనే ఉన్న వాణికి ఆమె భావనలు డిప్రెషన్‌లో రూపంలో ఉన్నాయని గమనించి లంచ్ టైమ్ లో తన దగ్గరగా కూర్చుని “దేనికో బాధపడుతున్నావు. నాతో చెప్పుకోవచ్చు”అని ఆప్యాయంగా అనగానే ఉష ఏడ్చింది. కొద్దిసేపటి తర్వాత తన బావ అమెరికా నుండీ వస్తే పెళ్లి అని అనుకుంటూన్న సమయంలో అతను అక్కడే ఎవరినో చేసుకున్నాడన్న వార్త తట్టుకో లేక పోయిందట. రాత్రి సూసైడ్ చేసుకుందామన్నంత ఆవేశం వచ్చిందట..ఇది విని వాణి ఉషకు బాగా నచ్చచెప్పింది. ఉషకు ఆ మాటలు మంత్రం లా పని చేశాయి. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు.. ఒకటి రెండు సార్లు ఉషకు వచ్చిన సమస్యలకు వాణి సమాధానాలు నచ్చి వాణిని స్పెషల్ గా చూడసాగింది ఉష. అంతే కాదు వాణి గ్రహింపు , ఆమె చెప్పే మాటలు నెమ్మదిగా కొందరికి తెలిసి మాటలు కలపబోయినా మళ్ళీ అవమానం చేస్తారేమో అన్న భయంతో దూరంగానే ఉంటూంది. ఆ సమయంలో ఉష పెద్దమ్మ కూతురు శ్రావణి వచ్చిందని సెలవు పెడుతూ “వాణీ, రేపు సాయంకాలం ఒక సారి ఇంటికి రాకూడదూ.. అక్కకు నిన్ను పరిచయం చేయాలని ఉంది.” అని ఆహ్వానించింది.
ఆ సాయంకాలం ఉష ఇంట్లో శ్రావణిని కలిసింది. తను యూనివర్సిటీలో ప్రొఫెసర్అని తెలవగానే ఎంతో సంతోషం అయ్యింది. తన విషయం ఒకసారి శ్రావణికి చెప్పాలనిపించింది. ఉష పనితో బిజీ గా ఉంటే ఆ అవకాశం వచ్చింది.
“శ్రావణి గారూ, నేను పర్సనల్ గా మీతో మాట్లాడాలి.” అనగానే
“చెప్పు వాణీ, నీ గురించి ఉష చెబుతూనే ఉంది..’వాణి తో మాట్లాడితే మనసు నిశ్చింత అవుతుంది’ అని అందుకే నాకే నీతో మాట్లాడాలని కుతూహలంగా ఉంది.” అంది ఆసక్తిగా. నెమ్మదిగా తనకి చిన్నప్పటి నుండీ వినిపించే “భావ శబ్దం” తన లోపల వెలిగే కొన్ని రంగులు “శబ్దం లేని శబ్దాన్ని” కలిగిస్తూ ఉంటే అందరూ ఎలా అపార్థం చేసుకున్నదీ, తన ప్రవర్తన పై తల్లిదండ్రుల ఆందోళన చవి చూశాక తను ఎంతో నిబ్బరంగా ఉంటూ జీవితాన్ని అలవాటు చేసుకోవడం…అంతా శ్రావణి కి చెప్పింది. రెండు నిముషాల తర్వాత “వాణీ, మీకు ఇది లోపం కాదు… ఇది వరం. నీవు “సినెస్తీషియా” గురించి తెలుసుకుంటే అందరికంటే మీరు భిన్నమని గ్రహించవచ్చు. నాకు తెలిసినంత వరకూ సినెస్తీషియా నాడీ సంబంధితమైనది. ద్వని తరంగాలను రంగులుగా భావించగలగడం ఒక రకం. ఇది ఇంద్రియాల కలయికతో సాధ్యం అయ్యే ప్రత్యేక శక్తి. ఇది ఏమాత్రం అబ్నార్మల్ కాదు. మీరింకా అధ్యయనం కోసం పుస్తకాలు, ఆన్‌లైన్, మైండ్-బాడీ కనెక్షన్ విషయాల గురించి చదవండి.. సీనియర్ డాక్టర్ లను కలవండి. సరిగ్గా తెలుసుకుంటే మీరు ఎంతమందికో ఉపయోగ పడతారు..” అంటూన్నప్పుడు ఉష కలిసి శ్రావణి మాటలకు ఆశ్చర్య పోయింది..తరువాత ముగ్గురూ ఇంకొంచెం లోతుగా ‘సెనెస్థీషియా’ వివరాలకు వెళ్లారు.
ఆ రోజు శ్రావణి ద్వారా ఎంతో వివరణ తెలియటంతో తనను కలవటం వాణికి ఎంతో నచ్చింది. తన మీద నమ్మకం పెరిగింది.
***
ఆ వారంలోనే ఒక రోజు ఇంటి గేటు వేయబోతూ ఉండగా బయట రోడ్డు మీద ఓ చిన్నపిల్ల ఏడుపు లాంటి శబ్దం వినిపించింది. నిజానికి అది శబ్దం కాదు … అది ఓ భయభరితమైన భావం. ఆ శబ్దం ఆమె చెవి తాకింది. చూస్తే ఎదురుగా స్పీడ్ బ్రేకర్ మీద ఎగిరిన బైక్ నుండీ జారీ కింద పడిపోయే దశలో భయంతో కేక వేసిన పిల్లను వాణి పరుగెత్తి పట్టుకుంది. ముందు కూర్చున్న వాళ్ళ నాన్న కూడా పక్కకు పడబోతూ నిలదొక్కుకుని స్కూటర్ పక్కన పెడుతూ వాణి చేతిలో ఉన్న అమ్మాయిని అందుకున్నాడు “పాప అరిచిన మరుక్షణంలో భలేవచ్చి కాపాడారండీ” అంటూ పాపను రక్షించినందుకు కృతజ్ఞతలు చెప్పాడు మనసారా…
అప్పటి నుండీ తన ప్రత్యేకతను ఎలా ఉపయోగించాలో ప్రయత్నాలు చేస్తే తప్పేమి? అన్న సంఘర్షణ మొదలైంది వాణిలో.
ఉష ప్రోద్భలంతో రోజువారి జీవితంలో ఎదురయ్యే చిన్న విషయాల్లో మిత్రుల మనోభావాలను అర్థం చేసుకొని వాళ్లకి సాంత్వన కలిగించడంలో వాణి తన శక్తిని ప్రయోగించసాగింది. మరి కొంతమంది తన వెనక నవ్వుకుంటారని తెలిసినా ధైర్యం వదలలేదు వాణి ఈసారి. వాణి గురించి ఉష ద్వారా తెలిసి మేనేజరు మాధవ రావు వాణితో తన అమ్మగారి ముఖానికి పెరాలిసిస్ తో మంచం పట్టి రెండేళ్లుగా మాటలాడ్డానికి కూడా కష్ట పడుతున్నారని ఒకసారి ఇంటికి వచ్చి చూస్తారా అని అడిగాడు.
మరురోజే ఆయనతో బాటు వెళ్ళి చూసింది. ఆమె దగ్గరగా కూర్చున్నప్పుడు ఆవిడ నోటి కదలికల ద్వని ద్వారా ఆమె భావనలను తెలుసుకో గలిగింది.. ‘పడకలో ఉంటూ తాను నరకం అనుభవిస్తు న్నానని, విముక్తి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్టు.’. వాణి చెబుతూంటే మాధవరావుని చూస్తూ తల ఊపింది ఆమె సంతోషంగా. తనపై ప్రేమతో కొడుకు ఎంత చేసినా సేవ చేయించుకోవడానికి తనకెంతో కష్టంగా ఉందని.. ఇది వాళ్ళకు అర్థం కావటం లేదని విల విలలాడటం వివరిస్తుంటే తన ఆలోచనలను ఇంత బాగా చెప్పగలుగుతున్న వాణిని చూసి మురిసింది. .
మాధవరావు వాణికి ఉన్న ఈ శక్తికి ఆశ్చర్య పోయాడు.
మాధవ రావు భార్య సంధ్యకు వాణి భలే నచ్చింది. తన చిన్న తమ్ముడు ప్రసాద్కి వాణిని చేసుకోవాలన్న కోరిక కలిగి కొద్ది రోజుల్లోనే వాణి తల్లిదండ్రులను కలిసి వచ్చారు. వాణి, ప్రసాద్ మాట్లాడుకున్నాక ఆరునెలల్లోనే పెళ్లి జరిగినది. పెళ్లై మూడు నెలల తర్వాత ప్రసాద్ ప్రమోషన్ విషయంలో అన్యాయం జరిగిందని చాలా ఆందోళన పడ్డాడు. అతను స్వయానా ఈ విషయం వాణితో మాట్లాడకుండా చాలా బాధ పడ్డాడు. అతని మనస్థితి గ్రహించి ఎలా సర్దుకు పోవచ్చో చెబుతూ మానసికంగా ఎంతో తోడుగా వుంది వాణి. తన భావనలు వాణికి ముందుగా తెలియటం చాలా మంచిదయిం దనిపించింది ప్రసాద్ కు. ఆ విధంగా ప్రసాద్ కు వాణి ప్రత్యేకత ఋజువుగా తెలిసింది. మరి కొన్నిసంఘటనల గమనింపుతో ప్రసాద్ ఒక ఆలోచన కలిగింది. ఎవరికైనా మనసులో బాధ ఉంటే, మాటల్లో చెప్పలేకపోతే… వాణి ద్వారా సమస్య తెలుసుకుని పరిష్కారం చేసుకోవడం సాధ్యమవుతుంది కాబట్టి దాని ద్వారా సమాజానికి డబ్బు ప్రశక్తి లేకుండా..కొంత సాయవడవచ్చని స్పురించింది. . అంటే ఉద్దేశ్యం మంచిదయినా ఉపయోగించుకుంటారా అన్న అనుమానం కూడా వచ్చింది. ప్రయత్న లోపం ఉండకూడదు అనుకున్నాడు. వాణి మొదట వద్దని మొరాయించిoది. కానీ భర్త తనకోసం, సమాజం లో ఒక మంచి కోసం తాపత్రయ పడుతూవుంటే ఇన్నిరోజులకు తనకు తోడూ నీడగా ప్రసాద్ నిలవడం దేవుడి నిర్ణయమే అని అంగీకారం తెలిపింది.
అలా అతి చిన్న స్థాయిలో “శబ్దాల శాంతి” అనే సంస్థ ప్రారంభం అయ్యింది. అక్కడ మాటలు ఉండవు, భావాలే అసలు భాష. డిప్రెషన్, దుఃఖం, ఒంటరితనం వంటి అనేక మానసిక సమస్యల బాధితులు ఆమె దగ్గరికి వచ్చి ఉపశమనం పొందాలనుకోవడం తృప్తి నిచ్చింది. ప్రతి చిన్న విషయానికీ కౌన్సిలింగ్ కు వెళ్ళే ఇప్పటి కాలంలో ఈ చిన్న సంస్థకు మనుషులు రావడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీప్రతి రోగానికీ ప్రత్యామ్నాయాలు వెదుక్కునే ఆరాటం ఉన్న మానవులకు ఇది తొందరగానే అలవాటైంది.
ఒకరోజు ఒక తల్లి, కూతురితో వచ్చింది వాణి దగ్గరికి. తల్లి కంటే ముందుగా ఆ అమ్మాయి “అక్కా… నాకు అప్పుడప్పుడు మనుషుల్ని చూడగానే ఏవో శబ్దాలు వినిపిస్తుంటాయి… చాలా వింతగా ఉంటాయి!”
వాణి వెంటనే బాలిక చేతి మీద చెయ్యివేసి మెల్లగా “అది వింత కాదు తల్లీ… అది నీకు దేవుడు ఇచ్చిన ఓ శక్తి. అది మన మాటలకంటే గొప్ప భాష.”అంది చిరునవ్వుతో. మనసులో మాత్రం ‘మరో వాణి వచ్చింది!’అనుకుంది తృప్తిగా.
*****

డా. లక్ష్మీ రాఘవ/ కె. వి. లక్ష్మీ M.Sc. PhD. రిటైర్డ్, జువాలజీ రీడర్,‘వనితా మహా విద్యాలయ” హైదరాబాద్. రచనలు- మొదటి కథ 1966 లో ఆంధ్ర సచిత్ర వార సచిత్ర లో , 8 కథా సంపుటాలు, ఒక స్మారక సంచిక, ఒక దేవాలయ చరిత్ర ప్రచురితం 200 పైగా కథలు. కొన్ని కథాసంపుటాలకు, కథలకూ బహుమతులు. కొన్ని సంకలనా లలో కథలు, రెండు కథాసంపుటాలు కన్నడ భాషలోకి తర్జుమా, రచనలే కాకుండా కళల పై ఆసక్తి, ఆర్టిస్ట్ గా కొన్ని ఎక్జిబిషన్ ల నిర్వహణ.
