
“నెచ్చెలి”మాట
కొత్త బంగారు లోకం
-డా|| కె.గీత
అవునండీ
మీరు విన్నది కరెక్టే
కొత్త బంగారు లోకమే!
ఏవిటండీ
మీ పరాచికాలు!
ఓ పక్క
బంగారం ధర
మండిపోతుంటేనూ!
అయ్యో
కొత్త బంగారు లోకం
అంటే
కొత్తగా
బంగారంతోనో
మణులతోనో
తయారుచేసిన
లోకం
కాదండీ!
ఎప్పుడూ
ఈసురోమంటూ
ఉండే
రోజులు
పోయి
ఉత్తేజితమైన
తేజోవంతమైన
సరికొత్త
రోజులు
కూడా
వస్తాయని
నమ్మడమన్నమాట
అన్నమాటేవిటీ
ఉన్నమాటే
ఉదాహరణకి
న్యూయార్క్
నగరం
వైపు
ఓ సారి
చూడండి
చింతకాయ
పచ్చడి
రాజకీయాలు
మట్టికలిసి
పోయి
ఒక
తేజోవంతమైన
అగ్ని కిరణం
ఆకాశంలోకి
ఎగిసింది
కొత్త వెలుగుతో
బంగారులోకమేదో
ఆవిష్కరణ
కానున్నదని
ఆశ
చిగురించింది
గోదాముల్లో
పెట్టెలు మోసి
మచ్చలు పడ్డ వేళ్ళ
గురించీ
కాయలుకాసిన
అరచేతుల గురించీ
గాయాల గురించీ
మాట్లాడే
నాయకత్వమంటే
మరి
బంగారు లోకం కాదూ!
ఆ చాల్లెండి
మీ అత్యుత్సాహాలు!
మీకు చాతనయితే
బంగారం ధర
తగ్గించండి!
రాజకీయాలు
మాట్లాడేందుకే-
పని చేసే వారిని
చూపించి
అప్పుడు
మాట్లాడండి-
సరే
సరే
కనీసం
ఓ కొత్త కోణం
ఓ సరికొత్త యువరక్తం
ప్రయత్నమైతే
చేసేందుకు
అవకాశం
వచ్చిందిగా
నమ్మితే
తప్పేవుంది?
కొత్త బంగారు లోకం
వస్తుందని
కలలు కంటేనే కదా
నిజమయ్యేది!
అలాంటిది
నిజంగా
ప్రత్యక్షమవుతున్నపుడు
స్వాగతించడానికేం?!
****
నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం:
ప్రతినెలా నెచ్చెలి పత్రికలో వచ్చే రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణా త్మక కామెంటుని ఎంపిక చేసి ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు.
మరింకెందుకు ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.
వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన “నెచ్చెలి”లో వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!
*****
అక్టోబరు, 2025 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: సుగుణ
ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: “31 రోజుల నెల” – డా. లతా అగ్రవాల్ గారి హిందీ కథ అనువాదం- డా. కూచి వెంకట నరసింహారావు
ఇరువురికీ అభినందనలు!
****

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.

బంగారు ధర ఆకాశాన్ని అంటుతున్న కాలంలో
“కొత్త బంగారు లోకం “ ఆశల కలల ఆశావహ కవిత సంపాదకీయం బాగుంది గీతగారు.🥰