
అమ్మ
(నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)
– మంజీత కుమార్
అడగకముందే
శరీరాన్ని చీల్చి జన్మనిచ్చాను
ఎన్నో ఊసులు చెబుతూ
జోలపాటలు పాడాను
ఆకలి అని చెప్పకముందే
నేను పస్తులు ఉండి మరీ నీ కడుపు నింపాను
అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు
నా ఆరోగ్యాన్ని పట్టించుకోక నీకు సపర్యలు చేశాను
పరీక్షల వేళ తోడుగా ఉంటూ
నీకు గురువై అక్షరాలు దిద్దించాను
నీకు కష్టం వస్తే నేను కన్నీరు కార్చి
నువ్వు విజయం సాధిస్తే నేను పొంగిపోయి
నన్ను నేను ఎప్పుడో మర్చిపోయి
నీ కోసమే ఊపిరి తీసుకుంటున్నాను
రెక్కలు వచ్చి నువ్వు ఆకాశమంత ఎత్తు ఎదిగినా
నాకేం తెలీదని హేళనగా మాట్లాడినా
నన్ను ఒక మరమనిషిలా చూసినా
పట్టించుకోని పిచ్చిదానిని
నా అవసరం నీకు తీరిపోయినా
ఈ పేగు బంధాన్ని నువ్వు వదులుకోవాలనుకున్నా
నీ క్షేమమే కోరుతూ తుదిశ్వాస విడుస్తాను
ఎందుకంటే నేను ‘అమ్మ’ను
ప్రేమించడం తప్ప మరేం తెలియని అమాయకురాలిని
*****

మంజీత కుమార్ స్వస్థలం – హైదరాబాద్, ప్రస్తుత నివాసం – బెంగుళూరు.
ఉస్మానియా యూనివర్సిటి నుంచి జర్నలిజంలో Mphil చేసి పలు టీవీ చానెల్స్ లో (జెమిని, NTV, TV5, సాక్షి టివి) చీఫ్ న్యూస్ ఎడిటర్‌గా బృహత్ బాధ్యతలు నిర్వర్తించాను.
దాదాపు పదేళ్లకుపైగా ఆల్ ఇండియా రేడియో (ఆకాశవాణి హైదరాబాద్) హైదరాబాద్ రెయిన్బో FM లో రేడియో జాకీ, యువవాణి ఇంగ్లిష్ అనౌన్సర్, IGNOU జ్ఞానవాణి రేడియో అనౌన్సర్‌గా పనిచేసి, ప్రస్తుతం ఆకాశవాణి రేడియోకు నాటకాలు రాస్తున్నాను.
వృత్తి – తెలుగు ఆడియో ఆప్స్, యూట్యూబ్ చానెల్స్ లో ఎడిటర్, కథా మాటల రచయితగా పనిచేస్తూ పలు అవార్డులు సొంతం చేసుకున్నాను.
కథా కవితా రచయితగా తానా మహాసభలు, ప్రపంచ తెలుగు మహా సభల్లో పాలుపంచుకున్నాను. పలు సాహితీ పోటీల్లో విజేతగా నిలిచి, పురస్కారాలు బహుమతులు అందుకున్నాను. ఎన్నో దిన, వార, మాస పత్రికలు, వార్త పత్రికలు, మ్యాగజైన్స్, సంకలనాల్లో కథలు, కవితల ప్రచురణ.
తొలి నవల ‘నాగ మంజీతం’కు తపస్వి మనోహరం నిర్వహించిన నవల పోటీల్లో ప్రథమ బహుమతి.
పురస్కారాలు, బిరుదులు :
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ (రెండుసార్లు)
వంశీ గ్లోబల్ అవార్డ్
విశిష్ట కథా మంజరి బిరుదు
సాహిత్య కళానిధి బిరుదు
కలం భూషణ్ బిరుదు
గాథ సృజన సంయమి పురస్కారం
