
అంతరంగాలు
(నెచ్చెలి-2025 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
– జి.వి.హేమలత
బయటినుంచి వస్తూనే మా ఆవిడ ఎందుకో చాలా కోపంగా ఉంది, ఎందుకో తెలియలేదు. ఆవిడ కోపం వచ్చినప్పుడు ఏదో ఒక రకంగా కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. అంతేకానీ ఆ కోపం దేనివల్ల ఏమిటో అసలు విషయం చెప్పనే చెప్పదు. కొద్దిసేపు రుసరుసలాడుతూ ఫ్రిడ్జ్ డోర్ తీసి కొద్దిగా నీళ్లు తాగి గట్టిగా ఫ్రిజ్ డోర్ వేసింది. హ్యాండ్ బ్యాగుని గాజు టీపాయ్ పై మీద శబ్దం వచ్చేలా గట్టిగా విసిరేసింది.
నేను చూసి చూడనట్టుగా ఆదివారం అనుబంధ పత్రిక చదువుతున్నాను. కాదు – చదువుతున్నట్టు నటిస్తున్నాను. నేను ఆ ప్రకటిత కోపాన్ని పట్టించుకోకపోవడం కూడా ఆమెకి ఇంకా అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. ఏదో గుర్తొచ్చిందానిలాగా బ్యాగ్ లో నుంచి ఫోన్ తీసింది. గబగబా ఏదో స్క్రోల్ చేసినట్లు ఉంది. ఆమెకు కావాల్సిన సమాచారం దొరకలేదు అనుకుంటా.. ఆ విసుగు ఆ కోపం నిట్టూర్పు మూడూ పెనవేసి ఫోన్ సోఫాలోకి గిరాటేసింది. ఆమె బాధని చూడలేక అడుగుదామనుకున్నాను కానీ ఆమె ఇప్పుడు ఉన్న ఆ 100°సెల్సియస్ కోపాగ్నిలో రగిలిపోతోంది..నేను కానీ ఆమెను కదిలిస్తే ఇటుక బట్టిలో కాలిపోయిన ఇటుకలాగా అయిపోతానేమోనని మౌనంగా ఉన్నాను. ఆవిడ భర్తగా నాకు ఈ విషయంలో చాలా అనుభవం ఉంది. అమె అలా అసహనంతో మా ప్లాట్ బాల్కనీలోకి వెళ్ళింది.
పెద్దహాలు, మూడు పడకగదులు, అతిపెద్ద కిచెను మరియు దానికనుబంధించి ఉన్న డైనింగ్ హాలు, ఊర్లోనే క్లాస్ గా ఉండేటువంటి ఫ్లాట్స్ లో మొదటి అంతస్తులో ఉన్న మా ఫ్లాట్లో.. ఇన్ని చదరపు గజాలలో ఆమెకి ఇవ్వలేని ఆనందం… బాల్కనీలో మాత్రమే దొరుకుతుంది. హాల్లో నుంచి వెళ్లడానికి వీలుగా ఉన్న చాలా పెద్ద బాల్కనీ అది. అక్కడ కూర్చుంటే చాలు ఆవిడకి ఎంతో సాంత్వన కలుగుతుంది.
ఆమె రోజు మొత్తంలో ఎక్కువ సమయం అటు ఫోన్ తోనో, లేదంటే ఈ బాల్కనీలోనో గడిపేస్తుంది. ఉదయాన్నే వాకింగ్ క్లబ్ కి వెళుతుంది. ఆ తర్వాత ఆరోగ్యానికి మంచిదంటూ లాఫింగ్ క్లబ్ కి వెళుతుంది. అక్కడ తెచ్చిపెట్టుకొని మరీ అరగంటసేపు విరగబడి నవ్వుతుంది. ఆ తర్వాత కొద్దిసేపు ఫోన్లో యూట్యూబ్లో ఉంటుంది. యూట్యూబ్లో ఎక్కువమంది వ్యూవర్స్ సబ్స్క్రయిబ్ చేసిన ఘనత, అలాగే ఎన్నో లింకులు షేర్ చేసిన మహావనితగా కూడా ఈమెకి మంచి పేరుంది. ఈ అపార్ట్మెంట్ కి కూడా ఈవిడ మహిళా సెక్రటరీ. పిల్లలిద్దరూ విదేశాలలో సెటిల్ అయిపోయారు. అంతేకాదు కొన్ని రోజులు నా బిజినెస్ చూసుకున్న అనుభవం కూడా ఉంది. ఇప్పుడు ఊర్లో మహిళలకు సంబంధించిన మంచి మంచి కార్యక్రమాలు కూడా రూపొందిస్తుంది. వస్తున్న మహిళా దినోత్సవ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించాలనే పని మీదే ఈరోజు బయటకు వెళ్తున్నానని నాతో చెప్పింది. మరి వచ్చేటప్పుడు ఇంత చిరాగ్గా ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదు. బాల్కనీలోకి వెళ్ళింది కదా ఆమె మూడ్ ఆటోమేటిగ్గా మారిపోతుందని నేను ప్రశాంతంగా కూర్చున్నాను.
మా బాల్కనీలో నుంచి చూస్తే..ఎదుటఉన్న ఒక చిన్న పెచ్చులూడిపోయిన డాబా ఇల్లు కనిపిస్తుంది. కనీసం ఒక వంద గజాలు కూడా లేని ఇల్లు అది. పాతకాలం నాటి ఇల్లు, మూడే మూడు గదులు చిన్న ప్రహరీ గోడ. ఆ గోడకి కిర్రుమని శబ్దం చేస్తూ వీధిఅంతా వినపడేలా తుప్పు పట్టి పోయిన ఒక గేటు. ఇంటికి ఒకవైపు వంటగది ఒకవైపు పడకగది మధ్యలో పెద్ద హాలు. వారి పేదరికం బహిర్గతం చేస్తున్నట్టు పెద్ద పెద్ద కిటికీలు, అంత ఇరుకు ఇంట్లో ఒక పెద్దావిడ పెద్దాయన ఆయన కొడుకు కోడలు ఇంకా వాళ్లకి ఇద్దరు పిల్లలు.. అంత సౌఖ్యంగా, ఎలా ఉండగలుగుతున్నారు అనేది ఈవిడికి అర్థం కాని మిలియన్ డాలర్ ప్రశ్న.
చిన్నచిన్న ఆనందాలకి ఉబ్బితబ్బిబ్బయిపోతూ తృప్తిపడే వాళ్ళని చూస్తుంటే, ఆమెకి ఎందుకో తెలియని అసూయ.. తన పిల్లలు యుఎస్ లో ఉన్నారని వాళ్లకు సంబంధించిన రీల్స్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ మార్నింగ్ వాక్ లో అందరికీ గొప్పగా చెప్పుకునే ఆమె, ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉన్నా సర్దుకుపోతూ కొడుకు కోడలు, మనవళ్లతో తృప్తిగా గడుపుతున్న ఆ దంపతులను చూస్తే ఆమె మనస్సులో ఏదో వెలితి.
ఆ ముసలావిడ తెల్లారక ముందే నిద్ర లేస్తుంది. వాకిళ్ళు కడిగి ముగ్గులు పెడుతుంది, కోడలు వద్దంటున్నా వినకుండా పిల్లలు స్కూల్ కి వెళ్లే లోపు బాక్సులు కూడా సిద్ధం చేసేస్తూ ఉంటుంది. కొడుకును ఎంత బుద్ధిమంతుడిగా తీర్చిదిద్దిందో అలాగే ఇప్పుడు మనవళ్లను కూడా తీర్చిదిద్దుతోంది. ఆమె పెద్దగా చదువుకోలేదని అర్థమవుతున్నా చదువుల్లోని సారమంతా ఔపోసన పట్టిన సంస్కారం ఆమెకుందని పిస్తుంది. పాలవాడి దగ్గర నుంచి, వీధిలో చెత్త తీసుకుని వెళ్లే మున్సిపాలిటీ కుర్రవాడిదాకా ఆ ముసలావిడతో ఎంతో మర్యాదగా ఉంటారు. ఆ వీధిలో అందరూ ఆమెను గౌరవిస్తారు. అందుకే మా ఆవిడ కూడా ఆమెలా అవ్వాలని ఎంతో కోరిక, కోరికుంటే సరిపోతుందా?……. ఈలోపే బాల్కనీలో నుంచి మా ఆవిడ ఒక కేక వేసింది. ఏమిటో నన్ను పిలిచింది అని హఠాత్తుగా అక్కడ వాలిపోయాను. ఆ ఎదురింటి ముందు, ఏదో ప్రభుత్వ ఆసుపత్రి వాహనం కనపడింది మా ఇద్దరికీ.
ఏమైందో అర్థం కాలేదు.
***
ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఫోన్ కాల్ లాగా ఉంది. ఫోన్ మోగుతూనే మా ఆవిడ గాబరాగా వెళ్లి ఫోన్ రిసీవ్ చేసుకుంది.
అటువైపు నుంచి మాట్లాడిన వ్యక్తి ఎవరో ఆమెను నిరుత్సాహపరిచారు. ఇక కాలయాపన చేయడం దేనికని విషయం ఏమిటని అడిగాను నేను. ఈ సంవత్సరం మహిళా దినోత్సవానికి గాను, ఒక మహిళా ప్రాంగణాన్ని బుక్ చేసుకున్నారట, మహిళా దినోత్సవం చాలా గ్రాండ్ గా జరపాలని ఏర్పాట్లు కూడా ముమ్మరంగా మూడు రోజుల నుంచి చేస్తున్నారట. అయితే మహిళా వెల్ఫేర్ సొసైటీ సభ్యులంతా కలిసి ఆ కార్యక్రమానికి చీఫ్ గెస్స్ట్ గా మహిళా మంత్రిగారిని పిలిచారు. అయితే ఆవిడ అపాయింట్మెంట్ ఎలాగో ఈజీగానే దొరికింది. కానీ ఆ రోజు ఆవిడ రాష్ట్రస్థాయిలో వేరే కార్యక్రమానికి హాజరవుతూ ఉండడం వల్ల జిల్లాస్థాయిలో జరిగే వీళ్ళ కార్యక్రమానికి రాలేనన్నది.
అది మా ఆవిడలో నిరుత్సాహానికి చిరాకుతనానికి దారి తీసిన కారణం.
“వి ఐ పి లు దొరక్కపోతే ఇంకెవరినైనా పిలవండి. కార్యక్రమం బాగా జరగడం అనేది ముఖ్యం. నిత్యం వాళ్ల జీవితాలను సఫలీకృతం చేసుకుంటున్న ప్రతి మహిళ సన్మానించదగ్గదే. అడుగడుగునా మోసాలు, వ్యామోహలు ఆకర్షిస్తూ.. విలువలు దిగజార్చే ఈ సమాజం చుట్టూ ఉన్నాకూడా, క్రమశిక్షణ గలిగి, ఉన్నతంగా, నిజాయితీగా జీవించేలా పిల్లల్ని బాధ్యతాయుతంగా పెంచిన ప్రతి తల్లీ సన్మానానికి అర్హురాలే!..డబ్బుతో, హోదాతో, స్వార్థంతో ప్రముఖులైన వి ఐ పి లను, ప్రాపకం కోసం గౌరవించేకంటే… తను ధర్మం వీడక, తర్వాతి తరాన్ని కూడా ఆదర్శవంతంగా తయారుజేసిన తల్లిని గౌరవించడమే.. నిజంగా స్త్రీ జాతికిచ్చే పురస్కారం.. “ అంటూ నా నిశ్చితాభిప్రాయాన్ని నాకు తోచిన ధోరణిలో, ఆమె మనసులో నాటుకునేలా చెప్పాను.
***
మహిళా దినోత్సవం రోజు-
మా ఆవిడ తీసుకున్న నిర్ణయం… స్వాతిశయానికి, అహానికి, రాగద్వేషాలకి అసూయలకి అతీతంగా.. ముచ్చట గొలిపింది.
మా అపార్ట్మెంట్ ఎదురింట్లో ఉండే ఆ పెద్దావిడ సావిత్రి గారిని, వాళ్ల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తన కారులో తీసుకొనివెళ్లడం, పట్టుశాలువాతో పూలదండలతోనూ సత్కరించడం నన్ను అబ్బుర పరిచింది. ఆమెలో ఈ ఆకస్మిక అభ్యున్నతికి, ప్రగతిశీల మార్పుకు, అసలైన మహిళాదినోత్సవానికి ముఖ్యఅతిథిని ఎంపికచేసిన విచక్షణకు, నేను విస్మయపోయాను.
సావిత్రిగారు స్వధర్మాచరణ పారాయణురాలేకాదు.. మరోవైపు, తన తదనంతరం తన అవయవాలు దానం చేయటానికి నిర్ణయం తీసుకున్నందుకే, ఆ రోజు వైద్యశాల వాహనం వచ్చిందని మా అపార్ట్మెంట్ వాచ్మెన్ ద్వారా తెలుసుకున్న మా ఆవిడ, సావిత్రిగారినే విశిష్ట అతిథిగా తీర్మానించడం మా ఆవిడ సమయోచిత నిర్ణయాధికార ప్రతిభకి నిదర్శనం. తద్వారా ఆమె నలుగురిలో పేరు పొందడమే కాదు…గతంలో ఆమె ఎన్నడూ పొందని తృప్తిని పొందింది. తనలోని వెలితిని వెలివేయగలిగి పూర్ణానందాన్ని సంపాదించింది.
*****

జి.వి.హేమలత మొట్టమొదటి కవిత 2008 సంవత్సరంలో ఆంధ్రభూమి పత్రికలో ప్రచురించబడింది. 2009 నుంచి రెడ్డి నాడు మాసపత్రికకి కథలు కవితలు రాసేదాన్ని ఆ కథకి బొమ్మ కూడా నేనే వేసుకునే దాన్ని. ఆ తర్వాత ప్రతిలిపి యాప్ లో ఆన్లైన్లో కథలు రాయడం మొదలుపెట్టాను 2013-14 సంవత్సరాల్లో నేను రాసినటువంటి “ఉత్తమ భార్య” కథకి ఇప్పటికీ 26.1 కె పాఠకులు అంటే 26,000 మంది దాకా పాటకులు కథని చదవడం వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలపడం అందరూ చాలా వరకు కాంప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఎంతో మంది పాఠకులకు చేరువయ్యా నా కథ ద్వారా.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్ష వారు ఉపాధ్యాయులు కోసం మరియు విద్యార్థుల కోసం కస్తూరి’ అనే మ్యాగజైన్ని నడుపుతూ ఉండేవారు ఆ కస్తూరి మ్యాగ్జన్లో కథలు కవితలు రాసేదాన్ని అందులో “మనోగీతం ‘అనే కథ అటు ప్రభుత్వం వారిని గాని ఇటు ఉపాధ్యాయులని విద్యార్థులని ఇంకా ఎందరో అభిమానుల్ని నాకు సంపాదించి పెట్టింది. అది ఒక మానసిక వికలాంగుడు అయినటువంటి విద్యార్థి గురించి అంతకు ముందు వరకు ఆ ప్రయోగం ఎవరూ చేయలేదు కనుక ఆ 2014 సంవత్సరంలో ఆ కథకి చాలా మంచి పేరు వచ్చింది.
ఆ తర్వాత ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి కథానికలు రాయడం మొదలుపెట్టాను 2017 నుంచి 2020 మధ్యకాలంలో కథానికలు రాసి విద్యార్థులతో నాటికలను కూడా అక్కడే ప్రదర్శించే వాళ్ళం.
2017 లో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా జాగృతి అనే పాటల పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. అలాగే స్టేట్ లైబ్రరీస్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను వివిధ రకాల కథలు కవితలు పోటీలు పెట్టడం ఆ కథలు పోటీల్లో అన్నిట్లోనూ ఏ ఏ రంగాల్లో అయితే పెట్టారో ఆ పోటీల్లో ప్రథమ బహుమతి రావడం జరిగింది. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వనం -మనం, స్వచ్ఛభారత్ అలాగే సుజలం- సుఫలం ఇలాంటి అంశాల పై పాటలు కవితలు రాయడం జరిగింది రాష్ట్ర స్థాయిలో వీటికి మంచి పేరు వచ్చింది ఆ తర్వాత ప్రభుత్వం వారు రికార్డ్ చేసి సిడిల రూపంలో కూడా పాటల్ని తీసుకొనడం జరిగింది.
2018 సెప్టెంబర్ ఐదున ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకోవడం జరిగింది.
2023 వరకు పాఠశాల విద్యకు సంబంధించి కథలు కవితలు అచ్చు పుస్తకాలకే సంబంధించి టెస్ట్బూక్ రైటర్ గా వెళ్తూ ఉన్నటువంటి నేను 2024 నుంచి వివిధ కథల పోటీలకు కవితల పోటీలకి రచనలను పంపడం అందులో వివిధ విభాగాల బహుమతులు పొందడం జరిగింది. ముఖ్యంగా నా కథలు కవితలు కూడా స్త్రీలకు సంబంధించినవి.
పాఠశాలలో నేను రూపొందించినటువంటి కార్యక్రమాలన్నీ కూడా “బేటి బచావో బేటి పడావో “అంటే బాలిక విద్యను చైతన్యం చేయడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.
సాహితీ కిరణం వారు నిర్వహించిన ఉగాది కవితల పోటీల్లో ప్రథమ స్థానం విశాలాక్షి వారి ఉగాది కథల పోటీల్లో ప్రథమ స్థానం ఇలా కొన్ని పత్రికల్లో ప్రథమ స్థానాన్ని సంపాదించుకున్నాను. ప్రతివారం కొన్ని అంతర్జాల పత్రికలకి కవితలు రాస్తూ ఉంటాను.
