
అమ్మ
(నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)
– మంజీత కుమార్
అడగకముందే
శరీరాన్ని చీల్చి జన్మనిచ్చాను
ఎన్నో ఊసులు చెబుతూ
జోలపాటలు పాడాను
ఆకలి అని చెప్పకముందే
నేను పస్తులు ఉండి మరీ నీ కడుపు నింపాను
అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు
నా ఆరోగ్యాన్ని పట్టించుకోక నీకు సపర్యలు చేశాను
పరీక్షల వేళ తోడుగా ఉంటూ
నీకు గురువై అక్షరాలు దిద్దించాను
నీకు కష్టం వస్తే నేను కన్నీరు కార్చి
నువ్వు విజయం సాధిస్తే నేను పొంగిపోయి
నన్ను నేను ఎప్పుడో మర్చిపోయి
నీ కోసమే ఊపిరి తీసుకుంటున్నాను
రెక్కలు వచ్చి నువ్వు ఆకాశమంత ఎత్తు ఎదిగినా
నాకేం తెలీదని హేళనగా మాట్లాడినా
నన్ను ఒక మరమనిషిలా చూసినా
పట్టించుకోని పిచ్చిదానిని
నా అవసరం నీకు తీరిపోయినా
ఈ పేగు బంధాన్ని నువ్వు వదులుకోవాలనుకున్నా
నీ క్షేమమే కోరుతూ తుదిశ్వాస విడుస్తాను
ఎందుకంటే నేను ‘అమ్మ’ను
ప్రేమించడం తప్ప మరేం తెలియని అమాయకురాలిని
*****

నా పేరు శ్రీమతి మంజీత కుమార్. హైదరాబాద్ లో పుట్టి పెరిగి వివాహం అయ్యాక బెంగళూరులో స్థిరపడ్డాను. మాడపాటి హనుమంతా రావు గర్ల్స్ హై స్కూల్ లో KG నుంచి 10th వరకూ చదివాను. రాజా బహదూర్ వెంకట రామారెడ్డి కాలేజీలో ఇంటర్, డిగ్రీ చేశాను. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో జర్నలిజంలో MPhil చేశాను. జెమిని టీవీ, NTV, TV5, సాక్షి టీవిలలో చీఫ్ న్యూస్ ఎడిటర్ గా పని చేశాను. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో యువవాణి ఆంగ్ల వ్యాఖ్యాతగా, రెయిన్బో FM రేడియో జాకీగా IGNOU వారి జ్ఞానవాణి రేడియోలో అనౌన్సర్ గా దాదాపు 12 ఏళ్ళు ఆల్ ఇండియా రేడియోలో పని చేసాను.
ఎన్నో వెబ్ సైట్స్, యూట్యూబ్ చానెల్స్ లో కంటెంట్ రైటర్ గా చేశాను. ప్రస్తుతం యూట్యూబ్ లో లఘు చిత్రాల (షార్ట్ ఫిల్మ్స్), మాటల రచయితగా పనిచేస్తున్నాను. ఇప్పటికే నేను రాసిన షార్ట్ ఫిల్మ్స్ కి పలు బహుమతులు అందుకున్నాను.
రెండున్నరేళ్లుగా తెలుగు, ఇంగ్లీష్, హిందీలలో కథలు, కవితలు, నవలలు రాస్తున్నాను. అవి యూట్యూబ్‌లలో ఆడియో కథలుగా వినవచ్చు. ఇప్పటికే పలు సంకలనాలు, పత్రికల్లో నా కవితలు, కథలు ప్రచురింపబడ్డాయి. రెండుసార్లు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఒకసారి వంశీ గ్లోబల్ అవార్డు, పలు బిరుదులు పురస్కారాలు అందుకున్నాను. 2022 తానా మహాసభల్లో, 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులో చోటు దక్కించుకున్నాను.
