దుబాయి నగర ఆకర్షణలు

-డా.కందేపి రాణి ప్రసాద్

బంగారు నగరం, రాచరిక నగరం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని నగరం, ప్రపచంలో అత్యధికంగా సందర్శించే నగరాలలో ఒకటైన నగరం, ఆకాశాన్నంటే సౌధాలున్న నగరం, చమురు నిల్వలున్న నగరం. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న నగరం దుబాయ్. పర్షియన్ గల్ఫ్ తీరాన ఉన్న ధనిక నగరం దుబాయ్. ప్రయాణికులతో ఎప్పుడూ రద్దీగా ఉండే ఇంటర్నేషనల్ విమానాశ్రయం కలిగిన నగరం దుబాయి.

ఈ దుబాయి నగరాన్ని వీక్షించడానికి మాకు ఇప్పుడు సమయం దొరికింది. దుబాయిలో జరుగుతున్న నవజాత శిశు వైద్యుల సమావేశాలు జరుగుతున్నందున మేము కుటుంబ సమేతంగా దుబాయిని దర్శించాము. మా అబ్బాయి, మా వారు శిశు వైద్య నిపుణులైనందున వారితో పాటు నేనూ దుబాయి వెళ్ళాను. అక్కడ రాయల్ సెవెన్ స్టార్ హోటల్ లో సమావేశాలు జరిగాయి. భారతదేశం నుంచి పదిహేను మంది డాక్టర్లు హాజరయ్యారు. మేము మొదటి రోజు పూర్తిగా కాన్ఫరెన్స్ లోనే పాల్గొన్నాము. మెడికల్ కేసుల డిస్కషన్ జరుగుతుంటే వినడం నాకు ఇష్టం. మెడికల్ స్పీచెస్ వినడం వల్ల నేను రాయబోయే మెడికల్ పుస్తకాలకు కావల్సిన సమాచారం లభిస్తుంది.

మేము దుబాయ్ లో బుర్జ్ ఖలీఫా, ఫామ్ ఐలాండ్, ఫ్యూచర్ మ్యూజియమ్, డెసర్ట్ సఫారీ, మిరాకిల్ గార్డెన్ చూడాలనుకున్నాం. ఉన్న నాలుగు రోజులలో మెడికల్ కాన్ఫరెన్స్ ను చూసుకుంటూ మధ్య మధ్యలో వీటిని చూడాలనుకున్నాం. ఇక్కడ చాలా మంది తెలుగు వాళ్ళు కనిపిస్తారు. మేము హైదరాబాద్ నుండి దుబాయ్ కి ఎతిహడ్ ఎయిర్ వేస్ ద్వారా వెళ్ళాము.

పిల్లల చదువు కోసం హైదరాబాద్ వెళ్ళిన కొత్తలో మా అపార్ట్మెంట్ లో ఒక స్నేహితురాలు ఉండేవారు. ఆమె ఆరు నెలలు దుబాయ్ లోనూ, ఆరు నెలలు హైదరాబాద్ లోనూ ఉండేవారు. తను దుబాయ్ గురించి ఎక్కువగా చెబుతూ ఉండేది. అక్కడ వేడి, ఎండ చాలా ఎక్కువ అనీ ప్రతి ఇంట్లో ఎసి తప్పనిసరిగా ఉంటాయని చెబుతుంటే ఆశ్చర్యంగా వినేవాళ్ళం. అప్పటికి ఇక్కడ అందరిళ్ళలో ఎసిలు లేవు. కానీ ప్రస్తుతం ఇక్కడ కూడా ఎసిలు లేని ఇళ్ళు కనిపించడం లేదు. హైదరాబాద్ లోనూ ఎండల వేడి తీవ్రతరం అయింది. బహుశ ముందు ముందు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగి ఎడారుల మంటలు వస్తాయని చెప్పిన శాస్త్రవేత్తల సూచనలు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తోంది. ఏమైనా వాతావరణ అసమతుల్యత వల్ల అధిక వేడి, అధిక చల్లదనం, అధిక గాలులు వంటి విపరీత పరిణామాలు సంభవించే అవకాశాలున్నాయి. మానవుడి అత్యాశ కారణంగా భూగ్రహం అనేక మార్పులకు లోనవుతుందటంలో అతిశయోక్తి లేదు.

ప్రపంచంలోనే ఎత్తయిన భవనాన్ని చూడాలని బయలుదేరాం. 828 మీటర్ల ఎత్తులో దుబాయ్ లోని బూర్జ్ ఖలీఫా ప్రస్తుతం ప్రపంచంలోనే ఎత్తైన న భవనంగా పేరు పొందింది. 2004 వ సంవత్సరంలో దీని నిర్మాణం మొదలుపెట్టి 2010 వరకు ప్రారంభమై పోయింది. ఆడ్రియాన్ స్మిత్ అనే శిల్పి తన చాతుర్యంతో 163 అంతస్తులు 57 లిఫ్టులతో అత్యంత అద్భుతంగా నిర్మాణాన్ని కావించాడు. 123 వ అంతస్తు దగ్గర నుంచి సంరక్షకులు చూడటానికి ప్రవేశం ఉంటుంది దీని వలన దుబాయ్ నగరం వైవిధ్యంగా అంతర్జాతీయ గుర్తింపు పొందటానికి తోడ్పడింది. మొదటగా ఈ టవరపు కి ‘బుర్జ్ దుబాయ్’ అనే పేరు పెట్టారట. ఆ తర్వాత దీని పేరు బూర్జ్ ఖలీఫాగా మార్చబడింది. యూఎఇ అధ్యక్షుడైన ఖలీఫా బిన్ జామేద్ అల్ నహ్యాన్ గారి గౌరవార్థంగా ఈ టవర్ పేరు ‘బూర్జ్ ఖలీఫా’ అని మార్చారు. అప్పటివరకు ప్రపంచంలో ఎత్తైన భవనంగా పేరు పొందిన షాంగై టవర్ ప్రస్తుతం రెండవ స్థానానికి పడిపోయింది.

టికెట్లు ముందుగానే బుక్ చేసుకుని దుబాయ్ మాల్ కు వెళ్ళాము. మాల్ లోపలికి వెళ్లాక బూర్జ్ ఖలీఫాకు వెళ్లే లిఫ్టులో వెళ్లాలి. అక్కడ అప్పటికే వందల మంది క్యూలో ఉన్నారు. అందర్నీ లైన్ లో నిలబెట్టి టాప్ ఫ్లోర్ కు వెళ్లే లిఫ్టులో ఎక్కిస్తున్నారు. 123 వ ఫ్లోర్ వరకే లిఫ్ట్ వెళ్తుంది. అక్కడే దిగి బాల్కనీ నుంచి దుబాయ్ నగర అందాలను వీక్షించాలి. బాల్కనీకి గాజు తలుపులు ఉండటం వలన కింది నుంచి కూడా దుబాయ్ నగరం కనిపిస్తుంది. మేం రాత్రిపూట వెళ్లడం వలన పైనుంచి చూసేటప్పుడు నగరం మొత్తం లైట్లతో మెరుస్తూ కళ్ళ మిరుమిట్లు గొల్పేలా అందంగా కనబడుతుంది. అక్కడకు చేరుకోగానే అందరూ కెమెరాలకు పనిపెడుతూ ఫోటోల కోసం, వీడియోల కోసం తపన పడటమే సరిపోతున్నది. ఇదొక అద్భుత ప్రపంచం. ఉత్కంఠభరితమైన నగర దృశ్యాలను ఎడారి స్కైలైన్ నుండి అరేబియా గల్ఫ్ వరకు వీక్షించవచ్చు. ఒకప్పుడు దుబాయ్ అంటే బంగారం కొనుక్కోవటం అన్నట్లుగా బంగారం ఎగ్జిబిషన్ల లైములో ఎక్కువగా వెళ్ళేవారు. ఇప్పుడు మాత్రం దుబాయిని బుర్జ్ ఖలీఫా చూడటం కోసమే దర్శిస్తున్నారు అంటే ఆతిశయోక్తి కాదు.

నేనిక్కడ బుర్జ్ ఖలీఫాను చూస్తుంటే పారిస్ లో ఈఫిల్ టవర్ ఎక్కేటప్పుడు లిఫ్ట్ లో ఎలా వెళ్ళామో గుర్తు వచ్చింది. మేము ఈఫిల్ టవర్ ఎక్కినప్పుడు లిఫ్టులో కొంచెం స్పీడ్ గా వెళ్లినట్లుగా భయం వేసింది. ఇక్కడ మాత్రం అదేమీ తెలియలేదు. పారిస్ లో ఈఫిల్ టవర్ ను ఎక్కాక అందరూ షాంపేన్ తాగారు. ఇక్కడ ‘బుర్జ్ ఖలీఫా’ అని ఇస్తున్నారు. ప్రపంచంలో ఎత్తైన భవనాన్ని ఎక్కి నగర అందమైన దృశ్యాల ను వీక్షిస్తూ తేనీరు తాగుతూ అలౌకిక ఆనందానికి గురయ్యాం. వెళ్లే వారందరూ ఒకవైపు లైన్ల లోనూ, పైనుంచి దిగి వచ్చే వారందరూ మరొకవైపు లైన్లలోనూ పంపిస్తున్నారు. వందలమంది వెళుతున్నా ఎక్కడా శబ్దాలు లేకుండా లైన్లు దాటకుండా క్రమశిక్షణగా పంపిస్తున్నారు. రికమండేషన్లు దగ్గర దారులు తెలిసినవాళ్లు అంటూ ఏమీ లేదు. అందరూ క్యూ లైన్లలో నిలబడి నిశ్శబ్దంగా సాగిపోతున్నారు.
సైన్స్ టెక్నాలజీలకు సంబంధించిన “ఫ్యూచర్ మ్యూజియమ్” కట్టడమే వింతగా ఉన్నది. దుబాయ్ లో ఈ మ్యూజియం 2022 వ సంవత్సరంలో ప్రారంభించబడింది. ఇది ఏడు అంతస్తులతో టోరస్ ఆకారంలో ఉంటుంది. కొద్దిగా వంచబడిన గుండ్రటి టైరు ఆకారంలో గమ్మత్తుగా ఉంటుంది. ఇందులో ఎన్నో సైన్స్ విషయాలు ఉన్నాయి. మేము వెళ్ళినపుడు చాలా మంది విద్యార్ధులు వచ్చారు. మొదటి అంతస్తులో లొపలికి వెళ్ళగానే ఒక రోబో కుక్క అటూ ఇటూ తిరుగుతూ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. పడుకోమని చెప్పినపుడు పడుకుంటున్నది. అలాగే ఒక సాలి పురుగు, చీమ ఆకారాల్లో రోబోట్లు చాలా బాగున్నాయి. లోపలకు వెళ్ళాక ఒక మనిషి రోబోట్ దగ్గర చాలా మంది గుమికూడారు. హలో అని పలకరిస్తున్నది. ఇంగ్లీషులో ఆడిగిన ప్రశ్నలకు సమాధానం చెపుతున్నది. నీవు నవ్వగలవా, నీవు ఏడవగలవా అని తుంటరి పిల్లలు ప్రశ్నలడిగితే ఆ రోబోట్ నవ్వంది, ఏడ్చినట్లుగా మొహం పెట్టి చూపింది. ఈ రోబోట్ తో సంభాషిస్తుంటే చాలా సరదాగా ఉన్నది. భౌతికశాస్త్ర చిక్క ముడులెన్నో పజిల్స్ రూపంలో అక్కడ కనిపిస్తున్నాయి. ఎమీ ఆధారం లేకుండానే పైప్ ద్వారా నీళ్ళు వస్తున్నాయి. ఆకాశంలోని గ్రహాల చలనం, సూర్యగ్రహణం చంద్రగ్రహణం వంటి వన్నీ వివరిస్తూ చెప్పే బొమ్మల ప్రయోగాలున్నాయి. మానవ శరీరంలో జరిగే మార్పులను పసిగట్టి చెప్పే యంత్రాలున్నాయి. నేను ఎక్కడికి వెళ్లినా సైన్స్ సెంటర్లు, సైన్స్ మ్యూజియంలు చూస్తుంటాను. దుబాయి నగరంలోనూ నా కోరిక నెర వేరింది. సైన్స్ టెక్నాలజీ ప్రాముఖ్యం ఇచ్చిన యుఎఇని మెచ్చుకోకుండా ఉండలేకపోయాం.

మర్నాడు సాయంత్రం ఫామ్ ఐలాండ్ చూడటానికి వెళ్ళాం. ఈ ద్వీపం కృత్రిమంగా ఏర్పాటు చేసిందట. సముద్ర తీర ప్రాంతాన్ని మట్టితో నింపేసి కృత్రిమంగా దీవులను ఏర్పాటు చేశారట. దుబాయ్ దీవులు, పామ్ జుమేరా దీవులు, పామ్ జెబెల్ అలీ దీవులు అనీ పిలుస్తారు. ఈ దీవులను 2001 వ సం||లో నిర్మించడం మొదలు పెట్టారు. 2007 వరకు పూర్తి చేసి ఈ ద్వీప సమూహాలలో నివాసాలు, హోటళ్ళు రిసార్టులు అనేకం ఏర్పాటు చేశారు. ఇక్కడ 28 హోటళ్ళు ఉన్నాయి. ఈ ద్వీపం మైత్తం తాటి చెట్టు ఆకారాన్ని కలిగి ఉండటం వల్ల పామ్ దీవులు అనే పేరు వచ్చింది. షేర్ మొహమ్మద్ జీన్ రషిద్ ఆల్ మక్తూమ్ రాసినటువంటి అరబిక్ పద్య సూక్తులను ఇక్కడ నిర్మించారు. అట్లాంటిస్, అట్లాంటిస్ ద రాయల్, పామ్ జుమెరా వంటి ప్రఖ్యాత హోటళ్ళు నిర్మించబడి ఉన్నాయి. అనేక వాటర్ గేమ్స్ ద్వారా పర్యాటకులను ఆకట్టుకుంటారు.

దుబాయ్ లోని ఎండ వాతావరణాన్ని తట్టుకోవడానికి బీచ్ లను పెంచాలనుకున్నారు. కృత్రిమ దీవుల ఏర్పాటు వలన ప్రపంచ పర్యాటకుల దృష్టిని తమపై నిలుపుకుంటున్నారు. దుబాయిలో సముద్రం ఉంటుదని బీచ్ లు ఉంటాయని నేననుకోలేదు. ఎడారి దేశాలని అంటుంటారు. కాబట్టి నీరు దొరకని ఎడారి ప్రాంతమనుకున్నాను. కానీ పర్షియన్ గల్ఫ్ సముద్రం నీలి నీలి అలలతో సుతారంగా తీరాన్ని తాకుతున్నది. ఇది కూడా బుర్జ్ ఖలిఫా టవర్ వలె పైకి ఎక్కి అక్కడి నుంచి దీవుల్ని చూడాలి. చివరికి నిలబడి చూడాలంటే నాకు కళ్ళు తిరిగాయి. బొమ్మలో చూపిన విధంగానే చెట్టు ఆకారంలో దీవులు కనిపించాయి. కొంత మంది పిల్లల్ని వదిలేసి మరీ పొటోల్లో మునిగిపోతే వారిష్టం వచ్చినట్లు పిల్లలు తిరుగుతుండడం చూస్తే తల్లి దండ్రుల మీద కోపం వచ్చింది. పిల్లల్ని పెంచటం ఎలాగో నవ తల్లి దండ్రులకు తెలియకపోగా నవ్వులాటగా ఉందనిపించింది.

‘డెజర్ట్ సషారీ’ అని పిలవబడే ఈ కార్యక్రమం ఒక రోజంతా సాగింది. టైము కూడా తెలియలేదు. ఆకలి గుర్తుకు రాలేదు. మూడు జంటల్ని కారులో తీసుకొని ఎడారి ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ వేల మంది గుమిగూడారు అనిపించింది. ఆ ప్రాంతమంతా ఇసుకతో నిండి ఉన్నది. నేనింత వరకూ ఎడారి ప్రాంతాలను చూడలేదు. కాని సినిమాలలో చూపించినట్లుగా ఇసుక తిన్నెలతో ఉన్నది. అక్కడ చాలా కౌంటర్లున్నాయి. చాలా రకాల ఆటలున్నాయి. మూడు చక్రాల బైకుల్ని తీసుకుని ఆ ఇసుకలో మనమే సొంతంగా నడుపుకోవచ్చు. మా బాబులు సంతోషంగా బైకులు తీసుకుని వెళ్ళారు కానీ మేము రెయిలింగ్ దగ్గర కూర్చుని వీడియోలు తీస్తూ ఉండిపోయాం. మాలాంటి వాళ్ళ కోసం పాత కాలం నాటి కార్లు, జీపుల వంటివి పెట్టారు. వాటిలో ఎక్కి పొటోలు, వీడియోలు తీసుకుటున్నారు. అంతలోనే ఒక ఇరవయ్యేళ్ళ అబ్బాయి ఫిట్స్ వచ్చి పడిపోయాడు. అక్కడ డాక్టర్లుండే ఏర్పాటు ఏమి లేదు. అతని తల్లిదండ్రులు విపరీతంగా ఏడుస్తు నీళ్ళు తెచ్చి అతని మీద గుమ్మరిస్తున్నారు. చాలాసేపు కిందనే పడిపోయి ఉన్నా ఎలాంటి వైద్య సహాయం అందలేదు. ఇవన్నీ ఊరికి దూరంగా వంద నూట యాభై కి.మీల దూరంలో ఉన్నాయి. ఇంత మంది మనుష్యులు ఉన్నపుడు డాక్టర్లు వైద్య సహాయం మందులు లేక పోవడం కొరతగా అనిపించింది. మా టీమ్ లో డాక్టర్లు ఉన్నప్పటికీ మందులు, పరికరాలు లేకుండా ఏమి చేయలేక పోయారు. తర్వాత ఆ అబ్బాయిని అక్కడున్న ఒక జ్యూస్ సెంటర్ లో పడుకో బెట్టారు. నాకైతే మూడ్ పాడయి పోయింది. మనిషి సరదాలకు ఇచ్చినంత విలువ ఆరోగ్యానికి ఇవ్వటం లేదు. ఇంతమంది ఒకచోట గుమి గూడుతున్నవుడు ఎప్పుడేం జరుగుతుందో తెలియదు కదా!

అక్కడ ఏవో చాలా ఆటలున్నప్పటికీ మాకు మాత్రం ఏవీ ఆడాలన్పించలేదు. ఆ పిల్ల వాడికి అలా ఫిట్స్ రావడం ఒక కారణమైతే మాకు తల నొప్పిగా, కడుపు నొప్పిగా ఉండడం మరొక కారణం. ఏదైనా అనారోగ్యం కలిగితే కనీసం మందులు కూడా దొరికే పరిస్థితి లేదు. తిండి పదార్థాలు కూడా అపరిశుభ్ర వాతవరణంలోనే ఉన్నాయి. ఉడికించిన మొక్క జొన్న కంకుల్ని చాలామంది తింటూ ఉన్నారు. వాటర్ బాటిల్స్ కూడా బ్రాండున్నది ఏమీ దొరకలేదు.

మూడు చక్రాల బైకులతో ఇసుకలో డ్రైవింగ్ చేయడం మా పిల్లలకు సరదాగా అన్పించింది. ఎత్తు, పల్లాల దగ్గర బైకును నడపటం గానీ తిప్పటం గానీ చాల కష్టంగా ఉన్నవి. ఒక గంట సేపు వాటితో తిప్పలు పడి ఆడుకుని వచ్చారు.

ఇక ఇక్కడ నుంచి మజా కలిగించే విషయం మొదలయింది. ఇక్కడ నుంచి మమ్మల్ని జీపుల్లాంటి వాటిలో ఎక్కించారు. రోడ్డుకు మరో వైపు తీసుకెళ్ళారు. అక్కడ పెద్ద గుట్టలు, లోయలు ఉన్నాయి. మా పిల్లలు నాకు ముందుగా చెప్పలేదు లేకపోతే నేను దిగిపోయేదాన్ని. ఈ ఇసుకతో రైడింగ్ కు ఒప్పుకునే దాన్ని కాదు. జీపులో ఎక్కించుకున్నాక డ్రైవరు కూడా వేరే అతను వచ్చాడు. ఇసుక దిబ్బల మీద డ్రైవింగ్ మొదలు పెట్టాడు. మొదట్లో చిన్న చిన్న ఎత్తులు ఎక్కితేనే భయపడ్డాము. ఆనందం, భయం కలగలసిపోయిన కేకలు అరుపులు వస్తున్నాయి. దూరంగా చాలా ఎత్తుగా గుట్టలు చూపించి “అవి కూడా ఎక్కుతాం మనమిప్పుడు” అని అన్నారు మా పిల్లలు. నేను సరదాగా అంటున్నారేమో అనుకున్నాను. జీపులో ఒకవైపు వాళ్ళందరూ మరో వైపుకు పడిపోతున్నారు. జీపుకు ఒక చక్రం ఎత్తు, దిబ్బమీద మరొక చక్రం నేలమీదా ఉంటున్నది. మా పిల్లలు చెప్పిన కొండలాంటి ఇసుక దిబ్బ ఒక అంతస్థు ఇల్లంత ఎత్తుగా కన్నా ఎక్కువే ఉన్నది. జీపులో కూర్చున్నవాళ్ళందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతూ భయంతో నవ్వుతూ కేకలు పెడుతూ ఉండగానే ఆ పెద్ద గుట్టల దగ్గరకు వచ్చాం. నిజంగానే ఆ గుట్టల్ని ఎక్కించేసాడు జీపును. నేనయితే ఆశర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్నాను. కడుపులో ఏమి లేదు కాబట్టి సరిపోయింది గానీ లేకపోతే మొత్తం బయటకు వచ్చేదేమా. మొత్తానికి ఒక గంట సేపు జీపులో డ్రైవింగ్ విన్యాసాలన్నీ చూపించాక మరల మొదట ఎక్కించుకున్న దగ్గరే దింపాడు. మరల ఎవరి కారు వాళ్ళు ఎక్కారు.

ఇప్పుడు మమ్మల్ని ఒక ఫైర్ డాన్స్ ఈవెంట్ కు తీసుకు వెళ్ళారు. ఇదొక మైదాన ప్రాంతం. లోపలికి వెళ్ళేటపుడు ఆడవారికి హిజాబ్ లు కడుతున్నారు. మేమూ కట్టించుకున్నాం. బయట ఒంటెలు గుర్రాలతో స్వారీ, చేయిస్తూ డబ్బులు తీసుకుంటున్నారు. ఇది మాటికెట్టులో లేని ప్రత్యేక ఆకర్షణ. లోపలికి వెళ్ళాక నేలమీద చక్కగా దుప్పట్లు పరిచి ఉన్నాయి. అక్కడ దిండ్లు కుడా పెట్టబడి ఉన్నాయి. మద్యలో తినటానికి కొద్దిగా ఎత్తు ఉన్న పీటలు అమార్చారు. నేను నేల మీద కూర్చోలేనని దిండ్లు వేసుకుని కూర్చున్నాను. మధ్యలో పీటల మీద తిండి పదార్థాలు పెడుతున్నారు. ఒక పక్కన మహిళలకు మెహందీ పెడుతున్నారు. అందరూ భోజనం అంటూ నృత్య కారుల విన్యాసాలు చూస్తున్నారు. మంటలతో రకరకాల విన్యాసాలు చూస్తూ అబ్బురపడుతున్నారు. మా పక్క టేబుల్ వద్ద ‘కొసావా’ నుంచి వచ్చిన కుటుంబం పలకరించి ఫోటోలు తీసుకున్నది. బయటకు వచ్చాక మేము కూడా ఒంటె స్వారీ కోసం ఒంటెను ఎక్కాం. నేను ఒంటెను ఎక్కలేకపోయాను. ఇంతకుముందు పూరిలో ఒంటెను ఎక్కి తిరిగినట్లు గుర్తుంది. అతను పీటను ఇచ్చాడు. ఒంటెను ఎక్కడానికి ఎలాగో రెండు రౌండ్లు ఒంటె స్వారీ ముగించి దిగాము.

మర్నాడు మిరాకిల్ గార్డెన్ చూడటానికి వెళ్ళాము. వాకిట్లోనే పెద్ద గుర్రం ముఖాలు రెండు స్వాగతం పలికాయి. ఆపచ్చని గడ్డితో ఉన్న గుర్రం ముఖాలవి. లోపలకు వెళ్ళే కొలదీ ఆకులు, పూలు రకరకాల ఆకారాల్లో ఒదిగిపోయి ఉన్నాయి. ఇక్కడున్న పువ్వుల రంగులను చూస్తే భూ గ్రహం ఇంత అందంగా ఉంటుందా అని ఆశ్చర్యపోతాం. అమ్మాయిల బొమ్మలు గుండ్రంగాం తిరుగుతూ ఉంటాయి. అమ్మాయి ఆకారంలో కనిపించేవన్నీ పూల చెట్లే. లోపల ఇంకా ఇళ్ళు కొండలు, విమానాలు, నెమళ్ళు, పెద్ద వృక్షాలు అన్నీ కనిపిస్తుంటాయి. కానీ అన్నింటిలోనూ పువ్వులే. ఎక్కడ ఫోటోలు తీసుకోవాలో తెలియడం లేదు. వాటి అందాలను పట్టుకోవాలంటే మామూలు కెమెరాలు ఫోన్లు సరిపోవు అన్పించింది. మేము ఒక రెండు గంటల సేపు తిరిగి బయటకు వచ్చేశాము. మాకు మధ్యాహ్నమే ఫ్లైటుంది కాబట్టి మొత్తం తిరిగి చూసేంత సమయం లేదు. కానీ ఇంకా అద్భుతాలు ఉంటాయని మిత్రులు చెప్పారు చూద్దాం మరో సారి వచ్చినపుడు అనుకుని వెళ్లిపోయాం. రూములో సామాను సర్దుకుని అన్నం తినేసి ఎయిర్ పోర్టుకు బయలుదేరాము. ఇండియా నుంచి వచ్చేటప్పుడు డైరెక్టుగా అబుదాబికే వెళ్ళిపోయాం. ఇలా దుబాయి పర్యటన ముగిసింది

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.