నడక దారిలో-60
-శీలా సుభద్రా దేవి
జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువుతో బాటు సాహిత్యం , సంగీతం, బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం. పాప రెండవ పుట్టినరోజు వేడుక , కొత్త ఇంటి గృహప్రవేశం తిరిగివెళ్ళిన రెండు నెలలకే అజయ్ చనిపోవడంతో ఆషీని తీసుకుని పల్లవి తిరిగివచ్చేసి ఉద్యోగంలో చేరింది. నేను హెచ్చెమ్ కావటం,రిటైర్ కావటం, పెద్దక్క మరణం,ప్రత్యేకతెలంగాణా ఉద్యమం, వీర్రాజు గారు తన ఏకాగ్రత అంతా పెయింటింగ్స్ వేయటంపై పెట్టారు. పల్లవి కొన్న సరూర్ నగర్ లో అపార్ట్మెంట్ గృహప్రవేశం అయ్యాక, మిత్రులు బంధువులకు విందు ఇచ్చాం. డా.పి.శ్రీదేవి మోనోగ్రాఫ్ రాయటం మొదలుపెట్టాను. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది. వీర్రాజుగారికి బోయి భీమన్న, బాపూరమణల పురస్కారాలు వచ్చాయి. ప్రరవే సభలకు వెళ్ళటం,అమృతలతగారి పరిచయం, చిన్నక్క మరణం తర్వాత—)
***
రాజమండ్రిలో వీర్రాజు గారి పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ పెట్టడానికి మాదేటి రవిప్రకాష్ వీర్రాజు గారిని సంప్రదించాడు. వీర్రాజుగారు చాలా సంతోషంగా అంగీకరించారు. రవిప్రకాష్, రవికాంత్ పెయింటింగ్స్ అన్నీ భద్రంగా పేక్ చేసి రాజమండ్రికి తీసుకెళ్ళారు. ప్రదర్శన తేదీ నాటికి మేమిద్దరం రాజమండ్రికి చేరాము. మాకు హొటల్ లో రూమ్ బుక్ చేసి వుంచారు. రాజమండ్రి టౌన్ హాల్ లో చిత్రప్రదర్శన ఏర్పాటు చేసారు. మేము దిగిన హొటల్ కు టౌన్ హాల్ చాలా దగ్గరగానే వుంది.
చిత్ర ప్రదర్శన రాజమండ్రి కమీషనర్ ప్రారంభించారు. ఆ రోజంతా అక్కడే వున్నాం. ఎండ్లూరి సుధాకర్, పుట్ల హేమలతా వచ్చారు. కొందరు చిత్రకారులూ, రచయితలూ కూడా కలిసారు. వీర్రాజుగారి బాల్యమిత్రుడు ప్రకాశరావు గారు కూడా మాతోనే వున్నారు.
మర్నాడు టౌన్ హాల్ లోనే వుండి అక్కడకు వచ్చిన వారితో కలిసాము. మూడో రోజు టౌన్ హాల్ లో ప్రదర్శన దగ్గర ఉండటానికి తెలిసిన వారికి అప్పగించి ఒక ప్రదేశానికి చూడటానికి వెళ్ళాము. పోలీస్ డిపార్టమెంట్ లో పనిచేసే ఆయన ఉద్యోగం మానేసి వచ్చిన సొమ్ముతో ఒక ఎత్తైన గుట్టమీద అతిపెద్ద బుద్ధవిగ్రహం ప్రతిష్టించే ఏర్పాట్లు చేస్తున్నాడనీ, ఆ ప్రదేశం చుట్టూ ప్రతిష్టించడానికి బౌద్ధగాథల అమరావతీ తరహా శిల్పపానల్స్ తయారౌతున్నాయనీ తెలిసి అక్కడకు వెళ్ళాము. ఆ ప్రదేశాన్ని ఆయన ఒక బౌద్ధ ధ్యానకేంద్రంగా మార్చుతున్నాడు. అక్కడ కొంతసేపు గడిపి తర్వాత రెండు మూడు దేవాలయాలేవో చూసి గోదావరి గట్టున కొంతసేపు కూర్చున్నాము. మిత్రులు ఇద్దరూ బాల్యజ్ణాపకాల్ని కలబోసుకున్నారు.
ఆ సాయంత్రం దేవాంగ సంఘం వాళ్ళు వీర్రాజుగారికి సత్కారం చేస్తామని ఆహ్వానించారు. మాకు ఈ కులపరమైన సత్కారాలు నచ్చవు. కానీ వీర్రాజుగారి మిత్రుడి కారణంగా వెళ్ళక తప్పలేదు. ఆ సందర్భంగా వాళ్ళు ప్లాస్టిక్ ఫైబర్ తో చేసిన సరస్వతి విగ్రహం ఇచ్చారు. అది మాత్రం మాకు భలే నచ్చింది. అక్కడనుండి తిరుగు ప్రయాణానికి స్టేషన్ కి వచ్చాం.
విజయవాడ పుస్తక ప్రదర్శనలో ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారి పుస్తకం ఆవిష్కరణ వుందనీ జానకీ బాల మనం వెళ్దామంది. గౌరిలక్ష్మి తన కథల పుస్తకం ఆవిష్కరణ పుస్తకప్రదర్శనలో కృష్ణాజిల్లా రచయితల స్టాల్ లో వుందని రమ్మని ఆహ్వానించింది. జానకీబాల వెళ్దాం రమ్మని కోరటంతో ఇద్దరం ఇంటర్ సిటీ ట్రైన్లో విజయవాడకి బయలుదేరాం. పల్లవి నన్ను ఉదయమే స్టేషన్ కు తీసుకు వెళ్ళింది. అప్పటికి జానకీ బాల వచ్చేసింది.
ఇక ట్రైన్ బయలుదేరిన దగ్గర నుండి మా మధ్య ఎప్పటి మాదిరే ఎన్నెన్నో కబుర్లు. విజయవాడలో వనజా తాతినేని మమ్మల్ని పికప్ చేసుకుని వాళ్ళింటికి తీసుకు వెళ్ళింది. ఆ సాయంత్రం పుస్తక ప్రదర్శనకు వెళ్ళాము. గౌరిలక్ష్మి రాసిన పుస్తకం ఆవిష్కరణ అయిన తర్వాత గుత్తికొండ సుబ్బారావుగారు, పూర్ణచంద్ గారూ, కొలకలూరి ఇనాక్ గారు, ఎమెస్కో లక్ష్మికలిసారు. శ్రీకాంతశర్మగారి ” ఇంటిపేరు ఇంద్రగంటి” పుస్తకావిష్కరణ మొదలయ్యే వరకూ కబుర్లు చెప్పుకుని ఆ సభావేదిక దగ్గరకు వెళ్ళాము. సభానంతరం శర్మగారితో బాటూ జానకీ బాల వాళ్ళ తమ్ముడి ఇంటికి వెళ్ళిపోయింది. నేను వనజతో వాళ్ళింటికి వెళ్ళాను.
దారిలో ఆ ముందు రోజు పుస్తకం ప్రదర్శనలో పాల్గొనటానికి వచ్చిన స్కైబాబ, షాజహానాలను అడ్డగించి తెలంగాణా ఉద్యమ సమయంలో ఆంధ్రా వాళ్ళని దుర్భాషలాడుతూ రాసిన కవితలు రాసినవారు మళ్ళా ఇక్కడకు ఎందుకు వస్తున్నారని కొందరు ఆందోళన చేసారనీ దాంతో అక్కడ గందరగోళం ఏర్పడినట్లు, అయితే ఆ గొడవ చేసిన వాళ్ళు నిజానికి సాహితీవేత్తలు కాదని రాజకీయ కార్యకర్తలని చెప్పింది వనజ.
రాష్ట్రాలు విడిపోయినా ఇరుప్రాంతాల జనాలలోనూ కొంత ద్వేష భావాలు రగులుతూనే వున్నాయి. అందుకు ప్రధాన కారణం మాత్రం స్వార్థ పూరిత రాజకీయాలే.
శిఖామణిగారు తన పుట్టిన రోజున యానాంలో కవితోత్సవం నిర్వహించి శివారెడ్డిగారికి పురస్కారం ఇస్తున్నానని వీర్రాజుగారికి ఫోన్ చేసారు. ఆసందర్భంగా వీర్రాజుగారి పెయింటింగ్స్ ప్రదర్శన కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాననీ. రాజమండ్రిలో వున్న పెయింటింగ్స్ యానాం తీసుకు వెళ్తున్నానని చెప్పారు. దానికి ఇద్దరూ రావాలని కోరుతూ, ఆ సందర్భంలో సుభద్రాదేవిగారిని కూడా కవిత చదవమని చెప్పమని ఫోన్లో చెప్పారు శిఖామణి. ఆ విషయం వీర్రాజుగారు నాకు చెప్పారు. వీర్రాజుగారి చిత్ర ప్రదర్శన యానాంలో ఏర్పాటు చేయటం సంతోషం కలిగించింది. ఆ సందర్భంగా అయినా యానాం ప్రయాణం కూడా సంతోషకరమే. కానీ శిఖామణిగారు వీర్రాజుగారి ద్వారా నన్ను కవి సమ్మేళనంలో పాల్గొనమని చెప్పించడం నాకు నచ్చలేదు. శిఖామణిగారికి ఈ విషయం తెలిసే అనుకుంటా కవి సంధ్యలో నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు దీని గురించి ప్రత్యేకం ఒక ప్రశ్న వేసారు. నిజానికి శిఖామణి కవిత్వం నాకెంతో ఇష్టం. తర్వాత్తర్వాత శిఖామణిగారు మా కుటుంబానికి అత్యంత ఆత్మీయులు అయ్యారు.
అది అలా వుంటే వీర్రాజుగారికి ఫోన్ చేసి నన్ను కవి సమ్మేళనంలో పాల్గొనమనే సందర్భాలు నేను చాలానే ఎదుర్కొన్నాను. ఇటువంటిదే ఒకసారి హైదరాబాద్ పుస్తకప్రదర్శనలో ఒక ప్రముఖ సంస్థ కవి సమ్మేళనం ఏర్పాటు చేసి నాకు ఫోన్ చేసి చెప్పకుండా వీర్రాజుగారితో “సుభద్రాదేవిగారిని ఫలానా రోజు కవిసమ్మేళనంలో కవిత చదవటానికి రమ్మని చెప్పండి. వెయ్యి రూపాయలు కూడా ఇస్తున్నాం” అని నిర్వాహకులు చెప్పారు. అలా కాకుండా “ఫోన్ సుభద్రాదేవికి ఇవ్వండి. కవిసమ్మేళనానికి ఆహ్వానించాలి” అని చెప్పినాకు పర్సనల్ గా చెప్పటం మర్యాద కదా. ఇతర కవయిత్రుల భర్తలకు ఫోన్ చేసి మీ ఆవిడని సభకి పంపండి అని అనగలరా? నాకు భలే కోపం వచ్చి ఆ రోజు వెళ్ళలేదు.
సరే అయితే ఇప్పుడు యానాంలో వీర్రాజు గారి చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. వయసు రీత్యా వీర్రాజుగారికి సాయంగా వెళ్ళక తప్పదు. అందుకని యానాం బయలుదేరాం. కాకినాడలో దిగిన తర్వాత రిసీవ్ చేసుకొని కార్లలో యానాం తీసుకు వెళ్ళారు. మాతోపాటూ, శివారెడ్డి, శ్రీకాంతశర్మగారూ, ఇతర కవి మిత్రులు కూడా వున్నారు. పగలంతా బహుమతి ప్రదానం, కవిసమ్మేళనం జరిగింది. ఆ రాత్రి మేమిద్దరం తప్ప కొందరు కవయిత్రులతో సహా ఇతరులందరితో సభానంతర సమావేశం జరిగింది.
మర్నాడు ఉదయమే తయారై నేనూ, రేణుకా అయోలా బయట అలా నడుచుకుంటూ గోదావరి ఒడ్డువరకూ వెళ్ళి వచ్చాము.
మిగతా వాళ్ళంతా ఇంకా యానాంలో తనివి తీరక అక్కడే వున్నారు. వీర్రాజుగారూ, నేను తిరుగు ప్రయాణానికి బయలుదేరిపోయాము. ఆ తర్వాత సుంకర చలపతిరావుగారితో సంప్రదించి రవిప్రకాష్ విశాఖ చిత్రకళా పరిషత్ లో కూడా పెయింటింగ్స్ ప్రదర్శనను రెండు రోజులు ఏర్పాటు చేసారు. కానీ మేము వెళ్ళటానికి కుదరలేదు.
ఉమ్మడిసెట్టి పురస్కారాలు ఈ ఏడాదితో ముఫ్ఫై అవుతాయనీ, ఆ సందర్భంగా ఇంతవరకూ పురస్కారాలు అందుకున్న వారందరినీ ఆహ్వానించి రోజంతా సభలు నిర్వహించటమే కాక ఒక పది మంది సీనియర్ కవులకు ప్రతిభా పురస్కారాలు అందించాలని తలపెట్టానని రాధేయగారు ఫోన్ చేసి తెలియజేసారు. నాకు చాలా సంతోషం కలిగింది.
1994 లో వచ్చిన “తెగిన పేగు” కవితా సంపుటిని ఉమ్మడి సెట్టి పురస్కారం పరిశీలనకు పంపాను. నాకు పురస్కారం రాలేదు. కానీ నాగభైరవ కోటేశ్వరరావుగారు నా కవితా సంపుటిని ప్రశంసిస్తూ నాకు వుత్తరం రాసారు. నేను ఆయనకు పుస్తకం పంపలేదు కదా అని ఆశ్చర్యపోయాను. తర్వాత బహుశా ఉమ్మడిసెట్టి పురస్కారాల న్యాయనిర్ణేతగా ఉండివుంటారనుకున్నాను. అప్పుడు తప్పిపోయిన పురస్కారం ఈనాడు ప్రతిభా పురస్కారంగా అందుకుంటున్నానని ఆనందించాను.
ఆ సభలకోసం కొండేపూడి నిర్మలతో కలిసి అనంతపురం బయలుదేరాను. అక్కడ మా ఇద్దరినీ శశికళ రిసీవ్ చేసుకొని వాళ్ళింట్లోనే ఆతిధ్యం ఇచ్చి మమ్మల్ని సభల అనంతరం తిరిగి ఆ సాయంత్రం ట్రైనుకి అందించేవరకూ మా వెన్నంటే వుంది.
“ఇంతవరకూ ముఫ్ఫై పురస్కారాలు ఇచ్చాము. అనేక కారణాలవలన ఇంక ఆపాలని భావిస్తున్నాను” అని రాధేయగారు సభలో మాట్లాడుతూ అన్నారు. కానీ రాధేయగారి శ్రీమతి సత్యాదేవి ఒకింత భావోద్వేగంతో కన్నీళ్ళతో ” ఉమ్మడిసెట్టి పురస్కారాలు ఆగవు. ఎప్పటికీ కొనసాగుతాయి” అని ప్రకటించారు. అప్పటికే కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో వున్నారు. ఆమె మాటలకి సభికులంతా ఉద్విగ్నతతోనే హర్షధ్వానాలు చేసారు. కానీ దురదృష్టం ఏమిటంటే తర్వాత కొంతకాలానికే రాధేయగారిని ఒంటరిని చేసి ఆమె మరణించారు.
ప్రజా సాహితి దివి కుమార్ గారు జనసాహితితో కలిసి విజయవాడలో వీర్రాజుగారి పెయింటింగ్స్ ప్రదర్శన ఏర్పాటు చేయాలని భావించారు. ఈమని శివనాగిరెడ్డిగారు విజయవాడలోని మధుమాలక్ష్మి కన్వెన్షన్ లో ప్రదర్శనకు సహకరించారు.
యూ.ఎస్ లో వున్న ప్రముఖ నైరూప్య చిత్రకారులు ఎస్వీ రామారావుగారు వూర్లోనే వున్నారని ఆయనతో ప్రదర్శన ఉదయం పదిన్నరకు ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు వుదయం ఆరుగంటలకు మాకు ఎప్పుడూ వచ్చే డ్రైవర్ని విజయవాడ వెళ్ళాలని రమ్మన్నాము. తీరా అతనికి అర్జంట్ గా వెళ్ళాల్సిన అవసరం వచ్చిందని వేరే డ్రైవర్ని పంపించాడు. దాంతో బయలుదేరటమే ఆలస్యం అయ్యింది.
తీరా ఎనిమిది దాటింది కదా అని దారిలోనే టిఫిన్ కూడా పూర్తిచేసుకొని బయలుదేరి తర్వాత పెట్రోల్ బంక్ కు వెళ్ళాము. పెట్రోల్ నింపాలని చెప్తే పొరపాటున డ్రైవర్ డీజిల్ నింపుతూ అప్పుడు తన పొరపాటును అబ్జర్వ్ చేసాడు.పెట్రోల్ టేంక్ లో డీజిల్ నింపకూడదట. అక్కడకు దూరంలో వున్న కారుమెకానిక్ షాపుకు డ్రైవర్, బంక్ అతనూ వెళ్ళి మెకానిక్ ని తీసుకు వచ్చి ట్యూబ్ ద్వారా డీజిల్ తీసివేసి కారు టాంక్ శుభ్రం చేసి తిరిగి పెట్రోల్ నింపి బయలు దేరేసరికే పదిన్నర అయ్యింది. మేము దివి కుమార్ గారికి ఫోన్ చేసి ఇదంతా చెప్పి చిత్ర ప్రదర్శన ప్రారంభించేయమని చెప్పాము. ఆ డ్రైవర్ దారి కూడా సరీగా తెలియదేమో మేము విజయవాడ చేరేసరికే రెండు కావస్తుంటే దివి కుమార్ గారు హొటలు రూమ్ కే తీసుకువెళ్ళారు. అక్కడ భోజనం చేసి మధుమాలక్ష్మి కన్వెన్షన్ కు వెళ్ళాము. అక్కడ ఎస్వీ రామారావుగారితో సహా అందరూ మా కోసం ఎదురు చూస్తున్నారు.
వీర్రాజుగారి పెయింటింగ్సేకాక మా ఇద్దరి పుస్తకాలు కూడా ప్రదర్శనకు పేర్చారు.పెయింటింగ్స్ చాలా బాగా స్టాండులకు అమర్చారు. అవి చూసి మాకు చాలా సంతోషం కలిగింది. సాయంత్రం వరకూ వుండి హోటల్ కు వెళ్ళిపోయాము. మర్నాడు ఉదయం తయారై తొమ్మిదింటికల్లా మధుమాలక్ష్మి కన్వెన్షన్ సెంటర్ కు వెళ్ళాము. ఆ రోజు చాలా మంది మిత్రులు వచ్చారు. వనజాతాతినేని, అల్లూరి గౌరి లక్ష్మీ, చలసాని వసుమతికాక కుందుం ప్రకాశరావు మొదలైన వీర్రాజుగారి మిత్రులు కూడా వచ్చారు. జనసాహితి తరుపున సాయంత్రం ఆరుగంటలకు ఒక సభా సమావేశం ఏర్పాటు చేసారు. వీర్రాజుగారి చిత్రాలు గురించి కొందరు చిత్రకారులు ప్రసంగించారు. కొందరు ప్రముఖులు డెలిగేట్స్ గా మధుమాలక్ష్మి కన్వెన్షన్ కు వస్తున్నారని , ఏవో కార్యక్రమాలు వున్నాయని అందుకని తర్వాత మరో మూడు రోజులు చిత్ర ప్రదర్శన కొనసాగిస్తామని మధుమాలక్ష్మి నిర్వాహకులైన ఈమని శివనాగిరెడ్డిగారు అన్నారు. అంతేకాక ఒక లక్షన్నరకు అయిదు పెయింటింగ్స్ కొంటానని , ఒక పెయింటింగ్ మాధుమాలక్ష్మికి బహుమతిగా కూడా ఇవ్వమని కోరారు. చిత్రప్రదర్శన చాలా సంతోషం కలిగించటం వలన ఒక పెయింటింగ్ శివనాగిరెడ్డిగారికి బహుమతిగా ఇచ్చేసారు. వీర్రాజుగారు కానీ అమ్మటానికి మాత్రం ఇష్టపడలేదు.
మర్నాడు వసుమతిగారింటికి వెళ్ళాము. వసుమతిగారు ఎప్పటినుంచో కోరుతున్నందున ఒక చిత్రాన్ని బహుమానంగా ఆమెకు ఇచ్చారు వీర్రాజుగారు. తర్వాత మేము ప్రజాసాహితి ఆఫీసుకి వెళ్ళి రవిబాబుగారిని కలిసి, దగ్గరలోని హొటల్ లో భోజనం చేసి హైదరాబాద్ తిరిగి బయలుదేరాము.
విజయవాడలో జరిగే కృష్ణారచయిత్రుల మహాసభలో ఒక చిరుసత్కారం చేస్తామని ఫోన్ చేసి ఆహ్వానించారు డా.జివి.పూర్ణచంద్ గారు. అంతేకాక మహిళలకు చెందిన వ్యాసం ఏదైనా రాసి ఇవ్వమని కోరారు.పేదవర్గాల ఆడపిల్లలు చదువులకు కలిగే అవరోధాలు మీద స్టాటిస్టిక్స్ ఆధారాలతో వ్యాసం రాసి పంపించాను. అదే సందర్భంలో జానకీ బాలకు ఒక పురస్కారం కూడా వుండటం వలన ఇద్దరం కలిసి కారులో విజయవాడ బయలుదేరాం. మా ఇద్దరికి ఒకే హొటల్ లో వసతి కల్పించారు.
ఒక సమావేశంలో మండలి బుద్ధప్రసాద్ గారి చేతి మీదుగా కొన్ని పుస్తకావిష్కరణలు కూడా జరిగాయి. ఆ సందర్భంలో నా ” ఇస్కూలు కతలు” పుస్తకంకూడా బుద్ధప్రసాద్ గారు ఆవిష్కరించారు. ఆయన వీర్రాజుగారి గురించి నాతో ప్రస్తావించారు.
నన్ను సన్మానించినపుడు నా గురించి నాలుగు మాటలు కె.బి.లక్ష్మి మాట్లాడింది. నేను నా కార్యక్రమం అయ్యాక సభికులలో కూర్చున్నప్పుడు ఒక అమ్మాయి వచ్చి చిత్తూరులో కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నానంటూ తనను పరిచయం చేసుకుని డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు పాఠ్యాంశంగా వున్న నా కథ ” మార్పు వెనుక మనిషి” చెప్తుంటాననీ వాళ్ళకు చూపించటానికంటూ నా గురించి వివరాలడిగి నాతో సెల్ఫీ దిగింది. అది నాకు ఎంతో ఆనందం కలిగించింది.
ఒకసారి లేఖిని ద్వారా ఏర్పాటు చేసిన కవిసమ్మేళనానికి తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ వైస్ ఛాన్సలర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణగారిని ముఖ్య అతిథిగా పిలిచారు వాసా ప్రభావతిగారు.
కవిసమ్మేళన సంధానకర్తగా నేనే వున్నాను. ఆ సభలో గంగిశెట్టిగారు వారి మాతృమూర్తి పేరిట కవితా సంపుటాలకు బహుమతి ఇవ్వాలనుకుంటున్నాననీ, కవితా సంపుటాలు పంపమని ప్రకటన సభాముఖంగా చేసారు. సాధారణంగా నేను పోటీలకు పంపను. కానీ పంపక పోవటం వలన ఎన్నో మంచి బహుమతుల్ని పోగొట్టుకుంటున్నానని చెప్పి పోటీకి అప్పట్లోనే వచ్చిన నా ఆకాశం నాదే సంపుటిని కూడా పంపించాను.
*****