
నా జీవన యానంలో- రెండవభాగం- 60
-కె.వరలక్ష్మి
మౌంటెన్ వ్యూ బుక్ షాపు డౌన్ టౌన్ లో ఉంది. షాపు పైన ఉన్న కాఫీ షాపులో అక్కడి ఇంగ్లీషు రచయితలు వారం వారం కలుస్తున్నారని నెట్లో చూసి గీతా నేనూ వెళ్లేం. పరిచయాలయ్యేక ఒక గంట పాటు ఎవరికి వాళ్లు లేప్ టాప్ లో ఏదో ఒక రచన చెయ్యడం. తిరిగి దాని గురించి డిస్కషన్స్ ఏమీ లేవు. అదయ్యేక పక్కనే ఉన్న చైనీస్ బొమ్మల షాపు చూసి తిరిగొచ్చాం.
ఒక రోజు ఒక మూవీ చూసాను. ఒక తల్లి కూతురు తయారు చేసిన కేక్ ని రోజూ ఒక ముక్క ఇష్టంగా తింటూ ఉంటుంది. కూతురు ఆ కేక్ ని ఎక్కడికో పట్టుకెళ్తే ‘‘దీన్ని వెనక్కి తెస్తానని ఆశపెట్టుకోకు, అక్కడే పంచిపెట్టేస్తాను’’ అంటుంది. ఎప్పుడూ ఏవో మాటల్తో తల్లిని బాధిస్తూ ఉంటుంది. ఆ తల్లి కళ్ళల్లో నీళ్లతో తనలో ఇలా అనుకుంటుంది. ‘‘ఆశ! అసలెందుకొచ్చాను ఇక్కడికి? గొప్ప మనస్తాపంగా ఉంది. ఎందుకు మనస్తాపం? ఎవరి నైజాన్ని బట్టి వాళ్లు నడుచుకుంటారు కదా! జీవితంలో ఎన్ని ఢక్కా మొక్కీలు తిన్నాను? ఈ సరికి ఎప్పుడో రాటుతేలి ఉండద్దా? జీవితాన్ని మౌనంగా దూరం నుంచి వీక్షించే యోగిలాగా ఉండడం మంచిదిక’’ – కిరణ్ ప్రభగారు అప్పటికి డబ్లిన్ లో ఉన్నారు. జూన్ 14న వాళ్లింట్లో ‘వీక్షణం 2 సమావేశం జరిగింది, కాత్యాయనీ విద్మహే తన డాక్టరేటు సబ్జెక్ట్ అయిన బుచ్చి బాబు గురించి మాట్లాడేరు. క్రాంతి శ్రీనివాసరావు పొయెట్రీ, దానిమీద ఆవంత్స సోమసుందర్ రాసిన విమర్శనా వ్యాసం పుస్తకాలు కూడా ఆవిష్కరించేరు. కాంతిగారు మంచి ఆతిథ్యం ఇచ్చేరు. నా ‘జీవరాగం’ పుస్తకం ఇచ్చేను కాంతిగారికి. వాళ్ల ‘కౌముది’ పత్రిక కోసం జీవరాగం కథల నేపథ్యాలు రాయమని, జనవరి నుంచి మొదలుపెడదాం అని అన్నారు. నేను సరే అన్నాను. వంగూరి చిట్టెన్రాజుగారి హాస్య కథలు 116, తిరుమల రామచంద్రగారి ‘హంపీ నుంచి హరప్పాదాకా’; శ్రీశ్రీ అనంతం, రావి కొండలరావు ‘హ్యూమరథం’ పుస్తకాలు చదివేను. తిరుమల వారు ఆత్మకథ రాయడం ఆలస్యంగా ప్రారంభించేరు. నాలుగింట ఒక వంతు రాసేసరికి ఆయన కాలం చేసారు. అనంతంలో చెప్పిందే మళ్లీ మళ్లీ రిపీట్ అవుతుంది.
ఒక రోజు మధ్యాహ్నం 2 కి స్వాగత్ హోటల్లో ముళ్లపూడి వెంకటరమణగారమ్మాయి రాయప్రోలు అను ఫాదర్స్ డే సందర్భంగా ఒక మీటింగ్ పెట్టి అందరి చేతా ఆయన గురించి మాట్లాడించింది. ఇక్కడే ఉంటుందట తన భర్త, 15 ఏళ్ల వాళ్ల అమ్మాయితో. సభలో ఉన్న అందరూ రెండేసి, మూడేసి నిమిషాలు మాట్లాడేరు. నేను కూడా ఆయన కథల గురించి, సినిమాలలో అశ్లీలత లేని సంభాషణల గురించి, నాకు ఇష్టమైన వంశవృక్షం సినిమా గురించి, అది కన్నడ వెర్షన్ కన్నా ఎంత బావుందో చెప్పేను.
2015 జూన్ 27 న ఉదయాన్నే కోమల్ తో సహా అందరం బయలుదేరి నార్త్ ఈస్ట్ వైపున్న యూసెమిటీ వెళ్లేం, పెద్దపెద్ద దుర్గాలు నిర్మించినట్టు రాతి కొండలు, కొండపాదం నుంచి పైకి చూస్తే మెడనొప్పి పుట్టేంత పెద్దకొండలు. ప్రయాణపు దారి పొడవునా పొలాలు, పళ్లతోటలు, పశువులు గుర్రాల ఫామ్స్ ఉన్నాయి. కొండల్ని చూడ్డానికి ఎంతోసేపు పట్టదు. మధ్యలో నిలబడితే చుట్టూ కొండలు. అయినా వాళ్ల బస్సెక్కి అన్ని పోయింట్లు చూసాం. కాని వేసవి కావడం వలన వేడి చాలా ఎక్కువగా ఉంది. వర్షాకాలంలో ఎంతో ఉధృతంగా పడుతుందని చెప్పే బ్రైడల్ వీల్ (పెళ్లికూతురి మేలిముసుగు) జలపాతంలో నీళ్లే లేవు. ఆగి ఆగి తుంపర్లు తుంపర్లుగా పడుతోంది. కొంత అప్ లోకి ఎక్కవలసి రావడం వలన చాలా అలసిపోయాను. అప్పర్ – లోయర్ ఫాల్స్ దగ్గర కొంతసేపు గడిపేం, పిల్లలు నీళ్లలో దిగి ఆడేరు. వచ్చేముందు టన్నెల్ పోయెంట్ నుంచి కొండలన్నిట్నీ మరో కోణంలో చూసి, వెనక్కి 60 మైళ్లు వచ్చి గేవ్ లేండ్ లో యూసెమిటీ వెస్ట్ గేట్ లాడ్జిలో రాత్రికి బసచేసేం.
మర్నాడు ఉదయం 10 కి బయలుదేరి ప్రత్యేకంగా, కొంత ప్రాచీనంగా ఉన్న జేమ్స్ టౌన్ ఊరినీ, అక్కడి రైల్ మ్యూజియంనీ చూసి మరోవైపు కొండల్లోకి ప్రయాణించి కేవ్ అండ్ మైన్ ఎడ్వంచర్స్ కి వెళ్లేం. గీత నాకా గుహల్ని చూపించాలనుకుంది కాని నేను ఒప్పుకోలేదు. అలాంటి ప్రదేశాల్లో నాకు ఊపిరి అందదు. సత్య, వరు మాత్రం జిప్ లైన్ ఎడ్వెంచర్ కి వెళ్లొచ్చేరు ఒక్కొక్కరికి 44 డాలర్లు కట్టి. వచ్చేటప్పుడు సోనోరా అనే ఊళ్లో రౌండ్ టేబుల్ రెస్టారెంట్లో లంచ్ చేసి రాత్రి 7.30 కి ఇంటికి తిరిగివచ్చాం. సాధారణంగా US లో ప్రయాణాలు, ఫంక్షన్స్, పండగలు అన్నీ వీకెండ్స్ లోనే జరుగుతాయి. నాలుగు రోజుల్లోనే మళ్లీ మరో ప్రయాణం. జూలై 2 మధ్యాహ్నం 12 కి బయలుదేరి నార్త్ కి ప్రయాణంచేం. సేక్రిమెంటో సిటీలోకి వెళ్లకుండా పక్కనుంచి ప్రయాణించి దారిలో రకరకాల పంటపొలాలు, పళ్లతోటలు, వందల ఎకరాల పచ్చదనాన్ని, రైస్ మిల్లుల్లాంటి పెద్ద ఫేక్టరీలని చూసుకుంటూ కొండల మీదుగా ప్రయాణించి సెక్రిమెంటో నది మీద DAM ని చూసి, ఇంకొంచెం ముందుకెళ్లి అదే నది మీద 2001 లో కట్టిన వంతెన మీదుగా నడిచి టైండయల్ భారీ స్థంభాన్ని చూసాం. 106 డిగ్రీల వేడి ఉంది ఆ రోజు. చల్లని నది నీటిలో దిగి ముఖంపై చల్లుకున్నాం. మన అలవాటు ప్రకారం ఎక్కడైనా నదుల్ని, సరస్సుల్ని చూడగానే పూజ్యభావం కలుగుతుంది కదా! నిండు పున్నమి చంద్రుడు SASTA పర్వతం మీదుగా ఉదయించడం, పడమటి దిక్కున శుక్రుడో అంగారకుడో పెద్దగా కన్పించడాన్ని చూస్తూ, కొండలు అడవుల్లో ప్రయాణిస్తూ కాలిఫోర్నియాను దాటేం. ఓరగాన్ రాష్ట్రంలోని మెడ్ ఫోర్డ్ నగరంలో హౌంప్టన్ ఇన్ లో ఆ రాత్రి దిగేం.
మూడవ తేదీన ఉదయం మళ్లీ బయలుదేరి ఓరగాన్ రాష్ట్రంలోని క్రేటర్ లేక్ కి వెళ్లేం. 7700 సంవత్సరాల క్రితం పగిలిన ఒక అగ్నిపర్వతం అలా సరస్సుగా ఏర్పడిందట, అక్కడి లోకల్ ప్రజలు దాన్ని మహామా అని పిలుస్తారు, సరస్సులో ఒక చివరగా అగ్నిపర్వతపు శిఖరం ఉండిపోయింది. లావాతో ఏర్పడిన అద్భుత శిలలు ఉన్నాయి. చుట్టూ ఉన్న చెట్ల మీద శీతాకాలంలో పేరుకున్న మంచుకరిగి ఆ నీటితో ఆ సరస్సు నిండుతూ వచ్చి ఇప్పడు అమెరికా లోనే లోతైన సరస్సుగా తయారైందట. 200 అడుగుల పైగా లోతైన స్వచ్ఛమైన నీలిరంగు నీటి సరస్సు అది. దాన్ని చుట్టి రావడానికి (ప్రదక్షిణ) 35 మైళ్లు ప్రయాణం చెయ్యవలసొచ్చింది. ఆ ప్రయాణంలో సరస్సును ఎత్తైన కొండలమీది నుంచి చూస్తాం. కొండల పైనుంచి 4-1/2 మైళ్లు కిందికి దిగితే సరస్సు వస్తుంది. ఈ భూమి మీది అద్బుతాలలో ఇదికూడా ఒకటి, పైనుంచి ఒక్కొక్క పాయింట్ దిగుతూంటే చలి వెయ్యడం మొదలైంది. రాత్రికి తిరిగి మెడ్ ఫోర్డ్ లోని రూంకి చేరుకున్నాం. మర్నాడు ఉదయం అక్కడి నుంచి బయలుదేరి వందల మైళ్ల కైవారంలో ఉన్న రెడ్ ఉడ్ నేషనల్ పార్క్ కి వెళ్లేం. కోట్లకొద్దీ ఉన్న రెడ్ ఉడ్ చెట్లను చూస్తూ సాయంత్రానికి ఆర్కేడ్ లోని హేంప్టన్ హోటల్ కి చేరుకున్నాం. దారిలో స్మిత్ నది దగ్గర ఆగి లంచ్ చేసాం. చాలా సేపు ఆ ఫ్రెష్ వాటర్ లో చల్లని పరిసరాల్లో ఉండిపోయాం. దారిపోడవునా అడవి అందాల్ని ఆస్వాదిస్తూ వెళ్లి వందల ఏళ్లనాటి అతి పెద్ద రెడ్ వుడ్ చెట్టును చూసాం. మధ్యలో ఒకచోట ట్రీస్ ఆఫ్ మిస్టరీ దగ్గర చాలా పెద్ద ట్రైబల్ మేన్, ఒక ఎద్దు బొమ్మలు – ట్రైబల్ మ్యూజియం చూసాం. రాత్రి డిన్నర్ కి ఆర్కేడ్ కి దగ్గర్లో ఉన్న యురేకా లో ఇండియన్ రెస్టారెంట్ కి వెళ్లేం, ఆ రోజు జూలై 4 అమెరికా ఇండిపెండెన్స్ డే కావడం వలన యురేకా సీషోర్ లో అద్భుతమైన ఫైర్ వర్క్స్ చూసాం. మధ్యాహ్నం రెడ్ వుడ్ నేషనల్ పార్క్ దాటుతూనే కారు సముద్రపు వొడ్డునే రోడ్డులో ప్రయాణించింది, సముద్రం మీది నుంచి నీటి ఆవిరి మేఘాల రూపంలో పైకి లేవడాన్ని మొదటిసారి చూసాను. సముద్రాన్ని, చెట్లనూ కమ్మేసిన పొగలాంటి మబ్బులు చూడడం కూడా ఒక మరపురాని అనుభూతి.
మర్నాడు సన్ డే ఉదయం ఆర్కేడ్ నుంచి బయలుదేరి మళ్లీ యురేకా వెళ్లి అక్కడి విక్టోరియా కాలం నాటి ఓల్డ్ టౌన్, గొప్పపనితనంతో కట్టిన కార్సన్ బిల్డింగ్ చూసి, తిరిగి రెడ్ వుడ్ పారెస్ట్, కొండదారుల మీదుగా ప్రయాణించి రెండు గంటలకి రెడ్డింగ్ అనే ఊరు చేరాం. అక్కడి ప్రియారెస్టారెంట్లో ఇండియన్ లంచ్ చేసి బేసిన్ నేషనల్ పార్క్ వైపుగా బయలుదేరాం. దారిలో మరోవైపు మళ్లి మెరార్డర్ బర్నీఫాల్స్ అనే అందమైన జలపాతాన్ని చూసాం. ఇక లేసన్ పార్క్ లో 1950 లో పేలిన పెద్ద అగ్నిపర్వతం లేసన్ ని, అది వదిలిన లావా గుర్తుల్ని, ఓ పక్క ఇంకా ఉడుకుతున్న గంధకపు మడుగుల్ని చూసి రాత్రి 1 కి ఇంటికి చేరుకున్నాం.
ఒకరోజు సన్నీవేల్ కి దగ్గర్లో ఉన్న గూగుల్ ఆఫీసు, పక్కన ఉన్న షోర్ లేన్ పార్క్ చూపించింది. జూలై 10న కొలకలూరి ఇనాక్ గారు లాస్ ఏంజల్స్ లో NATS సభలో పాల్గొని మృత్యుంజయుడు గారింటికి వచ్చి ఉన్నారట. గీతా నేనూ వెళ్లి ఆయన్ని తీసుకొచ్చి భోజనం పెట్టి శాలువాతో సత్కరించింది గీత.
ఆ జూలై 11న నాపావేలీకి వెళ్లేం, అక్కడ రాళ్లతో నిర్మించిన పాత మోడల్ కోట ఒకటి ఉంది. దాన్ని చూడడానికి ఒక్కొక్కళ్లకీ 20 డాలర్లు టిక్కెట్టు, కోటలో అన్ని గదుల్లోనూ వైన్ టేస్టింగ్ స్టాల్స్ ఉన్నాయి. వెళ్లిన వాళ్లంతా అదే పనిలో ఉన్నారు. మేం మాత్రం వాటివైపు చూడకుండా కోటను చూడడంలో నిమగ్నమయ్యాం. బైట అంతా వందల ఎకరాల ద్రాక్షతోటలు, వచ్చేటప్పుడు దారిలో ఫెయిత్ ఫుల్ గీజర్ చూసాం. నేల లోపలినుంచి 45 నిమిషాల కొకసారి వేడినీరు ఫౌంటెన్ లాగా వస్తోంది ఒకచోట. దాన్ని చూడడానికి మనిషికి 14 డాలర్ల టిక్కెట్టు.
జూలై వీక్షణం మీటింగ్ ఫ్రీమౌంట్ లో ఉన్న సుభాష్, వందనల ఇంట్లో జరిగింది. అప్పటికి కొత్తగా రాస్తున్న సాయిపద్మ వైజాగ్ నుంచి కాళ్లకు వైద్యం కోసం అమెరికా వచ్చి ఉన్నదట. ఆ రోజు గెస్ట్ గా వచ్చింది, మంచి ఈవెంట్స్ తో చాలా బాగా జరిగింది సమావేశం. నేను అప్పటికి కొత్తగా రాసిన కిటికీ, థేంక్స్ గివింగ్ పోయెమ్స్ చదివేను.
ఇండియాలో 14.7.15 న గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజునే తొక్కిసలాటలో 34 మంది చనిపోయారని వార్తల్లో చెప్పేరు. షాజహానా అక్క సంషాద్ బేగం రంజాన్ విందుకి పిలిస్తే వెళ్లేం. ఆ అమ్మాయి మమ్మల్ని ఎంతో ఆప్యాయంగా చూసి, నాకో చీర పెట్టి సత్కరించింది. తన పొయెట్రీ బుక్ ఇచ్చింది, ఎందుకో కొందరికి రావాల్సినంత పేరు రాదు. షంషాద్ మంచి కవిత్వం రాసింది.
“Life is not series of giglamps symmetrically arranged, but a luminous halo, a semitransparent envelops surrounding us from the beginning of the consciousness of the end” అంటుంది వర్జీనియా వూల్ఫ్.
‘‘అవార్డులు పొందడం ప్రత్యేక కళ. అది కవితారంగానికి గాని, కళారంగానికి గాని చెందిన వ్యవహారం కాదు. పాఠకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవడం కన్నా గొప్ప అవార్డు ఏముంటుంది?’’ అంటుంది మాయా ఏంజిలో. నేను బయలుదేరే డేట్ దగ్గరకొస్తోందని మా కోమల్ నా కోసం ఒక బల్లి స్మార్ట్ ఫోన్ కొని తెచ్చాడు. నామొదటి మనవడు ఇచ్చిన మొదటికానుక. నాకు చెప్పరాని ఆనందం కలిగింది, మా గీత నాకోసం వజ్రాల దుద్దులు కొని పెట్టింది. అవి మాత్రం నాకు ఆనందాన్ని కలిగించలేదు. పిల్లల నుంచి అంత ఖరీదైన గిఫ్టులు తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఎవరికీ ఋణపడిపోవడం కూడా నాకు నచ్చదు. ఆడంబరంగా అహంకారంతో జీవించడం కూడా నా పద్ధతి కాదు. నావి చిన్ని చిన్ని ఆనందాలు. దాసరి అమరేంద్ర తన టూర్ లో భాగంగా కాలిఫోర్నియా వస్తే గీత తమ ఇంట్లో ఉండమని పిలిచింది, వీళ్లింట్లో ఉంటూ తన ఫ్రెండ్స్ ని కలుస్తూ, పరిసర ప్రదేశాలు చూస్తాడు కొన్నాళ్లు. సాహిత్యాన్ని అభిమానించే ఇక్బాల్ డిన్నర్ కి పిలిస్తే అమరేంద్రను తీసుకుని వెళ్లేం.
జూలై 26న నా తిరుగుప్రయాణం, 24న గీత చాలా మందిని డిన్నర్ కి పిలిచింది. తనే స్వయంగా రకరకాల వంటలు చేసింది. నేను వెళ్తున్నందుకూ, అమరేంద్రను అందరికీ పరిచయం చెయ్యడానికీ ఆగెట్ టుగెదర్. ఇక్బాల్ తల్లిగారు కొన్ని తన జీవితానుభవాలు చెప్పేరు. అమరేంద్ర తన గురించీ, తన రచనల గురించీ మాట్లాడేడు. గీత నా గురించి రాసిన పోయెమ్ చదువుతూ దుఃఖపడిపోయింది, నాకూ దుఃఖంతో కన్నీళ్లొచ్చాయి. ఆ సెంటిమెంట్సూ, ప్రేమలూ లేకపోతే జీవితాలు నిస్సారాలు కదా!
జూలై 26 ఉదయం 7.30 కి గీత, అమరేంద్ర వచ్చి నన్ను శాన్ ఫ్రాన్సిస్కో ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కించారు.
ఇంతేరా ఈ జీవితం
తిరిగే రంగులరాట్నమూ – అన్నపాట ప్రయాణం పొడవునా నామనసులో కదలాడింది.
*****

కె వరలక్ష్మి జన్మస్థలం, ప్రస్తుత నివాసం తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట. ప్రస్తుత నివాసం హైదరాబాద్. ప్రముఖ కవయిత్రి, “నెచ్చెలి” సంస్థాపకసంపాదకురాలు డా||కె.గీత వీరి అమ్మాయి. నాలుగు నవలికలు, 200 పైగా కథలు, చాలా కవితలు, రేడియో నాటికలు, వ్యాసాలు రచించారు. జీవరాగం (1996), మట్టి బంగారం (2002), అతడు నేను- (2007), క్షతగాత్ర (2014), పిట్టగూళ్లు (2017) కథా సంపుటులు, ఆమె (2003) కవితా సంపుటి, కథ, కథావార్షిక, రంజని, రచన, విశాలాంధ్ర, కవిత, కవితా వార్షిక, నీలిమేఘాలు మొ.లైన వెన్నో సంకలనాలు. అజో విభో విశిష్ట సాహితీ మూర్తి, ఆంధ్రప్రదేశ్ 2025 ఉగాది గౌరవ పురస్కారం, చాసో స్ఫూర్తి పురస్కారం, రంగవల్లి, విమలా శాంతి పురస్కారం, సహృదయ సాహితీ, బి.ఎస్ రాములు, హసన్ ఫాతిమా పురస్కారాలు, పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్శిటీ ధర్మనిధి పురస్కారం , రంజని, పులికంటి, ఆర్.ఎస్ కృష్ణమూర్తి అవార్డులు, అప్పాజోస్యుల- విష్ణుభొట్ల పురస్కారం, శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి సాహితీ పురస్కారం, ఆటా, తానా పురస్కారాలు మొ.నవి కథలకు అవార్డులు. శ్రీ శ్రీ, దేవుల పల్లి కృష్ణ శాస్త్రి అవార్డు మొ.నవి కవితలకు అవార్డులు. శాస్త్రీయ సంగీతం, గజల్స్ వినడం, మంచి సాహిత్యం చదవడం అభిరుచులు.
