బుజ్జి

गुड्डी

హిందీ మూలం – డా. రమాకాంత శర్మ

తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు

తలుపు తెరిచి చూస్తే వాళ్ళు ముగ్గురూ ఎదురుగా నిలబడి ఉన్నారు. వాళ్ళ బట్టలు, వాలకం చూడగానే డా. కుంతల్ చెప్పినవారు వీళ్ళే అయివుంటారని నాకర్థమైపోయింది. కాని ప్రశ్నార్థకంగా చూస్తూ నేను అడిగాను- మిమ్మల్ని డా. కుంతల్ పంపించారా? అతను `అవును’ అన్నట్లుగా తల ఊపాడు. అతని భార్య తలమీద ఉన్న కొంగు జారిపోకుండా సర్దుకుంటూ అంది- “అవునమ్మగారూ”.

నాలుగైదేళ్ళ ఆమె పిల్లాడు ఆమె కొంగును గట్టిగా పట్టుకుని ఉన్నాడు. వాడు నన్ను తదేకంగా చూస్తున్నాడు.

“లోపలికి రండి. కూర్చుని మాట్లాడుకుందాం”- అని నేను తలుపు దగ్గరినుంచి తప్పుకున్నాను.

వాళ్ళు ముగ్గురూ లోపలికి వచ్చి కాస్త సంకోచిస్తూ నేలమీద కూర్చున్నారు.

సంభాషణ మొదలుపెడుతూ నేనడిగాను- “నీ పేరేమిటి?”

అతను జవాబిచ్చాడు- “నాపేరు హరికిషనండి. ఈమె రాందేయీ- నా భార్య. వీడు మా కొడుకు జగదీష్.”

“నన్ను రాందేయీ అని ఎవరూ పిలవరు అమ్మగారూ. అందరూ నన్ను బుజ్జి అనే పిలుస్తారు. మీరు కూడా నన్ను బుజ్జి అనే పిలవండి”- ఆమె అతని మాటకి అడ్డంవస్తూ అంది.

నేను ఆమెను పరిశీలించి చూశాను – ఇరవై-ఇరవైఒకటి కన్నా ఎక్కువ ఉండదు ఆమె వయస్సు. సన్నని శరీరం, చామనచాయతో ఆమెలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఉంది. ఆమె కళ్ళలో అమాయకత్వం తొణికిసలాడుతోంది. చవకబారు నూలు చీర ఆమె కొంచెం అస్తవ్యస్తంగా కట్టుకునివుంది. గాఢమైన చామనచాయతో ఉన్న పిల్లవాడు ఇంకా ఆమె కొంగు పట్టుకుని నిశ్శబ్దంగా కూర్చునివున్నాడు. కాని వాడి చూపులు మాత్రం గదిలోని ప్రతివస్తువునీ ఆశ్యర్యంతో పరిశీలిస్తున్నాయి. పైజామా-చొక్కా ధరించి పెద్ద తలపాగా చుట్టుకునివున్న ఆమె భర్త తన భార్య చెప్పిన మాట విని గుబురుమీసాలతో నవ్వు తున్నాడు.

“సరే, నేను నిన్ను బుజ్జి అనే పిలుస్తాను. ఒక విషయం చెప్పు. నువ్వు ఎప్పుడైనా పదిహేను-ఇరవై మందికి అన్నం వండేపని చేశావా? ఇక్కడ మాయింట్లో వచ్చేవారం ఇంచుమించు ఇంతమంది చుట్టాలు వస్తారు. వాళ్ళకోసం కాఫీ-టిఫిన్లతోపాటు రెండుసార్లు భోజనానికి కూడా వంటచెయ్యాలిసొస్తుంది. మరి నువ్వు చెయ్యగలవా?”

“ఎందుకు చెయ్యలేం అమ్మగారూ? పోయిన రెండేళ్ళబట్టీ ఇళ్ళలో వంటలు చేసే పనే చేస్తున్నాం. మీరు ఏదైనా చెప్పి చేయించుకోండి. ఒక్కసారి ఏంకావాలో, ఎలాకావాలో చెప్పండి. ఇంక మీకెటువంటి ఇబ్బంది లేకుండా చేసిపెడతాం.”

“అదంతా చెబుతాంలే. తినేవి, తాగేవి ఎలా ఏ రుచులతో మాకు ఎలా కావాలో చెబుతాంగా. కాని ఒక్క విషయం ఇప్పుడే చెబుతున్నాను. ఇల్లు తుడవడం, తడిగుడ్డపెట్టడం, ఇవన్నీ కూడా మీరే చెయ్యాలి. దానికోసం వచ్చేవారం మంగళవారం నుంచి ఆదివారందాకా మీరు ఇక్కడే ఉండాలి. ఒక గది మీకోసం ఉంచుతాను. తెలిసిందా. ఇంట్లో చేసే వంటలోనే మీరు కూడా తినాలి.”

“ఇది మా మంచికోసమే కదా మీరు చెబుతున్నారమ్మగారూ. మేము ఇక్కడినుంచి పది-పదిహేను కిలోమీటర్ల దూరంలో పాతబస్తీలో ఉంటున్నాము. రోజూ అక్కడికి వెళ్ళడం, రావడం ఎలాచెయ్యడం, ఇంతమందికోసం పని ఎలా చెయ్యడమా అనే ఆలోచిస్తున్నాం.”

“ఈ పనులన్నీ చెయ్యడానికి ఏం తీసుకుంటారు మీరు?”

“మీరెలా అనుకుంటే అలాగే ఇవ్వండి అమ్మగారూ.”

“అలాకాదు. తరువాత నాకేమీ గొడవ పడటం బాగుండదు. మీరేం తీసుకుంటారో ఖచ్చితంగా చెప్పండి.”

“అయితే అమ్మగారూ, ఇంతపని ఉన్నప్పుడు మొత్తం అయిదువేలు ఇప్పించండి. అంతకన్నా తక్కువ అయితే గిట్టదు.”

నేను అనుకుంటున్నదానికన్నా చాలా తక్కువ అడిగారు వాళ్ళు. కేవలం వంట చెయ్యడానికే వంటవాళ్ళు ప్రతిరోజుకి పదిహేను వందలు అడుగుతున్నారు. వీళ్ళు ఆ వృత్తిలో చేసే ఎత్తులకి ఇంకా చాలా దూరంగా ఉన్నారన్నది స్పష్టంగా తెలుస్తోంది. నేను వెంటనే సరే అన్నాను. అయిదువందలు అడ్వాన్సుగా వాళ్ళకి ఇచ్చాను. వచ్చేవారం సోమవారం రాత్రికి వస్తామని మాట ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. పొద్దుటినుంచి సాయంత్రం దాకా ఈ పనులన్నీ చెయ్యడానికి పనివాళ్ళు దొరికినందుకు నేను కూడా నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాను.

సోమవారం సాయంత్రం నుంచే నేను వాళ్ళకోసం ఆదుర్దాగా ఎదురుచూడసాగాను. మంగళవారం ఉదయం నుంచి బంధువులు రావడం మొదలవుతుంది. మా అమ్మాయి ఫ్లైట్ పొద్దున్న అయిదుగంటలకే వచ్చేస్తుంది. నా దగ్గర బుజ్జి ఫోన్ నెంబరు కూడా ఏదీ లేదు. ఒకవేళ వాళ్ళు రాకపోతే ఏమవుతుందన్నది ఆలోచిస్తేనే నాకు కంగారు పుడుతోంది.

కాని, నా చింతలన్నీ పోగొడుతూ, వాళ్ళు సరిగ్గా సమయానికి వచ్చేశారు. బుజ్జి, దాని పిల్లాడితోబాటు వచ్చిన మనిషి హరికిషన్ కాకుండా వేరే ఎవరో రావడంచూసి నాకు ఆశ్చర్యం కలిగింది. మరోసారి నేను దిగులుకి గురి అయ్యాను. ఈ అమ్మాయి ఇతనెవరినో ఎందుకు తీసుకువచ్చిందో తెలియదు. ఈ కొత్త మనిషి బుజ్జి వయస్సువాడిలాగే ఉన్నాడు. లేదా దానికన్నా ఒకటి-రెండేళ్ళు ఎక్కువ ఉండవచ్చు. ఏదో వంకతో ఇంట్లోకి ముక్కూ-ముఖం తెలియనివాళ్ళు రావడం, అదును చూసి అన్నీ పట్టుకుని పారిపోవడం గురించిన చాలా సంఘటనల గురించి నేను విని ఉన్నాను. అదీకాక వీళ్ళు ఒక వారంరోజులపాటు రేయింబవళ్ళు నాయింట్లోనే ఉండాలి. నేను ఎటువంటి మొహమాటం లేకుండా బుజ్జిని అడిగాను- “నీతో వచ్చిన ఇతను ఎవరు? మీ ఆయనలాగా కనిపించడంలేదు.”

“ఇతను మా ఆయన కాదమ్మగారూ. మా పక్కింట్లో ఉండే పీతాంబరం. ఆయన్ని రెండురోజుల కిందటనే కారు గుద్దేసింది. ఇంట్లో మంచంమీద పడిఉన్నాడు. మరిప్పుడయితే అమ్మగారూ, మీదగ్గర కొంతడబ్బు బయానా తీసుకున్నాం కదండి. మరి తప్పకుండా రావాలికదండి. ఆయనే ఇతన్ని నాతో పంపించాడు. ఇతను కూడా వంటపని చేస్తాడు. మీరేమీ చింతపెట్టుకోకండి. చాలా కష్టపడతాడు పీతాంబరం.”

ఆమె చెప్పినంత మాత్రాన నా మనస్సులోని చింత తొలిగిపోలేదు. ఇంకో గదిలోకి వెళ్ళి నేను డా. కుంతల్ కి ఫోన్ చేశాను. ఫోన్ వాళ్ళ పనిమనిషి ఎత్తింది. ఆయన పదిహేనురోజులకి వాళ్ళ కూతురు దగ్గరికి విదేశం వెళ్ళారని చెప్పింది. అక్కడ వాళ్ళ నెంబరు తనదగ్గర లేదని చెప్పింది. తను ఫోన్ పెట్టేసిన తరువాత కూడా నేను కొన్ని క్షణాలు రిసీవర్ చేత్తో పట్టుకుని కూర్చుండిపోయాను. ఏం చెయ్యాలో నాకు తెలియడంలేదు. వాళ్ళని ఇంట్లో ఉండనివ్వడం తప్ప నాకు మరోమార్గం లేదు. వాళ్ళమీద బాగా ఒక కన్ను వేసి ఉంచాలి. అదే ఆలోచించి నాకు నేను సర్దిచెప్పుకుని ఆ గదిలోంచి బయటికి వచ్చాను.

వాళ్ళకి పనులన్నీ విడమర్చి చెప్పాక నేను వాళ్ళకోసం ఒక చిన్నగది చూపించాను. దానికి లోపలే బాత్ రూం ఏర్పాటు ఉంది. రెండు పరుపులు, దుప్పట్లు, తలగడలు తీసి వాళ్ళకి ఇచ్చి అడిగాను- “అన్నం అదీ ఏమన్నా తిన్నారా లేదా? నీ పిల్లాడు ఆకలిగా లేడుకదా.”

“తిని వచ్చాం అమ్మగారూ. జగదీష్ కూడా తిన్నాడు.”

“అయితే సరే. రేపు పొద్దున్నే అయిదు గంటలకి లేవాలి మీరు. ఇంక వెళ్ళి పడుకో.”

నేను ఆ గదికి ఆనుకుని వున్న హాల్లో సోఫా మీదనే పడుకోవాలని నిర్ణయించుకున్నాను. మనస్సులో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంత పెద్ద యింట్లో ఒక్కదాన్నే ఉంటున్నాను. కొత్తవాళ్ళని కనిపెట్టి ఉండడం అవసరం.

అప్పుడే నడుం వాల్చానో లేదో పీతాంబరం తన పరుపు ఎత్తుకుని గదిలోంచి బయటికి వస్తూ కనిపించాడు. నేను లేచి కూర్చుని అడిగాను- “ఇక్కడేం చేస్తున్నావు?”

“ఏంలేదమ్మగారూ. బుజ్జికి నేను తనతో ఒక్క గదిలో పడుకోవడం ఇష్టంలేదు. మీరు సరేనంటే ఇక్కడే ఒకవైపు నేలమీద నా పక్క వేసుకుంటాను.”

నేను సరేననగానే అతను హాల్లో ఖాళీగా ఉన్న చోటు చూసుకుని తన పక్క వేసుకున్నాడు. కొంచెంసేపట్లోనే గురకపెట్టడం మొదలుపెట్టాడు.

నాకు నిద్ర వస్తోంది. బుజ్జి ఏమీ అలాంటి-ఇలాంటి పిల్ల కాదని తెలిసిపోయింది. కాని ఆ చిన్నపిల్లవాడితో తను ఇంట్లోని పని అంతా ఎలా చేస్తుందన్నది తెలుసుకోవడం మిగిలింది. ఆలోచిస్తూ నాకు ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు.

పొద్దున్నే డోర్ బెల్ గట్టిగా మోగుతున్న ధ్వనికి నాకు మెలకువ వచ్చింది. చూస్తే పీతాంబరం, బుజ్జి అప్పటికే లేచి తయారైపోయి వున్నారు. తలుపు బుజ్జే తీసింది. నా కూతురు, అల్లుడు, వాళ్ళ అయిదేళ్ళ చిన్నపిల్ల ఇంట్లోకి వచ్చి ఆప్యాయంగా నన్ను చుట్టుకుపోయారు.

బుజ్జి మొత్తం ఇల్లంతా చీపురుపెట్టి తుడవడం, తడిగుడ్డ పెట్టడం మొదలుపెట్టింది. దాని కొడుకు ఇంకా నిద్ర పోతున్నాడు. పీతాంబరం నన్ను అడిగాడు- “టిఫిన్ ఏం చెయ్యంటారు అమ్మగారూ.” నేను చెప్పిన తరువాత అతను కాఫీలు-టిఫిన్లు చెయ్యడంలో నిమగ్నమయ్యాడు. కొద్దిసేపట్లోనే అతను కాఫీ-టిఫిన్లు, పిల్లకి పాలు టేబిలుమీద అమర్చిపెట్టాడు.

వాళ్ళిద్దరినీ కూడా టిఫిను, కాఫీ తీసుకోమని చెప్పాను. జగదీష్ లేస్తే వాడికి కూడా పాలుపట్టమని చెప్పాను. బుజ్జి అంది- “లేదమ్మగారూ. జగదీష్ కి నేను చాయ్ పెట్టి ఇస్తాను. కొన్నిరోజులు పాలు తాగించి వాడి అలవాటు పాడుచెయ్యకూడదు. ఇక్కడయితే వాడికి పాలు దొరుకుతాయి. కాని ఇంటికి వెళ్ళాక కూడా వాడు రోజూ పాలు అడిగితే ఎక్కడనుంచి తెచ్చి ఇవ్వగలను.” నేనేదయినా చెప్పేలోపలే తను కిచన్ లోకి వెళ్ళిపోయింది.

సాయంత్రానికి ఒక్కొక్కరుగా అతిథులందరూ రావలసివుంది. మధ్యాహ్నానికి ఆరు-ఏడుమందికి మాత్రమే అన్నం చెయ్యాలి. నేను వాళ్ళకి చెయ్యవలసినవన్నీ చెప్పాను. అనుకున్న సమయానికి ముందే పీతాంబరం, బుజ్జి కలిసి మొత్తం వంట అంతా చేసేశారు. భోజనం నేను ఆశించినదానికన్నా బాగానే చేశారు. మా అమ్మాయి, అల్లుడు కూడా అన్నారు- “మమ్మీ, నిజంగా యూ ఆర్ లక్కీ. నీకు ఇటువంటి వాళ్ళు దొరికారు.”

బుజ్జి కొడుకు జగదీష్ అసలు ఏమాత్రం అల్లరి చెయ్యకుండా ఉండటం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. వాళ్ళ అమ్మ పనిచేసుకుంటున్నప్పుడు వాడు ఆమెని అసలు విసిగించడంలేదు. నా మనవరాలు సౌమ్య వాడి వయస్సుదే. తొందరగానే వాళ్ళిద్దరూ స్నేహితులైపోయారు. సౌమ్య టి.వి. కి ఎదురుగావున్న సోఫాలో కూర్చుని కార్టూన్ సినిమా చూస్తోంది. అది జగదీష్ ని కూడా తన దగ్గర కూర్చోమని అంది. వాడు సంకోచిస్తూ ఉంటే సౌమ్య వాడి చెయ్యి పట్టుకుని వాడిని సోఫా మీద కూర్చోబెట్టుకుంది. బుజ్జి ఇది చూడగానే పరిగెత్తుకుంటూ వాడిదగ్గరికి వచ్చి వాడిని ఎత్తుకుని కింద నేలమీద కూర్చోబెట్టింది. ఇదంతా నేను దూరాన్నించి చూస్తునే వున్నాను. ఎందుకో ఇది నాకు బాగుండలేదు. సౌమ్య కూడా కొంచెం ముఖం చిన్నబుచ్చుకుంది. నేను అక్కడి నుంచే గట్టిగా అరుస్తూ అన్నాను-“బుజ్జీ, ఏం చేస్తున్నావు నువ్వు. వాడు చంటిపిల్లాడు. వాడిని అక్కడే సౌమ్య దగ్గర కూర్చుని టీవీ చూడనీ.” బుజ్జి ఆశ్చర్యంగా నావంక చూసింది. జవాబేమీ ఇవ్వకుండా కిచన్ లోకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయాక సౌమ్య జగదీష్ ని మళ్ళీ తనదగ్గర సోఫాలో కూర్చోబెట్టుకుంది. వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ కార్టూన్ సినిమా చూస్తూ ఆనందించడం నేను గమనించాను.

సాయంత్రానికి అతిథులతో ఇల్లు నిండిపోయింది. అతిథులనేదేముంది, అందరూ చుట్టాలే. ఇల్లంతా హడావిడి నెలకొంది. నవ్వులూ, కబుర్లతో సమయం ఎలా గడిచిపోతోందన్నది తెలియడంలేదు. రోజంతా నాకు ఒంటరిగానే ఉండవలసివస్తోంది. నిజం చెప్పాలంటే కాలం గడపటం కష్టంగా ఉండేది. శిరీష్ బాగా జ్ఞాపకం వస్తున్నారు. జీవితం ఆయన్ని ఇంత తొందరగా విడిచిపెట్టేస్తుందని ఎప్పుడూ కలలో కూడా అనుకోలేదు. లాయరుగా ఆయన ప్రాక్టీసు చాలా బాగా నడుస్తోంది. ఆయన నా కోసం ఇంత పెద్ద ఇల్లు, బోలెడంత డబ్బు నా కోసం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కాని, నేను ఒంటరిగా ఇదంతా ఏం చేసుకుంటాను. ఈశా కనుక నా దగ్గర లేకపోతే నేను కుంగిపోయేదాన్ని. తనని పెంచిపోషించడానికి, పెళ్ళి చెయ్యడానికి సమయం అంతా తీరికలేకుండా పనుల్లో గడిచిపోయింది. ఇంట్లోని ఏకాంతం నాకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. అందుకనే వేసవి సెలవుల్లో నా దగ్గరి బంధువులందరినీ నేను ఒక్కసారే పిలిచాను. నేను ఆశించింది ఇదే- అందరూ కలిసి కూర్చుని మాట్లాడుకోవాలని, నవ్వుతూ ఒకరు చెప్పేది మరొకరు వినాలని, కనీసం కొన్ని రోజులకైనా ఇంట్లో ఒక ఉత్సవంలాంటి వాతావరణం ఏర్పడాలని. నేను నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను.

పీతాంబరం, బుజ్జి మొత్తం పని అంతా చాలా బాగా నిర్వహించారు. ఇంతమంది జనం ఉన్నప్పటికీ, ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉంటోంది. రెండు పూటలా కాఫీలు, టిఫిన్లు, భోజనాలు ఎప్పుడూ సమయానికి తయారుగా ఉంటున్నాయి. ఈ పనుల్లో వాళ్ళిద్దరికీ ఏమాత్రం సమయం ఖాళీగా దొరకడంలేదు. వచ్చిన చుట్టాలు చెప్పే మిగిలిన పనులు కూడా వాళ్ళు చెయ్యవలసివస్తోంది. ఈ పనులవత్తిడిలో బుజ్జి తన కొడుక్కి కూడా సమయం ఇవ్వలేకపోతోంది. వాడేమన్నా తిన్నాడాలేదా, తాగాడా లేదా, ఇది చూడటానికికూడా తనదగ్గర సమయం ఉండటంలేదు. అందరూ తిని లేచాకనే వాళ్ళు తినడానికి కూర్చుంటు న్నారు. ఆ పిల్లవాడికి కూడా అప్పుడే తినడానికి దొరుకుతోంది. ఈ కాస్తంత వయస్సులోనే ఈ పిల్లాడు ఎంత తెలివిగా ఉంటున్నాడని, వాళ్ళ అమ్మని పని చేసుకునే సమయంలో ఏమాత్రం విసిగించడని నాకు అనిపిస్తుంది. ఆకలిగా ఉన్నా, ఆ పిల్లాడు ఏమీ మాట్లాడకుండా కూర్చుని ఉంటాడు. తనకి ఇది కావాలని, అది కావాలని మారాం చెయ్యడు. తన తల్లిచేసే పనిలో సాయం చెయ్యడానికి బహుశా ఇదే వాడి పద్ధతి కావచ్చు.

సౌమ్యతో బాటుగానే జగదీష్ కి కూడా టిఫిను, భోజనం పెడుతూ ఉండమని నేను బుజ్జికి చాలాసార్లు చెప్పాను. కాని బహుశా అది ఆమెకి నచ్చినట్లు లేదు. పిల్లవాడు ఇంతంత సేపు ఏమీ తినకుండా, తాగకుండా మౌనంగా ఉండటం నన్ను అశాంతికి గురి చేస్తోంది. అందుకనే నేను స్వయంగానే వాడిని సౌమ్యతో పాటుగానే తినడానికి కూర్చోబెట్టిస్తున్నాను. సౌమ్య ఏదయినా తినడానికి మారాం చేసిన ప్పుడు అది దానికి ఇస్తున్నప్పుడు జగదీష్ కి కూడా ఇవ్వడం నేను మరువడంలేదు. వాడు మొదట్లో పడే మొహమాటం నెమ్మదిగా తగ్గిపోయింది. వాడు నన్ను చూసినప్పుడు నవ్వుతున్నాడు.

పీతాంబరంకి, బుజ్జికి రోజు అనేది ప్రాతఃకాలపు మొదటి కిరణంతోనే మొదలవుతుంది. అది రాత్రి పదకొండు లేదా పన్నెండు గంటలకే ముగుస్తుంది. వాళ్ళు భోజనం కూడా అందరూ తినడం ముగించిన తరువాతే చేస్తున్నారు. అప్పుడప్పుడూ వంట చెయ్యడం అయిపోయినప్పటికీ, భోజనం చెయ్యవలసినవాళ్ళు రావడం లేదు. మేమంతా ఎప్పుడు భోంచేస్తామని, తమ పనులు ఎప్పుడు ముగించుకుందా మని వాళ్ళు ఎదురు చూస్తూ కూర్చుని ఉంటారు. ఆ రోజు చాలామంది తిరగడానికి బజారుకి వెళ్ళారు. భోజనాలు చేసే సమయం దాటిపోయింది. అయినా వాళ్ళు అప్పటికి ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. నేను బుజ్జితో అన్నాను- “ఇలా ఎంతసేపు కూర్చుని ఉంటారు. మీరు అన్నం తినేసెయ్యండి.”

“అలా ఎలా తినేస్తాం అమ్మగారూ, అతిథులకన్నా ముందు మేము ఎలా తింటాం.” బుజ్జి అంది.

నేను మాటిమాటికీ చెప్పినా తను తనచోటి నుంచి కదలకపోయేసరికి నేనే లేచి వాళ్ళకి అన్నం వడ్డించి తీసుకువచ్చాను. వాళ్ళు మొహమాటంతో నిండిపోయివున్నారు. కాని, బహుశా ఇంక వాళ్ళదగ్గర వేరే మార్గం ఏదీ మిగల్లేదు. వాళ్ళు తలవంచుకుని అన్నం తినసాగారు.

మంచి రోజులు కన్నుమూసి తెరిచేసరికి గడిచిపోతాయి. ఆ రోజున అతిథులందరూ వెళ్ళిపోయారు. ఇల్లు మళ్ళీ నన్ను కలవరపరుస్తోంది. పీతాంబరం, బుజ్జిల హడావిడి కూడా తగ్గింది. పీతాంబరం ఇంకెక్కడికో పనిమీద వెళ్ళాలిట. అందువల్ల అతను ఆ రోజు సాయంత్రమే వెళ్ళిపోతాడు. బుజ్జి మర్నాడు ఉదయం తొమ్మిది గంటలలోపల వెడుతుంది. ఆమె భర్తకి తగిలిన దెబ్బ ఇంకా పూర్తిగా నయంకాలేదు. కనుక వాళ్ళకి తెలిసిన ఆటోరిక్షా డ్రైవరు ఒకతను పాతబస్తీ నుంచి వాళ్ళని తీసుకువెళ్ళడానికి వస్తాడు.

పీతాంబరం అంతకు ముందురోజు సాయంత్రమే వెళ్లిపోయాడు. బుజ్జి పనికూడా ముందురోజు రాత్రికే పూర్తి అయిపోయింది. ఆమెతో మాట్లాడుకున్న ప్రకారం ఆరోజు నుంచి ఆమె ఏ పనీ చెయ్యక్కరలేదు. ఇల్లంతా శుభ్రం చేసి ఆమె నాకోసం టిఫిన్-కాఫీలు కూడా చేసి పట్టుకొచ్చి నన్నడిగింది- “అమ్మగారూ, మీకోసం వంట చెయ్యమంటారా?”

నేనన్నాను-“చూడు బుజ్జీ, మనం అనుకున్నదాని ప్రకారం నీ పని నిన్న రాత్రికే పూర్తి అయిపోయింది. నువ్వు ఇవ్వాళకూడా ఇల్లు తుడిచి శుభ్రం చేశావు. నా ఒక్కదానికోసం వంటచెయ్యడానికి ఎంతసేపు పడుతుంది. నేను నాకోసం వంట నేనే చేసుకుంటానులే.”

“ఇవాళ పనికి డబ్బులేమీ అడగను అమ్మగారూ”- ఆమె కళ్ళనీళ్ళ పర్యంతం అయింది.

“ఏమయింది బుజ్జీ? రా, ఇలా వచ్చి నా దగ్గర కూర్చో”.

తను నా దగ్గరికి వచ్చి నేలమీద కూర్చుంది. ఆమె కనురెప్పలమీద కన్నీటి బిందువులు ఉండటం నేను గమనించాను.

అంతగా ఏమయిందో నాకు అర్థం కావడంలేదు. తప్పకుండా నేనో, లేదా వచ్చిన చుట్టాల్లో ఎవరైనానో  తెలియకుండానే  తనకి బాధ కలిగించి ఉండవచ్చు. నేను మళ్ళీ-మళ్ళీ ఆమెని అడిగాను- “ఏమయింది, నాకు చెప్పు మరి. నువ్వు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది.  మాలో ఎవరివల్లనైనా ఏమైనా పొరపాటు జరిగిందా, చెప్పు”.

“లేదమ్మగారూ, అటువంటిదేమీ లేదు”.

“అయితే మరి విషయమేమిటి, నువ్వెందుకు ఏడుస్తున్నావు?”

అప్పటికి తను కొంచెం తమాయించుకుంది. చీరకొంగుతో తను కళ్ళు తుడుచుకుని అంది- “నేను పుట్టిన కొన్ని గంటలకే మా అమ్మ చనిపోయింది. మొదట్లో మా పిన్ని, ఆ తరువాత మా సవతమ్మ నన్ను పెంచారు. మాటిమాటికీ తిట్లు, చివాట్లు దెబ్బలు తింటూ చిన్నతనం గడిచిపోయింది. నా స్నేహితురాళ్ళందరికీ అమ్మలు ఉన్నారు, మరి నాకెందుకు లేరని నేను అనుకునేదాన్ని. కాని నాకు అమ్మ అంటూ ఉంటే నేనుకూడా మా అమ్మని ప్రేమించేదాన్ని. దెబ్బలాడుతూ ఉండేదాన్ని. కడుపునిండా అన్నం తింటూ ఉండేదాన్ని. ఇంటి పనులన్నీ బహుశా నేను చెయ్యవలసివచ్చేది కాదు. కాని నేను ఆలోచన ల్లోనే మునిగి వుండేదాన్ని.

పదకొండేళ్ళ వయస్సులో నాకు పెళ్ళి అయింది. మా ఆయన నాకన్నా ఎనిమిదేళ్ళు పెద్ద. ఆయనకి కూడా ఎవరూ లేరు. రోడ్డులు వేసే కాంట్రాక్టరు దగ్గర కూలిపని చేసుకుని తెచ్చినదాంట్లోనే మేము ఇల్లు గడుపుకునేవాళ్ళం. తర్వాత నేను కూడా ఆయనతో కూలిపని చేయడానికి వెళ్ళడం మొదలుపెట్టాను. పదిహేనేళ్ళ వయస్సులో నాకు జగదీష్ పుట్టాడు. కొన్ని నెలలు నేను పనికి వెళ్ళలేకపోయాను. వెళ్ళడానికి వీలుకాగానే నేను జగదీష్ ని నాతో తీసుకువెళ్ళేదాన్ని. వాడిని అక్కడే ఏదైనా చెట్టుకింద గుడ్డ పరిచి పడుకోబెట్టేదాన్ని. రోజంతా కంకరరాళ్ల తట్టలు మోసేదాన్ని. ఒకరోజున కళ్ళుతిరిగి పడిపోతే కాంట్రాక్టరు బాగా తిట్టిపోశాడు. “రోజూ నీ పిల్లోడిని తీసుకొస్తావు. పనిమీదకన్నా నీకు వాడిని సముదాయించడంలోనే ఎక్కువ టైమ్ పడుతోంది. ఇప్పుడింక కళ్ళుతిరిగి పడిపోవడమనే నాటకం కూడా మొదలుపెట్టావు. చూడు హరికిషన్, నువ్వు ఇన్ని సంవత్సరాలనుంచి మాతో పని చేస్తున్నావనే నేను నిన్నేమీ అనడంలేదు. రేపటినుంచి నువ్వు మీ ఆవిడని పనిలోకి తీసుకురాకు.”

ఆ మర్నాటినుంచి నాతోపాటు మా ఆయనకూడా పనిలోకి వెళ్ళలేదు. ఇంతో-అంతో మిగిలిన డబ్బులు రెండు-మూడు రోజులకే అయిపోయాయి. అక్కడ ఏమీ పని దొరక్కపోయేసరికి మేము మా మూట పట్టుకుని బస్సులో కూర్చుని ఇక్కడికి టౌన్ కి వచ్చేశాం.

ఆకలి కడుపుతోనే ఆయన పని వెతుక్కుంటూ ఉండేవాడు. నేను జగదీష్ తో పాతబస్తీలోని ఆ సత్రంలో ఆకలికడుపుతోనే ఆయనకోసం ఎదురుచూస్తూ ఉండేవాళ్ళం. సత్రం మానేజరు చాలాసార్లు నా చుట్టూ తిరుగుతూవుండేవాడు. నాకు ఎరకూడా చూపించాడు. తను అనుకున్నట్లుగా కాకపోయేసరికి వాడుకూడా తిట్లు లంకించుకున్నాడు. ఆ మర్నాటినుంచి మేము అక్కడినుంచి వెళ్ళిపోవాలని ఖరాఖండిగా చెప్పాడు.

ఆ రోజునే ఒక దుకాణంలో టీ తాగుతున్నప్పుడు ఆయనకి పీతాంబరం కనిపించాడు. అంతకుముందు మాలో మాకు ఎరిక లేదు. అతనికి మా పరిస్థితి తెలిసిన తర్వాత మా ఆయన్ని తను పనిచేస్తున్న ఢాబా (ఒకవిధమైన హోటలు) కి తీసుకువెళ్ళాడు. వాళ్ళకి తుడిచి  శుభ్రంచేసే పనికి ఒక మనిషి అవసరం ఉంది. అందువల్ల వెంటనే ఆయనకి పని దొరికింది. పీతాంబరమే మాకు తనకి దగ్గరలోనే ఉన్న ఒక పూరింట్లో మేం ఉండటానికి ఏర్పాటు కూడా చేశాడు. అతను మాకు ఎంతగానో ఉపకారం చేశాఢు. బహుశా ఈ జన్మలో అతని రుణం మేం తీర్చుకోలేం.

అవసరమైనప్పుడల్లా ఢాబా యజమాని ఈయనతో వేరే పనులు కూడా చేయించుకోవడం మొదలుపెట్టాడు. వంటచెయ్యడంలో కూడా ఈయన సాయపడేవాడు. అక్కడే ఈయన వంటచెయ్యడం నేర్చుకున్నాడు. తను నేర్చుకుని వచ్చిందల్లా నాకు కూడా నేర్పేవాడు. ఆ తర్వాత నేను ఆ చుట్టుపక్కల వున్న ఇళ్ళలో శుభ్రం చేసే పనితో బాటు వంటచేసే పని కూడా మొదలుపెట్టాను. జగదీష్ ని ఎక్కడా విడిచిపెట్టడానికి వీలు లేదు కనుక వాడెప్పుడూ నాకూడానే ఉండేవాడు. చిన్నపిల్లాడు కావడంవల్ల ఇళ్ళలో ఇటూ-అటూ తిరిగితే, ఏ వస్తువుమీద అయినా కాస్త చెయ్యివేస్తే ఆ యింటి యజమానులు వాడిని తీవ్రంగా మందలించేవారు. నేను కూడా కారణం ఉన్నా లేకపోయినా వాళ్ళుపెట్టే చివాట్లు వినవలసివచ్చేది. మేము మనుషులం కాదు, జంతువులకన్నా నికృష్టమైనవాళ్ళమని అనిపించేది. ఎందుకంటే వాళ్ళ ఇళ్ళలోని పెంపుడు కుక్కలు కూడా ఇంట్లో ఎక్కడికయినా వెళ్ళగలవు, ఎక్కడయినా కూర్చోగలవు. అవి ఏమయినా తప్పుచేసినా వాటిని చీదరించుకోకుండా ప్రేమగా ముద్దుచేస్తారు. కుక్కపిల్లలతో ఆడుకునే ఇంటియజమానుల పిల్లలని జగదీష్ దగ్గరికి కూడా రానివ్వకుండా ఉన్నప్పుడు నేను కోపంతో దహించుకుపోయేదాన్ని.

జగదీష్ కూడా నెమ్మదిగా అంతా అర్థం చేసుకోసాగాడు. నేను పనిలో మునిగిపోయిఉన్నప్పుడు వాడు నేనెక్కడ కూర్చోబెడితే అక్కడే మాట్లాడకుండా కూర్చుని ఉండసాగాడు. ఒకరోజున నేను పనిలో ఉన్నప్పుడు పక్కనే ఉన్నగదిలో ఇంటివారి పిల్లలు టీవీ చూస్తున్నారు. జగదీష్ కూడా టీవీ చూడటానికి అక్కడికి వెళ్ళాడు. అక్కడ పెట్టివున్న ఒక కుర్చీలో కూర్చున్నాడు. అప్పుడే ఇంటావిడ అక్కడికి వచ్చింది. ఆవిడ జగదీష్ ని తిడుతూ వాడిని కుర్చీలోంచి కిందకి లాగింది. ఆవిడ అక్కడనుంచే అరిచింది- “బుజ్జీ, నీ కొడుకుని ఇంట్లోనైనా వదిలేసి రా, లేకపోతే వీడిని జాగ్రత్తగా పెట్టుకో. వీడి ధైర్యం చూడు. కలెక్టరులాగా కుర్చీలో కూర్చుని టివి చూస్తున్నాడు.” నేనేం చెప్పగలను, ఇంచుమించు ఏడుస్తూ జగదీష్ ని గట్టిగా ఒక లెంపకాయ కొట్టాను. వాడిని మళ్ళీ అదే మూల కూలవేసి వచ్చాను.

తరువాత మేము ఇద్దరం కలిసి ఒకచోటనే పని చెయ్యగలిగే పనులు తీసుకోవడం మొదలుపెట్టాం. మేము ఇళ్ళలో చిన్న-పెద్ద పార్టీలలో వంట, ఇతరపనులు చెయ్యడానికి వెళ్ళసాగాం. పనికి పిలిచిన వాళ్ళు డబ్బులు ఇస్తున్నప్పుడు మేం యంత్రాల్లాగా పని చెయ్యాలని ఆశించేవాళ్ళు. మేము యంత్రాల్లాగానే పని చేస్తూ వచ్చాం అమ్మగారూ. బహుశా మాలాంటి దురదృష్టవంతులని భగవంతుడు అలిసిపోయేలా పని చేస్తూకూడా తిట్లు-చివాట్లు తింటూవుండటానికే జన్మనిచ్చాడు. మేము ఎవరిని తప్పుపట్టగలం. రెండుపూటలా కడుపు నింపుకునేందుకు వేరేవాళ్ళ ఇళ్ళలో వంటలు చెయ్యడమే మా నుదుట రాసివుంది.

అమ్మగారూ, నిజం చెప్పాలంటే మేము కూడా మనుషులమేనని మీయింట్లో మొదటిసారిగా అనిపించింది. జగదీష్ వేళకి తింటున్నాడా లేదా అని చింతిస్తున్న మిమ్మల్ని చూస్తే నాకు నమ్మకం కలగలేదు. వాడు మీ మనవరాలితో ఆడుకున్నాడు, ఆ అమ్మాయితో సోఫాలో కూర్చుని టివి చూశాడు. సౌమ్యమ్మ ఏం తింటే అదే తిన్నాడు. నా కళ్ళతో నేను నమ్మలేకపోయాను. మేము ఎలా ఉన్నామని, మా తిండి గురించి, నిద్ర పోవడం గురించి, కాస్త నెమ్మదించి అలసట తీర్చుకోవడం గురించి మీరు, మీ చుట్టాలు అడుగుతున్నప్పుడు నాకు చాలా విచిత్రంగా అనిపించింది. ఇటువంటి ఆదరణ మేం ఎప్పుడూ చూడలేదు. మీ అంతట మీరు మా కోసం కంచంలో అన్నంపెట్టి తీసుకువచ్చినప్పుడు నిజంగా నాకు నా గుండెలో ఏదో చెప్పలేని బాధ వెల్లువలా పొంగింది. లేచివచ్చి మీ పాదాలనితాకి దణ్ణం పెట్టు కుందామని అనిపించింది. చెబుతూనే బుజ్జి మౌనం వహించింది. బహుశా తను అంతకన్నా ఇంకేమీ చెప్పలేకపోతోంది.

నేనేమీ మాట్లాడకుండా కేవలం తను చెప్పేది వింటూ అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. మేము సహజంగానే  వ్యవహరించే తీరులో తనని అంతగా కదిలించే అంశం ఏముందో నాకు తెలియడంలేదు. బుజ్జి చాలా మంచిపిల్ల. తను, పీతాంబరం, ఉన్న పనులన్నీ ఎలా నిర్వహించారన్నది చూసి నాకు ఎంతగానో సంతోషం కలిగింది.

బుజ్జి నాకు వంట చేసేసింది. తన సామాను సర్దుకునేందుకు గదిలోకి వెళ్ళిపోయింది. కొద్దిసేపట్లో బయట ఆటోరిక్షా ఆగిన చప్పుడు వినిపించగానే బుజ్జి వెంటనే తలుపు తెరిచి అంది- “వస్తున్నానయ్యా, ఇప్పుడే వచ్చేస్తున్నాను.” సామాను తెచ్చుకునేందుకు తను లోపలికి వెళ్ళింది.

వెళ్ళేటప్పుడు నేను ముందు ఇచ్చిన అయిదువందల రూపాయలు తగ్గించి మిగిలిన నాలుగువేల అయిదు వందలు తనకి ఇచ్చాను. తను ఆ డబ్బు కళ్ళకద్దుకుని తన చీరకొంగులో ముడివేసుకుంది. జగదీష్ వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే తనని అంటిపెట్టుకుని నిలబడి వున్నాడు. తను సామాను అందుకోగానే నేను తనని ఆపుజేశాను- “ఇదిగో, ఈ అయిదువందలు నేనిస్తున్నాను ఉంచుకో. ఈ చీరకూడా తీసుకో, ఇది నీకోసమే.”

ఆమె నా చేతిని పట్టుకుని అంది- “నేను నా డబ్బులతోపాటు మీ ప్రేమ, మర్యాద, ఆత్మీయత… ఇవన్నీ తీసుకున్నాను అమ్మగారూ. ఇప్పుడింక నేను మీదగ్గర ఇంకేమీ తీసుకోను. మళ్ళీసారి మీరు మీ చుట్టాలని పిలిచినప్పుడు నన్ను పిలవడం మరిచిపోకండి అమ్మగారూ.”

“ఒరేయ్ జగదీష్ బాబూ, అమ్మగారి కాళ్ళకి దణ్ణం పెట్టరా.” ఆమె తనుకూడా నా కాళ్ళకి అభివందనం చెయ్యడానికి వంగింది. నేను ఇద్దరి తలలమీద ఆశీస్సులు తెలుపుతూ నా చెయ్యి ఉంచాను. ఆమె తిరిగి నన్ను చూడకుండా బయటికి వెళ్ళిపోయింది. తన కళ్ళలో నీళ్ళు నిండివుంటాయని నాకు తెలుసు. అవును. నిజంగా నా కళ్ళు కూడా చెమర్చాయి.

***

డా. రమాకాంత శర్మ – పరిచయం

1950 లో భరత్ పుర్, రాజస్థాన్ లో జన్మించిన డా. రమాకాంత శర్మ 100కి పైగా కథలు వ్రాశారు. పది కథాసంకలనాలు, రెండు వ్యంగ్యసంకలనాలు, ఎనిమిది నవలలు, ప్రచురితమయ్యాయి. కొన్ని కథలకు ప్రతిష్ఠాత్మకమైన యు.కె. కథాకాసా, కమలేశ్వర్ స్మృతి పురస్కారంతోబాటు మహారాష్ట్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ, కియాన్ ఫౌండేషన్ ల ద్వారా సన్మానం పొందారు. కొన్ని కథలు ఇతర భాషలలోకి అనువదించ బడ్డాయి. బ్యాంకింగ్, మానేజిమెంట్ మొ. విషయాలపైన వ్రాసిన పుస్తకాలకు రాష్ట్రపతి మరియు కేంద్ర ప్రభుత్వం ద్వారా అవార్డులు పొందారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జనరల్ మానేజరుగా రిటైరయ్యాక ముంబయిలో ఉంటున్నారు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.