వ్యాధితో పోరాటం-37

కనకదుర్గ

నాకు మాత్రం అమ్మ వస్తుందంటే చాలా సంతోషంగా ఉంది. అమ్మ నాకు బాగాలేదు, తనకు వీలయినంత సాయం చేయడానికి ఇక్కడికి వస్తున్నది అంతే. కానీ ఇండియాలో మాత్రం, ’అమ్మ తంతే బూరెల గంపలో పడింది, అమెరికా వెళ్తుందంటే మాటలా? ఇలాంటి చాన్స్ ఎవరికి ఇంత త్వరగా వస్తుంది?’ అని అనుకున్నారు. అక్కా, అన్నా రావడానికి కాదన్నా అమ్మ వస్తుందంటే ఎంత ఆనందంగా ఉందో! చైతూ పదేళ్ళ వాడయినా వాడికీ అర్ఢం అయ్యింది, ’అమ్మ, అమ్మమ్మ మనకోసం అంత దూరం నుంచి వస్తుంది కదమ్మా!’ అని అన్నాడు. ’అవున్రా కన్నా! ఇదే మొదటి సారి ఇంటర్నేష్నల్ ప్లయిట్ ఎక్కడం. వీసా కోసం మద్రాస్ వెళ్ళినపుడు అమ్మమ్మని ప్లయిట్లో తీసుకెళ్ళమన్నాం భానుమామను, అలవాటవ్వడానికి. కానీ డొమెస్టిక్ ప్లయిట్ కన్నా ఇంటర్నేష్నల్ ప్లయిట్స్ చాలా పెద్దగా వుంటాయి కదా! ఇంకా ఇక్కడ టాయిలెట్స్ కి అలవాటు పడాలి కూడా. చూద్దాం ఎలా వస్తుందో!’ అన్నాను.

ఇక్కడ ఫ్రెండ్స్ కి అమ్మ వస్తుంది ఇండియా నుండి అని చెప్పినపుడు చాలా ఆశ్చర్యపోయారు. అప్పుడు ఎక్కువగా అమెరికన్ ఫ్రెండ్సే మాకెక్కువగా సాయం చేస్తున్నారు. ఇక్కడ డెలివరీలు ఎవరికి వారే చేసుకుంటారు. భార్యా, భర్తలే బేబి పుట్టకముందే అన్నీ రెడీ చేసుకోవడం, పుట్టింతర్వాత కూడా భర్తకు రెండు వారాల సెలవిస్తారు, తల్లికి కొన్నినెలలిస్తారు. భర్త, తల్లితండ్రులు, భార్య తల్లితండ్రులు కానీ వీలయితే వచ్చి మనవడు/మనవరాలిని చూసి మురిసిపోయి చిన్నపిల్లలకు చేసే పనులన్నీ సంతోషంగా కొన్నాళ్ళు వుండి వెళ్తారు.

అంతే కానీ అమ్మాయి తల్లిగారు వాళ్ళే కాన్పు చేయాలి, తల్లిని, పిల్లను కొన్ని నెలలుంచుకుని కట్నాలు, కానుకలిచ్చి పంపించాలనుకోరు ఇక్కడి వాళ్ళు. మేము ఇక్కడ అమెరికన్ ఫ్రెండ్స్ ని చూసి మేమిద్దరం చేసుకోవచ్చులే అని అనుకున్నాం. కానీ నా పాన్క్రియాటైటిస్ వల్ల అంతా తల్లక్రిందులయిపోయింది మా పరిస్థితి.

సర్జరీ అయిన జూలియా రోజు వచ్చి వెళ్ళేది, జోన్ పాపని చూసుకోవడానికి వచ్చేది. ముగ్గురం కబుర్లు చెప్పుకునేవారం. రెండువారాల తర్వాత సర్జన్ దగ్గరికి చూపించుకోవడానికి వెళ్ళాము, నేను, జోన్. హాస్పిటల్ దగ్గర దిగి లోపలికి వెళ్తుంటే ఇన్ పేషంట్ రూమ్స్ దూరం నుండి కనిపించాయి. నా కళ్ళ ముందర, నా రూమ్ ప్రక్కన ఉన్న క్యాన్సర్ పేషంట్

’ప్లీజ్ హెల్ప్ మీ సంబడీ, ఎనీబడీ…హెల్ప్ విత్ దిస్ పేయిన్, ఓ గాడ్ టేక్ మీ అవే….,’ ’అమ్మా నొప్పే, భయంకరమైన నొప్పి… శ్రీని నాకేమన్నా అయితే నువ్వు ఇక్కడ ఉండకు, ఇండియాకి వెళ్ళిపో. అక్కడ మా అమ్మ, నాన్న కానీ మీ నాన్నకానీ సాయం చేస్తారు…ప్లీజ్ హెల్ప్ మీ…,’ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్దామనుకుంటుండగా మళ్ళీ అటాక్ వచ్చి హాస్పిటల్ లోనే ఉండిపోయి సర్జరీ జరగడం, అన్నీ కళ్ళముందు తిరిగాయి. జోన్ నాచెయ్యి పట్టుకునే తీస్కెళుతుంది, నాకు వొళ్ళు తూలినట్టయ్యింది. “దుర్గా, ఆర్ యూ ఓకే? వాట్ హాపెండ్?” అని అడిగింది జోన్ పడిపోకుండా పట్టుకుంటూ.

“నో జోన్, లెట్స్ గో హోమ్. ఐ కాన్ట్ స్టే హియర్ వన్ మోర్ మినిట్.” అని ఏడవసాగాను.

” వాట్స్ హాపెనింగ్? వై కాన్ట్ యూ సీ ది డాక్టర్?”

” ఇట్ ఈజ్ సో సాడ్ థింకింగ్ అబౌట్ ఆల్ దీజ్ పీపుల్ హు ఆర్ సఫరింగ్…ఐ డోంట్ వాంట్ టు రిమెంబర్ ఎనీథింగ్.. ప్లీజ్ జోన్, లెట్స్ గో హోమ్.” అని వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నాను.

జోన్ నన్ను గట్టిగా పట్టుకుని, ” దుర్గా! యు హావ్ టు కామ్ డౌన్. జీవితమంటే ఏమనుకుంటున్నావు? అంతా సుఖమే ఉండదు. ఇలాంటి ఒడిదుడుకులుంటాయి మనకి ఇష్టమున్నా, లేకున్నా, సరేనా! నీ కుటుంబం కోసం, పిల్లలకోసం సర్జరీ చేయించుకున్నావా, లేదా? నేనింతకంటే ఎక్కువ కష్టాలే చూసాను. మా స్టెప్ డాడ్ కి క్యాన్సర్ వచ్చి, బాధ భరించలేక అప్పట్లో ఆయన డెమొరాల్ ఇంజెక్షన్స్ కి అలవాటు పడిపోయి ఎన్నో రోజులు ఇలాగే హాస్పిటల్ లో ఉంటే వచ్చి చూసేదాన్ని. మా కన్నతండ్రి కూడా మాకు అంత ప్రేమను పంచలేదు, కానీ మా స్టెప్ డాడ్ (తల్లి రెండో భర్త) మమ్మల్ని చాలా ఆప్యాయంగా చూసుకున్నారు, ఆత్మీయతను పంచారు. నేను ఆయన్ని చూడడానికి వచ్చినప్పుడల్లా ఏడ్చేదాన్నిఆయన బాధ చూడలేక. నేను టీనేజర్ని అపుడు.” అని నిదానంగా చెప్పింది.

“ఇటు చూడు నువ్విట్లా డీలా పడిపోతే ఎట్లా? అపాయింట్మెంట్ టైమ్ అవుతుంది. మనం వచ్చిన పని చేసుకుని వెళ్ళిపోదాం, సరేనా? ఇంక వేరే విషయాల గురించి అస్సలు ఆలోచించొద్దు, కమాన్ లెట్స్ గో డియర్.” అని ముందుకు నడిపించడానికి ప్రయత్నించింది.

“జోన్ లుక్ ఎట్ దిస్ హాస్పిటల్. ఇట్స్ సో బిగ్ అండ్ సో మెనీ పేషంట్స్ ఆర్ దేర్ సఫరింగ్…, ప్రపంచంలో ఇంకా ఇట్లాంటి హాస్పిటల్స్ ఎన్నో? ఎన్నో భయంకరమైన జబ్బులతో కష్టపడుతూ బ్రతుకు తున్నారో ఆలోచించు…..” అన్నాను ముందుకి అడుగు వేయకుండా.

ఒకరకమైన ప్రలాపం (డిలీరియమ్)కి లోనయ్యానని అర్ధమయ్యింది జోన్ కి. తను ఏం చెప్పినా వినే స్థితిలో లేనని. మెల్లిగా నడిపించుకుంటూ సర్జన్ ఆఫీస్ కి తీసుకెళ్ళింది. అక్కడ వేరే పేషంట్లు సర్జన్ కోసం ఎదురు చూస్తున్నారు. జోన్ అక్కడ వున్న పెద్ద నీటి క్యాన్ లో నుంచి ఒక్క పేపర్ కప్ లో నీళ్ళు తెచ్చి తాగించింది. నేను తల వెనక్కి ఆనించి కళ్ళు మూసుకున్నాను. జోన్ తన చెయ్యి నా చెయ్యి మీద వేసి నా పక్కనే కూర్చుంది. ఎమర్జన్సీ సర్జరీ వచ్చి డా. బార్బరా వెళ్ళి ఇప్పుడే వచ్చారట. అందుకే కొంచెం లేటవుతుందని, ఆలస్యానికి క్షమించమని డాక్టర్ బార్బరా వచ్చి పేషంట్స్ కి చెప్పి ఆమె పేషంట్స్ ని చూడడం ప్రారంభించింది.

నలుగురైదుగురు పేషంట్స్ అయ్యాక మాకు పిలుపొచ్చింది.

మేము లోపలికి వెళ్ళాం. “హౌ ఆర్యూ మిస్ డింగారి? హౌ ఈజ్ యువర్ పేయిన్. ఆర్యూ ఏబుల్ టు ఈట్? తిన్నపుడు నొప్పిగానీ వస్తుందా? ఓహ్! టి.పి.ఎన్ పీడింగ్స్ ఇంకా వుందా?”

ఇది తీసేసి తిని చూస్తే బావుంటుంది, మామూలు ఆహారంతో బరువు పెరుగుతుందా, లేదా అనేది తెలుస్తుంది. కానీ ఇపుడే కాదు వచ్చే నెల ప్రయత్నం చేద్దాం. ఇపుడు తను ఇంకా చాలా వీక్ గా వుంది. కొంచెం తినడం మొదలు పెడితే అపుడు ప్రయత్నం చేయొచ్చు.” అని చెప్పి కుట్లు మానాయా, లేదా అని చూసి, కడుపు నొక్కి చూసింది. వెనక వీపు పై వత్తి చూసింది.

“అంతా బాగానే వుంది. ఇట్ టేక్స్ టైమ్ టూ కంప్లీట్లీ హీల్. డూ యూ హావ్ ఎనీ క్వశ్చన్స్?” అని అడిగింది.

నాకు కొద్ది సేపు కునుకు తీసి లేచేవరకు మామూలయ్యాను.

“నాకు నిద్ర సరిగ్గా పట్టడం లేదు. నాకు ఎక్కువ తినటానికి రావటం లేదు. మీరు సర్జరీ చేసేసారు కదా! ఇంక అంతా బాగయినట్టే కదా! అటాక్స్ వచ్చే చాన్స్ లేనే లేదు కదా!” అని గబగబా అడిగాను.

ఆమె కాసేపు ఆలోచించింది. “నీకు నిద్ర పట్టాలంటే వాక్స్ కి వెళ్ళాలి, కొంచెం స్ట్రెంత్ వచ్చాక ఇంట్లో పనులు చేసుకుంటుంటే బాడీ అల్సిపోయి రాత్రికి నిద్ర పడ్తుంది. మెల్లి మెల్లిగా తినడం పెంచాలి, అలా అయితేనే మనకు ఈ సర్జరీ రిజల్ట్ తెలుస్తుంది….”

“అంటే మళ్ళీ వచ్చే అవకాశం ఉందా?”

“అది కాదు…నువ్వు ఏది తినాలన్నా భయపడకుండా తిను. కానీ కొన్నాళ్ళు ఫాట్ వున్న ఆహారం తినకు. మళ్ళీ ఒక నెల తర్వాత వస్తే చూస్తాను. ఆల్ ది బెస్ట్.” అని షేక్ హ్యాండిచ్చింది.

నాకు ఇంకేం చేయాలో అర్ధం కాలేదు. సరే అని చెప్పి బయటకు వచ్చాం.

ఈ సారి కూడా పాన్క్రియాటైటిస్ పూర్తిగా తగ్గినట్టేనా, లేదా అనేదానికి సమాధానం చెప్పలేదు. ఎందుకీమె ఇలా తప్పించుకుంటుంది? అంటే లోపల ఇంకా ఏదైనా మిగిలిపోయి వుందా? ఇదెక్కడి జబ్బురా నాయనా, ఇది నన్ను ఇక వదిలిపెట్టదా? నాకు ఇక అందరిలా నార్మల్ గా బ్రతికే అవకాశం వుంటుందా? లేదా? అని ఆలోచిస్తూ ఇల్లు చేరాము.

జూలియా ఒకరోజు వచ్చినపుడు ఇండియన్ ఆహారం గురించి మాట్లాడుతుంటే తనకి ఇండియన్ ఫుడ్ అంటే చాలా ఇష్టమని అన్నది.

అంతే నేను ముందు వెనకా ఆలోచించకుండా, ” నేను ఎగ్స్ తో పులుసు బాగా చేస్తాను. డూ యూ వాంట్ టు ట్రై?” అన్నాను. జోన్ పాపని ఆడిస్తూ కూర్చున్నది, “వ్వాట్?’ అని అరిచింది.

నేను ఏదో గొప్ప పని చేస్తున్నదానిలా, ” ఐ యామ్ మేకింగ్ ఎగ్ కర్రీ జోన్. డూ యూ వాంట్ సమ్?” అని అడిగా.

“నో, ఐ డోంట్ వాంట్ ఇట్! యూ ఆర్ నాట్ రెడీ టు స్టాండ్ దట్ లాంగ్ ఇన్ ద కిచెన్, వుమన్!” అన్నది కొంచెం కోపంగా .

“ఇట్స్ ఓకే, తనకి చేయాలని వుంటే చేయొచ్చు. ఇట్ విల్ బి ఏ చేంజ్ ఫర్ హర్ టూ,” అంది జూలియా.

“మీరిద్దరూ ఎంత సాయం చేసారు మాకు, దిస్ ఈజ్ జస్ట్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ థ్యాంక్ యూ ఫ్రం మీ….”

“శ్రీనివాస్ విల్ నాట్ బి వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ దుర్గా!”

“వాళ్ళకి కూడా నేను ఏదైనా చేసి పెట్టినట్టవుతుంది.” అని లేచి కిచెన్లోకి వెళ్ళాను ఎగ్ పులుసుకి కావాల్సినవన్నీ వున్నాయా, లేదా చూడడానికి.

ఓపిక లేకున్నా ఇపుడు ఈ పని చేయడం అవసరమా అని జోన్ వాదన. కానీ తనకి  చేయాలని ఉంటే చేస్తే తప్పేముంది అని జూలియా వాదన.

నేను మొదలు పెట్టినపుడు ఎంతో ఉషారుగా మొదలుపెట్టాను. కానీ సగంలోనే నాకు ఎందుకు చేస్తానన్నానురా బాబు. జోన్ చెప్పినా వినలేదు అనిపించింది.

జూలియాకి మాత్రం తనకోసం నేను లేచి తనకిష్టమైన వంట చేసానని చాలా సంతోషించింది. నా కోసం మూడు రోజులు సర్జరీ తర్వాత నా దగ్గర ఉంది, అంతకు ముందు ఒక ప్రొసీజర్ అపుడు ఒక రోజు మొత్తం హాస్పిటల్లో ఉంది, నేను చేసిన ఈ చిన్న పనిని తను  చేసిన సాయంతో పోల్చగలమా! ఇలాంటి వారికి ఎంత చేసినా తక్కువే.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.