జీవ పరిణామం

-కందేపి రాణి ప్రసాద్

సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. తీరంలోని ఇసుక తెల్లగా ఉండి సూర్యకిరణాలకు మెరుస్తూ ఉన్నది. అలల్లో నుంచి ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్స్ విరిగిన ముక్కలు తెగిన వలల తాళ్ళు ఒడ్డుకు కొట్టుకుని వస్తూ ఉన్నాయి. సముద్రంలోకి వెళ్ళాక వస్తువులన్నీ ఒడ్డుకే వచ్చేస్తున్నాయి. సముద్ర తీరంలో పెంగ్విన్లు చాలా ఉన్నాయి. అది నలుపు, తెలుపు రంగుల్లో బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లా కనిపిస్తున్నాయి. తమ రెండు కాళ్ళతో నిలబడి నడుస్తుంటే చూడటానికి గమ్మత్తుగా ఉంటుంది.

పెంగ్విన్లు అన్ని కుటుంబాలూ కలిసి ఒక కాలనీగా ఏర్పడి చక్కగా కలసి మెలసి ఉంటున్నాయి. రెండు పిల్ల పెంగ్విన్లు తమ తల్లితో కలసి ఉంటున్నాయి. ఇవి గులకరాళ్ళతో గూడు కట్టుకుని జీవిస్తున్నాయి. సముద్రపు నీళ్ళలో తడుస్తూ మళ్ళీ ఇసుకలోకి వచ్చి ఆడుకుంటూ సరదాగా తిరుగుతున్నాయి.

తల్లి పెంగ్విన్ పిల్లల ఆటల్ని చూసి సంతోష పడుతూనే “ఇక చాల్లే ఆటలు ఇలా నా దగ్గరకు వచ్చేయండి” అని పిలిచింది. “ఇంకా కొద్దిసేపు ఆడుకుంటామమ్మా” అంటూ తల్లితో గారంగా అడిగాయి పిల్ల పెంగ్విన్లు. “సరేనమ్మా ఇంకా కొద్దిసేపు మాత్రమే ఆడుకోవాలి. తర్వాత ఇంట్లోకి వచ్చేయాలి అన్నం పెట్టేస్తాను సరేనా” అని ముద్దుగా పిల్లలతో చెప్పింది తల్లి. సరే అంటూ ఆటలు ఆడటం మొదలు పెట్టాయి.

ఆకాశంలో పావురాలు కొంగలు, కాకులు ఎగురుతూ వరసగా పోతున్నాయి. కింది నుంచి చూస్తున్నప్పుడు ఆకాశంలో ఒక గీత గీసినట్లుగా చక్కగా క్రమశిక్షణ పాటిస్తూ వెళుతున్నాయి. వాటిని చూసి పిల్ల పెంగ్విన్లు సంబరపడి చప్పట్లు కొట్టాయి. మళ్ళీ వెంటనే అమ్మ దగ్గరకు వెళ్ళి “అమ్మా మనం కూడా ఆకాశంలో ఎగిరి పోదామా! చాలా సరదాగా ఉంటుందమ్మా” అని పిల్ల పెంగ్విన్లు అమ్మను పట్టుకుని అడిగాయి.

“ఉండండి ఉండండి పిల్లల్లారా! మనం పావురాల్లా, కొంగల్లాగా ఆకాశంలో ఎగరలేము కదమ్మా, మనం భూమి మీద మాత్రమే నడవగలుగుతాం.” అని తల్లి పెంగ్విన్ పిల్లల ఒంటి మీదున్న ఇసుకను తుడుస్తూ చెప్పింది. “అదేమిటమ్మా! మనం కూడా పక్షులమే కదా! మనం కూడా ఆకాశంలో స్వేచ్ఛగా ఎగురుతుంటే బాగుంటుందమ్మా” అని కాళ్ళు నేలకు కొడుతూ అడుగుతున్నాయి.

“మనం పక్షులమే కానీ ఎగరలేని పక్షులం మనం గాలిలో మామూలు పక్షుల్లా ఎగరలేము తల్లీ” కొంచెం బాధాతప్త హృదయంతో చెప్పింది తల్లి పెంగ్విన్” అదేమిటమ్మా పక్షుల్లో ఎగరలేని పక్షులు ఉంటాయా! చాలా వింతగా ఉన్నది” అని పిల్ల పెంగ్విన్లు ఆశ్చర్యంగా అడిగాయి.

“అవునమ్మా ఉంటాయి మనవే కాకుండా ‘కీవీ’ పక్షులనేవి కూడా ఉంటాయి. అవి కూడా ఎగరలేవు ఇలాగే మనం కూడా ఎగరలేని పక్షులమే” అని తల్లి పెంగ్విన్ పిల్లలకు లాలనగా చెప్పింది. చాలా ఆశ్చర్యంగా ఉన్నదమ్మా ఎందుకమ్మా మనం ఎగరలేకపోతున్నాము. చక్కగా పావురాలు వరసలుగా విమానాలు వెళ్ళినట్లుగా వెళుతున్నాయి. మనం కూడా అలా వెళితే ఎంత బాగుంటుందో కదా! అని నిరాశగా పిల్ల పెంగ్విన్లు తల్లితో అన్నాయి.

“మన శరీర నిర్మాణం ఎలా ఉంటే అలా పని చెయ్యగలం అంతే గానీ శరీర నిర్మాణానికి భిన్నంగా ఏ పనీ చెయ్యలేము. పెంగ్విన్ల శరీరాలు బరువు ఎక్కువగా ఉంటాయి. చూశావా మన శరీరం ఎంత లావుగా ఉన్నదో” అంటూ తమ శరీరాల్ని చూసుకోమని పిల్లలకు చూపించింది. పిల్లలు తమ శరీరాల వంక పరిశీలనగా చూసుకుని, కొంగల శరీరాల వంక చూశాయి. ఆకాశంలో ఎగిరే పక్షుల శరీరాలు సన్నగా ఉన్నాయి. బరువు తక్కువగా ఉన్నాయి. తామేమో చాలా బరువుగా లావుగా ఉన్నారు.

అంతే కాదు, మన రెక్కలు చిన్నవిగా ఉంటాయి. కాకులు పావురాల రెక్కలు వెడల్పుగా విశాలంగా ఉంటాయి గమనించారా. అంటూ తల్లి పెంగ్విన్ తన పిల్లలకు విషయ గ్రహణం చెయ్యటానికి ప్రయత్నిస్తున్నది. “అవునమ్మా మన రెక్కలు చిన్నగా ఉన్నాయి అయితే ఏమి? ఎందుకు ఎగరలేకపోతున్నాం. ఇదంతా నాకు నచ్చలేదు” అని ఒక పిల్ల పెంగ్విన్ ఇసుకలో గీతలు గీస్తూ బుంగమూతి పెట్టుకుని అన్నది.

“చూడు కన్నా! రెక్కలు వెడల్పుగా విసనకర్రవలె ఉంటేనే ఎగరగలిగే అవకాశం ఉంటుంది. రెక్కలతో గాలిని అటూ ఇటూ నెడితేనే ముందుకు వెళ్ళగలిగేది. ఇంకో విషయం ఏమిటంటే పావురాలు, కొంగలు వంటి పక్షుల రెక్కల్లో గాలి గదులు ఉంటాయి. అలాంటి గాలి గదులు ఉండటం వలననే ఆకాశంలో ఎగరగలవు. అంటూ తల్లి పెంగ్విన్ చెబుతూ ఉండగానే మరో పిల్ల పెంగ్విన్ ఇంకో సందేహంతో ముందుకొచ్చింది.

“అమ్మా ఆగమ్మా! మరి మనక్కూడా వాళ్ళలా పెద్ద రెక్కలు ఎందుకు లేవు. అలా లేకపోవటం వలననే కదా మనం ఆకాశంలో ఎగరలేకపోతున్నాము. ఇదేమైనా లోపమా” అంటూ తన అనుమానాన్ని వ్యక్తం చేసింది. తన పిల్ల తెలివితేటలకు తల్లి పెంగ్విన్ చాలా మురిసి పోయింది. ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ “చిన్న రెక్కలు శరీరం బరువుగా ఉండటం అనేవి శారీరక లోపాలు కాదు. ఇది పరిణామ క్రమంలో వచ్చిన లక్షణాలు. మనకు పక్షుల ఆకారంలో రెండు కాళ్ళన్నాయి గానీ ఎగరలేమన్నమాట”. అని తల్లి పెంగ్విన్ చెబుతున్నది.

“జీవ పరిణామం అని చెబుతున్నావు అదేమిటి” అని మరల పిల్లలిద్దరూ తమకు తెలియని విషయాన్ని తల్లి నుంచి తెలుసుకోవాలనే ఉత్సుకతతో అడిగాయి.

పిల్లల ఉత్సాహాన్ని చూసి తల్లి పెంగ్విన్ సంతోష పడింది. పిల్లల ప్రశ్నకు సమాధానమిస్తూ “చూడండి పిల్లలూ! భూ ప్రపంచంలో ఎన్నో రకాల జంతువులున్నాయి గమనించారు కదా! మనకు రెండు కాళ్ళు మాత్రమే ఉన్నాయి. చాలా జంతువులకు నాలుగు కాళ్ళండటం గమనించారా! ఆవు, కుక్క, గొర్రె, మేక వంటి జంతువులకు నాలుగు కాళ్లుంటాయి. అలాగే బల్లి, పాము, తొండ వంటి జీవుల్ని చూశారు కదా! అవి మనలా కాళ్ళతో నడవవు. వాటికి కాళ్ళేలేవు చూశారా!. ఇంకా అక్టోపస్ వంటి వాటికి ఎనిమిది కాళ్లుంటాయి. సాలీడు క్కూడా 8 కాళ్ళుంటాయి. మరి కొన్ని పాకే జీవులకు వంద కాళ్ళుంటాయి. వాటిని శతపాదులంటారు. ఇలా ప్రకృతిలో రకరకాల జీవులు జన్మిస్తాయి. ఆయాకాలాలకు అనుగుణంగా కాలక్రమేణా మార్పులకులోనై పరిణామం జరుగుతుంది. జీవ పరిణామం వలననే జీవుల మధ్య భేదాలు ఉంటున్నాయి. ఇలాంటి జీవ పరిణామం వలననే మనక్కూడా పక్షుల లాంటి లక్షనాలున్నప్పటికీ ఎగరలేక పోతున్నాము. మీరు ఇంకా కొంచెం పెద్ధైతే ఇంకా చక్కగా అర్థమవుతుంది”. అని తల్లి పెంగ్విన్ చెప్పింది.

“అవునా అమ్మా! ఇవన్నీ మాకు తెలియదు. చాలా విషయాలు తెలిశాయి” అంటూ పిల్లలు తల్లితో చెప్పారు. తల్లి పెంగ్విన్ పిల్లల్ని ముద్దు చేస్తూ “మా పిల్లలు బంగారు తల్లులు ఈ రోజు ఎన్నో విషయాలు తెలుసుకున్నారు” అంటూ ఇంట్లోకి దారి తీస్తూ “అన్నం తిందురు రండి” అని పిల్లల్ని పిలిచింది. పిల్లలు తల్లి వెంట లోపలికి నడిచారు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.