దీపానికి కిరణం ఆభరణం!

(నెచ్చెలి-2025 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

– కొత్తపల్లి ఉదయబాబు

తూరుపు తెలతెలవారుతోంది. ఆ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న చెట్లమీద ఎప్పటినించో నివాసముంటున్న రకరకాల పక్షుల కువకువలు వందిమాగధుల సుప్రభాతంలా కిలకిలారావాలతో ప్రచ్చన్నమైన ఉదయభానుడికి స్వాగతం పలుకుతున్నాయి.

సూర్యుని లేలేత కిరణాలు కిటికీ పరదాను దాటుకుని ఆ గదిలో పడుతున్నాయి. అదేగదిలో మంచం బెడ్ మీద నిస్సత్తువగా పడుకుని ఉన్న అమృత కనుకొలుకుల నుండి మాత్రం కన్నీరుజారి, ఆమె తలదిండు చమర్చిన కన్నీటి సరోవరంలా అయింది. అపుడే పాలు బ్రెడ్, డైలీ పేపర్ లతో లోపలకి వచ్చిన నర్సు ‘’ గుడ్ మార్నింగ్…అరె…ఇంకా పూర్తిగా తెల్లవారనేలేదు.మళ్ళీ బాధ పడుతున్నారా? చదువుకున్నవారు…విజ్ఞత తెలిసినవారు…ఏమిటమ్మా ఇలా? తప్పు కదూ…” అని చనువుగా బెడ్ దగ్గరకు వచ్చి అమృత కళ్ళు తుడిచింది నర్స్.

‘’రెండు నిముషాలు హెడ్ లైన్స్ చదివేసి ఇచ్చేయండి. న్యూస్ పేపర్ డాక్టర్ గారి రూమ్ లో పెట్టేస్తాను. జస్ట్ మీ ఆలోచనలు ఇంకో విషయం మీదకు మరలుతాయి. ఇంజక్షన్ ఫిల్ చేసి తెస్తాను.’’ అని అమృతకు న్యూస్ పేపర్ ఇచ్చి బయటకు వెళ్ళింది నర్స్. మొదటి పేజీలో అజిత్ ఫోటోను చూస్తూనే కోయ్యబారిపోయింది. చకచకా వార్తా చదివేసింది. ఇక ఆమెకు దుఖం ఆగలేదు.

నర్స్ వచ్చి ఇంజక్షన్ చేసింది. ‘’తప్పమ్మా. నిండు చూలాలు మీరు. ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి. నేనున్నాను మీకు.’’ అంది అమృత వెన్ను నిమురుతూ.

‘’ దేవుడికి నామీద అంత దయ కూడానా? ప్రేమించి పెళ్ళాడిన భర్తను పోగొట్టుకుని, నవమాసాలు మోసి కన్నబిడ్డను పురిట్లోనే పోగొట్టుకున్న నావంటి దౌర్భాగ్యురాలు ఇంకా బతకడం అవసరమంటారా సిస్టర్?’’ గాద్గదికంగా అడిగింది అమృత.

‘’మన చేతుల్లో ఏముంది మేడం? అదిగో…ఆ కిటికీలోంచి చూడండి. ‘’ అని కిటికీ అవతల ఉన్న తురాయి చెట్టు కేసి చూపించింది. గుబురుగా ఉన్న కొమ్మల మధ్య ఒక తల్లి పక్షి పెట్టిన గూట్లోంచి ఆకలికి తమ ఎర్రని నోళ్ళు తెరుస్తూ, పిల్ల పక్షులు అరుస్తూ, రాని రెక్కల్ని అల్లల్లాడిస్తూ ఎదురు చూస్తున్నాయి.

అవును. వచ్సినప్పటినుంచి తనూ చూస్తోంది వాటిని. తల్లి ఎక్కడనుంచో ఆహారం తన ముక్కున కరిచి తెచ్చి వాటి నోట్లో పెడుతుంటే నాకు అంటే నాకు అన్నట్టుగా పోటీ పడుతున్నాయి ఆ పసికూనలు. తల్లి పక్షి మళ్ళీ వెళ్లి ఆహారం తెచ్చి వాటిని సంతృప్తి పరుస్తోంది. వాటి చిరు పొట్టలు నిండాకా వాటిని తన రెక్కల్లో పొదువుకుని పిల్లల రెక్కలను తన ముక్కుతో దువ్వుతూ పడుకునేది.

‘’ వాటికి ‘నిన్న’ అక్కర్లేదు…రేపు అనే ‘భయం’ లేదు. ఈ క్షణంలో తమను సాకి తమ పొట్ట నింపే తల్లి ఆదరణ చాలు వాటికి. అది జీవన ధర్మం. జరిగినదానికి వగచి ఇక జీవితమే లేదనుకుని బాధపడుతూ ఆ నిర్వేదంలో మన జీవితాన్ని మనమే అంతం చేసుకునే ఆలోచనలు ఉన్నతమైన చదువులు చదివిన మీలాంటి వాళ్లకి రాకూడదమ్మా. ఏమో… రేపు మీ జీవితం ఏ మలుపుతిరుగుతుందో? ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. మార్పు అనివార్యం. అనవసరంగా ఆలోచించక లేచి ముఖం కడుక్కురండి. బ్రెడ్ పాలు తీసుకుందురుగాని.’’ అంది.

లేవడానికి ప్రయత్నించింది అమృత. ఎందుకో గుండెలు బరువుగా అనిపించాయి. బలమంతా ఉపయోగించి ప్రయత్నంచేసినా మళ్ళీ గుండెలు పట్టుకుని వెనక్కి వాలిపోయింది. పాలిండ్లలో ఏదో సన్నని సలుపు ప్రారంభం అయింది.

అది గమనించిన నర్స్ ‘’ఏమిటమ్మా? ఏమైంది?’’ అని అడిగింది…తన పరిస్తితి చెప్పింది అమృత. ‘’అరె…నిన్న మధ్యాహ్నంఅనగా డెలివరీ అయింది కదా…పాలు బయటకు రాకపోవడంవల్ల గడ్డలు కట్టడం ప్రారంభం అయినట్టుందమ్మా. ఒక్క క్షణం ఓపిక పట్టండి. డాక్టర్ గారితో చెప్పి వస్తాను.’’ అని వేగంగా పరుగెత్తింది.

నెమ్మదిగా అలా వస్తున్న నొప్పిని భరిస్తూనే కొన్ని క్షణాలైనా పక్షిపిల్లలను చూస్తూ ఆ బాధ మర్చిపోదామని అటు తలతిప్పిన అమృత మ్రాన్పడిపోయింది.

కావలసినంత తినేసి ఎక్కువైన పదార్ధాన్ని కారీ బాగ్లో వేసి బయట పడేస్తే దాన్ని ముక్కున కరుచుకుని వచ్చి అప్పుడే కొమ్మమీద వాలిన తల్లి పక్షి పిల్లలకు పెట్టడం కోసం కారీ బాగ్ లోంచి బయటకు కనిపిస్తున్న పేపరు కాగితాన్ని ముక్కుతో బయటికి లాగి అందులో పదార్ధాన్ని కాస్త ఎక్కువగా ముక్కులోకి తీసుకుంది. ఆ పదార్ధం దాని గొంతులో ఇరుక్కుందో, అదేమైనా విషపదార్ధమో తెలీదు గాని చూస్తుండగానే తల్లి పక్షి కొమ్మమీద నుంచి నేలమీద వెల్లకిలా పడి కొట్టుకోసాగింది. దానితో పాటే కారీబాగ్.. పదార్ధమున్న పేపర్ కాగితం దూరంగా పడ్డాయి. మరో రెండు నిముషాలు కాళ్ళు ఆడిస్తూ రెక్కలు కొట్టుకుని తల్లి పక్షి కదలిక లేకుండా ఉండి పోయింది. పిల్ల పక్షులు అరుస్తూనే ఉన్నాయి ఎర్రటి నోళ్ళు మరింతగా ఎర్రబడేటట్టు.

ఆడపిల్ల అయితే చాలు… నిలువెల్లా కామంతో రంకెలు వేసే మృగాడిలాంటి ఓ ఊరకుక్క తల్లిపక్షిని నోట కరుచుకుని గేటు బయటకు పరుగెత్తింది. ఇదంతా కేవలం మూడు నిముషాలలో జరిగిపోయింది.

ఊహించని దృశ్యాన్ని చూసిన అమృత కళ్ళు గుండెల్లోని బాధ రెట్టింపు చేస్తుండగా కన్నీటి సాగరాలయ్యాయి.

అంతలోనే లోపలి దూసుకువచ్చింది నర్స్. తలుపులు దగ్గరగా వేసి బెడ్ దగ్గరకు వచ్చింది. ‘’డాక్టర్ గారు ఇంకా లేవలేదటమ్మా. మీరేం కంగారు పడకండి. నేనున్నానుగా.’’ అంటూ అమృత పమిట తొలగించి జాకెట్ కు పైన మిగిలి ఉన్న రెండు హుక్స్ ను తొలగించబోయింది.

“ ఏం చేస్తున్నారు?’’ అడిగింది అమృత అంత బాధలోనూ…

‘’మీ బాధ తగ్గించడానికి నేను ఇదివరకు ఇలా బాధపడిన తల్లులకు చేసిన వైద్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను.’’ అని తనతో తెచ్చిన పెయిన్ – కిల్లర్ ఆయింట్మెంట్ ఆమె నిండైన రెండు పాలిండ్లకు చుట్టూ రాసింది. అనంతరం డబుల్ ఎలక్ట్రికల్ బ్రెస్ట్ పంప్ ను ఆమె చనుమొనలకు అమర్చింది. ఆ పంప్ కు అమర్చిన రెండు చిన్న బాటిల్స్ లోకి పాలను సేకరించింది.

పాలు తనలోనించి ధారగా సీసాలోకి వెళ్తున్న కొద్దీ తన గుండెల్లోంచి ఏదో భారం ఎవరో తీసేస్తున్నట్టుగా ఫీల్ అయింది అమృత.

తన నుంచి మిషన్ వేరుచేసి పాలసీసాలకు మూతలు పెట్టి టీపాయ్ మీద ఉంచి ‘’ఇపుడు ఎలా ఉందమ్మా?’’ అని అడిగింది సిస్టర్.

‘’కొంచెం పరవాలేదు సిస్టర్. ఈ పాలు ఏం చేస్తారు ?’’ కొంచెం ఉపసమనం అనిపించి అడిగింది సిస్టర్ ని.

‘’పాలు పడని తల్లుల పిల్లలు ఉంటారుగా…వాళ్లకి పడతాను. డాక్టర్ వచ్చే వేళైంది. నేను వెళ్తాను.’’ అంటూ వెనుతిరగబోయిన ఆమె చెయ్యి పట్టుకుని కిటికీలోంచి పక్షుల గూడుకేసి చూపించింది అమృత.

పక్షిపిల్లలు అదేపనిగా అరుస్తూనేవున్నాయి ఆపకుండా.

సిస్టర్ లోపలి రాకముందు జరిగింది చెప్పి “ప్లీజ్ సిస్టర్. ఆ పక్షిపిల్లలు ఇంకా అలా కొంత సేపు అరుస్తూనే వుంటే నోరు ఆర్చుకుని చచ్చిపోతాయి. ఎవరైనా కాంపౌండర్ ఉంటే కొంచెం చెట్టు ఎక్కించి ఈ పాలు ఆ పక్షి పిల్లల నోట్లో చెంచాతో జాగ్రత్తగా పోయించండి. ప్లీజ్. నేను మిమ్మల్ని కోరుకునే కోరిక ఇది ఒక్కటే. ప్లీజ్.’’ అంది ఏడుస్తూ…

‘’ చూడండి. మీరు ఇలా పేగులు తెగేలా ఏడుస్తూ ఉంటే ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఇక్కడనుంచి డిశ్చార్జ్ అయేంతవరకు కళ్ళ నీళ్ళు పెట్టుకోను అంటే తప్పకుండా చేస్తాను. నేను పిల్లల తల్లినే…’’ అంది నర్స్ చేయి చాపుతూ…

‘’ మాట ఇస్తున్నాను.’’ అంది అమృత ఆమె చేతిలో చేయివేసి.

మరో పది నిముషాల తర్వాత చెట్టుకొమ్మ పైన కూర్చున్న పదిహేను ఏళ్ళ కుర్రాడు చుక్క చుక్కగా చెంచాతో ఆపక్షిపిల్లల ఎర్ర నోళ్ళల్లో తన పాలు పోస్తూ కనిపించాడు అమృతకు.

ఆ దృశ్యం చూస్తున్న అమృత తన కన్నబిడ్డకి పాలు స్వయంగా ఇచ్చిన అనుభూతి చెందుతూ కళ్ళు మూసుకుంది.

***

నగరంలో పేరుమోసిన కోటీశ్వరుడు సుగుణాకరరావుకు ఇద్దరే సంతానం. కుమార్తె అమృత. ఆమెకు పైన అన్నయ్య చరణ్. బిట్స్ పిలానీలో ‘ట్రిపుల్-ఈ’ చేసి రీసెర్చ్ స్కాలర్ గా అమెరికా వెళ్ళాడు.

చదువులో అమృత కూడా కాలేజ్ టాపర్. ఆమె తనతోపాటు టాపర్ అయిన అజిత్ తో పోటాపోటీ గా చదివేది. ఒకే అంశంమీద అజిత్ ఒక కోణంలో ఆలోచిస్తే…అదే అంశంమీద ఆమె మరోకోణంలో ఆలోచించి ప్రజెంట్ చేసేది.

చూసేవారికి ఒకే అంశం మీద రెండురకాల ప్రజెంటేషన్స్ విస్మయం కలిగించి మూడో రకంగా ఎలా ప్రెజెంట్ చేయాలో ఆలోచనలో పడేవారు.

ఇంజనీరింగ్ రెండోసంవత్సరంవరకు వివిధ పోటీలలో పరస్పరం శత్రువుల్లా వున్న వారిద్దరి మధ్య మూడవ సంవత్సరంలో ప్రేమ చిగురించి మారాకు వేసింది. అప్పటికి ఎన్నో సార్లు తన ఇంటికి తీసుకువెళ్ళిన అమృత అతన్ని ఇష్టపడుతోందని మొదటిసారి పసికట్టింది అమృత తల్లి కల్పవల్లి.

అజిత్ ను తానూ ప్రేమిస్తున్నానన్న విషయాన్ని తల్లికి చెప్పబోతున్నంతలో అమృతను ఏమాత్రం మాట్లాడనివ్వలేదు కల్పవల్లి.

‘’ వాడు పెరిగింది అనాధాశ్రమంలో. అదీ ఒక మారుమూల పల్లెటూళ్ళో. తెలిసి ప్రేమించావో, తెలియక ప్రేమించావోగానీ నక్కకు నాగలోకానికి పెళ్ళా? నా కంఠంలో ప్రాణం ఉండగా జరగనివ్వను.’’ అందామె.

‘’అదేంటి వల్లీ…అతను అమ్మాయితో పోటీ పడి చదువుతున్నవాడు. అటువంటి రెండు జీవితాలు కలిసాయంటే వాళ్ళ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా ఉంటుంది. అమ్మాయి ఎవడో డబ్బున్న లోఫర్ ని ప్రేమిస్తే మన కులం వాడే అయినా నేను ఒప్పుకునే వాడిని కాదు. అలా కష్టపడి చదువుకున్న కుర్రాళ్ళను ఈ కాలంలో మనం చాలా తక్కువమందిని చూస్తాం. అటువంటి అబ్బాయి మనకు అల్లుడవ్వడం మనకూ మంచిది. డబ్బు విలువ తెలుసుకుని చాలా జాగ్రత్తగా మసలుతాడు.’’ అని తండ్రి ఎన్నో విధాల భార్యకి నచ్చచెప్పాడు.

మరో రెండేళ్ళల్లో వాళ్ళ ఇంజనీరింగ్ పూర్తవ్వక ముందే కాంపస్ సెలెక్షన్స్ వచ్చాయి ఇద్దరికీ. వేర్వేరు కంపెనీలలో తమ ఉద్యోగాలలో చేరాకా కూడా ఏడాది పాటు ప్రేమించుకున్నవారి ప్రేమను కల్పవల్లి తీవ్రంగా నిరసించింది.

అమృత ఇంట్లోంచి వెళ్ళిపోతానని బెదిరించడంతోనూ, ఆమెకు ఎంతో ఇష్టమైన రాజకీయ రంగ ప్రవేశానికి ఈ పెళ్లి వేదిక అవుతుందని భర్త పదే పదే చెప్పిన మీదట ఒప్పుకుంది.

ఎంతో ఆదర్శంతో, ఆస్థి అంతస్తు పుష్కలంగా ఉన్నా, ఏ మాత్రం అతిశయంలేని కల్పవల్లి అనాధ అయిన అజిత్ కు అమృతను ఇచ్చి వివాహం చేసిందని పత్రికలన్నీ జిల్లా మొదటి పేజీలో ప్రధాన వార్తగా ప్రచురించాయి. మంచి రోజు చూసి ఆమె అధికార పక్షపార్టీలో చేరి ముఖమంత్రి చేత పార్టీ కండువా వేయించుకుంది.

మరుసటి నెలలో జరిగిన కార్పోరేషన్ ఎన్నికలలో మహిళా కార్పొరేటర్ గా పోటీ చేసి అఖండ మెజారిటీతో గెలిచింది కూడా.

కల్పవల్లి నిర్ణయం నూతన దంపతులకు విస్మయాన్ని కలిగించినా తమ కోరిక ఫలించినందుకు సంతోషించారు.

పెళ్ళైన నెలలోపే ‘మీ బాధ్యతలు మీరు తెలుసుకోవాలి ఇక’ అంటూ అమృతకు ఘనంగా సారె ఇచ్చి వేరింటి కాపురం పెట్టించింది కల్పవల్లి. తల్లి యొక్క ఈ నిర్ణయానికి అజిత్, అమృత ఎంతగానో సంతోషించారు.

కొత్త సంసారం ఎంతో అన్యోన్యంగా ఆనందంగా సాగిపోతుంటే ఏడాది కాలం గడవడం కూడా తెలియలేదు ఆ ప్రేమజంటకి.

అయితే ఇక్కడే దురదృష్టం వారిని వెక్కిరించింది. అజిత్ ఆ రోజు యధాప్రకారంగా ఆఫీస్ కు వెళ్ళి అక్కడ నుంచి బాస్ పంపినచోటికి క్యాంపుకి వెళ్ళిపోయాడు.

అతను వెళ్ళిన గంటకు అమృతకు ఫాల్స్ పైన్స్ మొదలయ్యాయి.. చుట్టుపక్కల వాళ్ళు కల్పవల్లికి ఫోన్ చేయడంతో ఆమె కూతుర్ని హాస్పిటల్ లో చేర్చి అజిత్ కు ఫోన్ చేసింది.

తానూ సాయంత్రానికి వచ్చేస్తానని అజిత్ చెప్పడంతో అమృతకు తోడుగా అవసరమైన మనుషులను పెట్టి, తమ కార్పొరేటర్లందరూ చైనా పరిపాలనలో మెళకువలు నేర్చుకునే కార్యక్రమానికి స్త్రీల బృందం తరపున తాను సారధ్యం వహిస్తూ ఉండడం వల్ల, కూతురికి డెలివరీ అయ్యాకా మనవడు పుట్టాడని తెలుసుకుని భర్తను చూసుకొమ్మని చెప్పి ఆ రాత్రే అంటే నిన్న రాత్రి ..ఫ్లైట్ ఎక్కేసింది కల్పవల్లి.

తన డ్యూటీ పూర్తిచేసుకుని అజిత్ ఆత్రుతతో అమృత దగ్గరకు వస్తున్నంతలో వేగంగా వస్తున్న లారీ ఒక మలుపులో అతని కారును గుద్దుకుని కొన్నిమీటర్లు ఈడ్చుకుపోవడంతో డ్రైవర్ సీట్లో ఉన్న అజిత్ అక్కడకక్కడే మరణించాడు.

కానీ విచిత్రంగా బాబు పుట్టిన వెంటనే ఉమ్మనీరు విపరీతంగా మింగేయ్యడంతో పొట్ట ఉబ్బి ఊపిరి ఆడక మరణించాడని నర్స్ చెప్పడంతో అమృత స్పృహ తప్పిపోయింది.

రాత్రి ఏడు గంటలకు నర్సులు డ్యూటీ మారడంతో వచ్చిన కొత్త నర్స్ అమృత కేస్ షీట్ అంతా చదివింది. రాత్రి ఎప్పుడో పదకొండు గంటలు దాటాకా మెలకువ వచ్చింది అమృతకు.

నర్స్ వెంటనే డాక్టర్ ని సంప్రదించి ఆమె ఎంతో నీరసంగా ఉండటంతో సిలైన్ ఎక్కించే ఏర్పాటు చేసింది. దాంతో అమృత నిద్రలోకి జారుకుంది. కాని తూరుపు తెలతెలవారుతుండగానే మెలకువ వచ్చేసింది ఆమెకు.

జరిగినదంతా ఒక్కసారిగా గుర్తుకు రావడంతో మౌనంగా రోదించసాగింది. ప్రస్తుతం డ్యూటీ లో ఉన్న నర్స్ ధైర్యం చెబుతూ తన బాధను గమనించి అనుభవంతో సకాలంలో స్పందిచడం వలన తానూ బతికి బట్టగలిగిందన్న కృతజ్ఞత ఆమె పట్ల గౌరవభావంగా మారడంతో తన భవిష్యత్తు ఏమిటా అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది అమృత.

***

భార్య వూళ్ళో లేకపోవడంతో తమ వార్డులోని సమస్యల వినతి పత్రాలతో వచ్చిన ప్రజల దగ్గరనుంచి ఆ కాగితాలు తీసుకోవడం…మేయర్ గారి పిలుపుతో ఆయన వెనుకే ఎన్నెన్నో కార్యక్రమాలలో స్వయంగా పాల్గోవడం సుగుణాకరరావు పనైపోయింది. దాంతో అమృతను కనీసం చూసే సమయం కూడా ఆయనకు లేకపోయింది.

ఆయన వారం రోజుల తరువాత హాస్పిటల్ కు వెళ్లి చూస్తె అమృత కనపడలేదు. కల్పవల్లి పదిహేను రోజుల తరువాత వచ్చి ఎక్కడ వెతికించినా అమృత కనపడలేదు.

‘’ చూడండి. అది దౌర్భాగ్యురాలు, దురదృష్టవంతురాలు కాబట్టే అటు భర్తని ఇటు కొడుకుని పోగొట్టుకుంది. అలాంటిదాన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే రేపు ఈ జనాల సానుభూతులు వినే ఓపిక, భరించేశక్తి నాకు లేవు. నన్ను నా సంపదని కాదని ఏనాడు ఆ అనాధ వెధవని ప్రేమించిందో ఆనాడే అది చచ్చిందని నీళ్లోదిలేసాను. ఇక దాని పేరు ఈ ఇంట్లో వినిపించడానికి వీలు లేదు.’’ అని శాసనం చేసేసింది కల్పవల్లి.

ఒక నెలరోజుల తరువాత అమెరికాలో ఉన్న కొడుకు ‘’అమ్మా…ఇదిగో నీ కోడలు’’ అంటూ వివాహం చేసుకుని వస్తే కూతుర్ని వదిలేసినట్టు వదిలెయ్యలేక ఆర్భాటంగా రిసెప్షన్ ఏర్పాటుచేసి అందరి మన్ననలూ పొందింది. కుమార్తె విషయంలోనే కాకుండా కుమారుని విషయంలో కూడా ఆమె ఆదర్శ మూర్తి అని పేపర్లు ఆమెను ఆకాశానికి ఎత్తేసాయి.

కుమార్తెపట్ల ఆమె ప్రవర్తించిన తీరుకో, చేసిన పాపానికో కొత్త దంపతుల చేత తిరుమల శ్రీవారి దర్శనం చేయించి తిరిగి తీసుకువస్తున్న వారు ప్రయాణం చేస్తున్న కారు ఘాట్ రోడ్ లోయలో పడి కల్పవల్లి, సుగుణాకరరావు దంపతులు స్పాట్ డెడ్ కాగా కొడుకు కోడలు తీవ్ర గాయాలతో బతికి బట్టకట్టారు.

కోలుకున్నాకా తల్లి తండ్రులకు సకల కార్యక్రమాలు జరిపించి ఉన్న ఆస్తిపాస్తులన్నీ అమ్మేసుకుని నెలరోజుల్లోనే అమెరికా తిరిగి వెళ్ళిపోయాడు చరణ్. దాంతో సుగుణాకరరావు దంపతుల కధ ముగిసింది.

***

హాస్పిటల్ లో ఉన్న వారం రోజులూ చెట్టుమీద పిల్ల పక్షులకు తన పాలను పోయించిన అమృతకు అక్కడనుండి డిశ్చార్జ్ అవక తప్పలేదు.

వారంరోజుల తరువాత హాస్పిటల్ నుంచి విడుదల అయిన అమృత తానూ అనుకున్న కార్యాచరణను అమలులో పెట్టుకుంది.

స్నేహితుల సహాయంతో కాశీకి చేరుకొని భర్తకు పిండప్రదానం చేయించి కాశీవిశ్వేశ్వరుని దర్శించుకుని ఉత్తరాది పుణ్యక్షేత్రాలన్నీ తిరిగింది. దాంతో కొంత మానసిక శాంతి లభించడంతో హైదరాబాద్ చేరిన ఆమెకు తల్లి తండ్రుల విషయం తెలిసి ఎంతో బాధ పడింది.

ఇక అక్కడ ఉండాలనిపించక బెంగళూరు చేరి తిరిగి ఉద్యోగంలో ప్రవేశించింది. ఎక్కడకు వెళ్ళినా తన చుట్టూ ఉన్నవాళ్ళు కుటుంబాలతో కళకళలాడిపోతుంటే ఆమె మనసు ఆర్తితో మూలిగేది. ‘మళ్ళీ పెళ్లి చేసుకో’ అని ఎందఱో ఆమెకు సలహాలు ఇచ్చారు.

కానీ అమృత అజిత్ జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోయింది. తానూ పురుడు పోసుకున్న హాస్పిటల్లో పురిటిలోనే తల్లిని కోల్పోయిన అనాధ పిల్లలకు తన జీతంలో ఇరవై అయిదు శాతం, ఏడాదికో మారు అజిత్ మరణించిన రోజున అనాధాశ్రమ నిర్వహణకు ఒక లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వడం అలవాటు చేసుకుంది.

***

అయిదు సంవత్సరాల తర్వాత ఒక ఆదివారం ఉదయం – కాలింగ్ బెల్ శబ్దం విని తలుపు తీసింది.

ఎదురుగా ఒకామె. ఆమెను ఎక్కడో చూసినట్టు ఉందిగాని అమృత కు గుర్తు రాలేదు.

‘’ చెప్పండమ్మా…ఏం కావాలి ?’’ ఆమెకు కుర్చీ చూపించి అడిగింది

ఆమె అమృత కాళ్ళమీద పడింది ‘’ నన్ను క్షమించడమ్మా. నేను మీరు హాస్పిటల్ లో నొప్పులు పడుతూ చేరినప్పుడు డ్యూటీలో ఉన్న నర్సును. గుర్తుపట్టారామ్మా?’’ అంది.

‘’ తప్పమ్మా…తల్లి లాంటి వారు. మీరు నాకాళ్ల మీద పడటం ఏమిటి? విషయం చెప్పండి.’’ అంది నొచ్చుకుని లేవదీసి కుర్చీలో కూర్చుండజేసి.

‘’మీవారి మరణానికి కారణం మీ అమ్మగారేనమ్మా. ఆ రోజు హాస్పిటల్ లో మీరు నొప్పులు పడుతున్నప్పుడు ఆమె ఫోన్ లో లారీ అతన్ని పురమాయించడం నేను చెవులారా విన్నానమ్మా. అది కావాలని చేయించిన ఆక్సిడెంటమ్మా.

‘ఆ అనాధ వెధవ బతకడానికి వీలు లేదు. ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. అది అందరూ ప్రమాదం అనుకోవాలి. ఎట్టి పరిస్తితుల్లోను నా పేరు బయటకు రాకూడదు. వస్తే నీ ప్రాణాలు ఉండవు.’అని అమ్మగారు ఫోన్ లోనే పురమాయించారమ్మా. అది నేను విన్నానని తెలిసి నన్ను చంపుతానని బెదిరించారు.

మీకు పుట్టిన బిడ్డను కూడా చంపేస్తే పది లక్షలు ఇస్తానని, తన మాట వినకపోతే నన్ను బాబుని కూడా చంపిస్తానని బెదిరించారమ్మా.

నన్నే కాదు డ్యూటీలో ఉన్న డాక్టర్ ను కూడా డబ్బుతో లొంగదీసుకున్నారు. అందుకే బాబు ఉమ్మనీరు ఎక్కువగా తాగి పొట్ట ఉబ్బిపోయి చచ్చిపోయాడని మీకు చెప్పాము.

ఆ రోజు సాయంత్రం ఏడు గంటల డ్యూటీ దిగి నేను ఇంటికి వెళ్ళిపోయాను. బాబుని, డబ్బుని మీవారు పెరిగిన అనాధాశ్రమంలో పనిచేస్తున్న మా చెల్లికి అప్పగించి నేను అక్కడనుంచి నేను మా మేరీ మాత గుళ్ళో పనిచేయడానికి విజయవాడ వెళ్లిపోయానమ్మా.

చెల్లి మూడు రోజుల క్రితం గుండెపోటుతో మరణిస్తూ బాబుని తిరిగి నాకు అప్పగించిందమ్మా. మా అడ్రస్ చర్చిలో తీసుకుని మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడకు వచ్చానమ్మా. మీ బాబు…మీ బాబు బతికే వున్నాడమ్మా. మీ బాబును మీకు అప్పగించి నా పాపం కడిగేసుకుందామని వచ్చానమ్మా. నన్ను మన్నించు తల్లీ..’’ అని దోసిలిలో ముఖం దాచుకుని ఏడుస్తూ…

ఆమె మాటలు విన్న అమృత ఇంకా సంభ్రమాశ్చర్యాల నుండి తేరుకోక ముందే, ఆమె తనను తానూ సంబాళించుకుని బయటకువెళ్లి ఆరు సంవత్సరాల బాబుతో లోపలి వచ్చింది.

బొద్దుగా ముద్దుగా ఉన్న బాబును చూస్తూనే అమృత ఆనందానికి అవధులు లేకపోయాయి. దానికి మరో కారణం బాబు అచ్చు అజిత్ నోట్లోంచి ఊడి పడ్డట్టు అవే పోలికలతో ఉండటమే.

బాబుని పవిత్రమైన వస్తువులా అపురూపంగా దగ్గరకు తీసుకుని గుండెలకు తనివారా హత్తుకుని వాడి బుగ్గలపై ముద్దాడింది అమృత.

‘’అమ్మను చూడటానికి వెళ్తున్నాం అన్నావ్. ఈవిడేనా మా అమ్మ ఆంటీ?’’ అడిగాడు బాబు ముద్దుగా

‘’అవును బాబు. నిన్ను కన్నతల్లి…నీకు ఇక సర్వస్వం ఆమెనే. అమ్మదగ్గరే ఉండాలి ఇక నువ్వు.’’అంది నర్స్. .

‘’అమ్మా’’ అంటూ బాబు కూడా అమృత మెడ చుట్టూ చేతులు వేసి కరుచుకుపోయాడు.

ఆ రోజు పక్షిపిల్లలకు తన పాలు పోయించినందుకు దేవుడు ఇంతటి వరమిచ్చాడా తనకు? ఇక అర్ధమేలేదనుకున్న తనజీవితానికి ‘దీపానికి కిరణమే ఆభరణం’ అని ఎవరో కవి రాసిన పాటలోని పల్లవిలా అందించిన భగవంతునికి మనస్పూర్తిగా నమస్కరించుకుని ‘’అమ్మా..ఇక నుంచి మీకు అభ్యంతరం లేకుంటే మీరూ మాతోనే..’’ అంది నర్సుని రెండో పక్క హత్తుకుంటూ. మార్దవంగా తలదించుకుంది నర్సమ్మ.

ఎదురుగా ఫోటోలోంచి చిరునవ్వులు చిందిస్తూ ఆశీర్వదిస్తున్నట్టుగా చూస్తున్నాడు అజిత్…!!!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.