ధర్మేచ, కామేచ… న.. చరామి

(నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-శ్రీపతి లలిత

“యువర్ ఆనర్! దేశం ఎంత అభివృద్ధి సాధించినా, ఆడపిల్లల జీవితాలతో మగవాళ్ళు ఆడుకోవడం ఆగడంలేదు. ఒకప్పుడు వరకట్నం, గృహహింస అయితే , ఇప్పుడు కొత్త రకం హింస! హోమో
సెక్సువల్ మగవాడు, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని, దాని అర్థమే మార్చేసి పెళ్లిని పెటాకులు చేస్తున్నారు.

వివాహసమయంలో, అబ్బాయి, అమ్మాయి చేత “ధర్మేచ, అర్థేచ, కామేచ… నాతి చరామి అని ప్రమాణం చేయిస్తారు. కానీ స్వలింగ సంపర్కం పెట్టుకుని, సమాజం కోసం అమ్మాయిని పెళ్లి చేసుకుని ‘నాతి చరామి’ ని ‘న చరామి’ చేస్తున్నారు కొందరు ఘనులు. అలా మోసపోయింది నా క్లయింట్ అపూర్వ.

కొడుకు విషయం బయట పెడితే ఊరుకోమని, అత్తమామలు బెదిరించినా, ధైర్యంగా బయటికి వచ్చి విడాకులు కోరుతోంది. ‘గే’ అయిన భర్తతో, ఒక ఆడపిల్ల కాపురం ఎలా చేస్తుంది, ఎలా తల్లి అవుతుంది? పెళ్లంటే ఇంతేనా? ఇప్పుడు పెళ్లికి జాతకాలు, ముహూర్తాలు కాదు వాళ్ళ సెక్సువల్ ప్రిఫరెన్స్, కాంపిటెన్స్ చూడాలి లేపోతే ఒక ‘గే’ కానీ ఒక ‘ఇంపోటెంట్’ కానీ భర్త అయితే ఆ అమ్మాయి బతుకు ఏమిటి?
కేసుకి సంబంధించిన అన్ని సాక్ష్యాలు ఇక్కడ ఉన్నాయి. దయచేసి అపూర్వకి విడాకులు మంజూరు చెయ్యమని నా ప్రార్థన” వినయంగా అంటూ ఫామిలీ కోర్ట్ జడ్జి ముందు అన్ని సాక్ష్యాలు పెట్టింది లాయర్ రమ్య.

“వచ్చే వారానికి కేసు వాయిదా వేస్తున్నాము” అని జడ్జిగారు చెప్పి వెళ్లిపోయారు.

ఇంటికి వెళ్లి, వేడివేడిగా ఒక కప్ కాఫీ పట్టుకుని, బాల్కనీలో కూర్చున్న రమ్య ఆలోచనలు అయిదేళ్లు వెనక్కు వెళ్లాయి. తనుకూడా ఇలాంటి బాధితురాలే.

బంధువుల పెళ్ళిలో దూరపుచుట్టమైన సావిత్రి, రమ్యని చూసి, తమ అబ్బాయి శౌర్యకి మంచి జోడీ అని, కొడుకుని తీసుకుని పెళ్ళిచూపులకి వస్తామని రమ్య తల్లితండ్రులు రాజేశ్వరి, రాజారావులకి చెప్పింది.

సావిత్రి భర్త సత్యనారాయణ హైదరాబాద్ లో పెద్ద వ్యాపారవేత్త, కోటీశ్వరులు. రమ్య తండ్రి రాజారావు “ఆ సత్యనారాయణ వాళ్ళు కోటీశ్వరులు, ఆస్తి లేని మన రమ్యని కోడలిగా ఎందుకు  అనుకుంటు న్నారు?” అనుమానంగా అన్నాడు.

“మన రమ్యకేం తక్కువ? చక్కటి పిల్ల? ఇప్పుడు కోటీశ్వరులైనా, ముందు మనలాంటి మధ్యతరగతి వాళ్ళేగా! వద్దని ఎందుకు అనాలి?” అంది రమ్య తల్లి రాజేశ్వరి.

మొత్తం మీద చెప్పిన రోజున పెళ్లి చూపులకి వచ్చారు సావిత్రి, కొడుకు శౌర్య. ఇంటి ముందు ఆగిన పడవలాంటి కారు, అందులోనుంచి దిగుతున్న హీరోలాంటి అబ్బాయిని చూసి, అందరూ ఆశ్చర్య పోయారు. లోపలికి వస్తూనే, అందరినీ నవ్వుతూ పలకరించిన శౌర్య, బాగా నచ్చేసాడు రమ్యకి.

“అన్నయ్యా! మీ అమ్మాయి మాకు నచ్చింది, మా అబ్బాయి మీకు నచ్చితే తాంబూలాలు మార్చుకుందాం. మాకు ఒక్కటే కోరిక, పెళ్లి హైదరాబాద్ లోనే అంగరంగవైభవంగా చెయ్యాలి, ఖర్చు మాది, మీరు వచ్చి కన్యాదానం చెయ్యండి చాలు” అన్న మాటలకి నోట్లో మాటరాక తలఊపారు రాజారావు, రాజేశ్వరి.

నిశ్చతార్ధం అంటూ పాతికవేల పట్టుచీర, వజ్రాల నెక్లెస్ పెట్టింది సావిత్రి. తరవాత పెళ్లి పనులు ఆఘమేఘాల మీద జరిగిపోయాయి. ఊర్లో వాళ్ళ కోసం పెళ్ళికి బస్సు ఏర్పాటు చేసారు, పెళ్లికూతురు
కుటుంబానికి పెద్ద కారు పంపారు. రమ్యకి పట్టిన అదృష్టానికి ఆనందించినవారు కొందరైతే, అసూయ పడ్డవాళ్లు ఎక్కువ.

అత్తగారింట్లో, అందరూ, రమ్యని నెత్తినపెట్టుకుని చూస్తున్నారు. శౌర్య సరదాగా ఉన్నాడు. ఎక్కడా, ఎవరూ, డబ్బున్న అహంకారం చూపలేదు. రమ్యకి ఇదంతా ఏదో కలలాగా ఉంది. పెళ్లి హడావిడి తరవాత, ఇద్దరూ హానీమూన్ కి బయలుదేరారు. ఇండియాలో కన్నా బయట దేశాలకి వెళదామని, యూరోప్ ట్రిప్ ప్లాన్ చేసాడు శౌర్య. రమ్యకి అంతా చాలా సరదాగా ఉన్నా, ఒక్క విషయం మనసులో తొలిచేస్తోంది.

అదే మొదటిరాత్రి సమాగమం! తల్లితండ్రి ఈ విషయం ఎత్తినప్పుడు, “పిల్లల ఇష్టం వదినా! వాళ్లే ఏర్పాటు చేసుకుంటారు” అని అత్తగారు అన్నా, శౌర్య అసలు ఆ సంగతి ఎత్తడంలేదు. కొత్త పెళ్ళికొడుకులాగా, శౌర్య తన స్పర్శ కోసం అల్లాడడం లేదు. పైగా ఫోటోలు తీసేటప్పుడు, “నన్ను ఎవరైనా టచ్ చెయ్యడం నచ్చదు, నువ్వు కొద్దిగా దూరంగానే ఉండు” అన్నాడు.

‘సరేలే! ఒకవేళ యూరోప్ వెళ్ళాక పరిస్థితి మారుతుంది’ అనుకుని ఎయిర్పోర్ట్ చేరిన రమ్య, ఎదురుగా శౌర్య స్నేహితుడు విక్రమ్ ని చూసి ఆశ్చర్యపోయింది.

“తను కూడా మనతో వస్తున్నాడు. అక్కడ వ్యాపారానికి సంబంధించిన పనులు చూసుకుంటాడు” అన్నాడు శౌర్య. తీరా బోర్డింగ్ పాసులు తీసుకున్నాక, శౌర్యకి, విక్రంకి పక్క పక్కన సీట్లు తీసుకున్న శౌర్యని “అదేమిటి?” అంటే

“మేము వ్యాపారం గురించి మాట్లాడాలి” అంటూ వెళ్లి విక్రం పక్కన కూర్చున్నాడు శౌర్య. తన చెయ్యి తగిలితేనే విసుక్కున్న శౌర్య, విక్రమ్ భుజాల చుట్టూ చెయ్యి వేయడం, బుగ్గమీద తేలిగ్గా ముద్దు పెట్టడం, రమ్య దృష్టి దాటలేదు. వెళ్లిన ప్రతిచోటా తమకి గది తీసుకున్నా, రాత్రి విక్రమ్ గదిలోనే పడుకునేవాడు శౌర్య. వ్యాపారవిషయాల కోసం వస్తున్నాడు అని చెప్పినా, విక్రమ్ వీళ్లతోనే తిరిగేవాడు.

ఒక పక్క అన్ని దేశాలు చూడడం బావున్నా, ‘అసలు ఇదేమి హానీమూన్’ అర్థం కాలేదు రమ్యకి.

ఇంక, మర్నాడు ఇండియాకి తిరిగి బయలుదేరతామనగా, రాత్రి డిన్నర్ అయ్యాక, విక్రంతో పాటు శౌర్య వెళ్తుంటే,

“విక్రమ్! మీరు ఏమీ అనుకోకపోతే నేను శౌర్యతో తేల్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, కొంచెం ఆగి వస్తాడు ప్లీజ్!” అన్న రమ్య వంక చూసి “ఓకే!” అని వెళ్ళిపోయాడు విక్రమ్.

“నా రూంలో మాట్లాడుకుందాం!” అంటూ శౌర్యకి వేరే అవకాశం ఇవ్వకుండా రమ్య రూమ్ లోకి నడిచింది.

“ఇవన్నీ ఇక్కడ అవసరమా! మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకోవచ్చుకదా!” అన్న శౌర్యతో ” అది నీ ఇల్లు… మన ఇల్లు కాదు, అసలు నేను అక్కడికి రావాలో, వద్దో తేల్చుకోవడానికే మాట్లాడతాను అన్నాను, నీ సంగతి కొంత నాకు అర్థమైంది, స్పష్టంగా వివరిస్తే మంచిది” అంది రమ్య.

ఒకసారి బలంగా ఊపిరి తీసుకుని “నేను గే!” అన్నాడు శౌర్య.

“అనుకున్నాను, మీ అమ్మా వాళ్ళకి తెలీదా? లేక, తెలిసి నా జీవితం బలి చేసారా ?” ఉక్రోషంగా అడిగింది రమ్య. ”

రమ్యా! నేను మా అమ్మానాన్నలకి  చెప్తూనే ఉన్నాను. సంఘంలో పరువు పోతుందని, మా అమ్మ నన్ను బ్లాక్మెయిల్ చేసింది. నీకు అన్యాయం చెయ్యాలనే ఉద్దేశ్యమే నాకు లేదు. డబ్బు లేని పిల్ల అయితే, నాకు అడ్డురాకుండా ఉంటుందని, ఈ డబ్బుతో వచ్చే సుఖం అలవాటుపడితే సర్దుకుపోతుందని మా అమ్మ చెప్పింది” అన్న శౌర్యతో

“అంటే నీకు నైతికంగా ఏ బాధ్యత లేదా, మనకి చట్టప్రకారంగా పెళ్లి అయింది, నీకు నా పట్ల కొన్ని బాధ్యతలు ఉన్నాయి కదా! నువ్వు ఈ విషయం చెప్పి చేసుకుంటే అదివేరు, చెప్పకుండా చేసావు, మోసం కాదా?” అంది రమ్య.

నిజానికి శౌర్య, రమ్య ఇంత ధైర్యంగా ప్రశ్నిస్తుందని అనుకోలేదు. సౌమ్యంగా ఉన్న అమ్మాయి, మంచి బట్టలు, నగలు, కార్లు చూసి నోరెత్తదు అనుకున్నాడు.

“ఒక్క నాలుగురోజులు కళ్ళు మూసుకుని దానితో కాపురం చెయ్యరా! దానికి కడుపు వచ్చిందనుకో, ఇంక నోరెత్తకుండా ఉంటుంది” అన్న తల్లి మాట గుర్తు వచ్చినా, అలా చెయ్యడానికి మనసూ, తనువూ సహకరించలేదు శౌర్యకి. అది ఒకరకంగా రమ్యకి అదృష్టమే అయింది.

“ఇప్పుడు నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు?” నెమ్మదిగా అడిగాడు శౌర్య.

“ఏం చెయ్యాలి? మా ఇంటికి వెళ్తే, అక్కడ మా అమ్మానాన్నా తట్టుకోలేరు, చుట్టూ ఉన్న వాళ్ళు కాకుల్లా పొడుస్తారు. కేసు వేస్తే, మీతో ఎదుర్కునే శక్తి, డబ్బు లేవు, నన్ను ఎందుకు ఇలా అన్యాయం చేసారు!”
వెక్కి వెక్కి ఏడ్చింది రమ్య.

కొద్దిగా జాలివేసినా, “దానిమీద జాలి పడకు, మన సంగతి బయటపడితే మనమీద ఎవరూ జాలిపడరు, కొద్దిగా గట్టిగా ఉండు” అన్న తల్లి మాటలు గుర్తు వచ్చి సర్దుకున్నాడు శౌర్య.

“చూడు రమ్యా! నువ్వు చెప్పినట్లు మాతో పెట్టుకుని నువ్వు నెగ్గలేవు. మీ వాళ్ళకి చెప్తే వచ్చే ఉపయోగం లేదు, వాళ్ళని బాధ పెట్టడంతప్ప. నీకు ఏ లోటూ రానియ్యను, డబ్బు, నగలూ ఏం కావాలంటే అవి కొనుక్కో. హాయిగా క్లబ్ లకి వెళ్ళు, డబ్బుతో ఎన్ని సుఖాలు వస్తాయో అన్నీ అనుభవించు. అలా కాదని మాకు వ్యతిరేకిస్తే, నిన్నూ, నీ కుటుంబాన్నీ కూడా నాశనం చేస్తాము. కొద్దిగా నటన నేర్చుకో, మీ వాళ్ళని నీ నటనతో, నువ్వు సుఖంగా ఉన్నట్టు నమ్మించు. నువ్వు వాళ్ళకి ఏదైనా డబ్బు సాయం చేస్తానన్నా నాకు అభ్యంతరం లేదు, కానీ ఎదురుతిరిగితే పర్యవసానం తీవ్రంగా ఉంటుంది” శౌర్య గొంతులో
కాఠిన్యం ధ్వనించింది.

దేశం కాని దేశం, స్థానబలం, అర్ధబలం లేని తను ప్రస్తుతం తగ్గడమే మంచిది అనుకుంది రమ్య. మౌనం పూర్తి అంగీకారంగా తీసుకున్నాడు శౌర్య. ప్రస్తుతం నటన తప్ప వేరే దారి లేదని అర్థం చేసుకున్న రమ్య, ఆరితేరిన నటిలా పుట్టింటిని, అత్తింటిని మెప్పించింది. మొదట్లో ప్రతీ క్షణం తన మీద నిఘా ఉంటుందని తెలిసిన రమ్య, పూర్తిగా శౌర్యకి నమ్మకం కలిగేటట్లు ప్రవర్తించింది. కొద్దిగా నమ్మకం కలిగాక సెల్ ఇచ్చినా, దాన్ని అత్తగారు ట్రాక్ చేసేవారు. లాప్టాప్ ఉన్నా, అందులో ఏమి చూస్తోందో శౌర్య ట్రాక్ చేసేవాడు.

క్లబ్ లో చేరమన్నా రమ్య పెద్ద ఆసక్తి చూపలేదు. ఇంట్లో వంట దగ్గర ఎక్కువగా ఉండేది, ఆఫీస్ పనులలో కొంత ఆసక్తి చూపినా, సావిత్రి రమ్యని ఆవేపు వెళ్ళనిచ్చేది కాదు. అలా కష్టమ్మీద ఒక్క సంవత్సరం గడిచింది. రమ్య పైకి నటిస్తున్నా, లోపల్లోపల ఎలా ఈ వలయంలో నుంచి బయటపడాలా అని ఆలోచిస్తూనే ఉంది, అవకాశం కోసం ఎదురు చూస్తూనే ఉంది.

ఆ అవకాశం రమ్య స్నేహితురాలు సుష్మ పెళ్లి రూపంలో వచ్చింది. సుష్మ, రమ్య పెళ్ళికి వచ్చింది, తర్వాత ఫోన్ చేస్తూనే ఉండేది. ఆ తరవాత సుష్మ తండ్రి ఉద్యోగరీత్యా హైదరాబాద్ రావడంతో,
అప్పుడప్పుడు రమ్య దగ్గరికి వచ్చి వెళ్తుండేది. ఆ ఇంట్లో ఎప్పుడూ రమ్యని తనతో ఒంటరిగా వదలకుండా, ఎవరో ఒకరు పక్కన ఉండడం గమనించింది సుష్మ. కానీ, అది ఏమాత్రం గమనించనట్లు అందరితో మామూలుగా కబుర్లు చెప్పేది. అలా అందరికీ సుపరిచితమైన సుష్మ, తన పెళ్ళికి తప్పకుండా అందరూ రావాలని ఆహ్వానించింది.

“మాకు రావడం కుదరదు కానీ నువ్వు వెళ్ళు, ఘనంగా బహుమతి తీసుకెళ్ళు, మంచి నగలు వేసుకుని తయారవ్వు” ఆర్డర్ జారీ చేసింది సావిత్రి.

“ఏం కొనమంటారు అత్తయ్యా!” వినయంగా అడిగింది రమ్య.

“వాళ్ళు మధ్యతరగతి వాళ్ళేగా! డబ్బు పెట్టి ఇవ్వు, కావాల్సింది కొనుక్కుంటారు” అంటూ పదివేలు రమ్య చేతిలో పెట్టింది.

రమ్య మనసులో ఒక ఆలోచన రూపు దిద్దుకుంది. సుష్మ వచ్చినప్పుడు కాబోయే మామగారు లాయర్ అని చెప్పింది, ఎలాగైనా సుష్మ సాయంతోనే ఈ జైలు నుంచి బయట పడాలి అనుకుంది.
పెళ్ళికి వెళ్ళేటప్పుడు రమ్య అనుకున్నట్లే, అత్తగారు ఇంట్లో పనిచేసే అమ్మాయిని ‘తోడు’ గా పంపింది. రమ్యకి తెలుసు ఆ ‘తోడు’ అనేది ‘కాపలా’ అని, తాను అక్కడ ఎవరితో ఏం మాట్లాడుతుందో అన్నీ వింటుంది, చూస్తుంది. అందుకే మాములుగానే గడిపింది.

పెళ్లిలో అందరితో నవ్వుతూ మాట్లాడింది. సుష్మ బదులు, పెళ్ళికొడుకు చేతిలో, డబ్బు ఉన్న కవర్ పెడుతూ “నా ప్రాణాన్ని మీ చేతిలో పెడుతున్నాను, జాగ్రత్తగా చూసుకోండి” అంది నవ్వుతూ. అది స్నేహితురాళ్ళ పరాచికమే అనుకుంది తోడుగా వచ్చిన ఆమె.

ఒక నెలరోజులు గడిచాయి, సుష్మ భర్తతో కొత్త ఇంట్లో కాపురం పెట్టింది. శ్రావణమాసం పూజ చేసుకుంటున్నానని రమ్యని రమ్మంది సుష్మ.

పూజ మాత్రమే కదా! ఎలాగో అక్కడ చాలామంది ఉంటారు, రమ్య ఏమీ చెయ్యలేదు అని సావిత్రి రమ్య ఒక్కదాన్నే పంపింది. రమ్య కూడా ఎక్కువ నగలు వేసుకోకుండా, సింపుల్ చీర కట్టుకుని
తయారయ్యింది. ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టాను అని సావిత్రికి చెప్పింది. సావిత్రి, రమ్యని ధైర్యంగా పంపింది.

రెండుగంటల తరవాత డ్రైవర్ ఖంగారుగా ఫోన్ చేసాడు, తాను గుమ్మం దగ్గరే ఉన్నానని ఎంతసేపటికీ రమ్య రాకపోతే, లోపలికి వెళ్లి అడిగితే రమ్య వెళ్లిపోయిందని చెప్పారని.

సావిత్రి ఖంగారుగా వస్తే అందరూ అదే సమాధానం చెప్పారు, రమ్య తాంబూలం తీసుకుని వెళ్లిపోయిందని. ఎక్కడికి వెళ్లిందో సావిత్రికి అర్థంకాలేదు.

రమ్య అమ్మానాన్నలతో మాట్లాడినా, పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా తమ గుట్టు బయటపడుతుందని నోరువిప్పలేదు. అడిగినవాళ్లకి రమ్య పుట్టింటికి వెళ్లిందని చెప్పారు.

సరిగ్గా పదిరోజుల తరవాత శౌర్యకి కోర్ట్ నోటీసు వచ్చింది రమ్య నుంచి విడాకులు కోరుతూ. ఎక్కువ రాద్ధాంతం చేస్తే తమకే మంచిది కాదని, రమ్య చెప్పిన వాటికి ఒప్పుకుని విడాకులు ఇచ్చాడు శౌర్య.
విడాకులు మంజూరు అయ్యేవరకు తల్లితండ్రులకి అసలు కారణం చెప్పలేదు రమ్య.

జరిగినవి అన్నీ విన్నాక బాధతో హతాశులయ్యారు వాళ్ళు. బంధువులయ్యి కూడా ఇంత నీచానికి పాల్పడ్డారు వాళ్ళు అని. వెంటనే ‘లా’ కోర్సులో చేరింది రమ్య. అక్కడ తనతో చదివిన అర్జున్ ని
పెళ్లి చేసుకుంది.

ఇద్దరూ హైదరాబాద్ లో ప్రాక్టీస్ పెట్టారు. రమ్య మాత్రం ఇలా ఆడపిల్లలు మోసపోయిన కేసులే తీసుకుంటుంది. వీలైనంతగా వారికి న్యాయం జరిపిస్తుంది. ఇప్పటివరకూ రమ్య ఎలా తప్పించుకుందని ఎవరికీ తెలియలేదు, ఒక్క సుష్మ కుటుంబానికి తప్ప.

సుష్మ పెళ్ళిలో రమ్య ఇచ్చిన ఇరవై ‘అయిదువందల నోట్లలో’ ప్రతీ నోటుమీద పెన్సిల్ తో తన సమస్యని కొంత, కొంతగా వ్రాసిందని, ముందే అనుమానించిన సుష్మ, బహుమతి తనకి ఇవ్వకుండా భర్తకి ఇవ్వడం’నా ప్రాణం మీ చేతిలో పెడుతున్నానని అనడంలో ఏదో రహస్యం ఉందని గ్రహించింది.

నోట్లన్నీ జాగ్రత్తగా చూసి, దానిమీద వ్రాసినవి లాయరైన మామగారికి చూపడం, ఆయన రమ్య వరలక్ష్మి పూజకి వచ్చినప్పుడు పోలీసుల సహాయంతో రూపం మార్చి రమ్యని తప్పించడం, ఎవరు ఊహించలేనిది. ఎంతో ఓర్పుగా అవకాశం కోసం ఎదురుచూసిన రమ్య దాన్ని తెలివిగా ఉపయోగించుకుంది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.