అనుకున్నవన్నీ జరిగితే

-యశోదాకైలాస్ పులుగుర్త

“నేనీ పెళ్లి చేసుకోలేను మమ్మీ!”

“ఏమైందే విన్నూ?”  లక్షణమైన సంబంధం కదే?  ఆ అబ్బాయి ఎందుకు నచ్చలేదు? ఎంత బాగున్నాడు అతను.  అతని అమ్మా నాన్నా ఎంత సౌమ్యంగా ఉన్నారో చూసావా?”

“మమ్మీ, నాకు నచ్చలేదంటే సవాలక్ష కారణాలు అవసరం లేదు.  ఒకే ఒక్క కారణం ఏమిటంటే అతను ఒక డబ్బా కాలేజ్ లో డొనేషన్ తో ఇంజనీరింగ్ చదివాడు.  అతని అదృష్టం మూలాన ఒక మల్టీ నేషనల్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడని ఒప్పేసుకోవాలా?  పైగా అతని సాలరీ పేకేజ్  ఏమంత గొప్పదని?  సంవత్సరానికి పదిహేను   లక్షలేమిటమ్మా, ఈ రోజుల్లో?    ఎవరికైనా చెప్పుకోవాలంటే కాస్తంత డీసెంట్ గా నైనా ఉండద్దా?  నా జీతంలో సగం జీతం వచ్చే అతగాడ్ని  నేను పెళ్లిచేసుకోవాలా?”

“ఏం, నీకు ముఫ్ఫై లక్షలు,  అతనికి పదిహేను  లక్షలు  వస్తాయి.  మీరిద్దరూ జీవించడానికి అవి సరిపోవా విన్నూ”?

“మమ్మీ సరిపోక కాదు.  కానీ, సొసైటీలో బ్రతకాలంటే ఒక స్టేటస్ ముఖ్యం.     ప్రతీ వాళ్లూ అడుగుతారు, మీ హజ్బెండ్ పేకేజ్ ఎంత అని.  ఇంతోటి గొప్ప సేలరీ  చెప్పి సిగ్గుతో చచిచిపోవాలి.  నా వల్లకాదు బాబూ.    ఇకనుండి ఇటువంటి సంబంధాలు చూడకండి.    మంచి రెప్యూటెడ్  కాలేజ్ లో చదివిన అబ్బాయి, అంతకంటే ముఖ్యం అతని సేలరీ నా పేకేజ్ తో సమానంగానో లేకపోతే  కాస్త ఎక్కువో ఉన్న సంబంధాలు మాత్రమే చూడండి.  ఇంకొకటి, రోగిస్టి అత్తగారూ, మామగారూ, వాళ్ల  బరువులూ, బాధ్యతలూ నా వల్లగాదు బాబోయ్.  ఏ బాదరబందీలు లేని సంబంధం చూడండి. అంటే అర్థం అయిందా మమ్మీ?  నేను, అతనే మా హేపీ ఫేమిలీ.  నేను ఇన్ని చెపుతున్నా మీకు అర్థం కావడంలేదు.  పనికిమాలిన సంబంధాలు తెచ్చి నన్ను విసిగిస్తున్నారంటూ”,  విస విసా నడుచుకుంటూ  వెళ్లిపోతున్న కూతురి  వైపు అచేతనంగా చూస్తూ ఉండిపోయింది అనూరాధ.

వినీత తెలివైన అమ్మాయి.  మెరిట్ లో మంచి రేంక్ తెచ్చుకుని  టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదివి కేంపస్ రిక్రూట్ మెంట్ లో మంచి జాబ్ కొట్టేసింది మంచి పేకేజ్ తో.  తను చాలా  తెలివైనదాన్నన్న అహం, పొగరూ  కూడా ఎక్కువే.  ఉద్యోగం వచ్చిన వెంటనే  సంబంధాలు చూస్తామని  తల్లీ, తండ్రి అంటే, “అప్పుడే పెళ్లేమిటంటూ, ఉద్యోగంలో బాగా స్థిరపడ్డాకా చేసుకుంటానంటూ” రెండేళ్లు దాటవేసింది.  ఇంక కూతురు అభిప్రాయంతో పనిలేదనుకుంటూ అనూరాధ సంబంధాల వేట కొనసాగించింది.  అప్పటికే హై పేకేజ్ తెచ్చుకుంటున్న వినీతకు ఏవరేజ్ సంబంధాలు మాత్రమే వస్తున్నాయి.  ప్రతీవాళ్లూ ‘మీ అమ్మాయికి మా అబ్బాయికంటే జీతం ఎక్కువ కదా, రేపు పెళ్లైతే ఇరువురి మధ్య తారతమ్యాలు, విబేధాలు  వచ్చి పెళ్లి పెటాకులు అవుతాయేమో నన్న భయాన్ని వెలిబుచ్చుతూ’   వెనక్కి వెళ్లిపోతున్నారు.

వినీత కోరుకున్నట్లు తన కంటే అన్నింటిలోనూ ఆధిక్యత ఉన్న సంబంధాలు రావడం గగనమౌతోంది.  అలా మరో రెండేళ్లు  గడచిపోయాయి.  అనూరాధకి దిగులు మొదలైంది.  ఒకరోజు వినీతను దగ్గర కూర్చోపెట్టుకుని నచ్చ చెప్పబోయింది.  “చూడు విన్నూ, ఇలా వచ్చిన సంబంధాలన్నీ వెనక్కి వెళ్లిపోతుంటే ఇంక ముందు ముందు నీకు పెళ్లి కావడం కష్టం అవుతుంది.  నీ కంటే కొన్ని విషయాలలో తక్కువ ఉన్నా సరిపెట్టుకోవాలి.  ఏ వయస్సులో జరిగే ముచ్చట ఆ వయస్సు లోనే జరగాలి వినీతా.  తరువాత పశ్చాత్తాప పడినా లాభం ఉండదు.   మనకి కావలసినట్లు అన్నీ జరిగిపోతే అది జీవితం ఎందుకు అవుతుంది విన్నూ?   సర్దుకు పోవడం అలవరచుకుంటేనే సంతోషంగా ఉండగలవు.  ఇకనుండి నీ అభిప్రాయాలను, కోరికలను కొంచెం  సడలించు.  చదువు, ఉద్యోగం మంచి మనస్సు ఉన్న అబ్బాయి చాలడా వెన్నూ?” అతని సంపాదన నీకంటే తక్కువైతే ఏమిటి నష్టం?”

తల్లి మాటలకు అంతెత్తున లేచింది వినీత.  “పెళ్లి పట్ల నా అభిప్రాయాలను సడలించలేను మమ్మీ.  నీవన్నట్లు నేను బలవంతంగా చేసుకున్నా రేపు మా మధ్య అభిప్రాయ బేధాలు వస్తే నీవు బాధ్యత వహిస్తావా?  నాకు నచ్చచెప్పాలని ప్రయత్నించకు మమ్మీ.  నాకు తగిన వ్యక్తి వస్తేనే  చేసుకుంటాను, లేకపోతే ఇలాగే ఉంటానంటూ”,  రోషంగా జవాబిచ్చేసరికి ఏమీ మాట్లాడలేకపోయింది అనూరాధ.

వినీతకు  ముఫ్ఫై సంవత్సరాలు నిండాయి.

ఆ అమ్మాయి లో ఏమీ మార్పు లేదు గానీ అనూరాధ ఒకటే   బెంగటిల్లి  పోతోంది, కూతురికి పెళ్లి కావడం లేదని.  చుట్టాలు, స్నేహితులు తమ వెనుక  వ్యంగ్యంగా మాట్లాడడం భరింపరానిదిగా ఉంది ఆమెకు. లక్షలు సంపాదించే కూతురి సంపాదనకు  ఆశపడి పెళ్లి చేయడం లేదన్న ఆరోపణలను వింటోంది.

వినీతకు ఒక అన్నయ్య, పేరు కళ్యాణ్.  వినీతకు పెళ్లి చేసిన తరువాత అతనికి చేద్దామనుకున్నారు అనూరాధ దంపతులు.  కానీ వినీతకు సంబంధం కుదరక పోయేసరికి రెండు సంవత్సరాల క్రితమే అతని పెళ్లి వైష్ణవి తో జరిగిపోయింది.  వైష్ణవి  కళ్యాణ్ ఒకే ఆఫీస్ లో కలసి పనిచేస్తున్నారు.  నిజానికి వారిది  ప్రేమ వివాహం, అయినా ఇరువైపుల పెద్దల అంగీకారంతో జరిగింది.

వైష్ణవి  కళ్యాణ్ తో సమానంగా పనిచేస్తున్నా ఎంతో ఒద్దికగా నెమ్మదిగా ఉంటుంది ఆమె ప్రవర్తన.  ఇంట్లో అందరితో కలసిపోతూ, ఇది నా కుటుంబం, ఇక్కడవారంతా నా వాళ్లనే భావంతో ప్రవర్తిస్తూ ఉంటుంది.  వినీత కు  వైష్ణవి మీద కాస్తంత చిన్నచూపు ఉన్నమాట వాస్తవం.  అన్నింటిలో తల దూరుస్తూ ఆరిందలా ఉండడం వినీతకు నచ్చదు.  స్టేటస్ మెయిన్ టైన్ చేయని వాళ్లంటే కాస్త చిన్నచూపు.

ఆరోజు ఆఫీస్ నుండి వస్తూనే కళ్యాణ్, వైష్ణవిల ముఖాలు వెలిగిపోతున్నాయి.  అప్పటికే ఆఫీస్ నుండి వచ్చేసి సోఫాలో రిలాక్స్ గా కూర్చుని టి.వి. చూస్తోంది వినీత.  “హాయ్ విన్నూ, నీ కొక గుడ్ న్యూస్!”  ఏయ్ వైషూ, నీవు చెపుతావా, లేక నేనే చెప్పేయనా?”  భార్య వైపు చిలిపిగా  చూసాడు.  “మీరే చెప్పండి కళ్యాణ్ అంటూ జవాబిచ్చేసరికి, “మీ వదినకు మేనేజర్ గా ప్రమోషన్ వచ్చిందే విన్నూ!” నేను రెండు సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్న ప్రమోషన్ ని మీ వదిన గద్దలా వచ్చి తన్నుకుపోయింది చూడవే”,  అనేసరికి, వినీత వైష్ణవి  వైపు నవ్వుతూ చూస్తూ “వావ్, కంగ్రాట్స్ వదినా!” అంటూ అభినందించింది.  విషయం తెలిసి ఇంట్లోని వారందరూ తమ హర్షాన్ని వెలిబుచ్చారు.

ఆరోజు రాత్రి ఎందుకో నిద్రపట్టని వినీత హాల్ లోకి వచ్చింది.  హాల్ పక్కనే కళ్యాణ్ వాళ్ల బెడ్ రూమ్ ఉంది. బెడ్ రూమ్ తలుపులు ఓరగా తెరిచే ఉన్నాయి.    అటువైపే వెడుతున్న వినీతకి ఆదాటుగా వాళ్ల నవ్వులు వినిపించేసరికి సభ్యత కాకపోయినా అక్కడే ఆగిపోయింది.  కళ్యాణ్ మాటలు నెమ్మదిగా ఆమె చెవులను తాకాయి.  “ఇంక రేపటినుండి నేను ఈ మేడమ్ గారికి  రిపోర్ట్ చేయాలన్నమాట!” అనేసరికి  వైష్ణవి  ఫక్కుమంటూ నవ్వింది.  “ఇందాకటి నుండి మీ తరహా గమనిస్తూనే ఉన్నాను కళ్యాణ్.  ఊరికే ‘మేడమ్ మేడమ్’  అంటూ నన్ను ఎగతాళి చేస్తున్నారు.”   చిరుకోపంతో అంటున్న వైష్ణవి  మాటలకు కళ్యాణ్ నవ్వేస్తూ, “సరదాగా అంటున్నాను లేవోయ్!”  నా భార్య నాకంటే ఎక్కువ హోదాలో ఉందంటే నాకు గర్వకారణం కాదా వైషూ?”

“కాదని అనడం లేదు శ్రీవారూ!”   ఆఫీస్ లో మేనేజర్ అయినంత మాత్రాన ఇంట్లో మీ భార్యనే కదా?”  అయినా భార్యా భర్తల మధ్య అనురాగం, ప్రేమ, ఒకరినొకరు గౌరవించుకోవడం ముఖ్యంగానీ, ఈ హోదాలూ, ఆర్థిక వ్యత్యాసాలూ అంత అవసరమా కళ్యాణ్?    ప్రస్తుత  ఐ.టీ  ఇండస్ట్రీలో  ఈ వ్సత్యాసాలు చాలా సహజం.  ఒక  కంపెనీ స్ట్రక్చర్  కి మరొక కంపెనీకి చాలా తేడా ఉంటుంది.  వర్క్ విషయం గానీ, ప్యేకేజ్ విషయం గానీ, ప్రమోషన్ పాలసీ గానీ  రక రకాలుగా ఉంటాయి.  నా డిజిగ్నేషన్ మీ కంటే  ఎక్కువ ఉండచ్చు, మీ కంటే జీతం ఎక్కువ రావచ్చు.   అలా అని నేను ఏదో పెద్ద తెలివైనదాన్నని పొంగిపోవడం అవివేకం.  నిజం చెప్పాలంటే కొత్త టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయడంలో మిమ్మల్ని మించినవారు మన గ్రూప్ లో లేనే లేరు.

“ఆ మరొక శుభవార్త కళ్యాణ్, మనిద్దరికీ కూడా మరో బ్రహ్మాండమైన ప్రమోషన్ రాబోతోంది మరో ఏడు నెలల్లో.”

“ఏమిటో ఆ ప్రమోషన్?!”  అమాయకంగా అడుగుతున్న కళ్యాణ్ మాటలకు వైష్ణవి నవ్వేస్తూ, “ఇంతటి సున్నితమైన విషయాలను అర్థం చేసుకోపోతే ఎలా?” నేనూ, మీరూ తల్లితండ్రులు  కాబోతున్నాం.”

“వావ్ వైషూ!”  ప్రమోషన్ల మీద ప్రమోషన్లను అందుకుంటున్నాం కదూ?”

ఇంక ఆ గదిలోనుండి మాటలేమీ వినబడలేదు.  వినీత మనసెందుకో అదోలా అయిపోయింది.  వారిద్దరి నవ్వులూ, సంతోషాలూ తను ఏదో కోల్పోయినట్లుగా తన మనసుమీద తీవ్ర ప్రభావం చూపెడుతున్నాయి.    అన్నయ్యా, వదినల సంతోషానికి తను అసూయ పడుతోందా?  వదిన మేనేజర్ గా ప్రమోషన్ తెచ్చుకుంది.  అయినా అన్నయ్య మీద ఎంత గౌరవం చూపెడుతోంది.  అన్నయ్య కూడా అంతే.  తనకు రాలేదన్న గిల్టీనెస్ లేకుండా వదినతో ఎంత ప్రేమగా మాట్లాడుతున్నాడు.  మనసెందుకో భారమైపోయింది.

వదిన అంటే చిన్న చూపు చూసే వినీతకు, ఇప్పుడు వదిన మీద గౌరవం పెరిగింది. అతి సాధారణంగా కనబడుతూ,  కలివిడిగా తిరిగే వదిన ఆఫీసు లో  మేనేజర్.  ఇంట్లో అతి సాధారణ గృహిణి.  కానీ ఆ భేషజాలేమీ వైష్ణవి లో మచ్చుకైనా కనపడడంలేదు.

ఒక రోజు ఉన్నట్లుండి   అనూరాధ వంటింట్లో  సడన్ గా కాల్ స్లిప్ అయి జారి పడింది.  కాలు బెణికింది.  అయిదువారాలు బెడ్ రెస్ట్ అనేసరికి వినీత కంగారు పడిపోయింది. “ఓ మై గాడ్!” శెలవు పెట్టడం కుదరదే, ఎవరినైనా లేడీ అటెండర్ ని పెడదాం”,  అనేసరికి అక్కడే ఉన్నవైష్ణవి “వద్దు వినీతా!”  ఎవరినో పెట్టడం ఏమిటి?  అత్తయ్యను ఆ మాత్రం మనం చూసుకోలేమా చెప్పు?  రెండువారాలు నేను, మరో రెండువారాలు నీవూ, వీలైతే మీ అన్నయ్స కూడా లీవ్ తీసుకుంటే సరిపోతుంది.    అత్తయ్యను చూసుకుందాం,”  అనేసరికి వినీత ముఖం క్షణ కాలం వాడిపోయింది.  “నాకు…నాకు కుదరక పోవచ్చు వదినా.  ఆఫీస్ లో ముఖ్యమైన డెడ్ లైన్స్ ఉన్నాయి.”

“పోనీలే  వినీతా, నెలరోజులు శెలవూ నేనే తీసుకుంటానులే, డోన్ట్ వర్రీ” అంటూ ఆఫీస్ కు ఫోన్ చేయడానికి  అక్కడనుండి లోపలకు వెళ్లింది.

“చూసావా విన్నూ, వైష్ణవి మంచితనం, పెద్దవారిపట్ల ఆమె చూపే ప్రేమానురాగాలు!”  ప్రెగ్నెంట్ అయినా నాకు సేవ చేయాలనే తపనను గ్రహించావా?”

అనూరాధ కూతురితో మాట్లాడడం మొదలు పెట్టింది.

“అత్త మామలకు సేవచేయలేనని, ఏ బాదరబఁధీలు లేని సంబంధాన్ని చూడమని వచ్చిన మంచి సంబంధాలన్నిటినీ కాలదన్నావ్.  వైష్ణవి  అంత పెద్ద హోదాలో ఉండీకూడా శెలవు పెట్టుకుని మరీ నాకు సేవ చేయాలనే ఆమె తపనను గ్రహించావా?  గ్రహించవు?  గ్రహిస్తే  ఇలా ఎందుకుంటావు?  పెళ్లి చేసుకోకుండా ఎండిన మ్రోడులా, నీ చుట్టూ గిరి గీసుకుని, నీ ఆశయాలే గొప్పవంటూ బ్రతికేస్తున్నావు.  ముఫ్ఫె మూడు సంవత్సరాలు వచ్చినా నీకు నచ్చిన సంబంధం దొరకలేదంటే హాస్యాస్పదంగా అనిపిస్తోంది.”

“మమ్మీ, వదినని ఎప్పుడూ  నెత్తిమీద పెట్టుకుని వెనకేసుకొస్తావు.  ఆవిడగారేమో గొప్పకోసం తెగ తాప్రతయ పడిపోతున్నారు.    ఈ మధ్య నీలో మార్పు బాగా కనపడుతోంది.  నాతో ముభావంగా ఉండడం, కసురుకోవడం, నేను కనిపించగానే లోపలికి వెళ్లిపోతున్నావు.”

“అవును విన్నూ, తల్లితండ్రుల మాటలను  గౌరవించలేని నీమీద ప్రేమ ఎందుకుంటుంది చెప్పు?”  పరాయింటి నుండి వచ్చిన వదినను చూడు.  తనేదో మెప్పుకోసం తాపత్రయ పడుతోందని నీవనుకోవడం  సబబు కాదు.  అది  పెద్దవారిపట్ల ఆమె చూపే గౌరవం, ఆదరణ.   ఆమెను కన్న తల్లితండ్రులు అదృష్టవంతులు.

“అంటే?”  మీరు  నన్ను కన్నందుకు దురదృష్టవంతులన్నమాట. నీ కూతురే నీకు కానిదైనపుడు నేను ఇక్కడ ఉండడంలో అర్థం లేదు.  ఎక్కడికైనా వెళ్లిపోతానంటూ ఏడుస్తూ లోపలికి వెళ్లిపోయింది.”

రోజులు యాంత్రికంగా గడచిపోతున్నాయి.

ఆరోజు ఆఫీస్ సమయంలో వైష్ణవి వినీతకు ఫోన్ చేసి “అర్జెంట్ గా నా ఆఫీస్ కు రాగలవా ఇప్పుడే, నీతో  ముఖ్యమైన పనుందంటూ” మాట్లాడింది.

ఏం పనబ్బా అనుకుంటూ వినీత వెళ్లేసరికి వైష్ణవి సీట్ ఎదురుగా ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు.  ఇద్దరూ నవ్వుకుంటూ  ఏదో మాట్లాడుకుంటున్నారు.

వినీతను చూడగానే వైష్ణవి  పలకరింపుగా నవ్వుతూ  అక్కడ మరో సీట్ ఆఫర్ చేసింది.

“బై ది బై మీట్  మిస్టర్ ప్రవీణ్!”

“ప్రవీణ్, షీ ఈజ్ వినీత, మై సిస్టర్ ఇన్లా!”

అనగానే ఇద్దరూ పరస్పరం ‘హాయ్’ చెప్పుకున్నారు.

చూడడానికి బాగున్నాడు.   హుందా గా కనిపిస్తున్నాడు.

“ఒక్క నిమిషం ప్రవీణ్!” అంటూ వినీత ను అక్కడనుండి  కాస్త దూరంగా తీసుకుపోయింది.

“సారీ వినీతా, నేను ఎక్కువ చొరవ చూపిస్తున్నానని అనుకోబోతే ప్రవీణ్ నాతోనే పనిచేస్తున్నాడు.  అదివరకు ఎక్కడెక్కడో పనిచేసాడు.  రెండు సంవత్సరాలైంది మా కంపెనీకి వచ్చి.  మా టీమ్ లోకి వచ్చినప్పటినుండి అతన్ని నిశితంగా గమనిస్తున్నాను.  మంచివాడు, సహృదయుడు.  సంబంధాలేమీ కుదరడంలేదని తెలిసింది.  నీ విషయం చెప్పాను.  నీతో మాట్లాడడానికి ఒప్పుకున్నాడు.  అందుకే నిన్ను పిలిపించాను.  నీకు అన్నివిధాలా నచ్చితేనే సుమా.  ఇందులో మొహమాటాల ప్రసక్తి లేదు.  వదిన ఏదైనా అనుకుంటుందని మాత్రం భావించకు.  అయినా నీకు నేను చెప్పాలా వినీతా?  ఎంతో తెలివైనదానివి, అన్ని విషయాలలో అవగాహన ఉన్నదానివి.  స్వతంత్రంగా ఆలోచించగలవు.  మీరిద్దరూ మాట్లాడుకుని నిర్ణయించుకోండి.  అల్ ది బెస్ట్ అంటూ తిరిగి తన సీట్ వద్దకు తీసుకు వచ్చింది.

“బై ది బై, నాకు అర్జెంట్ మీటింగ్ ఒకటి ఉంది.  నేను మీతో జాయిన్ అవలేను, ఐయామ్ సారీ, యూ గైస్ కెన్ కేరీ ఆన్ అంటూ” వైష్ణవి  వారిరువురికీ ‘బై’ చెప్పి వెళ్లిపోయింది.  ప్రవీణ్ తో కలసి వినీత ఆఫీస్ కెఫ్టీరియా లోకి దారితీసింది.

“ఇలా నాతో  రావడం మీకు ఇబ్బందిగా లేదు కదా!”  అంటూ చాలా పొలైట్ గా ప్రశ్నించాడు ప్రవీణ్.

లేదంటూ తలూపింది.

“చూడండి వినీతా, వైష్ణవి మేడమ్ మీ గురించి అంతా చెప్పారు.  ఇందులో దాపరికాలూ, ముఖమాటాల ప్రసక్తి ఉండకూడదు.  దాదాపు ఏడు సంవత్సరాలనుండి మా పేరెంట్స్ నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నాకు వర్కింగ్ ఉమెన్ ని చేసుకోవాలన్న కోరిక.   కానీ నా ప్రొఫైల్ ఏ అమ్మాయికీ నచ్చడం లేదు.  కారణం వాళ్లు కోరుకుంటున్న హై స్టేటస్  ప్రొఫైల్ కాదు నాది.  మాది సాధారణ మధ్యతరగతి కుటుంబం.  ఇద్దరు చెల్లెళ్లు, అమ్మా నాన్న.  నాన్న సంపాదనతో నా ఇంజనీరింగ్ చదువు, చెల్లెళ్ల పెళ్లిళ్లు జరిగిపోయాయి.  నాన్న రిటైర్ అయ్యారు.  అమ్మా, నాన్న బాధ్యత నాదే. చెల్లెళు పుట్టింటికి వస్తూ వెడుతూ ఉంటారు.   నా పేకేజ్  సంవత్సరానికి ఇరవై లక్షలు మాత్రమే.  సో,  అమ్మాయిలకు నా కుటుంబ బేక్ గ్రౌండ్,  సేలరీ అకర్షణీయంగా లేని కారణంగా ముఫ్ఫె అయిదు సంవత్సరాలు వచ్చినా అవివాహితుడిగా ఉండిపోయాను.  నాకు బాధేమీ లేదుగానీ, మా అమ్మా నాన్నా నా పెళ్లి గురించి అదే పనిగా బాధపడిపోతున్నారు.

“వైష్ణవి మేమ్ మీ గురించి అంతా చెప్పారు. తమ భవిష్యత్ పట్ల ఒక్కొక్కరికి ఒకో రకమైన అభిప్రాయాలు, కోరికలు ఉండడం లో తప్పులేదు.  మీ గురించి నాకేమీ సందేహాలు లేవు.  కానీ ఒక్కటి  మాత్రం నిజాయితీగా చెపుతున్నాను.    మిమ్మల్ని చూసిన ప్రథమ వీక్షణంలోనే, మీరు నాకు ఎంతో దగ్గరవారన్న భావం మనసులో చోటుచేసుకుంది.   మీకు నా పట్ల  ఏమైనా సందేహాలుంటే,  ప్లీజ్ ఫీల్ ఫ్రీ వినీతగారూ!”  నేను మీకు భాగస్వామిని   కాగలిగే అర్హతలుంటే మీ అంగీకారాన్ని తెలపండి.”  ఒక వేళ నచ్చకపోయినా మనం ఎప్పటికీ మంచి స్నేహితులమే.   ఇంక వెడదామా అనుకుంటూ ‘బై’  చెప్పుకుని వచ్చేసారు.

ఆఫీస్ కు తిరిగి వచ్చిన  వినీత కు  ప్రవీణ్ రూపం, అతని హుందాతనం మాటి మాటికి గుర్తొస్తున్నాయి.  తనకు పెళ్లి చేసుకోవాలన్న కోరిక లేదా?  ఎందుకు లేదు?  అందరూ తన గురించి తప్పుడు అభిప్రాయంతో ఉన్నారు.    తన కొలిగ్స్, క్లాస్ మేట్స్ అందరికీ పెళ్లిళ్లు అయిపోయి పిల్లలని కూడా కనేసారు.  పిల్లల బర్త్ డే పార్టీస్ కు, మేరేజ్ డే  ఫంక్షన్స్ కి పిలిస్తే తాను మాత్రం ఒంటరిగా వెడుతుంది.  ఒకోసారి ఎంతో దిగులుగా, ఒంటరిగా ఉన్నానన్న ఫీలింగ్స్  మనసుని దొలిచేస్తాయి.   పెళ్లి చేస్తామన్నప్పుడు తనకంటే అన్నివిధాలా ఆధిక్యత ఉన్న వాడిని కోరుకుంది. ఎన్నో సంబంధాలు వచ్చినా తనకు నచ్చలేదు,  ఇప్పుడు ఏ సంబంధాలూ రావడం లేదు.   ఇలా మరికొంత కాలం గడిస్తే తను చివరకు బ్రహ్మచారిణిగా మిగిలిపోవడం ఖాయం.

వైష్ణవి  ఆ ఇంటికి కోడలిగా వచ్చినప్పటినుండి తను గమనిస్తోంది.  తన వృత్తిని, కుటుంబాన్ని సమంగా బేలెన్స్ చేసుకుంటూ ఒక మంచి కోడలిగా తమ కుటుంబంలో ఇమిడిపోయింది.  మరి తను వదిన కంటే ఏ విషయంలోనూ  గొప్పది కాదే!  తనే గొప్పది అనుకుంది ఇన్నాళ్లూ.   తనకూ ఒక మంచి భర్త, ఒక కుటుంబం కావాలనిపిస్తోంది.

ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత వినీత మనసు తేలికగా అయిపోయింది.

ఆరోజు రాత్రి తల్లి పక్కనే పడుకుంది వినీత.  వినీత తన పక్కనే పడుకుందని, ఏదో విశేషమే ఉందనుకున్న అనూరాధ కూతురితో మాట్లాడకుండా ముభావంగా పక్కకు తిరిగి పడుకుంది.

“అమ్మా, నీతో మాట్లాడాలి, ఇటువైపు తిరిగి చూడంటూ” తల్లిని అంటుకుపోయింది.

“నేను…పెళ్లి చేసుకుందా మానుకుంటున్నాను అమ్మా!” వదిన కొలిగ్ నాకు నచ్చాడమ్మా.  వింటున్నావా?

అనూరాధ దిగ్గున కూతురివైపుకి తిరిగింది.  సంభ్రమంగా కూతురివైపే చూస్తూ, “మరి ఆ అబ్బాయి సేలరీ, చూసుకోవలసిన అతని తల్లితండ్రులూ నచ్చాయా మరి?”

“అమ్మా!” గారంగా తల్లి గుండెల్లోకి ఒదిగిపోయింది.  “అన్నీ నచ్చాయమ్మా, ఇన్నాళ్లూ మూర్ఖత్వంతో ఆలోచించానే తప్పించితే విజ్నతతో కాదు.  భార్యాభర్తల మధ్య ఉండాల్సింది చక్కని అవగాహన, పరస్పర ప్రేమానురాగాలు తప్పించితే జీతాలూ, హోదాలూ కావని వదిన నిరూపించింది.  వదిన నాకు ఆదర్శం.  ఇన్నాళ్లూ ఒక భ్రమలో బ్రతికానే తప్పించితే వాస్తవంలో కాదు.  నిన్ను బాధ పెట్టినందుకు క్షమించమ్మా అంటూ” కళ్ల నీళ్లు పెట్టుకుంటున్న తన చిన్నారి కూతురిని ఆనందంతో గుండెలకి  హత్తుకుంది.

మరో నెలరోజుల్లో వినీతా, ప్రవీణ్ లు పెళ్లి చేసుకుని ఒకటైనారు.  పెళ్లి దుస్తుల్లో బంగారు బొమ్మలా, మెరిసిపోతున్న విన్నూని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది వైష్ణవి.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.