ప్రశ్నల తెరచాట్లు

-డా.నూకరాజు బెందుకుర్తి

ప్రశ్నలే నీడలు కాదు
అవి సూర్యకిరణాల సుడిగుండాలు,
మాయాపటలాలు చించి
ఆత్మను తెరిచే కత్తిపీటలు.
సముద్రం లోతుల్లో మునిగినట్లు,
ప్రతి “ఎందుకు?” అనేది మనస్సు ముంచుతుంది,
మౌనంలో తేలియాడే నిజాలు
ఉప్పు నీటి తెల్లని స్పటికాల్లా మెరుస్తాయి.
అజ్ఞానపు గోడలు కూల్చేది సమాధానాలు కాదు,
అడగడం అనే నిప్పురవ్వలు!
సోక్రటీస్ పెట్టిన ప్రశ్నల మంటలు మరెప్పటికీ ఆరవేమో?
ఆత్మ శుద్ధి యజ్ఞంలో ధూమం ఎగిరింది.
“ఏది/ఎలా?” అనే ఉల్కాపాతం
మనస్సు ఖాళీలో సృష్టిస్తుంది నక్షత్రాలు.
ప్రశ్నలనే పిడుగుల్లో
మనస్సు చెక్కుచెదరగా
ఏకక్షణంలోనైనా మాయలు పగిలి
నిశ్శబ్దపు సంగీతం పుట్టక మానదు.
జిడ్డు కృష్ణమూర్తి అడిగినట్లు: “ప్రశ్న సమాధానమా?”
అన్వేషణలోనే జీవిత సారం!
తెలివి అనేది పుస్తకాల్లో కాదు
ప్రశ్నాత్మక చూపుల ఎదుగుదల.
ప్రశ్నల సాగరంలో మునిగితే
మనిషి కనుగొంటాడు తన నక్షత్రాల్ని
సమాధానాల తెరచాట్లు వదిలి
అడగడం నేర్చుకోవడమే జ్ఞానయాత్ర!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.