
వ్యాధితో పోరాటం-39
–కనకదుర్గ
“ఓకే, ఓకే… ఇదిగో వెళ్తున్నా…” అని కర్టెన్ తీసి అటువైపు నిల్చున్నాడు. నర్స్ తన ముందునుంచే వెళ్ళినా ఏం చెప్పలేదు. ఆమెకి చెప్పినా, ’ఇపుడేగా ఇచ్చింది, కాసేపయ్యాక వచ్చి చూస్తాను,’ అని అంటుందని నాకు తెల్సు.
కానీ భరించలేని ఈ నొప్పితో శ్రీని పైన కోపం వస్తుంది. మళ్ళీ నాకే అనిపిస్తుంది, ’పాపం తను మాత్రం ఏం చేస్తాడు?’
ఆ తర్వాత రెండు సార్లు అరగంటకి, మళ్ళీ గంటకి ఇచ్చారు. దాంతో కొంచెం కళ్ళు మూతలు పడ్డాయి, కానీ నిద్రలో కూడా కదిలితే నొప్పి తెలుస్తుందని కదలకుండా పడుకున్నాను.
ఒకరోజు డా.రిచర్డ్ దగ్గరికి వెళ్ళాం రోజూ వస్తున్న నొప్పి గురించి మాట్లాడటానికి.
“ఒకోసారి వేరే పద్దతుల వైద్యం తీసుకుని ప్రయత్నం చేస్తే ఈ నొప్పి తగ్గొచ్చేమో! నా కుడి చేతికి టెన్నిస్ ఆడి ఆడి ’టెన్డనైటిస్,’ నొప్పొచ్చింది అన్నీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను, అన్ని మందులు వాడాను కానీ నొప్పి మాత్రం తగ్గలేదు. అపుడు నా ఫ్రెండ్ ఒకతను “ఆక్యూపంక్చర్,” చేయించుకున్నాను. మీరు కూడా ప్రయత్నం చేయొచ్చు కదా!” అన్నాడు.
నేను, శ్రీని ఇద్దరం ఆశ్చర్యపోయాము. “మీరు వేరే వైధ్య పద్దతులు ప్రయత్నం చేయమంటున్నారా?” అన్నాను నేను.
“ఏం? ఎందుకు చేయకూడదు. అలోపతి ఒకటే వైధ్యం కాదు కదా! మీ ఇండియాలో ఆయుర్వేదం, చైనా వాళ్ళ ఆక్యూపంక్చర్, హర్బల్ మెడిసన్, మూలికలతో తగ్గించే వైద్యం, హోమియోపతి, ఇలా వివిధ పద్ధతులున్నాయి. అలోపతిలో ఒక్కటి మంచిదేమిటంటే ఏ జబ్బులోనయినా ఎమర్జెన్సీలో సర్జరీలు చేసి ప్రాణాలు బ్రతికిస్తారు. ఈ పద్దతి ఒక్కటే ప్రయత్నం చేయాలని లేదు కదా! నా దగ్గర అందరి విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయి. ముందు ఆక్యూపంక్చర్ ప్రయత్నం చేయండి, నా ఫ్రెండ్ కార్డ్ ఇస్తాను….”
“హోమియోపతి ప్రయత్నం చేయొచ్చా?” అన్నాను ఆయన మాట పూర్తి కాకుండానే.
“తప్పకుండా! నా దగ్గర ఆ డాక్టర్ విజిటింగ్ కార్డ్ కూడా వుంది….” అని రెండు కార్డులు తీసి ఇచ్చారు.
” ఫిలడెల్ఫియాలో “సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ మెడిసన్,” అని వుంది. అక్కడికెళితే అన్నీ రకాల వైద్యాల గురించి రిసెర్చులు చేస్తారు, అలాగే ట్రీట్మెంట్ ఇస్తారు. అక్కడికెళ్ళొచ్చు మీరు. ముందు ఆక్యూపంక్చర్ ప్రయత్నం చేయండి. నాకు ఇది పనిచేస్తుందనిపిస్తుంది. ఆ తర్వాత కావాలంటే ఫిలడెల్ఫియాలోని సెంటర్ కి వెళ్ళొచ్చు.” అన్నాడు డా.రిచర్డ్.
“సరే డాక్టర్, థ్యాంక్యూ సో మచ్ ఫర్ యువర్ సజెషన్స్. మాకు ఇపుడు ఆశ మళ్ళీ తిరిగివస్తుంది, మీ సలహా వల్ల. లేకపోతే జీవితాంతం ఈ నొప్పితో ఇలాగే ఉండాలేమో అని భయంగా ఉండేది.” అని ధన్యవాదాలు చెప్పేసి వచ్చాము.
కొన్నాళ్ళు ఆక్యూపంక్చర్ ప్రయత్నం చేసాము. కానీ ఆ డాక్టర్ కూడా అన్నీ రిపోర్ట్స్ చూసి, “నేను ట్రీట్మెంట్ ఇస్తాను కానీ మీకు నొప్పి ఎక్కువయితే మాత్రం ఎమర్జెన్సీకి వెళ్ళిపోవాలి,” అని చెప్పారు.
మేము “సరే,” అన్నాము. ఫస్ట్ టైం ప్రయత్నించినపుడు సూదులతో ట్రీట్ చేస్తారు కాబట్టి నాకు కొంచెం భయమేసి డాక్టర్ ని అడిగాను, “చాలా నొప్పి లేస్తుందా?” ఆయన నా వైపు చూసి చిన్నగా నవ్వారు.
“నేను పెడతాను మీరే చెప్పండి. నౌ జస్ట్ రిలాక్స్!” అని కడుపు పైన కొన్ని పెట్టారు. నేను కళ్ళు మూసుకున్నాను, నొప్పి తెలుస్తుందనుకుని. డాక్టర్ కళ్ళు తెరవమన్నారు. ఇంకా పెట్టాలేదనుకున్నాను. ఎక్కడెక్కడ పెట్టాలో అక్కడ పెట్టి వున్నాయి సన్న సూదుల్లాంటివి. “నాకు తెలియనేలేదు మీరు పెట్టింది, అందరు ఎంత భయపెట్టారో,” అన్నాను.
” అందరికి కొద్దిగా తెలుస్తుంది, మీకు అస్సలు తెలియలేదా?”
“చీమ కుట్టినంత కూడా అనిపించలేదు. నేను మీరు ఇంకా రెడీ చేస్తున్నారనుకున్నాను. ఎక్కడెక్కడ పెట్టాలో మీరు అక్కడ మార్క్ చేసుకుంటున్నారనుకున్నాను.”
సూదులు పెట్టింతర్వాత ఆయన ఒకోసారి అరగంట, ఒకోసారి నలభై అయిదు నిమిషాలకి అలార్మ్ పెట్టేవారు. అవి తీసింతర్వాత కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళేవాళ్ళం. అలా కొన్నాళ్ళు ఆక్యూపంక్చర్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. శ్రీని వారంలో రెండు సార్లు తీసుకెళ్ళేవాడు. ఎప్పుడూ మొహంలో విసుగు కానీ చికాకు కానీ కనిపించనిచ్చేవాడు కాదు అస్సలు. ఇంట్లో అమ్మ ఉంది కాబట్టి స్కూల్ నుండి చైతన్య రాగానే వెళ్ళేవాళ్ళం. అమ్మ ఒక్కతే ఇంట్లో ఉంటే భయపడ్తుంది, డిష్ వాషర్లు, ఒవెన్, మైక్రోవేవులు అలవాటు లేవు, అదీ కాకుండా మేము లేనపుడు ఎవరన్నా వస్తే ఎలా? తనకి ఇంగ్లీషు మాట్లాడడం రాదు కదా అని అమ్మకి భయం. చైతన్య ఉంటే పక్కన తనకి ధైర్యంగా వుండేది.
కడుపులో ఎప్పుడూ నొప్పి తెలుస్తూ వుండేది. ఆక్యూపంక్చర్ మొదలు పెట్టింతర్వాత కొంచెం మెరుగ్గా అనిపించసాగింది. అయినా కూడా తగ్గిపోతుందని సంతోషించాలో, లేదో ఇంకా తెలియదు. ఇలాగే తగ్గిపోతే బావుండు అని అనుకుంటూ వుండేదాన్ని. సాయంత్రాలు చైతన్య వాడి స్నేహితులతో ఆడుకుంటుంటే నేను, అమ్మ స్ఫూర్తిని ఎత్తుకుని బాల్కనీలో కూర్చొని చూస్తుండేవారం. స్ఫూర్తి ఎప్పుడూ అన్న ఎక్కడ ఉంటే అటే చూస్తూ ఉండేది. శ్రీని దాన్ని ఎత్తుకుని నిల్చుంటే చైతన్య దానితో దోబూచులాడేవాడు. అలాగే ఒకరోజు ఆడిస్తూ ఉంటే పకపకా అని గట్టిగా ఒకటే నవ్వడం. అప్పటివరకు చిరునవ్వులు చిందిస్తున్న పాప అదే మొదటిసారి గట్టిగా నవ్వడం. నా చేతిలో అపుడు వీడియో కెమెరా లేదు కానీ మామూలు కెమెరా ముందు రూమ్ లో కనపడగానే తీసుకుని ఫోటో తీసాను. ఇలాంటి చిన్న చిన్న సంతోషాలు ఎంతో ఆనందాన్నిచ్చేవి. నేను అంత అనారోగ్యంగా వున్నా పాప ఆరోగ్యంగా పుట్టడం, చక్కగా ఆనందంగా పెరుగుతూ ఉంటే శ్రీనికి, నాకు ఎంతో సంతోషంగా ఉండేది.
ఆక్యూపంక్చర్ చేయించుకుని వచ్చి ఆ రోజు సాయంత్రం స్ఫూర్తికి స్నానం పోసాను. ఈ మధ్యే పాప ఘనాహారం తింటుంది, తినిపించాను. కానీ నాకు చాలా నీరసంగా అనిపించడంతో సోఫాలో ఆనుకుని పడుకున్నాను. చిన్న కునుకు పట్టింది. కునుకు మధ్యలోనే వీపులోనుండి ముందుకి భరించలేనంత నొప్పి, దాంతో పాటు గట్టిగా అరుపు వచ్చి ఊపిరి పోయినట్టుగా అనిపించింది. అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ తర్వాత అంతా మామూలే, ఎమర్జన్సీ వార్డుకి పరిగెత్తడం, రక్తపరీక్షలు, సీ.టి స్కాన్లు, నొప్పికి ఇంజెక్షన్లు, హాస్పిటల్లో చేర్చుకుని నొప్పి ఎక్కువగా ఉన్నపుడు డాక్టర్లు పెయిన్ పంప్ ఇచ్చేవారు. పది నిమిషాలకొకసారి బటన్ ప్రెస్ చేస్తే ఒక డోస్ మందు వచ్చేది. అలా పది, పది నిమిషాలకు చేసుకుంటుంటే ఒకట్రెండు రోజుల్లో కొద్దిగా కంట్రోల్లోకి వచ్చేది. రక్త పరీక్షలో ఈ సారి అమెలైజ్, లైపేజ్ లెవెల్స్ పెరగలేదు. కానీ అలాగని నొప్పి ఉండదని కాదు. అయితే సర్జరీ తర్వాత వచ్చిన నొప్పి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న అటాక్స్ అపుడపుడు వస్తూ ఉంటాయి పూర్తిగా కోలుకునే దాక అన్నారు. సరే ఇది తగ్గేవరకు వచ్చే చిన్న అటాక్స్ అట. ఇది చిన్న అటాకా? ఇలాంటివి ఇంకా వస్తాయా?
డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చి కొన్నాళ్ళయ్యాక డా.రిచర్డ్ ఇచ్చిన హోమియోపతి డాక్టర్ తో సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ , అప్పాయింట్మెంట్ తీసుకుని వెళ్ళాము. వాళ్ళు ముందే ఇప్పటి వరకు జరిగిన ప్రొసీజర్స్, సర్జరీ, చేసిన రకరకాల టెస్ట్స్ అన్నీ రిపోర్ట్స్ తీసుకుని రమ్మన్నారు. ముందు డాక్టర్ హెన్రీ మమ్మల్ని కల్సి మా నోటి ద్వారా ఎట్లా, ఎపుడు, ఎక్కడ మొదలయ్యిందీ జబ్బు, నొప్పి వచ్చినపుడు ఎలా ఉంటుంది, ఎన్ని రోజుల్లో తగ్గుతుంది లాంటి ప్రశ్నలు వేసి అన్నీ విన్నారు. ఆ తర్వాత మమ్మల్ని వాళ్ళ దగ్గర ఉన్న రకరకాల ట్రీట్మెంట్స్ అన్నీ చూడండి అని ఒక న్యూట్రీషియన్ని చూపించి ఆయనతో అన్నీ చూసి రమ్మన్నారు. తను ఈ లోపల నా రిపోర్ట్స్ అన్నీ స్టడీ చేసి మళ్ళీ మమ్మల్ని కలుస్తానన్నారు.
మేము ఆ బిల్డింగ్ లో వున్న అన్నీ రకాల వైద్యాలు చూసాము. హోమియోపతి, ఆయుర్వేదంలో వివిధ రకాల నూనెలతో శరీరానికి మర్ధనాలు, శరీర ఇతర భాగాలకి విడిగా కూడా మర్దనాలు చేస్తున్నారు. కొంతమంది డాక్టర్లు పేషంట్లను చూసి ఆయుర్వేదం మందులిస్తున్నారు. మరో విభాగంలో రకరకాల పూలతో ప్యాక్స్ చేసి కాలుకి సమస్యుంటే ఆ కాలు సమస్యకి బాగా పని చేసే పూలు, మూలికలు ఉపయోగించి చల్లటి బట్టలో పెట్టి కాలుకి చుట్టారు. సమస్యని బట్టి చల్లటి నీళ్ళతో, లేదా బట్ట, వేడి నీళ్ళు, వేడి బట్ట వాడతారు. ఈ వైద్యం చేసే గది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక బల్లపైన పేషంట్ని పడుకోబెడతారు ఆ పూల, మూలికల ప్యాక్ ని చుట్టి, సన్నగా భారతీయ సంగీత వాయిద్యాల టేప్ పెట్టి, ఒకటి, రెండు అగరుబత్తులు, ఒక నల్లబండతో చేసిన చిన్న జలపాతంలాంటిది ఉంది. నీళ్ళు పైనుండి మెల్లిగా కింద పెట్టిన ఒక పింగాణి గిన్నెలో పడుతుంటే ఎంతో హాయిగా అనిపిస్తుంది. అన్ని సమస్యలు మర్చిపోయి హాయిగా సన్నగా వినిపిస్తున్న సంగీతం వింటూ, మంచి సువాసనలు వెదజల్లే పూల, మూలికల సువాసనతో పేషంట్లు వాళ్ళకి తెలియకుండానే ప్రశాంతమైన నిద్రలోకి జారుకుంటారు. నాకు ఇది చాలా నచ్చింది. మరో విభాగంలో యోగా, మెడిటేషన్, చేయిస్తారు. అలాగే చైనీస్ వైద్యం కూడా అక్కడ ఇస్తుంటారు. ఒకోసారి క్యాన్సర్ ఆఖరి స్టేజ్ లో ఉండి మరో వారం, పది రోజుల్లో చనిపోతారనుకున్నవారు ఇక్కడికి వస్తే వారికి వైద్యం చేసి వారి ప్రాణాలను కాపాడారు.
డా. హెన్రీగారు నా రిపోర్ట్స్ చూసాక,”ఇది చాలా కాంప్లికేటడ్ కేస్. నేను పాన్క్రియాస్ బలంగా అవ్వడానికి దాని దగ్గరే వారానికి ఒకసారి ఇంజెక్షన్ ఇస్తాను, దాంతో పాటు హోమియో మందులు కూడా ఇస్తాను, నేను చెప్పిన విధంగా వేసుకొండి. ఆక్యూపంక్చర్ ఎన్ని రోజులు పని చేసింది?”
“రెండున్నర వారాలు పని చేసింది. తర్వాత నొప్పి వచ్చింది.”
“అదే నేను చెబ్తున్నాను, నేను ప్రయత్నిస్తాను, ఈ వైద్యం పని చేసి మీరు మామూలు మనిషైతే మాకు చాలా తృప్తిగా ఉంటుంది. కానీ మీకు నొప్పి వస్తే మాత్రం ఎమర్జెన్సీకి వెళ్ళీపోవాలి. అస్సలు సమయం వృధా చేయకూడదు.” అని చెప్పారు.
నాకు కొంచెం నిరాశగా అనిపించింది. “అంటే మళ్ళీ నొప్పి వచ్చే అవకాశం వుందంటారా?” అని అడిగాను మెల్లిగా. “రాదనే అనుకుని మొదలు పెడ్దాము. ఏమో మనం సక్సెస్ అవుతామేమో!” అన్నారు డాక్టర్.
ఆ తర్వాత వారానికి రెండుసార్లు ఆయన దగ్గరకు వెళ్ళడం ఆయన ఇంజెక్షన్స్ ఇవ్వడం, అలాగే పూలు, మూలికలతో చేసే వైద్యం కూడా మొదలుపెట్టారు. పాపం శ్రీని ఆఫీస్ వదిలేసి వారానికి రెండుసార్లు నన్ను ఇక్కడికి తీసుకొచ్చేవారు.
నెల కాగానే ఒక అర్ధరాత్రి విపరీతమైన నొప్పి వచ్చింది. మళ్ళీ అదే సీన్ రిపీట్, ఎమర్జన్సీ, నొప్పికి ఇంజెక్షన్లు, సిలైన్ ఎక్కించడం, అడ్మిట్ చేసుకుని నొప్పి తగ్గేవరకు ఉంచుకుని డిశ్చార్జ్ చేసారు.
కోలుకునేవరకు ఇలా అపుడపుడు వస్తుందన్నారు కానీ ఇన్ని సార్లు వచ్చేవరకు డాక్టర్లకు అనుమానం రావడం మొదలుపెట్టింది. మొదటి సర్జరీతో పూర్తిగా సమస్య తీరినట్టు లేదు. మళ్ళీ సర్జన్ దగ్గరికి వెళ్ళమన్నారు. నాకు మళ్ళీ ఆ హాస్పిటల్ కి వెళ్ళాలనిపించలేదు. డాక్టర్లు ప్రతి వారం ఇంటికి విజిటింగ్ నర్స్ వచ్చేలా ఏర్పాటు చేసారు. జెన్నీ, చాలా ఫ్రెండ్లీగా ఉండేది. తనే ఒక మంచి వేరే హాస్పిటల్లో పాన్క్రియటైటిస్ డిసీజస్ విభాగానికి అధిపతిగా పని చేస్తున్న సర్జన్ డా. రొసాటో గారి ఫోన్ నెం సంపాదించి ఇచ్చింది. అప్పాయింట్మెంట్ ౩ నెల్ల తర్వాత దొరికింది.
ఈ లోపల నాకు మళ్ళీ నొప్పి ఎక్కువగా రావడం నేను ఎప్పుడు చేరే హాస్పిటల్లో చేరడం జరిగింది. తిండి పూర్తిగా తగ్గిపోయి బరువు చాలా తగ్గి సన్నగా అయిపోయాను. డా. రిచర్డ్ ఊళ్ళో లేరని మరో డాక్టర్ వచ్చి చూసేవారు. ఆ గ్రూప్ లో పని చేసే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్స్ అందరూ చాలా బాగా చూస్తారు. పొద్దున్నే వచ్చి చూసి వెళ్ళాడు, మళ్ళీ మధ్యాహ్నం వచ్చి మాట్లాడతానన్నాడు. అమ్మ నా దగ్గరే కూర్చొని ఉంది. “నేను వచ్చినపుడు బాగానే వున్నావే, రాను రాను తిండి తినక సరిగ్గా నొప్పి వల్ల ఎంత సన్నగా అయిపోయావో తల్లి! ఈ ఆసుపత్రిలో డాక్టర్లు, సర్జన్స్ బాగానే ఉన్నట్టున్నారు. మరి ఇక్కడ ఎందుకు చేయరు నీకు సర్జరీ?’ అంది అమ్మ.
“కాదమ్మా ఇది చిన్న ఆసుపత్రి. సిటీలో అయితే పెద్ద పెద్ద యునివర్సిటీ హాస్పిటల్స్ వుంటాయి, మంచి అనుభవమున్న సర్జన్స్ ఉంటారు.” అని చెప్పా.
శ్రీని మధ్యాహ్నం ఆఫీస్ నుండి వచ్చాడు డాక్టర్ ఏం చెబ్తారా అనే ఆత్రంతో. ౩ గంటలకు వచ్చాడు. “మీకు చేసిన సర్జరీ సగం సర్జరీయే చేసారు. ఇపుడు మరి కొన్ని అడ్వాన్స్ అయిన పరీక్షలొచ్చాయి. ఆ పరీక్షలు చేస్తే అసలు సమస్య ఏమిటి అనేది తెలుస్తుంది. దాని తర్వాత సర్జరీ చేస్తారనుకుంటాను, ఇక దాని తర్వాత మీరు పూర్తిగా మామూలుగా అయ్యే అవకాశం ఉంది. కానీ అప్పటిదాక మీకు న్యూట్రిషన్ కావాలి కదా….”
“మళ్ళీ టి.పి.ఎన్ పెడతారా? అది నాకు పడదు. నాకు వాంతులు, విరేచనాలవుతాయి…”
“నో, నో, నో! టి.పి.ఎన్ కంటే బెటర్ ఆప్షన్ వుంది ఇపుడు. ఒక చిన్న సర్జరీ చేసి చిన్న కన్నం చేసి దాని ద్వారా ఒక ట్యూబ్ చిన్న పేగుల్లోకి పంపిస్తారు. దాన్నే జే ట్యూబ్ అంటారు. ఇది చాలా మందికి జీవితాంతం వుంటుంది అస్సలు తినలేని వారికి. కానీ మీకు సర్జరీ అయ్యి కోలుకుని ఆహారం తినేవరకు వుంచి, తింటుంటే ఏ సమస్య రాకుంటే అపుడు తీసేస్తారు….”
నాకు చాలా చిరాకుగా ఉంది, తిండి లేక నీరసంతో కొంత …. ఆయన చెప్పే ప్రొసీజర్ గురించి చెబుతుంటే ఇవన్నీ చేయించుకుంటూ బ్రతికుండడం అవసరమా అని పిచ్చి ఆలోచన వచ్చింది.
“ఇదంతా చేయడం ఎందుకు? వై డోంట్ కిల్ మి? ఐ కాంట్ టేక్ ఆల్ దిస్….” అని కొంచెం అరిచాను.
ఆ డాక్టర్ మొహం పాలిపోయింది.
ఆయన ఇంకేం మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు. శ్రీని ఆయన వెంట పరిగెత్తాడు.
“సారీ డాక్టర్! ఐ అపాలజైజ్ ఆన్ బిహాఫ్ హర్. తను బాగా డిప్రెస్ అయ్యింది….”
” ఐ కెన్ అండర్ స్టాండ్! ఎన్నో ఏళ్ళుగా కష్టపడుతుంది ఈ జబ్బుతో పాపం. ఇట్స్ ఓకే! డోంట్ వర్రీ. రేపు డా. రిచర్డ్ వస్తారు కదా! తను వివరంగా చెబితే అర్ధమవుతుందేమో! ఐ విల్ సీ యూ లేటర్. బై!” అని చెప్పి వెళ్ళిపోయాడు.
పెద్ద సర్జరీ తర్వాత కొన్నాళ్ళ వరకు ఇలా చిన్న చిన్న అటాక్స్ వస్తాయన్నారు. ఇపుడేమో, అంత పెద్ద సర్జరీ చేయించుకుని ఎంత బాధననుభవించానో, అయినా తగ్గిపోతుందనే ఆశతో ముందుకు సాగుతున్నాను. ఒకోసారి నాకు నిజంగా నొప్పి వస్తుందో లేదో, నేనే నొప్పి వస్తుందని ఊహించుకుంటున్నానేమోనని సైకియాట్రిస్ట్ దగరికి వెళ్ళమన్నారు. నాకు విపరీతమైన కోపమొచ్చినా పోనీ వాళ్ళైనా నాకు నొప్పి వచ్చినప్పుడు ఎక్కువ గాబరా పడకుండా ఏవైనా మందులిస్తారేమోనని వెళ్ళాను. ఆమె అన్నీ మాట్లాడించి, అన్నీ విని మామూలుగా అందరికీ రాసే ఆల్ప్రాక్స్ లాంటి టాబ్లెట్ రాసింది. అది కొంచెం ఆందోళన తగ్గింది. ఎప్పటికి ఇది తగ్గుతుందా, లేదా పిల్లలను ప్రేమగా పెంచగలుగుతానో లేదో అనే భయముండేది. అది వేస్కుంటే ప్రశాంతంగా నిద్ర పట్టేది, విపరీతమైన ఆలోచన తగ్గింది. ఈ జబ్బు పేషంట్స్ ని డిప్రెషన్లోకి నెట్టుతుంది అందుకని డిప్రెషన్ కి మందులియ్యమన్నారు డాక్టర్లు. నేను ఎందుకు ఒప్పుకున్నానంటే నా వల్ల కుటుంబంలోని వారికి ఏ బాధ కలగకూడదని. ఆవిడ ఒక మందు రాసింది. అది వేసుకున్న రాత్రి నాకు ఒక రకమైన భ్రాంతి కలిగి, ఏవేవో భ్రమలు కళ్ళముందు తిరగసాగాయి, ఏవేవో శబ్ధాలు వినపడసాగాయి. దాంతో నేను పక్కలోనుండి లేచి ఎక్కడికో వెళ్ళడానికి ప్రయత్నించానట. డాక్టర్ కి ఫోన్ చేసి చెబితే అది డోస్ ఎక్కువైందేమో మరో మందు రాసి తనే పోస్ట్ లో పంపిస్తానని చెప్పి పంపించింది. ఈ మందుతో కూడా దాదాపు అవే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. మళ్ళీ మందు మార్చింది. ఈ సారి కిచెన్ లోకి వెళ్ళి స్టవ్ ఆన్ చేసి చూస్తూ నిల్చున్నానట. డాక్టర్ గారికి చెబితే తనకి ఏ మందులు పడటం లేదు, ఆందోళన తగ్గడానికి నేను ముందు రాసిన టాబ్లెట్ వేసుకో మళ్ళీ నీ ట్రీట్మెంట్స్ అయ్యింతర్వాత మళ్ళీ ట్రై చేద్దామని అంది.
ఇపుడేమో చిన్నప్రేగుల్లోకి ఒక ట్యూబ్ పెట్టి న్యూట్రీషన్ ఇస్తారట. దీని తర్వాత ఇంకేం చెబుతారో? చాలా చికాకుగా వుంది. అమ్మ నా వీపు పైన రాస్తూ కూర్చుంది. నాకు చిన్నప్పట్నుండి అట్లా రాస్తూ వుంటే చాలా ఇష్టం, అమ్మ అట్లా రాస్తూ ఉంటే నేను నిద్రపోయేదాన్ని. శ్రీని వెళ్ళి నర్సులకు నా చికాకు గురించి చెప్పి వచ్చాడు. ఆమె నేను కొంచెం కామ్ డౌన్ అయ్యి నిద్రపోవడానికి ఐ.వి ఇంజెక్షన్ ఇచ్చింది. నేను మెల్లిగా నిద్రలోకి జారుకున్నాను.
***
ఎమర్జెన్సీ రూమ్ లో నాకు మెలుకువ వచ్చేసరికి నన్ను రూమ్ లోకి తీసుకెళ్తున్నారు. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక విజిటింగ్ నర్స్ జెన్నీ, పెన్న్ మెడిసన్ వాళ్ళకి ఫోన్ చేసి నా పరిస్థితి చెప్పి పాన్క్రియాటిక్ చీఫ్ సర్జన్, డా. రొసాటోతో అపాయింట్మెంట్ కొంచెం త్వరగా ఇవ్వమని బ్రతిమాలింది. వాళ్ళు ఒక రెండు గంటల తర్వాత ఫోన్ చేసి మూడు నెలల తర్వాత అన్న అపాయింట్మెంట్ రెండు వారాల తర్వాతే రమ్మని చెప్పారు. దాంతో ఒక అడుగు ముందుకు వేసామనిపించింది.
*****
(సశేషం)

నేను హైద్రాబాద్ లో పుట్టి పెరిగాను. గత 26 ఏళ్ళుగా అమెరికా, పెన్సల్వేనియా లో నివసిస్తున్నాము. ’90 నుండి ఫ్రీలాన్సర్ గా డెక్కన్ క్రానికల్, ఉదయం, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, సాక్షి, వార్తాపత్రికలకు, వెబ్ మ్యాగజైన్స్ కి ఆర్టికల్స్ రాస్తూనే వున్నాను. తెలుగువన్ అంతర్జాల రేడియోలో ఆర్.జే గా ’పాటలపల్లకీ,’ కార్యక్రమాన్ని 13 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాను. ’మయూరి,’ ’రచన’ మాసపత్రికలో, వివిధ వెబ్ మ్యాగజైన్స్, ’విహంగ,’ ’శిరాకదంబం,’ ’తెలుగువన్.కామ్’ లో ’ కథలు ప్రచురింపబడ్డాయి. పుస్తకాలు చదవడం, జీవితంలో చిన్నప్పట్నుండి మధ్యతరగతి జీవితాల్లో సంబంధాల గురించి గమనించడం, వాటి గురించి కథలుగా రాస్తే ఎలా వుంటుంది అని దాదాపు 13, 14 ఏళ్ళ వయసప్పట్నుండే ఆలోచించడం అలవాటయింది. ఇంకా ఎంతో చదవాలి, పుస్తకాలు, జీవితాన్ని ఇంకా ఎంతో రాయాలి అనే తపన ఉంది. శ్రీనివాస్ తో, జీవిత సహచర్యం, చైతన్య, స్ఫూర్తి(పిల్లలు) మీనా(కోడలు) ముందుకు సాగమని స్ఫూర్తినిస్తుంటారు.
