ఏకాకి వలపోత!

-బాలాజీ పోతుల

ఒంటరి పక్షుల్లెక్క జంటై గట్టెక్కితే,
ఆరోజు సాయంత్రానికి,
నెత్తి మీద కట్టెలయి బయల్దేరద్దుము

మోరీలని సాపు చేసిన ఆ చేతులే,
పచ్చి కట్టె మోపులని కట్టిన ఆ చేతులే
ఈరోజు లేకుంటయినయ్!

కాళ్ళకి సెప్పులు లేని రోజులల్ల గూడా,
గట్టెక్కి దిగిన ఆ కాళ్ళే,
ఇయ్యాల తొక్కితే ఇరిగే ఎండు తొగరి కట్టెలయినయంటే,
తెలవకుంటనే నా కంట్లనించి,
మా ఊరి మల్లన్నాగు పారినట్టయింది.

ఎన్ని జెప్పుకున్నా,
ఎంత ఏడ్సినా,
నా వలపోత ఆగునా?
నా సుశీల తిరిగొద్దునా?

అయిషిల ఎండకు ఎండొచ్చి,
ఇంట్ల దీపం పెట్టేది
అవ్వగారింటికి పురుడుకు పోతే,
నన్నిడిచిపోయినందుకు కంట నీరు పెట్టుకుంది

“నీ మొగునికేం చాతనైతదే మోరీలు తీసుడు తప్ప”
అని దాని చిన్నక్క ఎక్కిరిస్తే,
నేనచ్చి సముదాయించిందాక బుక్కెడు బువ్వ నోట్ల పెట్టకపోయింది.

మా యవ్వ అర్ధాంతరంగా పోయిందని,
పోని దుఃఖంల నేనుంటే,
మందారపువ్వసొంటి మొకంతోని,
నా గడపల అడుగుపెట్టి,
నా బతుకుని బంతిపువ్వసొంటి తోటలెక్క పెంచిన నా సుశీల –
ఇయ్యాల లేదంటే,
మా బిడ్డ తన పురిట్లనే పొయ్యిందంటే,
బొందలు తవ్వి తవ్వి మా అయ్య,
ఆ బొందల్నే పడి ఇంకో బొందయినట్టే,
తట్టుకోలేని నా గుండె –
నా మెడనే దూలంగజేసి
నా ఊపిరిని కాస్తా ఊదేసినట్టయింది!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.