
కాదేదీ కథకనర్హం-23
కార్యేషు మంత్రి
-డి.కామేశ్వరి
ఇంటర్వల్ లో బయటికి వెళ్ళి రెండు కూల్ డ్రింకులు తెస్తున్న రమేష్ తాము కూర్చున్న సీటు వెనకే వున్న ప్రభావతిని చూసి షాక్ తగిలినవాడిలా ఒక క్షణం వుండిపోయాడు. ప్రభావతి సుమతి బెస్ట్ ఫ్రెండ్. ఇందాకటి నించి తనని, జయని చూసే వుంటుంది. ఆమె తనవైపే చూడడం గుర్తించి చకచక వెళ్ళి సీటులో కూర్చుండిపోయాడు. ముఖంలో గాభరా, చెమటలు, అతని ఉత్సాహం అంతా అరక్షణంలో దిగిపోయింది.
జయ తనమీద వాలి మాట్లాడుతుంటే, ఇందాకటి వరకు అతి మధురంగా వినిపించింది ఇప్పుడు …..అక్కడ నించి ఎలా తప్పించుకోడం అన్నట్టు ముళ్ళ మీద కూర్చున్నాడు. ఏదో పాతసినిమా ఎవరూ వుండరు అని వస్తే ఈవిడ గారు ఇక్కడ అందులో తన వెనక సీటులో దాపరించాలా. ఇందాకటి నుంచి తమ ఇద్దరి మధ్య జరిగిందంతా గమనించే వుంటుంది. ఇంటికి వెళ్ళాక సుమతితో చెప్పకుండా వుండదు. ఆలోచిస్తే అతనికి గాభరా అన్పించింది. సినిమా చూడలేకపోయాడు. ఆఖరికి ఇంకా సినిమా అరగంట వుండగానే తలనొప్పి అని వంకపెట్టి లేచి పోయాడు.
జయని వాళ్ళింటి రోడ్డు మీద డ్రాప్ చేసి ఇల్లు చేరాడు. సుమతి ముఖం చూడాలంటే సిగ్గుగా అన్పించింది. గత ఏడెనిమిది నెలలుగా జయతో తిరుగుతున్నా ఏనాడు అన్పించనిది ఈరోజు ఏదో తప్పు చేసినవాడిలా ముఖం తప్పించుకున్నాడు. ప్రభావతి ఈరాత్రి ఫోను చెయ్యకపోయినా రేపు తప్పక చేస్తుంది. సుమతి అడిగితె ఏం చెప్పాలి? రాత్రంతా అదే ఆలోచన అయి కంటి మీద కునుకు పట్టలేదు అతనికి.
కాస్త తగ్గింది. ఈ టెన్షన్ లో గత మూడు రోజులుగా జయ దగ్గరకే వెళ్ళాలనిపించలేదు. సుమతి వారం రోజులయినా ఏ ప్రసక్తి తీసుకురాకపోవడంతో నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇక ముందు జాగ్రత్తగా వుండాలని నిర్ణయించుకున్నాడు. సుమతి ఏం అడగలేదు కానీ ఎందుకో కాస్త ముభావంగా వుందనిపించింది. ముఖంలో కాస్త కళ తగ్గిందనిపించింది.
ఓరోజు రాత్రి భోజనం చేస్తూ -” ఏం అలా వున్నావు . ఒంట్లో బాగోలేదా?” అడిగాడు భార్య ముఖం చూస్తూ. సుమతి తలెత్తి “ఏం లేదే బాగానే వున్నాను” అంది కాస్త నవ్వి. “ఏమో డల్ గా అనిపిస్తే…. అందుకే అడిగాను” అని కాసేపాగి – ఎక్కడికి వెళ్ళలేదా ఈ మధ్య? మీ ఫ్రెండు కూడా వస్తున్నట్టు లేదే….” కూపీ లాగాడు.
“ఆ ఎందుకు రావడం లేదు. మూడు నాలుగు రోజుల క్రితం వచ్చి వెళ్ళింది….ఫోనూ చేస్తుంది” సుమతి భర్త ముఖంలోకి చూసింది. గతుక్కుమన్నాడు రమేష్, వచ్చిందంటే చెప్పకుండా వుంటుందా, చెప్పిందేమో. అందుకే సుమతి కాస్త ముభావంగా వున్నట్టుంది. తగ్గిన టెన్షన్ మళ్ళీ మొదలైంది అతనిలో. భార్య ఇంక ఏం అనకపోవడంతో ఇంకేం ప్రశ్నలు వెయ్యలేదు. భార్యకి తెల్సిందా లేదా అన్నది అతనికి ఓ పెద్ద సస్పెన్సు అయి కూచుంది. తెలిస్తే ఎందుకడగకుండా ఊరుకుంది అన్నది ఇంకా పెద్ద సస్పెన్సు! అసలు సంగతి ఎలా రాబట్టడం అన్నది ఒక సమస్య అయింది.
ఆ రోజు ప్రభావతి వస్తూనే స్నేహితురాలి మీద విరుచుకుపడింది. “నీ కసలు బుద్ధుందా?” అంటూ దండయాత్రకి నాందిగా మొదలుపెట్టింది. “నీ మొగుడనేవాడు అసలు ఏం చేస్తున్నాడో నీకసలు తెలుస్తుందా….” తెల్లపోయి చూస్తున్న సుమతిని “ఏమిటా వెర్రి చూపు . నిన్ను వెర్రిదాన్ని చేసి నీ మొగుడు నీ వెనక ఏం ఆటలు ఆడుతున్నాడో తెలుసా?” ఆవేశంగా అంది.
సుమతి ప్రభావతి ఆవేశానికి కారణం అర్ధం అయి చిన్నగా నవ్వింది. “ఏం చేస్తున్నారు…… అమ్మాయిలతో తిరుగుతున్నారు అవునా….” ఈసారి తెల్లపోవడం ప్రభావతి వంతయింది. ‘అంటే తెలిసీ ఊరుకుంటున్నావా….. నీకిదంతా తెలుసా” నమ్మలేనట్లడిగింది.
‘అంతా అంటే ఏంటో నాకు తెలియదు. కానీ, ఏదో వుందని తెలియనంత వెర్రిదాన్ని కాదులే….ఆ మధ్య అయన ఆఫీసులో పనిచేసే టైపిస్టు అమ్మాయి సరళ కూరల మార్కెట్ లో కన్పించింది….పాపం ఆ అమ్మాయితో నాతో ఏదేదో చెప్పాలనుకుని చెబితే ఏం అనుకుంటానని, చెప్పకుండా వుండలేక సతమతమయింది.
“ఏం చెప్పింది?” కుతూహలంగా చూసింది ప్రభావతి. “మేడమ్ ….మిమ్మల్ని….. మీతో పెద్ద పరచయం లేదు… మిమ్మల్ని ఆ పద్మావతి గారింట్లో పేరంటంలో చూశాను. మా బాస్ మిసెస్ అని తెలుసు అంటూ పరిచయం చేసుకుంది. నేను మీకు ఎలా చెప్పాలో, చెప్పడం తప్పో ఒప్పో . అందువల్ల మా బాస్ కోపం ఎదుర్కోవాలని తెల్సినా తోటి ఆడదానికి అన్యాయం జరుగుతుంటే, అందులో మహాలక్ష్మీలా వున్న మిమ్మల్ని చూసి ఆగలేక చెప్తున్నాను – మీ వారిని జాగ్రత్త పెట్టుకోండి …. పూర్తిగా చేజారిపోకముందే మేల్కోండి…… నేనూ ఒకరికి భార్యని. నా భర్తే ఇలా చేస్తే అన్న ఆలోచనలో ఇందంతా చెప్తున్నాను. అయన జయలక్ష్మీ అనే అమ్మాయితో చాలా క్లోజ్ గా….చాలా దూరం వెళ్తున్నారు ఇద్దరూ. అంటూ చెప్పలేక చెప్పింది పాపం ఆ అమ్మాయి.”
‘చెప్పాక కూడా అలా చూస్తూ ఊరుకున్నావా….. అసలా అమ్మాయి ఎవరట? నీకేమన్నా తెలుసా. ఇవాళ సినిమా హాలని కూడా లేకుండా వాళ్ళ ఇకఇకలు పకపకలు. ఒకరి మీద ఒకరు వాలి పోవడాలు…..చ ఛ. ఏదో కాలేజీ కుర్రాడిలా…… నలబై ఏళ్ళు వచ్చి ఇద్దరు పిల్లల తండ్రి అయి వుండి, ఎంత లేకిగా…… ఛీ… ఛీ….” ప్రభావతి జుగుప్సగా అంది. “అదేవర్తే …..ఇలా పెళ్ళయిన వాడని తెలీదా దానికీ?”
“జయలక్ష్మీట. అందంగానే వుంటుంది గాబోలు. ఎమ్.కామ్ . చదివిందిట. ఈయనకి పర్సనల్ అసిస్టెంటట. పెళ్ళి కాలేదు. పాతికేళ్ళు పరువం గల అమ్మాయి కనపడగానే ఈయనలో సెకండ్ యవ్వనం విజ్రుంభించేసి వుంటుంది. ఈయనగారి తళుకు బెళుకులు పెద్ద హోదా, కారు గట్రా చూసి ఆ అమ్మాయి ఈయన మాటలకి బోల్తా పడినట్లుంది.”
“ఇన్ని తెలిసి కూడా….. నిలేసి ముఖం కాల్చకుండా ఊరుకున్నావా, పైగా పెద్ద పతివ్రతలా మొగుడి గారి ప్రేమాయణం గురించి కూల్ గా చెప్తున్నావా…’ ప్రభావతిలో కోపం కంటే ఆశ్చర్యం కనపడింది. సుమతి అదోలా నవ్వింది. “ఏం అని అడగమంటావు, అడిగాననుకో, ముందు లేదని బుకాయిస్తారు. వీళ్ళ మాటలు, వాళ్ళ మాటలు విని నన్నే అనుమానిస్తున్నావా అంటారు. ఇంకా గట్టిగా నిలేస్తే తెగించి నా ఇష్టం అంటారనుకో….. అప్పుడు దానికి నా దగ్గిరేం జవాబుంది…..’ సుమతి ప్రభావతి వంక సూటిగా చూస్తూ అంది జవాబు చెప్పమన్నట్టుగా.
*****

డి.కామేశ్వరి కథారచయిత్రిగా తెలుగుసాహిత్య లోకానికి సుపరిచితులు. 11 కథా సంపుటాలు, 21 నవలలు, సుమారు 300 కథలు, 30 కవితలు, ఒక కవితా సంపుటి ప్రచురితాలు. కొత్తమలుపు నవల ‘న్యాయం కావాలి’ సినిమాగా, కోరికలే గుర్రాలైతే నవల అదే పేరుతో సినిమాగా వచ్చాయి. కొన్ని నవలలు టెలీఫిల్ములుగా, టీవీ సీరియళ్లుగా వచ్చాయి.
