కోల్పోతున్న ఇళ్ళు

खो जाते हैं घर

హిందీ మూలం – – సూరజ్ ప్రకాష్

తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు

బాబు క్లినిక్ నుంచి రిలీవ్ అయ్యాడు. మిసెస్ రాయ్ వాడిని తనతోబాటు తీసుకువెడుతోంది. ఆవిడ క్లినిక్ కి సంబంధించిన మొత్తం పేమెంట్ అంతా చేసేసింది.

“ఓకే డాక్టర్, ఇంక వీడిని నాతో తీసుకువెడుతున్నాను. ఏమయినా విషయం ఉంటే నేను మీకు ఫోన్ లో చెబుతాను.” ఆవిడ డాక్టరు దగ్గరినుంచి అనుమతి తీసుకుంది.

డాక్టరు ఆవిడ దిగులుని పోగొడుతూ అన్నాడు- “సరే మేడమ్, మీరు ఇతనికి మందులు ఇస్తూ ఉండండి. కొద్దిరోజుల్లోనే పూర్తిగా కోలుకుంటాడు. ఓకే బాబూ, బై… ఆంటీని విసిగించకు.”

బాబు నీరసంగానే అన్నాడు- “విసిగించను.”

బాబు బుగ్గలని నిమిరిడాక్టరు వాడికి గుడ్ బై చెప్పాడు.

ఆవిడ మరోసారి డాక్టరుకి గుర్తు చేసింది –“ఒకవేళ ఆ మనిషి వచ్చి ఈ కుర్రాడిని గురించి అడిగితే నాకు వెంటనే తెలియజెయ్యండి. ప్లీజ్.”

డాక్టరు ఆవిడకి హామీ ఇచ్చాడు- “ష్యూర్, ష్యూర్. ఇప్పుడు ఇన్ని రోజులు గడిచాక అతను వస్తాడన్న ఆశ తక్కువే. అయినా అతను వస్తే మాత్రం మీకు వెంటనే తెలియజేస్తాను. నాకు ఇప్పుడు కూడా అనిపిస్తోంది అతను ఈ కుర్రాడిని ఎక్కడో జ్వరంతో బాధపడుతూ ఉండగా చూసివుంటాడు, వీడికి ట్రీట్ మెంట్ ఇప్పించడానికి తనకి స్తోమత లేని కారణంగా వీడిని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు.”

“నాకూ అదే అనిపిస్తోంది. అతని స్వంత బిడ్డ అయివుంటే ఎలాగైనా ఒకసారి చూసుకునేందుకు తప్పకుండా వచ్చివుండేవాడు. కాని మధ్యమధ్యలో వీడు వేరే పిల్లల గురించి ఏమేమిటో చెబుతున్నాడు. దాంతో విషయం అర్థం చేసుకోవడంలో ఇబ్బందిగా ఉంది.” మిసెస్ రాయ్ తన సందేహాన్ని వెలిబుచ్చింది.

“నా దృష్టిలో ఈ కుర్రాడికి పూర్తిగా నయం అయిన తరువాతనే అన్ని విషయాలూ బాగా తెలుస్తాయి.”

“అవును. నేనూ అదే అనుకుంటున్నాను. ఈ కుర్రాడు ఇంకా విషయాలన్నీ ఒక క్రమంలో చెప్పలేకపోతున్నాడు. కొన్ని రోజులు ఇంకా ఎదురుచూడవలసే వస్తుంది.”

మిసెస్ రాయ్ సామాను తీసుకోమని డ్రైవరుకి చెప్పింది. పిల్లాడిని కారులో కూర్చోబెట్టమని వార్డుబాయ్ కి సంజ్ఞ చేసింది. బాబు కారులో ఇబ్బంది లేకుండా కూర్చున్నతరువాత ఆవిడకూడా వచ్చి కారులో కూర్చుంది. బాబు తన జీవితంలో మొదటిసారి కారులో కూర్చున్నాడు. ఆశ్చర్యంగా అంతా పరిశీలిస్తున్నాడు. చాలా సౌకర్యంగా ఉన్న సీటులు, చల్లని గాలి, చాలా మందస్వరంలో వినిపిస్తున్న సంగీతం, నీళ్ళమీద వెడుతున్నట్లుగా అనిపించే కారు. వాడు అద్దానికి దగ్గరగా కళ్ళు పెట్టి బయటి దృశ్యాన్ని చూడాలనుకుంటున్నాడు. మిసెస్ రాయ్ వాడిని సౌకర్యంగా ఉండేలా కూర్చోబెట్టి కిటికీకి దగ్గరగా వాడిని జరిపింది. ఉన్నట్టుండి వాడి ధ్యాస అంతా కారులో కాకుండా బయట పరుగెడుతున్న ప్రపంచంవైపుకి మళ్ళింది. మిసెస్ రాయ్ వాడి తలమీద నెమ్మదిగా వేళ్ళతో నిమరసాగింది. తనంతట తానుగా ఏదయినా చెప్పికాని, అడిగికాని ఆ పిల్లవాడికి, వాడిలోకానికి ఎటువంటి ఇబ్బందినీ కలిగించదలుచుకోలేదు. ఆవిడకి ఆ విషయంలో ఎటువంటి తొందర లేదు. బాబు కొద్దిసేపట్లోనే కారులోపలి లోకంలోకి తిరిగివచ్చాడు. ఆవిడని చూశాడు. ఆవిడ నవ్వింది. బాబు కూడా ఆవిడ మందహాసానికి బదులుగా తన ముఖంలో విలువైన చిరునవ్వు తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు. వాడి బుగ్గని నిమురుతూ ఆవిడ అడిగింది –“బాబూ, ఇప్పుడెలా ఉంది?”

వాడు నెమ్మదిగా అన్నాడు- “బాగానే ఉంది.”
తిరిగి వాడే ఆవిడని అడిగాడు –“మనం ఎక్కడికి వెడుతున్నాం?”

“ఇంటికి. ఎందుకని?”

“ఎవరింటికి?”

“మనింటికే. ఇంకెవరింటికి?”

“మీ ఇల్లు ఎక్కడ ఉంది?”

“లోఖండ్ వాలా లో.”

బాబు ఊరుకున్నాడు. తరువాత ఏం మాట్లాడాలో వాడికి తెలియడంలేదు. ఎప్పుడూ ఎవరూ వాడితో ఈ విధంగా ఎప్పుడూ మాట్లాడలేదు. వాడు ఏదో ఆలోచించి తనంతట తానే అన్నాడు –“మా ఇల్లు చాలా దూరం.”

“ఎక్కడుంది మీ ఇల్లు, చెప్పు బాబూ?” ఆవిడకి ఏవో ఆశాకిరణాలు కనిపించసాగాయి.

“తెలీదు.” కుర్రవాడు ఆవిడని మళ్ళీ మధ్యంతరంగా వదిలేశాడు.

“అవునూ, నిన్ను హాస్పిటల్లో వదిలి వెళ్ళినతను ఎవరు?”

“నాకు తెలీదు.”

“సరే, నువ్వు ఎక్కడ ఉండేవాడివో, ఎవరితో ఉండేవాడివో అదయినా తెలుసా?”

“స్నేహితులతో.”

“ఎక్కడ?”

“వంతెన కింద.”

“చోటు జ్ఞాపకం ఉందా?”

“లేదు.”

“ఆ వంతెన గురించి ఇంకా ఏమన్నా గుర్తుందా?”

“అక్కడ దోమలు చాలా ఉండేవి. రాత్రంతా కుట్టేస్తూ ఉండేవి.”

“నువ్వు ముంబయి వచ్చి ఎన్ని రోజులై ఉండచ్చు?”

“తెలీదు.”

“అన్నం ఎక్కడ తినేవాళ్ళు?”

“ఎక్కడో ఒకచోట తినేవాళ్ళం.”

“రోజంతా ఏం చేసేవాళ్ళు?”

“ఏమీ కాదు.”

“నువ్వు రోజూ తలుచుకునే నీ స్నేహితులు నీకు ఎక్కడ దొరికారు?”

“అక్కడే. వంతెన కిందనే.”

“వాళ్ళు ఏం చేసేవాళ్ళు?”

“అందరూ వేరే వేరే పనులు చేసేవాళ్ళు.”

“మరి నీకు కావలసినవన్నీ ఎవరు చూసేవారు?”

“అందరూ చూసేవాళ్ళు.”

“తినడానికి, తాగడానికి కావలసినవి?”

“అందరం కలిసే తినేవాళ్ళం.”

“మరి నువ్వు ఏం చేసేవాడివి?”

“ఏమీ చేసేవాడిని కాదు. నేను చాలా చిన్నవాడిని కదా… …”

“కాని తెలివైనవాడివి. చిన్నవాడివైనా నేర్పరివి.”

“నేనేమీ నేర్పరిని కాదు.”

“సరే, మీ ఇల్లు నీకు జ్ఞాపకం ఉందా?”

“ఉంది.”

“మీ ఇంట్లో ఎవరెవరున్నారు?”

“నాన్న, అమ్మ, అక్క… అన్నయ్య…”

“నువ్వు ముంబయికి ఎలా వచ్చావు?”

“రైల్లో.”

“ఇది ఎప్పటి సంగతి?”

“తెలీదు.”

“మీరు అప్పుడు ముంబయికి ఏం చెయ్యడానికి వస్తున్నారు?”

“పెళ్ళికి.”

“ఇంకా నీతోకూడా ఎవరున్నారు?”

“అందరూ ఉన్నారు.”

“అయితే నువ్వు వాళ్ళనుంచి ఎలా విడిపోయావు?”

“తెలీదు.”

“మీ అమ్మా-నాన్నా నిన్ను రైల్లో వదిలేసి వెళ్ళిపోయారా?”

“నాకేం తెలుసు?”

“మీరు ఎంతమంది అన్నదమ్ములు-అక్కచెల్లెళ్ళు ఉన్నారు?”

“ముగ్గురం.”

“అలాగా… అయితే మీ ఇల్లు ఎక్కడుందో నీకు అసలు జ్ఞాపకం లేదా?”

“చాలా దూరం.”

“కాని ఎక్కడ?”

“ఊళ్ళో.”

“ఊరుపేరు గుర్తుందా?”

“జ్వాలాపూర్.”

“మరి స్కూలుపేరు?”

“ఆదర్శ స్కూలు.”

“మీ నాన్నగారి పేరేమిటి?”

“రామ్ చరణ్.”

“మరి అమ్మపేరు?”

“తెలీదు.”

“మీ నాన్నగారు ఏంచేస్తారు?”

“షాపు ఉంది.”

“నీకు అసలు ఏదీ జ్ఞాపకం లేదు. లేకపోతే తెలియదు. మరి మీ ఇంటికి నువ్వు ఎలా వెడతావు?”

“తెలీదు.”

“మీ అమ్మని, నాన్నగారిని ఎలా కలుసుకుంటావు?”

“తెలీదు.”

బాబు ఇన్ని ప్రశ్నలతో అలిసిపోయాడు. వాడికి తన ఇల్లు కూడా జ్ఞాపకం రాసాగింది. వాడు కళ్ళు మూసుకున్నాడు. మిసెస్ రాయ్ కి కూడా వాడిని ఇన్ని ప్రశ్నలు ఒక్కసారిగా అడిగివుండకూదని అర్ధం అయింది. ఆవిడ వాడిని అలా మౌనంగానే ఉండనిచ్చింది.

ఉన్నట్టుండి బాబు కళ్ళు తెరిచాడు. “ఆంటీ, మీరేం చేస్తారు?”

“ఏం బాబూ?”

“ఊరికేనే అడిగాను. మీ బండి చాలా బాగుంది. చల్లచల్లగా.”

“నీకు బాగుందా?”

“అవును. మీరు కూడా.”

“అబ్బో, నేను కూడా నీకు బాగున్నానా, ఎందుకని?”

“మీరు రోజూ వస్తూ ఉండేవారు కదా నన్ను చూడటానికి. బోలెడు వస్తువులు తెచ్చేవారు. నన్ను కొట్టలేదు కూడా.”

“నిన్ను నేనెందుకు కొడతాను బాబూ? నువ్వు ముద్దొస్తూ ఇంత బాగున్నావుకదా, నిన్ను ఎవరైనా ఎందుకు కొడతారు?”

“నాన్నగారు కొట్టేవారుకాదు. అమ్మ కొట్టేది. అక్కయ్య, అన్నయ్య కూడా కొట్టేవాళ్ళు.”

“వాళ్ళు అసలు మంచివాళ్ళు కాదు. నిన్ను ఎవరూ కొట్టలేరు.”

ఆవిడ డ్రైవరుతో అంది- “డ్రైవర్, ఎదురుగా వున్న రెడీమేడ్ బట్టల షాపు దగ్గర కాస్త బండి అపుజెయ్యి. మన రాజా బాబుకి కొన్ని బట్టలు తీసుకోవాలి.”

“నేనేం చేసుకుంటాను బట్టలు?”బాబు తనప్రసక్తి రావడం విని అడిగాడు.

“మరి ఎవరైనా బట్టలు ఏంచేసుకుంటారు?”ఆవిడ అడిగింది.

“తొడుక్కుంటారు. నేను కూడా తొడుక్కుని ఉన్నానుగా.”

“నువ్వు ఇన్ని రోజులుగా హాస్పిటల్లో ఉన్నావు కదా, ఇప్పుడు ఇంటికి వెడుతున్నావు. అందుకని మంచి బట్టలు వేసుకోవాలి కదా. అలాగే ఆడుకునే బొమ్మలు కూడా. నీకు ఏ బొమ్మలంటే ఇష్టమో చెప్పు.”

“నేను ఇంట్లో బొమ్మలతో ఆడుకునేవాడినా ఏమిటి?”

“మరి దేనితో ఆడుకునేవాడివి బాబూ?”

“అలాగే ఏమీ లేకుండానే ఆడుకునేవాడిని.”

“నువ్వు బొత్తిగా అమాయకుడివి బాబూ. పిల్లలు బొమ్మలతోనే ఆడుకోవాలి. అవునా కాదా?”

బండి ఒక స్టోర్ కి ఎదురుగా ఆగింది. మిసెస్ రాయ్ పిల్లవాడిని డ్రైవరుతో బాటు అక్కడే కారులోనే విడిచిపెట్టి లోపలికి వెళ్ళింది. వాడికోసం బోలెడన్ని బట్టలు, బొమ్మలు తీసుకుని వచ్చింది.
కారులోకి రాగానే ఆవిడ డ్రైవరుతో అంది –“ఇంక తిన్నగా ఇంటికే వెడదాం. మా బాబుకూడా కాస్త అలసట తీర్చుకోవాలి కదా, విశ్రాంతి తీసుకోవాలి కదా. అవును కదా బాబూ?” వాడివంక చూస్తూ ఆవిడ అడిగింది.

వాడు తలకాయ ఊపాడు.

బండి లోఖండ్ వాలా కాంప్లెక్స్ లో ఒక చాలాపెద్ద భవనం ముందు ఆగింది. ఆవిడ కుర్రవాడిని నెమ్మదిగా కిందికి దింపింది. ఇద్దరూ లిఫ్టుదాకా వచ్చారు. కుర్రవాడు ఆశ్చర్యంగా ఆ వైభవం అంతా చూస్తూ నిలబడ్డాడు. వాడికి ఈ లోకం పూర్తిగా అపరిచితమైనది. ఇంతకుముందెప్పుడూ చూసి ఉండనిది. లిఫ్టు రాగానే ఇద్దరూ లోపలికి వచ్చారు. పిల్లవాడు లిఫ్టులో మొదటిసారి వచ్చాడు. ఆశ్చర్యపోతూ అడిగాడు-

“ఆంటీ, ఈ గది ఏమిటి?”

ఆవిడ నవ్వుతూ చెప్పింది- “బాబూ, ఇది గది కాదు. ఇది లిఫ్టు. దీనితో పైకి వెడతారు.”

“ఓహో. ఇది లిఫ్టా. టీవీలో ఒకసారి పిక్చర్లో చూశాను.”

వాళ్ళు తమ ఫ్లోరుకి చేరుకున్నారు.

ఆవిడ ఒక తలుపు దగ్గర బెల్ నొక్కింది. తలుపు పనిమనిషి తెరిచింది. ఆవిడ వాడిని తీసుకుని లోపలికి వెళ్ళింది. పనిమనిషి ఆవిడ చేతిలోంచి సామాను తీసుకుంది. పిల్లవాడిని చూసి అంది- “పిల్లాడు ఎంత బాగున్నాడో. ఎవరబ్బాయి అమ్మగారూ?”

ఆవిడ గర్వంగా చెప్పింది- “మన అతిథి. ప్రస్తుతం మనతోనే ఉంటాడు. ఇదిగో చూడు. ఈ పిల్లాడికి ఒంట్లో బాగుండలేదు. తినడానికి వీడికి ఏదయినా తేలిగ్గా ఉండేది చెయ్యి. వీడికి ఏం కావాలో పూర్తిగా శ్రద్ధ తీసుకో. సరేనా…”

“అలాగే అమ్మగారూ.” ఆమె చెయ్యి పిల్లవాడి బుగ్గలు నిమరడానికి ఉబలాటపడుతోంది. కాని తనని తాను కంట్రోలు చేసుకుంది. దానికోసం చాలా అవకాశాలు లభిస్తాయి. ఆమె మౌనంగా లోపల సామాను పెట్టడానికి వెళ్ళిపోయింది. తన గదిలోకి వెళ్ళగానే ఆవిడ పిల్లాడిని గట్టిగా తన గుండెలకి హత్తుకుంది. గట్టిగట్టిగా ఏడవసాగింది. వాడిని గట్టిగా పట్టుకునే “నా బిడ్డ, నా బిడ్డ…”అంటోంది. ఆవిడ ఏడుస్తూ ఉంటే పిల్లవాడు కంగారుపడ్డాడు. వాడు కూడా ఏడవసాగాడు.

“ఆంటీ, మీరెందుకు ఏడుస్తున్నారు?”

“అరే తండ్రీ, నేనెక్కడ ఏడుస్తున్నాను… ఇవి సంతోషంతో వస్తున్న ఆనందబాష్పాలు.”

“ఆంటీ, ఆనందబాష్పాలంటే ఎలా ఉంటాయి?”

“చాలా ప్రశ్నలు అడుగుతున్నావురా. మనిషి చాలా సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఏడుస్తాడు.”

“నేను ఏడ్చినప్పుడల్లా వచ్చేవి ఆనందబాష్పాలు కావు కదా. నేనెప్పుడైనా పడిపోయినప్పుడూ, లేకపోతే ఆకలేసినప్పుడూ అయితే నేను నిజంగా ఏడుస్తాను. ఆంటీ, మీకు దెబ్బ తగిలితే మీరు ఏడుస్తారా?”

“పిచ్చివాడా, పెద్దవాళ్ళకి దెబ్బ తగిలినప్పుడు అది కనిపించదు. కేవలం దెబ్బతగిలినట్లుగా తెలుస్తుంది. తెలిసిందా పిచ్చిసన్నాసీ…”

“లేదు.”

“నీకు తెలియదులేరా నా తండ్రీ. ఇలారా నీకు చెబుతాను.”

వాడిని తీసుకుని ఆవిడ ఒక ఫోటోకి ఎదురుగా వెళ్ళింది. అది బొద్దుగా ఉన్న ఇంచుమించు అయిదేళ్ళ పిల్లవాడి ఫోటో. నవ్వుతూ ఉన్న ఒక పిల్లవాడి ఫోటో.

“ఆంటీ, ఇది ఎవరి బొమ్మ?”

“బాబూ, ఇది నా మనవడి ఫోటో.”

“మనవడంటే ఏమిటి?”

“ఓరి నాయనా, ఎలా చెప్పనురా నీకు మనవడంటే ఏమిటో. సరే చూడు. నీకు కొడుకు అంటే తెలుసుకదా. మచ్చుకి నువ్వు మీ నాన్నకి కొడుకువి.”

“అవును.”

“అయితే మరి నీకు కొడుకు పుడితే మీ నాన్నకి మనవడు అవుతాడు.”

“నాకు కొడుకు ఎలా పుడతాడు? నేను ఇంత చిన్నవాడిని కదా.”

“అరే, నీకు పెళ్ళి అయ్యాక నీకు కొడుకు పుడతాడు కదా, వాడు మీ నాన్నకి మనవడు అవుతాడు. తెలిసిందా?”

“తెలీలేదు.”

“ఏం ఫరవాలేదు. ఇది నా మనవడి ఫోటో.”

“మీ మనవడి పేరేమిటి?”

“మా మనవడి పేరు రిక్.”

“ఆంటీ, ఇదేంపేరు… రిక్?”

“బాబూ, వాడు ఉన్నచోట పేర్లు అలాగే ఉంటాయి.”

“ఎక్కడ ఉంటాడు మీ మనవడు?”

“ఫ్లోరిడాలో.”

“అదెక్కడుంది?”

“చాలా దూరం. ఏడు సముద్రాలకి అవతల.”

“ఆంటీ, సముద్రం అంటే ఏమిటి?”

“సముద్రం అంటే, సముద్రం అంటే… సరే, ఒక పని చేద్దాం. నిన్ను సాయంత్రం సముద్రం చూపించడానికి తీసుకువెడతాను. నీ అంతట నువ్వే చూడు.”

“మీరు మీ మనవడిని మీదగ్గరే ఎందుకు ఉంచుకోరు ఆంటీ?”

ఆవిడ మళ్ళీ ఏడవసాగింది –“పిచ్చివాడా, నేను ఇంతవరకూ వాడిని చూడనుకూడాలేదు. ఎంత దురదృష్టవంతురాలిని. నా మనవడు అయిదేళ్ళవాడయ్యాడు. ఇంతవరకూ వాడిని నేను చూడనేలేదు. నా దగ్గర ఉంచుకోవడం అనేది చాలా దూరమైన విషయం. అప్పుడప్పుడూ ఫోన్ లో వాడి మాట వింటూ ఉంటాను. దానితోనే నా మనస్సు కాస్త చల్లబడుతుంది.”

“మీ మనవడిని మీరెందుకు చూడలేదు ఆంటీ?”

“మా అబ్బాయి వాడిని తీసుకుని ఇక్కడికెప్పుడూ రాలేదు.”

“ఎందుకని?”

“వాడి దగ్గర టైమ్ లేదు. వాడుకూడా ఎప్పుడూ ఇక్కడికి రాడు.”

“ఎందుకు రాడు?”

“వీటన్నిటికీ జవాబు నా దగ్గర లేదు బాబూ. పిచ్చినాయనా, ఉంటే నేను నిన్ను నా గుండెలకి హత్తుకుని ఏడ్చేదాన్నా?”

ఇన్ని విషయాలు కుర్రవాడు అర్థం చేసుకోలేకపోయాడు. వాడు ఆవిడ దగ్గరినుంచి ఇవతలికి వచ్చాడు. ఇవతలికి వచ్చాక వాడి ధ్యాస ఇంటిమీద, అక్కడ ఉన్న బోలెడు సామాను, అక్కడి ఆడంబరం, అలంకరణ మీదకి మళ్ళింది. వాడు మొత్తం ఇల్లంతా తిరిగి చూశాడు. తిరిగి మళ్ళీ ఆవిడదగ్గరికి వచ్చి చేరాడు.

“ఆంటీ, ఇంత పెద్ద యింట్లో మీరొక్కరే ఉంటున్నారా?”

ఆవిడ తలకాయ ఊపి చెప్పింది –“అవును.”

“మీకు భయం వెయ్యదా?”

“వేస్తుంది.”

“ఎవరంటే వేస్తుంది?”

“బాబూ, ఒక్క భయమైతే చెప్పవచ్చు. ఒక్కోసారి నేనంటే నాకే భయం వేస్తుంది. ఒక్కోసారి నా ఒంటరితనమంటే భయం వేస్తుంది. ఒక్కోసారి నా వృద్ధాప్యం అంటే భయం వేస్తుంది. ఒక్క విషయం చెప్పు. నువ్వు నా భయం పోగొట్టడానికి నాతోపాటు ఇక్కడ ఉంటావా?”

“నేను ఉంటే మీకు భయం లేకుండా ఉంటుందా ఆంటీ?”

“నీకు తెలియదు బాబూ, నువ్వెంత చూడముచ్చటగా ఉంటావో. నువ్వు ఇక్కడ ఉంటే ఈ యింట్లోని చీకటి అంతా మాయమైపోతుంది.”

“ఆంటీ, మీరు జోక్ వేస్తున్నారు. ఇంట్లో చీకటి ఎక్కడ ఉంది. ఇంత వెలుతురు ఉంటేను.”

“అవును బాబూ, వెలుతురు బయటినుంచే కనిపిస్తుంది. లోపల ఉన్న చీకటి కనిపించదుకదా. చెప్పు నా దగ్గర ఉంటావు కదా. నేను నీకు బాగా చదువు చెప్పిస్తాను. మంచి స్కూల్లో నీకు అడ్మిషన్ వచ్చేలా చూస్తాను. నువ్వు బాగా చదువుకుని తరవాత నాకు సహాయపడుదువుగాని. నా భయం పోగొడుదువుగాని. సరేనా?”

“మరి నా స్నేహితులో?”

“నీ స్నేహితుల సంగతి సరే నాయనా, కాని వాళ్ళని మనం ఎక్కడ వెతుకుతాం? నీకా బ్రిడ్జి తప్ప ఇంకేమీ గుర్తు లేదా? మీ అమ్మా-నాన్నా కూడా కనిపించిఉంటే ఎంత బాగుండేది.”

“కాని నేను మా స్నేహితుల దగ్గరికే వెడతాను.”

“సరే, అయితే ఒక పని చేద్దాం. నువ్వు కాస్త కోలుకుంటే ముంబయిలో ఎన్ని బ్రిడ్జిలు ఉన్నాయో అన్నింటి దగ్గరికి మనం వెడదాం. నీ స్నేహితులు ఎక్కడున్నారో తెలుసుకుందాం. వస్తావా నాతోబాటు?”

“వస్తాను ఆంటీ. కబీరా నన్ను బాగా చూసుకుంటాడు. మోతీ కూడా ఉంది. నేను మిమ్మల్ని అందరితోనూ కలుసుకునేలా చేస్తాను.”

“ఈ మోతీ ఎవరు?”

“ఆంటీ, మోతీ మా కుక్క. చాలా తెలివైంది. దోస్త్ ఎవరో, శత్రువు ఎవరో ఇట్టే చెప్పేస్తుంది.”

“అబ్బో, అది ఎలా చెబుతుంది బాబూ?”

“ఆంటీ, అది ఎవరినైనా చూసి తలకాయ ఊపితే వాళ్ళు దోస్తులని అర్ధం. ఎవరినైనా చూసి మొరగడం మొదలుపెడితే అర్ధం ఎదురుగా ఉన్నవాళ్ళు శత్రువులని.”

“అరే వాహ్, చాలా విచిత్రంగా ఉంది. మరి నువ్వు మోతీనినాకు చూపిస్తావా?”

“సరే ఆంటీ. మాతోకూడా గప్పూ కూడా ఉన్నాడు. వాడికెప్పుడూ నిక్కరు కిందికి జారిపోతూ ఉంటుంది. అది చూస్తే భలేగా ఉంటుంది.”

“బాగుంది. పద నాన్నా, ఇంక విశ్రాంతి తీసుకో. నేను కూడా కొన్ని పనులు పూర్తి చేసుకుంటాను. నీకు ఆకలి వేస్తే మాత్రం నాకు కాని, మాయా ఆంటీకి కాని చెప్పు. సరేనా. చూడు, ఈ గదిలో రెస్టు తీసుకో. తరువాత మాట్లాడుకుందాం.”

“సరే ఆంటీ.”

“ఇకనుంచి నువ్వు ఈ గదిలోనే ఉంటావు.”

“ఇంత పెద్ద గది నా ఒక్కడికోసమేనా?”

“అయితే ఏమయింది?భయం వేస్తోందా నీకు?”

“లేదు… సరే ఆంటీ.”

బాబు పడుకున్నాడు. కాని వాడికి నిద్ర రావడంలేదు. అక్కడున్న వస్తువులు, హంగులు, అక్కడి వాతావరణం అన్నీ వాడి ఊహకి అందనివి. వాడు లేచి కూర్చున్నాడు. ఇల్లంతా తిరిగి చూస్తున్నాడు. అక్కడి వస్తువులన్నీ వాడికి కొత్తవిగానూ, అంతకుముందెప్పుడూ చూసిఉండనివిగానూ ఉన్నాయి. వాడు ఒకసారి స్టీరియోని, మరోసారి కలర్ టి.వి. ని చూస్తున్నాడు. అప్పుడప్పుడూ ఫోటోలని, ప్రతిమలని చూస్తున్నాడు. నలువైపులా ఉన్న వస్తువులన్నీ చూశాక, వాడు ఆంటీ ఇచ్చిన బొమ్మలతో ఒక్కడే ఆడుకోసాగాడు. చాలాసేపూ అలా ఒంటరిగానే కూర్చుని వాడు ఆ బొమ్మలన్నీ ఇటూ-అటూ జరుపుతూ కూర్చున్నాడు. వాడికి ఉన్న ఇబ్బంది ఏమిటంటే చాలా బొమ్మలు బ్యాటరీతో నడిచేవి, లేదా వాటిని నడపటం వాడివల్ల కావడంలేదు. ఇంక చేసేదేమీ లేక వాడు అవన్నీ ఒకపక్కకి జరిపేశాడు.

***

మిసెస్ రాయ్ కుర్రవాడిని జుహూ బీచ్ తిప్పి చూపించింది. వాడు తన జీవితంలో మొదటిసారి సముద్రం చూశాడు. నిస్సందేహంగా వాడు మూడు నెలలుగా ముంబయిలో తిరుగుతున్నాడు. కాని సముద్రంవరకు ఎందుకు వెళ్ళలేకపోయాడో తెలియదు. ఎవరూ వాడిని అటువైపు తీసుకువెళ్ళలేదు. సముద్రాన్ని చూసి వాడు చాలా సంబరపడిపోయాడు. నీళ్ళతో బాగా ఆటలు ఆడుకున్నాడు. మిసెస్ రాయ్ భయపడుతున్నది వాడు ఇప్పుడిప్పుడే జబ్బుపడి లేచాడు, దానితో సముద్రంనుండి వచ్చే చల్లనిగాలి వాడికేమీ చెరుపు చెయ్యదుకదా అని. కాని వాడు మాత్రం తన్మయత్వంతో నీళ్ళతో బాగా ఆడుకున్నాడు. ఒక్కొక్కసారి వాడు కెరటాలకి దూరంగా పారిపోతూఉన్నాడు, ఒక్కొక్కసారి నీళ్ళకి బాగా దగ్గరగా రావాలనుకుంటూఉన్నాడు. మిసెస్ రాయ్ స్వయంగా వాడితో ఉయ్యాలలో కూర్చుంది. గుర్రంబండిమీద సవారీ చేసింది. బుడగలు తీసుకుని వాడితోపాటు తడిగా ఉన్న ఇసుకలో పరుగెత్తింది. చాలాకాలం తరువాత ఆవిడ తననుతాను పూర్తిగా మరిచిపోయి, కుర్రాడితోపాటు తనుకూడా ఒక పిల్లవాడిలా అయిపోయి ఒక కొత్త అనుభవం సంపాదించుకుంది.

ఇంటికి చేరుకుని కుర్రవాడు మారాం చేస్తూ ఏడవటం మొదలుపెట్టాడు. వాడికి తన స్నేహితులు జ్ఞాపకం వచ్చారు. వాడు ఏడుపుముఖంతో అన్నాడు- “ఆంటీ, నేను కబీరా దగ్గరికి వెళ్ళాలి.”
మిసెస్ రాయ్ దిగులు ఎక్కువయింది. “చూడు బాబూ, నీ ఆరోగ్యం ఇంకా పూర్తిగా బాగుపడలేదు. ఇంకా కొన్నాళ్ళు నువ్వు మందులు వేసుకోవాలి. నిన్ను ఇలా ఉండగా బయటికెక్కడికీ పంపించడం కుదరదు. మనం ఒకపని చేద్దాం. రేపు మనం బండిలో వెళ్ళి మొత్తం ఊరంతా కబీరాని వెతుకుదాం. నిన్ను కలుసుకునేందుకు రోజూ వస్తూ ఉండమని నేను వాడితో చెబుతాను. కబీరాని తీసుకువస్తూ ఉండమని డ్రైవరుతో చెబుతాను.”

కుర్రవాడికి ఆశాకిరణం కనిపించింది –“మోతీని కూడా తీసుకువస్తాడా?”

కుర్రవాడు ఇంత సులభంగా అంగీకరించినందుకు మిసెస్ రాయ్ సహజంగా నార్మల్ అయింది. వెంటనే వాడికి హామీ ఇచ్చింది –“సరే, మోతీని కూడా తీసుకువద్దాం. ఇంక నువ్వు విశ్రాంతి తీసుకో. చాలాసేపు నువ్వు నీళ్ళతో ఆడావు.”

కాని కుర్రవాడి లిస్టు ఇంకా పూర్తి కాలేదు –“మరి గప్పూని కూడానా?”

మిసెస్ రాయ్ కి ఈ షరతు కూడా చెయ్యలేనిదిగా అనిపించలేదు. “సరే, గప్పూని కూడా. వాడి నిక్కరు కిందికి ఎలా జారిపోతుందో నేను కూడా చూస్తాను. ఇంక నువ్వు రెస్టు తీసుకో. నువ్వు మందు వేసుకునేందుకు కూడా టైమయింది.”

కుర్రవాడు తన ప్రశ్నలలోకం నుంచి బయటికి వచ్చాడు. సాయంత్రం అంతా జుహూలో ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. వాడికి మళ్ళీ జ్ఞాపకం వచ్చింది –“ఆంటీ, సముద్రంలో ఇన్ని నీళ్ళు ఎక్కడినుంచి వస్తాయి?”

మిసెస్ రాయ్ వాడికి చెప్పడానికి ప్రయత్నించింది –“అరే నాయనా, నువ్వింకా దానిగురించే ఆలోచిస్తున్నావా. చూడు, సముద్రంలో ముందునుంచే ఇన్ని నీళ్ళు ఉన్నాయి.”

“ఆంటీ, సముద్రం అన్నిచోట్లా ఎందుకు ఉండదు?”

“పిచ్చినాయనా, సముద్రం అన్నిచోట్లా ఉంటే మనం ఎక్కడ ఉంటాం?”

“అన్నిచోట్లా నీళ్ళు ఉంటే ఎంత బాగుంటుంది, నేను నీళ్ళతో ఆడుకుంటూ ఉంటాను.”

‘’అయితే స్కూలుకి ఎప్పుడు వెడతావు, పనులు ఎప్పుడు చేసుకుంటావు, మందు ఎప్పుడు వేసుకుంటావు కొంటె కృష్ణయ్యా?”

“నేను మందు వేసుకోను. చేదుగా ఉంటుంది.”

“మందు వేసుకోకపోతే ఆరోగ్యంగా ఎలా ఉంటావు, చెప్పు, మరి అలాంటప్పుడు కబీరాతోనూ, గప్పూతోనూ ఎలా ఆడుకుంటావు?” ఆవిడ వాడిని బ్లాక్ మెయిల్ చేసింది.

“సరే, వేసుకుంటాను.” వాడు తన ఉచ్చులోనే తాను చిక్కుకున్నాడు.

***

పొద్దున్న సమయం. వాడు నిద్రపోతున్నాడు. మిసెస్ రాయ్ ఆఫీసుకి వెళ్ళడానికి తయారవుతోంది. వాడి దగ్గరికి వచ్చి ప్రేమగా వాడిని ముద్దాడింది. ఆవిడ పనిమనిషిని పిలిచింది –“మాయా, నేను సాయంత్రం ఇంటికి రావడానికి ఆలస్యం అవుతుంది. పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకో. నేను మధ్యమధ్యలో ఫోన్ చేస్తూ ఉంటాను.”

“సరే అమ్మగారూ.”

“పిల్లాడు లేచాక వాడికి వేడినీళ్ళతో స్నానం చేయించు. వాడు తనకి ఎలాకావాలో అలా ఆడుకోనీ. టైముకి అన్నం పెట్టు.”

“అలాగే అమ్మగారూ.”

“పిల్లాడికి టైముకి మందు వెయ్యి. ఏ బిళ్ళ ఇవ్వాలో తెలుసుకదా.”

“తెలుసమ్మగారూ.”

మిసెస్ రాయ్ ఒకసారి మళ్ళీ కుర్రవాడి బుగ్గమీద ముద్దు పెట్టుకుని వెళ్లింది.

***

కుర్రవాడు నిద్రనుండి లేవగానే అన్నింటికన్నా ముందు మొత్తం ఇల్లంతా ఆంటీకోసం వెతికాడు. ఆవిడ వాడికి ఎక్కడా కనిపించలేదు. వాడు ఏడుపు ముఖం పెట్టాడు. వాడికి వంటింట్లో మాయ కనిపించింది. ఇప్పుడు వాడు ఆమెని కూడా గుర్తుపట్టసాగాడు –“ఆంటీ ఎక్కడ?”

“అమ్మగారు పనిమీద వెళ్ళారు.”

“ఎక్కడికి?”

“ఆఫీసుకి.”

“ఆఫీసంటే ఏమిటి?”

“ఆఫీసు అంటే కచేరీ.”

“కచేరీ అంటే ఏమిటి?”

“అవన్నీ నాకు తెలియదు. అక్కడ చాలామంది కూర్చుని పనిచేస్తారు. అమ్మగారు రోజూ వెడతారు ఆఫీసుకి. సాయంకాలానికి తిరిగి వస్తారు. బాబూ, నువ్వు పాలు తాగుతావా ఇప్పుడు. ఆ తరవాత నువ్వు నీళ్ళు పోసుకుని ఆడుకో.”

“ఇవాళ కబీరా వస్తాడా?”

“అవును. డ్రైవరు వెళ్ళి కబీరాని వెతుకుతాడని, తరవాత చిన్నబాబు, కబీరా కలిసి ఆడుకుంటారని అమ్మగారు చెప్పారు.”

కుర్రవాడికి ఆనందం కలిగింది. ఇప్పుడింక వాడికి ఆంటీ అక్కర్లేదు –“మోతీ కూడా వస్తుందికదా?” – “అవును. మోతీ కూడా వస్తుంది.”

కాని మాయ హామీ ఇచ్చినాకూడా కబీరా రాలేదు. వాడు చాలాసార్లు బాల్కనీలోనూ, పెద్ద గదిలోనూ, మొత్తం ఇల్లంతానూ తిరుగుతూ తన స్నేహితులకోసం ఎదురుచూస్తున్నాడు. డ్రైవరుకూడా ఇంకా తిరిగి రాలేదు. వాడు నిస్సందేహంగా స్నానం చేశాడు, పాలు కూడా తాగాడు, మందుకూడా వేసుకున్నాడు. కాని వాడి ధ్యాస అంతా తలుపుమీదనే నిలిచిపోయి ఉంది. ఒక్క క్షణంకూడా వాడు విశ్రాంతి తీసుకోలేకపోయాడు. మాయ మాటిమాటికీ చెప్పినాకూడా వాడు నిద్రపోవడానికి సిద్ధపడలేదు. కబీరా వాళ్ళూ వచ్చి వాడు నిద్రపోతూవుంటే చూసి తిరిగివెళ్ళిపోతారేమోనని. వాడికి ఒంటరిగాఉండి విసుగ్గా ఉంది. గది అంతా బొమ్మలు చెదురుగా పడిఉన్నాయి. వాడు ఒక్కోసారి బాల్కనీలోకి వెడుతున్నాడు. మళ్ళీ లోపలికి వస్తున్నాడు. వాడి ముఖంలో కళాకాంతులు లేవు. ఈలోగా వాడు చాలాసార్లు ఏడ్చాడు. ఏంచెయ్యాలో వాడికి తెలియడంలేదు.

అప్పుడే ఫోన్ మోగింది. ఫోన్ మోగితే విని ఏంచెయ్యాలో వాడికి తెలియడంలేదు. వాడికి ఫోన్ ఎత్తడం తెలియదు. అప్పుడే త్వరగా మాయ వచ్చి ఫోన్ ఎత్తింది. ఆమె ఫోన్ వింటూనే అవును-అవును అని అంటోంది. తరువాత ఆమె వాడిని పిలిచింది –“బాబూ, అమ్మగారు చేశారు ఫోన్. నీతో మాట్లాడతారు.”

కుర్రవాడు ఫోన్ తీసుకున్నాడు. కాని దాన్ని ఎలా పట్టుకోవాలో వాడికి తెలియడంలేదు. మాయ వాడికి చెప్పింది –“హలో అనాలి.”

“హలో ఆంటీ, మీరు తొందరగా వచ్చేయండి. కబీరా రాలేదు.”
మిసెస్ రాయ్ వాడికి చెప్పింది –“నేను తొందరగానే వచ్చేస్తాను బాబూ. నువ్వు రెస్ట్ తీసుకో. సరేనా.”
“సరే.” వాడు ఫోన్ మాయకి తిరిగి ఇచ్చేశాడు.

***

కుర్రవాడికి మూడ్ బాగా పాడైపోయివుంది. వాడు గట్టిగట్టిగా ఏడ్చేస్తున్నాడు. మాయ ఒకసారి వాడిని ఎత్తుకుని ఊరుకోబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఒకసారి వాడికి బొమ్మలు ఇచ్చి మరిపిద్దామని అనుకుంటోంది. కాని కుర్రవాడు మాత్రం మారాంచెయ్యడం ఏమాత్రం మానడంలేదు. ఏ విధంగానూ వాడిని ఊరుకోబెట్టడం సాధ్యం కావడం లేదు. ఈలోగా మాయ అమ్మగారికి ఫోన్ చేసి వాడు అసలు ఊరుకోవడం లేదని, ఏంచేసినా వాడిని ఊరుకోబెట్టడం ఎంతమాత్రం వీలుకావటంలేదని చెప్పడానికి ప్రయత్నం చేసింది. ఏం చెయ్యాలో తోచడంలేదు. కాని ఆవిడ ఏదో మీటింగులో ఉంది. ఆవిడ వరకూ పరిస్థితిని తెలియజెయ్యడం వీలుపడటం లేదు. తను ఎప్పుడూ అమ్మగారికి స్వయంగా ఫోన్ అనేది చెయ్యలేదు.

మాయ వాడిని ధ్యాస మళ్ళించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. ఏంచెయ్యాలో ఆమెకి తెలియడంలేదు. అప్పుడే మాయ వాడికి రంగుపెన్సిళ్ళు, కాగితం తీసుకువచ్చి ఇచ్చింది. కుర్రవాడు దానిమీద అడ్డదిడ్డంగా గీతలు గీస్తూ కూర్చున్నాడు. కొంతసేపటికి వాడుతను ఆలోచిస్తున్న విషయాలు విడిచిపెట్టి మళ్ళీ మామూలు స్థితికి వచ్చాడు. అది చూసి మాయకి ప్రాణం తేరుకుంది. వాడు గీతలు గీస్తున్నాడు. ఒక్కోసారి గుండ్రంగా, మరోసారి నిలువుగా. వాడికి వాటితో ఆనందం కలుగుతోంది. వాడు అందులోనే నిమగ్నమై ఉన్నాడు. కాగితాన్ని రంగులతో నింపుతూ వాడికి నిద్ర వచ్చింది. వాడు అక్కడే పడుకుని నిద్రపోయాడు.

***

వాడు బాల్కనీలో నుంచుని ఉన్నాడు. కింద పార్కులో పిల్లలు ఆడుకుంటున్నారు. వాడు కొంతసేపు వాళ్ళని ఆడుకోవడం చూస్తూ ఉన్నాడు. ఉన్నట్టుండి వాడు మాయని అడిగాడు –“నేను కిందకి ఆడుకునేందుకు వెళ్ళనా?”

“వెళ్ళు బాబూ, కాని తొందరగా వచ్చేయ్.”

మాయ వాడికి బట్టలు మార్చింది. షూస్ తొడిగింది. వాడికోసం తలుపు తీసింది. మాయకి వాడు ఈ లోకంలోనివాడు కాడని తెలియదు. వాడు ఎక్కడినుండి వచ్చాడో, అక్కడ లిఫ్టు, చాలా అంతస్తుల భవనాలు, పిల్లల పార్కు, ఈ హంగులు, ఆర్భాటాలు ఉండవని తెలియదు. ఈ కుర్రవాడు ఈ లోకంలోకి తనంతట తాను రాలేదని, వాడిని ఇక్కడికి తీసుకువస్తే వచ్చాడని, చాలా విషయాల గురించి వాడికి అసలు ఏమీ తెలియదని ఆమె ఎరుగదు.

మాయ చూసిందల్లా కుర్రవాడు ఇంట్లోనే కూర్చుని ఉండి బోర్ అయిపోయాడని, కొంచెంసేపు కిందకి వెళ్ళి ఆడుకుని వచ్చేస్తాడని అనుకుంది. వాడిని తను దగ్గర ఉండి తీసుకువెళ్ళాలని, తరువాత తన సమక్షంలో కొంచెంసేపు ఆడుకోనిచ్చి మళ్ళీ తను దగ్గర ఉండి ఇంటికి తిరిగి తీసుకురావాలనే ఆలోచన ఆమెకి అసలు రాలేదు.

***

వాడు కొంతసేపు లిఫ్టుకి ఎదురుగా నిలబడ్డాడు. కాని, దాన్ని ఎలా తెరవాలో అర్థం కాలేదు. అటు మాయ కూడా తలుపు వేసుకుంది. వాడికి డోర్ బెల్ గురించి తెలుసుకాని అక్కడివరకు వాడి చెయ్యి వెళ్ళదు. వాడు నాలుగైదుసార్లు తలుపుమీద తేలికగా తపతపా కొట్టాడు. కాని లోపల పని చేసుకుంటున్న మాయకి అది వినపడలేదు. వాడు నెమ్మదిగా మెట్లు దిగసాగాడు. వాడు పిల్లల పార్కుకి చేరుకున్నాడు. వాళ్ళు ఆడుతూఉంటే తదేకంగా వాళ్ళని ఆశగా చూస్తూ నుంచున్నాడు. నిజానికి వాడు ఆ పిల్లలముందు తనని తాను చాలా చిన్నవాడిలా అనుభూతి చెందుతున్నాడు. నెమ్మదిగా వాడు వాళ్ళకి ఎదురుగా వచ్చాడు. కాని ఏ ఆట ఆడాలన్నది నిర్ణయించుకోలేకపోతున్నాడు. అనుకోకుండా ఒక బంతి దొర్లుకుంటూ వాడి కాళ్ళదగ్గరికి వచ్చింది. వాడు దాన్ని తీసి ఒక అబ్బాయికి ఇచ్చాడు. తెలియకుండానే వాడు వాళ్ళ ఆటలో కలిసిపోయాడు. వాళ్ళుకూడా వాడిని తమలో చేర్చుకున్నారు. వాడికి కూడా బాగుందని అనిపించింది. వాడు మిగిలినవన్నీ మరిచిపోయి బాగా తన్మయత్వంతో ఆడుకున్నాడు. చాలా సేపు వాడు వాళ్ళతో ఆడుతూ ఉన్నాడు. ఈలోగా చీకటి కమ్ముకోసాగింది. పిల్లలందరూ ఒక్కొక్కరే తిరిగి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళసాగారు. లేదా తమతమ ఆయాలతో, అక్కలతో, తల్లులతో కలిసి వాళ్ళు తిరిగి వెడుతున్నారు. వాడు కూడా ఆటలు ఆడి అలిసిపోయాడు. వాడికి కూడా తిరిగి ఇంటికి వెళ్ళాలనిపించింది. వాడు అడుగు ముందుకి వేశాడు. కాని తను ఏ బిల్డింగులోంచి బయటికి వచ్చాడన్నది వాడికి జ్ఞాపకం లేదు. ముందు ఒక బిల్డింగు వైపు వెళ్ళాడు. మళ్ళీ ఇంకో బిల్డింగు వైపుకి వెళ్ళాడు. వాడు తిన్నగా నిలబడలేక అలసటతో తూలుతున్నట్లు నడుస్తున్నాడు. కంగారుపడిపోయి ఏడవటం మొదలు పెట్టాడు. వాడు తన ఇల్లు మరిచిపోయాడు. ఏడుస్తూ-ఏడుస్తూ దారితప్పాడు. తను వెళ్ళవలసిన బిల్డింగునుంచి చాలా దూరం వచ్చేశాడు.

చీకటి పూర్తిగా కమ్మేసింది.

రోడ్డుమీద ఏడుస్తూ కుర్రవాడు ఒంటరిగా నడుస్తూనే ఉన్నాడు. కుర్రవాడు తిరిగి మళ్ళీ రోడ్డుమీదికి వచ్చేశాడు.

***

సూరజ్ ప్రకాష్ – పరిచయం

14 మార్చి 1952 న దెహరాదూన్, ఉత్తరాఖండ్ లో జన్మించిన శ్రీ సూరజ్ ప్రకాష్ సాహిత్యం విస్తృతమైనది. ఇప్పటివరకు ఆయన 9 కథాసంకలనాలు, నాలుగు నవలలు ప్రచురితమయ్యాయి. చార్లీచాప్లిన్ ఆత్మకథ అనువాదంతో సహా ఇంగ్లీషునుంచి అయిదు పుస్తకాలు, మహాత్మాగాంధీ ఆత్మకథ అనువాదంతో సహా గుజరాతీ నుంచి ఎనిమిది పుస్తకాల అనువాదం ప్రచురితమయింది. రెండు వ్యంగ్య సంకలనాలు, పదకొండు సంపాదకత్వం వహించిన పుస్తకాలు ఆయనకు చెందినవి. ఆయన గుజరాత్ సాహిత్య అకాడమీ, మహారాష్ట్ర సాహిత్య అకాడమీల ద్వారా సన్మానం పొందారు. రిజర్వ్ బ్యాంక్ లో డిప్యూటీ జనరల్ మానేజరుగా రిటైర్ అయిన తరువాత శ్రీ సూరజ్ ప్రకాష్ ప్రస్తుతం ముంబయి వాస్తవ్యులు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.