గ్రహింపు

-తోకల రాజేశం

అన్నీ అదుపులోనే ఉన్నాయనుకుంటాం

చేతిలోని గాజు గ్లాసు కిందపడి
భళ్ళున పగిలేదాకా అర్థం కాదు

మనస్సు ముక్కలయ్యాక కానీ
ఏం జరిగిందో బోధపడదు

దారపు ఉండ నుంచి పోగు
తెగినంత సులభంగా ఎలా తెగుతాయో బంధాలు?
అతుకుదామని చూస్తాం కానీ
ముడి తెగిన గాయాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది

అన్నీ అనుకున్నట్టే జరుగుతాయనుకుంటాం

అకస్మాత్తుగా వచ్చి కోసిన పంటనంతా
నీటి నోటితో నమిలి పారేస్తుంది తుఫాను

పిడుగులాంటి వార్త నెత్తిమీద పడిన తరువాత కానీ
కాళ్ళకింది భూమి బద్దలయిన సంగతి తెలియదు

చెట్టు మీది నుంచి పండు
జారినంత సహజంగా ఎలా రాలిపోతారో మనుషులు?
శోక సముద్రంలో దేవులాడుతాం కానీ
మళ్లీ ఎన్నడూ ఆ పలకరింపు గుండెను తాకదు

ఏదో ఘనసమైనదే సాధించామని అనుకుంటాం

బావిలోనుంచి బయటకు దూకే దాకా
లోకమేమిటో తెలిసి చావదు

ప్రపంచాన్ని పాతాళ గరిగెతో
తోడితే కానీ నిజం కనిపించదు

మట్టిలో నుంచి సరాసరి నింగిలోకి
క్షిపణి దూసుకెళ్లినంత గర్వంగా ఎలా ఎదుగుతాడో మనిషి?
కిందపడతాడని భయం నీడలో చేరతాం కానీ
కొన్ని చేతులు నేలమీద నిచ్చెనలల్లుతూనే ఉంటాయి

నా దగ్గర ఏదీ లేదనుకుంటాం

ఏకాంతం ఒడిలో గుండెలోకి తొంగి చూసుకునేదాకా
ఏది నీ జీవితమో స్పష్టం కాదు

అంతరంగానికి ముసురు పట్టినప్పుడు కానీ
నీ కోసం కొందరున్నారని అర్థం కాదు

ఏదీ మనది కాదనుకుంటాం
అన్నీ మనవేనని గ్రహింపులోకిరానంత వరకు
జీవితమేమిటో బొత్తిగా అర్థం కాదు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.