
బంజరు బోటి
– ప్రసాదరావు రామాయణం
చూస్తున్నాను
తదేకంగా
ఆవైపు…
ఆ కొమ్మ వైపు
కొమ్మపైని
కాకిగూటి వైపు
గూటిలోని పిల్లల వైపు
పిల్లల నోటిలో
మేత కుక్కుతున్న
తల్లి కాకివైపు…
గుండె మూలిగింది
మూగగా !
వేడి నిట్టూర్పు !!
చూస్తూనే వున్నాను
గోవు వైపు
గోవు పొదుగు వైపు
క్షీరం కుడుస్తున్న
లేగ వైపు
గోవు నిమీలిత నేత్రాల వైపు
నా పాలిండ్లలో
ఏదో పులకరింత
హృదయం మూలిగింది
తీక్షణంగా !
చెమరిన నా కనులు
నిగ్గదీశాయి చతుర్ముఖుని
పక్షులకున్న వరం
పసరాలకున్న వరం
నాకెందుకు ఇవ్వవు ?
చుట్టూ కాకులు కూస్తూనే ఉన్నాయి
కావు కావు మని కాదు
గొడ్రాలు గొడ్రాలని !
పేరంటాళ్లు వెలి వేశారు
పెళ్లికూతురు ఆశీస్సులకై అందరి పాదాలు తాకుతూ
నన్ను మాత్రం దాటి పోయింది !
బంజరు బోటిని కదా !!
కన్నీరు వత్తుకున్నాను
ఎవరూ చూడలేదని
అత్త మామల గొణుగుడు
పతిదేవుని సణుగుడు
ప్రేమబిచ్చం వెయ్యమని
నా చుట్టూ తిరిగిన ప్రియ వల్లభుడు !
మ్రొక్కమన్నారు
మ్రోక్కాను
పొర్లు దండాలన్నారు
పొర్లాను
వొడలు హూనమైనా
నోములన్నారు
నోచాను
ఉపవాసాలన్నారు
నీరసించాను
చేతిలోని మాస్టర్స్ సైన్సుడిగ్రీ
నవ్వింది వెక్కిరింపుగా !
వెచ్చించాను కాలం
వైద్యురాలి పరీక్షలకు
అచ్చెరువందింది ఆమె
బంజరు భూమి కాదే ?
నల్లరేగడి మాగాణి
పండక పోవడమేమిటి?
విత్తనాలు పరీక్షించాలి…
బ్రతిమాలాను
భర్తదేవుని
ఉరిమి చూశాడు
తరిమినట్టు నన్ను
పురుషాహంకారం !
పౌరుషం పొంగింది నాలో
చూపుతాను తల్లినై అని
ఎవరో కేకలేశారు నాలో !
చెంపలేసుకున్నాను తక్షణమే
ఎంత అపరాధ భావన!
కృంగిపోయాను నాలో నేను
అద్దం ముందు నిలుచున్నాను
ముద్దువచ్చే నామోమును చూస్తూ కాదు
నా చుట్టూ కందకపు వలయాలు
కంచెమీద కంచెలు
దాటలేను
దాటాలని అనుకోను !
మారిందన్న కాలం
మారనే లేదు !
సైన్సు పెరిగింది
సెన్సు తరిగింది !
*****

