
యాత్రాగీతం
నా కళ్లతో అమెరికా
అలాస్కా
-డా||కె.గీత
భాగం-9
ఆ మర్నాడు మేం తిరిగి వెనక్కి వెళ్లే ప్రయాణంలో భాగంగా తల్కిట్నా (Talkeetna) అనే ఊర్లో బస చేసి హెలికాఫ్టర్ ద్వారా గ్లేసియర్ల మీద దిగే అడ్వెంచర్ టూరు చెయ్యబోతున్నాం.
ఉదయం ఏడు గంటల ప్రాంతంలో దెనాలీ నేషనల్ పార్కు నుంచి సెలవు తీసుకుని రిసార్ట్ గుమ్మం దగ్గిరే తల్కిట్నా బస్సు ఎక్కేం. ఈ బస్సు నేషనల్ పార్కులోపల తిరిగే ఎర్రబస్సు కాకుండా మంచి డీలక్స్ బస్సు కావడంతో సంతోషించాం. అయితే అప్పటిదాకా రైలు ప్రయాణాలు వరసగా చేసినందువల్ల పిల్లలకి రైలు అలవాటు అయిపోయింది. తిరిగి రైలు ఎప్పుడెక్కుతాం అని అడగడం మొదలుపెట్టేరు. నిజానికి అమెరికాలో ఇప్పటివరకు ఇంత విరివిగా రైలు ప్రయాణాలు చేసింది లేదు మేం.
నాలుగు గంటల ప్రయాణం తర్వాత దాదాపు ఉదయం 11 గం.ల ప్రాంతంలో తల్కిట్నా లో రిసార్ట్ దగ్గిర దిగాం.
ఇక్కడి రిసార్ట్ చిన్న సైజు అడవి మధ్య, చుట్టూ కనుచూపుమేర గులాబీ రంగు, ఎరుపు రంగు పూలతో, ఎత్తైన గడ్డి, దట్టమైన మొక్కలతో భలే అందంగా ఉంది. రిసార్టు వెనక గుమ్మం లోంచి దూరంగా పారే నది, ఒడ్డున పరుచుకున్న ఇసుక కనిపిస్తూంది. లోపలికి అడుగుపెట్టగానే ప్రయాణపు బడలికంతా పోయి ఒక గొప్ప ఆనందం కమ్ముకొచ్చింది.
లాబీలో రెండు కాళ్ళమీద నిలబడ్డ దాదాపు 20 అడుగుల ఎత్తైన ఎలుగుబంటి బొమ్మని చూసి ఆశర్యపోయేం. ఎందుకంటే దాని తోలు నిజం ఎలుగుబంటిదే. ఇప్పటివరకు ఇంత భారీ ఎలుగుని ఎక్కడా చూళ్ళేదు.
ఇక ఒక తమాషా విషయం ఏవిటంటే ఆ ఎలుగుకి రెండు కాళ్ళకి ఎగువగా ఎత్తుగా ఉన్న రంధ్రాన్ని చూపించి మా సిరి పొట్ట మీదికి తన చొక్కా లాక్కుని తన బొడ్డు మాకు చూపించి అది ఎలుగుబంటి బొడ్డు అని చెప్పడం చూసి మాకు నవ్వాగలేదు.
ఇక మా బసలో చెకిన్ సమయం మధ్యాహ్నం మూడు గంటలకి మాత్రమే కావడం వల్ల మా లగేజీని రిసార్టు కౌంటరు వాళ్ళకి అప్పగించి అక్కడే ఉన్న రెస్టారెంటులో కానిచ్చి కాస్సేపు రిసార్టు చుట్టూ తిరుగుతూ ఫోటోలు తీసుకుంటూ తిరిగేం.
మరో గంటలో గ్లేసియర్ హెలికాఫ్టర్ టూరు పికప్ ఉంది మాకు. బస్సులో దారి పొడుగునా ఏవో స్నాక్స్ వంటివి తినడం వల్ల ఎవరికీ ఆకలిలేక భోజనాల్ని తిరిగి వచ్చే సమయానికి వాయిదా వేసేం. దాదాపు అరగంట వెయిటింగ్ తర్వాత గ్లేసియర్ టూరు పికప్ వాను ఎక్కేం.
రిసార్టు నుంచి పదిహేను నిమిషాల దూరంలో తల్కిట్నా చిన్న ఊరుని దాటుకుని మరో కొసలో ఉంది ఎయిర్ బేస్. ఇద్దరు నుంచి ఆరుగురు పట్టే దాదాపు పది పదిహేను చిన్న విమానాలతో, వచ్చి పోయే వాళ్లతో మంచి హడావిడిగా ఉంది. ఈ టూరు టిక్కెట్టు మనిషికి 200 డాలర్ల పైచిలుకే. ఇంత ఖరీదైనా వెనుకాడకుండా చాలా మంది వస్తున్నారు. అక్కడికి వచ్చి అప్పటికప్పుడు బుక్ చేసుకోవాలని అనుకున్నవారు కొందరు ఆ రోజుకి టిక్కెట్లు లేక నిరాశతో వెనుదిరగడం గమనించేం. టూరు మొత్తం ముందుగానే బుక్ చేసుకున్నందువల్ల మాకు ఎక్కడా సమస్యలు ఎదురుకాలేదు.
మా అందరికీ ఆ చిన్న విమానం ఎప్పుడెక్కుదామా గ్లేసియర్ మీదికి ఎప్పుడు కాలుమోపుదామా అని ఆతృతగా ఉంది. కౌంటరులో విమానంలోకి పట్టుకెళ్ళడానికి అతి చిన్న హేండ్ బ్యాగు తప్ప మిగతావన్నీ వదిలివెయ్యమని చెప్పారు. అంతేకాకుండా గ్లేసియర్ మీద దిగడానికి మంచు బూట్లు వేసుకోవడానికి ఇచ్చారు. కౌంటరు ఆఫీసుకి వెనక వైపు ఆరుబయట ఉన్న పెద్ద బాక్సుల్లో సైజుల వారీగా ఉన్న బూట్ల జతల్లో మాకు పట్టేవి తెచ్చుకుని వేసుకుని సిద్ధమయ్యేం.
నిజానికి బయట వెచ్చగానే ఉన్నా గ్లేసియర్ మీద చలిగా ఉంటుందని అందరికీ చలికోట్లు తొడిగేను నేను. దాదాపు ఒంటిగంట ప్రాంతంలో మా విమానం పైలట్ వచ్చి మమ్మల్ని పరిచయం చేసుకుని ముందుకు దారితీసేడు. ప్రయాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించి శబ్దం బాగా ఎక్కువ వస్తుంది కాబట్టి విమానంలో పైలట్ తో మాట్లాడాలన్నా, పైలట్ చెప్పేది వినాలన్నా మాకు ఇచ్చిన పెద్ద హెడ్ ఫోన్స్ తప్పనిసరిగా పెట్టుకోమని చెప్పేడు.
మా నలుగురితో బాటూ మరెవరో ఇద్దరు ఎక్కేరు మా విమానంలో. కిటికీ పక్కన ఒక్కొక్క సీటు మాత్రమే ఉండి సరిగ్గా ఆరు సీట్లు మాత్రమే ఉన్నాయి. సత్య కాక్ పిట్ లో పైలట్ పక్క సీట్లో కూచున్నాడు. నేను, పిల్లలు ఎవరికి వారు వరసగా ఒక్కొక్కరం కూచున్నాం. సిరి ఒక్కతే కూచోడానికి భయపడి పేచీ పెడ్తుందేమో అని మేం తెగ భయపడ్డాం. కానీ మమ్మల్ని భయపడొద్దని తన హెడ్ ఫోన్స్ తనే పెట్టుకుని సొంతంగా బుద్ధిగా కూచుంది. అంతేకాకుండా సరిగ్గా రెండు నిముషాల్లోనే నిద్రలోకి జారుకుంది.
****
(ఇంకా ఉంది)
ఫోటోస్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి –

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
