జానపద గేయ సాహిత్యంలో స్త్రీ వాదం

అత్యాధునిక తెలుగు సాహిత్యంవస్తు, రూప పరిణామం (2000-2020)

నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం

-సోనబోయిన సతీష్

జానపద విజ్ఞానాన్ని స్త్రీవాద దృక్పథంతో పరిశీలించినట్లయితే తరతరాల స్త్రీల సామాజిక ఆర్థిక పరిస్థితులే కాక పురుషాధిపత్య సమాజం స్త్రీ జీవితాన్ని ఏ విధంగా అణచివేసిందో, స్త్రీల సమస్యలు ఏ విధంగా అపరిష్కృతంగా మిగిలి పోతున్నాయో అవగతమవుతుంది. జానపద విజ్ఞానంలో జానపద సాహిత్యానిదొక పెద్ద శాఖ. మానవ సంబంధాల చరిత్రను రకరకాల ప్రక్రియల ద్వారా వ్యక్తం చేయడానికి ఈనాడు సాహిత్యం కంటే శక్తివంతమైన సాధనం మరొకటి లేదు. అయితే ఇతర సాహిత్య ప్రక్రియలలో స్త్రీల జీవితానుభవాల వివరణ, ఆంతరంగిక ప్రదర్శన జానపద సాహిత్యంలోవలె ఉండే అవకాశం తక్కువ. జానపద సాహిత్యంలో స్త్రీల ఆలోచనలు, అనుభవాలు, వారి అనుభూతులు ఏ అడ్డంకి లేకుండా కనిపిస్తాయి. వారి చైతన్యాన్ని పట్టి చూపుతాయి. స్త్రీ దృష్టిలో పరిశీలించినపుడు పురుషస్వామ్య ప్రధానమైన సమాజం స్త్రీల మాటలపైన, అంకరణపైన, నవ్వుపైన ఎన్ని ఆంక్షలు విధించిందో అర్థం చేసుకోవచ్చును. సాహిత్యాన్ని స్త్రీ దృక్కోణంతో చూడడం అనే పద్ధతి చాలా కొత్తది. దీనికొక గొప్ప నేపథ్యం ఉంది. ఈ శతాబ్దంలో వచ్చిన సాహిత్య ధోరణులలో స్త్రీవాద సాహిత్యం ఒక ప్రత్యేకతను, విశిష్టతను కలిగి ఉంది. వేదకాలంలో స్త్రీ స్వేచ్ఛను అనుభవించడమే కాక పురుషులతో సమానంగా విద్యాభ్యాసం చేసినట్టుగా విశ్వవర మొదలైన స్త్రీల చరిత్రలు చెపుతాయి. వివాహాల విషయంలో కూడ స్త్రీలకు స్వేచ్ఛ ఉండేదని, పదహారు, పదిహేడు సంవత్సరాలకు వివాహాలు జరిగేవని తెలుస్తుంది. అధర్వణ వేదకాలంలో స్త్రీల పరిస్థితులలో మార్పులు వచ్చాయి. స్త్రీ సంతానం కంటే పురుష సంతానమే కావాలని వాంఛించి పురుషసంతానం కోసం ప్రార్థనలు, పూజా విధానాలు మొదలయ్యాయి. స్త్రీల అంగీకారం లేకుండా వివాహాలు జరిగేవి. సూత్రకారుల కాలంలో బాల్యవివాహాలకు ప్రాధాన్యత హెచ్చింది. ఆపస్తంబుడు స్త్రీకి స్వేచ్ఛ ఉండకూడదని నియంత్రించాడు. ఇతిహాసయుగంలో స్త్రీ కొంత గౌరవాగౌరవాలకు పాత్రురాలైంది. స్త్రీ చంచల స్వభావానికి, అపనమ్మకానికి, నరక ద్వారానికి ప్రతీకగా చిత్రింపబడింది. పురాణాలు, ధర్మశాస్త్రాలు స్త్రీలను అణచివేసే సిద్ధాంతాలను తయారు చేశాయి. పురుషులకో ధర్మం, స్త్రీలకో ధర్మం నిర్దేశించాయి. భర్త ఆచార విహీనుడైనా, వేరొక స్త్రీని ఇష్టపడినా, విద్యాది సుగుణాలు లేకపోయినప్పటికీ పతివ్రత అయిన స్త్రీ అతడిని పూజించాలని నిర్దేశించబడింది.

బౌద్ధుల కాలంలో స్త్రీ పురుష వివక్ష తగ్గింది. బౌద్ధమతం స్త్రీ పురుషులకు సమానత్వాన్నిచ్చింది. హిందువులు బౌద్ధమతంలో ఉన్న నిర్వాణ విధానాన్ని తమ ‘‘సతి’’కి అనుకూలంగా మలచుకున్నట్టు ఆధారాలున్నాయి. మహమ్మదీయుల పరిపాలనలో బాల్య వివాహాలు తప్పనిసరి అయినాయి. కాకతీయుల కాలంలో విజయనగరం రాజుల కాలంలో, దక్షిణాంధ్ర యుగంలో వేశ్యావృత్తి కులంగా పరిణమించింది. శైవ వైష్ణవ మతాలు బసివిరాండ్రను దేవదాసీలను తయారు చేసినాయి. ఆంగ్లేయులు పరిపాలించిన కాలంలో వారు భారత సంస్కృతులలో ఉన్న లోటుపాట్లను గమనించి స్త్రీలకు అనుకూలమైన కొన్ని చట్టాలను అమలులోకి తెచ్చారు. రాజారామమోహన్‌ రాయ్‌ వంటి సంఘ సంస్కర్తల తోడ్పాటుతో సతి, బ్యా వివాహాల రద్దుకు ప్రయత్నాలు జరిగాయి. సతి నిరోధన చట్టాలు, వితంతు పునర్వివాహ చట్టం “Child Marriage Restrict Act”, “Hindu Married Women’s rights to seperate residence and maintenance Act” మొదలైనవి ప్రవేశ పెట్టబడ్డాయి. స్వాతంత్య్రం లభించిన తరువాత Hindu Inheritence Act”, “The Dowry Prohibition Act” మొదలైనవి ప్రవేశపెట్టబడినా ఈనాటికి సమాజంలో చెప్పుకోదగ్గ మార్పులేమి లేవు. రూప్‌కన్వర్‌ సతీసహగమనం లాంటి సంఘటలను మనం చూస్తూనే ఉన్నాం. వరకట్న సమస్య, కట్నం తేలేదన్న కోపంతో కిరోసిన్‌ పోసి తగులబెట్టడం మొదలైనవి ఇంకా మితిమీరిపోతున్నాయి. జానపద కుటుంబాలలో చాలా వరకు పది సంవత్సరాలు నిండక పూర్వమే పెళ్ళిళ్ళు చేస్తున్నారు. నేటికీ స్త్రీని భోగ వస్తువుగా, పిల్లలను కనిచ్చే యంత్రంగా చూస్తున్నారు. పురుషుల మనస్తత్వాల్లో మార్పు నామమాత్రమే వచ్చింది. ఎవరో వచ్చి ఏదో చేస్తారనే కాక తమ హక్కుల కోసం, సమానత్వం కోసం తామే పోరాడాలనే స్వభావంతో బయలుదేరింది స్త్రీవాదం. సమాజంలో తన అస్తిత్వపు ప్రాముఖ్యాన్ని నిలుపుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నంగా స్త్రీవాదం నేడు సంచలనం కలిగిస్తున్నది. కేవలం స్త్రీలకు అన్యాయం చేస్తున్న, దౌష్ట్యాన్నీ, దురహంకారాన్నీ చూపిస్తున్న పురుషులపైనే ఈ పోరాటం కాని పురుషజాతిని ద్వేషంచడం స్త్రీవాద లక్షణం కాదు.

స్త్రీ వ్యక్తిత్వం కోసం రచయితగా ఎక్కువ కృషి చేసింది గురజాడ. ఆ తరువాత చలం, కొడవటిగంటి కుటుంబరావు, శ్రీదేవి, రంగనాయకమ్మ, కె.రామలక్ష్మి, మాలతి చందూర్‌, వాసిరెడ్డి సీతాదేవి, డి.కామేశ్వరి, ఆనందారామం మొదలైన నవలా రచయిత్రులు పురుష దురహంకారం నుండి బయటపడడానికి స్త్రీలు చేస్తున్న ప్రయత్నాన్ని కొంతమేరకు తమ నవలల్లో చూపించారు. ముఖ్యంగా రంగనాయకమ్మ 1980లో వ్రాసిన జానకీ విముక్తినవల స్త్రీవాద నవలా సాహిత్యాన్నే ఒక కొత్త మలుపు తిప్పింది. ఓల్గా ఈ మార్గాన్నే అనుసరించింది. కవిత్వ రంగం నుండి ఎక్కువ సంఖ్యలో స్త్రీవాద కవయిత్రులు బయలుదేరారు.

జానపద సాహిత్యంలోనైనా, ఏ సాహిత్యంలోనైనా పురుషస్వామ్య వ్యవస్థ పరంగా స్త్రీలపై జరుగుతున్న అణచివేతలో భాగంగా స్త్రీల శారీరక సమస్యలను, స్త్రీ పురుష సంబంధపరమైన సమస్యలను, మాతృత్వపరమైన సమస్యలను స్త్రీ కోణంతో పరిశీలించ వచ్చును. ఈ ఉద్దేశ్యంతోనే ముఖ్యంగా జానపద సాహిత్యాన్ని పరిశీలించవచ్చు.

జానపద సాహిత్యంలో స్త్రీల పాటలదొక ప్రత్యేక శాఖ. స్త్రీల అనుభవాల చరిత్ర ఆధారంగా ఈ పాటలు రూపుదిద్దుకున్నాయి. కుటుంబానికి, భక్తికి, గ్రామ దేవతలకు, పనికి సంబంధించినవే కాక రామాయణ, భారత, భాగవతాలకు సంబంధించిన పాటలెన్నో స్త్రీలు పాడుకున్నారు. ఏ ఇతివృత్తం స్వీకరించినా స్త్రీల జీవితాల్లోని కష్టసుఖాలు, అనుభూతులే అందులో చోటుచేసుకుంటాయి. స్త్రీకి జరిగే అన్యాయాలు, అక్రమాలు, బ్రతుకు బాధలే ఆ పాటలలో ప్రతిధ్వనిస్తుంటాయి. వారి ఆలోచనా విధానాలు సమాజంలోని ఎగుడు దిగుడును వేలెత్తి చూపుతాయి.

వ్యవస్థలో వచ్చిన మార్పువల్ల పురుషుని అదుపాజ్ఞలలో బ్రతుకుతూ, వాని కనుసన్నలలో మసులుతూ జీవిస్తున్న స్త్రీలు, ముఖ్యంగా మధ్యతరగతి స్త్రీలు తమ మనోభావాలను కుటుంబానికి సంబంధించిన పాటలలో ఏ విధంగా వ్యక్తం చేశారో చూడవచ్చు.

స్త్రీకి నిండుదనాన్నిచ్చేది మాతృత్వం అని ఎన్ని సంపదలున్నా సంతానం లేకపోతే ఆమె బ్రతుకు వ్యర్థమనే అభిప్రాయాలు సమాజంలో ఉన్నాయి. సంతానం లేని కారణంగా పురుషులు ఎంతమందినైనా వివాహం చేసుకోవడం నేటికీ మనకు కనిపిస్తుంది. లోపం ఎవరిదయినప్పటికీ సమాజం దానికి ఆమోదముద్ర వేస్తుంది.

పసుపు కుంకుమలకు పోలేను లేను
పసిబిడ్డలను ఎత్తుకోలేను
ఒక్క బిడ్డనైనా ముద్దాడలేదు
గొడ్రాలి బ్రతుకయ్యే, గౌరవం లేదాయె

అని ఆ స్త్రీ పడే బాధ అంతా ఇంతా కాదు. ఒకవేళ సంతానం కలిగినా మగసంతానం కావాలని ‘‘తింటేను తీయదోస పండు తినాలి, కంటేను కొడుకుల్ల కాన్పు కనాలి’’ అనుకుంటారు.

బిడ్డగన్న తల్లి నీళ్ల కంటాబోతే
అమాస చీకటి ఆ బావిలోనా
కొడుకులగన్న తల్లి నీళ్లకంటాబోతే
కొసరి వెన్నెల గాసు ఆ బావిలోనా

అని ఆడపిల్ల తల్లికి జరిగే అవమానాన్ని మగపిల్లలపై మోజును వ్యక్తం చేసిందొక తల్లి.

సమాజం స్త్రీస్వామ్యం నుండి పురుషస్వామ్యానికి మారిన తరువాత స్త్రీలు ఆస్తి హక్కుతోపాటు, ఆత్మాభిమానాన్ని, వ్యక్తిత్వాన్ని ఏ విధంగా కోల్పోయారో స్త్రీల పాటల్లో సహజంగా కనిపిస్తుంది. అన్నదమ్ములు వేరుపడేటప్పుడు తోబుట్టువులు ఆస్తికోసం వారితో తగవులాడుతారు. ‘‘శ్రీరామ చింతల్లా చిగురంతా గడ్డి’’ అన్న పాటలో ‘‘అర్నామిత్తవు రార, అన్నా పెద్దన్నా’’ అంటూ అన్నను ఆస్తికోసం నిలదీసిందొక చెల్లెలు. ఆడదానికి నీకు అర్నాలెక్కడివే అని అంటాడు. ‘‘ఆడదాన్నిగనుకా, అటుబోతినన్నా, లేకపోతే నీతో సరిపోలూదాన్ని’’ అని మళ్లీ తగవులాడింది. అయినా అన్న వినడు. చివరకు ఏదో కనికరించి ‘‘యెంచుకోవే ఎడ్లా – పంచుకోవే బర్లా ఆవు పెయ్యాల అడుగ బోకమ్మా’’ అంటాడు. ఆస్తి మాటేమోకాని ఆ మాత్రం దయ చూపించాడని, తగవు పెంచితే ఫలితమేమి ఉండదనుకొని ఆ కొద్దిదానికే సంతృప్తిపడింది. సమాజంలో తన స్థానమేమిటో ఆమెకు తెలుసును కనుక.

కోటేసి పెట్టెల్లా ధనమూ నీకున్నా
కోకరైకే దాన్ని అన్నారో నేను
నూరేసి పెట్టెల్లా ధనము నీకున్నా
నూలు చీరెదాన్ని అన్నారో నేను
ఏడేసి పెట్టెల్లా ధనము నీకున్నా
పసుపు కుంకుమ దాన్ని అన్నారో నేను – అని మిన్నకుండిపోయింది.

పూర్వకాలంలో మేనరికాలవల్ల స్త్రీలకు ఆస్తి హక్కు ఉండేది. ఒక అల్లునికి మామ ఆస్తి ఇవ్వ నిరాకరించినపుడు ‘‘మా అమ్మ మీ తోడుపుట్టిందా లేదా’’ అని మామను అడిగాడు. ‘‘పుట్టితే పువ్వంచు చీరె నాడె పెట్టిన్నా’’ అని మామ అల్లునితో అంటాడు. పెద్దలదాకా వెళ్లింది ఈ పోట్లాట. అన్నా చెల్లెల తీర్పు చెప్పరాదనిరి – ఆకు తీగెవనం తెంపరాదనిరి! అయినా సంబంధానికి వెళ్లినప్పుడే ‘‘చేను చెరిసగమనిరి – పసుపుతోట్ల పాలు పణితి నిమ్మనిరి’’ అన్న ఒప్పందాన్ని పెద్దలు జ్ఞాపకం చేస్తారు. మేనరికాల వల్ల ఆస్తి హక్కు పునరుద్ధరించుకునే అవకాశం నాడు ఉండేది. స్త్రీలకు ఆస్తి హక్కులున్నట్లయితే వరకట్న సమస్య కొంతవరకు తగ్గేదేమో! ఏ రకమైన సంప్రదాయాలోనైనా స్త్రీయే దోపిడికి గురవుతుంది.

అన్నా చెల్లెలి వైరానికి సంబంధించిన కథలన్ని మాతృస్వామ్య, పితృస్వామ్య వ్యవస్థ సంఘర్షణలో ఉద్భవించినవే. ఎల్లమ్మ, ఈదెమ్మ కథలేకాక సామాన్యమైన జానపద కథలలో ఈ అంశం ప్రధానంగా ఉంటుంది. చేను కాపలాగా ఉన్న మరదలు పిట్టలను గొట్టి, ఈకెలు కొప్పులో ధరిస్తే వదిన చూచి అసూయపడి తన భర్తతో ‘‘పిల్లలాటగాన్ని పిలుచుకున్నాది’’ అని నిందమోపి ఆమెను చంపించింది.

భర్త వదలివేసిన స్త్రీ పుట్టింటికి వస్తే ‘‘సిగ్గుమల్లి అన్నాలింట సిగదిప్పరాదే బుద్ధిగల్ల అన్నాలింట బువ్వతినరాదే’’ అని వాపోయింది. నీ భర్త మంచివాడు కాదని ఎవరైనా ‘‘ఇండ్లలోనీ మొగుడు ఈగిల్వలేడెడొడ్లలో నీ మొగుడు దోమిల్వలేడే’’ అంటే ఆమె ‘‘ఈగిల్వ లేకున్న ఈగురవంతుడు’’ అని సమర్థించుకుంటుంది. స్త్రీ ఔదార్యాన్ని ఈ కథలు పట్టి చూపుతాయి.

భర్త చాటుగా ఇతర పురుషులతో సంబంధాలున్న స్త్రీలు గ్రామ వాతావరణంలో కనిపిస్తారు. ఒక స్త్రీ తన ప్రియుడితో ‘‘మా యింటికాడ మా బావ అడిగితే ` ఆలు మొగలామనరో, నా భర్త అడిగితే అన్న చెల్లెలా మనరో’’ అని గడుసుదనాన్ని కనబరచింది.

ఇంకొక కథలో తనను వేధించే వాడితో ‘‘చిన్నమ్మ కొడుకువురా – పడితివి నా భ్రమల పాపపు దురియోదనా’’ అని మందలించిందొక స్త్రీ. కొన్ని కుటుంబాలలో మామలు తమ కొడుకు భార్యలను కాముక దృష్టితో చూడడం, బలాత్కరించడం చేస్తారు. భర్తను కోల్పోయిన కోడలును వశపరచుకొన్న ఒక మామ ఆమెతో బయట పాత వరుస, ఇంట కొత్త వరుస’’తో పిలువుమంటాడు. నాగమ్మ కథలో కట్టమైసమ్మకు చిన్నకోడల్ని బలి ఇవ్వడానికి మామ ‘‘అటెటు పోరాదే నా చిన్ని నాగ’’ అని ఆమె మునిగిపోయే వరకు అక్కడే ఉన్నాడు. గురువమ్మ కథలో కరణం నర్సన్న గురువమ్మను కామించి, ఆమె భర్తను చంపినాడు. ఆమె భర్త చితిలో దహనం కాగా ‘‘మనుండి నీతోని ` మాట్లాడకున్న చచ్చిన నీతోని సావుసం జేసేను’’ అంటూ ఆమె ‘‘కాట్లో పొర్లాడగా’’ ఆమె ఆత్మ వెళ్లి ఆ విషయాన్ని బావతో చెప్పింది. వాడిని శిక్షించిన తరువాతన ఆమె ఆత్మ తృప్తి పడి వెళ్లిపోయింది.

జానపద స్త్రీలు తమ పాతివ్రత్యం చేత తమ భర్తలను రక్షించుకునే పతివ్రతల గాథలను ఎక్కువగా ఇష్టపడతారు. అటువంటి వస్తువు ప్రధానంగా కలిగిన గాథలెన్నో జానపద సాహిత్యంలో ఉన్నాయి. పురాశక్రరాజు కథలో జయప్రదాదేవి తనను బలాత్కరించిన షావుకారు సందుగలో దాగిన తన భర్త చెయ్యి వేస్తే తప్ప, దాని మూత రావొద్దని ఆనబెట్టింది. ఆమె భర్త చంద్రావతిని చేసుకొని వస్తూ మార్గమధ్యంలో ఆ సందుగను జూచి చెయ్యి వేస్తాడు, మూత తెరుచుకుంటుంది. జయప్రదాదేవి బయటకు వచ్చి భర్త కాళ్ళకు నమస్కరించడానికి పూనుకుంటే రాజుకు కాళ్లు ఖండిరచబడి ఉన్నాయి. అతడు రెండో పెళ్లి చేసుకున్నప్పటికి తన పాతివ్రత్య మహిమ చేత, అతనికి కాళ్లు అతికిస్తుంది. భర్త ఏమి చేసినా రాజీ పడడమేఉన్న సమాజంలో ఏ కథైనా సుఖాంతంగానే ముగుస్తుంది. అందుకే ఆడవాళ్ల బ్రతుకుకు సంబంధించిన ఎన్నో సామెతలు సమాజ స్వరూపాల్ని, దాని వికృతత్వాన్ని అద్దంలా చూపుతాయి.

‘‘ఆట పాటకు అవ్వగారిల్లు ` అలసి కష్టం జెయ్య అత్తగారిల్లు, కడుపుల్ల నొప్పులు కన్నతల్లికెరుక ` ఆడీడ దిరిగేటి అత్తకేమెరుక’’, ‘‘ఆడ పుట్టుకా కన్న ఆడి రాతకన్న, అడవి ఒక చెట్టు అయ్యిందే మేలు’’ అనుకొని శోకతప్తయ్యే స్త్రీల మనోవేదనలు ఏ సాహిత్యం చూచినా కనిపిస్తాయి. జానపదలు గాని శిష్టులు అనుకున్నవారు గాని సమాజంలో స్త్రీకి ఇచ్చిన విలువ ఎటువంటిదో అర్థం అవుతుంది. ఈనాడు స్త్రీలు తమ సమస్యల్ని శక్తివంతమైన శైలిలో తమ రచనల్లో ఎత్తిచూపి, సమాజ దృష్టిని స్త్రీ సమస్యల వైపు మళ్ళించడంలో కృతకృత్యులవుతున్నారు. ఇటువంటి చైతన్య శక్తిని అందిపుచ్చుకొని స్త్రీవాద సాహిత్యపు విలువల్ని గౌరవించి పరిష్కార మార్గాలను నిర్ణయించుకొని ముందుకు సాగాలి. చరిత్ర పురనావృతం కాకుండా చూసుకోవాలి. మారుతున్న సమాజపు విలువల ననుసరించి సాహిత్యాన్ని విశ్లేషించడం సరియైన పద్ధతి. వివేకవంతులైన స్త్రీలు తమ చైతన్యాన్ని తామే గుర్తించి ఉద్యమిస్తున్నారు. చదువు సంధ్యలు లేని జానపద స్త్రీలే మొట్టమొదట సారా ఉద్యమాన్ని నడిపి తెలుగుదేశాన్ని గడగడ లాడించినారు. అసలు సిసలైన మన సంస్కృతికి మూలమైన జానపద సాహిత్యాన్ని సేకరించి స్త్రీవాద దృక్పథంతో పరిశీలించినట్లయితే అట్టడుగు సమాజంలో ఉన్న సమస్యలను గుర్తించి, వాటికి ఏదో ఒక స్థాయిలో పరిష్కార మార్గాలను నిర్ణయించుకోవచ్చు.

ఈ వ్యాసానికి ఉపకరించిన గ్రంథాలు :

  1. స్త్రీల రామాయణం పాటలు – కృష్ణశ్రీ సంపాదకము
    2. పాలమూరు జిల్లా జానపద గేయాలు – కసిరెడ్డి వెంకటరెడ్డి
    3. రంగారెడ్డి జిల్లా జానపద గేయాలు – కసిరెడ్డి వెంకటరెడ్డి
    4. జానపద సాహిత్యంలో స్త్రీ ` రావి ప్రేమలత
    5. కరీంనగర్‌ జిల్లా స్త్రీల పాటలు – టి.సత్యనారాయణ (సిద్ధాంత వ్యాసం అముద్రితం)
    6. తెంగాణా స్త్రీల పాటలు (సిద్ధాంత వ్యాసం అముద్రితం) సత్యం రాజు
    7. ఆంధ్రుల జానపద విజ్ఞానం ఆర్వీయస్‌ సుందరం.

*****

Please follow and like us:

2 thoughts on “జానపద గేయ సాహిత్యంలో స్త్రీ వాదం (నెచ్చెలి & బెంగళూరు తెలుగు శాఖ అంతర్జాతీయ సదస్సు పత్రం)”

  1. నమస్తే మేడం నెచ్చెలి సంచికలు నా పత్రం వేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మేడం గారు ఈ నెల మ్యాగ్జిన్ పంపించగలరు మేడం పుస్తకం మరియు కొరియర్ చార్జీలు ఇస్తాను. మేడం దయచేసి ప్లీజ్ మేడం గారు

    1. Sateesh garu, Neccheli is only an online Magazine. It is not a printed Magazine. You can take a printout of your poem page if you would like to from the link.

Leave a Reply

Your email address will not be published.