
పడవలసిన వేటు
-శ్రీనివాస్ బందా
తెగిపడిన నాలిక చివరగా ఏమన్నదో
పెరకబడిన కనుగుడ్డు ఏ దౌష్ట్యాన్ని చూసి మూసుకుందో
లేతమొగ్గ ఎంత రక్తాన్ని రోదించిందో
అప్పుడే తెరుచుకుంటున్న గొంతు ఎంత ఘోరంగా బీటలువారిందో
చచ్చిందో బతికిందో అనుకునేవాళ్లు
పొలంలోకెందుకు విసిరేస్తారు
చిదిమేటప్పుడు చలించనివాళ్లు
చిన్నపిల్ల అని ఎందుకనుకుంటారు
కలెక్టివ్‌గా గంతలు కట్టుకుని
దుర్గకీ కాళికీ లక్ష్మికీ ఉత్సవాలు చేస్తాం
గదిలో ఏనుగు చుట్టూ గుడ్డోళ్ళం
సమస్యకి అనేక రంగులు పూస్తాం
నా సుఖప్పిల్లో కింద మూలుగు నొక్కేసుకుని
మరో కట్ట నోట్లమీదికి దృష్టిసారించి
రాత్రికి రమ్మా విస్కీయా బేరీజు వేసి
అలా చులాగ్గా వేలితో వార్తని పైకి తోసేసినంత మాత్రాన ఆగదు…
ఇప్పుడు స్పందించక తప్పదు
చప్పుడు చెయ్యకపోతే జరగదు
నా చెల్లీ నా తల్లిదాకా వచ్చేదాకా
ఆగటం సరి అనిపించుకోదు
రాక్షసుల గొంతు కాదు కోయాల్సింది
మీకు తెలుసు…
*****

పుట్టి పెరిగింది విజయవాడలో. ఆకాశవాణిలో లలితసంగీతగీతాలకి వాయిద్యకారుడిగా పాల్గొంటూ పాలొంటూ సైన్యంలో చేరి, రెండు దశాబ్దాల తర్వాత మరో పదకొండేళ్లు కార్పొరేట్లో కదం తొక్కి, మూడేళ్లక్రితం దానికీ గుడ్ బై చెప్పినప్పట్నుంచీ, గాత్రధారణలు, అనువాదాలు చేస్తూ, కథలూ కవితలూ రాసుకుంటూ, సాహిత్యారాధనలో ఢిల్లీలో నివసిస్తున్నాను.
