
ఒకరు లేని ఇంకొకరు
-భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు
అమ్మ లేని నాన్న…..
వెలిగించని దీపంలా
రాశిపోసిన పాపంలా
వెలుగే లేని లోకంలా
మూర్తీ భవించిన శోకంలా
శబ్దం లేని మాటలా
పల్లవిలేని పాటలా
పువ్వులులేని తోటలా
నవ్వులులేని నోటిలా
శిధలమైన కోటలా
గమనం తెలియని గమ్యంలా
పగలులేని రాత్రిలా
ఉంటారు.
నాన్న లేని అమ్మ ……
వత్తిలేని ప్రమిదలా
ప్రమోదం లేని ప్రమదలా
కళ తప్పిన కళ్ళలా
మమతలు ఉడిగిన మనసులా
ఒరలేని కత్తిలా
పిడిలేని సుత్తిలా
దిక్కులేని పక్షిలా
హక్కులేని సాక్షిలా
అంతంలేని శిక్షలా
గమ్యం ఎరుగని గమనంలా
రాత్రి లేని పగలులా
ఉంటుంది.
*****

నేను నా పదవ తరగతి నుండి కవిత్వం రాయటం చేస్తూ ఉన్నాను.నా కవితలు వివిధ అంతర్జాల పత్రికల్లో ప్రచురింప బడుతూనే ఉన్నాయి. కౌముది, సుజనరంజని,మాలిక,విహంగ, అచ్చంగా తెలుగు వంటివే కాకుండా మరికొన్నింటిలో కూడా ప్రచురింప బడినవి.నేను ఈ మధ్యనే మీ పత్రికను చదవటం జరిగింది.అందుకే మీకు ఈ కవిత పంపుతున్నాను.అమ్మా, నాన్నలంటే నాకు చాలా ఇష్టం. అందుకే ఇప్పటికి వారిద్దరిపైన55 కవితలకు పైనే రాసేను.ఇప్పటికి 45పైనే ప్రచురింప బడినవి. ఇంకా రాస్తూనే ఉంటాను.వారి ప్రేమకు సాటి ఏదీ లేదని నా అభిప్రాయం. ప్రస్తుతం ఇద్దరి అబ్బాయిల దగ్గర ఉంటూ, మనవలని ప్రేమతో చూసుకుంటూ, ఉండటమే నా ఉద్యోగం.
