
వెనుకటి వెండితెర-6
వెలుగు నీడలు
-ఇంద్రగంటి జానకీబాల
1950 ల తర్వాత తెలుగులో మంచి సినిమాలు తీసిన సంస్థలలో అన్నపూర్ణా పిక్చర్స్ ఒకటి అప్పటికే విజయా, వాహిని, భరణి లాంటి సంస్థలు కొన్ని ప్రయోగాలు చేస్తూ, సహజ సిద్ధమైన కథలతో సినిమాని రూపొందిస్తూ ప్రేక్షకుల్లోనూ, పరిశ్రమలోనూ మంచి గుర్తింపు పొందుతూ, ఆర్థికంగా కూడా విజయాలు చే చిక్కించుకుంటున్న సమయం అది.
ఒక మంచి కథ, అందులో ఆదర్శం సమాజానికి స్ఫూర్తి కలిగించే నీతి సహజత్వం వుండేలా చూస్తున్న కాలం అది. ‘వెలుగునీడలు’ అన్నపూర్ణా పిక్చర్సు వారు నిర్మించిన సినిమా. దీని నిర్మాత దుక్కుపాటి మధుసూదన రావుగారైతే అక్కినేని గిరికి కూడా చాలా ప్రమేయం వుండేదని చెప్పుకునేవారు. అంతవరకు సినిమాకి కథ అంటే కథ కోసం కలకత్తా వెళ్ళాల్సిందే అనే నానుడి వుండేది. అయితే అలాగే జరిగేవని కాదు కొంత ఆఛాయిలతో మన రచయితలు, దర్శకులు, నిర్మాతలు మంచి కథలు తయారు చేస్తూ పని మొదలు పెట్టేవారు. కథ పటుత్వంగా సాగేట్టు, సన్నివేశాలు బలంగా వుండేట్టు చూసుకునేవారు అలా రూపుదిద్దుకున్న కథ ‘వెలుగు నీడలు’ సినిమా కథకి ఫలానా బెంగాలీ కథ ఆదారం అని టైటిల్స్ లో వేయక పోవడం వల్ల ఇది సొంతగా రూపుదిద్దుకున్న కథే అని భావించాలి.
మానవ మనస్తత్వాలు, అహంకారాలు, అసూయలు, అనుమానాలు వన్ని ఇందులో చాలా అందంగా చిత్రించబడ్డాయి.
రావుబహుదూర్ వెంకటరామయ్యగారికి భార్య కనకదుర్గమ్మ, ఆ దంపతులకు పిల్లలులేని కారణంగా కనకదుర్గమ్మ చెల్లెల్లు కూతురు సుగుణని తెచ్చి ముద్దుగా పెంచుకుంటువుంటారు. సుగుణ తల్లి దంరడులు చనిపోవడంతో వారే అన్నీ అయి సుగుణను పెంచుకుంటూ వుండగా కనక దుర్గమ్మకి ఒక పిల్ల పుడుతుంది. అప్పట్నించి పెంచిన కూతురుమీద మోజు తీరి, ఆ చంటిదాన్ని విసుక్కోవడం చూసిన వెంకట రామయ్య, వారి పొరుగునే వున్న వెంగళప్ప దంపతులకు పిల్లని ఇచ్చి, పెంచుకుంటాడు. సుగుణ, చంద్రం మెడిసన్ లో సహాద్యాయులు. ఒకరియిందు ఒక ప్రేమనూ పెంచుకున్నారు. వారి మధ్య డా. రఘు వచ్చి, సుగుణని ప్రేమించానంటాడు తలో చంద్రంకి క్షయిరావడంతో అతనే సుగుణను ఒప్పించి రఘుతో వివాహం జరిపిస్తాడు. చంద్రంకి క్షయి తగ్గడం, కనకదుర్గమ్మ కూతుర్ని పెళ్ళి చేసుకోవడం రఘు ప్రమాదంలో మరణించటం ఇలా ఇలా కథ నడిచి చంరదం పెళ్ళాడిన వరలక్ష్మి అపార్థాలు, ఆమే తల్లి కుతంత్రాలు చివరికి అంతా సర్దుకుంని సుకాంతం. ఈ కథ సాగుతూ వున్నా ఇందులో రెండు మూడు పాటలు శ్రీ శ్రీ వ్రాసినవి అద్భుతంగా అమరిపోయాయి.
- పాడవోయి భారతీయుడా, ఆడిపాడవోయి విజయగీతికా
- రంగయో పూలరంగయో
- కలకానిది విలువైనదీ
ఈ మూడు శ్రీ శ్రీ వ్రాశారు. సినిమాకి సంగీతం కూర్చిన పెండ్యాల నాగేశ్వరరావు మంచి ట్యూన్స్ చేశారు. ఘంటసాల సుశీలా పాడారు. ఈ పాటలు చరిత్రలో శాశ్వతంగా నిలచిపోయాయన్న మాట నిజం.
ఈ వెలుగునీడలు సినిమాకి రచన ఆత్రేయ చేశారు. పాటలు శ్రీ శ్రీ కొసరాజు వ్రాశారు. మంచి సాహితీ విలువలు గల పాటలందులో వున్నాయి.
దర్శకత్వం ఆదుర్తి సుబ్బారావు వహించారు. దీనికి అసోసియేట్ గా కె. విశ్వనాథ్ పనిచేశారు.
అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, రేలంగి, సూర్యకాంతం, గిరిజ, ఎస్.వి.రంగారావు లాంటి మహామహులంతా వున్న ఈ చిత్రం మంచి విజయం సాధించింది.
కథ కొంచెం నెమ్మదిగా, జిడ్డుగా వున్నా బాగానే ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న చిత్రం ఇది. ఈ సినిమాకి విజయం చేకూరడానికి కారణం పాటల రచన సంగీతం అని చెప్పుకోవాలి.
అన్నపూర్ణా పిక్చర్స్ వారు నిర్మించిన ఈ ‘వెలుగు నీడలు’ వారికి మంచి పేరును, డబ్బునూ సంపాదించి పెట్టింది.
*****

ఇంద్రగంటి జానకీబాల గారు ప్రముఖ రచయిత్రి, గాయని. వీరు ఆరు కథాసంపుటాలు, పన్నెండు నవలలు, ఒక కవితా సంపుటి ప్రచురించారు. సినీనేపథ్య గాయనుల జీవిత విశేషాలతో కూడిన పరిశోధన గ్రంథం “కొమ్మా కొమ్మా కోయిలమ్మా” వంటివెన్నో వెలువరించారు. జానకీబాల గారు డిసెంబరు 4, 1945న రాజమండ్రిలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీ సూరి రామచంద్రశర్మ, శ్రీమతి లక్ష్మీనరసమాంబ. వీరు తణుకులోని సీతామహాలక్ష్మి జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలలో విద్యాభ్యాసాన్ని పూర్తిచేశారు. 1966లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగంలో చేరారు. సాహితీ ప్రముఖులైన శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారి మూడో కుమారులు ప్రముఖ కవి, విమర్శకులు శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు వీరి భర్త. వీరి కుమారులు శ్రీ ఇంద్రగంటి మోహనకృష్ణ, కుమార్తె శ్రీమతి ఇంద్రగంటి కిరణ్మయి ప్రముఖ సినీదర్శకులు. ఉద్యోగరీత్యా విజయవాడలో పాతికేళ్లపాటు నివసించారు. 1991లో ఉద్యోగ విరమణ చేసి హైదరాబాద్లో స్థిరపడ్డారు. వీరు ప్రముఖ ఆకాశవాణి లలిత సంగీత కళాకారిణి. లలితగీతమాలిక , శివాక్షరమాల కేసెట్లు విడుదల చేశారు. ఈటీవీ-2లో “పాటలపాలవెల్లి” కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు సినిమా పాటలపై పదలహరి సంగీతకార్యక్రమాన్ని రేడియోస్పందనలో నిర్వహించారు. సంగీత, సాహిత్యరంగాల్లో విశేష కృషిచేసిన జానకీబాల గారిని పలు పురస్కారాలు వరించాయి. “కనిపించే గతం” నవలకు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం, కథారచయిత్రిగా రంగా-జ్యోతి పురస్కారం, జ్యోత్స్నా పీఠం సంస్థ నుంచి కథారచయిత్రిగా జ్యోత్స్నాపీఠం పురస్కారం మొ.వి
