చిన్న- పెద్ద

-ఆదూరి హైమావతి 

అనగనగా ఒక అడవిలో చీమనుండి ఏనుగు వరకూ, దోమ నుండీ డేగవరకూ అన్నీ కలసి మెలసి జీవిస్తూ ఉండేవి. ఎవరూ ఎవ్వరికీ కష్టంకానీ, అపకారం కానీ తలపెట్టేవి కావు. చేతనైతే సాయం చేసేవి.

ఒకరోజున ఆ అడవికి ఏనుడు గజన్న స్నేహితుడుదంతన్న,చెలికాడిని చూడాలని వచ్చాడు . గజన్న మిత్రునికి మంచి విందుచేశాడు.  ఇద్దరూ ఒక మఱ్ఱి చెట్టు క్రింద విశ్రాంతిగా కూర్చుని చిన్న నాటి కబుర్లు చెప్పుకుంటున్నారు.

మఱ్ఱి చెట్టు మానువద్ద  పుట్ట కట్టుకున్న చీమలన్నీ  సైనికుల్లా వరుసగా నడుస్తూ ఆహార సేకరణ చేసు కుంటూ పోతున్నాయి.వాటిని చూసి దంతన్న ఫక్కున నవ్వి ” ఈ చీమలు ఇలావరుసగా పోతున్నాయి , మనం ఒక్క అడుగు వేస్తే ఇవీ ,వీటిపుట్టాకూడా నేలమట్టం ఐపోతాయి . చిరుజీవులు, వృధా జీవులు.  ”  అంటూ మళ్ళీ నవ్వాడు.

దంతన్న స్నేహితుని ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయాడు. “వీటికీ బతుకుమీద ఎంత ఆశ! ఎలా గింజలను తీసుకుపోతున్నాయో! ఇంత చిన్న జీవులు బతికితేనేం చస్తేనేం?  ఎవరిక్కావాలి వీటి స్నేహం” అంటూ మళ్ళీ తేలికచేసి అన్నాక దంతన్న ఉండలేక ,తమ అడవి నియమాలు తెలీనిది కనుక తన స్నేహితునితో ” అలా చులకన చేయకు  మిత్రమా! ఏ జీవిశక్తీ తక్కువ కాదు. భగవంతుడు ఏ జీవినీ వృధాగా పుట్టించడు. అన్ని జీవులూ భగవంతుని సృష్టిలోవే కదా!”అన్నాడు.

దానికి మళ్ళీ నవ్వి దంతన్న” వీటిముఖం ” అని స్నేహితునిమాట తీసేశాడు. ఇరువురూ కాస్త కునుకు తీశాయి. వారి మాటలన్నీ విన్న చీమల రాజూ, రాణీ బాధపడ్డాయి.

కొద్దిసేపటికి ఆచీమలన్నీ ధాన్య సేకరణ చేస్తున్న దారివెంట ఒక గుట్టమాటున ఒక వేటకాడు మాటేసి ఉండటం అవిచూసాయి. ఎందుకైనా మంచిదని తమ పరివారాన్నంతా హెచ్చరించి ఉంచాయి.ఇంతలో దంతన్నా, గజన్నా కమ్మగా నిద్రలో మునగ్గానే  వేట కాడు గురిచూసుకోను అటూ ఇటూ మెదులుతూ బాణం ఎక్కు పెట్టుకోడం చూసిన చీమలరాణి , హెచ్చరిక విని గండు చీమలూ, ఎర్రచీమలూ, కరెంటు చీమలూ, రెక్కల చీమలూ  అన్నీ ఒక్క సారిగా వేట గాని మీద దాడిచేశాయి. కొన్నీఅతదికళ్ళమీదా చెవులమీదా, చేతులమీదా కాళ్ళమీదా ఒకేసారిగా ఎక్కేసి కుట్ట సాగాయి. ఇది ఊహించని వేటగాడు కంగారు పడి ఎక్కుపెట్టిన బాణం పక్కకు వదిలేసి అరుస్తూ పరుగు లంకించుకున్నాడు.

ఆబాణం  నిద్రిస్తున్న దంతన్నా, గజన్నల పక్కన రివ్వున వచ్చి గుచ్చుకుంది.ఆ శబ్దానికి అవి మేలుకుని చూశాయి. బాధతో అరుస్తూ వెళుతున్న వేటగాని  అరుపులు విన్నాయి.

ఇంతలో చెట్టుమీదనుంచీ అంతా గమనిస్తున్న డేగ వచ్చి విషయం వివరించింది వాటికి .దంతన్న తాను పొరపాటుగా నోరుజారి వెక్కిరించిన చిన్న చీమలే తమను కాపాడాయని గుర్తించి మన్నించమని మనసారా  వేడుకుంది వాటిని.

గజన్న  ” చూసావా! మిత్రమా! నీవు చులకన చేసి మాట్లాడినా ఆచిరుచీమలే అఈరోజున మనప్రాణాలు కాపాడాయి. ఎవ్వరినీ చులకనచేయడంకూడని పని.” అని మిత్రునికి చెప్పగానే, పశ్చాత్తాపంతో కంటివెంట నీరుకారుస్తూ మరోమారు మన్నించమని చీమలను కోరింది దంతన్న.

పిల్లలూ! ఎవ్వరినీ తక్కువచేసి మాట్లాడకండి. ఎప్పుడోఒకప్పుడు ఎవరినుండీ ఐనా మనకు సాయం అవసరంకావచ్చు. మాటలతో బాధించి ఎవ్వరినీ దూరంచేసుకోకండి.

      *****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.