
ఆస్ట్రిచ్ పక్షుల దక్షిణాఫ్రికా
-డా.కందేపి రాణి ప్రసాద్
ఫస్ట్ క్లాస్ టిక్కెట్టు కొనుక్కొని రైల్లో ప్రయాణిస్తున్న మహాత్మాగాంధీ బ్రిటిషర్స్ చేత రైల్లోంచి గెంటివేయబడి సత్యాగ్రహానికి పూనుకున్న దర్బన్ ఘటన, స్వాతంత్య్రం కోసం పోరాడి ఇరవై ఏడు సంవత్సరాలు జైలు జీవితం గడిపి నోబెల్ శాంతి బహుమతి పొందిన దక్షిణాఫ్రికా తొలి దేశాధ్యక్షుడు నెల్సన్ మండేలా జీవితం, ఎగరలేని అతి పెద్ద పక్షులకు పుట్టినిల్లైన దేశం, ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఎగుమతి చేసే దేశాలలో ఒకటి, ప్రపంచంలో అత్యధిక వజ్రాల గనులు కలిగిన దేశం – ఇలా ఎన్నో రకాల ప్రత్యేకతలు కలిగిన దేశమైన దక్షిణ ఆఫ్రికాను జూన్ 2017లో దర్శించాం.
ఇథియోపియన్ ఎయిర్ లైన్స్ వారి విమానంలో దక్షిణాఫ్రికా చేరుకున్నాం. డాక్టర్ల కుటుంబాలు యాభై మందిమి కలిసి ఈ టూరుకు బయలుదేరాము. మొదటగా ఇథియోపియా దేశ రాజధాని అడ్డిస్ అబాబాకు చేరుకొని మరల అక్కడ విమానం మారి ‘జోహన్నెనస్ బర్గ్’కు చేరాము. ఇక్కడ ప్రోటియా హెూటల్ లో దిగి ఆ తర్వాత “క్రూగర్ నేషనల్ పార్క్”కు వెళ్ళాము. ఇక్కడ టైము భారతదేశ సమయం కన్నా మూడు గంటలు వెనక్కి ఉంటుంది. అక్కడ ఉదయం 9 గంటలు అంటే మన దేశంలో ఉదయం 12 గంటలు అవుతుంది. అక్కడ కరెన్సీని ‘రాండ్స్’ అంటారు. ఒక రాండ్ కు భారతదేశ కరెన్సీ 6 రూపాయలు. ఈ దేశానికి చాలా రాజధానులు ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ కాపిటల్ అంటే ‘ప్రిటోరియా’, ‘కేప్ టౌన్’ నగరమేమో లెజిస్లేటివ్ కాపిటల్. ‘బ్లోయమ్ ఫాంటి’ నగరం జుడిషయల్ కాపిటల్, ఇలా ఒక్కొక్క నగరం ఒక్కొక్క విభాగానికి. ఆఫ్రికా లోనే అతి పెద్దదైన, అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయం జొహాన్నెస్ బర్గ్ O R Jambo International Airport. దేశంలోని సగం మంది ప్రయాణీకులు ఈ ఎయిర్ పోర్ట్ ద్వారానే ప్రయాణిస్తారట. ప్రతి ఏటా సగటున 19 మిలియన్ల ప్రజలు ఈ ఎయిర్ పోర్ట్ ను వినియోగించుకుంటున్నారు. మేము జోహాన్నెస్ బర్గ్ నుంచి ఐదు గంటలు ప్రయాణం చేసి ‘క్రూగర్ నేషనల్ పార్క్’ చేరుకున్నాము. ఇక్కడ అడవి జంతువులన్నీ ‘జూ’లో కాకుండా స్వేచ్ఛగా ఉంటాయి. మనం మాత్రం అద్దాలు ఉండే జీపులో ప్రయాణం చేస్తూ వాటిని చూస్తాము. జూ పార్కుల్లో జంతువులు బోనుల్లో ఉంటే, ఇక్కడ మనం బోనులాంటి జీపుల్లో ఉంటాం. సింహం, పులి, ఏనుగు, రైనోసారస్ వంటి పెద్ద పెద్ద మృగాలు సైతం అడవిలో స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. అవి ఎదురుపడితే ఎలా అనే భయమేసింది. కానీ వాళ్ళు “మనం వాటిని ఏమీ చేయకుండా, విసిగించకుండా, ఆహారం మన వెంట లేకుండా వెళితే ఏమీ చేయకుండా వాటి మానాన అవి వెళ్ళిపోతాయి” అని చెప్పారు.
తొమ్మిది మంది పట్టే ఒక అద్దాల జీపులో కూర్చుని ప్రయాణం చేశాం. యాంటీలో పులు, జింకలు, రాబందులు, అడవిపందులు, దున్నపోతులు, మొసళ్ళు, తాబేళ్ళు, కొంగలు, వంటి చాలా రకాల జంతువులను చూశాము. ఆ తర్వాత మొదటిసారిగా సింహం కనిపించింది. దూరంగా ఉన్నది. కానీ దాని గర్జన వినిపిస్తోంది. మెల్లగా నడుచుకుంటూ పోతున్నది. గడ్డిపోచల్లో దాని రంగు కలిసిపోతున్నది. మనం అసలు గుర్తు పట్టలేక పోతున్నాం. ఆ తర్వాత ‘లెపార్డు’ను చూశాం. ఇదీ దూరంగానే ఉంది. ఏమంత భయమేయలేదు కానీ ఏనుగు మాత్రం మా జీపు దగ్గర దాకా వచ్చింది. అది ఒక సంవత్సరం ఉన్న గున్న ఏనుగట. దానికేమీ తెలియటం లేదు. తలను అడ్డంగా తిప్పుతూ గబగబా వచ్చింది. మా అందరికీ భయమేసి ‘జీపు పోనివ్వు’ అని అరిచాం. జీపు డ్రైవరు ప్రశాంతంగా చూస్తూ ‘డోన్ట్ పానిక్’ అని నిదానంగా అన్నాడు. అందరూ మెల్లగా మాట్లాడుతూ ‘పోనివ్వు, పోనివ్వు’ అంటున్నారు. ఇలా గుసగుసగా మాట్లాడితే దానికి అనుమానం వస్తుందట ‘మామూలుగా ఉండాలి’ అని చెప్పాడు డ్రైవరు. ఏది ఏమైనా మొత్తం ప్రయాణంలో ‘ఏనుగు’ ఒక్కటే భయపెట్టింది మమ్మల్ని, ఈ నేషనల్ పార్కులో ఏ చెట్టుకీ పెద్దపెద్ద ఆకులు కనిపించలేదు. పెద్ద పెద్ద వృక్షాలున్నాయి. సింహం, చిరుత పులి, ఏనుగు, రైనోసిరాస్, బర్రె – ఈ ఐదు పెద్ద జంతువులూ ఈ అడవికే ప్రఖ్యాతి చెందినవి. దంతాలున్న ఏనుగులు ఆఫ్రికా ఖండానికే ప్రత్యేకమైనవి. 19,485 చదరపు కిలోమీటర్ల స్థలం కలిగిన పార్కు ఇది. దీని హెడ్ క్వార్టర్స్ ‘స్కు జూజా’లో ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా క్రూగర్ పార్కులో తిరిగి మరల జోహన్నెస్ కు చేరుకున్నాం.
జోహన్నెస్ బర్గ్ లో గాంధీస్క్వెర్ అనే బజారు ఉన్నది. ఈ చౌరస్తా దగ్గర గాంధీ యువకుడిగా ఉన్న విగ్రహం ఉన్నది. చేతిలో పుస్తకంతో తల మీద జుట్టుతో యువ గాంధీని చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. మనమెప్పుడూ బోడి గుండుతో చేతిలో కర్రతో చిన్న పంచెతో ఉన్న విగ్రహాలు మాత్రమే చూశాం. పాంటూ షర్టుతో బారిస్టరు పుస్తకాలతో ఉన్న గాంధీని మేమంతా వింతగా చూశాం. ఇక్కడ దిగి ఫొటోలు తీసుకుందా మంటే వద్దన్నారు. ఈ ఏరియాలో దొంగతనాలు ఎక్కువట. బస్లో కూర్చునే ఫొటోలు తీసుకున్నాం. ఇంకా జోహన్నెస్ బర్గ్ అంతా తిరిగి చూశాము. ఓ చోట షాపింగ్ చేశాం. ఆఫ్రికా అడవుల్లోని గిరిజన జాతుల బొమ్మలు చాలా ఉన్నాయి. అక్కడ ఓ సింహం బొమ్మ దగ్గర ఫొటో తీసుకున్నాం.
జోహాన్నెస్ బర్గ్ ఎంపరర్స్ ప్యాలెస్ వెళ్ళాం. అక్కడ హెూటల్ లో ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. అక్కడ కృత్రిమమైన ఆకాశం ఉంటుంది. మధ్యలో నగ్నంగా ఉన్న ఓ పురుషుడి విగ్రహం, నాలుగు వైపులా షాపులు ఉంటాయి. విగ్రహం చుట్టూతా ఫౌంటెన్ ఉంటుంది. సాయం సమయంలో ఉన్న ఆకాశం ఎలా ఉంటుందో అలాంటి ఆకాశం తయారుచేయబడి ఉంటుంది. రాత్రి 12 అయినా అక్కడి ఆకాశం సాయంకాలంగానే ఉంటుంది. బయటికి వస్తే గానీ తెలియదు ఎంత చీకటి పడిందో. అక్కడ అందరూ చాలా ఫొటోలు తీసుకున్నారు.
జోహన్నస్ బర్గ్ నుంచి కులులు ఎయిర్ లైన్స్ లో ‘జార్జి’ అనే నగరానికి వెళ్ళాము, ఇక్కడ భోజనం చేసి బస్సులో ‘నైస్నా’ నగరానికి బయలు దేరాం. నైన్నా నగరం సముద్రపు ఒడ్డున ఉన్నది. ఇక్కడ క్రూయిడ్ షికారు చేద్దామనుకున్నాం. గానీ విపరీత మైన గాలి, చలి వచ్చింది. పెద్దపెద్ద తాటిచెట్లు సైతం వంగిపోతూ ఉంటే మనం కూడా ఎగిరిపోతామేమో అనిపించింది. అలాంటి సమయంలో సముద్రం మీద ప్రయాణం మంచిది కాదని వెళ్ళకుండా హెూటల్ లాబీలో అందరం కూర్చుని కబుర్లు చెప్పు కున్నాం.
నైస్నాలో ‘కాంగా కేవ్స్’ అని స్వతఃసిద్ధంగా ఏర్పడిన గుహల్ని చూడటానికి వెళ్ళాము. బయటి వాతావరణం అంత చలిగా ఉందా, లోపల మాత్రం చాలా వేడిగా ఉంది. అక్కడ ‘పీసాటవర్’ అని చూపించారు. అచ్చం అలాగే తయారయింది. అది ఒక మనిషి ముఖం, ఏంజెల్స్ వింగ్ అనీ రకరకాల ఆకారాల్ని ఆ గుహల్లో చూపించారు. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంకా అక్కడక్కడ నీటి చుక్కలు రాలుతున్నాయి. ఇక్కడ నుంచి ‘ఆస్ట్రిచ్ ఫామ్ కు’ వెళ్ళాం. అక్కడ చాలా ఆస్ట్రిచ్ లు ఉన్నాయి. ఇవి ఎగరలేని అతిపెద్ద పక్షులు. ఇందులో నల్లగా నిలనిగలాడుతూ, కాళ్ళ మీద గులాబీరంగుతో ఉన్నవి మగ ఆస్ట్రిచ్ లు. తెలుపురంగు, బూడిదరంగు కలిగి గులాబీరంగు పూసినట్లుగా రేకపోతే అవి ఆడ ఆస్ట్రిచ్ లు. ఆస్ట్రిచ్ లు దక్షిణాఫ్రికాలో పుట్టిన పక్షులు. ఇవి పెట్టే గుడ్లు చాలా పెద్దగా ఉంటాయి. ఒక్క గుడ్డును ఆరేడుగురు తినవచ్చు. అంతే కాకుండా ఈ గుడ్లు మీద ఉండే పెంకు చాలా గట్టిగా ఉంటుంది. ఈ గుడ్లను కింద పెట్టి వాటి మీద మనం నిలబడినా కూడా అది పగలదు అంత గట్టిగా ఉంటాయన్నమాట. అందుకే అక్కడ ఈ ఆస్ట్రిచ్ గుడ్ల పెంకులపై రకరకాల చిత్రాలు చిత్రించి అమ్ముతున్నారు. మేం కూడా చిత్రించిన గుడ్డునొకదాన్ని కొనుక్కున్నాం. వీటి కళ్ళు చాలా గుండ్రంగా పెద్దవిగా ఉన్నాయి.
ఆ తర్వాత ‘చీటాఫామ్’కు వెళ్ళాం. ఇక్కడ కూడా చాలా జంతువులున్నాయి.ఇవన్నీ మామూలు జూ పార్క్ వలె బోనుల్లో ఉన్నాయి. వీటినన్నింటినీ చూడటమే కాకుండా పులి బోనులోకి మనం వెళ్ళవచ్చు. ఇదొక స్పెషల్ దీనికొక స్పెషల్ టికెట్టు ఉంటుంది. అది తీసుకొని వెళ్ళాలి. ఇలాంటి వాళ్ళకు చేతులు, కాళ్ళు యాంటీ బాక్టీరియల్ వాష్ తో కడిగి పులి ఉన్న బోనులోనికి తీసుకెళతారు. అక్కడ దానిని ముట్టుకోవచ్చు, వీపు నిమరవచ్చు. ఫొటోలు తీసుకోవచ్చు. అయితే అక్కడి క్యూరేటర్స్ పక్కనే ఉన్నప్పటికీ మనకు భయంగానే ఉంటుంది. దాని మూడ్ ఎలా మారుతుందో అని. పిల్లలు అరుస్తూ గోల చేయటం వాటికి చిరాకట. పులితో సన్నిహితంగా ఉండటం, దీని వీపు మీద చెయ్యేసి ఫొటో దిగటం ఒక వింత అనుభూతి.
హిందూ మహా సముద్రం మీద క్రూయిజ్ షికారుకు వెళ్ళాము. సముద్రం మధ్యలో కొండలు, నీళ్ళ మీద పాముల్లా తేలియాడుతూ నీటి చెట్లు సన్నని తుంపరలు మన మీద పడుతూ ఫెర్రీ వెళుతుంటే చాలా సరదాగా అన్పించింది. ఇంత అందమైన అనుభూతిని అనుభవించాల్సిందే కానీ వర్ణించలేము. కొంత దూరం తర్వాత ‘స్కై డైవింగ్ ప్లేస్’కు వెళ్ళాం. ఇది మన దేశంలో లేదట. ప్రపంచంలో కొన్ని దేశాలలో మాత్రమే ఉండదు. అక్కడకు వెళ్ళాం అందరం. షెడ్డులో మూడు, నాలుగు హెలికాఫ్టర్లు పార్క్ చేసి ఉన్నాయి. హెలికాఫ్టర్ లో ఎక్కించుకొని 10,000 అడుగుల పైకి తీసుకెళ్ళి అక్కడ నుంచి పారాచ్యూట్ సహాయంతో కిందికి దిగాలి – ఇదీ స్కై డైవింగ్. మా గ్రూపులో కొంత మంది చేశారు. మా అబ్బాయి స్వాప్నిక్ కూడా స్కైడైవింగ్ చేశాడు. ఇది మొత్తం రికార్డు చేసి పెన్ డ్రైవ్ లో వేసి ఇస్తారు. ఇంకా స్కై డైవింగ్ చేసినట్లుగా సర్టిఫికెట్ కూడా ఇస్తారు. ఇదొక సాహసక్రీడ.
తరువాత రోజు ‘కేవ్ టౌన్’ కు వెళ్ళాం. అక్కడ ‘రాబిన్ ఐలాండ్’కు వెళ్ళాం. మన అండమాన్ దీవుల్లోలాగా ఇక్కడ కూడా జైళ్ళున్నాయి. ఇక్కడి జైలులో నెల్సన్ మండేలా ఉన్నగది చూపించారు. నెల్సర్ మండేలా 27 సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు. జైలులో కూడా వివక్ష చూపేవారట. కిందనే పడుకోవాలి. దుప్పట్లు లేవు. అక్కడి జైలు యొక్క నియమ నిబంధనలు, ఆ రోజుల్లో వారు పడిన కష్టాలు వివరిస్తుంటే కళ్ళు చెమర్చాయి. మాకివన్నీ చెప్పినతను కూడా ఆ జైలులో గడిపిన వ్యక్తేనట. అతను 8 సంవత్సరాల శిక్ష అనుభవించాడు. మండేలాను ఒక సారి కలిశాడట. అతను కూడా కొంత మండేలా పోలికలతో ఉన్నాడు. అతనితో ఒక ఫొటో తీసుకున్నాను.
టేబుల్ మౌంటెన్ కు కేబుల్ కార్లో వెళ్ళాము. ఇంతకు ముందు స్విట్జర్లాండ్ లో చూసి ఉండటం మూలంగా భయమనిపించలేదు. కొండపైకి చేరాక మైదానంలా ఉంటుంది. అక్కడ నుంచి చూస్తే హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం రెండు కనిపిస్తాయి. ఆ రెండూ కలిసిపోయిన బీచ్ ను చూశాము. రెండు మహాసముద్రా లను ఏకకాలంలో వీక్షించడం చాలా గొప్ప అనుభూతిని మిగిల్చింది. ఇక్కడి కొండలు రాళ్ళ మీద రాళ్ళు పేర్చినట్లుగా తమాషాగా ఉన్నాయి. ఒక చోట బంగారు గనులున్న కొండలు చూశాము. ఈ బీచ్ దగ్గరే సినిమా హీరో అక్షయకుమార్ ఇల్లు చూపించారు. ఇంకా కొండల మీద ఒక క్యాజిల్ లాగా ఉన్న మైకెల్ జాక్సన్ ఇల్లును గైడ్ చూపించగా అందరూ ఫొటోలు తీసుకున్నారు. మేం వెళ్ళిన పది రోజులు పది క్షణాల్లా గడిచి పోయాయి.
*****

నేను ప్రధానంగా బాలసాహిత్యం రాస్తాను.నేను సుమారుగా 40పుస్తకాలు రచించాను. బాలసాహిత్యం_విజ్ఞానికరచనలు అంశంపై PhD చేశాను.తెలుగు విశ్విద్యాలయం వరి ఉత్తమ రచయిత్రి పురస్కారం అందుకున్న ను.20 ప్రక్రియలలో రచనలు చేశాను.టీచింగ్ aids,memontoes, బొమ్మలు చార్టులు,చేయటం ఇష్టం. మిల్కీ museum nu నిర్వహిస్తున్నాం.sweety children library nI pillala kosam pettanu.