అతని ప్రియురాలు

-డా||కె.గీత

అతని మీద ప్రేమని
కళ్ళకి కుట్టుకుని
ఏళ్ల తరబడి బతుకు అఖాతాన్ని
ఈదుతూనే ఉన్నాను
అది మామూలు ప్రేమ కాదు
అతని కుటుంబపు
నిప్పుల గుండంలో
వాళ్ళ మాటల చేతల
కత్తుల బోనులో
నన్ను ఒంటరిగా వదిలేసే ప్రేమ-
చస్తున్నా మొర్రో అంటే
చావడమే శరణ్యమైతే చావమనే ప్రేమ
భరించలేను బాబోయ్ అంటే
పారిపోవడమే ఇష్టమైతే పొమ్మనే ప్రేమ
అయినా
సిగ్గూ శరం లేకుండా
ఆత్మాభిమానాన్ని
చిలక్కొయ్యకి ఉరితాడేసి బిగించి
కూపస్థ మండూకాన్నై కొట్టుకుంటూనే ఉన్నాను
ఏ మూసలో పోస్తే ఆ పాత్రనై
ఒదిగి మెదిగి
చలనం కాగలిగినా అచలనమై
ప్రయత్నం కూలబడ్డ అప్రయత్నభారానికి
ఇంకా ఇంకా కూరుకుపోతూనే ఉన్నాను

అయినా అన్నీ ముసుగు చాటున దాచిపెట్టి
అతనికి నా మీదున్న ప్రేమ
తుమ్మెదలు హొయలుపోయే
పూలవనమ్మీంచి వీచే తెమ్మెరని
తళత్తళ్లాడే కెరటాల్ని ముద్దాడి
పుప్పొడై తాకే నును వెచ్చని కిరణాలని

అతను
కన్నీటి నిప్పు రవ్వల్ని బుద్భుదంగా
తుడిచివేసే సఖుడని
రక్తమోడే విరిగిన కాళ్ళని ప్రేమతో
భుజానమోసే చెలికాడని
అతనే సత్యమూ జీవమూ మార్గమని
గొప్పలు పోయాను

అతనితో జీవించడమంటే
నిత్యం
సూది ముళ్ల కవాతే
ఓసారి
ఝంఝామారుతమై
విరుచుకు పడితే
మరోసారి
కుంభవృష్టిగా ముంచెత్తుతాడు

అయినా
అతని మీద ప్రేమతో
సప్త సముద్రాలు దాటగలనని
కష్టపడి సాధించుకున్న జీవనాధారాన్ని
తృణప్రాయంగా వదిలెయ్యగలనని
నాకే తెలియనంత పిచ్చి ప్రేమ

అతనికోసం
ఏటికెదురీదైనా
ఏడిపించిన వాళ్ళనీ
ప్రేమగా చూసే ప్రేమ
అతనికోసం
ఏ మూలకైనా
పరుగెత్తుకెళ్లి
సమస్యల్ని చిటికెలో
మాయం చెయ్యగలిగే ప్రేమ

నాన్నే ప్రాణమనే
పిల్లా జెల్లా
అతనికి
బహుమతులిచ్చి
ఓటికుండ బతుక్కి
‘నిండుప్రేమ’ని ప్రేమగా పేరుపెట్టుకుని
అదృశ్య శిలువను ఈడ్చుకెళ్తున్నా
ధీమా ప్రదర్శనల్లో లోలోపల జోకర్నైనా
పైకి గంభీరంగా నవ్వుతూ నవ్విస్తూ
మరీచిక జీవనరంగమ్మీద
యవనికనై గమనిస్తూ
అతని చిటికెన వేలందుకుని
అనుదినమూ నడిచే
అతని ప్రియురాల్ని మరి!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.