
ఈ తరం నడక – 14
ఉలిపికట్టెలు – పి.జ్యోతి
-రూపరుక్మిణి
బంధాలు – బలహీనతలు
ఒకరు రాసే రచనలతో రెండోసారి ప్రేమలో పడ్డాను. ఈసారి కథలు అనే కన్నా మన చుట్టూ ఉండే మనుషుల జీవితాల అంతఃమధనం అని చెప్పొచ్చు.
ఒకరికి మనసులో బాధగా అనిపించిన విషయం, ఇంకొకరికి తేలికగా అనిపించ వచ్చు. మరొకరికి చేదించలేని దుర్భలత అయి ఉండవచ్చు. వీటన్నింటికీ కారణం ఒకే సమస్య, కానీ వ్యక్తులు నిలబడిన స్థానాన్ని బట్టి పరిణామాలు మార్పు చెందుతూ ఉంటాయి.
ఇందులో అవకాశవాదులు ఉంటారు., స్వార్ధపరులు ఉంటారు., స్వాభిమానంతో బ్రతికేవారు, షరతులతో జీవించేవారు, షరతులను భేషరతుగా కాలదన్నేవారు ఉంటారు.
ఈ కథలో పాత్రలు మనతో ఎంతో సహజంగా మన మధ్య చేరి ఎవరి పక్షాన వారు మాట్లాడుతూ ఉంటారు. తప్పు ఇది, ఒప్పు ఇలా అని ప్రకటించే జాబితాలు ఉండవు.
స్వేచ్ఛకి, విచ్చలవిడి తనానికి మధ్య దూరం తెలియచెప్పే సందర్భాలు ఎదురవుతాయి.
ఏ ఇజాల వాదోపవాదాల గోల ఉండదు అంటే ఇక్కడ మాట్లాడే ప్రతి సందర్భము లోని విషయం సూటిగా మనుషుల మనస్తత్వపు పరిమళం యొక్క అవసరాన్ని చెప్తాయి.
ఈ పుస్తకం మొత్తము విమెన్ విక్టిమ్స్ మాత్రమే కాదు జెండర్ లెస్ గా విక్టీమైస్ చేయబడిన వాళ్లు కనిపిస్తారు. బాధిత మనసులు కనిపిస్తాయి.
ఆమెలు ఉంటారు అందులోనూ అమ్మలు ఉంటారు. ఆ అమ్మ తనంలో స్వార్థంతో కూడిన అమ్మ ఉంటుంది. ఆడపిల్లని అక్కడ పిల్లలుగా చూసే సమాజ న్యాయపు ఆలోచన కలిగించే బెరుకు కనిపిస్తుంది ఒక అమ్మలో., మరొక అమ్మ నిస్సహాయతలో ప్రేమించిన వ్యక్తికి పంచి ఇచ్చే ప్రేమలో పిల్లలకు మాత్రమే చెందే తల్లి ప్రేమను కలిపి పంచిపెట్టే తీరు నచ్చని కొడుకు ఎదురవుతాడు. అతనిలోని దుఃఖపు జీర ఎదురవు తుంది. గొంతులోనే మాట ఆగిపోయిన సమయాలు, నిర్మలమైన ఆకాశంలో కూడా ఉన్మాదపు ఉరుముల చప్పుడు వినపడతాయి.
మరో ఆమెకి కుటుంబంలోని బంధాలు బంధించిన తీరు, కన్నబిడ్డలకు కూడా మనసు విప్పి చెప్పుకోలేని కళ్ళ కింద నల్ల వలయాల మధ్య నలిగే తూగుటుయ్యాలల ఆలోచనల పై కుటుంబం పేరుతో జరిగే హింసకు ఆమెను ఆమె బలి చేసుకున్న కుటుంబ వ్యవస్థ పై తిరగబడితే బాగుండు అనిపిస్తుంది.
మనుషుల మధ్య బంధుత్వాలు సరిగా నడవాలంటే కొన్ని సర్దుబాటులో ఉండాలి కానీ ఆ సర్దుబాటు ఓ మనిషి అస్తిత్వానికి గురిచేసి ఆ మనిషిని కోల్పోయే బంధాలు, ప్రేమలు లేకున్నా పరవాలేదనిపిస్తుంది.
ఈ కథలోని ఏ పాత్ర ఏకపక్షంగా సమర్ధించినట్లు ఉండదు.
చిన్నచిన్న కుటుంబాల్లోని ఎదుగుతున్న ఇద్దరు పిల్లల తల్లిదండ్రులకు పరిష్కరించలేని సమస్యగా వారి పెంపకం ఎదురైనప్పుడు. పురుష స్వామ్య ప్రపంచం మన సామాజిక నడకను భగ్నం చేసి, ఆడపిల్లల భవిష్యత్తుకి గోడలు నిర్మించడం చూస్తాము. అటువంటి సందర్భంలో నిస్సహాయత ఆ తల్లిదండ్రులదా ఆ పిల్ల లేదా అన్న ప్రశ్న వస్తుంది. ఎదుగుతున్న కొడుక్కి వయసులో ఉండే కూతురితో ఎలా ఉండాలో కూడా చెప్పలేని కట్టుబాట్లు చట్రాలు నిర్మించుకున్న వ్యవస్థలోని లోపాలను , పడే వేదనను చూపిస్తాయి ఓ కథలో.
ఒంటరి మహిళ అంటే తనకే బరువు బాధ్యతలు ఉండవని ఈ సమాజంలో భర్తతో కలిసి జీవించలేని వారి పట్ల తోటి ఉద్యోగస్తులు పంచే పని భారంలోని మానసిక ఒత్తిడిని చెప్పేటప్పుడు మొత్తం కథంతా ఆత్మాభిమానం నిలబెట్టుకోవలసిన అవసరాన్ని చెబుతూనే ఒక్కోసారి మనిషికి మొండితనం ఎంత అవసరమో అందునా ఒంటరి తనానికి మొండితనం ఎంత అవసరమో తెలుస్తుంది.
మనుషులు చనిపోయిన తర్వాత పంచుకుంటే వచ్చే ఆస్తిపాస్తుల కోసం జరిగే సంఘర్షణలో అతి చిన్న విషయాల కోసం కుళ్ళి కృషించిపోయే మానవ స్వభావాలను కలుస్తాము. ఆ పాత్రకి న్యాయం జరిగిందేమో అన్న భావాల్ని రూపొందించుకుంటూనే ఈ జాతీయాలని వదిలించుకోలేని స్థాయిలో అనేక భావావేషపురూపాలు కనిపిస్తూ ఉంటాయి.
నిస్వార్ధంగా ఆలోచించే గురువులు ఉంటారు స్నేహితులు ఉంటారు ఎదిగే పిల్లల్లో వచ్చే మార్పులు వాళ్ళల్లో రేపే అలజడులు ఉంటాయి.
ఆధునిక మిత్రుల మధ్య స్నేహం వైఫ్ స్వైపింగ్ వరకు వెళుతుంది వాళ్ళ ఆలోచనల్లో వాళ్లకి అది న్యాయం మరి అన్యాయం ఎవరిది ? ఇక్కడ మన ఆలోచనలకు విరుద్ధంగా మనం ప్రవర్తించడమే మనకు మనం చేసుకునే శిక్ష అని అనన్య కథ చదువుతున్నప్పుడు అనిపించక మానదు.
ఆస్తి,పాస్తులు అందం, చందం అన్నీ ఉన్న బానిసలు ఉంటారు. అందులో స్త్రీలే భాగం అవుతూ ఉంటారు. ఇక్కడ గడుసుతనం నేర్వని నాడు హింస ప్రేరణ పొందు తుంది. ఎమోషన్స్ నీ పక్కన పెట్టి తన మనసుకి తానే నిర్ణయించుకునే న్యాయం వైపు నిలబడడం శిక్ష కథలో సుధ పాత్ర కనిపిస్తుంది.
శారీరక సంబంధాలను దాటి మానవ సంబంధాలను ఆడ మగ అంటే శారీరక బంధమే ముడి వేస్తుంది అనే జాడియం నుండి బయట వేసే పరిస్థితులు మానసికంగా ముడి వేసుకున్న మనుషులు ఉంటారు. అలా అని వారి మధ్య ప్రేమ అనే వారధి ఉండాలని లేదు. బంధాలను పంచుకునే బాధ్యతలు ఉంటే చాలు అనిపిస్తుంది.
అలసిన మనసుతో కాస్త స్వాంతన పొందేందుకు ఆకాశం కింద ఎక్కడ ఊపిరి సలపని సమయాలు కొన్నిసార్లు ఎదురవుతాయి అటువంటి సమయాల్లో అనుకోని అతిథులు మన జీవితాల్లోకి వచ్చి ఎంతో నేర్పుగా మనల్ని మన లోపలి మనసుని పరిచయం చేస్తారు అటువంటి మాట భరోసానిచ్చే కథ స్ట్రాంగ్ ఉమెన్.
ఇక్కడ నేను ఏ కథ గురించి ప్రత్యేకంగా చెప్పబోవడం లేదు. కారణం ఇక్కడి ప్రతి కథలో ఓ అంతఃమదనం ఉంటుంది. మనుషులు స్వార్థపూరిత జీవితాల్లో నలిగే మనసులు ఉంటాయి. మంచి చెడు తప్పు ఒప్పులు పాటకుడికి వదిలివేయడం ఈ కథలోని ప్రత్యేకత. ఒక్కో కథ ఒక్కో సమయానుకూల సత్యాలను మన ముందు పరిచి మనల్ని సమాధానపరిచేలా చేస్తాయి. ఈ కథల్లోని పాత్రలు .
ఈ కథలోని పాత్రలు పేర్లు కూడా భలే సహజంగా ఉంటాయి. ఎక్కడ తెచ్చి పెట్టుకుని రచయిత మనతో ఏ సంభాషణ చేయరు. ఏ పాత్ర అవసరానికి మించి ఒక్క మాట, సంఘటన ఉండదు. అంతేకాకుండా ఈ కథల్లో కథ వెనుక కథలు కూడా ఉంటాయి. అంటే పాత్రలు వాటి అంతట అవే మనల్ని ఇంకో కథలోకి తీసుకువెళ్లి, మూల కథని పరిచయం చేసి చాలా తేలికగా బయటకు వస్తాయి.
“ ఈ పుస్తకం మొత్తానికి సరిపడే ఒకే ఒక వాక్యం”
బంధాల మధ్య ఇరుక్కున్న వ్యక్తికి జీవితంలో రెండే మార్గాలు. ఆ బంధాలకు లొంగిపోవడం లేదా వాటి నుండి బయటపడడం.
విలువల కోసం అన్నింటినీ అందరినీ వదులుకునే వ్యక్తులు కొందరికి మూర్ఖులుగా కనిపిస్తారు. కానీ అది వాళ్ళ వ్యక్తిగత విషయం అన్న స్పృహ చాలా కొద్ది మందిలోనే ఉంటుంది.
“ ఎమోషనల్ డిపెండెన్స్ అనేది మానిప్లేట్ చేసేవారికి నీవిచ్చే ఆయుధం.” అంటారు ఓ కథలో రచయిత్రి. ఇలాంటి మాటలు మనకి చాలానే తారసపడతాయి ప్రతి కథ లోపల.
ఒకటి రెండు కథలు మాత్రం ప్రారంభంలో అనేక పాత్రలు ఒక్కసారిగా రావడం వలన రీడర్ మైండ్ రీ రీడింగ్ చేయాల్సి వస్తుందేమో…!
జ్యోతి గారు తన అక్షరాల్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ల కనిపిస్తారు. తను చెప్పదలుచు కున్న దాంట్లో చాలా స్పష్టత ఉంటుంది. ఈ కథల్లో తన జీవితంలో ఎదురైన జీవిత గాధలనే కథలుగా మలిచాను చెప్పడం మరింత బావుంది. తన కథలతో అంతకు ముందు పరిచయమే., వివిధ మ్యాగజైన్స్ ద్వారా చదివినప్పుడు తన కథలు ఆ రోజుకు సరిపడా మెదడుకు మేత వేసేవి. ఇప్పుడు పదిహేను కథలు ఒకే దగ్గర చదువుతుంటే చుట్టూ ప్రవహించే కాలం స్తంభించినట్లుగా ఉంది.
ఉలిపి కట్టెలు కథలపుస్తకం, రచయిత్రి పి జ్యోతి గారికి అభినందనలు. జ్యోతి గారు థాంక్యూ సో మచ్ ఈ పుస్తకం నా బుక్ ర్యాక్ లో ఎప్పటికీ ఉంచుకోదగ్గ పుస్తకం.
*****

పేరు కె.రుక్మిణి. చదువు ఎమ్మే ఎకనామిక్స్ & తెలుగు. కవి, రచయిత, టీచర్ & సామాజిక కార్యకర్త. కలం పేరు రూపరుక్మిణి. రచనలు : 1.అనీడ 2.మిగుల్చుకున్న వాక్యాలు. వివిధ సంకలనాలలో, పత్రికలలో కవితలు, కథలు, సామాజిక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. పుట్టి, పెరిగింది, విద్యాభ్యాసం ఖమ్మంలో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.