శరసంధానం

-శీలా సుభద్రాదేవి

ఒకసారి ప్రశ్నించాలి
అని అనుకుంటూ అనుకుంటూనే
ఏళ్ళకి ఏళ్ళు నడుచుకుంటూ వచ్చేసాను

ఏమని ప్రశ్నించాలా అని ఆలోచిస్తే
సమాధానాలెట్లా రాయాలో నేర్పించారు కానీ
బళ్ళో పదేళ్ళ చదువు కాలంలో
తదనంతర చదువుల్లోనూ
ఏ ఒక్క మాష్టారూ కూడా
ప్రశ్నించటం మాత్రం నేర్పలేదు.
ఎక్కడో ఏదో పురుగు దొలిచి
అడగాలనుకునే ప్రశ్న
ఎర్రని చూపు తాకి మసై రాలిపోయేది

మాటిమాటికీ ప్రశ్నే కొక్కెంలా
నావెనుక ఎప్పుడు తగులుకొందో గానీ
నా అడుగులు ముందుకుపడకుండా
నిత్యమూ వెనక్కి లాగుతూనే వుంది

అయినాసరే
ఎప్పుడు ఏ అక్షరం
నా మనో క్షేత్రంలో నాటుకుందో
నా వంటిమీదే కాదు
నా అంతరాంతరాల నిండా
ప్రశ్నలు మొలకెత్తుతూనే వున్నాయి.
అటువంటప్పుడు అంపశయ్య మీద భీష్మలా
ప్రశ్నల పరుపుపై నిద్రపట్టక దొర్లుతాను

ఇకపై
మనసునిండా ఎందుకు నాటావని
ప్రశ్నల్ని తుంచి దుఃఖసముద్రంలో నానుస్తూ
మీనమేషాలు లెక్కబెట్టే పనేలేదు

ప్రశ్నించనీయకుండా చేసిన
నీ మీదా,ఈ సమాజం మీదా
ఈ సాంప్రదాయాల లక్ష్మణ రేఖల్లో
నన్ను బంధించిన ప్రతీ ఒక్కరి మీదా
శరసంధానం చేయటానికి నాదే ఆలస్యం
ఇకపై ప్రశ్నించి నిలదీయాల్సిందే

*****

Please follow and like us:

One thought on “శరసంధానం (కవిత)”

  1. నిజంగా ఎక్కుపెట్టిన వేనవేల మహిళల మనసులలో మీది ఎక్కుపెట్టిన ప్రశ్నే.

Leave a Reply

Your email address will not be published.