నా జీవన యానంలో- రెండవభాగం- 58

-కె.వరలక్ష్మి

          2015 జనవరిలో మా గీత నాకోసం టిక్కెట్టు కొనేసి మరోసారి నాకు అమెరికా ప్రయాణం పెట్టింది.

          ఫిబ్రవరి 4న మా అబ్బాయి, కోడలు, చిన్నమనవరాలు సవర్ణిక వచ్చి తెల్లవారు ఝామున 4 గంటలకి నన్ను ఎయిర్ పోర్ట్ లో దిగబెట్టేరు. బ్రిటిష్ ఎయిర్ వేస్ లో చెకిన్ తొందరగానే అయిపోయింది. ఉదయం 7. కి ఫ్లైట్ కదిలింది. పది గంటలు గాల్లో ప్రయాణించి లండన్ హీత్ రో ఎయిర్ పోర్ట్ చేరేసరికి అక్కడ టైం 11.20 అయ్యింది. ఇండియాలో సాయంత్రం 5.00 అయి ఉంటుంది. అప్పటినా హేండ్ లగేజి బేగ్ కు చక్రాలు లేవు. బేగ్ ని మొయ్యలేక ఈడ్చుకుంటూ వెళ్తూంటే ఒకామె వెనక నుంచి వచ్చి నా చేతిలో బేగ్ అందుకుంది. పేరు సుధ అని చెప్పినట్టు గుర్తు. షికాగో వాళ్ల అమ్మాయి దగ్గరకి+తన ఉద్యోగం పనిమీద. నా ఫ్లైట్ 3 గంటలకి, తనది 4 కి. అంతసేపూ నాతో బాటే ఉండి 2.30 కి నేను వెళ్లాల్సిన గేటువైపు వెళ్తున్న ఒక ఫారినర్ జంటకి నన్ను అప్పగిం చింది. ఆ అబ్బాయి నా బేగ్ మోసి తెచ్చి నన్ను నా గేట్ లో కూర్చోబెట్టి వెళ్లేడు. ఫ్లైట్ కొంత ఆలస్యంగా 3.45 కి కదిలింది. నా సెల్ ఫోన్ లో చూస్తే ఇండియాలో టైం రాత్రి 9 కావస్తోంది. లండన్ నుంచి ఫ్లైట్ మళ్లీ మరో 10 గంటలేమో (?) ప్రయాణించి శాన్ ఫ్రాన్సిస్కోలో ఆగేసరికి అక్కడి టైం రాత్రి 6.20 అయ్యింది. చెకిన్ అయి బైటికొచ్చేసరికి 7.45 అయ్యింది. గీత, వరు వచ్చి ఉన్నారు. తన కారులో సన్నీవేల్ లో గీతవాళ్లు రెండేళ్ల క్రితం కొనుక్కున్న ఇంటికి చేరుకున్నాం. ఇదివరకు వచ్చినప్పుడు గీతవాళ్ళు అద్దెకున్న ఇల్లులా కాక ఈ ఇల్లు విశాలంగా అన్ని సదుపాయాల్తో ఉంది. తెల్లారి లేచేక చూస్తే పెరట్లో నారింజ చెట్టు, దాన్నిండా గుత్తులు గుత్తులు పెద్ద పెద్ద నారింజపళ్లు. జూసర్ తో రసంతీస్తే ఒక్కకాయ రసంతోనే ఒక పెద్ద గాజు గ్లాసు నిండిపోయేది. బైటికెళ్తే చుట్టుపక్కల నిమ్మ, దబ్బ, నారింజ లాంటి పళ్లచెట్లు, చెట్లకింద రాలిపడిన పళ్లు, అందంగా విరబూసిన గులాబీలు ఇంకా పేరు తెలీని ఎన్నెన్నో పూల మొక్కలు, రెడ్ ఉడ్ లాంటి వృక్షాలు, అటుబైట మెయిన్ రోడ్డు ప్రశాంతమైన పరిసరాలు – ఎంతో బావున్నా యి. జగ్గంపేటలో ఒక మెడిసిన్ వాడాలన్నా, ఏదైనా తినాలన్నా, ఎక్కడికి వెళ్లాలన్నా ఏదో అధైర్యం ఒంటరితనం వల్లకాబోలు! గీత ఇంట్లో ఒక వెన్నుదన్ను లభించి నావాళ్ల మధ్య ఉన్నానన్న ధైర్యంతో హాయిగా నిద్రపట్టేది.

          నేనొచ్చిన మూడోరోజున – ఇంకా జెట్ లాగ్ వదల్లేదు. కుపర్టినోలో ఉన్న ఒక క్లబ్ హాల్లో గీత దగ్గర సంగీతం నేర్చుకుంటున్న స్టూడెంట్స్ కి హాఫీయర్లీ డే ఫంక్షన్ జరిగింది. పిల్లలు చక్కగా పాడుతున్నారు. తెలుగు పలుకుతున్నారు. చిన్న చిన్న ప్లేలతో, పాటల్తో కార్యక్రమం బాగా జరిగింది. పిల్లల తల్లిదండ్రులు, వాళ్లకి దగ్గర కుటుంబాలు అందరూ వచ్చేరు. అందరూ వండి తెచ్చిన పదార్థాల పాట్ లాగ్ లంచ్ తర్వాత 4.30 కి ఇంటికి తిరిగి వచ్చేం. రోజూ ఉదయం, సాయంకాలం ఆ విద్యార్థుల రాకతో గీత ఇల్లు సందడిగా ఉండేది. రోజూ గీతానేనూ ఒకోవైపు వాకింగ్ కి వెళ్లివచ్చేవాళ్లం. 13న వాలెంటైన్స్ డే సందర్భంగా మా మనవడు కోమల్ నాకు, వాళ్లమ్మకి, చెల్లి వరూధినికి ఒకో రెడ్ రోజ్ ఫ్లవర్, ఒకో చాక్లెట్ బాక్స్ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పేడు. ఉదయాన్నే పేన్ కేక్స్ వేసి పెట్టేడు, 25 డాలర్లు ఇచ్చి ‘‘అమ్మమ్మా నీకు ఏదైనా అవసరం పడొచ్చు, ఇవి ఉంచుకో’’ అన్నాడు. ఆ ప్రేమకు నేను ఎమోషనల్ అయిపోయి కళ్లల్లో నీళ్లు తిరిగేయి. కోమల్ కాలేజ్ లో చదువు తూ అక్కడే పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు స్టూడెంట్ కోటాలో.

          15 వ తేదీన గీత తను తన సాహితీ మిత్రుల్తో కలిసి నడుపుతున్న వీక్షణం మీటింగ్ మిల్ పిటాస్ లో ఉన్న మృత్యుంజయుడు తాటిపాముల గారింట్లో జరిగింది. నా ‘క్షతగాత్ర’ పుస్తకాన్ని మళ్లీ ఆవిష్కరింపజేసి, దాంట్లో ఉన్న ‘శివంగి’ కథను చదివింది గీత. అందరూ కథ బావుందని మెచ్చుకున్నారు. సమావేశం చాలా బాగా జరిగింది.

          ఫిబ్రవరి 18న కోమల్ తప్ప మిగిలిన ఐదుగురం సాయంకాలం 6 కి పెద్ద కారులో ఒక ట్రిప్ కి బయలుదేరాం. 9.30 కి 150 మైళ్లు ప్రయాణించి కాలిఫోర్నియా కేపిటల్ సేక్రిమెంటో చేరుకున్నాం. ఒక పెద్ద సూట్ అద్దెకు తీసుకున్నారు. పేరు హోమ్ ఉడ్ సూట్స్. రోజుకి 350 డాలర్ల రెంట్. వెంట తెచ్చుకున్న బిర్యానీ, కూల్ డ్రింక్స్ తో డిన్నర్ ముగించి హాయిగా నిద్రపోయాం, మర్నాడు ఉదయం హోటల్ వాళ్లు ఫ్రీగా ఎరేంజ్ చేసిన కేకులు, బ్రెడ్స్ లాంటి అమెరికన్ టిఫిన్స్ తిని, రూం వెకేట్ చేసి ఓల్డ్ సేక్రిమెంటో వైపు వెళ్తూ ముందుగా పార్లమెంట్ హౌస్ చూసాం, ఒక గంటలో తిరిగి వస్తామనుకున్నది ఇంకా ఎక్కువ టైం పట్టి కార్ పార్కింగ్కి 42 డాలర్ల ఫైన్ కట్టవలసొచ్చింది. తర్వాత ఓల్డ్ సిటీలో సేక్రిమెంట్ నది వొడ్డునున్న ఫేమస్ నాన్ వెజ్ రెస్టారెంట్ జోక్రేబ్ లో లంచ్ చేసాం. అక్కడికి దగ్గర్లో ఉన్న చాక్లెట్ ఫేక్టరీలో బస్తాల్తో, బుట్టల్తో, పెట్టెల్తో నింపిపెట్టి ఉన్న ఫ్రీ చాక్లెట్స్ రుచిచూసి, కొన్ని కొనుక్కుని తిరిగి కారెక్కేం. కొన్ని ఊళ్లు దాటిన కాస్సేపటికి అద్బుతమైన అడవిలోకి ప్రవేశించాం. ఆకాశాన్నంటే పైన్, రెడ్ వుడ్ చెట్లు, ఎత్తైన కొండలు; ‘లేక్ తహూ’ని సమీపించే కొద్దీ కొండలమీదా, దారిపక్కనా పేరుకున్న మంచు – అద్భుతమైన జర్నీ. పొద్దుపోయేవేళకి తహూ చేరుకున్నాం. ‘లేక్ షోర్ లాడ్జ్ స్పా’ హోటల్లో రెండు రూమ్స్ తీసుకున్నారు. సత్య, వరూ రేపు ఉదయం చెయ్యబోయే స్కీయింగ్ కి 225 డాలర్ల చొప్పున టిక్కెట్లు ఇవాళే కొన్నారు.

          ఫిబ్రవరి 20 ఉదయం నా జీవితంలో అద్భుతమైన రోజు అన్పించింది. ఉత్తరం వైపు విండో కర్టెన్ జరపగానే నిశ్చలమైన, స్వచ్ఛమైన నీలినీటి సరస్సు తహో. చుట్టూ పర్వతసముదాయం. కొన్నిటి మీద మంచు. సరస్సువైపు బైటికెళ్లి చూస్తే పశ్చిమాన మంచుకొండలు. హిమాలయాల మధ్య మానస సరోవరాన్ని చూసిన అనుభూతి ఆవరించుకుంది నన్ను.

‘అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా

హిమాలయోనామనగాధిరాజః!

పూర్పానరౌ తోయనిధీ వగాహ్య

స్థితః పృథివ్యా ఇవమాన దండః!

అంటూ కుమార సంభవం కావ్యాన్ని పై శ్లోకంతో ప్రారంభించిన కాళిదాసు మహాకవి గుర్తుకొచ్చాడు.

          చుట్టూ పొగమంచు. మైనస్ 2 డిగ్రీలట. ఉదయం సత్య, వరు స్కీయింగ్ కోసం పర్వతాల మీదికి రోప్ వేలో వెళ్లేరట. 11కి నేనూ గీతా సిరిని తీసుకుని గండోలా అంటున్న రోప్ వేలో వెళ్లేం. టిక్కెట్టు 42 డాలర్లు. రోప్ వేలో కొండల మీదికీ కిందికీ కొన్ని పదుల బాక్సులు తిరుగుతున్నాయి. బాక్స్ లోకి ఎక్కి కూర్చున్నాక మొదలైంది అసలైన అద్భుతం. చాలా చాలా ఎత్తైన హెవెన్లీ హిల్స్ మీదికి ప్రయాణం. తూర్పుకి తిరిగి కూర్చుంటే దిగువన ఆకాశాన్నంటే చెట్ల చిగుర్లు. ఎదుట ఎత్తైన మంచుపర్వతాలు. పశ్చిమానికి తిరిగి కూర్చుంటే ఎదుట మరో మంచుకొండల శ్రేణి. కింద విశాలమైన తాహో సరస్సు. తాహో అంటే బిగ్ వాటర్ అని అర్థమట.  ఆ అనుభూతిని అనుభవించి తీరాలేకాని వర్ణించసాధ్యంకాదు. మధ్యలో చిన్న హాల్ట్ లో దిగి ఫోటోలు తీసుకుని మళ్లీ ఎక్కేం. పైన కొండ శిఖరాన్ని చేరేసరికి అక్కడంతా నిండిన మంచులో,  ఆ పైపైకి ఉన్న కొండల్లో స్కీయింగ్ చేస్తున్న వేలమంది జనం కన్పించారు. సత్య, వరు కన్పించాక గీత కూడా స్కీయింగ్ షూ వేసుకుని ప్రయత్నించింది కాని సాధ్యపడలేదు. వెనక్కి జారి మెడ, తల నొప్పిచేసాయి. అప్పుడు తెలిసింది స్కీయింగ్ ఎంత కష్టమో! సాయంకాలం వరకూ అక్కడున్న ఏకైక పెద్ద రెస్టారెంట్ ముందు కూర్చుని సాయంత్రం 4 కి బయలుదేరి కిందికి వచ్చేం. మరొక స్కీయింగ్ వరల్డ్ కప్ ట్రెయినింగ్ దగ్గరకెళ్లి స్కీచేస్తున్న వాళ్లని కాసేపు చూసి రూంకి తిరిగొచ్చాం. తిరిగి 8 కి వణికించే చలిలో బైటికెళ్లి నిక్కీస్ ఇండియన్ రెస్టారెంట్లో డిన్నర్ చేసి, అదే ఊళ్లో మొదలౌతున్న నెవాడా స్టేట్ లో ఉన్న కేసినోకెళ్లి అలా అలా తిరిగి 9.30కి రూంకి చేరుకున్నాం.

          ఉదయం 10 కి బ్రేక్ ఫాస్ట్ తర్వాత రూమ్స్ ఖాళీ చేసి బయలుదేరాం. ఆ రోజు మరో అద్భుతమైన జర్నీ. లేక్ తాహోని చుడుతూ అడవి దారి గుండా ప్రయాణం. మన మానససరోవర్ పరిక్రమణ లాగన్నమాట! మంచుకొండలు, ఆకాశాన్నంటే వృక్షాలు, మరో పక్క తాహో సరస్సు. మధ్యలో ఓ చోట ఆగి లేక్ మథ్యలో ఉన్న డైమండ్ ఐలాండ్ చూసాం. రెనో టౌన్ కి మా ప్రయాణం. మధ్యలో మంచుతో నిండిన మౌంట్ రోజ్ దగ్గర కారు ఆపి అందరం కాస్సేపు మంచులో నడిచివచ్చేం. 2.30 కి రెనోటౌన్ చేరుకుని డియాన్ రెస్టారెంట్లో ఒక్కొక్కరికి  9 డాలర్లు చొప్పున బఫే లంచ్ చేసాం. భోజనం చాలా బావుంది. తర్వాత అక్కడి రాయల్ హోటల్ పెప్పర్ మిల్ లో 500 డాలర్స్ చొప్పున రూమ్స్ తీసుకున్నాం. రాత్రి 8 కి హోటల్ బైటికి వచ్చేసరికి చలి గడగడలాడించేస్తోంది. మైనస్ డిగ్రీల్లో ఉంది వాతావరణం. రెనో డౌన్ టౌన్ కివెళ్లేం, నెరోడా రాష్ట్రమంతా ఎడారి ప్రాంతమట. కేవలం కేసినోల ఆదాయంతో నడుస్తోందట. లాస్ వెగాస్ తర్వాత రెనోనే నెవోడాలో పెద్ద కేసినో సిటీ అట. కేసినో జూదశాలలు తప్ప మరేమీ లేవు చాలాపెద్ద పెద్ద బిల్డింగ్స్ నేనైతే రోడ్లమీది చలి తట్టుకోలేక గడగడ లాడిపోయేను. కేసినోల మధ్యనుంచి నడుస్తూ ఒక వీధినుంచి మరో వీధికి వెళ్లిపోతాం. అక్కడే ఒక కేసినోలో డిన్నర్ ముగించి హోటల్ కెళ్లేం. అదికూడా ఒక కేసినో కేంద్రమే. హోటల్ వాళ్లు కేసినోలో పాల్గోడానికి రూంకి ఐదు డాలర్ల కార్డు ఫ్రీగా ఇచ్చారట. వాటిని డబ్బుగా మార్చుకోడానికి లేదు. ఆడిపోగొట్టుకోవాలి, లేదా గెల్చుకోవాలి. సామాన్య జనానికి జూదం అలవాటు చేసే పద్ధతన్నమాట! ‘‘సరదాగా వెళ్లొద్దాం రా అమ్మా’’ అంది గీత. చిన్న పెన్నీ మిషన్ దగ్గర కూర్చున్నాం. నా కార్డు మీద 9 డాలర్లు, గీత కార్డుమీద 1.75 డాలర్లు వచ్చేయి. అక్కడికి ఆపేసాం. మొత్తం 10 డాలర్ల చిల్లర గుర్తుగా ఉంచుకోమని గీత నాకే ఇచ్చేసింది. ఉదయం 10 కి రెనో నుంచి బయలుదేరి మళ్లీ తాహోవైపు ప్రయాణించేం. నిన్న వచ్చిన మంచుకొండలకి ఇవతలి నుంచి ప్రయాణం. విశాలమైన పర్వతసానువుల మధ్య నుంచి అద్భుత దృశ్యాల్ని వీక్షిస్తూ ప్రయాణం. మేం తాహో టౌన్ చేరుకునేసరికి సన్నని వేపపూలలాగ మంచు కురుస్తోంది. గీతకి కూడా స్నోఫాల్ చూడడం ఇదే మొదటిసారట. ఒకటే మురిసిపోయింది, ఏపిల్ రెస్టారెంట్ ముందు మధ్యాహ్నం ఒంటిగంటకి కారు దిగేసరికి ఈదురుగాలితో బాటు స్నోఫాల్ ఎక్కువైంది. మైనస్ ఇంకాస్త పెరిగిందట. లంచ్ తర్వాత మొన్న వచ్చినదారినే తిరిగి ప్రయాణం. దారిలో ఫోల్సన్ లేక్, అమెరికన్ కేన్యన్రివర్ చూసి రాత్రికి ఇంటికి చేరుకున్నాం. నేనొచ్చినప్పటి నుంచీ ఫిబ్రవరి నెలలో అయిదారు రోజులు మాత్రమే మంచి ఎండ కాసింది. ఇంట్లో హీటర్ లేకపోతే చల్లదనం భరించడం కష్టమై ఉండేది.

          గీత అప్పటికి ఎం.ఎస్. చేస్తోంది. మార్చి ఫస్ట్ న సాయంత్రం గీత కాలేజ్ నుంచి వచ్చేక మిల్ పిటాస్ లోని కోమటి జయరాం గారి స్వాగత్ రెస్టారెంట్లో BATA టీచర్స్ కాన్ఫరెన్స్ కి వెల్లేం. అక్కడ గీత బాటా టీచర్స్ కి క్లాస్ తీసుకుని తెలుగు ఎలా టీచ్ చెయ్యాలో చక్కగా వివరించి చెప్పింది.

          మార్చి 14 న బాటా (బే రియా తెలుగు అసోసియేషన్) వారి ఉగాది కార్యక్రమాలు సన్నీవేల్ హిందూ టెంపుల్ లో జరిగాయి. గీత ముఖ్య సలహాదారు కాబట్టి మాకు ఫ్రీ టిక్కెట్స్ వచ్చాయి. VVIP సీట్లవి. ఒక సినిమాపాటకి డేన్స్ కార్యక్రమంలో వరు పాల్గొంది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.