నడక దారిలో-58

-శీలా సుభద్రా దేవి

జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,. అమ్మ చనిపోవటం, పల్లవి వివాహం, నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, పాప రెండవ పుట్టినరోజు వేడుక , కొత్త ఇంటి గృహప్రవేశం తిరిగివెళ్ళిన రెండు నెలలకే అజయ్ చనిపోవడంతో ఆషీని తీసుకుని పల్లవి తిరిగివచ్చేసి ఉద్యోగంలో చేరింది. నేను హెచ్చెమ్ కావటం, రిటైర్ కావటం, పెద్దక్క మరణం, ప్రత్యేక తెలంగాణా ఉద్యమం, వీర్రాజు గారు తన ఏకాగ్రత అంతా పెయింటింగ్స్ వేయటంపై పెట్టారు. పల్లవి కొన్న సరూర్ నగర్ లో అపార్ట్మెంట్ గృహప్రవేశం అయ్యాక, మిత్రులు బంధువులకు విందు ఇచ్చాం. డా.పి.శ్రీదేవి మోనోగ్రాఫ్ రాయటం మొదలుపెట్టాను. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పడింది. వీర్రాజుగారికి బోయి భీమన్న, బాపూరమణల పురస్కారాలు వచ్చాయి. తర్వాత—)

***

          పరీక్ష కోసం చదువుతున్నట్లుగా శ్రీదేవి రచనలు ఒకటికి రెండుసార్లు చదివి నోట్స్ తయారు చేసుకుని స్వతంత్ర బౌండ్లు కృష్ణదేవరాయ భాషా నిలయానికి తిరిగి అందజేసాను.
 
          కథానిలయంలోని కథలు గురించి వివినమూర్తిగారిని మెయిల్ ద్వారా సంప్రదిం చాను. ఆయన అక్కడి కథలు పీడీఎఫ్ లు పంపించారు. ముందుగా కథలకు, కవిత్వానికి సంబంధించిన నోట్స్ పూర్తి చేసుకున్నాక ” కాలాతీతవ్యక్తులు” నవలను చిన్నప్పుడు చదివినదే అయినా ఇప్పుడు చదువుతుంటే ఎన్నో కోణాల్లో నవల విశిష్టతని గుర్తించి రాయటం మొదలు పెట్టే సరికి నవల విశ్లేషణే 40 పేజీలకు పైగా వచ్చింది. రాయటం స్పీడ్ అందుకుంది.
 
          అయితే నాకు ఈ ప్రోజెక్ట్ అప్పగించిన నాటికి అక్కిరాజు రమాపతిరావు ( మంజుశ్రీ) గారు కేంద్ర సాహిత్య అకాడెమీ కన్వీనర్. నేను సబ్మిట్ చేసేనాటికి  కమిటీ మారి పోయింది. ఎన్.గోపీగారు కన్వీనర్ అయ్యారు. ఇతర సభ్యులలో ఒకరుగా వీర్రాజుగారు కూడా వున్నారు. అది నన్ను కొంచెం ఇబ్బంది పెట్టింది. నేను రాసినది స్క్రూటినీకి కూడా వెళ్ళి తొందరగానే అంగీకారం అయ్యి ప్రింటింగ్ కు వెళ్ళింది.
 
          సాధారణంగా కమిటీలో వున్నవాళ్ళు  అకాడమీ సభ్యులు కూడా సాధ్యమైనంత వరకూ కొన్ని ప్రోజెక్టులు తీసుకుంటారు. వీర్రాజుగారు మాత్రం కమిటీ సమావేశాలకు వెళ్ళటం తప్ప ఏవిధమైన ప్రయోజనం పొందలేదు.
 
          నాకు ఒక విషయంలో వీర్రాజుగారి పై  చాలాకోపం కూడా వచ్చింది. ప్రతీ సభ్యుడూ జ్యూరీ సభ్యులుగా వుండటానికి ప్రతీ కేటగిరి కిందా సుమారు ముప్పై మంది పేర్లు వారి చిరునామాలతో సహా ఇవ్వాలి. నాస్నేహితులైన రచయిత్రులతో సహా తెలిసిన వారిపేర్లు వీర్రాజు గారు రాసి ఇచ్చారు. కానీ నా పేరు రాయలేదు. “మీ భార్యగా కాకుండా ఇంత కాలంగా రాస్తున్న రచయిత్రిగా నా పేరు రాయొచ్చు కదా “అని గొడవ పెట్టుకున్నాను. కానీ ఆయన నిబద్ధతకి మరి మౌనం వహించాను.
 
          అదే సమయంలో కేంద్ర సాహిత్య అకాడమీతో కలిసి వాసా ప్రభావతిగారు లేఖిని సంస్థ ద్వారా సదస్సును నిర్వహించ తలపెట్టారు. ఆరుగురు మాత్రమే పత్ర సమర్ప కులు. లేఖిని సభ్యులు ప్రసంగకర్తలుగా పేర్లు ఇచ్చారు. వాటిని కన్వీనర్ అయిన గోపిగారికి పంపుతే అందరూ ఒకే సామాజికవర్గానికి చెందినవారున్నారు. అకాడమీ నిబంధనకు కుదరదన్నారు. ప్రభావతిగారు నాకు ఫోన్ చేసి నన్ను ఒక పేపర్ ప్రజెంట్ చేయమన్నారు. వీర్రాజుగారు అకాడమీ సభ్యులు కనుక నేను  ప్రసంగం ఇవ్వడానికి అంగీకరించలేదు. మరో కారణం కులం ప్రాతిపదికన కార్యక్రమానికి అవకాశం పొందటం నాకు నచ్చదు. అప్పుడు వాళ్ళు పుట్లహేమలతని సంప్రదించారు.
 
          వందేళ్ళ కథకు వందనాలు కార్యక్రమం కోసం వీర్రాజుగారి కథను రికార్డు చేయటా నికి గొల్లపూడి మారుతీరావుగారు మాయింటికి వచ్చారు. అప్పుడు మా బిల్డింగ్ లో కొందరికి వీర్రాజుగారు రచయిత అనే విషయం తెలిసింది. తర్వాత్తర్వాత నేను కూడా రచయిత్రి నని తెలిసింది కాని ఇక్కడ ఎవరికీ సాహిత్య వాసనలు లేనందునా, మేము ప్రచారం చేసుకోనందు వలన అంతకన్నా మా గురించి ఎవరికీ తెలియదు.
 
          శ్రీదేవి మోనోగ్రాఫ్ రాసిన తర్వాత వ్యాసాలు రాయాలనే వుత్సాహం వచ్చింది. అందులోనూ వందేళ్ళ కథకు వందనాలు కార్యక్రమంలో ప్రత్యేకంగా కథలను గురించి చెప్పదగిన రచయిత్రులైన జలంధర, జానకీరాణి, శివరాజు సుబ్బలక్ష్మి వాళ్ళంతా మరొకరిని పరిచయం చేయటానికి వుపయోగ పడ్డారు. దాంతో 118 కథకుల్లో కేవలం 12 మంది కథయిత్రుల కథలను మాత్రమే పరిచయం చేయటం నాకు బాధకలిగించింది. అరవయ్యో దశకం రచయిత్రుల స్వర్ణయుగం అనేవారు కదా. వారెవ్వరూ నవలలు తప్ప కథలు రాలేదా అని పరిశోధన చేసాను. నమ్మలేనంత ఆశ్చర్యం కలిగింది.
 
          స్వాతంత్య్రానంతరం రచయిత్రులలో బాగా రాస్తారు అనుకున్న వాళ్ళ పేర్లు జాబితా వేసుకుని నా దగ్గర కథా సంపుటాలే కాకుండా కెపి అశోక్ కుమార్ , అనిశెట్టి రజిత, కాత్యాయనీ విద్మహే , రామడుగు రాధాకృష్ణ మూర్తి గారు వంటి వారినుండి  పుస్తకాలు సేకరించాను. కథానిలయం నుండి వేల కొద్ది కథలు డౌన్లోడ్ చేసుకుని. ఒకరి తర్వాత ఒకరి కథల మీద వ్యాసాలు రాయటమే కాక వివిధ పత్రికలకు పంపించగా అన్నీ ప్రచురణ కాసాగాయి. దాంతో రెట్టించిన వుత్సాహం వచ్చింది.
 
          వీర్రాజుగారు కథలూ, కవిత్వం మానేసి వ్యాసాలు రాస్తున్నందుకు ‘వ్యాసాలలో పడితే మరి సృజనాత్మక సాహిత్యం రాయలేవు’ అని మందలించేవారు.
 
          ఆయన మాటల్ని పట్టించుకోకుండా  ‘ కవితలు కూడా ఇంచుమించు ప్రతీ నెలా పత్రికల్లో వస్తూనే వున్నాయిగా’ అన్నాను.
 
          డిసెంబర్, జనవరి మా ఇంట్లో హడావుడి వుంటుంది. జనవరిలో సంక్రాతికి బొమ్మల కొలువు పెడతాము. నాకు చిన్నప్పటి నుంచి బొమ్మలకొలువు పెట్టటం ఇష్టం. చిన్నప్పుడు తీరని కోరిక పల్లవి పుట్టిన తర్వాత తీర్చుకోసాగాను. ఒక్కొక్కసారి ఒక థీమ్ అనుకొని ఆ థీమ్ కి అనుగుణంగా బొమ్మలు, బేక్ గ్రౌండ్ లో అలంకరణ మేమే తయారు చేసి పెడతాము. అందుచేత డిసెంబర్ నుంచి ఈ పని కొనసాగుతుంది. మా నైపుణ్యా లన్నీ బొమ్మల కొలువులో ప్రదర్శిస్తాం.
 
          ఆ హడావుడిలో వుండగా ఒక రోజు మా మేనల్లుడు ఫోన్ చేసి వాళ్ళమ్మకు అనారోగ్యంగా వుందని తెలియజేసాడు. వీర్రాజుగారికి చెప్తే చూడటానికి వెళ్దామన్నారు. సుమారు పది పదిహేనేళ్ళుగా మా అన్నయ్యగానీ, ఆడపడుచుగానీ మాకు కాంటాక్ట్ లో లేరు. అన్నయ్యకి చాలా కాలం క్రితం బ్రైన్ ఆపరేషన్ అవుతే స్కూల్ నుండి డైరెక్ట్ గా చూడడానికి వెళ్ళినప్పడు ఎవరో పరాయిదానిలా  చూసిన అనుభవం ఇంకా మర్చి పోలేదు. కానీ రక్తసంబంధం వదిలేయలేక ప్రయాణం అయ్యాము. మాతో మా మరిది, పెద్దాడబడుచు భర్త కూడా వచ్చారు. ఆమె పరిస్థితి అంత బాలేదు. తిరిగి వచ్చేటప్పుడు ‘ అవసరమైతే చెప్పు నేను సాయానికి వస్తాను’ అని మేనల్లుడితో చెప్పాను.
 
          ఎప్పుడు అక్కడికి వెళ్ళవలసి వస్తుందో నని బొమ్మలకొలువు కొంచెం సింపుల్ గా పెట్టాము. సంక్రాంతి వెళ్ళిన నాలుగో రోజున సీరియస్ గా వుందని ఫోన్ వస్తే ఓ రెండు చీరలు, డబ్బు సంచిలో వేసుకొని వాళ్ళింటికి వెళ్ళాను. ఆ రాత్రి ఆమె బాధ భరించలేక కోమాలోనే భయంకరంగా మూలుగుతుంటే శరీరం వదలటానికి ప్రాణం ఇంత కొట్టుకు లాడుతుందా అని భయం వేసింది. ఇంటి ఓనరు కొడుకు పెళ్ళి వుందని ఇంట్లో ప్రాణం పోతుందేమోనని గొడవ పెట్టారు. దాంతో మర్నాడు ఉదయమే దగ్గరలోని ఓ ఆశ్రమంకి తీసుకు వెళ్ళాం.
 
          మా చిన్నన్నయ్య ఇంతకాలం తర్వాత తన మనసులోని మాటలన్నీ అతని పిల్లలు ఆపాలనుకున్నా కూడా నాతో చెప్పటం మొదలుపెట్టాడు. నేను మౌనంగా విన్నాను. మర్నాడు ఆమె పోవటంతో వీర్రాజు గారి తరపు వాళ్ళంతా వచ్చారు. ఆమెకు పుట్టింటి వాళ్ళే చీర పెట్టాలి మా దగ్గర వున్నదే పెట్టేయమని అన్నయ్య, అతని వియ్యం కులు అంటే వాళ్ళచీర వద్దని చెప్పి పల్లవికి ఫోన్ చేసి నాదే ఒక కొత్త చీర తీసుకు రమ్మన్నాను. పల్లవి వచ్చాక మా చిన్నాబడుచును సాగనంపాము. ఆ పని అయ్యాక మా ఇంటికి తిరిగి వచ్చాము. అయితే ఆ తర్వాత చిన్నన్నయ్యని పలకరించటానికి  అప్పుడప్పుడు నేను వాళ్ళింటికి వెళ్ళే దాన్ని. ఒకసారి అతను రాసిన కథలు ఫైల్ తీసుకు వచ్చి నా చేతిలో పెట్టి వాటిని డీటీపీ చేయించి కొడుకుకి ఒక కాపీ ఇవ్వమనీ, నా దగ్గర ఒకటి పెట్టుకోమనీ డీటీపీ ఖర్చు తానే ఇస్తానన్నాడు. ఇంటికి వచ్చాక చూస్తే వంద కథలు వున్నాయి. నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది.
 
          విజయనగరంలో రావిశాస్త్రి , కారా మాస్టారు, చాసోల కోవలోనే సమాజానికి దర్పణంగా వుండే మంచి కథలు రాసి , అనేక మందిని రచయితలుగా ప్రోత్సహించిన చిన్నన్నయ్య ప్రచారపటాటోపం లేక పోవటాన అనామకంగా అయిపోయాడే అని బాధ కలిగింది. “విజయనగరంలో నేను రాజును ఇప్పుడు ఇక్కడ బంటును” అంటున్న చిన్నన్నయ్య ఆర్థికంగా ఇబ్బందుల్లో వున్నా ఎల్లప్పుడూ , ఎట్టిపరిస్థితుల్లోనూ ఒకరి దగ్గర చెయ్యి చాచకుండా ఉన్నంతమేరకు దొరబాబులా బతికిన అతడిని ఈ నాడు ఇలా కుంగిపోయిన స్థితిలో చూడలేక పోయాను. అతను కోరినట్లుగా కాపీలు తీయించి ఇచ్చాను.
 
          మరో రెండుమూడు ఏళ్ళకే అనేక డిప్రెషన్ లతో ఆరోగ్యం క్షీణించడంతో చిన్నన్నయ్య కూడా చనిపోయాడు.
 
          వీళ్ళిద్దరూ ఒకరి తర్వాత ఒకరు పోవటం తెలిసాక కోరుకొండలో వున్న చిన్నక్క కూడా బెంగ పెట్టుకున్నట్లుగా అయిపోయింది.
 
          తెలంగాణా వచ్చిన తర్వాత బతుకమ్మ సంబురాలు అంగరంగవైభవంగా జరిగాయి. ఆ సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయంలో అప్పటి వీసీ ఎస్వీ సత్యనారాయణగారు ఆ పదిరోజులూ కవిసమ్మేళనాలూ, బతుకమ్మ ఆటలూ, పాటలతో సంబురాలు జరిపించారు.
 
          ఒకరోజు ఉదయం నాకు ఫోన్ చేసి మధ్యాహ్నం సెషన్ కవి సమ్మేళనానికి ఆత్మీయ అతిథిగా ఆహ్వానించారు. సరే అని నేను వెళ్ళాను. కవి సమ్మేళనానికి అధ్యక్షురాలు సూర్య ధనుంజయ్. పూనా, చెన్నై, ముంబై మొదలగు ప్రాంతాల నుండి వచ్చిన కవయిత్రులు వారు బాల్యంలో బతుకమ్మ ఎట్లా ఆడేవారో వాటిని కవిత్వంలో చెప్పారు. నేను పరిమళ ప్రస్తారం కవిత చదివాను. అందులో–
 
” అక్షరాల్ని ఒడిబియ్యంలా మోసుకొచ్చింది అక్షరాలా అక్కడి నుండే
వాటికి సాహిత్య సొబగులు అద్ది
పుస్తకపళ్ళేల్ని నింపి
వాయినాలు యిచ్చిందిమాత్రం ఇక్కడే
మరి నేను ఎక్కడిదాన్నని అనుకోను?”
అంటూ కవిత చదివాను.
అధ్యక్షురాలు “మీరు హైదరాబాదీయే మేడం”అంది. ధన్యవాదాలు చెప్పి కూర్చున్నాను.
 
          మర్నాడు ” ప్రవాస తెలుగు కవయిత్రుల  సమ్మేళనం జరిగింది” అని వచ్చిన పేపర్ల నివేదికలో ఏ ప్రాంతం నుండి ఎవరు వచ్చారో రాస్తూ ఆంధ్రా నుంచి శీలా సుభద్రాదేవి అని నాపేరు వచ్చింది. నాకు చాలా బాధ కలిగింది. అప్పటికి నలభై అయిదేళ్ళ క్రితం ఇక్కడికి వచ్చి ఇక్కడే ఓయూ నుండి నాలుగు డిగ్రీలు పొంది పాతికేళ్ళు ఇక్కడి పేద పిల్లల బడిలో గొంతు పోయేలా చదువు చెప్పి బతుకుతున్నాను. ఆంధ్రాలో సూదిమొన అంతన్నా ఆస్తులు లేని నన్ను ఆంధ్ర క్రింద పరిగణించడం బాధే కలిగింది. ఇక్కడ వీళ్ళు ఆంధ్రా అన్నారు. ఆంధ్రాలో వారికి మేము ఏమి రాసామో కూడా అనేక సాహితీ సంస్థలకూ తెలియదు, సాహితీవేత్తలకూ తెలియదు. ప్రచార పటాటోపాలు ,ఆర్భాటం చేయగలిగేవాళ్ళకు పర్వాలేదు. కానీ మాలాంటి వాళ్ళ సాహిత్యం ఇలా త్రిశంకు స్వర్గంలో ఉండటమే అనుకున్నాను.
 
          మైండ్ ట్రీలో ప్రాజెక్టు మేనేజర్ గా పనిచేస్తున్న పల్లవికి ఉద్యోగం ఒత్తిడి రానురాను ఎక్కువ అయ్యింది. ఉదయం ఎనిమిది గంటలకు బయలుదేరితే గచ్చిబౌలికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేసరికి రాత్రి తొమ్మిది అయ్యేది. వచ్చాక రాత్రిపూట కాన్ఫరెన్స్ మీటింగ్ లు ఉండేవి ఆఫీసుకు వెళ్ళిరావటానికే మూడుగంటల వరకూ ప్రయాణానికే అయి పోయేది. దాంతో మానసికంగా, శారీరకంగా అలసిపోయేది. బీపీ ఎక్కువ కావటం చేత మెడికేషన్ కూడా మొదలు పెట్టాల్సి వచ్చింది. మైండ్ ట్రీ వాళ్ళు ఇక్కడ కాకుండా  అమెరికా, బెంగుళూరు, పూనా ఈ మూడింటిలో ఎక్కడికైనా ఎంపిక చేసుకుంటే అక్కడే బ్రాంచ్ లో జాబ్ కి  పంపుతామని అన్నారు.
 
          ‘ఇప్పటికి పదిహేను  ఏళ్ళు పనిచేసాను. ఇక పరుగులుచాలనీ, ఉద్యోగం మానేసి తనకి ఇష్టమైన వ్యాపకాలు కల్పించుకుని, ఆషీ చదువుమీద దృష్టి  పెట్టుకుంటాను’ అని పల్లవి నిర్ణయించుకుని ఉద్యోగానికి రిజైన్ చేసేసింది.
 
          ఒక నెలో రెండు నెలలో విశ్రాంతి  తీసుకుని రామకృష్ణా మిషన్ లో జర్మన్ భాష నేర్చుకునేందుకు జాయిన్ అయింది. ఉద్యోగంలో వున్నప్పుడు కూడా స్పానిష్ భాష ఒక సెమిష్టర్ పూర్తి చేసి తర్వాత కుదరక ఆపేసింది. అందుకే అక్కడే జర్మన్ భాష నేర్చుకు నేందుకు చేరింది.
 
          క్లాసులు సాయంత్రం 5.30 నుండి 7-30  వరకూ వుంటాయి. అందుచేత పగలు అప్పుడప్పుడు సంగీతాన్ని సాధన చేయాలనుకుంది. అప్పటికే నా పుస్తకాలకు ముఖ చిత్రాలు పల్లవే వేస్తుంది. నాకే కాకుండా ఇంద్రగంటి జానకీ బాలగారికీ నాలుగు పుస్తకాలకు, మరొక కవికీ కూడా ముఖచిత్రాలు డిజైన్ చేయటం మొదలుపెట్టింది . ఉద్యోగం వత్తిడి లేకుండా తనకి ఇష్టమైన వ్యాపకాలతో పల్లవికి రానురాను కొంత ఆరోగ్యం  కుదుట పడింది.           
 
          ఒకరోజు తెలుగు విద్యార్థి మాసపత్రిక సంపాదకుడు రమణగారు వచ్చారు. వాళ్ళ పత్రికకు ఏదైనా రెగ్యులర్ గా రాయమని అడిగారు. నేను రిటైర్ అయిన దగ్గర నుండి మా స్కూల్ అనుభవాలను ఏదో ఒక రూపంలో రాయాలనే ఆలోచన వుంది. సరే రాస్తానని చెప్పాను. ముందు ఒక పదో పదిహేనో ఇస్కూలు కతలు పేరిట రాయాలనుకున్నాను. కానీ రాస్తున్న కొద్దీ అనేక విషయాలు మనసులో మెదిలి రాయటం కొనసాగించాను. వాటికి మంచి స్పందన వచ్చింది. ఎక్కడెక్కడ నుంచో స్కూల్ టీచర్లు ఫోన్లు చేసేవారు. కొంత మంది వాళ్ళ విద్యార్థులతో మాట్లాడించేవారు. నాకు భలే సంతోషం కలిగించేది. ఈ ఇస్కూలూ కథలు రెండున్నర ఏళ్ళ పాటు తెలుగు విద్యార్థి మాసపత్రికలో ధారావాహికంగా ప్రచురితమయ్యాయి.
 
          ఇంకా రాస్తూ వుంటుండగానే మహారాష్ట్ర పాఠ్య ప్రణాళిక కమిటీ నుండి ఫోన్ వచ్చింది. మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో రెండవ భాష తెలుగు పాఠ్యాంశంగా నేను రాసిన ఇస్కూలు కథల్లోని ” ఒకే తాను ముక్కలం” కథని ఎంపిక చేసుకున్నట్లు అంగీకారం కోరారు. మరో రాష్ట్రంలో విద్యార్థులు నా కథని పాఠంగా చదువుతారు అంటే అంతకన్నా ఆనందం ఇంకేముంది? ఆ కథలకు వచ్చిన గుర్తింపు  వలన ఇస్కూలు కతలు ముఫ్ఫై కథలు పూర్తికాగానే ఉపాధ్యాయ రచయిత అయిన గంటేడ గౌరు నాయుడు గారి ముందు మాటతో ఉపాధ్యాయుడే అయిన చిన్నన్నయ్యకు అంకితం ఇస్తూ పుస్తకంగా వేసుకున్నాను.    
 
          వీర్రాజుగారు నా రచనల మీద ప్రముఖులు రాసిన మంచి వ్యాసాలు వున్నాయనీ వాటిని పుస్తకం రూపంలో తెస్తే బాగుంటుందని ఆలోచన చేసారు. వాటినన్నింటిని  క్రమపద్దతిలో చేస్తున్నప్పుడు ఒక కవిగారు మా ఇంటికి వచ్చారు. ఆయనకి ఆ వ్యాసాలు చూపించి పుస్తకంగా వేయాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇంతవరకూ కవయిత్రుల సమీక్షా వ్యాసాల సంకలనం రాలేదని ఆయన అభినందనలు తెలియజేశారు. కానీ ఇంకా నా పుస్తకం డీటీపీ అవుతుండగానే మరొకరిది ఆఘమేఘాల మీద అటువంటి పుస్తకం వెలువడటానికి కారణం కూడా తెలిసినా పోటీతో కూడిన మానవ స్వభావం గురించి వీర్రాజుగారూ నేనూ  మాట్లాడుకున్నాము.
 
          అక్క కూతురు రంజనావాళ్ళూ అబ్బాయి అనురాగ్ ని హైదరాబాద్ లోని ఎంబిఎ లో జాయిన్ చేయటానికి వచ్చారు. కాలేజీ హాస్టల్ లో చేర్చారు.సెలవుల్లో మా ఇంటికి వచ్చేవాడు. అన్నరాకతో ఆషీకి సందడి కలిగించింది. ఎప్పుడైనా సెలవురోజున వస్తే అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ హొటల్ కో , సినీమాలో వెళ్ళేవారు అనురాగ్  అలా ఇంట్లో  తాతగారూ, అమ్మమ్మా అంటూ తిరుగుతుంటే  మాకూ సందడిగా  అనిపించేది 
 
          పుస్తక ప్రదర్శనలో ఇంద్రగంటి జానకీబాలగారి “నవలా ద్వయం “పుస్తకాన్ని, నా రచనలపై సమీక్షల సంకలనం ” గీటురాయి పై అక్షరదర్శనం”లను ప్రమదాక్షరి స్టాల్ లో ఆవిష్కరణ చేసాము. శ్రీకాంతశర్మగారూ, వీర్రాజుగారూ, జగన్నాథ శర్మగారూ పాల్గొన్నారు. అదే సందర్భంలో జగన్నాథశర్మ “నవ్యకి ఓ మంచికథ రాయకూడదూ” అన్నారు.
 
          అదే మాటతో మొదలుపెట్టి  “నిజానికీ అబద్ధానికీ మధ్య” కథ రాసి నవ్యకి పంపించగా ప్రచురించారు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.