రంగుపూసల్లాంటి నవ్వుల్ని
ఆమె పెదవుల నుండి లాక్కుంటాను
మాటకత్తినిసిరి కళ్ళలో నిద్రని హత్య చేస్తాను
ఏడాదంతా శిశిర ఋతువుని
శరీరమంతా పండిస్తాను
వాడిన పువ్వవుతుందనుకుంటే
సీతాకొకచిలుకలా నన్ను స్పర్శిస్తూ
పాత ప్రేమని మాగిన పండులా గుండెకు తినిపిస్తుంది
నిద్రిస్తున్న పాప పసితనాన్నంత
ఒంట్లోకి వొంపి తానో పాపవుతుంది నావొడిలో
ఆక్షణం
గతం నీటిబుడగై నేనో ప్రేమకొలనవుతా
కలువ తానై రాత్రికి వెన్నెల చిత్రాల్ని
గీయిస్తూ రోజుల పేజీలని తిప్పేస్తుంది
దాయాదిరాళ్ళో పొరుగింటి కొప్పులో
విడిపోత విషాన్ని కక్కుతారు
ఆమె హృదయం కన్నీళ్లతో నన్ను బదులు
వాళ్ళని కడిగేసుకుంటుంది
కొట్టినా అమ్మకాళ్ళనొదలని పసిదానిలా
గాయపెట్టినా ప్రేమించడం ఎవరు నేర్పారో తనకి
అపార అనురాగ దీపాన్నెలిగించి
చీకటి నుండి వెలుగుకి
విషాదపర్వం నుండి
శాంతి తీరానికి మోసుకెళ్తుంది
తననిప్పుడెవరైనా
ఎంతప్రేమిస్తున్నావని అడిగితే
తనగోటి పరిమాణమంతంటాను
సగభాగంకాని నాతో
తన ప్రయాణాన్ని చూసి సిగ్గు పడతాను
ఈలోకంలో
అమ్మంత ఎత్తుకు ఎదిగింది
ఆమె ఒక్కతేనని
నిక్కచ్చిగా మాతృభావమై మోకరిళ్లుతాను
నా అహాన్ని జయింపజేస్తూ
ఆమెని గెలిచాననుకున్న
ఈ పరాజితుణ్ణి
ఇప్పుడెవరైనా దీవిస్తే బాగుండనిపిస్తోంది
తనతో సమంకమ్మని..!