వ్యాధితో పోరాటం-35

కనకదుర్గ

          మధ్యాహ్నం వరకు కునుకులు తీస్తూనేవున్నాను. జూలియాని కెఫెటీరియాకెళ్ళి లంచ్ తిని రమ్మన్నాను. నేను క్యాన్సర్ వార్డ్ లో వున్నపుడు నాతో బాగా మాట్లాడిన స్టూడెంట్ డాక్టర్ వచ్చింది నాకు చెప్పినట్టుగానే. కానీ నేనెక్కువగా మాట్లాడలేక పోయాను. నేనెక్కువగా మాట్లాడకపోయేసరికి తను ఏం చేయాలో తెలియక వెళ్ళిపో యింది. తను గుర్తు పెట్టుకుని వచ్చినందుకు సంతోషంగా వుంది అనైనా అనలేక పోయినందుకు నాకు బాధగా అనిపించింది.

          శ్రీనివాస్ మధ్యాహ్నం ౩ గంటలకు వచ్చాడు. అంతకు ముందే జూలియాను మరొక్క రోజుంటావా అని బ్రతిమిలాడాను.

          “సరే వుంటాను. కానీ ఇపుడు ఇంటికి వెళ్ళి పెట్స్ కి తిండి పెట్టి, డానియల్ కి, పాల్ కి డిన్నర్ చేసి నేనూ కూడా తినేసి 8.30 రాత్రికల్లా వస్తాను.” అని అంది.

          రాత్రంతా ఏం జరిగింది, ఎలా బాధపడ్డానో అంతా వివరంగా చెప్పింది శ్రీనివాస్ కి జూలియా. నాకు గొంతులో పైప్ వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను.

          జూలియా శ్రీనిని అడిగింది, “నేనొచ్చేవరకుంటావా? వెళ్ళిపోతావా?”

          “వుంటాను. జూలీ ఈ రోజు నేనెళ్ళేవరకు వుంటానన్నది.” అన్నాడు.

          “ఓకే ఐ విల్ బి బ్యాక్ బై 8.30.” అని నా నుదుటి పైన ముద్దు పెట్టుకుని వెళ్ళింది.

          “చాలా ప్రాబ్లెమ్ అయ్యిందా చిన్నీ, రాత్రంతా?” అని అడిగాడు శ్రీని బెడ్ పైన వున్న నా చెయ్యి పట్టుకుని.

          నేనేం మాట్లాడలేదు. నా కంట్లో నుండి నీరు కారిపోతున్నాయి.

          ఇంత కష్టంగా వుంటుందనుకోలేదు. ఇంతలో ఫోన్ మ్రోగింది.

          క్యాథి అక్క సూసన్ మాట్లాడుతుంది. ” హాయ్ దుర్గా! హౌ ఆర్ యూ డియర్. డోంట్ వర్రీ. ప్రతి రోజు కొద్ది కొద్దిగా మార్పుంటుంది, ఇంప్రూవ్మెంట్ వుంటుంది. దిస్ మస్ట్ బి యువర్ మేజర్ సర్జరీ. ఫస్ట్ డే విల్ బి ఏ గ్రేట్ షాక్. బట్ యూ విల్ ఫీల్ బెటర్ మై ఫ్రెండ్! ఐ విల్ టాక్ టు యు సూన్. టేక్ ఇట్ ఈజీ దుర్గా!”

          “హౌ ఆర్ యూ సూసన్?”

          నిన్న ప్రొద్దున క్యాథి ఫోన్ చేసినపుడు చెప్పింది సూసన్ కి నిన్నతెల్లవారుఝామున చాలా మేజర్ సర్జరీ చేసారని.

          ఈ రోజే తను నాకు ఫోన్ చేసి నాకు ధైర్యం చెబ్తుంది. ఇలాంటి మనుషులు కూడా వుంటారా? నేను నా బాధ గురించే ఆలోచిస్తున్నాను.

          ఆమె తన బాధ కన్నా నాకు ఇది మొదటి మేజర్ సర్జరీ అని నేను కంగారు పడుతుం టానని అంత నొప్పితో కూడా నాకు ఫోన్ చేసింది. ఇలాంటి వారి దగ్గరనుండి ఎంతైనా నేర్చుకోవచ్చు. వాటే ఏ వండర్ఫుల్ పర్సన్!

          శ్రీని రాత్రి సర్జరీ తర్వాత సర్జన్ బార్బరా ఏం చెప్పిందో చెప్పాడు.  “ఇన్ని రోజులు గాల్ బ్లాడర్లో ఏం ప్రాబ్లెమ్ లేదని చూపించింది టెస్ట్ లో. ఆమె ఓపెన్ చేయగానే మొట్ట మొదట కనిపించింది గాల్ బ్లాడరంతా పాడయిపోయి మొత్తం రాళ్ళతో నిండిపో యిందట. అందుకని అదే ఫస్ట్ తీసేసి తర్వాత ఒక్ పెద్ద స్టోన్ డక్ట్ లో వుంటే అది తీసేసి దాంతో పాటు కొన్ని చిన్న చిన్నవి వుంటే తీసేసిందట. ఇంత అడ్వాన్స్మెంట్ అయ్యారం టారు టెక్నాలజీలో, ఇట్లా ఎందుకు జరుగుతుందో ఇంకా?” అన్నాడు.

          నాకు చాలా నీరసంగా వుంది, సర్జరీ నొప్పి, ముక్కులో, గొంతులో ఆ ట్యూబ్లు గుచ్చు కుంటూ చికాకుగా వుంది. కాసేపు నిద్రపోతే బాగుండునన్పించింది. ఎపిడ్యూరల్ వుంటే వూరికే నొప్పి ఇంజెక్షన్ కోసం నర్సులను పిలిచే అవసరం వుండేది కాదు. శ్రీని ఉంటే నర్స్ ని పిలవమని అడిగితే తను చేసేవాడు. తను దగ్గర వుంటే ధైర్యంగా అనిపించేది. నర్స్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళింది. నేను కళ్ళు ఇసకపోసినట్టు మండుతుంటే మెల్లిగా కళ్ళు మూసుకుని పడుకోవడానికి ప్రయత్నించాను. కాసేపయ్యాక నిద్ర పట్టింది.

          నేను నిద్రలేచే వరకు శ్రీని కుర్చీలో వెనక్కి జారగిలపడి కునుకు తీస్తున్నాడు. పాపం అటు ఇటు తిరిగి అలసిపోతున్నాడు. పిల్లల్ని చూసుకోవాలి, ఆఫీసుకెళ్ళాలి, ఇంత దూరం హాస్పిటల్ కి రావాలి. ఎంత కష్టమున్నా, ఎంత బాధ ఉన్నా అన్నీ తన మనసులోనే వుంచుకుంటాడు, ఎవ్వరితో మనసువిప్పి ఏమీ చెప్పడు, నాతోనే ఏం పంచుకోడు. నేను ప్రతి విషయం చెప్పేస్తూ వుంటాను. ఏదీ మనసులో వుంచుకోను, తను అలా కాదు.

          బాత్రూంకెళ్ళాలి, నర్స్ ని పిలుద్దామనుకుంటుండగానే శ్రీని నిద్ర లేచాడు. నర్స్ ని పిలిచాడు.

          వాళ్ళు బెడ్ పాన్ పెడతామంటే వద్దని నేనే నడిచి వెళ్తానంటే ఇద్దరు నర్సులు కలిసి బాత్రూంకి తీసుకెళ్తున్నారు.

          ఇంకో నర్స్ కూడా వచ్చింది. నాకు లేచి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది, కానీ పడుకుని ఉంటే కాళ్ళు లాగేస్తున్నాయి. నేను మంచమ్మీంచి లేవననుకుని కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడానికి ప్రతి కొన్ని నిమిషాలకి కాళ్ళని బిగించి వదిలి పెట్టేవి పెట్టారు. అవి తీసేసి తీసుకెళ్తారు. మళ్ళీ బెడ్ పైకి రాగానే అవి పెడుతున్నారు.

          సర్జన్ వచ్చి చూసి వెళ్ళింది. నేను, “ఈ సర్జరీ పని చేస్తే ఇంక ఆ భయంకరమైన నొప్పి రాదు కదా!” అని అడిగాను.

          ఆమె నన్ను చూసి నవ్వింది కానీ ఏ సమాధానం ఇవ్వలేదు. ఆమె వెళ్ళాక నేను, శ్రీని మొహలు చూసుకున్నాం. అదేంటి ఇంత పెద్ద సర్జరీ చేసింతర్వాత తగ్గుతుందా, లేదా అంటే అలా వెళ్ళిపోయిందేమిటి? మా ఇద్దరి మొహల్లో అయోమయం.

          “రేపు వస్తుంది కదా! మళ్ళీ అడగొచ్చులే. ఏదో ఆలోచిస్తూ వుందేమో…” అన్నాడు శ్రీని.

          శ్రీని కాఫీ తెచ్చుకోవడానికి వెళ్ళాడు. జూలియా వచ్చాక శ్రీని ఇంటికి బయల్దేరాడు. ఇపుడున్న పరిస్థితిలో ఇద్దరం ఎవరికీ ఎంత వీలైతే అంతవరకు చేయాలి, ఇక్కడ ఇద్దరం ఒకరిని గురించి మరొకరు అపార్ధాలు చేసుకోవడానికి అవకాశం కానీ సమయం కూడా లేవు. తను చేస్తున్నదే ఎక్కువ, కొంతమంది అమెరికన్ స్నేహితులు సాయం చేస్తున్నందుకు కొద్దిగానయినా రిలీఫ్ గా ఉంది. జూలియా ఉండడానికి ఒప్పుకున్నం దుకు శ్రీని పిల్లలతో ఉండడానికి వస్తుంది. సర్జరీకి ముందు ఒక్కరోజు కూడా శ్రీనిని కానీ ఫ్రెండ్ ని కానీ రాత్రి నా దగ్గర ఉండమని అడగలేదు. ఒక్కరోజు ఎవరైనా ఉంటే నేను నా అంతటా నేనుండగలననుకున్నాను, కానీ ఈ రోజు కూడా ఉండమన్నాను జూలియాను. మరి రేపెలా ఉంటుందో చూడాలి. ఇండియన్ ఫ్రెండ్స్ కొన్ని నెలల వరకు మా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లోనే వుండేవారు, ఇపుడు వేరు వేరు జాబ్స్ వల్ల చెల్లా చెదురై పోయారు.

          జూలియా తను ఇంటికెళ్ళి ఏమేం పన్లు చేసి వచ్చిందో చెబ్తుంది. నాకేమి తలకెక్కడం లేదు. కాసేపయ్యిం తర్వాత జూలియా నీళ్ళు తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళింది.

          నా రూం బయటే నర్స్ స్టేషన్ వుంది. అందరు నర్సులు ఈ వార్డులో పని చేసేవారు ఇక్కడ నుండే మందులు, ఇంజెక్షన్లు, పేషంట్స్ కి ఏం కావాలో తీసుకెళ్తుంటారు. వాళ్ళు కొంచెం నార్మల్ గా మాట్లాడుకున్నా స్పష్టంగా వినిపిస్తుంది. నా నర్స్ కొత్త నర్స్ ఇక్కడకు ఈ రోజొచ్చాడు. అతనికి నా గురించి చెబ్తుంది, ” ఈ పేషంట్ చాలా బాధలో వుంది, చిన్న పాప ఇంట్లో వుంది, ఒకబ్బాయి కూడా వున్నాడు. భర్త రోజొచ్చి కాసేపు కూర్చుని వెళతాడు. వాళ్ళ ఫ్యామిలీ వారెవరూ ఇక్కడ ఎవ్వరూ లేరు. అందుకే నిన్ను ఇక్కడికి రమ్మన్నాము. మాతో ఎక్కువ మాట్లాడటం లేదు, నీతో మాట్లాడుతుందేమో, మీరిద్దరూ ఒకే దేశం వారు కదా! ప్లీజ్ టేక్ గుడ్ కేర్ ఆఫ్ హర్! వియ్ ఆర్ ఆల్ వర్రీడ్ అబౌట్ హర్!” అని చెప్పింది.

          నర్సులు షిప్ట్స్ మారుతున్నారు. ఒక ఐదు నిమిషాల తర్వాత, “హాయ్ దుర్గా! మై నేమ్ ఈజ్ విజయ్, డూ యూ స్పీక్ హిందీ?” అని అడిగాడతను లోపలికొచ్చి.

          “యస్ ఐ డూ స్పీక్ హిందీ.”

          “దేకియే దుర్గా బెహన్, ఆప్ కా సర్జరీ అచ్చాసా హో గయా హై! అభీ ఘభ్రానేకి కోయీ బాత్ నహీ. అభీ ఆప్ రికవరీ పర్ ఫోకస్ కీజియే. సబ్ కుచ్ ఠీక్ హోజాయేగా. హమ్ లోగ్ ఆప్ కా దేఖ్ బాల్ బహుత్ అచ్చి తరహ్ సే కరేంగే! కోయి ఫికర్ కర్నేకి బాత్ నహీ హై!” అని చాలా ఆప్యాయంగా మాట్లాడాడు.

          “నేను ఫోర్త్ ఫ్లోర్లో పని చేస్తాను, కానీ మీ కోసం నన్ను ఇక్కడకొచ్చి పని చేయమ న్నారు. సో మీరు డిశ్చార్జ్ అయ్యేవరకు నా మొహం రోజు చూడాల్సి వస్తుంది, మీకిష్టము న్నా, లేకున్నా!” అని గట్టిగా నవ్వాడు.

          “నో, నో, నో …” గొంతులో ట్యూబ్ గుచ్చుకుంది, “ఐ యామ్ గ్లాడ్ టు సీ యూ…”అని కష్టంగా అన్నాను.

          “థ్యాంక్ యూ, వేయిట్..”అని బయటకు పరిగెత్తాడు.

          స్ప్రే తీసుకొచ్చి గొంతులో కొద్దిగా స్ప్రే చేసాడు. “ఇది చేదుగా ఉంటుంది కానీ కాసేపన్నా మొద్దుబారుతుంది.” అన్నాడు నర్స్ విజయ్.

          “సో మీకు ఏం కావాలన్నా నన్ను పిలవండి. నేను పొద్దునవరకు ఇక్కడే ఉంటాను. మీకు త్వరగా తగ్గిపోతుంది, ఎక్కువగా వర్రీ అవకండి..” చిరునవ్వుతో అన్నాడు.

          ” సరే,” అన్నాను.

          జూలియా లోపలికి వచ్చింది, “హాయ్, హౌ ఆర్యూ?” అని నర్స్ విజయ్ చెయ్యి ఊపుతూ వెళ్ళాడు.

          నేను జూలియాకి అతనేం అన్నాడో చెప్పాను.

          దానికి  జూలియా, ” వావ్! దట్స్ నైస్. నీ కోసం స్పెషల్ గా పిలిపించారంటే నువ్వు ఇక్కడ కంఫర్టబుల్ గా ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు.” అంది.

          జూలియా ఆవులిస్తుంది. నేను తనని పడుకోమన్నాను, రాత్రి అస్సలు సరిగ్గా పడుకోలేదు పాపం.

          “బుక్ తెచ్చుకున్నాను. కాసేపు బుక్ చదువుకుని పడుకుంటాను. నీకేమన్నా కావాలా ఇపుడు? నిన్నటికన్నా ఈ రోజు బెటర్ గా ఉందా?” అంది జూలియా.

          “నాకేం తేడా అనిపించడం లేదు.” అన్నాను.

          “హౌ ఆర్ యువర్ డాగ్స్ అండ్ క్యాట్స్?” అని అడిగాను.

          “దే ఆర్ ఫైన్. నేనెళ్ళే వరకు పాల్ వాటికి ఫుడ్ పెట్టేసాడు. డానియల్, తను బ్రేక్ఫాస్ట్ చేసారు. పాల్ మొక్కలకు నీళ్ళు పడ్తున్నాడు. పెట్స్ కి ఫీడ్ చేసేసాడు కదా! నేను స్నానం చేసి  కొద్దిసేపు అంటే ఒక గంట పడుకున్నాను. లేచి లంచ్, డిన్నర్ కూడా చేసి పెట్టేసాను. అందరం కల్సి లంచ్ చేసి, నేను గ్రోసరీ షాపింగ్ కెళ్ళి అన్నీ సరుకులు తీసుకొచ్చాను. ఇంట్లో కొంచెం క్లీనింగ్ పని చేసేపటికి డిన్నర్ టైం అయ్యింది. డిన్నర్ చేసి వచ్చేసాను.”

          ” థ్యాంక్యూ సో మచ్ జూలియా! ఐ కాన్ట్ థ్యాంక్యూ ఎనఫ్!”

          జూలియా నా చేతులు తీసుకుని ముద్దు పెట్టుకుంటూ, ” నువ్వు త్వరగా కోలు కుంటే చాలు, పాపం పిల్లలు నీకోసం వేయిట్ చేస్తున్నారు కదా!” అని అంది.

          జూలియా బుక్ తీసుకుని చదువుతూ కూర్చుంది.

          నేను టీ.వి చూస్తూ కళ్ళు మూసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. కొన్ని కొన్ని గంట లకు నొప్పి ఇంజెక్షన్ ఇస్తున్నారు. ఎక్కువ ఆందోళన కల్గకుండా, కడుపులో తిప్పకుండా ఉండడానికి కూడా ఐ.వి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. జూలియా కాసేపయ్యాక నైట్ డ్రెస్ వేసుకుని, పడుకునే ముందర ఇక్కడ చాలా మంది స్త్రీలు చర్మానికి  క్రీం రాసుకుంటారు, హేయిర్ స్టయిల్ మర్నాటికి వేరేగా ఉండాలనుకుంటే ఆ స్టయిల్ సెట్ చేసుకుని పడు కుంటారు, కళ్ళలో లైట్ పడకుండా ఐ మాస్క్ పెట్టుకుంటారు. ఒక్కరోజే కదా అని జూలియా ఏం తెచ్చుకోలేదు. నా దగ్గర ఏమన్నా ఉన్నాయా అని అడిగింది. నా దగ్గర దువ్వెన, హేయిర్ బాండ్స్ ఉన్నాయి. హాస్పిటల్ వాళ్ళే టూత్ పేస్ట్, క్రీం, సోప్, షాంప్ ఇస్తారు. నా బ్యాగ్ లో చూడమన్నాను. తనకు కావాల్సినవి ఏవి లేవు. ఈ రోజు తెచ్చుకు న్నట్టుంది. అన్నీ చేసుకుని, “గుడ్ నైట్ దుర్గా, ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ వేక్ మీ అప్,” అని చెప్పి పడుకుంది.

          నాకు కాళ్ళు విపరీతంగా లాగటం మొదలుపెట్టాయి. ప్రతి నెల పీరియడ్స్ వచ్చే ముందు నాకు కాళ్ళు విపరీతంగా లాగుతుంటాయి, అలాగే అనిపించింది.

          నేను తట్టుకోలేకపోతున్నాను. నర్స్ బటన్ నొక్కాను, నర్స్ విజయ్ వచ్చాడు.

          “చెప్పమ్మా దుర్గా నేనేం చేయగలను?”

          “నా కాళ్ళు బాగా లాగుతున్నాయి. భరించలేకపోతున్నాను…”

          “కాళ్ళు పట్టనా….”

          “కాదు, నేను కాసేపు నడుస్తాను.”

          “నడవటమా? రేపు నడిపిస్తాము మామూలుగా, ఇపుడే నడవాలా? ఒక్క నిమిషం…” అని బయటికి వెళ్ళి మరో నర్స్ ని అడిగి వచ్చాడు.

          “సరే! ఒక్క నిమిషం ఆగాలి తల్లీ, నీవి చాలా ట్యూబ్స్ ప్లగ్ చేసి వున్నాయి. అవి అన్నీ జాగ్రత్తగా తీసి ఈ ఐ.వి పోల్ కి జాగ్రత్తగా తగిలించాలి…” అని అంటూనే తీయ సాగాడు.

          వెళ్ళే ముందు బాత్రూంకెళ్ళి బయట హాల్వేలోకి వెళ్ళాము. సర్జరీకి ముందు ఐ.వి పోల్ తీసుకుని హాస్పిటల్ హాల్వేల్లో ఊరికే తిరుగుతూ వుండేదాన్ని.

          నర్స్ విజయ్ జాగ్రత్తగా పట్టుకుని నడిపిస్తున్నాడు. నేను త్వరగా నడవడానికి ప్రయత్నిస్తున్నాను, నర్స్ విజయ్, “అంత ఫాస్ట్ గా వద్దమ్మా, నొప్పి వస్తుంది.”

          ఒక రౌండ్ అయ్యింతర్వాత రూంలోకి తీసుకెళ్ళబోయాడు, నేనేమో, “మరొక్క రౌండ్ ప్లీజ్!” అన్నాను.

          ” పేషంట్స్ ని ఫస్ట్ టైం వాక్ చేయడానికి తీసుకెళ్ళడానికి వారిని బ్రతిమిలాడాలి, ఒక్క రౌండ్ కూడా సరిగ్గా చేయరు, వెళ్ళి బెడ్ పైన పడుకుంటామంటారు. నువ్వేమో వారికి పూర్తిగా విరుద్దంగా వున్నావు.”

          మూడు రౌండ్లు అయ్యిం తర్వాత ఇష్టం లేకుండా రూంలోకి వెళ్ళి పడుకున్నాను.

          ఒక రెండు గంటలవ్వగానే మళ్ళీ నర్స్ విజయ్ ని పిలిచి, వాక్ కి తీసుకెళ్ళ మన్నాను. ఈ సారి డ్యూటి డాక్టర్ కి ఫోన్ చేసి తన పర్మిషన్ తీసుకున్నాక బయటికి తీసుకెళ్ళాడు.

          అలా తెల్లారేసరికల్లా 3-4 సార్లు వాక్ చేసాను.

          పొద్దున కొంచెం నిద్రపడుతుంది సర్జన్ బార్బరా వచ్చింది చెక్ చేయడానికి, “నాకు పీరియడ్ వచ్చింది డాక్టర్,” అని చెప్పాను.

          “ఓహ్! నువ్వు నాలుగోదానివి ఈ విషయం చెప్పినదానివి. పెద్ద సర్జరీ కదా! ఒకోసారి ఇలా జరగొచ్చు.” అంది.

          ఆ రోజు ఆమెతో పాటు చీఫ్ ఆఫ్ సర్జన్ వచ్చాడు సర్జరీ పేషంట్స్ ని చూడడానికి. ఆయన పేషంట్ డిటేయిల్స్ అడిగి తెలుసుకుంటున్నాడు.

          నేను మళ్ళీ ఈ నొప్పి రాదు కదా అని అడుగుదామనుకుంటే నాకా అవకాశం రానేలేదు.

          మూడో రోజు కూడా జూలియాని ఉండమని అడిగితే పాపం ఏం అనకుండా ఒప్పు కుంది.

          ఆ రోజు మధ్యాహ్నం మా అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో ఉండి బోస్టన్ కి వెళ్ళిపోయిన మంజుల ఫోన్ చేసింది. ఇంటికి ఫోన్ చేస్తే శ్రీని ఇక్కడి నెంబర్ ఇచ్చాడట.

          “ఎట్లా వున్నావు దుర్గా?” అని అడిగింది.

          నాకు దు:ఖం వచ్చేసింది. “మంజుల నా వల్ల కావటం లేదు. మాకు సాయం కావాలి ప్లీజ్ వచ్చేయ్ మంజుల. శ్రీనివాస్ కి చాలా కష్టమవుతుంది. జూలియా మూడ్రోజుల నుండి వుంటుంది. రేపట్నుండి ఎవ్వరు ఉండరు. సర్జరీ తర్వాత ఒక్కదాన్ని ఉండలేక పోతున్నాను మంజుల. వచ్చేయ్ మంజుల ప్లీజ్….”

          “ఏడవకండి దుర్గా, సర్జరీ అయ్యిందట ఇపుడు ఎట్లా వున్నారని అడగడానికి చేసాను. రజిత, కాంచన, శ్రీ వల్లి వీళ్ళంతా అక్కడకి దగ్గరే వుంటారు కదా! మీరు అందరికీ సాయం చేసేవారు, ఇపుడు మీకు అవసరం పడితే ఎవ్వరూ మాట్లాడరా?” అన్నది మంజుల.

          “వచ్చేసేయ్ మంజుల. ఫ్లయిట్ లో వస్తానంటే శ్రీనివాస్ ని టికెట్ బుక్ చేయ మంటాను. మేము చేసుకోగలమనుకుని ఎవ్వరిని సాయం అడగలేదు. నేనొక్కదాన్ని హాస్పిటల్ లో ఉండగలిగితే ఎవ్వరి సాయం అవసరం లేదు. శ్రీనివాస్, జోన్ పిల్లల్ని చూసుకుంటే నన్ను ఒకసారి చూడడానికి వచ్చి పోతే సరిపోయేది కానీ ఇది మేజర్ సర్జరీ ముక్కులో, గొంతులో ట్యూబులున్నాయి, ఎపిడ్యూరల్ పనిచేయలేదు, నా ఒంట్లోని శక్తంతా పీల్చేసినట్టుగా ఉంది. ఒక్కదాన్ని ఉండాలంటే చాలా భయంగా, బెంగగా ఉంటుంది. నేనెప్పుడూ ఇంతగా ఎవ్వరినీ దేనికి సాయం అడగలేదు….”

          “నేనెట్లా రాను దుర్గా? మా ఆయన టూర్స్ కెళ్తుంటాడు. పిల్లల స్కూల్ పోతుంది….”

          ” పర్మీషన్ తీసుకుని పిల్లల్ని తీసుకొచ్చేయ్…”

          “అయినా మేం చాలా దూరమున్నాము దుర్గా! ఆయన ఇక్కడే వుండి ఆఫీసుకి వెళ్తుంటే పిల్లల్ని ఆయన దగ్గర వదిలిపెట్టి వచ్చేదాన్ని. కానీ…మీరేం కంగారు పడకండి. నేనేదన్నా ఒకటి ఆలోచించి చెప్తా… నేను సాయంత్రం మళ్ళీ ఫోన్ చేస్తాను. జాగ్రత్త దుర్గా! మీరేం ఎక్కువ ఆలోచించకండి, మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొండి. పిల్లల్ని శ్రీనివాస్ గారు, జోన్ బాగా చూసుకుంటారు. పాపకి దూరంగా ఉండడం కష్టమే కానీ మీకారోగ్యం బాగాలేకపోతే తనని మీరెట్లా చూసుకుంటారు? ఆరోగ్యం బాగయిపోతే మీరే అన్ని చూసుకోవచ్చు. మీరెంత యాక్టివ్ గా ఉండేవారు, ఒక్కనిమిషం ఖాళీగా ఉండేవారు కాదు, ఎప్పుడు ఏదో ఒక పని చేస్తుండేవారు. మళ్ళీ అట్లా అయిపోవాలి మీరు దుర్గా! సాయంత్రం మళ్ళీ మాట్లాడతాను. సరేనా!” అని ఫోన్ పెట్టేసింది.

          తను ఏదో ఒకటి ఆలోచించి చెప్తానన్నప్పట్నుండి నాకు కొంచెం ధైర్యంగా అనిపిం చసాగింది.

          జూలియా పాపం మూడ్రోజులుంది. రేపట్నుండి ఎలా అని ఆలోచిస్తున్నాం?

          ఇలాంటి ఫ్రెండ్స్ ని చూస్తే అనిపిస్తుంది, మన కష్టంలో మీకు మేమున్నామని ఎంతో అభిమానంగా అండగా నిలబడేవారు రక్తసంబంధీకులే కానక్కర్లేదని కష్టాల్లో, సంతోషంలో సమానంగా పాలు పంచుకునేవారుంటే చాలు. జూలియా, క్యాథి, జోన్, లాంటి వారు అమెరికన్స్, వాళ్ళకి ఎలాంటి భేదభావాలుండవు. ఒకసారి స్నేహం చేస్తే జీవితాంతం స్నేహితులుగానే ఉండిపోతారు.

          జూలియా ఆ రోజు మంజుల ఫోన్ వచ్చింతర్వాత మేమిద్దరం కాసేపు మాట్లాడు కున్నాం.

          ” మా పేరెంట్స్ ఈ లోకం వదిలిపెట్టి వెళ్ళిపోయి చాలా రోజులయ్యింది. మా పెళ్ళయిన తర్వాత చాలా ఏళ్ళకు ఒక బాబు పుట్టాడు. ఇక్కడ నా వైపు కానీ పాల్ వైపు కుటుంబ సభ్యులకు వీలైతే కొన్ని రోజులకు వచ్చి వెళ్తారు వీలు కాకపోతే ఎవ్వరు రారు. కొత్తగా పేరెంట్స్ అయిన జంటలే అన్నీ పనులు చేసుకుంటారు. డెలివరీ తర్వాత అసలు రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది కానీ ఆ అవకాశం చాలా తక్కువ ఇక్కడ.” అంది జూలియా.

          గొంతులో ట్యూబ్, ముక్కులో ట్యూబ్ విసిగిస్తుంటే మెల్లిగా మాట్లాడుతున్నాను.

          “మా దగ్గర మొదటి కాన్పు తప్పకుండా మా పెరెంట్స్ వాళ్ళే చేస్తారు. డెలివరీ అయ్యింతర్వాత కనీసం మూడు నెలలు ఏమి పనులు చేయనివ్వరు. పాప/బాబుకు స్నానం పోయడం, నాకు స్నానం పోయడం, మంచి హెల్తీ ఫుడ్ పెట్టడం, రెస్ట్ ఇవ్వడం చేస్తారు. పాప/బాబుని రాత్రి పూట లేస్తే కూడా బట్టలు తడిపితే మారుస్తారు, నేను పాప/బాబుకి పాలు పట్టింతర్వాత నిద్ర పుచ్చుతారు. ఒక రాజకుమారిని చూసుకున్నట్టు చూసుకుంటారు.” అని మెల్లి మెల్లిగా ఆగుతూ ఆగుతూ చెప్పాను.

          ” దట్ మస్ట్ బి సో నైస్, రైట్?”

          ” యస్, మనకు కొన్ని వారాలు కానీ ఒక నెల చిన్న, చిన్న పనులు చేసుకుంటూ రెస్ట్ తీసుకోవచ్చు. ఆ తర్వాత కూడా చెవుల్లో గుడ్డలు పెట్టుకుని ఎండాకాలంలో కూడా, రూంలో నుండి బయటకు రాకుండా వుండాలంటే చాలా కష్టం. చాలా తినిపిస్తారు, పని చేయనివ్వరు. ఆరోగ్యంగా ఉంటే మన పనులు మనం చేసుకోవచ్చు, బేబిని చూసుకోవ డానికి కొంచెం సాయం వుంటే చాలు మరీ ఎక్కువ రెస్ట్ కూడా మంచిది కాదు. ఐ ఫీల్ లైక్ దట్. నేను చైతన్య పుట్టినపుడు రెండు వారాల తర్వాత నా పనులు నేను చేసుకుంటూ, బాబుని కూడా నేనే చూసుకునేదాన్ని.”అన్నాను.

          అదే రొటీన్ కంటిన్యూ అవుతుంది. గొంతులో గుచ్చుకున్నపుడల్లా స్ప్రే చేస్తున్నారు. నొప్పికి ఇంజెక్షన్లు ఇస్తున్నారు. ఐ.వి బ్యాగ్స్ అయిపోయినపుడల్లా మారు స్తున్నారు. ఐ.వి యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. టి.పి.ఎన్ న్యూట్రీషన్ ఇంకా మొదలు పెట్టలేదు. పొద్దున పూట హాల్వేలో నడవడానికి నర్సుల సాయంతో వెళ్ళొస్తున్నాను. రాత్రి నర్స్ విజయ్ కొన్ని గంటలకోసారి పిలిచి నడకకు తీసుకెళ్ళమంటాను. పాపం విసుక్కోకుండా తీసుకెళ్తాడు. రాత్రి పూట కాళ్ళు లాగటం ఎక్కువవుతుంది.

          జూలియా సాయంత్రం వెళ్ళిపోయింది. తను వెళ్ళేపుడు చాలా చాలా థ్యాంక్స్ చెప్పాను. వీలయితే సిటీకి వస్తే నను చూడడానికి రమ్మన్నాను.

          ప్రయత్నిస్తానన్నది. తను వెళ్ళిపోతుంటే నాకు ఏడుపు వచ్చింది. చాలా కష్టంలో ఉన్న నాకు నేనున్ననని నిలబడింది. ఇలాంటి మంచి స్నేహితులుంటే చాలు.

          శ్రీని వచ్చి కాసేపుండి వెళ్తానన్నాడు.

          నాకు రాత్రి ఒక్కదాన్ని ఎలా వుండాలా అని భయమేస్తుంది.

          నా కోపం శ్రీని మీద చూపిస్తానేమో అని అనిపిస్తుంది. కళ్ళు మూసుకుని పడుకోవ డానికి ప్రయత్నం చేస్తున్నాను.

          “పడుకుందేమోనండి…. వేయిట్ చేద్దాం తను లేచేవరకు….” అని మాటలు వినపడి కళ్ళు తెరిచాను.

          ఎదురుగా రమ్యశ్రీ, ఆమె భర్త సురేష్ నిలుచుని ఉన్నారు.

          “ఓహ్ రమ్యా, మీకెలా తెలుసు నేనిక్కడ ఉన్నానని?” అని అడిగాను.

          “మంజుల గారు ఫోన్ చేసారు మధ్యాహ్నం దుర్గ గారు?” అన్నాడు సురేష్.

          రమ్య నా ట్యూబ్లు, నా చుట్టూ వున్న మెడికల్ సరంజామానంత ఆశ్చర్యంగా చూస్తుంది.

          “ఇదేమిటి దుర్గా. మాకు ఒక్క మాటయిన చెప్పలేదు. సర్జరీ అంటే ఏదో చిన్నదను కున్నాను. చాలా పెద్దదిలా వుంది… ఎలా అయిపోయారో?” అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది రమ్య.

          “ఇట్స్ ఓకే రమ్యా! మాకు మీరెక్కడ ఉన్నారో, మీ ఫోన్ నెంబర్ మారిందన్నారు, నా దగ్గర లేదది. ఎలా చెప్పగలం చెప్పండి?”

          ఇంతలో శ్రీని వచ్చాడు.

          “అరె మీకెలా తెల్సింది? మా దగ్గర మీ ఫోన్ నెంబర్ లేదు అందుకే ఎలా చెప్పాలో తెలీలేదు. మేము మీరీ వూళ్ళో లేరనుకున్నాము.” అన్నాడు శ్రీనివాస్.

          “అసలు ఈ హాస్పిటల్, రూం నంబర్ ఇవన్నీ మంజులకు తెలీదు. మీకెలా…”

          “హాస్పిటల్ పేరు చెప్పింది తను. నేను లంచ్ టైంలో వచ్చి రిసెప్షనిస్టుని రూం నెంబర్ అడిగి పైకి వచ్చి చూసి వెళ్ళాను. మీ ఫ్రెండ్ బుక్ చదువుకుంటూ కూర్చున్నారు, మీరు నిద్రపోతున్నారు. డిస్ట్రబ్ చేయడం ఎందుకని వెళ్ళిపోయాను. మా ఆఫీస్ రెండు బిల్డింగ్ ల అవతలే.” అన్నాడు సురేష్.

          “శ్రీనివాస్ గారు నేను రాత్రి పూట వచ్చి పడుకుంటానండి. మీరు ఇంట్లో పిల్లల్ని చూసుకొంటాను. కానీ నేను నాలుగురోజులు రాగలనండి, ఇండియాకి వెళ్తున్నాం వీకెండ్లో,” అంది రమ్య.

          నాకు తన మాటలతో భయం పోయింది. చాలు ఎన్ని రోజులున్నా చాలు. నాలుగు రోజుల తర్వాత నాకు ధైర్యం వస్తుందేమో.

          రమ్య శ్రీనివాస్ కి ఒక టిఫిన్ కారియర్ ఇచ్చింది. “ఇందులో పప్పు, కూర, పచ్చడి వున్నాయండి. మీరు అన్నం పెట్టేసుకుంటే సరిపోతుంది…”

          “మీకెందుకండి శ్రమ. మీరు వచ్చి తన దగ్గర ఉండడమే మాకు పెద్ద సాయం. థ్యాంక్యూ… …” అన్నాడు శ్రీని.

          “అయ్యో! ఇదేం పెద్ద సాయమండీ! మీరు చిన్న పాపతో, అక్కడ ఇంట్లో, ఇటు హాస్పిటల్లో చూసుకుంటూ కష్టపడుతున్నారు. ఈ మాత్రం చేయకపోతే ఇంకెందుకండీ …” అన్నది రమ్య.

          మర్నాడు మంజులకు ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పాను. “పర్వాలేదు దుర్గా. నేనే వచ్చేదాన్ని దగ్గర వుంటే. అందరికీ ఫోన్ చేసి బాగా కోపడ్డాను. మనం స్నేహితులం ఒకరికొకరం సాయం చేసుకోకపోతే ఎట్లా? మీరు రెస్ట్ తీసుకొండి దుర్గా! మీరు ఎపుడు డిశ్చార్జ్ అవుతారో చెబితే అపుడు రావడానికి ప్రయత్నిస్తాము.” అన్నది. తనతో మాట్లాడిన తర్వాత నాకు కొంచెం ధైర్యంగా అనిపించింది.

          రమ్య అన్నట్టే నాలుగురోజులు వచ్చి రాత్రి పూట పడుకునేది, శ్రీనివాస్ కి తిండి కూడా తీసుకొచ్చి ఇచ్చేది. 

          నర్స్ విజయ్ రోజు ఏదో ఒకటి చెప్పి ధైర్యాన్ని నూరిపోయడానికి ప్రయత్నించే వాడు. వాళ్ళ బందువుల్లో ఎవరికో చాలా జబ్బు చేసింది అసలు బ్రతకడనుకున్నారు కానీ మంచి డాక్టర్లు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి బ్రతికించారని, మనసుని గట్టిగా ఉంచుకుంటే ఎంత కష్టమైనా బయటపడొచ్చని చెప్పేవాడు. ఇంట్లో నెలల పాపని వదిలేసి ఇక్కడ వుండడం కష్టమే కానీ తల్లి ఆరోగ్యం బాగుంటేనే కదా, పిల్లల్ని బాగా చూసుకునేది. అందుకే మీరు రోజు పిల్లల్ని మీ భర్తని తల్చుకుని ఈ బాధ నుండి కోలుకుని సంతోషంగా వుండాలని ఆలోచించండని చెప్పేవాడు. మీరు బాగయిం తర్వాత పిల్లలతో ఎలా సమయం గడపాలి, మీ అమ్మ వస్తుందన్నారు, అమ్మతో కలసి ఎలా సంతోషంగా ఉండాలో, అమ్మ వస్తే మీ భర్తకు ఇంటి పనిలో సాయంగా ఉంటుంది, తనకి కూడా కొంచెం రిలీఫ్ గా, ఇంట్లో పెద్దవాళ్ళుంటే ధైర్యంగా ఉంటుంది అని ఒక కౌన్సలర్ లాగా చెప్పేవాడు.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.