గుండె గాయం మానేదెలా

(నెచ్చెలి-2025 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-తెలికిచెర్ల విజయలక్ష్మి

“మంగా, ఇంటికి వచ్చేసేవా! నిన్ను కలవడానికి రావాలని అనుకుంటున్నాను. రావచ్చా” అంది వసుమతి.

“అదేంటే రావచ్చా అని అడుగుతున్నావు? నేను నీకు పరాయిదాన్ని అయిపోయానా!” అంది కిసుకగా మంగ.

“మీ అన్న కొడుకు వచ్చి తీసుకు వెళ్ళాడని చెప్పావు కదా! వచ్చేవో లేదో అని అడిగానంతే. వచ్చేనెలలో మా మరిది కూతురు పెళ్ళి వుందే. జాకెట్లు కుట్టడానికి నీకు ఇచ్చినట్టు వుంటుంది. ఆ వంకతో మనం కాసేపు కబుర్లు చెప్పుకోవచ్చు అని ప్లాన్ చేసుకున్నాను. ఒక గంటలో వస్తాను అయితే!” అంది వసుమతి.

“త్వరగా రా! నీకోసం ఎదురుచూస్తూ వుంటాను. వస్తావు కదా, నా మిషన్ పరిస్థితి చూసి, జాకెట్లు కుట్టడానికి ఇవ్వు!” అంది మంగ. ఇంటికి తాళం పెట్టుకుని మంగ ఇంటికి చేరుకున్న వసుమతి ఇల్లంతా కలియచూసి,”వరదల దెబ్బకు ఇల్లు బాగా పాడైపోయిందే!” అంది.

“ఇల్లు ఇలా అవుతుందని అనుకున్నాను. తలుపు తీసి లోపలకు రాగానే ఒక్కసారిగా భయం వేసింది!” అంది మంగ.

“భయం ఎందుకే?” అంది వసుమతి నవ్వుతూ.

“ఈ కఱ్ఱ కుర్చీ వెళ్ళి ఫ్యాన్ రెక్కకు తగులుకుని వేలాడుతోంది. ఈ చిన్న దారాల పెట్టే వెళ్ళి ఎంచక్కా ఆ ఫ్యాన్ రెక్కమీద పదిలంగా కూర్చుంది. వాటిని అలా చూడగానే  దెయ్యాల సినిమా సెట్టింగ్ లా అనిపించింది. అంత యెత్తుదాకా ఇంట్లో నీళ్ళు నిండివుంటాయి. టివి పూర్తిగా నాశనం ఐపోయింది. బీరువాలో బట్టలన్నీ నీళ్ళల్లో నాని కంపు కొడుతున్నాయి. అవన్నీ శుభ్రం చేసుకుంటూ… నానిన గోడల మధ్య బతుకు ఎలాగో వెళ్లదీయచ్చు అనుకున్నాను. నా బతుకుతెరువు, కుట్టుమిషన్ నాశనం అయిపోయింది!” అంది బాధగా మంగ.

“మిషన్ బాగవుతుందిలే. ఎక్కువ టెన్షన్పెట్టుకోకు!” అంది వసుమతి స్నేహితురాల్ని ఓదారుస్తూ.

“ఏం బాగవుతుందీ! చూడు, ఈ కుట్టు మిషన్  వరద నీళ్ళల్లో ఉండిపోయి ఎలా పింపిరి ఎక్కిపోయిందో!  నా కష్ట సుఖాలకు ప్రత్యక్ష సాక్షి. ఎప్పుడైనా చిన్నచిన్న రిపేర్లు వచ్చినా వెంటనే బాగైపోయేది. దాని పుణ్యమా అంటూ నేను ఏనాడూ పస్తు వుండవలసిన అవసరం పడలేదు. ఇకమరి పనికి రాదే!” అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటున్న మంగను చూస్తుంటే గుండె బరువెక్కింది. “ప్రభుత్వం సహాయక చర్యలు వెంటనే చేబట్టింది కదా! నీకేమీ నష్ట పరిహారం రాలేదా?” అంది వసుమతి.

“మనసున్న మహారాజులు వరద ఉధృతి తగ్గగానే ఇంటింటికీ వచ్చి ఎంతవరకూ నష్టపోయేరో రాసుకుని వెళ్ళారు. అందరికీ నష్టపరిహారం చేతికి అందింది కూడా!” అంది మంగ.

“నీకు ఎందుకు అందలేదు. నీ పేరు మిస్ అయిందేమో అడకపోయావా!”

“నేను ఇక్కడ వుంటే నాకూ అంది వుండేదే! ఏనాడూ నా గుమ్మానికి రాని నా అన్న కొడుకు వచ్చాడు. వరదనీరు పెరుగుతున్న సమయంలో నన్ను వాడి ఇంటికి తీసుకుపోయాడు. కాస్త వరద తగ్గగానే వెళ్ళిపోతానురా అన్నాను. వినకుండా మరి కొన్నాళ్ళు వుంచేసాడు. ఆ సమయంలోనే ఇంటింటికీ వచ్చి కాలనీలో అందరి పేర్లు రాసుకున్నారట. ఆ సమయంలో నేను లేకపోవడంతో నాకు నష్టపరిహారం రాలేదు. వార్డు మెంబర్ వద్దకు వెళ్లి అడిగితే…

సమయం మించిపోయింది. ఇప్పుడు లిస్ట్ తియ్యలేమనేసారు!” అంటూ బాధగా చెప్తున్న స్నేహితురాలిని ఏమని ఓదార్చాలి? టివి చూసుకుంటూ బట్టలు కుడుతూ బాధలన్నీ మర్చిపోయేది. ఆ కుట్టుమిషన్ తో దాని జీవితం ఎలా ముడిపడి వుందో తనకు మాత్రమే తెలుసు. దాని జీవితంలో జరిగిన విషాదం వయసు ముప్పై సంవత్సరాలు దాటింది. అయినా ఆ గాయం ఇప్పటికీ రాకాసి పుండులా బాధపెడుతూ చీము కారుతున్నట్టే వుంటుంది.

***

“చదివి, చదివి బోరుకొడుతోంది. ఇకచాలుతల్లీ. ఆపేద్దాము!”

“మరొక్కసారి రివిజన్ చేసుకుంటే ఐపోతుంది! క్వశ్చన్ పేపర్ చూశాక మరొకసారి ఈ చాప్టర్ చదవవలిసింది అని బాధపడకూడదు! నువ్వూ మరొకసారి చదువు, నన్ను చదవనియ్యి!” అంటూ పదవతరగతి పరీక్ష కోసం ఎడ్ల బండిలో వెళుతూ చదువుకుంటోంది మంగ. పరీక్షకు వెళ్ళేముందు రిలాక్సగా వుండాలని అనుకుంటుంది వసుమతి. పరీక్ష హాల్ లోకి వెళ్ళే ఆఖరినిమిషం దాకా చదువుకోవాలని అనుకుంటుంది మంగ. పల్లెటూర్లో వుండే హై స్కూల్ లో ఇద్దరూ టెన్త్ చదువుతున్న స్టూడెంట్స్. నలభైమంది క్లాస్ పిల్లల్లో ఇద్దరే ఆడపిల్లలు. వోణీని నడుంచుట్టూ తిప్పి గట్టిగా దోపుకుని, పుస్తకాలను గుండెకు ఆనించుకుని ఏ జంకూ లేకుండా రెండు మైళ్ళ దూరం నడిచి చకచకా స్కూల్ కి చేరుకునేవారు.

ఇద్దరూ క్లాసులో వున్నప్పుడు ఆకతాయి పిల్లలు ఏమైనా కామెంట్స్ చేసినా పట్టించుకోకుండా ఎంతో ధైర్యంగా వుండేవారు. ఏదైనా అవసరంపడి ఒకళ్ళు స్కూల్ కి వెళ్ళలేకపోతే రెండోవాళ్ళు కూడా ఆబ్సెంట్ అయ్యేవారు. మంచి మార్కులతో టెన్త్ పాస్ అవుతామని ఇద్దరికీ ధైర్యంవుంది. ఎమ్ పిసి గ్రూప్ తీసుకుని, టౌన్ లో ఇంటర్ చదవాలని కలలు కంటున్నారు ఇద్దరూ. ఆఖరు పరీక్ష ఇది. ఈ ఒక్క పరీక్ష కూడా అయిపోతే ఇక నిశ్చింత అనుకుంటోంది మంగ.

“పేపర్ ఎంత కష్టంగా వచ్చినా బాగానే రాస్తావులే! నీకు ఫస్ట్ క్లాస్ గ్యారంటీ!” అంటూ మంగ చేతిలో పుస్తకం తీసి మడిచిపెట్టింది వసుమతి. పరీక్ష పూర్తి అయింది. తిరుగు ప్రయాణం, ఎడ్లబండిలో కూర్చుని పాటలు కొందరు పాడుతుంటే… భవిష్యత్ గురించి చర్చించుకుంటున్నారు కొందరు. అందరూ విడిపోయే సమయం ఆసన్నమైంది. ఒక్కొక్కరూ ఆడపిల్లలకు బై చెప్పి వెళ్తుంటే, దేవుడు మంగకు దగ్గరగా వచ్చి,

“పాత పుస్తకాలు ఏం చేస్తావు?” అని అడిగాడు.

“ఎవరికైనా సగం రేటుకి అమ్మేస్తాను!” అంది మంగ.

“అమ్మే ముందు పుస్తకాలన్నీ ఒకసారి చెక్ చేసుకుని అమ్ము!” అన్నాడు.

“ఎందుకనీ?” అంది మంగ.

“ఆడపిల్లలకి పుస్తకాల్లో డబ్బులు దాచుకునే అలవాటు వుంటుంది కదా! అందుకని” అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు. దేవుడి మాటలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే…

“పుస్తకాల పురుగు నీతో ఏంటి మాట్లాడుతున్నాడు?” అంది ఆరాగా వసుమతి. దేవుడు చెప్పినమాట నాకే అర్థం కాలేదు. దానికి చెప్పి, దాని బుర్ర వేడెక్కించడం ఎందుకని అనుకుని, “పరీక్ష ఎలా రాసేవు? ఇంటర్ ఎక్కడ చదువుతావు? అని అడుగుతున్నాడు!” అంటూ మాట మార్చి చెప్పింది మంగ. అలా మార్చి చెప్పకుండా దేవుడు అన్నమాటను యథాతధంగా చెప్పివుంటే ఆ మాటల్లో మర్మం ముందే వసుకి కొంతైనా అర్థమై ఉండేదేమో!

***

“మంగూ, సీత పిన్ని మనవడికి నీ నోట్సులు కావాలట, తీసి ఇయ్యమ్మా!” అన్నాడు రాఘవయ్య.

“ఇప్పుడు అవన్నీ తియ్యాలా! రిజల్ట్స్ వచ్చేక ఎలాగూ తీసేస్తాను కద నాన్నా! అప్పుడు ఇస్తాలే. ఈ రోజు పక్కింటి సుందరమ్మతో సినిమాకి వెళుతున్నాం!” అంది మంగ హుషారుగా.

“సరే, మీరంతా సినిమాకి వెళ్ళే ధ్యాసలో వున్నారు, మీరు వెళ్ళండి!” అంటూ కూతుర్ని పంపించి…

“రవీ, చెల్లాయి బుక్స్ తీద్దాము. కాస్త సహాయం చెయ్యి!” అంటూ కొడుకుని పిలిచాడు రాఘవయ్య. ‘ఆవిడగారు సినిమాలకి వెళుతుంది. నేనేమో ఆవిడ పుస్తకాలు సర్దాలిట!’ అని గొణుక్కుంటూ తండ్రి పక్కన కూర్చున్నాడు రవి. టెక్స్ట్ బుక్స్ విడదీసి ఒక పక్కగా పెట్టాడు. నోట్ బుక్స్ ఒక పక్కగా పెడుతుంటే,  గులాబీరంగు కవరు జారి పడింది. ఆ కవరు విప్పి చదివిన రవి కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి.

“ఏంట్రా, ఆగిపోయావు. నేను దుకాణంకి వెళ్ళేటప్పుడు ఇచ్చేసి వెళతాను. కానీయి, త్వరగా!” అన్నాడు తండ్రి.

“ఇదిగో, ఇది చూడండి!” అని కొడుకు చేతికి ఇస్తున్న కాగితం అందుకుంటూ

“ఏంటీ?” అన్నాడు రాఘవయ్య.

“మీ ముద్దుల కూతురికి వచ్చిన ప్రేమలేఖ. ఎంత పదిలంగా దాచుకుందో, చదవండి!” అంటున్న కొడుకు మాటలు నమ్మబుద్ధి కావడంలేదు. కూతురి ఉజ్వల భవిష్యత్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న తండ్రికి, ఆ లేఖ తీరని మనస్తాపాన్ని కలిగించింది. దుకాణంకి వెళ్ళకుండా ఆలోచిస్తూ చాలాసేపు వుండిపోయాడు ఆయన. చెల్లెలికి మంచి మార్కులు వచ్చిన ప్రతీసారీ…’ ఆడపిల్ల, దాన్ని చూసి సిగ్గు తెచ్చుకో!’ అంటూ తండ్రి వినిపించే మాటలతో  చెల్లెలిమీద కడుపు మంటగా వుండేది రవికి. ఇప్పుడా కడుపుమంట చల్లార్చుకునే అవకాశం వచ్చినందుకు మనసులోనే సంతోషించాడు ఆ అన్న.

“చదువు మాన్పించి ఇంట్లో కూర్చోపెట్టండి. దాని తిక్క కుదురుతుంది!” అన్నాడు ఉక్రోషంగా రవి. కొడుకు మాటలు పదేపదే మదిని దొలుస్తున్నాయి ఆ తండ్రికి. కూతురుకి చదువు మాన్పించాలనే మాట బాధ కలిగించింది. ‘ ఈ ప్రేమ లేఖ వ్యవహారం ఎంతదూరం వెళుతుందో తెలియదు. కుటుంబం నలుగురిలో అవమానాల పాలు అవుతుందేమో అనే భయం కలిగింది ఆయనకు. కూతుర్ని చదివించాలి అనే కోరికను ఆ భయం డామినేట్ చేసింది. కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు రాఘవయ్య. దాని పర్యవసానం తన బంగారు తల్లి జీవితాన్ని అధః పాతాళంలోకి తోసేస్తున్నానని తెలుసుకోలేకపోయాడు ఆయన.

***

టెన్త్ రిజల్ట్స్ వచ్చాయి. డెభై పర్సంట్ మార్కులతో పాస్ అయింది మంగ. తన రిజల్ట్స్ చెప్తుంటే తండ్రి ముభావంగా తల ఆడించి వెళ్లిపోవడం బాధ కలిగించింది ఆమెకు. తల్లి మాత్రం గిన్నెనిండా సేమ్యా పాయసం చేసి ఇరుగూ పొరుగూ అందరికీ పంచింది. ఒకరోజు పొద్దున్నే వచ్చిన వసుమతి…

“అడ్మిషన్ ఫామ్ మనిద్దరికోసం తెప్పించానే!” అంటూ ఇచ్చి వెళ్లింది. ఆ ఫామ్ మీద గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అనే పేరు చదువుతుంటే మంగ మనసు ఒకరకమైన ఆనందానికి లోనైంది. రాత్రి దుకాణం మూసేసి వచ్చిన తండ్రి వద్దకు వెళ్ళి…

“నాన్నా! వసూ అడ్మిషన్ ఫామ్ తెచ్చింది!” అంది.

“ఎవరికోసం!” అన్నాడు ఆయన.

“నా కోసం!” అంది మెల్లిగా.

“మరి చదివించలేను. పక్క వీధిలో ఆడవాళ్ళకు ఏదో స్కీమ్ మీద కుట్లు నేర్పించి, కుట్టు మిషన్ సబ్సిడీ మీద ఇస్తున్నారట. అందులో చేరి కుట్లు అల్లికలు నేర్చుకో. కాస్త డబ్బులు కూడబెట్టాక బావతో నీ పెళ్ళి చేస్తాను!” అంటూ మరొక మాటకు అవకాశం ఇవ్వకుండా లేచి అక్కడినించి వెళ్ళిపోయాడు.

ఉన్నత చదువులు చదువుకోవాలనుకుంది ఆ అమ్మాయి. మంచి ఉద్యోగం చెయ్యాలని కలలు కన్నది ఆ అమాయకురాలు. ఆ అమ్మాయి ఆశలు మొగ్గలోనే తుంచి వేయబడ్డాయి. నాన్న ఎందుకు అంత కఠినంగా వున్నాడో ఆ అమ్మాయి ఊహకు అందలేదు. తండ్రికి ఎదురు చెప్పడం తెలియదు. జీవితంలో రాజీ పడటం నేర్చుకుంది. ఏ పనినైనా పొందికగా నేర్చుకునే మంగ బట్టలు కుట్టడంలో ఆరి తేరింది. పొరుగుఇంట్లో ఉండే మిషన్ తాత, బట్టలు కట్టడంలో మెళుకువలు మంగకు నేర్పించేవాడు. ‘మంగ జాకెట్టు కుట్టిందంటే ఇక తిరుగులేదు!’ అంటూ ఊళ్ళోవాళ్ళు మెచ్చుకోవడం మంగ అన్నయ్యకు కంటగింపుగా మారింది.

“ఆడపిల్ల కష్టంతో జల్సా చేస్తున్నారని ఊళ్ళో వాళ్ళు అంటున్నారు. ఆడపిల్లను ఎన్నాళ్ళు ఇంట్లో వుంచుతాము. పెళ్ళిచేసి పంపిస్తే సరి!” అంటున్న రవి మాటతో కుటుంబం అంతా ఉలిక్కిపడింది. వెంటనే విజయవాడ కార్ షో రూమ్ లో పనిచేసే తన మేనల్లుడు నకుల్ కి కూతుర్నిచ్చి పెళ్ళిచేసాడు రాఘవయ్య. తన మిషన్ తోపాటు భర్త వద్దకు చేరుకుంది మంగ. టౌన్ లో కుట్టుకూలి బాగానే వచ్చేది. సంపాదించిన డబ్బులన్నీ పదిలంగా దాచుకునేది. అత్తమ్మ వచ్చినప్పుడల్లా తన కష్టార్జితం తీసుకుపోతుంటే బాధపడేది. వచ్చిన సొమ్మంతా ఇంట్లో ఉంచకుండా కొంత డబ్బు వేరే దాచుకుని చీటీలు వేసుకునేది. అలా తెలిసిన వాళ్ళ ద్వారా వంద గజాల స్థలంలో చిన్న ఇల్లు కొనుక్కుంది. సంవత్సరాలు గడిచాయి. పిల్లలు కలగలేదు. జీవితం ఎలా విసిరికొట్టినా తట్టుకుంది. భర్త, భయంకరమైన అనారోగ్యంతో మంచాన పడితే అప్పుచేసి మరీ మంచి ట్రీట్మెంట్ చేయించింది. ఫలితం దక్కలేదు. ఒంటరిగా మిగిలిపోయింది మంగ.

‘ఎంత కష్టాన్నైనా భరించేది నా స్నేహితురాలు. ఇప్పుడు, కుట్టు మిషన్ పనికిరాకుండా పోయిందని బాధపడుతోంది. నేనెలా ఓదార్చగలను’ అనుకుంటూ కాసేపు ఆలోచించిన వసుమతి…

“మరొక్కసారి ఆఫీసుకి వెళ్ళి అడిగి వద్దామా!” అంది. స్నేహితురాలి సలహాతో చిరు ఆశ కలిగింది మంగకు. ఇద్దరూ కలక్టర్ ఆఫీసుకి చేరుకున్నారు. ఫిర్యాదుల విభాగంలో తమ గోడు వెళ్లబోసుకున్నారు. నష్టపరిహారం అందని వాళ్ళ లిస్ట్ చూసారు. మంగ ఇంటి నంబర్ కనిపించలేదు. స్టాఫ్ ని బతిమాలితే ఇప్పుడు వీలవదు అన్నారు. చేసేది లేక మౌనంగా వుండిపోయారు.

“మంగా…!” అనే పిలుపు వినిపించినవైపు ప్రశ్నార్థకంగా చూసారు ఇద్దరూ.

“నీ క్లాస్ మేట్ దేవుడిని. ఇక్కడ నేను ఆఫీసు సూపరెంట్ ని. నీకేమైనా సహాయం చెయ్యగలనా!” అన్నాడు.

“పైనున్న ఆ దేవుడే సహాయం చెయ్యలేకపోయాడు. మానవమాత్రుడివి. నువ్వేం చేస్తావు?” అంది నిర్లిప్తంగా మంగ. దొరికిన అవకాశం వదలకుండా నష్టపరిహారం అందిన లిస్ట్ చెక్ చేయించింది వసుమతి. మంగ ఇంటి నంబరు కోసం చురుకుగా వెతికింది. ఆ నంబర్ వద్ద డబ్బు అందుకున్నట్టు టిక్ కనిపించాయి. ఇంటియజమాని స్థానంలో అన్న కొడుకు దాసు పేరు, సంతకం వెక్కిరిస్తూ కనిపించాయి. ‘ఎప్పుడూ ఇంటికి పిలవని అన్న ఈ స్వార్థంతో తనను ఇంటికి పిలిచాడా, ఛీ!’ అనుకుంది ఆ అభాగ్యురాలు.

రవి, తనను కొట్టడానికి వచ్చినప్పుడే మంగ చదువు తనవలన ఆగిపోయిందని ఆ నాడే అర్థమైంది దేవుడికి. ‘గులాబీ రంగు పేపర్ మీద ప్రేమ అనే పైత్యాన్ని ఒలకబోసాను. గుండె బొమ్మను గీసి బాణం గుచ్చి మంగ నోట్ బుక్ లో పెట్టి మురిసిపోయాను ఆనాడు. ఆ బాణమే ఆమె గుండెకు కన్నంపెట్టి రక్తంకార్చి జీవితాన్ని నలిపి వేస్తుందని తెలుసుకోలేకపోయాను. తెలిసీ తెలియని వయసులో మంగకు తీరని ద్రోహం చేశాను. ఆ ద్రోహానికి  ప్రాయశ్చిత్తం చేసుకునే సమయం ఇదే!’ అనుకున్నాడు దేవుడు. వసుమతిని పక్కకు పిలిచి మంగ ఆర్థిక పరిస్థితి అడిగాడు. ‘ఎవ్వరిదగ్గరా ఏమీ ఆశించని అభిమానవతి’ అని వసు చెప్పింది. దేవుడి మనసు బాధతో మూలిగింది. వెంటనే బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్న తన భార్యతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకున్నాడు.

“ఎంప్లాయ్ మెంట్ స్కీమ్ ద్వారా కుట్టు మిషన్ కొనుక్కోవడానికి లోన్ ఇప్పిస్తాను. నీ కష్టసుఖాలు పంచుకోవడానికి నీ మిత్రుడిగా అంగీకరించు నేస్తం! కుదరదని మాత్రం అనద్దు!” అని మంగ వద్ద అనుమతి తీసుకుని ఇద్దరినీ  సాగనంపి అదే పనిలో పడ్డాడు దేవుడు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.