
కాదేదీ కథకనర్హం-22
సర్దుబాటు
-డి.కామేశ్వరి
రాత్రి ఎనిమిదన్నర అయింది. వంటింట్లో చకచక గిన్నెలు కడిగి, స్టవ్ గట్టు అలికి తుడుస్తుంది సుజాత, “జునూన్” అప్పుడే మొదలవుతుంది టి.వి. లో. సుజాతకి “జునూన్” సీరియల్ ఎంతో ఇష్టం. ఎన్ని పనులున్నా తీరిక చేసుకుని చూస్తుంది. సీరియల్ మొదలయ్యేలోగ పని పూర్తి చేసుకోవాలని గబగబ గట్టు తుడుస్తుండగా కాలింగ్ బెల్ మోగింది. పిల్లలిద్దరూ సీరియల్ ముందు అడ్వర్టయిజ్ మెంట్ శ్రద్ధగా చూస్తున్నారు. రవీంద్ర పొద్దుట పూర్తీ చెయ్యని పేపరు శ్రద్దగా చదువుతున్నాడు. బెల్ మరోసారి మోగింది. “బెల్ కొడుతున్నారు ఎవరో కాస్త చూస్తారా?” సుజాత అరిచింది వంటింట్లోంచి.
రవీంద్ర తలుపు తీసి “అరే, అక్కయ్యా…’ అరిచాడు సంతోషంగా. వంటింట్లోంచి తొంగి చూసిన సుజాతకి ఆడబడుచుని ఆవిడ భర్తని చూడగానే ఒంట్లో బలమంతా ఒక్కసారి ఎవరో లాగేసి నట్లయిపోయింది- “ఓగాడ్ ‘ అనుకుంది. “ఇప్పుడు మళ్ళీ వండాలా భగవంతుడా” అన్న ఆలోచన రాగానే నీరసం ముంచుకొచ్చింది. గెస్టులు, దగ్గిర బంధువులు వచ్చిన సంతోషం లేకపోగా, విసుగు, కోపం, చిరాకు, నీరసం —-అన్నీ వచ్చేస్తున్నాయి సుజాతకీ మధ్య. ఇంట్లో చాకిరీ, బ్యాంకి ఉద్యోగం, పిల్లలు, వాళ్ళ చదువులు, బస్సు ప్రయాణాలు వీటన్నింటితో కొంపలో ఎప్పుడొచ్చి పడదామా …..తప్పక ఇంత వండి పడేసి ఎప్పుడు పక్క మీద వాల్దామా అని ఎదురుచూసే లక్షాతోంబయి మంది ఉద్యోగినులలో సుజాత ఒకర్తి.
హైదరాబాదులో కాపురంలో చుట్టాల తాకిడి ఎక్కువే. అందులో ఇటు, అటు రెండు వైపులా బంధుజనం ఎక్కువే అవడంతో ఏ పెళ్ళిళ్ళకో, పెళ్ళి చూపులకో, ఆస్పత్రి పనులకో, ఉద్యోగాల ఇంటర్వ్యూలకో, కాలేజి సీట్లకో ఎవరో ఒకరు వస్తూనే ఉండి చుట్టాలంటే విసుగొచ్చేసింది సుజాతకి. కాస్త నాల్గు రోజులు రొటీన్ లో పడి ‘అమ్మయ్య” అని ఊపిరి పీల్చుకునే వేళకి ఎవరో ఒకరు దిగుతూ సుజాత సహనానికి పరీక్ష పెడ్తున్నారు. “సుజా, అక్కయ్యోచ్చింది . రండి బావగారూ.” రవీంద్ర బావగారి చేతిలో సూట్ కేస్ అందుకుంటూ ఆహ్వానించాడు. నిట్టూర్పు అణచుకుని మొహాన రాని నవ్వు పులుముకుని, “రండి వదినగారూ, ఏమిటి కబురన్నా లేకుండా వచ్చారు” అంది సుజాత.
“హటాత్తుగా బయలుదేరాల్సి వచ్చింది. ఫోను చేద్దాం అంటే మీ పక్కింటి వాళ్ళు లేనట్లున్నారు. రెండుసార్లు చేసినా ఎవరూతీయలేదు. సరే, ఎలాగో సాయంత్రం వచ్చేస్తాం, ఫరవాలేదు ముందు తెలియ పర్చకపోయినా అనుకుని బయలుదేరాం రైలు రెండున్నర గంటలు ఆలస్యం అయింది.” ఆడబడుచు అంది.
“ఏమిటి? ఏమయింది- అంతా కులాసాయేనా? నీ వంట్లో బాగుంది కదా.” రవీంద్ర అడిగాడు.
“అదేనోయి, మీ అక్కయ్యకే ఈ మధ్య వంట్లో బాగుండడం లేదు. అక్కడ లేడీ డాక్టర్ యూటేరస్ ఆపరేషన్ చేయ్యాలంటుంది. ఓసారి ఈ ఊళ్ళో మంచి డాక్టరుకి చూపించి సలహా తీసుకుని డిసైడ్ చేద్దామని……’ బావగారు చెప్పారు.
‘అలాగా…..అయ్యో, చెప్పెనేలేదే – సుజాతకి మంచి గైనకాలజిస్ట్ తెలుసు. చూపిద్దాం లెండి- ఈ రోజుల్లో ఈ ఆపరేషన్లు మామూలయిపోయాయి.”
“అప్సత్రి పని…..అంటే కనీసం రెండు మూడు రోజులు. ఆపైన ఆపరేషన్ ఇక్కడే అంటారు…..” సుజాతకి ఆలోచించడానికే భయం వేసి వంటింట్లోకి వెళ్ళింది. “జునూన్ లేదు ఏం లేదు- మళ్ళీ వంట, గిన్నెలు కడుక్కోడం.” గొంతులో దుఖం అడ్డుపడింది సుజాతకి – బియ్యం కడిగి కుక్కరులో పెట్టి, నాలుగు వంకాయలుంటే వేయించడానికి తరగసాగింది. “నయమే -మధ్యాహ్నం చారు పారేశాను కాదు అనుకుంటూ ఫ్రిజ్ నుంచి చారుగిన్నే తీసింది. పెరుగు కాస్తే ఉంది. నిన్నటి పెరుగుంటే ఇది, అది కాస్త కలిపింది. వాళ్ళూ స్నానాలు అవీ చేసి వచ్చేలోగా వంటయిందనిపించింది.
“ఏం, మరదలి మొహం అలా వాడిపోయింది- వంట్లో బాగులేదా – పాపం మళ్ళీ వండాల్సి వచ్చింది. ఈ వెధవ రైళ్ళు ఎప్పుడూ ఆలస్యమే” అంది కమల.
“ఆ, ఏం ఉందిలే వంటెంత సేపు ” అన్నాడు రవీంద్ర. సుజాత మొగుడ్ని మింగేద్దాం అన్నట్టు చూసింది. “వంటెంత సేపుట? వండితే తెలుస్తుంది. అందులో పని అంతా అయింది అనుకున్నాక మళ్ళీ వంట అంటే ఎంత విసుగు. ఈ మగాళ్ళకేం, ఎంత సులువుగా వంటెంత సేపు అంటున్నాడు” కసిగా అనుకుని రాని నవ్వు పులుముకుంది.
“ఈయనగారికి ఈ అక్కగారిని చూస్తె చాలా ప్రేమ. ఆరుగురు పిల్లల్లో ఆఖరివాడు ఇతను. పెద్దావిడ ఆవిడ……తల్లికి ఒంట్లో బాగులేకపోతే అక్కగారే అస్తమానూ తమ్ముడ్ని ఎత్తుకోడం, ఆలనా పాలనా చేసేదని ఈయనకి, ఆవిడకి చాలా ఎటాచ్ మెంట్. మంచిదే – అక్కా తమ్ముళ్ళ ప్రేమలు – తనకేం అభ్యంతరం! ఎటొచ్చీ చాకిరీ చెయ్యడానికే ఈ ఏడుపు అనుకుంది. వాళ్ళ భోజనాలు కానిచ్చి, పిల్లల గది వాళ్ళకిచ్చి, కొడుకుని తమ మంచాల మధ్యలో పడుకోబెట్టి, కూతురికి డ్రాయింగు రూములో దివాను మీద పక్కవేసింది.
వాళ్లింకా కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నారు. పది దాటాక ఇంకా కూర్చోలేక “నేను పడుకుంటానండి, కాస్త తలనొప్పిగా వుంది’ అంది సుజాత అడబడుచుతో. “పడుకో అమ్మా. పాపం పొద్దుననగా లేస్తావు” అన్నారు శేషగిరిరావుగారు. అభిమానంగా, చూస్తూ – బతుకుజీవిడా అనుకుంది సుజాత. తలగడ మీద తల అన్చగానే ఒళ్ళేరగకుండా నిద్రపోయింది.
ఉదయం ఐదు గంటలకే అలారం పెట్టినట్టే మెలకువ వచ్చేసింది. నిద్ర పోయాక కాస్త ఫ్రెష్ – గా ఉందనిపించింది సుజాతకి – రోజూ ఒకటే రొటీను. ఐదు గంటలకి లేచిందగ్గిర నించి ఒకటే పరుగులు- కప్పు కాఫీ కాస్త కూర్చుని తాగి ఎంజాయ్ చెయ్యడానికి కూడా తీరికుండదు. టిఫిను, వంట చేస్తూనే పిల్లలని లేపి, తయారుచేయడం, పక్క తియ్యడం, ఇల్లు గబగబ తుడిచి పిల్లలకి టిఫిను, పెట్టి, నలుగురికి లంచ్ బాక్స్ లలో చపాతీలు పెట్టి, పిల్లల పుస్తకాల దగ్గిర నించి సర్దిపెట్టాలి మధ్యలో భర్తగారి అరుపులకి సమాధానం చెప్తూ……పిల్లలని పంపి, తనింత తిని, టిఫిన్ బాక్స్ పట్టుకుని ఉరుకులు పరుగులతో బస్సు స్టాప్ దగ్గిరికి చేరి- రెండు బస్సులు మారి బ్యాంక్ చేరి, మళ్ళీ సాయంత్రం ఐదు గంటలకి శవంలా ఇల్లు చేరి, కాస్త టీనీళ్లు తాగి బడలిక తీర్చుకుని వంటలో చొరబడి, వంట చేస్తూనే పిల్లల చదువులు చూస్తూ…… మర్నాటికి కావాల్సిన కూరలు తరిగిపెట్టుకుని….అటు ఇల్లాలిగా, ఇటు తల్లిగా ఉద్యోగినిగా క్షణం తీరిక లేక మరబొమ్మలా చాకిరీ చెయ్యడమేనా ఈనాటి స్త్రీలు సాధించిన ప్రగతి అన్న సందేహం సుజాతకి వస్తుంది.
ఆదివారం వస్తే మరింత పని – తలంట్లు బట్టలుతుక్కోడాలు, ఆదివారం అని పిల్లలకి ఏ స్వీటో చేసి పెట్టడం, ఆదివారం అని వచ్చే ఫ్రెండ్స్ కి మర్యాదలు, కూరలు తెచ్చుకోడం… ఇదా జీవితం అంటే – బొత్తిగా జీవితం ఇంత మెకానికల్ అయిపోయిందేమిటి! చక్కగా తనకి నచ్చిన ఓ మంచి ఇంగ్లీషు నవల చదివి ఎన్నాళ్ళయింది? దియేటరుకి వెళ్ళి సినిమా చూసి ఎన్ని ఏళ్ళయింది? కిలోమీటరు దూరంలో ఉన్న గార్డెను కన్నా ఎప్పుడన్నా వెళ్ళారా తాము? చదువుకోడం, ఉద్యోగం, పెళ్ళి పిల్లలు, చాకిరీ…..ఈనాటి స్త్రీ ఎంతలా నలిగి పోతుంది ఇంటా బయటా, తరచు ఈ ప్రశ్నలు సుజాతలో తలెత్తుతాయి. ఈమధ్య ఆడవాళ్ళ చదివి ఉద్యోగాలు చేస్తూ సాధిస్తున్నదేమిటి? ఇంటా బయటా నలిగిపోతూ మగవాడి బాధ్యత సగం భుజాన వేసుకుని కుంగి పోతున్నారు తప్ప వాళ్ళకేం ఒరుగుతుంది!
ఎకనామికల్ ఇండిపెండెన్స్ …..హ…..తన సంపాదన! అయినా, కావాల్సిన చీర ఒక్కటైనా కొనుక్కోగలుగుతుందా. నగలు అన్నదానికే ఆస్కారం లేదు….. చీరలు, నగలు అటుంచి కనీసం విసుగ్గా ఉన్న రోజున ఆటో అయినా ఎక్కగలుగుతుందా తను- యింటి నించి తీసికెళ్ళిన చల్లారిన చపాతీలు తప్ప పక్కనున్న హోటలుకి కొలీగ్స్ తో వెళ్ళి ఒక దోసన్నా తినగలుగుతుందా…..ఎప్పుడూ ….ప్రతినెలా ఏదో అనుకోని ఖర్చులు జీతం వచ్చిన రోజున తప్ప ఆ డబ్బు తన పర్సులో ఓ రోజున్నా ఉంటుందా. తన జీతం అంతా ప్లాట్ కొన్న లోనుకే సరిపోతుంది మూడొంతులు. మిగతాది ఏ పండుగలకో, ఏ చుట్టాలకో, ఏ గ్రైండర్ కొనడానికో, ఇంట్లో వస్తువుకో, పిల్లల బట్టలకో….ఏం అవుతుందో కూడా తెలియకుండా, అయిపోతుంది.
తన కొలీగ్స్ కొందరు ఇస్త్రీ మడత నలగని బారెడు వెంకటగిరి చీరలు కట్టుకుని వస్తారు. ఇవి చేయిచుకున్నాం, అవి చేయించుకున్నాం అంటూ గాజులు, గొలుసులు చూపిస్తారు తన సంపాదనతో తాను ఏం ఎంజాయ్ చేస్తుంది-‘ ఇదంతా ఎవరి కోసం, నీ కోసం కాకపోతే” అంటాడు రవి. ప్లాట్ కొన్నా, టి.వి కొన్నా, ఫ్రిజ్ కొన్నా అన్నీ తనకోసమే అంటాడు తెలివిగా అంటే – ఆడవాళ్ళ సంపాదనతో వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న కంఫర్ట్ ఇచ్చి, అదంతా తాను వాళ్ళ కోసమే చేస్తున్నాననడం ! ఇదివరకు ఇల్లు నడపడం మగాడి బాధ్యత ఇల్లే కొంటాడో భూములే కొనేవాడో, నగలే చేయించినా, పిల్లల పెళ్ళిళ్ళు చెయ్యాలన్నా అదంతా భర్త భాద్యత. ఇదివరకటి భార్యలే అదృష్టవంతులేమో! ఏదో తెచ్చి పడేసింది వండి పెడ్తూ పిల్లల్ని చూసుకుంటూ, లిమిటెడ్ కోరికలతో, వచ్చే డబ్బుతో తృప్తిగా బతికేవారు. అప్పటికంటే ఇప్పుడు ఆడదానికి ఒరిగిందేముంది. చదువుకున్నా ఉద్యోగం చేస్తున్నా మగాడి అండనే బతుకుతుంది. మొగుడ్ని కాదని ఏ చిన్న నిర్ణయమూచెయ్యలేదు ఇంట్లో సొంత డబ్బు ఖర్చు పెట్టాలన్నా భర్త గారి ఆమోదముద్ర లేనిదే ఏం చెయ్యగలుగుతుంది. ఈ పిచ్చి ఆడవాళ్ళు ఏదో చదివి సంపాదిస్తూ చాలా ప్రగతి సాధించినట్టు సంబరపడిపోతున్నారు అంతే…..
సుజాతకి ఒళ్ళు మండినప్పుడల్లా ఇలాంటి ఆలోచనలు వస్తాయి. అటు తను ఇంట్లో చాకిరీ, బయట చాకిరీ చేస్తూ నలిగిపోతుంటే, ఇటు రవి ఇంటి పని ఆడదాని బాధ్యత అన్నట్టు ప్రవర్తిస్తుంటే పుండు మీద కారం చల్లినట్లుంటుంది. ఉదయం 5 గంటలకి లేచి ఉరుకులు పరుగులతో తానంత అవస్థ పడుతుంటే, ఏడు గంటలకి సావకాశంగా లేచి, హాయిగా కాఫీ తాగుతూ పేపరు చదివే అతన్ని చూస్తే ఒళ్ళు మండి పోతుంటుంది. అసూయగా ఉంటుంది. వండి వార్చక్కర్లేదు, చిన్న చిన్న పనులన్నా చెయ్యచ్చు – పక్కలు వేయడం, డస్టింగ్, పిల్లల పుస్తకాలు సర్దిపెట్టడం, రాత్రి ఇంటికి వచ్చాక పిల్లల్ని కూర్చోపెట్టి చదివించడం, బజారు సామాన్లు కూరలు తేవడం లాంటివన్నీ చెయ్యచ్చు.
“నే కూరలు తెస్తే ముదురు, పుచ్చులు అంటావు. బజారు సామాను తెస్తే నూక బాగులేదు, మైదా పురుగులు, ఆవాలలో ఇసక అంటూ వంకలు పెడతావు, నీవే తెచ్చుకో”. ఒకసారి బాగోలేదంటే రెండోసారి మంచివి తేకపోగా అసలుకే ఎసరు పెడతాడు. మరీ కోపం, విసుగు వచ్చి పక్కలు వేయమంటే దుప్పటి మడతలన్నా పోవు. ఎక్కడవక్కడే ఉంటాయి. డస్టింగ్ చేస్తే ఆ పని తీరు చూసి రెండోసారి చెప్పకుండా చేస్తాడు – “ఫర్ గాడ్ సేక్ ఇంటికి వచ్చాక ఒక్క క్షణం కూర్చోనీయవు” అంటూ విసుగు. పిల్లల చదువు చెప్పమంటే – విశ్రాంతులు వాళ్ళకే కావాలి, తమకేం అక్కరలేదు. ఛా అసలు తాను ఈ ఉద్యోగంలో చేరడం పొరపాటు అయింది. హాయిగా చదువయ్యాక పెళ్ళి చేసుకుని ఇంటి పట్టున ఉండాల్సింది. మధ్యతరగతి ఇంట్లో పుట్టి, ఏదో చదివి ఉద్యోగం చేసి ఉద్ధరిస్తున్నాననుకుంది. అప్పుడు, అందుకే బాగా అయింది తనకి తగిన శాస్తి – ఉక్రోషంగా అనుకుంటుంది.
ఆలోచనలతో, ఆవేశంగా చకచక కూరల మీద కోపం తీర్చుకుంటుంది సుజాత. “ఏమిటమ్మా మరదలా, నీ కోపం అంతా కూరల మీదేనా?” హాస్యంగా అంటూ పమిట కొంగుతో మొహం తుడుచుకుంటూ బావగారు వంటింట్లోకి వచ్చారు. “ఉండండి కాఫీ ఇస్తాను” అంది సుజాత. రవి ముఖం కడుక్కుని డ్రాయింగు రూములోంచి ఆర్డరు వేశాడు – “సుజా, కాఫీ ఇస్తావా?” అంటూ. ఎవరన్నా ఇంటికి వస్తే ఈయనగారు ఇంకా ఆర్డర్లు ఎక్కువ వేస్తారు. వంటింట్లోకి వచ్చి తీసికెళ్ళచ్చుగా అనుకుంటుంది.
పిల్లలకి స్కూలు డ్రస్సులు తొడుగుతున్న సుజాత దగ్గరికి బెడ్ రూంలోకి వచ్చాడు రవి. “సుజా, ఇవాళ నీవు సెలవు పెట్టు, అక్కయ్యని డాక్టరు దగ్గరికి తీసికెళ్ళు” అన్నాడు చాలా క్యాజువల్ గా. సుజాత మొగుడి వంక చురచుర చూసింది. “నే సెలవు పెట్టాలా? ఈ నెలలో ఎన్ని రోజులు మానేశానో తెలుసునా? అప్పుడే ఐదు రోజులు. రమ్యకి జ్వరం వచ్చి రెండు రోజులు, నాకు ఒంట్లో బాగులేక రెండు రోజులు, మీ రెండో అక్క వచ్చిందని ఒకరోజు. నాకసలు కుదరదు. మీరే పెట్టి తీసికెళ్ళండి” సుజాత కటువుగా అంది.
రవీంద్ర మొహం ఎర్రబడింది. “లేడీ డాక్టరు దగ్గరికి నే తీసికెళ్ళాలా? బుద్ధి ఉండే మాట్లాడుతున్నావా?”. “ఏం తప్పేం ఉంది? మీ బావగారు మీరు కలిసి తీసికెళ్ళండి. లేడీ డాక్టరయితే ఆడవాళ్ళే తీసికెళ్ళాలని రూలుందా?”. రవీంద్రకి కోపం ముంచుకు వచ్చింది. “మా వాళ్ళెవరన్నా వస్తే నీ మొహం మాడిపోతుంది. నిన్న రాత్రి నించి చూస్తున్నాను, ఆ మొహం ఎలా ఉందో చూసుకో. ఎవరన్నా వస్తే ఏడుపు ఒక్కటే తక్కువ నీకు” అంటూ భార్య మీద కోపం ఆ విధంగా తీర్చుకున్నాడు. సుజాత చివుక్కున తలెత్తి రవీంద్ర వంక చూసింది. తన మీద వేసిన నెపానికి అవమానంతో గొంతులోకి దుఃఖం తన్నుకు వచ్చింది. పెదాలు అదురుతుండగా, “అవును, మీ వాళ్ళొచ్చారని ఏడుస్తున్నానా? ఛా… ఎంత చేసినా, ఏం చేసినా మెప్పు లేదు ఈ పాడు బతుక్కి…” అని చేతిలో దువ్వెన విసిరికొట్టి వంటింట్లోకి వెళ్ళిపోయింది.
రవి తన అక్క బావ విన్నారేమోనన్న అనుమానంతో అవమానమనిపించి ముఖం మాడ్చుకున్నాడు. గదిలో భార్యాభర్తలు ఏదో అనుకోవడం విన్న కమలమ్మ సగం ఊహించింది. “రవీ, డాక్టరు దగ్గరికి మేం వెడతాం లేరా. అడ్రసు అదీ చెప్పు. పాపం సుజాతకి సెలవు ఉండదు” అంది. “నే తీసికెడతాలే అక్కయ్యా, నాకూ తెలుసు ఆ డాక్టరు” అన్నాడు రవి. “వదినగారూ… నాకు సెలవు పెట్టడానికి కుదరదు. నే రావాలంటే ఎల్లుండి శనివారం హాఫ్ డే కదా, అప్పుడు తీసికెడతాను” కాస్త ఆవేశం దిగాక వంటింట్లోంచి వచ్చి అంది సుజాత. రవి మొహం ముడుచుకుని, “ఎల్లుండి దాకా ఎందుకు, నే తీసికెడతాను ఇవాళ” అన్నాడు, నీవు రాకపోతే కొంప మునగదు అన్న ధోరణితో.
సుజాత ఇంకా రెట్టించకుండా ఊరుకుంది. ఆడబడుచుకి అన్ని రకాల పరీక్షలు అయి మళ్ళీ నెలలో ఆపరేషన్ జరిపేట్లు నిర్ణయం జరిగింది. ఖమ్మంలో కంటే హైదరాబాదులో చేయించుకోడానికి నిర్ణయించారు అందరూ. మళ్ళీ నెల నుంచి సుజాతకి భయం పట్టుకుంది. ఆపరేషన్ అంటే కనీసం పదిహేను రోజులు ఉంటారు. ఎలా భగవంతుడా నెగ్గుకు రావడం. అటు ఇల్లు, ఇటు ఆఫీసు, మధ్యలో ఆస్పత్రి చుట్టూ తిరగడం. ఏదో రెండు రోజులు సెలవు పెట్టగలదు కానీ… సుజాతకి తలచుకుంటేనే నీరసం వచ్చింది. ఛా… ఈ ఉద్యోగం వల్లే ఎంత సెల్ఫిష్ గా ఆలోచించాల్సి వస్తుంది. పనికి భయపడి చుట్టపక్కాలు అవసరంలోనూ రాకూడదని కోరుకుంటుంది. అతిథులు అభ్యాగతుల రోజులు పోతున్నాయి, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు అవుతున్నాయి రోజులు.
అక్కగారు ఉన్నన్ని రోజులు సుజాతతో ముభావంగానే మాట్లాడాడు రవి. వాళ్ళు వెళ్ళాక మనసులో కోపం వెళ్ళగక్కాడు. “నీకసలు ఈమధ్య మర్యాద అన్నది లేకుండా పోతుంది. వాళ్ళున్నది మూడు రోజులు. నీ మొహం ఎలా మాడ్చుకున్నావో నీకు తెలియదేమో కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటారో అని కూడా లేకుండా నీ అయిష్టం స్పష్టంగా చూపించావు. నీ ఉద్దేశంలో నా వాళ్ళెవరూ నా ఇంటికి రాకూడదని గాబోలు” అని కయ్యానికి కాలు దువ్వాడు.
“మీ వాళ్ళు నా వాళ్ళు అన్నది కాదు నా బాధ. చాకిరీ చేయలేక చస్తున్నాను అన్నది అర్థం చేసుకోకపోగా, పైగా అపార్థాలు. కట్టుకున్న వాడికి ఇంత పిసరు సానుభూతి లేదు. మీ వాళ్ళు తినిపోతున్నారని నేనెప్పుడూ ఏడవలేదు – చాకిరీ కోసం ఏడుస్తున్నాను. ఇంత పిసరు హెల్ప్ లేకపోగా పైపెచ్చు నిందలు” సుజాతకి ఏడుపు ముంచుకొచ్చింది.
“ఆ… నీవొక్కర్తివే ఇన్నాళ్ళకి ఉద్యోగం చేస్తున్నావు. అందరాడవాళ్ళు చేస్తున్నారు ఉద్యోగాలు. మొగుడికి, పిల్లలకి వండి పెట్టుకోవడం ఊరికి ఉపకారం కాదు…” హేళనగా అన్నాడు. ఆ తిరస్కారం, హేళన భరించే శక్తి లేకపోయింది సుజాతకి. “నేనీ ఉద్యోగం మానేసి ఇంటి పట్టున ఉండి వచ్చేపోయే చుట్టాలకి పక్కాలకి వండి వారుస్తాను. అప్పుడు పల్లెత్తి మాట నేనేమన్నా అంటే చెప్పుతో కొట్టండి. ఈ వెధవ ఉద్యోగం మానేస్తే మనశ్శాంతి అన్నా దొరుకుతుందేమో”.
“మానేయి, మానేస్తా మానేస్తా అని పదిసార్లు బెదిరించకు. నాకోసం చేస్తున్నట్లు మాట్లాడకు. ప్లాట్, ఇంట్లో కంఫర్ట్ కోసం చేస్తున్నావు. మానేయి. నోరు మూసుకుని నేనేది తెచ్చి పడేస్తే దాన్తోనే కాలం గడుపు. ఇది కొనాలి అది కొనాలి అనకుండా” సుజాత మాటలకి మనసులో బెదిరినా రవి పైకి బింకంగా అన్నాడు.
బ్యాంక్ మేనేజర్ సావిత్రి సుజాత ఇచ్చిన రిజిగ్నేషన్ లెటర్ చూస్తూ ఆశ్చర్యంగా అంది – “ఆర్ యూ క్రేజీ సుజాతా? పన్నెండేళ్ళ సర్వీసు వదులుకుంటావా? మళ్ళీ కావాలంటే ఇలాంటి ఉద్యోగం దొరుకుతుందా, దొరికినా సీనియారిటీ ఉంటుందా?”. “సారీ మేడమ్, ఏం చెయ్యను? ఇంటా బయటా నిభాయించుకోవడం రెండూ కావడం లేదు. ఇంట్లో శాంతి లేదు. సుఖం లేకపోయాక ఎందుకు ఈ సంపాదన?” మేనేజర్ ఆవిడ సానుభూతిగా చూస్తూ, “మిస్టర్ రవీంద్ర కోపరేటివ్ గా ఉండరా? ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళు ఉంటే తెచ్చి పెట్టుకోకూడదూ?” అంది. “ఎవరొస్తారు మేడం? మా అత్తగారు లేరు. మా అమ్మ ఉన్నా ఎవరొచ్చి ఎన్నాళ్ళు ఆదుకుంటారు? పోనీ ఎవరినన్నా పనికి పెట్టుకుందామంటే పనిమనిషి నా టైంకి రాదు. ఉదయం ఎనిమిదైనా రాదు. సాయంత్రం ఆలస్యంగా రమ్మంటే రాదు. వచ్చే పోయే బంధువులు, చాకిరీతో ప్రతి దానికి విసుగు, కోపం వచ్చేస్తున్నాయి. పిల్లలతో కాసేపు ప్రేమగా గడపడానికి కూడా ఓపిక ఉండడం లేదు. విసుగెత్తిపోయాను…” సుజాత తన గోడు వెళ్ళబోసుకుంది.
మేనేజర్ కూడా ఉద్యోగినే – ఇంచుమించు అందరి కథలు, అవస్థలు ఒక్కటే. భర్త ఇంట్లో భార్య కష్టం అర్థం చేసుకుని చేదోడు ఇస్తే అంత ఇబ్బంది ఉండదు అని సానుభూతిగా నిట్టూర్చింది ఆవిడ. “రిజైన్ చెయ్యకు. ఒకటి రెండు నెలలు సెలవు పెట్టు. కాస్త మార్పుగా ఉంటుంది. కాస్త రెస్టు తీసుకుంటే మళ్ళీ కొన్నాళ్ళు చెయ్యడానికి ఓపిక వస్తుంది” అని సలహా ఇచ్చింది.
ఆవిడన్నది సబబుగానే అనిపించింది సుజాతకి. ఒక్క క్షణం ఆలోచించి “మేడం, మీరు నాకొక్క సహాయం చెయ్యండి. నేను సెలవు పెట్టినట్లు ఎవరికీ తెలియనీయకండి. ముఖ్యంగా మావారికి అసలు చెప్పద్దు – ఆయనగాని వచ్చి అడిగితే రిజైన్ ఇచ్చేసింది వద్దన్నా వినకుండా అని చెప్పండి” అంది. ఆవిడ సుజాత వంక నవ్వుతూ చూసి, “ఐ అండర్ స్టాండ్ యువర్ పాయింట్ డోంట్ వర్రీ… రవీంద్ర రానీ.. నే చూస్తాలే” అని అభయం ఇచ్చింది.
మర్నాడు సావకాశంగా లేచి పిల్లలని తయారుచేస్తూ, టైమవుతున్నా తను తయారవని భార్యని చూసి, “ఏం ఇవాళ బ్యాంకుకు వెళ్ళవా, సెలవు పెట్టావా” అని ఆశ్చర్యంగా, అనుమానంగా అడిగాడు రవీంద్ర. “నేను ఉద్యోగం మానేశాను. నిన్ననే రిజైన్ ఇచ్చేశాను” అని సుజాత చాలా మామూలుగా అంది. రవీంద్ర ఒక్కక్షణం తెల్లబోయాడు. నోట మాట రాక అలా చూస్తుండిపోయాడు. “రిజైన్ చేశావా… నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా -” అని అరక్షణంలో అతని మొహం ఎర్రబడి ఆవేశం పొంగుకొచ్చింది.
“చెప్పడానికి ఏముంది. మీరూ అన్నారుగా చెయ్యకపోతే మానేయి అని… ఇంట్లో ఇలా కొట్టుకుంటూ తిట్టుకుంటూ శాంతి లేకుండా నేను ఇంత కష్టపడి ఎందుకు చెయ్యడం ఆ ఉద్యోగం… నాకు ఒంట్లో అసలు బాగుండడం లేదు. అందుకే మానేశాను” అంది. రవీంద్ర మనసులో అరక్షణంలో ఎన్నో “లెక్కలు” భయపెట్టేశాయి. భార్య జీతం లేకపోతే… ప్లాట్ కొన్న అప్పులు ఎలా తీర్చాలి?. తన సంపాదన ఉన్నా నెలాఖరుకి ఏం మిగలదు… మరి ఇక ఇల్లు ఎలా గడుస్తుంది?. అతని కోపం తారాస్థాయికి చేరింది.
“ఉన్నపాటున చెప్పా చెయ్యకుండా ఉద్యోగం మానేస్తే ఎలా అనుకుంటున్నావు. నీ జీతం ఉందని ప్లాట్ కొన్నాను. అదెవరు తీరుస్తారు ఇప్పుడు. ఇల్లు కొనండి కొనండి అన్నావు. ఆ డబ్బు ఎలా తీర్చాలి” అని పళ్ళు కొరుకుతూ అడిగాడు. “అమ్మేయండి ప్లాట్. అప్పు తీర్చేసి మిగతాదేమన్నా ఉంటే బ్యాంక్ లో వెయ్యండి వడ్డీ వస్తుంది. అద్దె ఇంట్లోకి వెడదాం బ్యాంక్ ఎలాగో హౌస్ రెంట్ ఇస్తుందిగా” అని చాలా కూల్ గా అంది సుజాత.
రవీంద్రకి కోపం ముంచుకు వస్తున్నా సుజాత నిజంగానే రిజైన్ ఇచ్చేసిందన్న నమ్మకం కలిగింది. దాంతో ఇంకా కోపం వచ్చింది – “నీ ఉద్యోగం ఉందనే నిబ్బరంతో ప్లాట్ కొన్నాను… అసలు ఏదో నీ ఉద్యోగం చూసే పెళ్ళాడాను… లేకపోతే నీ మాత్రంది దొరకదని కాదు. మా వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటే బోలెడు కట్నం వచ్చేది. నీ అందం చూసి చేసుకోలేదు. ఉద్యోగం కోసం చేసుకున్నాను” అని కసిగా అన్నాడు.
సుజాత మొహం అరక్షణం నల్లబడింది. కానీ, అంతలోనే తేలిగ్గా నవ్వేసింది. “నాకూ తెలుసు ఆ మాట. నేనేం అందగత్తెను కానని – చాలా మాములు మధ్య తరగతి అమ్మాయినని. అవును, వెధవ కట్నం మహా అయితే పాతిక వేలో, ఏభై వేలో ఇచ్చేవారు. ఉద్యోగం అయితే నా సర్వీసంతా కలిపి ఎన్ని లక్షలవుతుందో లెక్క కట్టే చేసుకుని ఉంటారు. ఏదో ప్రేమ కబుర్లు చెప్పి చేసుకున్నారని నాకు తెలుసు. సారీ, వెరీ సారీ. మీ లెక్కలు, అంచనాలు తలకిందులు అయిపోయాయి. చూడండి, ఈరోజు నుంచి నేను ఉత్త హౌస్ వైఫ్ ని… భర్త అంటే భరించేవాడు పెళ్ళి అర్థం అదే కదా. మీ వంతు పోషించడం, నావంతు ఇల్లు నడపడం… నా బాధ్యత నేను నిర్వహిస్తాను. ఏవన్నా లోటుపాట్లుంటే అప్పుడు అనండి…” అంది.
“చావండి, అందరూ మాడి చావండి. జీతం చాలదు. ఇదీ లేదు, అది లేదు అని అన్నావంటే చూడు, చెపుతా నీ పని చెపుతా. నా తడాఖా చూపిస్తా నాకోసం నేను హాయిగా ఖర్చు పెట్టుకుంటాను. మీ కోసం క్లబ్బులు, ఫ్రెండ్సు, డ్రింక్స్, సిగరెట్లు అన్నీ మానాను. ఈరోజునించి చూడు… చావకుండా రెండు పూటలా ఇంత తిండి పడేస్తాను. హాయిగా నేను ఎంజాయ్ చేస్తా” అని క్రూరంగా విసవిసా వెళ్ళిపోయాడు. సుజాతకి అతని కోపం అర్థమై నవ్వి ఊరుకుంది.
పదిరోజులు గడిచాయి. పది రోజులుగా రవీంద్ర సుజాతతో మాట్లాడడం మానేశాడు. కావాలని ఇంటికి ఆలశ్యంగా రావడం, వెంట ఓ రమ్ బాటిల్ తీసుకురావడం, ఇంటికి వచ్చి సినిమాకి వెళ్ళాలని పిల్లలతో చెప్పడం మొదలుపెట్టాడు. తనని ఏడిపించడానికి ఇలా చేస్తున్నాడని తెలుసు గనుక సుజాత ఏమీ అనకుండా ఊరుకుంది. పదిహేను రోజులు గడిచినా సుజాత ఇంటి పట్టునే ఉండడంతో రవీంద్ర మనసులో బెదిరాడు. సెలవు పెట్టి ఉంటుంది, తనతో అలా అంది అని తనని తాను నమ్మించుకున్నాడు కొన్నాళ్ళు.
ఆఖరికి పదిహేను రోజులు గడిచాక ఆగలేక బ్యాంక్ కి వెళ్ళాడు. డైరెక్టుగా వెళ్ళి అడిగితే మేనేజరు ఏమనుకుంటుందోనని తటపటాయించాడు. రవీంద్రని చూసిన మేనేజరు సావిత్రి తనే అతన్ని పిలిచింది. “రవీంద్రగారూ… ఏమిటండీ సుజాత ఇలాంటి పని చేసింది. నిక్షేపం లాంటి బ్యాంక్ ఉద్యోగానికి, అందులో పన్నెండేళ్ళ సర్వీసు ఉన్న ఉద్యోగానికి రిజైన్ ఇచ్చేసింది. నేనెంతో నచ్చ చెప్పాను. షి డిడ్ ఏ పూలిష్ థింగ్. మీరన్నా చెపుతారనుకున్నాను” అంది.
ఆ మాటతో రవీంద్ర మొహం రక్తం లేనట్టు ఇంకిపోయింది. “నిజంగానే రిజైన్ ఇచ్చేసిందన్న మాట” అని నిమిషం తరువాత మాట పెగుల్చుకుని అన్నాడు. “నేనూ చెప్పాను మేడం… అసలు నాకు చెప్పకుండా చేసింది…” అన్నాడు. మేనేజర్ సావిత్రి సానుభూతిగా “ఇంట్లో ఇబ్బందులు, చాకిరీ చెయ్యలేకపోతున్నాను, రెండూ సమర్థించుకోవడం నావల్ల కాదు అంది. తాను బాగా వీక్ గా ఉంది, ఐ పిటీ హర్. కానీ, మళ్ళీ కావాలంటే ఉద్యోగం వస్తుందా… ఇదిగో చూడండి రిజిగ్నేషన్ లెటర్” అంటూ డ్రాయరు లోంచి తీసి ఇచ్చింది. కాగితం చదివిన రవీంద్ర మొహం కాగితం లాగే అయింది.
“మీరు ఎక్సేప్ట్ చేశారా ఇది. పైకి ఫార్వార్డ్ చేశారేమిటి ….” బెదురుగా అడిగాడు.
“లేదండి, ఏదో ఆవేశంలో చేసిందేమో, మళ్ళీ మనసు మార్చుకుని వస్తుందని కాగితం ఇంకా పైకి పంపలేదు – లీవ్ కిందే ట్రీట్ చేస్తున్నాను. మీకు చెపుదామని చూశాను. మీరే బ్రాంచిలో ఉన్నారో తెలియక ….” ఆవిడ ఇంకా రిజిగ్నేషన్ లెటర్ పైకి పంపలేదన్న వార్తతో సగం ప్రాణం వచ్చింది రవీంద్రకి.
“ప్లీజ్ మేడమ్ ఈ లెటరు పైకి పంపకండి. నేను సుజాతతో మాట్లాడతాను.” “లాభం ఉంటుందనుకొను. తాను చాలా ఖచ్చితంగా చెప్పింది. మేం అందరం ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయింది….” అతని హావభావాలు గమనిస్తూ అంది సావిత్రి.
“రవీంద్రగారూ ….మీరేం అనుకోకపొతే ఒక మాట – చూడండి ఆడవాళ్ళం ఇంత కష్టపడి ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నాం – కాస్త మీకు భారం తగ్గి, ఇంటికి కాస్త అవసరమైనవి అమర్చుకుని, పిల్లల్ని కాస్త మంచి చదువులు చదివించాలని గదా తాపత్రయం – ఆడది ఇటు ఇంట్లో, అటు ఆఫీసులో డబుల్ పనితో ఆమె ఎంత అలసిపోతుందోనన్నది భర్తలు కాస్త గ్రహిస్తే మాలాంటి వారికీ ఓదార్పుగా ఉంటుంది. ఇంట్లో భార్య ఇటు ఇల్లు, అటు ఆఫీసుతో అవస్థ పడుతుంటే కాస్త సపోర్టు చెయ్యకపొతే ఎలా. ఆ భార్య మిషను కాదు గదా. ఫారిన్ లో అడ, మగ ఉద్యోగాలు చేస్తారు. ఇంట్లో పనులూ అడ పని మగ పని అని లేకుండా ఇద్దరూ సర్దుకుంటారు. ఇదివరకటి రోజుల్లో సంపాదన మగాడి పని కాబట్టి ఇంటి పనులు భార్య చూసుకునేది. ఇప్పుడు భర్తతో పాటు ఆవిడా సంపాదిస్తున్నా, మగాడి బరువు సగం పంచుకున్నా ఇంకా ఇంటిపని ఆవిడ డ్యూటీ అంటే ఎలా అండి. ఆడవాళ్ళు తెచ్చే సంపాదన కావాలి కాని, ఆవిడ బాధ్యత సగం తీసుకొం అంటే ఎలా కుదురుతుంది. పిల్లల్ని కనడం, పెంచడం ఎలాగూ తప్పదు- పెద్దగా వంటా వార్పులు చెయ్యకపోయినా సగం సగం పనులు పంచుకోకపోతే ఆ భార్య పరిస్థితి ఏమిటో ఆలోచించండి – సుజాతకి ఎంత విసుగెత్తి ఉంటే గాని ఇలా రిజైన్ ఇస్తుందా….”.
రవీంద్ర మొహం గంటు పెట్టుకు వింటున్నాడు. “నా మటుకు నేను, మా అయన పనులు పంచుకున్నాం- వంటపని నాది – ఇల్లు సర్దడం, పక్కలు వేయడం, డస్టింగ్, నీళ్ళు పట్టడం, సాయంత్రం పిల్లల్ని చదివించడం అన్నీ అయన వంతు – ఎవరికన్నా ఒంట్లో బాగులేకపోతే అయనవొకసారి నేనొకసారి సెలవు పెడతాం – రెండేళ్ళకోసారి ఎల్.టి.సి మీద తప్పకుండా ఎటన్నా వెడతాం రొటీన్ నుంచి బయటపడడానికి. చుట్టాలు వచ్చినా ముందుగానే వాళ్ళకి చెప్పేస్తాం. ఇంట్లో వంట చేసి వెడతాం, మీ పనులు మీరు చూసుకోండి అని. ఇలా ఇద్దరం ఫ్రాంక్ గా చేసుకోకపొతే, ఫిజికల్ గా, మెంటల్ గా భర్త సపోర్ట్ ఇవ్వకపోతే ఆడవాళ్ళు ఉద్యోగం చెయ్యడం చాలా కష్టం – ” ఆవిడ రవీంద్ర ముఖకవళికలూ గమనించినా చెప్పదలచింది చెప్పేసింది.
“ఈ లెటరు ఇంకో నాలుగైదు రోజుల వరకు పంపకుండా ఉంచుతాను —ఈ లోగా మీరు సుజాతని కన్విస్ చేయగలిగితే మంచిదే — మరి మీ ఇద్దరూ ఆలోచించుకోండి -“.
“థాంక్స్ మేడమ్. ఐ విల్ టాక్ టు హర్ –‘ అన్నాడు.
మర్నాడు రవీంద్ర ఉదయం ఆరుగంటలకే లేచిపోయాడు. సుజాత వంటింట్లో పని చేస్తుండగా చకచక పక్కలు తీసేసి, పుస్తకాలు పేపర్లు సర్దేసి, డస్ట్ చేసేశాడు. పిల్లల పుస్తకాలు సర్దేశాడు. పిల్లలు విడిచిన బట్టలు సబ్బు నీళ్ళల్లో నానబెట్టాడు. బాత్ రూంలో వాష్ బేసిన్, కమోడ్ బ్రష్ పెట్టి కడిగాడు.
వంటింట్లోంచి ఎందుకో బయటికి వచ్చిన సుజాత రవీంద్ర చేసిన, చేస్తున్న పనులు చూసి తెల్లబోయింది. “ఇటు సూర్యుడు అటు పొడిచాడా ఇవాళ. ఎంత శుభదినం….” హాస్యంగా అంది. రవీంద్ర మొహం సిగ్గుతో కాస్త ఎర్రబడింది.
‘ఇంక రోజూ సూర్యుడు ఆటే పొడుస్తాడనుకో …. ఇదిగో నేను ఇంట్లో చేసే పనులు అన్నీ లిస్టు రాసేశాను. ఇంకేమన్నా చేర్చాలంటే చేర్చు వంట తప్ప. అది నేను చేశానంటే ఇంట్లో ఆకలితో మాడాలి’ చాలా తేలిగ్గా అనేశాడు. బాత్ రూంలో దూరి తలుపు వేయబోతూ “ఇదిగో నిన్న మీ సావిత్రి మేడమ్ కనిపించి నిన్నెందుకో రమ్మన్నారు…. అంటూ తన మొహం చూపలేనట్టు తలుపు వేసుకున్నాడు.
సుజాతకి అర్ధం అయింది ఇదంతా ఏమిటో….. రవీంద్రలో మార్పుకి తృప్తిగా నిట్టూర్చింది. పదిహేను రోజులు ఇంట్లో కూర్చునే సరికి రెస్టు దొరికి….. అలవాటయిన ఉద్యోగం లేక రోజంతా ఖాళీగా ఏం తోచనట్టయింది.
ఫెళ్ళున నాలుగు రోజులు ఎండ కాస్తే మబ్బు పట్టడం, ఉరుములు మెరుపులు, వర్షం రావడం ప్రకృతిలో సహజమైనట్టే — సంసారంలో ఎండలాంటి కోపాలు, ఆవేశాలు, తరువాత ఉరుముల్లా అరుచుకోడాలు, వర్షంలా కన్నీళ్ళు సంసారాల్లో సహజమే. ఒక్క సంపాదనతో రోజులు వెళ్లదీసే రోజులు పోయాయి. ఎంత “ఇగో” ఉన్నా దిగమింగుకు దిగిరాక తప్పదు మగాళ్ళు ఆడదానికి సంసారంలో – పరిస్తితులలో ఎడ్జస్ట్ అవక తప్పదు. లైఫ్ అంటేనే, అందులో మారేజ్ లైఫ్ అంటేనే ఎడ్జస్ట్ మెంట్ !- బతకడానికి ఎడ్జస్ట్ మెంటు తప్పనిసరి !.
*****

డి.కామేశ్వరి కథారచయిత్రిగా తెలుగుసాహిత్య లోకానికి సుపరిచితులు. 11 కథా సంపుటాలు, 21 నవలలు, సుమారు 300 కథలు, 30 కవితలు, ఒక కవితా సంపుటి ప్రచురితాలు. కొత్తమలుపు నవల ‘న్యాయం కావాలి’ సినిమాగా, కోరికలే గుర్రాలైతే నవల అదే పేరుతో సినిమాగా వచ్చాయి. కొన్ని నవలలు టెలీఫిల్ములుగా, టీవీ సీరియళ్లుగా వచ్చాయి.
