
రోదన రక్కసి
-చిట్టత్తూరు మునిగోపాల్
పడకలమీద అసహనంగా కదులుతున్నారు విక్రమపురి వాసులు.
ఎక్కడినుంచో హృదయ విదారక రోదన. అసహాయురాలైన ఓ స్త్రీమూర్తి ఎవరో అంతులేని విషాదంలో కూరుకున్నట్లు. తప్పించలేని ఆపదేదో మీద పడ్డట్టు.
గత కొద్ది రోజులుగా ఇదే రోదన, గుండెలు పిండేసేలా. ఎక్కడినుంచో తెలియడం లేదు. ఎవరు ఎందుకు రోదిస్తున్నారో అర్థం కావడం లేదు.
ఝాములను సూచించే నగారా రాత్రి పన్నెండు సార్లు మోగగానే శూన్యంనుంచి తెరలు తెరలుగా గాలి అలలపై తేలి వస్తున్న ఆ రోదన భరించలేక పోతున్నారు నగర వాసులు. రాత్రుళ్ళు నిద్ర లేక, అందువల్ల వచ్చి పడుతున్న నీరసంతో పగళ్లు పనులు చేసుకోలేక సతమతమై పోతున్నారు.
నిజం… తమ రాజ్యానికేదో కీడు దాపురించింది. ఏదో ముప్పు వాటిల్లనున్నది. అందుకు సూచనగానే ఈ శూన్య రోదన.
ఎప్పుడు ఏ గండం వచ్చి పడుతుందోనని భీతిల్లి పోతున్నారు రాజ్య ప్రజలు.
రాత్రి గడిచినది. ఉదయము రాజసభ కొలుఫుదీరినది.
“మహామంత్రీ…” గంభీరంగా పిలిచాడు మహారాజు విక్రమసింహుడు. ఆయన వదనం వాడి ఉంది.
“ప్రభూ…” ఉచితాసనం నుంచి లేచి నిలబడ్డాడు మహామంత్రి తిమ్మనామాత్యులు.
“నేటికి మాసము దినములైనది… ఆ శూన్య రోదన వినిపించడం ప్రారంభమై. ఏమీ చేయలేక పోతున్నాము ?”
“మీకు తెలియనిదేమున్నది ప్రభూ. మన సైన్యాన్ని నలుదిక్కులా పంపితిమి. గూఢచర్యములో ఆరితేరిన వేగులను చూచి రమ్మంటిమి. రహస్య ఛేదనలో నిపుణులను ఎందరినో వదిలితిమి. అయిననూ ఫలితము కనబడకున్నది. ఆ శూన్య రోదన గుట్టేమిటో తెలియ రాకున్నది.”
“అటులని వదిలి వేయమందువా ? ఆ రోదన భరించలేక రాజ్య వాసులందరూ మానసిక రుగ్మతలకు లోనగుచున్నారు. వ్యవసాయము లేదు. వృత్తి పనులు లేవు. సైన్యమూ నీరసించినట్లు కనబడుచున్నది. మన బలహీనత బయట పడి, శత్రు రాజులు రాజ్యముపైకి దండెత్తే యత్నము చేయక మునుపే ఏదో ఒకటి చేయవలె. ఆ స్త్రీమూర్తి ఎవరో, ఆమె వేదన ఏమిటో కనుగొని తీరవలె. మనలకు సాధ్యమైన యెడల ఆమె ఆవేదన తీర్చవలె.”
“మహారాజా…” రాజ గురువు సిద్దయాచార్యులు మంద్రస్వరంతో పిలిచారు.
“గురువర్యా…” సింహాసనం మీద ఆసీనులై వున్న మహారాజు విక్రమసింహుడు ముందుకు వంగినాడు వినయంగా.
“నేను నా సకల శక్తులూ కూడదీసుకుని రాత్రి అంజనం వేసి చూసితిని. ఎక్కడినుంచి ఆ హృదయ విదారక రోదన ఉద్భవిస్తున్నదో కనుగొంటిని.
సభామటంపమంతటా ఒక్కసారిగా నిశ్శబ్దము అలముకున్నది. భరించలేని ఉత్కంఠతో మహారాజు మరింత ముందుకు వంగిపోయి చెవులు రిక్కించాడు.
“ఆ స్త్రీమూర్తి రోదన ఎక్కడినుంచో కాదు, మహారాజుల వారి అంత:పుర సౌధాలలోని రాణివాస భవనాంతర్భాగాల నుంచే తేలి వస్తున్నది.”
రాజ గురువుల ముఖత: ఈ మాటలు వెలువడగానే, సభాసదులలో ఒక్కసారిగా కలకలం రేగినది.
దండనాథుల హెచ్చరికలతో ఆ వెంటనే మౌనం రాజ్యమేలినది.
“ఎవరు గురువర్యా, ఎవరా స్త్రీమూర్తి ? ఆమెకు వచ్చిన అంత కష్టమేమిటి ?” సంభ్రమాశ్చర్యాలనుంచి తేరుకుని ప్రశ్నించాడు విక్రమసింహుడు.
“అంతకు మించి నాకుయునూ ఎరుక పడలేదు మహారాజా. ఆ రహస్యం మీరు మాత్రమే ఛేదించ గలరన్న జ్ఞానం మాత్రం మన కులదైవం కారుణ్యమాత కలిగించినది. మీరు త్వరపడి ఈ రాత్రికే అందులకు పూనుకోవలె. ఇదిగో ఈ తాయెత్తు మీ దక్షిణ హస్తము మణికట్టునకు కడుతున్నాను. అమ్మ అర్చనలో ఉంచి తెచ్చిన ఈ తాయెత్తు మహిమ వల్ల అది ఎంతటి దుష్ట శక్తి అయిననూ మీ కంట పడి తీరుతుంది. ఆపైన దైవేచ్చ.” తాయెత్తుతో సహా విక్రంసింహుడిని సమీపించాడు సిద్దయాచార్యులు.
పదిహేనుమంది రాణులు. దండయాత్రలు చేసి గెలిచిన రాజ్యమునుంచల్లా పట్టి తెచ్చిన బానిస స్త్రీలు. రాజ్య విహారములో కంటికి నదురుగా కనిపించిన పాపానికి బంధించి తెచ్చిన కన్యలు. వీరుగాక మదవతులైన ఉంపుడుగత్తెలు. స్త్రీజన పరివారంతో క్రిక్కిరిసి కనిపిస్తున్నాయి అంత:పుర భవనాలన్నీ.
ఇంతమందిలో ఆ రోదనామూర్తిని ఎలా కనిపెట్టడం ?
ఆ అర్ధరాత్రివేళ కరవాలం చేబూని ఒంటరిగా కలియ దిరుగుతున్నాడు మహారాజు విక్రమసింహుడు.
హఠాత్తుగా ఎటువైపు నుంచో ఒక రాక్షస హస్తం వచ్చి ఆతని కంఠ సీమను ఒడిసి పట్టుకున్నది.
“రారా… రా… రా… నీకోసమే చూస్తున్నా. నిన్ను నా రోదనల ఝంఝా మారుతంలో ముంచి ఊపిరాడకుండా చంపి పాతరేయడానికే ఇంతకాలంగా కాచుకున్నా.” ఒక భారీ రాక్షస స్త్రీ ఆ వెంటనే కనుల ఎదుట ప్రత్యక్షమైంది.
రాణులు… బానిస స్త్రీలు… చెరబట్టిన కన్యలు… ఉంపుడుగత్తెలు… ఆ రాక్షస స్త్రీ దేహం వీరితోనే నిండినది. తన స్త్రీ జనమే కాదు… పురుష దౌష్ట్యాలకు బలైపోతున్న రాజ్యములోని సకల మహిళా పరివారమునూ కలుపుకుని ఆ రాక్షస దేహం పెరిగిపోతున్నది. హృదయవిదారక రోదనలు ఆమె శరీరంలోని అణువణువునుంచీ వెలువడి చెవులను బద్దలు చేస్తున్నవి.
నిరుత్తరుడయ్యాడు విక్రంసింహుడు. ఏమిటీ వింత ? ఎవరీ రాక్షసి ? దీనికంటూ ఒక దేహం లేదా ? తన రాజ్యంలోని స్త్రీలందరూ ఎలా దీని పాలబడ్డారు ? వారందరి రోదనలే ఈ రాక్షస స్త్రీ ఆహారమా ?
పరిపరి విధాల ఆలోచనలు పోతూనే, కరవాలము ఝళిపిస్తున్నాడు మహారాజు. వల్ల కావడం లేదు. అంతకంతకు పెరిగిపోతున్న రాక్షస స్త్రీ రోదన తన శక్తిని ఉడిగింప జేస్తోంది.
“మహారాజా ముందు ఆ కరవాలాన్ని వదిలేయ్. రెండు చేతులూ జోడించి మోకరిల్లు. నువ్వు ఆ స్త్రీమూర్తితో కలబడే కొద్దే దాని శక్తి పెరిగిపోతూనే ఉంటుంది.”
ఎప్పుడొచ్చాడో అక్కడికి, రాజ గురువు సూచనలిచ్చాడు. పాటించాడు విక్రమసింహుడు. రాజునుంచీ ప్రతిఘటన లేకపోయేసరికి దాడిని ఆపింది రాక్షస స్త్రీ.
“అమ్మా… తెలిసో తెలియకో, ఈ రాజ్యంలో స్త్రీ హింస జరిగింది. మమ్మల్ని క్షమించు. ఇకమీదట ఏ కష్టనష్టాలు పెట్టబోము. తల్లీ సాంతించు.” రాజ గురువు వేడుకుంటున్నాడు.
అర్థమైంది విక్రమసింహునికి.
“అమ్మా… మా తప్పు ఈనాటికి తెలిసి వచ్చినది. రాజ్యంలోని అబలల కన్నీటి మూర్తివి నీవు. కులదైవం కరుణామాత సాక్షిగా చెబుతున్నాను. ఇక ముందు రాజ్యంలో స్త్రీ వేదన కనిపించదు. ఆమె రోదన వినిపించదు. మమ్ములను, మా రాజ్య ప్రజలను కనికరించు. మమ్ములను రక్షించు. సాష్టాంగపడ్డాడు మహారాజు.
కనుల ముందు నుంచి ఉత్తర క్షణాన మాయమైనది ఆ భయంకర రాక్షస స్త్రీ మూర్తి.
స్త్రీమూర్తులకు దక్కిన గౌరవాదరాలతో నాటినుంచి సుఖసంతోషాల నడుమ, సకల సౌభాగ్యాలతో తులతూగినది విక్రమపురి రాజ్యం.
*****

పుట్టింది చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి దగ్గరి తిమ్మసముద్రం అనే చిన్న పెల్లెటూరు. చదువు శ్రీకాళహస్తి. ప్రస్తుత నివాసం
చిత్తూరు జిల్లా కుప్పం. ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికలో విలేకరివిత్వం. సాహిత్యమంటే మక్కువ. కథలు, కాకర కాయలు రాయడం ఏడాదినుంచే.
ఆంద్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ఒకటి, వేర్వేరు వెబ్ మ్యాగజైన్లలో మూడు కథలు ప్రచురితమయ్యాయి.
