నడక దారిలో-65

-శీలా సుభద్రా దేవి

జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే చదువుతో బాటు సాహిత్యం , సంగీతం, బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం, పల్లవి వివాహం, నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, .పాప రెండవ పుట్టినరోజు వేడుక , కొత్త ఇంటి గృహప్రవేశం తిరిగివెళ్ళిన రెండు నెలలకే అజయ్ చనిపోవడంతో ఆషీని తీసుకుని పల్లవి తిరిగివచ్చేసి ఉద్యోగంలో చేరింది. నేను హెచ్చెమ్ గా రిటైర్ కావటం, పెద్దక్క మరణం, ప్రత్యేకతెలంగాణా, సరూర్ నగర్ అపార్ట్మెంట్ కు మారటం. డా.పి.శ్రీదేవి మోనోగ్రాఫ్ రాయటం, వీర్రాజుగారికి బోయి భీమన్న, బాపూరమణల పురస్కారాలు-ఉమ్మడిశెట్టి రాధేయ ప్రతిభా పురస్కారం -చిన్నక్క మరణం, వీర్రాజుగారి పెయింటింగ్స్ ప్రదర్శనలూ, నాకు అమృతలత అపురూప పురస్కారం, ఆషీకి కాలేజీ ప్రహసనాలూ, కరోనా విజృంభణ, పల్లవికి కరోనా వచ్చి తగ్గటం, తర్వాత—)

***

కేంద్ర సాహిత్య అకాడమీ వారు కవులకు కవిసంధి, రచయితలకు కథాసంధి అనే పరిచయం కార్యక్రమాల నిర్వహణ ఎప్పటినుండో కొనసాగుతూ వుంటుంది. ఎనభైరెండేళ్ళ వయసులో వీర్రాజుగార్ని రచయితగా గుర్తించారు కాబోలు కరోనాకాలంలో జూమ్ సమావేశంలో కథాసంధి కార్యక్రమం జరిగింది.

“పోనీలే ఇప్పుడైనా గుర్తొచ్చాను” అని అల్ప సంతోషి అయిన వీర్రాజుగారు సంబరపడ్డారు.

కరోనా పరిస్థితులు చూస్తుండేసరికి వీర్రాజుగారికీ ఇంటినిండా నిండిపోయిన పుస్తకాలూ, వీర్రాజుగారి పెయింటింగ్స్, నాలుగైదు దశాబ్దాలకు పైగా సేకరించిన కళాకృతులు పిల్లలకు భారమోతుందేమో అనే భయం, బెంగా మా మనసుల్లో నిండిపోయింది.

గ్యాలరీ ఏర్పాటు చేయాలంటే ఇండిపెండెంట్ ఇల్లు కాదు. మాది అపార్ట్మెంట్. వీర్రాజుగారు రాజమండ్రిలోని మాదేటి రాజాజీ అన్న కొడుకు రవిప్రకాష్ ని సంప్రదించారు.” మా చిన్నాన్న పెయింటింగ్స్ కూడా పెట్టే వుద్దేశ్యం వుంది. మీ పెయింటింగ్స్ కూడా కుదురితే అలా చేద్దాం ” అన్నాడు. మా పుస్తకాలని విశ్వవిద్యాలయాల లైబ్రరీలకు పంపాలని వాటి చిరునామాలు గూగుల్ లో వెతికి తెలుగు శాఖా అధ్యక్షులు ఫోన్ నెంబర్లు వుంటే వాళ్ళకి మెసేజ్ పెట్టాను. వాళ్ళ అంగీకారం తెలిపిన తర్వాత కేవలం మా రచనలను పార్సిల్ చేసి పంపించాము. అందుకున్నట్లు తిరిగి మెసేజ్ లు పెట్టారుకానీ ఏ విశ్వవిద్యాలయం శాఖా కూడా అక్నాలెడ్జ్ వుత్తరం మాత్రం ఇవ్వలేదు. రచయితలను గౌరవించే సంస్కృతి లేదనిపించింది. అయితే విశ్వవిద్యాలయం లైబ్రరీలోకి  కొన్నైనా పుస్తకాలు వెళ్ళాయన్న ఒక తృప్తి అంతే.

ఇప్పుడప్పుడే ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కార సభ పెట్టే అవకాశం లేదనిపించి వీర్రాజుగారు జూమ్ సమావేశం ఏర్పాటు చేసి , వాళ్ళ అక్కౌంటుకు పురస్కార నగదు పంపించేద్దాం, హైదరాబాద్ వచ్చినప్పుడు జ్ణాపిక అందజేద్దాం అని నిర్ణయించి కుందుర్తి కుటుంబంతో సంప్రదించారు. వాళ్ళు కూడా అవార్డులు ఇచ్చేస్తే ఇంక బాధ్యత తీరిపోతుంది అని అన్నారు.

సింగపూర్ లో వున్న కుందుర్తి కవిత ఆగష్టు 11 వ తేదీన ఫ్రీవర్స్ ఫ్రంట్ వాట్సాప్ సమూహం ఏర్పాటు చేసింది. అంతకు ముందు ఈ పురస్కారం అందుకున్న వారినే కాకుండా సమకాలీన కవులను సమూహంలో చేర్చాము. అయితే నలుగురైదుగురు అంతకు ముందు పురస్కారం అందుకున్న వారే ఇష్టం లేక కావచ్చు సమూహం నుండి బయటకు వెళ్ళిపోయారు.

సమూహం స్తబ్దుగా లేకుండా, కొత్త వాళ్ళకు ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డులు గురించి పరిచయం చేసినట్లు ఉండాలని కుందుర్తిగారి గురించి , ఫ్రీవర్స్ ఫ్రంట్ స్థాపన, అవార్డు మొదలుపెట్టటం మొదలైనవన్నీ ఒక క్రమ పద్ధతిలో రోజూ అందులో పోష్టు చేసేదాన్ని. తర్వాత రోజుకు ఒకరిద్దరు పురస్కారగ్రహీతల పరిచయం చేసాను. దానికి వారు కూడా ప్రతిస్పందించి ఆనాటి ముచ్చట్లు, సభల ఫొటోలు షేర్ చేయటంతో సమూహం ఉత్సాహవంతంగా, ఆసక్తికరంగా కొనసాగింది. ఆ గ్రూపులో దీనికి సంబంధించిన సమాచారం తప్ప మరేదీ పోష్టు చెయ్యకుండా చూసుకున్నాను.

ఆగష్టు 22 వతేదీన గుంటూరు లక్ష్మీనరసయ్యగారి అధ్యక్షతన 49,50 వ ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారాల జూమ్ సమావేశం జరిగింది. సిరికి స్వామినాయుడి “మట్టిరంగు బొమ్మలు” సంపుటి మీద మేడిపల్లి రవికుమార్, ఇబ్రహిమ్ నిర్గుణ్ “ఇప్పుడేదీ రహస్యం కాదు” సంపుటి మీద డా.సీతారాం మాట్లాడారు. తర్వాత కూడా శివారెడ్డి గారూ తదితరులు ఫ్రీవర్స్ ఫ్రంట్ కొనసాగించుతేనే బాగుంటుంది అనే ఆకాంక్షను వ్యక్తం చేస్తూ మాట్లాడారు. అప్పుడు కూడా వీర్రాజుగారు స్పష్టంగా ఖండిస్తూ మాట్లాడారు.

ఫ్రీవర్స్ ఫ్రంట్ సంస్థ గురించి వీర్రాజు గారిని అనిల్ డ్యాని చేసిన ముఖాముఖి సారంగలో ప్రచురితమైంది.

ఫ్రీవర్స్ ఫ్రంట్ వాట్సాప్ సమూహంలో డిసెంబర్ 22 వతేదీ కుందుర్తి ఆంజనేయులు గారి శతజయంతి కనుక అప్పటి వరకూ ఈ సమూహం కేవలం వచన కవిత్వం కోసమే కొనసాగుతుంది. సమూహ కవులు తమ కవితల్ని ఇందులో పోష్టు చేసుకోవచ్చునని సమూహం అడ్మిన్ గా నేను ప్రకటించాను. దానికి సభ్యులందరూ హర్షం వ్యక్తంచేశారు.

నేను రచయిత్రుల కథల గురించి రాసిన వ్యాసాల పుస్తకానికి ” కథారామంలో పూలతావులు ” అనే శీర్షిక అనుకున్నాము. వ్యాసాల తర్వాత గోదావరి పత్రికలో కాత్యాయనీ విద్మహే చేసిన ముఖాముఖిని కూడా చేర్చాను. పల్లవి చక్కటి ముఖచిత్రం వేసింది. పుస్తకం చాలా బాగా వచ్చింది. చాలామంది సాహితీ వేత్తలకు పోష్టు చేసాను. మంచి స్పందన వచ్చింది. ఈ పుస్తకం మీద చక్కని సమీక్షలు కూడా వచ్చాయి. పుస్తకం పీడీఎఫ్ నిడదవోలు మాలతిగారికి ఈమెయిల్ ద్వారా పంపాను. ఆమె మొత్తం చదివి ఒక విశ్వవిద్యాలయం విద్యార్థి చేసిన పరిశోధన గ్రంథంలా వుందని ప్రశంసించటమే కాకుండా పుస్తకానికి నేను రాసిన ముందుమాట అర్థవంతంగా వుందని అన్నారు. ఆ పుస్తకానికి ఆమె కూడా సమీక్ష రాసి తన వెబ్సైట్ లో ప్రచురించారు.

మాకు తెలియని మా బంధువు ఒకాయన మా ఫోన్ నెంబర్, ఇల్లూ వెతుక్కుంటూ మా ఇంటికి వచ్చారు. బంధుత్వం కలుపుకుని వీర్రాజుగారు ఆయనకు మామయ్య అవుతారనీ, ఆయన నన్ను అక్క అని వరస కలిపాడు. వీర్రాజుగారివీ, నావీ పుస్తకాలు తీసుకున్నారు. ఆయన హిందీలో పీహెచ్డీ చేసారు. బేంక్ లో ఆఫీసర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. అనువాదం పట్ల ఆసక్తీ , అభిరుచి ఉన్నవారు. వీర్రాజుగారు రచించిన మైనానవలని హిందీలోకి అనువాదం చేస్తానని అంగీకారం కోరారు. ఆయనే డా.కాలేపు గణేశ్ రామ్ గారు. రాజమండ్రి వాస్తవ్యులు. వీర్రాజుగారు చాలా సంతోషంగా అంగీకారం తెలియజేసారు.
తర్వాత మైనా హిందీ అనువాదమే కాక తదనంతరం నా ఇస్కూలు కథల్ని అనువాదం చేసి పుస్తకం రూపంలో తీసుకువచ్చారు. నా కవితల్ని కూడా చాలా వాటిని అనువాదం చేసారు. నేను నిర్వహిస్తున్న ఫ్రీవర్స్ ఫ్రంట్ సమూహంలోనికి ఆయనను చేర్చాను. దాంతో చాలామంది కవులు పరిచయం కావటంతో గణేష్ రామ్ గారు అనువాద కార్యక్రమాలు ఉధృతం చేసారు

తప్పక చదవాల్సిన వంద నవలలలో వున్న మైనా నవల్ని, 1969 లోనే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం పొందిన నవలని ప్రచారం చేసుకునే శ్రద్ధగానీ, చొరవగానీ వీర్రాజుగారికి లేకపోవటం వలన అనువాదాలు చేయించుకోలేకపోయారు.

కె.బి.గోపాలంగారు ఆంగ్లానువాదం చేసినా దాన్ని ప్రచురించే ప్రయత్నం కూడా చేయలేదు. కానీ రాజేశ్వరీ కోథండం తమిళానువాదం చేయడమే కాక పుస్తకరూపంలోకి కూడా ఆమె ప్రచురణ బాధ్యత తీసుకుని వేయించారు.

అదే సమయంలో వరంగల్ నుంచి అనుకుంటాను దామోదరాచారి అనే ఆయన తాను చాలా మంది రచనల్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేసానని అవి అంతర్జాతీయ స్థాయిలో పేరు పొందాయని నా కవిత్వాన్నీ అనువాదం చేస్తానని ఫోన్ చేసారు. ఇంట గెలవకుండా అంతర్జాతీయ స్థాయి నాకు అక్కరలేదులే అని నాకు అంతగా ఇష్టంలేక మొహమాటం కొద్దీ చెప్పలేక వీర్రాజు గారు ఖచ్చితంగా చెప్తారేమోనని ఆయనకు ఫోన్ అందించాను. వీర్రాజుగారికి నాకన్నా మొగమాటం కనుక అంగీకారం తెలియజేసారు.

ఇంక ఆయన నా పుస్తకాల పీడీఎఫ్ పంపమని రోజూ ఫోన్ చేసేవారు. ఇక తప్పక శీలా సుభద్రా దేవి కవిత్వం పీడీఎఫ్ పంపించాను. దామోదరాచారిగారు ఆగమేఘాల మీద అనువాదం చేయడమే కాకుండా పుస్తకం ప్రచురించడానికి పబ్లిషర్ని కూడా మాట్లాడేసి డబ్బు పంపమని ఒత్తిడి చేసాడు. అయిదువందలు వేసుకోమని అన్నా సరే నేను అంగీకరించ లేదు. వంద కాపీలు చాలని అనువాదం చేసిన ఆయన్ని పాతిక కాపీలు తీసుకుని నాకు డెబ్భైఅయిదు పంపమన్నాను. వీర్రాజుగారి మొహమాటం వలన ఆ పుస్తకం ప్రచురణ కోసం ఇరవైమూడు వేలు పంపాల్సివచ్చింది. ఆ తర్వాత ఇంకా ఏవో అనువాదం చేస్తానని ఫోన్లు చేసినా వద్దని చెప్పి నేను స్పందించలేదు.

వీర్రాజుగారి పెయింటింగ్సునీ, మాదేటి రాజాజీ పెయింటింగ్సునీ రాజమండ్రిలోని దామెర్ల రామారావు చిత్రకళా పరిషత్ లో మొదటి అంతస్తులో ఏర్పాటు చేయటానికి రవిప్రకాష్ గ్యాలరీ ఇన్చార్జి గారితో మాట్లాడానని చెప్పాడు. మొదటి అంతస్తులో పెయింటింగ్స్ పెట్టటానికి వీలుగా ఫ్రేములూ, బీములు తయారు చేయించటానికీ, ఫోకస్ లైట్లు ఏర్పాటు చేయటానికి అతనికి కొంత సొమ్ము పంపించాము.

చిన్నమరిది, తోటి కోడలు ప్రతి ఏడాది ఒక ఆరునెలలు యూఎస్ లో వున్న పిల్లల దగ్గరకు వెళ్తుంటారు. పెయింటింగ్స్ రాజమండ్రి గ్యాలరీకి ఇచ్చేయాలనుకుంటున్నామని తెలిసి పిల్లలు ఇద్దరికీ రెండు పెయింటింగ్స్ ఇమ్మని అడిగాడు. వాళ్ళు ఎంపిక చేసుకున్న పెయింటింగ్స్ రెండు ఇచ్చేసాము. మా కోసం ఇంట్లో పెట్టుకోవటానికి పల్లవి, ఆషీ నాలుగు పెయింటింగ్స్ ఎంపిక చేసారు. ఒకటి రెండు పెయింటింగ్స్ పాడైనవి వుంచేసాము. వీర్రాజుగారు తనకి అంతగా నచ్చనివి చిన్నవి పంపవద్దనుకున్నారు. మరో రెండు చిన్న సైజు ఆయిల్ చిత్రాలు కూడా మా కోసమనే దాచుకున్నాను.

గ్యాలరీలో పెయింటింగ్స్ అమర్చటానికి ఏర్పాటు అంతా ముగిసాక మాదేటి రవిప్రకాష్, రవికాంత్ కలిసి వచ్చి డెభ్భై ఎనిమిది పెయింటింగ్సునీ చక్కగా పేక్ చేసి తీసుకు వెళ్ళారు.

అయితే అన్నింటినీ అటకమీద నుండి దించేసరికి ఖాళీ అయిన అరల్ని చూసి దిగులు వేసింది. వీర్రాజుగారు నెలలూ సంవత్సరాల తరబడి గంటలు గంటలు కూర్చుని ఒక తపస్సుగా వేసిన చిత్రాలు అవి. అమ్మితే డబ్బు చేసుకోవచ్చును. కానీ అమ్మితే అవి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాయి. చిత్రకారుడి ప్రతిభ మరుగున పడి పోతుంది. ఒక దగ్గరే వుంటే అది నిలిచి పోతాయనీ భావించాము. అదీకాక వీర్రాజుగారికి రాజమండ్రి అంటే అమితమైన ప్రేమ. అక్కడే ఆ దామెర్ల రామారావు చిత్రకళా పరిషత్ లోనే తన కళకు మెరుగులు దిద్దుకున్నారు. అందువలన అక్కడ చేర్చడమే సమంజసం అనిపించింది.

నిజానికి వాటిని మేము కలకాలం భద్రపరచడం కష్టమే. పల్లవీ, ఆశ్లేషాలకు కూడా భారమౌతాయేమో, గ్యాలరీలో అయితే అనేక మంది చూస్తారు. అంతేకాక కలకాలం భద్రంగా వుంటాయని భావించాము.

వాళ్ళు ఆ పెయింటింగ్స్ తీసుకు వెళ్తుంటే కన్నబిడ్డని పంపినంతగా బాధతో కళ్ళు చెమ్మగిల్లాయి. అదేవిధంగా వీర్రాజుగారు దశాబ్దాల కాలంగా ప్రతి ఆదివారం సెకెండ్ హ్యాండ్ పుస్తకాల షాపులు తిరిగి చిత్రకళకు చెందిన వివిధ దేశాల పుస్తకాలు సేకరించి పెట్టుకున్నారు. అవికూడా ఆర్ట్ గ్యాలరీకి పంపించేస్తే అక్కడ చిత్రకారులకు పనికి వస్తాయని భావించి తర్వాత వాటిని కూడా పంపించేయటానికే నిశ్చయించారు. వాటిలో పల్లవి తనకు నచ్చిన కొన్ని పుస్తకాలను తనకోసం ఉంచుకుంది.

ఒకరోజు తెలంగాణా సారస్వత పరిషత్తు నుండి చెన్నయ్యగారు నాకు ఫోన్ చేసి ” మిమ్మల్ని ఈ ఏడాది శ్రీమతి సుశీలానారాయణరెడ్డి పురస్కారానికి ఎంపిక చేసాము. యాభైవేల నగదు, సన్మాన పత్రం, జ్ణాపిక ప్రదానం వుంటుంది” అన్నారు.

నేను వింటున్నది నిజమేనా అని అనుమానంతో మరోసారి ప్రశ్నించి అడిగాను. ఆయన మరోసారి అదే చెప్పారు.” నేను నిజమేనా” అని ప్రశ్నించాను.

” మీరు అవార్డులు వెంట పరిగెత్తరు. మీ దగ్గరకే అవార్డులు వెతుక్కుంటూ వస్తాయి. అందుకే ఎంపిక జరిగింది.” అన్నారు చెన్నయ్యగారు. ఆ మాటకంటే పెద్ద అవార్డు ఏముంది.

తర్వాత సి.నారాయణరెడ్డిగారి పెద్ద అమ్మాయి గంగ ఫోన్ చేసి ఫిబ్రవరిలో అవార్డు సభ వుంటుందని తెలియజేసి చాలా సేపు మాట్లాడారు. బయోడేటా పంపించమని చెప్పారు.

సారస్వత పరిషత్తు నుండి ఒక అతన్ని పంపిస్తాననీ నా పుస్తకాలన్నిటినీ పంపమని చెన్నయ్యగారు ఫోన్ చేసి చెప్పారు. అన్నట్లుగానే పరిషత్తు నుండి వచ్చిన ఆయనకి నా పుస్తకాలు ఇచ్చి పంపించాను.

సుశీలా నారాయణరెడ్డి అవార్డు కోసం ప్రయత్నాలు, పైరవీలు చేసే వారి గురించి నాకు తెలుసు. నేను ఇంతకుముందు ఒకసారి రామలక్ష్మికి ఇచ్చినప్పుడు మాత్రమే ఆ సభకి వెళ్ళాను. తర్వాత వెళ్తే అవార్డు కోసం ప్రయత్నాలు చేసుకోటానికి వెళ్ళినట్లు ఉంటుందని ఇంతకాలంగా ఎప్పుడూ వెళ్ళలేదు.

ఎప్పుడో కుందుర్తి సత్యమూర్తి, వీర్రాజు గారితో కలిపి సైదాబాద్ కో ఆపరేటివ్ బ్యాంక్ లో ఫ్రీవర్స్ ఫ్రంట్ పేరిట కొంత కొంత చొప్పున డబ్బు వేస్తుంటే అవార్డులకు, సభకూ ఉపయోగ పడుతుందన్న ఆలోచనతో జాయెంట్అక్కౌంటు ఓపెన్ చేసారు. ఆ విషయం ఇద్దరూ మర్చిపోయినట్లున్నారు. సమత వాళ్ళ నాన్న ఫైల్స్ ఏవో వెతుకుతున్నప్పుడు పాస్ బుక్ కనిపించిందట. కరోనా కాలంలోనే సమత బేంక్ కి వెళ్ళి కనుక్కుంటే జాయింట్ అక్కౌంట్ లో ఎవరైనా జీవించినవారు సంతకం పెడితే సరిపోతుంది అని చెప్పారుట. వీలున్నప్పుడు వెళ్ళి క్లోజ్ చేయమని అవసరమైన ఫామ్స్ నింపి తీసుకు వచ్చి ఇచ్చింది.

కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టింది. జనజీవితం పూర్తిగా యథావిధిగా మారింది. ప్రపంచం అంతా వూపిరి పీల్చుకుంది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.