
ఈ తరం నడక – 24
సుజాత వేల్పూరి
-రూపరుక్మిణి

మట్టిలో మాణిక్యాలు
పల్నాటి మట్టిలో పుట్టిన మాణిక్యం వంటి మగువలు తమని తాము ఎలా నిర్మించుకున్నారో, ఎలా వారి జీవితాన్ని నిలబెట్టుకున్నారో చెప్పే కథలు ఈ పల్నాడు కథలు.
మగువలు ఏ ఇంటికైనా వెలుగే. ఆ వెలుగు ఓ తోడును కోరుకుంటే ఆ తోడు నాలుగు గోడల మధ్య చీకటితో వారి జీవితాన్ని కమ్మేస్తే, వెలుగు నింపుతూ తమను తాము కొవ్వొత్తిలా కరిగించుకుంటూ, తన చుట్టూ ఉన్న వారికోసం వెలుగుపూలు పంచుతూ బతికే మగువలు ఎందరో..
ఈ సమసమాజంలో మహిళ ఎన్నో రకాలుగా పాలిష్డ్ చేయబడింది. సాంప్రదాయాల మాటును సమాజం చిత్రించిన చిత్రంలో మగువ ఎప్పుడు ఆట బొమ్మగా చూడాలని చూస్తుందీ సమాజం. కొట్టినా, తిట్టినా, ఛీ పోమన్నా, చిత్రవధకు గురి చేసే ఇల్లే స్వర్గంగా , మాటల శూలాలు దింపే మగడే దైవంగా.. అనుకుంటూ బ్రతకమని నిర్దేశిస్తూందీ సమాజం.
ఇంటికి వెలుగు స్త్రీ అన్న ఒక్క మాట మాత్రం నిజం. స్త్రీలు ఉన్నచోట పువ్వులు పరిమళిస్తాయి, ప్రకృతి పచ్చగా నవ్వుతుంది. ముళ్ళ గోరింటలా విచ్చుకుంటుంది, గులాబీ పువ్వులా జీవితాన్ని వికాసవంతం చేసుకుంటుంది. అటువంటి స్త్రీ తనను కొవ్వొత్తిలా కరిగించుకుంటూ, తన చుట్టూ ఉన్న వారి కోసం వెలుగును పంచుతూ, బతికే ఈ వెలుగు రవ్వలు నిప్పు కనికల్లా తమ చుట్టూ చీకటిని చీల్చి తమని తాము నిలబెట్టుకుంటూనే సమాజానికి చుక్కానిలా బ్రతుకుతున్న తామర తరకలు, ఏ మరకలు అంటని మగువల కథలు ఈ “పల్నాడు కథలు”
కొన్ని కథలు చదువుతుంటే జీవితం ఎన్ని రకాల పాఠాలని చెబుతుందో , కొత్త మనుషుల్ని కొత్త-పాత జీవితాల్లోని మార్పుల్ని సమీకరించి నడతను నడకనో మార్చుకునే నేర్పుని నేర్పుతుంది అనిపించక మానదు. పౌరుషంతో, ఆత్మగౌరవంతో బ్రతికే స్త్రీలను చూస్తే సమాజానికి కంటగింపు ఎక్కువే మరి!.
ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొని, నిలబడి సాధికారతను అందు కున్న పల్నాడు ఆడబిడ్డల కథలు మనకి అందించిన వారు సుజాత వేల్పూరి గారు.
ఈ కథలన్నీ శిల్ప పరంగా హృదయానికి హత్తుకుని, ఆసక్తికరంగా బిగువు సడలకుండా నిర్మించిన కథలు. ఒకే తీగకు అమరిన రంగుల పూలలా, నశాలానికి అంటిన మిర్చీ ఘాటులా అనేక జీవిత శకలాలోని మూలాలుగా మనకు కనిపిస్తాయి. ఒక్కో కథ మనల్ని పల్నాడు పరిసరాలని పట్టి చూపిస్తుంది. స్థానికతను గుర్తు చేస్తూ పల్లె జీవనం లోని మట్టి పరిమళం ఎంత గుభాళిస్తుందో చూపిస్తాయి. సున్నితమైన మనసు రాతి పొరలు లాంటి మాటల వెనుక ఎలా దాగుతుందో విశ్లేషించి చెప్తాయి.
ఈ కథలోని పాత్రలు రాజ్యలక్ష్మి, కోటేశ్వరి, స్వరాజ్యం, సైదమ్మ, నాగమల్లేశ్వరి, విజయశాంతి, నాగలక్ష్మి, విద్య వీళ్లంతా సాధికారత కోసం పోరాడిన మహిళలు. స్వేచ్ఛగా నిలువ నీడని సంపాదించుకొని తమని తాము నిర్మించుకున్న పల్నాడు వనితల ఆత్మ కథలు.
ఈ పుస్తకంలో మొత్తం 15 కథలు ఉన్నాయి. సన్నివేశానికి తగిన భాషా సౌందర్యం ఈ కథల్లో మనం చూడవచ్చు. దేనికి అది ప్రత్యేకమైన నడకతో, జీవన పరిమళాన్ని వెదజల్లుతాయి. శ్రమ సౌందర్యానికి ప్రతీకగా నిలిచిన పల్నాడు కథల్లో నాకు బాగా నచ్చిన కథ “నరసరావుపేట పడక కుర్చి”. ఈ కథ ప్రారంభం నుండి ముగింపు వరకు అలవోకగా చదివిస్తుంది కానీ కథలోని బరువు మాత్రం అంత తొందరగా దిగిపోదు. పురుష స్వామ్య ప్రపంచంలో స్త్రీ ఎన్ని రకాలుగా పాలిష్ చేయబడుతుందో చెప్తూనే, ఓ స్త్రీ అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ సమాజంపై ఆ స్త్రీకి ఉన్న లౌకికత్వాన్ని వివరిస్తుంది. ఈ కథలోని రాజ్యలక్ష్మి దక్కించుకున్న సాధికారతను చూపిస్తుంది.
ఇంటి యజమాని అంటే పురుషుడు మాత్రమే అని అహంకారాన్ని ప్రదర్శించే సాంప్రదాయాల మూలాల్లో స్త్రీ ఎలా బంధింపబడింది?, అన్నది చెప్తూనే కథనడక మనల్ని చాలా తేలిగ్గా కథ లోపలికి నడిపి స్తుంది బలమైన ముద్రను వేస్తుంది. ఈ రాజ్యలక్ష్మి పాత్ర.
సైదమ్మ, స్వరాజ్యం తమకష్టానికి గుర్తింపు లేని చోట తనకు స్థానం లేదని బయటకు వచ్చి అదే కష్టంతో నలుగురికి మంచి చేస్తూ బ్రతికి చూపిస్తుంది శ్రమ సౌందర్యం ఎంత స్వావలంబనని ఇస్తుందో చెప్తాయి ఈ కథలు.
గైనకాలజిస్ట్ అవ్వాలన్న కోరికతో ఉన్న నాగమల్లేశ్వరి తన ఇంటిలోని పరిస్థితుల వల్ల చదువు అర్ధాంతరంగా ఆగిపోతుంది, పెళ్లి చేసుకున్న వాడు అధికారాన్ని చెలాఇస్తూ హింసకు ప్రతిరూపంగా మారితే, చదువునే నమ్ముకుని టీచర్‌గా ఉద్యోగం సంపాదించుకొని తన కాళ్లపై తానే నిలబడి తన జీవితాన్ని గెలుచుకున్న తీరు ఈ కథలో వర్ణించి చెప్పడం, చెప్పిన విధానం చాలా మెలుకువతో రాశారు అనిపించింది. ఈ కథకు ఓ ప్రత్యేకత వుంది. ఎక్కడా ఒక చెదురు మాట లేకుండా ఒకరి జీవితాన్ని గురించి చెప్పే క్రమంలో మరో మనిషిగా కథలోకి మనకి ప్రవేశం దొరుకుతుంది.
సావిత్రి పెంచుకున్న బిడ్డను విచక్షణారహితంగా నలిపివేసిన తండ్రి కొడుకులకు బుద్ధి చెప్పిన తీరు సావిత్రి పాత్రలో “ముళ్ళ గోరింట” కథా నడక అద్భుతంగా సాగింది. ఈ కథలోని పాత్ర తప్పు చేసిన వారికి శిక్ష పడాలి అన్న నియమంతో ప్రతీకారం తీర్చుకోవడం ఒక సాధారణ విషయంగా కథలో చెప్పి ఒప్పిస్తారు కథా రచయిత్రి.
లింగారెడ్డి పైకి ఎంతో ధైర్యంగా నిలబడే మనిషి చేనును అమ్మాల్సి నప్పుడు నేల తల్లిని నమ్ముకుని బ్రతికిన మనిషి ఆ నేలను వీడి వెళ్లాలంటే ప్రాణం భూమి ఒక్కటే అని చెప్పే ఒక వాక్యం కథలోని రైతు హృదయాన్ని ఆవిష్కరిస్తుంది. రచయిత్రి ఈ కథ ద్వారా తల్లిదండ్రులు వారు కట్టుకున్న ఇళ్ల పైన నమ్ముకున్న నేలపైన ఎంత మమకారంతో ఉంటారు గుర్తించండి అని చెబుతున్నట్లు ఉంటుంది. పెద్దవాళ్లు వాళ్లు జీవించిన ప్రాంతాన్ని నేలను వదిలి రాలేరని అలా వచ్చినా ప్రాణం లేని శవాలుగా మారిపోతారని చెప్పే కథ ఇది.
రికార్డింగ్ డాన్సర్‌గా పనిచేసిన మనిషి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ‘విద్య’ ఆత్మగౌరవంతో బతుకుతున్న అమ్మాయి. ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఆ అబ్బాయి తల్లిదండ్రులు, అతని కుటుంబ సభ్యులు విద్యపై జాలి పడుతూ పెళ్లి చేసుకుంటాం., మేము నీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తున్నాం. అన్న మాటలకు మనిషి చలించిపోయి. ఎవరి దయాదాక్షిణ్యాల మీద బ్రతుకుతూ జీవితాన్ని నరక కూపం చేసుకోలేను అంటూ ప్రేమించిన వ్యక్తి కుటుంబానికి ఈ సంబంధం నచ్చలేదు అని చెప్పే సందర్భం ఈ కథలో కథకురాలి అవగాహన చాతుర్యంతో ఈ కథ నిర్మాణంలో కనిపిస్తుంది.
ఈ కథలు అన్ని స్త్రీ పాత్రల మధ్య పల్లె వాతావరణంలోని కల్మషం లేని మనుషుల మధ్య పల్లె వర్ణాన్ని పల్లె సామాజిక సామూహిక వ్యవస్థకు బలమైన నేపథ్యాన్ని చేర్చి ఈ కథలన్నింటినీ మలిచారు.
ఈ కథలు ఎంత తేలికగా చదివిస్తాయో అంత బరువుగా ఉంటాయి ఈ కథల్లో పురుష పాత్రలు ఉన్న కథలు మూడు ఉంటే 12 స్త్రీ సంఘర్షణలే ముఖ్య పాత్ర వహిస్తాయి. ప్రతి కథ ఆత్మాభిమానానికి ప్రతికలుగా నిర్మించారు భాష పట్ల శ్రద్ధ కనిపిస్తుంది మాండలికాన్ని అందిస్తూనే ప్రాంతీయతకు ప్రాధాన్యం ఇస్తూనే సరళమైన పదసంపద వలన ఎక్కడ ఇబ్బంది కలిగించదు చదువరులకు.
ఈ కథల్లోని వస్తువు షార్ట్ ఫిలిం తీసిన చాలా బాగుంటుంది అనిపిం చేలా కథా నిర్మాణము, శైలి ఉన్నాయి. అభినందనలు సుజాత గారు
*****

పేరు కె.రుక్మిణి. చదువు ఎమ్మే ఎకనామిక్స్ & తెలుగు. కవి, రచయిత, టీచర్ & సామాజిక కార్యకర్త. కలం పేరు రూపరుక్మిణి. రచనలు : 1.అనీడ 2.మిగుల్చుకున్న వాక్యాలు. వివిధ సంకలనాలలో, పత్రికలలో కవితలు, కథలు, సామాజిక వ్యాసాలు ప్రచురితమయ్యాయి. పుట్టి, పెరిగింది, విద్యాభ్యాసం ఖమ్మంలో. ప్రస్తుత నివాసం హైదరాబాద్.
