
ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఇంద్రగంటి జానకీబాల గారితో నెచ్చెలి ముఖాముఖి
-డా||కె.గీత
ఇంద్రగంటి జానకీబాల గారు ప్రముఖ రచయిత్రి, గాయని. వీరు ఆరు కథాసంపుటాలు, పన్నెండు నవలలు, ఒక కవితా సంపుటి ప్రచురించారు. సినీనేపథ్య గాయనుల జీవిత విశేషాలతో కూడిన పరిశోధన గ్రంథం “కొమ్మా కొమ్మా కోయిలమ్మా” వంటివెన్నో వెలువరించారు.
జానకీబాల గారు డిసెంబరు 4, 1945న రాజమండ్రిలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీ సూరి రామచంద్రశర్మ, శ్రీమతి లక్ష్మీనరసమాంబ. వీరు తణుకులోని సీతామహాలక్ష్మి జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలలో విద్యాభ్యాసాన్ని పూర్తిచేశారు. 1966లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగంలో చేరారు. సాహితీ ప్రముఖులైన శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారి మూడో కుమారులు ప్రముఖ కవి, విమర్శకులు శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు వీరి భర్త. వీరి కుమారులు శ్రీ ఇంద్రగంటి మోహనకృష్ణ, కుమార్తె శ్రీమతి ఇంద్రగంటి కిరణ్మయి ప్రముఖ సినీదర్శకులు. ఉద్యోగరీత్యా విజయవాడలో పాతికేళ్లపాటు నివసించారు. 1991లో ఉద్యోగ విరమణ చేసి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.
వీరు ప్రముఖ ఆకాశవాణి లలిత సంగీత కళాకారిణి. లలితగీతమాలిక , శివాక్షరమాల కేసెట్లు విడుదల చేశారు. ఈటీవీ-2లో “పాటలపాలవెల్లి” కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగు సినిమా పాటలపై పదలహరి సంగీతకార్యక్రమాన్ని రేడియోస్పందనలో నిర్వహించారు.
సంగీత, సాహిత్యరంగాల్లో విశేష కృషిచేసిన జానకీబాల గారిని పలు పురస్కారాలు వరించాయి. “కనిపించే గతం” నవలకు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ రచయిత్రి పురస్కారం, కథారచయిత్రిగా రంగా-జ్యోతి పురస్కారం, జ్యోత్స్నా పీఠం సంస్థ నుంచి కథారచయిత్రిగా జ్యోత్స్నాపీఠం పురస్కారం మొ.వి
నవలలు
కరిగిన హరివిల్లు
విశాల ప్రపంచం
వెన్నలమట్టి
ఆవలితీరం
తరంగిణి
నీలిరాగం
నిజానికి అబద్ధానికి మధ్య
మాతృబంధం
సజలనేత్రి
కనిపించేగతం
రాగవల్లకి
పంజరం కోరిన మనిషి
దేవకీ వాళ్ళక్క, అన్నయ్య-
కథా సంపుటాలు
ప్రేమలేఖ
ప్రయోజనం
అంతరంగ
తరంగాలు
ఆత్మ-దృష్టి
అందరం ప్రేక్షకులమే
నిర్ణయానికి అటూ-ఇటూ
జానకీబాల కథలు
సువర్ణ రేఖ
కవితాసంపుటి
మనశ్శల్యాలు
పలు సావనీర్లకు, పుస్తకాలకు, సంకలనాలకు జానకీబాల గారు సంపాదకత్వ బాధ్యతలు వహించారు. 2002లో అమెరికాకు చెందిన వంగూరి ఫౌండేషన్ ప్రచురించిన అమెరికా తెలుగు కథకు సహ సంపాదకురాలిగా వ్యవహరించారు. ప్రముఖ సంగీతవేత్త, ఆకాశవాణి లలిత సంగీత పితామహులు “బాలాంత్రపు రజనీకాంతరావు” గారి సావనీర్ కు సంపాదకత్వం వహించారు. భానుమతీ రామకృష్ణ, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ల జీవితచరిత్రలు ప్రచురించారు.
*****
https://youtu.be/DG-Y4EkifCI

డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023), అనగనగా అమెరికా (కాలమ్స్)(2025) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.
