(వచ్చేనెల నుండి “మాకథ” (దొమితిలా చుంగారా ఆత్మకథ)  ధారావాహిక ప్రారంభం. ఈసందర్భంగా అనువాదకులు ఎన్. వేణుగోపాల్ ఆంధ్రజ్యోతి (జనవరి 19, 2004) లో రాసిన ముందు మాట మీకోసం ప్రత్యేకంగా ఇక్కడ ఇస్తున్నాం. నెచ్చెలిలో పున: ప్రచురణకు అంగీకరించిన వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు-)

ఇరవై ఏళ్ల తర్వాత…

  ఎన్. వేణుగోపాల్

నేను అనువాదం చేసిన పూర్తిస్థాయి మొదటి పుస్తకం మా కథే, అందువల్ల ఆ పుస్తకంతో నా అనుబంధం హృదయానికి చాలా దగ్గరిది.

ఒక సందర్భం అనేక జ్ఞాపకాల్ని ప్రేరేపిస్తుంది. ఒక జ్ఞాపకం అనేక సందర్భాల్ని పునర్జీవింప చేస్తుంది.

‘మా కథ’ రెండో కూర్పు అటువంటి సందర్భం, బొలీవియన్ గని కార్మిక, మహిళా ఉద్యమ నాయకురాలు దొమితిలా బారియోస్ ది రాసిన ఆత్మకథ ‘లెట్ మీ స్పీక్’ కు అనువాదం ‘మా కథ’ నవంబర్ 1983 లో హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణగా వెలువడింది. సరిగ్గా రెండు దశాబ్దాలు గడిచిన తర్వాత హెచ్ బిటి ఈ పుస్తకపు రెండో కూర్పును ప్రచురించింది.

ఈ పుస్తకం అనువాదం కోసం బొలీవియా గురించీ, లాటిన్ అమెరికా గురించీ, స్ర్తీవాద ఉద్యమం గురించి చదవడమూ, అనువాదం ఆలస్యం చేస్తున్నానని హెచ్ బిటి నిర్వాహకురాలు గీతా రామస్వామి తొందర పెట్టడమూ, ఇప్పుడు నేనుంటుండిన ఉస్మానియా యూనివర్సిటీ ఓల్డ్ పిజి హాస్టల్ రూం నంబర్ 19 బైట మిత్రులు కె. నరసింహాచారితోనో, గడియారం శ్రీవత్సతోనో, లక్నారెడ్డితోనో  తాళం వేయించుకుని లోపల స్వయం నిర్బంధంలో గబ గబా అనువాదం పూర్తి చేయడమూ.. ఇన్నీ నిన్ననో మొన్ననో జరిగినట్టున్నాయి గాని ఇరవై సంవత్సరాలు. డికెన్స్ ’ఎ టేల్ ఆఫ్ టు సిటీస్’లో అన్నట్టు ‘అది అత్యద్భుతమైన కాలం. అది అత్యంత దారుణమైన కాలం. ఇప్పటికీ కవిత్వమూ, వ్యాసాలూ, కరపత్రాల లాంటి మూడు చిన్న పుస్తకాలు అనువాదం చేసి ఉన్నా నేను అనువాదం చేసిన పూర్తిస్థాయి మొదటి పుస్తకం మా కథే. అందువల్ల ఆ పుస్తకంతో నా అనుబంధం హృదయానికి చాలా దగ్గరిది అయితే ఈ అనుబంధం కేవలం అనువాదకుడిగా మాత్రమేకాదు. అంతకుమించి ఎన్నో స్మృతులను, స్నేహాలను, అవగాహనలను, చర్చలను ఈ ఇరవై సంవత్సరాల వెనుకటి పుస్తకం  దృశ్యాదృశ్యంగా మనసుమీద పరుస్తుంది.

అసలీ పుస్తకం నాకు పరిచయమైన తీరే విషాదం నిండిన రెండు స్నేహ జ్ఞాపకాల గురుతు.

ఎమర్జెన్సీ అనంతర కొత్త ప్రజాస్వామిక చైతన్య వికాసంలో భాగమై ప్రతివారమూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసేలా నడిచిన బొంబాయి పత్రిక సండే అబ్జర్వర్ లో 1982 మార్చిలో అనుకుంటాను. లెట్ మీ స్పీక్ ను మైత్రేయి కృష్ణరాజ్ సమీక్షించారు. అప్పుడే  దేశ దేశాల విప్లవోద్యమాల గురించి, ముఖ్యంగా లాటిన్ అమెరికాలోని కొత్త తరహా ప్రజా ఉద్యమాల గురించి, స్త్రీ సమస్య గురించి, తల మునకలుగా ఆలోచిస్తున్న వాతావరణంలో ఆ సమీక్ష ఒక పెన్నిధిలా కనిపించింది. ఏమయినా సరే ఆ పుస్తకం సంపాదించి చదవాలనే కోరికను పెంచింది.

ఆ తర్వాత ఐదారు నెలలకే ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ఎంఎ ఎంట్రెన్స్ రాయడానికి వెళ్లాను. ఆ రోజుల్లో పివి సుబ్బారావు ఒక ఆదర్శం. ఒక నమూనా.  అప్పటికి ఢిల్లీ విశ్వవిద్యాలయపు గురు తేజ్ బహదూర్ ఖాల్సా కాలేజీలో ఎకనామిక్స్ పాఠాలు చెపుతున్న అపార ప్రజ్ఞాశాలి సుబ్బారావు (సురాగా సుప్రసిద్ధుడు ‘విభాత సంధ్యలు’ ద్వారా తెలుగు సాహిత్య విమర్శలో కొత్త మార్గానికి నాంది పలికినవాడు)ను అనుకరించడానికీ చాలా ప్రయత్నించేవాణ్ణి. నేను ఢిల్లీ చేరే సమయానికి సుబ్బారావు ఏదో నిజనిర్ధారణ కమిటీలో బీహార్ వెళ్లాడు. టాగోర్ పార్క్ లోని సుబ్బారావు ఇంటికి తాళం ఉండడంతో నేను ఇంద్రప్రస్థ కాలేజీ స్టాఫ్ క్వార్టర్స్ లోని సుదేష్ వైడ్ ఇంటికి వెళ్లాను. సుదేష్ ఆ కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్. పీపుల్స్ యూనియన్ ఫర్ డెమొక్రటిక్ రైట్స్ చిరునామా. స్త్రీవాద సాహిత్యం మీద అప్పటికే అధ్యయనం, రచన చేస్తున్నారు.

ఆమె దగ్గర పుస్తకాలలో స్త్రీ సమస్యమీద చాలా పుస్తకాలుండడం చూసి ’లెట్ మీ స్పీక్‘ ఉందా అని అడిగాను. వెంటనే సుదేష్ ఆ పుస్తకం తీసి ఇస్తే ఎంత ఆనందపడ్డానో.

మర్నాడు సుబ్బారావు వచ్చాక ఢిల్లీ స్కూల్ ఎలీటిజం గురించి చెప్పి ఆ క్యాంపస్ కు తీసుకువెళ్లి ప్రొఫెసర్లను పరిచయం చేసి, రాజకీయ విశ్వాసాలూ, ఆచరణా వదులుకోదలచుకుంటే ఢిల్లీ వచ్చే ఆలోచన చేయమన్నాడు. నా అవగాహనలకూ, ఆచరణలకూ సరిపడినవి కాకతీయ, ఉస్మానియ వాతావరణాలే తప్ప ఢిల్లీ స్కూల్ కాదన్నాడు. ఇక ఎంట్రెన్సు కూడా రాయకుండానే తిరుగుదారి పట్టాను.

అట్లా ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదవాలనే కోరికా, ప్రయత్నమూ పోయాయి గాని ’లెట్ మీ స్పీక్‘ చేతికందింది. ఢిల్లీలో చదవడం మొదలుపెట్టి భోపాల్ ప్రాంతాల్లో ముగించగానే దీన్ని  తప్పనిసరిగా తెలుగుపాఠకులకు అందించాలి అనుకున్నాను.

ఇట్లా ఈ పుస్తకం నా చేతుల్లోకి రావడానికి దోహదపడిన ఇద్దరు మిత్రులూ పివి సుబ్బారావు, సుదేష్ వైద్ ఇవాళ లేరు. ఆ తర్వాత మరెన్నో విలువైన రచనలూ, ఆలోచనలూ, ఆచరణా సాగించిన సుబ్బారావు 1993 జనవరిలో గుండెపోటుతో మరణించాడు.  ఆయన తెలుగు రచనల సంకలనం ’సందిగ్ధ సందర్భం‘ ఆ తర్వాత వెలుగుచూసింది గానీ హైదరాబాదు రాష్ట్ర ఆర్ధిక చరిత్ర మీద ఆయన చేసిన కృషి ఇంకా పుస్తకరూపంలోకి రావలసి ఉంది. సుబ్బరావు మరణం నాటినుంచి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చి, సుదేష్ 2001 డిసెంబర్ లో కాన్సర్ తో మరణించింది.

’మా కథ‘ రెండో కూర్పు సందర్భంగా ఆ ఇద్దరి కన్నీటి జ్ఞాపకం.

’మా కథ‘ 1983 లో ఒక ప్రత్యేక సందర్భంలో తెలుగు సమాజంలో ప్రవేశించింది. ఇప్పుడు ఎమర్జెన్సీ అనంతర  ప్రజాస్వామిక ఉద్యమాల వెల్లువలో భాగంగా మహిళా ఉద్యమం విస్తరిస్తుండింది. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా దశాబ్దం చివరి సంవత్సరాలుగా ప్రభుత్వం వైపు నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండింది. అప్పుడప్పుడే  రాజకీయ నిర్మాణాలకు విడిగా ’స్వతంత్ర‘ మహిళా సంఘాలు రూపుదిద్దుకోవాలనే ఆలోచన తలెత్తుతుండింది. రంగనాయకమ్మ ’జానకి విముక్తి‘ వెలువడి స్త్రీ సమస్యల పట్ల దృక్పథాల గురించి, పరిష్కారాల గురించి తీవ్రమైన చర్చలు జరుగుతుండినాయి.

ఆ సంచలన వాతావరణాన్ని ’మా కథ‘ ప్రభావితం చేసింది. ఆ వాతావరణం వల్ల ’మా కథ‘ మీద అనవసరమైన అపోహలూ అభిమానాలూ కూడా పెరిగాయి. కనీసం కొందరయినా ఈ పుస్తకాన్ని అప్పుడే తలెత్తుతున్న ’స్వతంత్ర‘ స్త్రీవాద ఆలోచనలను ఖండించే ’వామపక్ష‘ పుస్తకంగా చూశారు. మరోవైపు దొమితిలా వాదనలలో తగినంత పదును లేదని వామపక్ష కార్యకర్తలలో కొందరయినా భావించారు.

మెక్సికో అంతర్జాతీయ మహిళా సమావేశంమీద తన అభిప్రాయాలు ప్రకటిస్తూ దొమితిలా ’స్వతంత్ర‘ మహిళా ఉద్యమాల మీద కాస్త కటువుగానే విరుచుకుపడింది. కార్మిక కర్షక మైత్రిగురించీ, వామపక్ష పార్టీలనబడేవాటి లోపాల గురించీ, బొలివీయాలో చేగువేరా కార్యాచరణ గురించీ కూడ ఆమె అటువంటి వ్యాఖ్యానాలే చేసింది.

ఈ రెండు దశాబ్దాలలో వంతెన కింద చాల నీళ్లు మాత్రమే కాదు, కన్నీళ్లూ, నెత్తురూ కూడ ప్రవహించాయి, పాత వంతెనలెన్నో కూలిపోయాయి. కొత్త వంతెనలు నిర్మిద్దామనే ప్రయత్నాలు ఇంకా  ఉన్నాయి.

మనుషులెందరో జారిపోయారు. మారిపోయారు, దారిలో ఒదిగిపోయారు. భూగోళం గిరగిరా తిరిగి మొదలయిన చోటికే వచ్చినట్టుంది. దొమితిలా అభిప్రాయాలలో అంగీకరించదగినవేమిటో, కానివేమిటో ఈ ఇరవై సంవత్సరాల అనుభవాలు సానపెట్టి ఉంటాయనే అనుకుంటున్నాను. అందువల్ల ఈ పుస్తకం ప్రాధాన్యత మరింత పెరిగిందనుకుంటున్నాను.

*****

(ఆంధ్రజ్యోతి, జనవరి 19, 2004)

 

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.