నేను ఓడిపోలేదు

  హిందీ మూలం : ఊర్మిలా శిరీష్

   అనుసృజన : ఆర్.శాంతసుందరి

ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చిన్నప్పుడు అక్కడ ఎవరూ లేరు. నల్లటి నిశ్శబ్దం మాత్రం అలుముకుంది.దోమల రొద, తేమ వాసన గదినిండా పరుచుకునుంది.బైట వర్షం ఆగిపోయింది,కానీ నీళ్ళు పారుతున్న చప్పడూ, చినుకుల చిటపటలూ ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.రోడ్డుమీద మనుషుల సందడి వినిపిస్తోంది.ఆమె తన కళ్ళని చేత్తో తడిమింది…నిద్రపోతున్నానా, మేలుకునే ఉన్నానా… ఒక్క క్షణం పాటు అయోమయంగా అనిపించింది.ఇంకేదో రహస్యలోకం తన చుట్టూ ఉన్నట్టు…అంతలో జీన్స్ ప్యాంటు కాళ్ళకిందికి జారి ఉండటం చూడగానే కరెంటు షాక్ కొట్టినట్టయింది.ఆమె తన మనసునీ, అవయవాలనీ తడిమి చూసుకుంది… ఒంటిమీద గాయాలు…గోళ్ళతో రక్కినట్టు, పళ్ళతో కొరికినట్టు చర్మం మీద… ఒక్కసారిగా నొప్పి లేచింది, మృదువైన రెమ్మని పదునైన కత్తితో పొడిచినట్టు.ఆమె గట్టిగా కేకలు పెట్టింది…లేదు…లేదు… నాకిలా జరిగే అవకాశమే లేదు…ఇది పీడకల కాదు … ఇదంతా జరిగింది నాకే…ఇది వాస్తవం… మెలకువలో తెలిసిన నిజం. ఆమె పిడికిళ్ళు బిగించి తలమీద గట్టిగా కొట్టుకుంది… ఇదేం మూర్ఖత్వం? ఏమిటీ ఆలోచనలు? థియేటర్ లో కూర్చున్నానా? సినిమా దృశ్యాలు అర్ధచేతనలో మనసులో తిరుగుతున్నాయా… అవన్నీ నాకే జరిగాయని గ్రహించాను .

ఈ చోటు…గాయాలతో నిండిన తన శరీరం…ఒక్కొక్కటిగా దృశ్యాలు స్పష్టంగా కళ్ళముందుకు రాసాగాయి.బైట భయంకరమైన తుఫానులాంటి వర్షం.నింగీ నేలాఒకే రంగులోకి మారిపోయాయి.ఎదుటి వ్యక్తి కనిపించనంత పెద్ద వర్షం. వర్షంతో బాటు గాలి కూడా వేగంగా వీస్తూ ఉంటే రెండు సార్లు జారిపడబోయి నిలదొక్కుకుంది తను.తనకి బాగా తెలిసిన, రోజూ చూసే రోడ్లే. అదే వేళకి బ్యాడ్ మింటన్ ప్రాక్టీస్ చేసి ఇంటికి వెళ్తుంది.దారిలో అవే ఆఫీసులు, అవే ఇళ్ళు.కాసేపు అక్కడ నిలబడి అలసట తీర్చుకోవాలనిపించింది.ఇంతలో దోవలో ఎక్కడా ఆగద్దని అమ్మ చేసిన హెచ్చరిక గుర్తొచ్చింది.కానీ అంత కుండపోత వర్షంలో ఎక్కడైనా నిలబడటమే మంచిదనిపించింది ఆమెకి. ఇంకా చాలామంది వర్షానికి భయపడి అక్కడ ఆగారు. వర్షం జోరు ఆగేట్టు లేదు. రోడ్లన్నీ నదులలా మారిపోయాయి…ఒకటే ప్రవాహం.చీకటైపోతోంది. ఆమెకి భయం వెయ్యసాగింది.ఇక బైలుదేరాలి, ఏమైతే అదే అవుతుంది.అసలు ఈరోజు తనకి అచ్చిరాలేదు.ఆమె స్కూటర్ స్టార్ట్ చేసేందుకు కిక్ ఇచ్చింది. అది స్టార్ట్ అవలేదు. అక్కడ నిలబడి ఉన్న ఒక వ్యక్తిని, ” మీరు కాస్త స్కూటర్ స్టార్ట్ చేసి పెడతారా?” అని అడిగింది.రైన్ కోట్ వేసుకున్నా అతను పూర్తిగా తడిసిపోయిఉన్నాడు.

“ప్లగ్ లోకి నీళ్ళు వెళ్ళుంటాయి,” అన్నాడతను.

“ఇక్కడ ఫోనేదైనా…?”

“ఎదురుగా అక్కడుంది.”

ఆమె రోడ్డు దాటేందుకు గబగబా పరిగెత్తింది.కానీ అక్కడ ఇద్దరు కుర్రాళ్ళుండటమ్ చూసి వెనక్కి వచ్చేసింది.ఎందుకో అక్కడికెళ్ళటం మంచిది కాదనిపించింది.ఆ కుర్రాళ్ళు ఆమె వెనకాలే వచ్చి నిలబడ్డారు.అప్పుడక్కడ కొద్దిమందే ఉన్నారు. ఉన్నట్టుండి షట్టర్ మూసిన చప్పుడైంది.ముందు అది ఉరుముల చప్పుడు, ఎక్కడో పిడుగు పడిందని అనుకుంది. కన్ను పొడుచుకున్నా ఏమీ కనిపించనంత చీకటి. “షట్టర్ ఎందుకు మూశారు, తెరవండి ?” అంటూ పరిగెత్తి దాన్ని తెరిచేందుకు ప్రయత్నించింది.కానీ బలమైన చేతులు ఆమెని పట్టుకుని తమవైపు నిర్దయగా లాగాయి.ఆమె కేకలు భోరుమని కురిసే వర్షం చప్పుడులో కలిసిపోయాయి.అవి ప్రవహించే కాలవ నీళ్ళలో కలిసిపోయాయి.శాయశక్తులా పెనుగులాడినా ఆమె తనని తాను రక్షించుకోలేకపోయింది.తుఫాను తాకిడికి కూలిపడిన చెట్టులా నేలమీద పడిఉండిపోయింది… పిండేసిన పండు తొక్కలా అశక్తురాలై…లేచేందుకు ప్రయత్నించింది కానీ తొడల్లో ఎవరో ఎర్రగా కాల్చిన ఇనపకడ్డీలు గుచ్చినట్టు భరించలేని బాధ…మరుక్షణం ఆమె గొంతులోంచి ఆర్తనాదం ఉబికింది…అది తన జీవితాన్ని ఏ విధంగా మార్చేస్తుందో అప్పుడామెకి తెలీదు.

ఆమె వేసిన కేక సైకిల్ మీద ఆ దారంట వెళ్తున్న ఒకతనికి వినిపించింది.షట్టర్ ఆమె పెట్టిన కేకకి దడదడలాడి, ఆ ఇనప షట్టర్ ని చీల్చుకుని బైటికి వినిపించింది.అతను అది విని ఆగి వెనక్కి వచ్చాడు.కేక ఎక్కణ్ణించి వచ్చిందా అని ఇటూ అటూ చూశాడు. అతనికి మూసిన షట్టర్ కనిపించింది.దానికి తాళం వేసి లేదు. అందులోంచి వచ్చిందా ఆ కేక, అనుకుంటూ అతను షట్టర్ ని పైకి లేపాడు.

” నన్ను ఇంటిదగ్గర దింపుతారా?” ఎదురుగా ఉన్న అమ్మాయి బతిమాలింది. ఒక్క క్షణం ఇతను కూడా తనమీద దాడి చేస్తాడేమో అని భయం వేసింది.అతను మాత్రం ఆశ్చర్యంగా ఆమెకేసి చూస్తూ ఉండిపోయాడు.ఏమైందో చూసేందుకు కొంతమమ్ది అక్కడ గుమిగూడారు.వర్షం తగ్గుముఖం పట్టింది.

“ఫోన్ నంబర్ చెప్పు, మీ ఇల్లెక్కడుంది?”

కొంతసేపట్లో అమ్మాయి తండ్రి అక్కడికొచ్చాడు.కూతురికి ఆక్సిడెంటయిందని అనుకున్నాడాయన.కానీ ఇక్కడ కనిపించింది వేరు.ఆయన కాళ్ళకింది భూమి కంపించింది. శిథిలమైపోయిన ఒక శిలాఖండం ఎదురుగా కనిపించింది. చుట్టూ ఉన్నవాళ్ళ గొంతులు రహస్యంగా , ” ఎంత ఘోరం … ఎవరా మృగాలు? ఎవరూ ఈ పిల్లని కాపాడేందుకు రాలేదా?ఒంటరిగా ఉందని చూసి…ఇప్పుడేం చేస్తారు? పాపం, పిల్ల జీవితం నాశనమైపోయింది …!”

” అయినా ఈరోజుల్లో అమ్మాయిలు కూడా చెప్పినమాట వినటమ్ లేదు.ఇష్టమొచ్చినట్టు తిరుగుతారు.”

“ఇలా జరుగుతుందని అనుకుంటారా వాళ్ళు?”

“అరే, ఈపిల్ల వర్మగారి కూతురు కదూ…ఆయన కుటుంబం పరువు బజారుపాలైనట్టే.”

పిల్ల తండ్రి కళ్ళెత్తి చూడలేకపోతున్నాదు.పెదవులు చనిపోయినవాడి పెదవుల్లా తడారిపోయి బిగుసుకుపోయాయి.కారు తలుపు తీసి, అమ్మాయిని ఈడ్చుకుపోతున్నట్టు కారు దగ్గరని తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టాడు. మరుక్షణం అక్కడి నేల విచ్చిపోతుందా అన్నట్టు వేగంగా కారు నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. తల్లీ, మిగిలిన వాళ్ళూ గేటు దగ్గర నిలబడి వీళ్ళకోసం ఎదురుచూస్తున్నారు.ఆయన కారు ఇంటి గుమ్మం ముందు ఆపాడు. ఆ అమ్మాయి చాలా కష్టం మీద కాళ్ళు ఈడ్చుకుంటూ , తడబడుతూ నడిచింది.కొన్ని అడుగుల్లో లోపలికి చేరుకునేదే, కానీ అందరూ ప్రశ్నల వర్షం కురిపించసాగారు.

“ఏమైంది? దెబ్బలెక్కడ తగిలాయి? ” “యాక్సిడెంట్ చేసినదెవరు? ” “ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్ళలేదు?” ఇంతలో వాళ్ళకి ఆకాషం దద్దరిల్లేలా ఆర్తనాదం వినిపించింది.ఆ పిచ్చి కేకలు ఆగటం లేదు…నదీ జలాలు లోయలోకి వేగంగా పడుతున్నట్టు శోకాలు…ఆ ఏడుపు అందరి మనసుల్నీ కలవరపెడుతోంది…ఆమెవైపు చూడలేక మొహాలు పక్కకి తిప్పుకుంటున్నారు.

పక్క గదిలో అమ్మాయి పక్కమీద బోర్లా పడుకునుంది…గాయపడిన పిట్టలా విలవిలలాడుతోంది.ఆమె అక్క ఆమెని పదివిపట్టుకుంది.ఏం జరిగిందో అర్థమవటం అంత కష్టమేమీ కాదు.ఆ అందవికారమైన వాస్తవం అందర్నీ బాధించింది. ఒక్కొక్కరుగా ఇరుగూ పొరుగూ బైటికెళ్ళిపోయారు.సానుభూతిపూర్వకమైన మాటలు నాలుక దాటలేదు.జాలి చూపులు చూస్తూ మౌనంగా వెళ్ళిపోయారు.బైట అకస్మాత్తుగా పూర్తి నిశ్శబ్దం ఆవరించింది. ఇంటి గేటుకి తాళం పడింది. గది తలుపులు మూసేసి ఫ్యాను ఫుల్ స్పీడ్ లో పెట్టారు. అది గిరగిరమని పెద్ద శబ్దం చేస్తూ తిరగసాగింది.తండ్రి మనసులో దాన్ని చీలికలు వాలికలు చేస్తూ మరో ఫ్యాను తిరుగుతోంది. ‘ఇప్పుడేం చెయ్యాలి?’ అని తల్లడిల్లిపోసాగాడాయన.ఆయన ఎదురుగా భార్య కళ్ళు దించుకుని కూర్చుంది. పైన పెద్ద కొండంత బరువున్నట్టు మనిషి కుంగిపోయింది.కళ్ళనుంచి కన్నీళ్ళు ధారలు కడుతున్నాయి. అంత మౌనంగా ఏడవటం సాధ్యమా? పక్షవాతం వచ్చినట్టు కొయ్యబారిపోయి ఉందామె. ఆమె కాలిమీద తట్టాడు, కానీ ఆమెలో చలనం లేదు. ఆమెకేమైందోనని భయపడిపోయాడు.

అమ్మాయి అక్క ఒకసారి మమ్చినీళ్ళూ, ఒకసారి టీ, బట్తలూ ఆ గదిలోకి తీసుకెళ్తోంది.ఉన్న వాళ్ళందరూ మూగవాళ్ళలా మాటామంతీ లేకుండా ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు.ఏమనాలి? ఎలా మాట కదపాలి?

అమ్మాయి అన్న మొదట నోరు విప్పాడు.” వాళ్ళెవరో గుర్తుపట్తగలవా?” అని అడిగాడు చెల్లెల్ని.అతని మొహం కందగడ్డలా ఉంది, కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయి.అతను చూసిన సినిమాల్లో దృశ్యాలు గుర్తుకు రాసాగాయి, కానీ ఇది వాస్తవం, కళ్ళముందు చెల్లెల్ని ఈ స్థితిలో చూడటం అతన్ని అమితమైన వ్యథకి గురిచేస్తోంది.

“ఇప్పుడేం మాట్లాడద్దు,” అంది చెల్లెలికి సపర్యలు చేస్తున్న అక్క. ఆమె గొంతు గద్గదంగా పలికింది. ఆమె చేతిలోని వస్తువులు కింద పడిపోతున్నాయి. నెలల తరబడి మంచంపట్టి లేచినదానిలా ఎంతో బలహీనంగా కనిపిస్తోంది.

చీకటి మరింత చిక్కబడింది…వాళ్ళ దుఃఖంలాగే.ఆకాశంలో ఇంకా మేఘాలు కమ్ముకునే ఉన్నాయి. దీపం చుట్టూ పురుగులు ఎగురుతున్నాయి.అక్కడక్కడా వర్షం నీరు మడుగులు కట్టింది. అంతటా వానపాములు…ఎర్రటి వానపాములు కనిపిస్తున్నాయి.ఇంట్లో శవం లేచినట్టు నిశ్శబ్దం.కానీ ఎవరైనా చనిపోయినప్పుడు కూడా కొన్ని మాటలు వినిపిస్తాయి.అందరూ కలిసి ఏడుస్తారు, దుఃఖాన్ని పంచుకుంటారు.కానీ ప్రస్తుతం ఒకరితో ఒకరు మాట్లాడటం అటుంచి ఒకదగ్గర కూర్చోవటానికి కూడా జంకుతున్నారు.

అదే పనిగా ఫోన్ మోగుతూనే ఉంది.

పిల్ల తండ్రికి చిరాకొచ్చి రిసీవర్ తీసి పక్కన పెట్టేశాడు.

” రిపోర్టు చెయ్యాలేమో…” అన్నాడు కొడుకు.

“జరిగిన అవమానం చాలదా?” అన్నాడు తండ్రి .

” మెడికల్ …? డాక్టర్ శోభకి ఫోన్ చెయ్యండి.వీలైతే ఆమె దగ్గరకి తీసుకెళదాం.”

తండ్రి జవాబు చెప్పలేదు.

“ఈప్పుడేం చెద్దాం నాన్నా?” అంటూ తల పట్టుకున్నాడు కొడుకు.

తల్లి మనసు కకావికలైపోతోంది…ఆమె ఒక మగతలోకి జారిపోయినటు కనిపిస్తోంది…

“నీకేమైనా చెప్పిందా?” అని అడిగి,” మీ అమ్మని కూడా డాక్టర్ కి చూపించాలేమో…అమ్మకి ఏమైనా అయితే?” అన్నాడు తండ్రి.

” ఏమీ మాట్లాడటం లేదు నాన్నా. ఊరికే కాసేపు కేకలు పెడుతుంది, మళ్ళీ ఆపేస్తుంది. కాస్త కుదుటపడితే గాని ఏమీ అడగలేం…నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను,” అన్నాడు కొడుకు.

” దాన్ని ఒంటరిగా బైటికి వెళ్ళనివ్వద్దని మీ అమ్మకి ఎన్నోసార్లు చెప్పాను, వింటే కదా? ఈలోకం మహా చెడ్డది, ఎవర్నీ నమ్మే రోజులు కావు,అయినా…” అంటూ గొంతు పూడుకుపోవటంతో ఆయన మాట్లాడలేకపోయాడు.కళ్ళలో శూన్యం నిండింది.భవిష్యత్తు కళ్ళముందుకొచ్చి నిలబడింది. బైటికెళ్తే నలుగురూ ఏమేం ప్రశ్నలు వేస్తారోనని భయం. ఈపిల్లకి ఇక పెళ్ళెలా అవుతుందో నన్న భయం. ఒకవేళ ఎవరైనా చేసుకుందామని ముందుకొచ్చినా మిగిలినవాళ్ళు ఏవేవో చెప్పి ఆ మనిషి మనసు విరిచేస్తారేమోనని ఇప్పట్నించే ఆందోళన.పోనీ పెళ్ళి చెయ్యకుండా తెలిసినవాళ్ళెవరూ లేని కొత్త చోటికి పంపించెయ్యచ్చు కానీ అదెలా సాధ్యం. వెళ్తే అందరూ వెళ్ళిపోవాలి. అలా చేసినా కూతురికి ఇలా జరిగింది కాబట్టే వర్మ పెళ్ళాం పిల్లలతో ఊరొదిలి వెళ్ళిపోయాడని నలుగురూ చెప్పుకుంటారు.

ఆలోచనలు కుదిపేస్తూ ఉంటే ఆయన గుండెల్లో ఏదో అలజడి మొదలైంది.ఊపిరి తీసుకోవటం కష్టమనిపించింది…గుండెల్ని చేత్తో గట్టిగా రుద్దుకున్నాడు.’అయ్యో తల్లీ , నీ బతుకు ఇలా అయిందేమిటమ్మా!’ అంటూ మనసు రోదించింది.గాలి పీల్చుకునేందుకు లేచి బైటికి పరిగెత్తాడు.బైట చిమ్మచీకటి. చాలాసేపు అక్కడే నిలబడ్డాడు.లోపలికెళ్ళి తన చిట్టితల్లిని గుండెలకి హత్తుకుని ఓదార్చాలని మనసు కొట్టుకుంది.కానీ మరుక్షణం గబగబా ఇంట్లోకి వెళ్ళి ఇంతక్రితం కూర్చున్న కుర్చీలోనే కూలబడ్డాడు. రాత్రంతా అలా జాగారం చేస్తూనే గడిపాడు.

ఇలాంటి వార్తలు దావానలంలా వ్యాపిస్తాయి.మర్నాడు ఉదయం నుంచే దగ్గర స్నేహితులు రావటం మొదలైంది. వాళ్ళ మొహాల్లో ఒకరకమైన అయోమయం.ఏమని అడగాలి, ఎలా ఓదార్చాలి అనేది తెలీని స్థితి.

” ఏమైనా ఆచూకీ తెలిసిందా? రిపోర్ట్ చేశారా? అయిందేదో అయింది, ఇక అమ్మాయిని ఎలా సముదాయించాలో ఆలోచించండి. ఈ సంఘటనవల్ల ఆపిల్ల మనసుమీద భయంకరమైన ప్రభావం పడుతుందేమో,” అన్నారొకరు.

మరొకరు,” నాకు గాని కనిపిస్తేనా, తుపాకీతో కాల్చిపారేస్తాను వెధవలని,” అన్నారు.

“ఈలోకం ముందుకెళ్తున్నకొద్దీ భద్రత కొరవడుతోంది.”

“ఆడపిల్లల మానం కాపాడలేని ఈ లోకం ఉండేం లాభం?”

“అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది?” అడిగాడొక స్నేహితుడు.

” ప్రస్తుతం షాక్ నుంచి తేరుకోలేదు,” అన్నాడు తండ్రి.

“డాక్టర్ కి చూపించారా?”

“ఆఁ, రాత్రి వచ్చి చూసి వెళ్ళింది.”

“అసలు అమ్మాయి బైటికెక్కడికెళ్ళింది?”

” బ్యాడ్ మింటన్ ఆడి ఇంటికి వస్తున్నప్పుడు…”

“ఎంతమంది వాళ్ళూ?”

అటువంటి సమయంలోఅడగకూడని ప్రశ్న హఠాత్తుగా ఎదురయేసరికి  లోపల ఏదో కాలి బూడిదైపోయినట్టనిపించింది ఆయనకి. బాణాలు సంధించినట్టు అలా ప్రశ్నలు వేసినప్పుడల్లా తనలో కొంతభాగం భస్మమైపోయినట్టు అనిపిస్తుందాయనకి.దించిన కళ్ళు పైకెత్తలేకపోయాడు. లేచి లోపలికెళ్ళిపోయాడు. అప్పటికి గాని ఆ మనిషికి తను అడిగిన ప్రశ్న ఆయన్ని ఎంత బాధపెట్టిందో అర్థం కాలేదు.అలా అడిగినందుకు నొచ్చుకున్నాడు.లోపలికి వెళ్ళి ఆయన భుజం మీద చెయ్యివేసి, ” మీరే ఇలా బెంబేలు పడిపోతే మిగిలినవాళ్ళేమవాలి? చిన్నప్పట్నుంచీ తెలిసిన పిల్ల, నా కూతురికే ఇలా జరిగిందన్నంత బాధగా ఉంది నాకు.కానీ మీరు దీన్ని ఎదుర్కోక తప్పదు కదా?”అన్నాడు.

“ఏం చెయ్యాలి? ఎక్కడికి తీసుకుపోవాలి దాన్ని?” అన్నాడు కన్నీళ్ళు కారుస్తూ. తండ్రి చనిపోయినప్పుడు కూడా ఆయన ఇంతగా ఏడవలేదు.అంతకన్నా బాధాకరమైన స్థితి ఇది.

ఎవరూ ఇంట్లోంచి బైట అడుగుపెట్టటం లేదు. అమ్మాయి అన్న మాత్రం సంఘటన జరిగిన చోటికి రెండు మూడు సార్లు వెళ్ళి వచ్చాడు.’ఒక్కసారి వాళ్ళు నాకు దొరకనీ, వాళ్ళ పనిపడతాను. గద్దలూ, కాకులూ పీక్కుతినేట్టు ఎవరూ లేని నిర్మానుష్యమైన చోటికి తీసుకెళ్ళి చంపుతాను !’ అనుకున్నాడతను.

‘ బైటికెళ్ళేందుకు ఎవరేమనుకుంటారో అన్న భయం లేదు నాకు. నా స్నేహితులందరూ మంచివాళ్ళు, మా బాధ అర్థం చేసుకోగలరు. కావాలంటే ఆ వెధవలని పట్టుకునేందుకు సాయం కూడా చేస్తారు. వాళ్ళలో ఎవరికైనా ఆ దుర్మార్గుల ఆచూకీ తెలుసేమో అడగాలి.అతని ఒళ్ళంతా తేళ్ళూ జెర్రులూ కుట్టినట్టు బాధపెట్టసాగింది. విషం ఒళ్ళంతా పాకినట్టు ఒకటే బాధ. తిండి సయించదు, నిద్ర పట్టదు.చెల్లెలంటే అమితమైన ప్రేమ, మంచి ప్లేయర్ అని గర్వం.అతనే పట్టుబట్టి బ్యాడ్ మింటన్ లో జాయిన్ చేశాడు.

నెమ్మదిగా లేచి వెళ్ళి గదిలోకి తొంగిచూశాడు. చెల్లెలు పక్కకి ఒత్తిగిలి పడుకునుంది.ఇంకొకప్పుడైతే చప్పుడు చెయ్యకుండా వెనకనించి వెళ్ళి పిడికిలితో గుద్దేవాడే.ఆ రోజు ఏమేం చేశాడో చెప్పేవాడు.తను చెప్పేది వినేవాడు.ఆమె స్నేహితురాళ్ళమీద జోకులు వేసేవాడు.ఆమె అతనికి కాఫీ కలిపి తెచ్చేది. కాఫీ బాలేదనో, వేడిగా లేదనో అల్లరిగా ఏడిపించేవాడు. కానీ ప్రస్తుతం తన అడుగుల చప్పుడు వినిపిస్తుందేమో అన్న భయంతో అక్కడే ఆగిపోయాడు.ఏం జరిగిందని మా మధ్య ఇంత దూరం ఏర్పడింది?పరిగెత్తుకెళ్ళి చెల్లెల్ని కావిలించుకోవాలన్న కోరిక కలిగింది.ఓదార్చాలనిపించింది,కానీ కాళ్ళు మంచుదిమ్మల్లా గడ్డకట్టాయి.లోపలేదో లోహం కరుగుతున్న భావన.అతను నిస్సహాయంగా నిలబడిపోయాడు.ఏవో పరాయి శరీరాల్ ఆమెమీద దాడి చేశాయి అనుకోగానే అతని నోటివెంట బండబూతులు వచ్చాయి.కోపంతో మండిపడుతూ వాళ్ళని శాపనార్థాలు పెట్టాడు. అలసిపోయి మంచం మీద అడ్డంగా పడ్డాడు. తల పగిలిపోతోంది.నరాలు చిట్లిపోతున్నంత బాధ. అక్క గొంతు సన్నగా వినిపిస్తోంది,” ఇందులో నీ తప్పేముంది? మేమందరం లేమూ? అదొక యాక్సిడెంట్,అంతే.వాళ్ళకి తప్పక శిక్ష పడుతుంది…పడాలి.” ఆ తరవాత ఆ నిశ్శబ్దమైన చీకట్లో చెల్లి పెట్టే వెక్కిళ్ళు గోడ అవతలినుంచి వినిపించాయి.

ఇష్టం లేకపోయినా స్నేహితులూ, బంధువులూ ఒత్తిడి చెయ్యటంతో పోలీస్ స్టేషన్ లో ఎఫ్ ఐ ఆర్ నమోదు చెయ్యక తప్పలేదు. డాక్టర్ శోభ మెడికల్ రిపోర్ట్ ఇచ్చింది.ఎస్.టీ.డీ.-పీసీఓ, షటర్ ఉన్న స్థలాన్ని పోలీసులు సీల్ చేశారు.అమ్మాయి ఈ పనులన్నీ యాంత్రికంగా, ఎవరేది చెపితే అది చేస్తోంది.కానీ మనసు లోతుల్లో ఆ సంఘటన తాలూకు దృశ్యాలు మాత్రం తిరుగుతూనే ఉన్నాయి.ఒకసారి జరుగుతున్నదంతా కల అనీ, లేవగానే అక్కకి అన్నీ చెప్పేస్తాననీ అనుకుంటుంది.మళ్ళీ ఇదంతా నిజంగా జరుగుతోందన్న స్పృహ రాగానే , అది తన ఇల్లు,తన గది అనీ, మూగదానిలా అమ్మ ఎప్పుడూ మౌనంగా ఇంట్లో తిరుగుతోందనీ అర్థమవుతుంది.అన్న ఇంట్లోంచి చాలాసార్లు బైటికి వెళ్తాడనీ, పిచ్చివాడిలా ఎక్కడెక్కడో తిరుగుతాడనీ, అతని కళ్ళలో ఎప్పుడూ అగ్నిజ్వాలలు రగులుతూ ఉంటాయనీ గమనించి ఆమె వణికిపోతుంది.

ఆమె మనసు నిరాశతో, వ్యథతో కుంగిపోతుంది.ఎంతో చెప్పలనుంటుంది, కానీ నోరు పెగల్దు.మాట్లాడాలని నోరు తెరిస్తే నాలుక పిడచకట్టుకుపోతుంది. బైటి ప్రపంచం గురించి ఆలోచిస్తే చాలు, అవే భయంకరమైన దృశ్యాలు కళ్ళముందు కదలాడతాయి.కళ్ళు మూసుకుంటే తను బ్యాడ్ మింటన్ ఆడే కోర్టూ, కాలేజీ, అక్కడి స్నేహితులూ  కనిపిస్తారు. అక్కడికి వెళ్ళాలని మనసు పీకుతుంది, అంతలో అక్కడ వాళ్ళు ఏమేం అడుగుతారోనని భయం వేస్తుంది.

‘ అసలేం జరిగింది?’

‘ ఆ ఊరకుక్కలతో పోరాడలేదా నువ్వు?’

‘పారిపోలేకపోయావా?’

‘వాళ్ళెవరు…ఎలాంటివాళ్ళు?’

‘ఇంత చిక్కిపోయావేమిటి?’

ఆ ప్రశ్నలడిగేప్పుడు వాళ్ళ మొహాల్లో ఎలాంటి భావాలు కనిపిస్తాయని ఊహించసాగింది… సానుభూతి, జాలి, కుతూహలం , బహుశా వెక్కిరింపు కూడానేమో! బైటికి ఎక్కడికెళ్ళినా, ‘ ఈపిల్లకే కదూ అలా జరిగింది?’ అనే మాటలే వినిపిస్తాయి. భగవంతుడా, ఇప్పుడు నా అస్తిత్వం మొత్తం ఆ ఒక్క సంఘటనలోనే కుదించుకుపోయిందా?ఇంకేమీ లేదా? లేదు, అలా జరగటానికి వీల్లేదు.నేను పారిపోతాను…ఈ లోకానికి దూరంగా వెళ్ళిపోతాను…ఇలాంటి గుర్తింపు నాకక్కర్లేదు…కానీ మనసునేం చేస్తాను? అది నావెంటే ఉంటుందే !

ఆ అమ్మాయి లేచి నిలబడింది… ఒక్కసారి నిలువెల్లా వణికిపోయింది.చేత్తో  చెవులు మూసుకుని లోపలి రొదని అణిచెయ్యాలని ప్రయత్నించింది…గది గుండ్రంగా తిరుగుతున్నట్టనిపించింది.ఆకాశం కిందికి జారిపోతున్నట్టూ, భూమి కుంగిపోయి పాతాళంలోకి దిగిపోతున్నట్టూ అనిపించింది.అంధకారంలో చిక్కుకుని ఎక్కడికో లోతుల్లోకి జారిపోతున్న భావన.నన్నెవరైనా పట్టుకోండి, పడిపోతున్నాను…మనసు ఆర్తనాదం చేస్తోంది.కానీ మాటలు సుడిగుండంలో చిక్కుకుని బైటికి రాలేకపోతున్నాయి.

అలా కొంతసేపు గడిచాక అక్క వచ్చి ఆమెకి గ్లూకోజ్ నీళ్ళు తాగించింది, తలకి నూనె రాసింది, హఠాత్తుగా కళ్ళవెంట నీళ్ళు కారసాగాయి ఆ పిల్లకి.ఇంటి గడప దాటి…అసలు తన గది దాటి నాలుగు వారాలయింది.సూర్యుడు ఉదయించటం చూడలేదు, ఎండ వెల్తురు చూడలేదు.సాయంకాలం ఆకాశంలో మారే రంగులు చూడలేదు.గదిలోనే బందీగా ఉండిపోయింది.గదిలోంచి బాత్ రూమ్ వరకే ఆమె వెళ్ళేది.ఈ నెలరోజుల్లో ఆమె ఎవరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు.చివరికి తండ్రిని కూడా చూడలేదు.ఎప్పౌడైనా ఆయన పైకి వచ్చినా, ఆయన గొంతు విన్నా గది తలుపు మూసి, నక్కి కూర్చుంటుంది. చివరికి పనిమనిషి కూడా ఆ గదిలోకి రావటం మానేసింది. టీవీ, క్యాసెట్ ప్లేయర్ ల మీద దుమ్మూ ధూళీ పేరుకుపోయింది.

కాలేజీ తెరిచిన నెలరోజుల తరవాత అక్క తనదీ,చెల్లెలిదీ మార్క్ షీట్లు తీసుకురావటానికి కాలేజీకి వెళ్ళింది.ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుతున్నారు.పరీక్షా ఫలితాలు ఎప్పుడు వచ్చాయో అని ఆలోచించే స్పృహ కూడా లేదు వాళ్ళకి.చెల్లెలి క్లాస్ మేట్లకి అక్క కూడా బాగా తెలుసు. ఎవరూ చూడకుండా మార్క్ షీట్లు తీసుకుని జారుకుందామని అనుకునేంతలో అనీషా తనవైపు పరిగెత్తుకురావటం కనిపించింది.

” మీరిద్దరూ కాలేజీకి రావటం లేదేమిటి? ఏమైంది?” అంది అనీషా.

“ఏం లేదు, ఊరికే…”

“నీకు ఒంట్లో బాలేదా? ఏమిటిలా నల్లబడి చిక్కిపోయావు?”

” ఒంట్లో బావుండటం లేదు,” అంది అంతటితో వదిలిపెడుతుందని.

” మీ చెల్లెలికి ఏదో అయిందని మా నాన్న…నన్ను కూడా కాలేజీకి వెళ్ళద్దని ఒకటే గొడవ ఇంట్లో.”

” నువ్వీ మాట ఎవరితోనూ అనలేదు కదా?” అంది అక్క కంగారుగా.

“లేదు, కానీ అందరికీ తెలిసిపోయింది…మీ ఇంటికొచ్చి తనని కలుస్తానని చెప్పు.ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా? పాపం ఎలా ఉందో, వింటేనే ప్ళ్ళు గగుర్పొడుస్తోంది…”

అక్క కొయ్యబారిపోయి అవాక్కయి రాయిలా ఉండిపోయింది.మెదడు మొద్దుబారినట్టయింది. ‘అయితే అందరికీ…మొత్తం క్లాసులోవాళ్ళందరికీ, కాలేజీ మొత్తానికి ఈ సంగతి తెలిసిపోయిందా ? అయితే ఊరంతటికీ కూడా తెలిసిపోయుంటుంది.’ అనుకోగానే ఆమె చేతులూ, కాళ్ళూ వణకసాగాయి.

“తనకి ఎవర్నీ కలవాలని లేదు. అసలు ఇక్కడ లేదు, వేరే చోటికి వెళ్ళిపోయింది,”అనేసి అక్క వేగంగా బైటికి నడిచింది.వెనకనుంచి ఏవో గొంతులు తనని తరుముతున్నట్టు అనిపించి నడక వేగం పెంచింది. గేటు బైటికి రాగానే ఆమెకి ఏడుపు ఆగలేదు. గేటు దిమ్మకి తలానించి వెక్కి వెక్కి ఏడవటం మొదలెట్టింది.రోడ్డుమీద వాహనాల రొదలో ఆమె ఏడుపు ఎవరికీ వినిపించలేదు.ఇక చెల్లెలు గతేమిటి? చచ్చిపోయినా ఈ మచ్చ చెరిగిపోదు కదా !పోనీ దూరంగా ఎక్కడికైనా పంపిచ్చేద్దామంటే అక్కడ తనని ఎవరు చూసుకుంటారు? ఆలోచిస్తున్నకొద్దీ అక్కకి తల తిరిగిపోసాగింది. కన్నీళ్ళు ధారలు కట్టసాగాయి. ఆ దుర్మార్గులని చమ్పెయ్యాలన్నంత కోపంతో రగిలిపోయిందామె.

” అమ్మా, చెల్లిని ఎక్కడికైనా పంపిచ్చేద్దాం…బాబాయింటికో, హాస్టల్ కో.ఇక్కడుంటే దాన్ని బతకనివ్వరు జనం,” అంది అక్క.

“ఒక్కదాన్నీ ఎక్కడికి పంపిస్తాం చెప్పు?” అమ్మ గొంతు బావిలోంచి వచ్చినట్టు బలహీనంగా ఉంది.ఈ మధ్య ఆవిడ చాలా తక్కువగా నోరు విప్పుతోంది.

” హాస్టల్ కి పంపిద్దాం.ఇక్కడ విషయం అమ్దరికీ తెలిసిపోయింది కదా !”

తల్లి శూన్య దృక్కులతో చిన్న కూతురి గది వైపు చూస్తూ,” ఆవేశంలో ఏమైనా చేస్తే? ఆ రోజు నువ్వు చూడలేదా?” అంది గద్గదంగా.

“ఎప్పుడో ఒకప్పుడు బైటికి వెళ్ళక తప్పదు కదమ్మా, ఇంకా ఎంత జీవితం ఉంది…”

అక్క చెల్లెలి గదిలోకి వెళ్ళింది. చెల్లెల్ని చూడగానే మనసు వికలమైపోయింది.చెల్లెల్ని పసిపిల్లలా ఒళ్ళోకి తీసుకుని,” నీ రిజల్ట్ వచ్చింది, సెవెంటీ పర్సెంట్.ఫార్మ్స్ తీసుకొచ్చాను, లేట్ ఫీజ్ తోబాటు డబ్బు కట్టేద్దాం,” అంటూ చిన్నగా నవ్వేందుకు ప్రయత్నించింది.’ మునుపు మేమిద్దరం ఎంత అల్లరి చేసేవాళ్ళం !ఇల్లంతా మా నవ్వులతో, కేకలతో సందడిగా ఉండేది. రాత్రి పొద్దుపోయేదాకా టీవీ లో సినిమాలు చూసేవాళ్ళం, డ్యాన్సు చేసేవాళ్ళం. ఇప్పుడీ మౌనాన్ని ఎలా ఛేదించాలి? అమ్దరం కలిసి కూర్చుని మళ్ళీ ఎప్పుడు భోజనం చేస్తాం? జరిగినదంతా ఎందుకు మరిచిపోవటం లేదు ? కానీ అదెలా సాధ్యం? అందరి మధ్యా ఏదో నల్లటి నీడలాంటిది పరుచుకుంది…’ అనుకుంది బాధగా.

చెల్లెలు మార్క్ షీట్ వైపు చూడనైనా చూడలేదు. అక్క మొహంవైపూ, కళ్ళవైపూ చూస్తూ ఉండిపోయింది.కళ్ళతోనే ఎన్నో ప్రశ్నలు వేసింది. అక్క మొహం పక్కకి తిప్పుకుంది.

” నువ్వు అందర్నీ ధైర్యంగా ఎదుర్కోవాలి.ఎంత బాధగా ఉన్నా తప్పదు.అవమానించినా, ద్వేషించినా, పట్టించుకోకపోయినా, దెప్పిపొడిచినా సరే, అవేమీ పట్టించుకోవద్దు,” అక్క ఆ అమ్మాయికి సలహా ఇచ్చింది.

‘అక్కా ఇవన్నీ చెప్పటం నీకు సులువే,కానీ బాధని అనుభవించింది నేను.ఆ సంఘటన జరిగింది నాకు మాత్రమే.నువ్వు చెప్పినంత మాత్రాన అవన్నీ మర్చిపోగలనా? రోజులు గడిచినకొద్దీ ఆ బాధ మరింత లోతైన గాయాన్ని చేస్తుంది.మెదడులో దానికి సంబంధించిన జ్ఞాపకాలు లేకుండా చేసేందుకు ఏ నరాన్నో కత్తిరించి పారెయ్యగలిగితే ఎంతా బావుంటుంది !ఎదుర్కొన్నంత మాత్రాన ఇవనీ తగ్గిపోయేట్టయితే నేను ఏం చెయ్యటానికైనా సిద్ధమే,’ అని అనాలనుకుంది కానీ ఆపిల్ల మాటలు మనసులోనే ఉండిపోయాయి.

తండ్రి కూతురి గదివైపు వచ్చినప్పుడల్లా ఒకసారి తొంగిచూసి వెల్లిపోతాడు.ఆయన మొహం వడిలిపోయిన చెట్టులా వేలాడిపోయింది.ముడతలు మునుపతటికన్నా ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఆయన నోటివెంట కూతురి పేరు రాదు, ఆ అమ్మాయి కూడా ఆయన ఎదుటికి వెళ్ళేందుకు భయపడుతుంది.

‘ నన్ను ఇంత హింసకి, అవమానానికి గురిచేసినవాళ్ళు హాయిగా తలెత్తుకుని తిరుగుతున్నారు.ఏ తప్పూ చెయ్యని నేను మాత్రం ఇలా బైట మొహం చూపించలేక గదిలో మగ్గుతున్నాను.ఇదెక్కడి న్యాయం?’ అని ఎన్నోసార్లు ఆమె ప్రశ్నించుకుంటూ ఉంటుంది. వాళ్ళ మొహాలు…చీకట్లో కంపుకొట్టే మొహాలు… తనకి తగిలినప్పుడు కొన్ని వేల ముళ్ళు దిగబడినంత బాధ…స్పృహకోల్పోయే స్థితిలో కూడా వాళ్ళు తన శరీరాన్ని పెట్టే హింస తెలుస్తూనే ఉంది. పచ్చని లేత కొమ్మని పదునైన గొడ్డలితో నరికి గాయపరిచినట్టు , అవన్నీ తల్చుకుని తల్చుకుని ఆమె విలవిలలాడిపోతుంది.

అయ్యో ! ఏంచెయ్యను? నాకు స్పృహ తప్పినా బావుండు.చచ్చిపోతే ఇక ఏ బాధా ఉండదు…కాలంలోని ఆ ముక్కని నా మనసులోంచి ఎలా చెరిపెయ్యను? భగవంతుడా నువ్వే నాకు దారి చూపాలి. నాకు చావు ప్రసాదించవా !కోర్టులో రేపు విచారణ జరిగితే నా పరిస్థితి హాస్యాస్పదంగా అయిపోదా ? నేనసలు కోర్టుకే వెళ్ళను…వెళ్ళనా ? లేదు వెళ్ళను గాక వెళ్ళను ! మనసులో ఈ రెండు భావాల సంఘర్షణ జరుగుతోంది. భరించలేక కాళ్ళు గట్టిగా నేలకి తాటించసాగింది… పిచ్చి పట్టినదానిలా అలా చేస్తూ చేస్తూ హఠాత్తుగా ఆగింది.ఎదురుగా తండ్రి.ఒక్క క్షణం కళ్ళలో వణుకు…వేగంగా డాబామీదికి పరెగెత్తి బొక్కబోర్లా పడిపోయింది. నేల మొహామికి చల్లగా తగిలింది. తండ్రి తను కిందే ఉండి తల్లిని పైకి వెళ్ళమన్నాడు. ఆవిడ పెద్దకూతుర్ని పంపించింది.

“ఏమైందే?”

“అక్కా నాన్న కళ్ళలో నా పట్ల ఎంత అసహ్యమో…!”

“అలాటిదేం ఉండదు.అసహ్యం ఎందుకుంటుంది?బాధ, నిస్సహాయత ,వ్యథ ఉంటుందంతే.నిన్ను చూసినప్పుడల్లా ఆయన మన్సులో ఎలాంటి తుఫాను రేగుతుందో నువ్వెప్పుడైనా ఆలోచించావా?నువ్వు నార్మల్ అయితే నాన్న కూడా సర్దుకుంటాడు.కాలమే మన గాయాలని మాన్పుతుంది.జనం ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోతారు చూడు.నాన్న ఇక్కణ్ణించి వేరే చోటికి మకాం మార్చాలని ప్రయత్నిస్తున్నాడు.”

“అందరూ అదోలా చూస్తారు…అడుగుతారు…వెనకాల మాట్లాడతారు.”

“నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది.ఎవరిమీదా ఆధారపడకు.చదువుకో, ఉద్యోగం చెయ్యి.బైటికి వెళ్ళు.అన్నీ అవే సర్దుకుంటాయి.నేనెప్పుడూ నీకు వెన్నుదన్నుగా ఉంటా.నీకు దూరంగా వెళ్ళిపోను,సరేనా?”

“అందరూ మర్చిపోయినా నేను మర్చిపోలేను కదా? ఈ గాయం అలా సలుపుతూనే ఉంటుంది,”అంది చెల్లెలు దీనంగా. అక్క చాలాసేపు చెల్లెలికి నచ్చజెప్పి బైటికి వెళ్ళింది.

తన తమ్ముడు అక్కడ ఊరికే కూర్చుని ఉండటం చూసి, ” కాలేజీకి వెళ్ళలేదా? “అంది. ఇంట్లో వాతావరణాన్ని తేలిక పరచాలని శాయశక్తులా ప్రయత్నిస్తున్నది ఆమె మాత్రమే.

” ఎలా వెళ్ళను చెప్పు? నాకు పిచ్చెక్కేట్టుందక్కా.అందర్నీ ఎలా ఫేస్ చెయ్యాలో అర్థమవటం లేదు.”

“అన్నీ మానేసి ఇలా కూర్చుంటే సమస్య పరిష్కారమౌతుందా?”

” నాకు ధైర్యం చాలటం లేదు…జరిగినదాన్ని తల్చుకుంటే మనసు దహించుకుపోతోంది.చెల్లికి ఇంత ఘోరమైన అనుభవం జరిగినా ఏమీ చెయ్యలేకపోతున్నానే అనే బాధ నన్ను తినేస్తోంది.”

” ఇలా ఆలోచిస్తూ ఉంటే దానివల్ల ఏమైనా లాభం ఉందా? నా మాట విని కాలేజీకి వెళ్ళు. లేకపోతే ఈ యేడాది వేస్టయిపోతుంది.”

” దాని జీవితమే పాడైపోయాక ఒక్క యేడాదిదేముంది…” అన్నాడు.

చివరికి ఎలాగో ఒప్పుకుని కాలేజీకి బైలుదేరాడు.ఇన్నాళ్ళూ స్నేహితులు ఫోన్ చేస్తే ఎత్తేవాడు కాదు.ఇప్పుడు వాళ్ళని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తూ స్కూటర్ స్టార్ట్ చేశాడు.

స్కూటర్ కి స్టాండ్ వేసి ఆఫీస్ వైపు రెండడుగులు నడిచాడో లేదో ఒక స్నేహితుడు ఎదురయ్యాడు.

” ఇన్నాళ్ళూ ఏమైపోయావురా? మనం కలిసి ఎన్నాళ్ళయింది !అడ్మిషన్ తీసుకుంటున్నావా లేదా?ప్రాక్టికల్ క్లాసులు కూడా మొదలైపోయాయి, “అన్నాడు స్నేహితుడు.

“ఊళ్ళో లేనులే, పనిమీద బైటికెళ్ళాను,” అన్నాడు ఉదాసీనంగా.

“ఇంట్లో ఏదైనా సమస్యా?”

అంత పెద్ద సమస్యేమీ లేదు.ఏం ఎవరైనా ఏమన్నా చెప్పారా?” అన్నాడు అనుమానంగా.

“ఏదో అన్నారులే…అయినా అదంతా ఎందుకు గానీ, నువ్వు కాలేజీకి ఎప్పణ్ణించీ వస్తున్నావో చెప్పు.”

“ఏమన్నారు?”

” నీ రిజల్ట్ వచ్చిందిగా? ఎన్ని మార్కులొచ్చాయి?”

“నువ్వేదో అన్నావు…?” అతను ఆవేశంతో వణకసాగాడు.

” అబ్బా, వదిలిపెట్టవు కదా ! అవును విన్నాను. పోలీసు రిపోర్ట్ ఇచ్చారని తెలిసింది.ఎన్నిసార్లు నీకు ఫోన్ చేశానో తెలుసా? ఇద్దరం కలిసి ఆ దరిద్రపు వెధవలని వెతికి పట్టుకుని పోలీసులకి అప్పజెపుదామని అనుకున్నాను…కానీ నువ్వు ఫోనెత్తితే కదా !వాళ్ళ ఆచూకీ ఏమైనా తెలిసిందా?

కాలేజీకి వస్తే ఇలాంటి ప్రశ్నలని ఎదుర్కోవలసి వస్తుందని అతనికి తెలుసు.

” ఏం తెలుసు? ఈ చుట్టుపక్కల వాళ్ళే అయుంటారు.ఇంట్లో భయంకరమైన టెన్షన్,”అన్నాడతను.

“ఇంకేమీ చెప్పకు,ఒకసారి మనచేతికి  దొరకనీ తడాఖా చూపిద్దాం!”అన్నాడు స్నేహితుడు.

ఇంతలో మరో అబ్బాయి వాళ్ళదగ్గరకి వచ్చాడు.అతనూ వాళ్ళ క్లాసే.” ఏమైందిరా ఇంత చిక్కిపోయావేమిటి? ఒంట్లో బాగాలేదా? ఒక్క క్షణం గుర్తుపట్టలేకపోయానంటే నమ్ము.ఇంట్లో అందరూ బావున్నారు కదా? సిస్టర్స్ ఎలా ఉన్నారు?” అని అడిగాడు.

అంతలోకే అతని క్లాస్ మేట్లు చాలామంది అతన్ని చుట్టుముట్టారు.

” వాడు ఒక్కడేనా, ఎక్కువమంది ఉన్నారా?” అన్నాడొకడు.

అంతే అన్నకి నసాళానికంటింది,” నోరు ముయ్యండిరా మీకు పుణ్యం ఉంటుంది !” అని గట్టిగా అరిచేసరికి అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళు కూడా తలతిప్పి చూడసాగారు.

“సారీ రా, తప్పైపోయింది ఏమనుకోకు.నీ చెల్లెలు నాకూ చెల్లెలేగా? నీకెలా అనిపిస్తోందో అర్థం చేసుకోగలను.నీ చెల్లెలికి ఇలాంటిది జరిగితే మేమేమీ అనకుండా, చెయ్యకుండా చేతులు ముడుచుకు కూర్చోటం సరికాదు…”అన్నాడు ఆ స్నేహితుడు అన్న చేతులు పట్టుకుని సానుభూతి కనబరుస్తూ.అయినా అన్న అక్కడ మరొక్క క్షణం ఉండలేకపోయాడు. స్కూటర్ స్టార్ట్ చేసి వేగంగా ఇంటికి వచ్చేశాడు.

గబగబా మెట్లెక్కి పైకి వచ్చి చెల్లెలి గది తలుపు తెరిచాడు. పడుకునున్న చెల్లెలి చెయ్యిపట్టుకుని లాగుతూ, ” పద,చెప్పు వాళ్ళెవరో. గుర్తుతెచ్చుకో. నేను బైట మొహం చూపించలేకపోతున్నాను. అవతలి వాళ్ళు జాలి చూపిస్తూంటే భరించలేకపోతున్నాను.ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుని వాళ్ళెవరో చెప్పు, వాళ్ళ అంతుచూస్తాను…” అన్నాడు విపరీతంగా ఆవేశపడిపోతూ.

నన్ను వదిలెయ్యరా…నేనెక్కడికీ రాను…” అంది చెల్లెలు దీనంగా.

“నీకేమైనా మతిపోయిందా? ఎక్కడికి లాక్కెళ్తున్నావు దాన్ని?” అంది అమ్మ ఇద్దర్నీ విడదీసేందుకు ప్రయత్నిస్తూ.

అతను తల్లిని కూడా విసురుగా తోసేశాడు. ఆ గొడవ విని అక్కా, తండ్రీ అక్కడికొచ్చారు,” వదిలెయ్…దాని చెయ్యి వదుల్తావా లేదా,” అని తండ్రి కొడుకుని ఒక్క తోపు తోశాడు.

” ఏమిటి నాన్నా ఈ బతుకు? బైట మొహం చూపించేందుకు లేకుండా ఉంది. అందరూ అదే ప్రశ్న…నాకు పిచ్చెక్కేట్టుంది.మనం ఈ ఊళ్ళో ఇక ఉండద్దు నాన్నా…” అంటూ అతను గోడమీద పిడికిళ్ళతో కొడుతూ అంతలోనే వెక్కె వెక్కి ఏడవటం ప్రరంభించాడు.

” అందుకని ఏ తప్పూ చెయ్యని చెల్లెలిమీద చూపిస్తావా నీ ప్రతాపం? దానికి ధైర్యం చెప్పటం పోయి ఇలా పీడించుకు తింటున్నావేమిట్రా?” అంది అక్క గట్టిగా అరుస్తూ.

చెల్లెలు బిక్కచచ్చిపోయినట్టు ముడుచుకుపోయి ఏడుస్తోంది.భయం, అవమానం కలగలిసిన భావం ఆమెని నిలవనీయటం లేదు.

“నేను చచ్చిపోతే మీ సమస్యలు తీరుతాయేమో, నన్ను చంపెయ్యండి ! నేను ఎలాటి నరకయాతన అనుభవిస్తున్నానో ఎప్పుడైనా ఆలోచించారా? నా శరీరం మీద నాకెంత రోతగా ఉందో మీకేమైనా తెలుసా అసలు?” అన్ అమ్మాయి చున్నీని మెడకి బిగించుకోసాగింది.

“ఏమిటే ఇది? ఆగు, ఏంచేస్తున్నావు?” అంటూ ముగ్గురూ ఆ పిల్ల మెడకున్న చున్నీని లాగేసేందుకు ప్రయత్నించసాగారు. కానీ ఆ కొద్ది క్షణాల్లోనే ఆమె కళ్ళు తేలిపోయాయి.ఊపిరాడలేదు. కళ్ళముందు చీకటి కమ్ముకుంది.తను ఆ అంధకార కూపంలో మునిగిపోతున్నట్టనిపించింది. మగత కమ్మి కింద పడిపోయింది.చున్నీ బిగించుకోవటం వల్ల మెడ మీద వాతలు తేలాయి.ముగ్గురూ నేలమీద ఆ అమ్మాయి పక్కన కూర్చుని బతకదేమో అన్న భయంతో  అరచేతులూ, అరికాళ్ళూ గట్టిగా రాయసాగారు.వాళ్ళ ప్రాణాలే పోతున్నంత బాధ వేసింది.ఉన్న సమస్యలకి తోడు ఇప్పుడొక కొత్త భయం పట్టుకుంది.పిల్ల ఆత్మహత్య చేసుకుంటుందేమో అన్న భయం . ఒకరివైపు ఒకరు చూసేందుకు కూడా వాళ్ళకి ధైర్యం చాలటం లేదు. వాళ్ళమధ్య ఏదో ఒక కనపడని గోడ లేచినట్టు దూరం దూరంగా మసులుతున్నారు.

అమ్మాయి తేరుకుని కళ్ళు తెరిచింది. అన్న కుర్చీలో కూలబడి ఉండటం కనిపించింది. ఒకవేళ తను వాళ్ళని గుర్తుపట్టినా అన్న ఒక్కడూ వాళ్ళనేం చెయ్యగలడు? ముగ్గురూ కలిసి అతన్ని చితకతంతే? అమ్మాయికి తన గురించి కన్నా అన్నకేమైనా అవుతుందేమోనన్న భయం ఎక్కువైంది.

చెల్లెలు కళ్ళు తెరవటం చూసి, ” వాళ్ళని గుర్తుపట్టగలవుగా? “అన్నాడు బాగా దగ్గరగా వచ్చి. కళ్ళెత్తి చూసేసరికి అమ్మాయికి తలతిరిగినట్టయింది.

“ఆఁ”అంది తలాడిస్తూ.

“వాళ్ళు కుర్రాళ్ళా, మగాళ్ళా? మునుపెప్పుడైనా చూశావా వాళ్ళని? జ్ఞాపకం తెచ్చుకో.”

“లేదు,” అంది కాస్త ధైర్యం తెచ్చుకుని.

“షట్టర్ మూసినప్పుడు లోపల ఎంతమందున్నారు? వాళ్ళెలాటివాళ్ళు?”

చెల్లెలు మొకాళ్ళమధ్య తలదూర్చి జవాబు చెప్పలేదు.ఆమె దవడలు బిగుసుకుంటున్నాయి.నరాల్లో విషం ప్రవహిస్తున్నంత నొప్పి.అయినా జవాబు చెప్పాలని చాలా ప్రయత్నించింది.తనలో ఏదో చనిపోతున్న భావన, దాన్ని విదిలించి పారెయ్యాలని ప్రయత్నించింది, కానీ…

” చెప్పు…చెప్పెయ్…నేను ప్రానాలతో ఉండాలనుకుంటే నోరు విప్పు.నా చెల్లికి ఎటువంటి సహాయమూ చెయ్యలేకపోయానన్న ఫీలింగ్ ని గుదిబండలా న మనసుమీద మోస్తూ జీవితాంతం బతకలేను…”అన్నాడతను పిడికిళ్ళు బిగించి.

“అన్నయా, ప్లీజ్,”అంది అమ్మాయి చేతులు జోడించి.

“ఏమిటే ప్లీజ్?” అని అరిచాడు.

“నా కోసం నీ జీవితం ఎందుకు పాడుచేసుకుంటావు?”

“మరి నీ జీవితమో? అందుకే చెప్పు.”

ప్రస్తుతం బీ.ఎ. పాసయింది. ముందెంతో జీవితం ఉంది.బ్యాడ్ మింటన్ లో స్టేట్ లెవెల్ లో సెలెక్ట్ అయింది. కెరీర్, పెళ్ళి, ఇంకా ఎంత జీవితం ఉంది!

“సిమ్లా వెళ్తావా? అక్కడుండి చదువుకుందువుగాని,” అన్నాడు అన్న.

“లేదు అదెక్కడికీ వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. మన బాధేదో మనమే అనుభవించాలి,” అంది తల్లి.

హఠాత్తుగా ఆ అమ్మాయికి తనొక పనికిమాలిన వస్తువైనట్టూ, ఎవరికీ అక్కర్లేక పారేసిన చెత్త అయినట్టూ అనిపించింది.ఎవరైనా ఏరుకున్నా పనికొస్తుందా లేదా అని చూస్తారు. శుభ్రం చేస్తారు.లోకమ్లో ఇప్పుడు తను ఒంటరి కాదు.తనలో ఒక అసహ్యకరమైన మరో లోకం ఉంది. అక్కడ ఎన్నో మొహాలున్నాయి.అమ్మాయి అద్దంలో తన మొహాన్నీ, శరీరాన్నీ చూసుకుంది.అందమైన తెల్లని మొహం, నునుపైన ఒళ్ళు…పైకి కనిపించేది అదే.అసలు శరీరమే శాశ్వతం కానప్పుడు, మట్టిలో కలిసిపోయేదే అయినప్పుడు ఇక అది మైల పడిందనీ, పవిత్రమ్గా ఉందనీ ఆ తేడాలెందుకు ? దానికింత ప్రాముఖ్యం ఎందుకు?శరీరం శిథిలమైనా ఆత్మ ఉంటుందంటారు.కానీ అది ఉండేది శరీరంలోనే కదా? ఇక అవయవాలు వయసుతోబాటు, పరిస్థితులతో బాటు మారిపోతాయి.కళ్ళకింద నల్లటి నీడలూ, మొహం మీద ముడతలూ ఎవరూ ఆపలేరు.

మనిషి ఎలా మారినా, ఎటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నా బైటి ప్రపంచం మాత్రం మారదు.పగలూ రాత్రీ ఒకదాని వెంట మరొకతి వస్తూనే ఉంటాయి.చెట్లు కదలక మెదలక ఒకే చోట ఉండిపోయినా వాటిలో జీవం తొణికిసలాడుతూనే ఉంటుంది.మారింది ఇంట్లో వాతావరణం ఒక్కటే.నాన్న ఏదో కోల్పోయినట్టు ఎప్పుడూ దిగులుగా ఉంటున్నాడు.అన్నయ్య చిక్కిపోయి ఎప్పుడూ ఏదో ఆందోళన పడుతున్నట్టు ఒక చోట నిలవలేకపోతున్నాడు.అమ్మయితే మూగదే అయిపోయింది. అక్కయ్య నవ్వటం మర్చిపోయింది.కాలేజీకి వెళ్ళటం మానేసింది. అక్కయ్యకి పెళ్ళెలా అవుతుంది? తనవల్లే కదా వీళ్ళందరూ ఇలా అయిపోయారు, అనుకునేసరికి ఆమె తల తిరిగిపోసాగింది.లోపలేదో పదునైన యంత్రం గిర్రున తిరుగుతూ కోసేస్తున్నంత బాధ !

ఎస్ టీడీ బూత్ లో పనిచేసే కుర్రాణ్ణి పట్టుకున్నారని నాన్న అన్నాడు.మిగిలినవాళ్ళ ఆచూకీ ఇంకా తెలీలేదు.అది విన్నప్పణ్ణించీ మనసులో అలజడి, కోపం, అసహ్యం ఒక్కసారిగా బుసలుకొట్టసాగాయి.కోర్టులో తను ఎంత స్పష్టంగా, నిర్భయంగా తనకి జరిగిన అన్యాయం గురించి చెప్పాలనే దాన్నిగురించి తమకి తోచిన సలహా ఇస్తున్నారు.అన్నయ్య మొహంలో కనిపించే విపరీతమైన ఒత్తిడీ, అతని బిగిసిన పిడికిళ్ళూ ఆమని నిరంతరం కలవరపెడతాయి.

తలుపు తెరిచి చూసింది. అన్నయ్య మంచం మీద పడుకుని ఉన్నాడు. అక్కయ్య కష్టం మీద అతనికి నాలుగు ముద్దలు తినిపించి నిద్రమాత్ర ఇచ్చి పడుకోబెట్టింది. మాత్ర వేసుకోకుండా నిద్రపోలేకపోతున్నాడతను.

ఆమె గోడకానుకుని కూర్చుండిపోయింది. కళ్ళముందు ఏవేవో దృశ్యాలు…నీడలు పరుచుకుంటున్నాయి. తనకి తెలీకుండానే కళ్ళు మూతలు పడసాగాయి.కొంత సేపట్లో నిద్ర ముంచుకొచ్చింది.కలలో కోర్టు గది.ఎదురుగా జడ్జి కూర్చునున్నాడు. వకీళ్ళూ, అమ్మా, నాన్నా, మిగిలిన కుటుంబ సభ్యులూ, స్నేహితులూ తన పక్కనే ఉన్నారు.వకీలు తనని వరసగా ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు. హృదయాన్ని చీల్చే ప్రశ్నలు…ఆత్మని కుళ్ళబొడిచే ప్రశ్నలు …సమ్మెటపోటుల్లాంటి ప్రశ్నలు…తన జీవితాన్ని ఛిద్రం చేసే ప్రశ్నలు !

ఆమె ఇబ్బందిగా కదుల్తూ, సంకోచిస్తూ కొన్ని ప్రశ్నలకి తలాడిస్తూ, కొన్నిటికి మౌనమే సమాధానంగా తలవంచుకుంటూ నిలబడింది. అక్కణ్ణించి పారిపోవాలని ఉన్నా అది సాధ్యం కావటం లేదు. తన చుట్టూ అమ్దరూ నిలబడి ఉన్నారు. ప్రసవవేదన తో విలవిలలాడే స్త్రీని ఒకసారి సినిమాలో చూసింది. తన పరిస్థితి అలాగే ఉన్నట్టు అనిపించింది.తన శరీరం మీద దాడి జరిగింది ఒకసారే.ప్రస్తుతం తన ఆత్మమీద జరుగుతున్న దాడి దానికన్నా వెయ్యిరెట్లు బాధాకరమ్గా ఉంది.అందుకే ఆత్మ వివలలాడుతోంది, మనసు హాహాకారాలు చేస్తోంది.గొంతుకేదో అడ్డం పడినట్టు ఊపిరాడటం లేదు…కాళ్ళూ చేతులూ మొద్దుబారుతున్నాయి.కదిలించటం సాధ్యం కావటం లేదు.ఆమె కంగారు పడుతూ మేలుకుంది.ఆయాసపడిపోతోంది. తన శరీరాన్ని తడిమి చూసుకుంది. లైటు వెలగటం లేదు, అంతా చీకటిగా ఉంది. మిగిలిన వాళ్ళందరూ మగత నిద్రలో ఉన్నారు.ఏవో భయపెట్టే నీడలు ఆమెని చుట్టుముట్టినట్టనిపించింది. స్పృహ కోల్పోతున్నట్టనిపించింది.అస్పష్టంగా ఏవో మాటలు, బావిలోంచి వస్తున్నట్టు వినిపిస్తున్నాయి. చేతులూ కాళ్ళూ కొట్టుకుంటూ గట్టిగా ఏడవసాగిందామె.

“అయ్యో, ఏమైందమ్మా?” అంటూ అమ్మా,నాన్నా,అక్కా ఆ అమ్మాయిని కుదిపి లేపేందుకు ప్రయత్నించసాగారు.మొహం మీద నీళ్ళు చల్లారు.వెంటనే డాక్టర్ కి ఫోన్ చేశారు.డాక్టర్ సలహా మేరకు అర్ధరాత్రి అప్పటికప్పుడు ఆస్పత్రికి తీసుకెళ్ళారు.ఆమెని పరీక్షించిన డాక్టర్ ఆమె కడుపుతో ఉందని చెప్పింది. ఆమెకి అక్కర్లేని, ఇష్టంలేని బీజం ఆమె గర్భంలో ఉంది. వెంటనే ఆమెకి డీఅండ్ సీ చేయించారు.ఆమె మగతలో ఉంది.అలాంటి అపస్మారక స్థితిలో కూడా తన శరీరంలోపలి ఒక మాంసపు ముద్దని కెలికి కెలికి తీసేస్తున్నారని తెలుస్తోంది.ఎన్నో పరికరాలు ఆమె శరీరంలోకి ప్రవేశపెడుతున్నారు. ఇంతకు ముందు జరిగినదానికీ, ఇప్పుడు జరుగుతున్న దానికీ ఒకటే తేడా, ప్రస్తుతం తనకి స్పర్శ తెలీటం లేదు.ఆమె కళ్ళు తెరిచేసరికి ఎదురుగా డాక్టర్ శోభ కనిపించింది.

“ఎలా ఉంది ఒంట్లో?” అంది డాక్టర్ దగ్గరకొచ్చి నుదుటిని తాఅకి చూస్తూ.

“బాగానే ఉన్నానాంటీ.నాకేమైంది?”

“తెలుసుకుని ఏం చేస్తావు? ఇంతవరకూ అనుభవించింది చాలు,ప్రస్తుతం నిన్ను నువ్వు సంబాళించుకోటానికి ప్రయత్నించు.నన్ను చూడు, నా దగ్గరకి చాలాసార్లు చావుబతుకుల్లో ఉన్న రోగులు వస్తారు…ముఖ్యంగా గర్భవతులు. కొన్నిసార్లు పెద్ద ప్రాణాన్ని బతికించాలా , పిల్లని బతికించాలా అన్న సమస్య ఎదురౌతుంది.చివరి క్షణం దాకా ఇద్దర్నీ బతికించాలనే ప్రయత్నిస్తాం. ఇక్కడ ముఖ్యమైనది ప్రాణాలు నిలపటం.మనం పడే పాట్లన్నీ బతికుండటానికే కదా? నీ జీవితం నీకెంత విలువైనదో నువ్వే ఆలోచించి నిర్ణయించుకోవాలి.ముందు శరీరానికి జరిగిన హింస గురించి ఆలోచిస్తూ కుమిలిపోతావో, లేక ఆత్మస్థైర్యంతో ముందుకి వెళ్తావో నిర్ణయించుకో. ఇది నీ శరీరం, అది ఎన్ని కష్టాలు అనుభవించినా నీకే సొంతమైనది.నువ్వే నా కూతురివైతే,’ లే, లేచి జీవితాన్ని కొనసాగించు , జరిగిన సంఘటనకి ఎదురుతిరిగి పోరాడు, అనేదాన్ని. నీనుంచి ఎవరూ ఏమీ ఆశించకపోయినా పరవాలేదు,కానీ నువ్వు మాత్రం ఆశించటం మానకు,” అని ఆ అమ్మాయి కడుపుతో ఉండటం, డీఎన్ సీ చేసి పిండాన్ని విచ్చిన్నం చెయ్యటం గురించి ఏమీ దాచకుండా చెప్పేసింది డాక్టర్ శోభ.

అదంతా విని ఆ అమ్మాయి ఉలిక్కిపడలేదు, బాధ కూడా పడలేదు.మౌనంగా ఆవిడవైపు చూస్తూ ఉండిపోయింది.ఆశ్చర్యం ఏమిటంటే  జరిగిన ఈ రెండు సంఘటనలూ ఆమె శరీరానికి జారిగాయే తప్ప ఆమె మనసునీ, ఆత్మనీ చెక్కుచెదరనివ్వలేదు.

“ఆంటీ, నాకు ఓడిపోవాలని లేదు.నేను పిరికిదాన్ని కాను.అలా ఏదో తప్పుచేసినట్టు కుంగిపోతూ బతకాలనీ లేదు.ఈ పరిస్థితులనుంచి బైటపడి మామూలుగా బతకాలనుంది. నా చుట్టూ ఉన్నవాళ్ళు నాలో భయం పెంచుతున్నారు. నా కుటుంబ సభ్యులకి కూడా అలా చెయ్యకూడదని చెప్పాలి,”అంది  మొదటిసారి తన మనసులో ఉన్నది బాహాటంగా తెలియజేస్తూ, తనని అగాధంలోకి నెట్టేసిన సంఘటనలలోనుంచి పైకి రావాలని ప్రయత్నిస్తూ.

” ఏదైనా అవయవంలో విషం ఉంటే డాక్టర్ ఆ చెయ్యో,కాలో తీసేస్తాడు. లేకపోతే ఆ విషం ఒళ్ళంతా పాకి మనిషి ప్రాణాలు తీస్తుంది. కాలూ,చెయ్యీ లేకపోయినా మనిషి ప్రాణాలతో ఉంటే చాలని అనుకుంటాడు.అందుకే  స్వయంగా ఏం చెయ్యాలో నిర్ణయించుకోమని నీకు సలహా ఇస్తున్నాను.జీవితం చాలా విలువైనదని మాత్రం గుర్తుంచుకో.” అంది డాక్టర్.

ఇంటికొస్తున్నప్పుడు ఆమె మనసుని ఎందుకో విచిత్రమైన అలజడి చుట్టేసింది. తన చుట్టూ ఉన్న ఉక్కిరిబిక్కిరి చేసే వాతావరణాన్ని దూరంగా విసిరేయాలన్న ఆవేశం వచ్చింది.ఇంటికి రాగానే ముందు తన అలమారాని చక్కగా  సర్దుకుంది, పుస్తకాలని దొంతరగా అమర్చింది.లోపల మనసుతో మాత్రం ఆమె పోరాటం కొనసాగుతూనే ఉంది.మనసు తన మాట వినేవరకూ అలా పోరాడుతూనే ఉండాలని నిశ్చయించుకుంది.ఏదైనా చెయ్యాలి, తను ఓడిపోలేదని లోకానికి తెలియజేయాలి, అందర్నీ ఎదుర్కోవాలి అనే వాక్యాలు మననం చేసుకుంటూ శక్తిని పుంజుకుంటోంది.ఆమెలో వచ్చిన మార్పు చూసి ఇంట్లోవాళ్ళు ఆశ్చర్యపోసాగారు. మానసికంగా దెబ్బతినలేదు కదా, అని భయపడ్డారు.మొన్నటివరకూ గదిలోంచి బైటికి కూడా రాని పిల్ల ఇంత చురుగ్గా అన్ని పనులూ చేసుకుంటోందేమిటి , అనుకున్నారు.

“అక్కయ్యా, నా మార్క్ షీట్ ఎక్కడ పెట్టావు? నాతో కాలేజీకి వస్తున్నావా?”అంది నవ్వుతూ.మార్క్ షీట్ చేతిలోకి తీసుకుని ఏదో అతి విలువైన వస్తువుని ముట్టుకుంటున్నట్టు సున్నితంగా తడిమింది.

మర్నాడు ఉదయాన్నే ట్రాక్ సూట్ వేసుకుని సిద్ధమైంది.శరీరం ఇంకా బలహీనంగా ఉన్నప్పటికీ, మనసు బలం పుంజుకుంది.

“ఎక్కడికే తయారయావు?బైటికెళ్తున్నావా? మతుందా లేదా నీకు?” అంది అమ్మ.

“స్టేడియం దాకా వెళ్ళొస్తా,” అంది ఏమాత్రం తొణక్కుండా శాంతంగా.

“డాక్టర్ అప్పుడే బైటికెళ్ళద్దని చెప్పింది కదూ? పైగా నలుగురూ ఏమనుకుంటారు? ఏమైనా అడిగితే మళ్ళీ జరిగినవన్నీ జ్ఞాపకం రావూ?ఇప్పుడిప్పుడే అందరూ కాస్త మర్చిపోతున్నారు,” అంది అమ్మ విపరీతంగా గాభరాపడుతూ.

తల్లిలో మార్పు చూసి ఆ అమ్మాయికి ఆశ్చర్యం వేసింది. ఇన్నాళ్ళూ మూగదానిలా ఉండిపోయిన ఈవిడ ఇప్పుడెంత గట్టిగా వాదిస్తోంది ! ఆవిడలో అనుమానం, తన పట్ల కఠినంగా ప్రవర్తించే తీరూ చూసి ఆ పిల్ల ఊరుకోలేకపోయింది.

“నేనే తప్పూ చెయ్యలేదు, మరి జీవితాంతం ఇంట్లో మగ్గుతూ ఏడుస్తూ మొహం చాటేసుకుని ఎందుకు కూర్చోవాలమ్మా? నాకు మీరెవరూ సహాయం చేసినా చెయ్యకపోయినా ఎలాంటి పరిస్థితినైనా ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం సంపాదించుకున్నాను,” అనేసి సమాధానం కోసం ఎదురుచూడకుండా , ఇంకేమీ మాట్లాడకుండా స్కూటరెక్కి బైలుదేరింది.ఆరోజు ఆకాశం నిర్మలంగా వెల్తురు నిండి ఉన్నట్టనిపించింది ఆమెకి.బాగా పరిచయమున్న దారిలో స్కూటర్ నడుపుతూ వెళ్తూంటే ఆమె మనసు గాలిలో తేలిపోతున్నట్టు తేలికగా అనిపించింది.

*****

(ఊర్మిలా శిరీష్ 1959లో మధ్యప్రదేశ్ లో జన్మించారు.

భోపాల్,మధ్యప్రదేశ్ లో నివాసం.

బర్కతుల్లా విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం.MLB మహిళా PG కాలేజిలో ప్రొఫెసర్ గా పనిచేశారు.

5 కథాసంపుటాలు ప్రచురియతమయాయి. 

అనేక సాహితీ పురస్కారాలు పొందారు.)

 

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.