వెనుతిరగని వెన్నెల(భాగం-1)

-డా|| కె.గీత 

(ఆడియో ఇక్కడ వినండి)

వెనుతిరగని వెన్నెల(భాగం-1)

-డా|| కె.గీత 

 (*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

యు హావ్ ఎరైవ్డ్ యువర్ డెస్టినేషన్” 

సమీర జీ.పీ యస్ ని ఆపి,  కారు దిగింది. చుట్టూ పరికించి చూసింది

గ్రేట్ అమెరికా, జీ.పీ యస్లు లేకముందు అడ్రస్ లు అసలెలా కనుక్కునే వారో!” అని నిట్టూర్చి ఎదురుగా కనబడుతున్న ఇంటి నంబరు, “వాట్స్ అప్లో ఉదయిని పెట్టిన నంబరు ఒకటో కాదో సరి చూసుకుంది.

సిలికాన్ వేలీ లో చక్కని రెసిడెన్షియల్ ఏరియా అది. ఆపిల్, గూగుల్ ఆఫీసులన్నీ చుట్టూ పదిమైళ్ల పరిధిలోనే ఉంటాయి

వీధిలో ఇళ్లన్నీ దాదాపు ఒక్కలాగే ఉన్నాయి. ఇళ్ల ముందు గార్డెన్ల సైజు తో సహా

గేట్లు లేని చదునైన లాన్లు, బాట కిరుప్రక్కలా అందంగా విరిసిన గులాబీ మొక్కలు, అంతకు రెట్టింపు అందంతో  విరగ కాసిన పొట్టి పొట్టి నిమ్మ చెట్లు, నారింజ చెట్లు.  

అయాం కమింగ్ హోమ్ లేట్ టు డే…” నడుస్తూ సాయి కి టెక్స్ట్  చేసింది

వేర్ ఆర్ యూ”  రిప్లై చూసి చిన్నగా నిట్టూర్చింది.

డోర్ బెల్లు కొట్టే ముందు అమెరికా మర్యాదని అనుసరించి ఉదయినికి కాల్ చేసింది.

అప్పుడు గమనించింది. డోర్ మేట్ మీదసహాయఅని కుట్టి ఉంది. ఇంటి ముందు వేళ్లాడదీసి ఉన్న గల గల మోగే చిన్న అద్దాలతో గుండ్రంగా తిరుగుతున్న విండ్ బెల్ మధ్య, బాట పక్కగా ఉన్న చిన్న గులక రాళ్ల మీద, తలుపుకిరుపక్కలా చిన్న దీపపు  కుందెల మీద అవే అక్షరాలు.

డోర్ పక్కగా ఉన్న అద్దాల వెనక నించి చిన్న అందమైన తెలుగు అక్షరాలుసహాయ“. 

ఇలా సంస్థ  పేరునినేమ్ ప్లేట్గా వేళ్ళాడ దీయ కుండా అన్ని చోట్లా అందంగా అమర్చడం భలే బావుందేఅనుకుంది సమీర

తలుపు తెరుస్తూనే ఉదయినిసమీరా…..దా, దా… “అంటూ కౌగలించుకుంది. తల స్నానం చేసి విరబోసుకున్న జుట్టు నించి మంచి ఆహ్లాదమైన సువాసన వస్తూంది.

చక్కని పలువరసతో నవ్వు, కళ్ళ చుట్టూ చిన్న గీతల కాటుకతో మంచి మెరిసే కళ్లు

బొట్టు చిన్నగా ఉన్నా, చామన ఛాయగా ఉన్న అందమైన ముఖమ్మీద సరిగ్గా అమరినట్టున్న చిన్నచుక్క. మాములు ఆడవాళ్ళ కంటే కొంచెం ఎత్తు అన్పిస్తూన్న హుందాతనం. అన్నిటి కంటే ఆశ్చర్యకరమైన విషయం చక్కగా పొందికగా ఆమెని అల్లుకున్న లేత చందనం రంగు చీర

అమెరికా లో ఇంత మోడ్రన్ యుగంలో ఇలా చక్కగా చీర తో ఎదురయిన ఉదయినిని చూసి సమీరకి  తెలీని గౌరవమేదో కలిగింది. అంతకు మించిన ఆశ్చర్యమూ కలిగింది

మా అమ్మకు స్నేహితురాలంటే వేరేగా ఊహించుకున్నాను. మీరు నిజంగానే అమ్మ చెప్పినఉదయిని ఆంటీఅంటే నమ్మబుద్ధి కావడం లేదు. మీ వయసు నలభై లోపే. యామై కరెక్ట్?” అంది సమీర పెద్ద కళ్ళు చేసి ఆశ్చర్యంగా.

అవన్నీ సరేలే. అంతా చెప్పే మాటలే. అయినా నువ్విలా ఇలా గుమ్మం దగ్గిర నిలబడి, పరాయి అమ్మాయిలా ఫోన్ చెయ్యక్కరలేదు.” అంది ఉదయిని సమీర చేతిలో బేగ్ అందుకుంటూ.

తెల్లని గోడంతా పెద్ద పెద్ద పూలతో అల్లుకు పోతున్నట్లున్న వరుస పసుపు, నారింజ పూల పెయింటింగులు.

అందుకు తగ్గ మేచింగ్ ఫర్నిచర్. మూల గాజు బీరువా లోసితార“. అరల నిండా చక్కగా పేర్చి ఉన్న పుస్తకాల ముందు  వరుసలోఅమృతం కురిసిన రాత్రి “. 

వావ్! యువర్ హోమ ఈజ్ సింపుల్ అండ్ నైస్ఆంటీఅని

నేను మిమ్మల్ని ఆంటీ అనొచ్చా?”  అంది సమీర

తప్పకుండా అనొచ్చు. మీ మమ్మీ , రాజీ  నాకంటే అయిదేళ్ళు సీనియర్. కానీ చాలా తమాషాగా మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. వయసు మా మధ్య ఎప్పుడూ ప్రతిబంధకం కాలేదు. మేమిద్దరం ఒకటే సంవత్సరం లో పుట్టకపోయినా ఒకటే తారీఖున పుట్టాం. అదొక కారణమనుకుంటా మా గాఢ స్నేహానికి.” అని 

అవునూ, ఎలా ఉంది తను? ఎప్పటికప్పుడు ఫోను చెయ్యాలనుకుంటూనే కాలం గడిచిపోతూ ఉంది.” అంది ఉదయిని.

మీ కంటే అయిదేళ్లే పెద్దదైనా…. అమ్మమ్మ లా తయారైంది. ఒక హుషారు ఉండదు, ఏవీ  ఉండదు. అమ్మకు ఎప్పుడూ ఎదో ఒక బెంగే.” అని నిట్టూర్చింది సమీర.

మీరేమో ఇంత కళాత్మకంగా ఉన్నారు. అమ్మకు, మీకు అసలు స్నేహం ఎలా కలిసిందా అని ఆశ్చర్యంగా ఉంది.” అంది మళ్లీ.

స్నేహమనేది గొప్ప విచిత్రమైంది సమీరా ! ఎప్పుడు ఎవరు ఎవరికి పరిచయమవుతారో, ఎందుకు స్నేహమవుతారో! కొన్ని స్నేహాలు చాలా త్వరగా కుదురుతాయి. కొందరు పరిచయస్థులుగానే  మిగిలిపోతారు ఎప్పటికీ. స్నేహాలు ఎన్ని రోజులలో ఎంత త్వరగా కుదిరినా, మనతో ఎప్పటికీ వచ్చేవి అతి కొన్ని మాత్రమే. నాకు దొరికిన అతి కొద్దిమంది స్నేహితుల్లో రాజీ తో స్నేహం నేనెప్పటికీ మర్చిపోను. మా ఇద్దరికీ పరిచయం కూడా కాకతాళీయంగా జరిగింది.

హైస్కూల్లో మా డ్రిల్లు మాస్టారు  నన్ను పిలిచిఅమ్మాయ్, అదుగో సీనియర్ల బేచ్ లో కుంటాట ఆడడానికి ఒకమ్మాయి తక్కువైంది. నువ్వాడతావా? అనడిగేరు.

నన్నే ఎందుకడిగేరో నాకప్పుడు తెలీదు

రోజూ సీనియర్లంతా ఆడుతున్నపుడు చకచకా తప్పించుకుని మెరికలా పరుగెత్తే అమ్మాయి వైపు నేను భలే ఆరాధనగా చూసేదాన్ని.

అమ్మాయే నన్ను రికమండ్ చేసిందని నాకు చానాళ్ళ తర్వాత తెలిసింది”.

నన్ను చెప్పనివ్వండి. మిమ్మల్ని రికమండ్ చేసింది అమ్మే కదూఅంది సమీర.

.. బానే చెప్పేసేవు.  కానీ నన్ను రికమండ్ చేసింది మీ అమ్మ కాదు, మీ అమ్మకు స్నేహితురాలు

అయితే అమ్మాయికి  సరిగ్గా ఆడాల్సిన సమయంలో కాలు మెలి పడి దెబ్బ  తగిలింది.  రోజూ ఆరాధనగా వీళ్ల ప్రాక్టీసు సెషన్ దగ్గర హాజరయ్యే నన్ను గమనించి , డ్రిల్ మాస్టారికి  రికమండ్ చేసింది

ఆటలో మా  బేచ్ గెలవగానే మీ అమ్మ ప్రశంసా పూర్వకంగా నన్ను దాదాపు ఎత్తుకుంది. అలా మొదలైంది మా స్నేహం“. అని ఒక్క క్షణం ఆగి 

అయినా మీ అమ్మకు కళాత్మకత లేదని ఎందుకు అనుకుంటున్నావు?”

పుస్తకం చూడుఎదురుగా పుస్తకాల బీరువాలో ప్రత్యేకంగా ముందు వరుసలో పెట్టినగీతాంజలిని చూపించింది.

సమీరఇంత పాత పుస్తకాన్ని ఇంత జాగ్రత్తగా దాచారా?” అంది అందుకుంటూ.

మొదటి పేజీలో ముత్యాల్లాంటి అక్షరాలు.

ప్రభూ! దయ అను అమ్మాయికి నన్ను స్నేహితురాలిని చేసావు. నీ దయతో నన్ను పునీతం చేసి నాదయగా ప్రసాదించావు.  ఉదయ మధ్యాహ్న సాయంత్రాల్నిఉదయినిగా మార్చి నా జీవితాన్ని ఉదయింపజేసావు. ధన్య వాదాలు ప్రభూ! శతకోటి నమస్సులు!!”

ఎప్పుడూ ప్రేమతో

నీ

రాజీ

అమ్మ రాసిందా! ఇంత అద్భుతమైన వాక్యాలు!!” ఆలోచనలో పడింది సమీర

పైకి అన్యాపదేశంగాఅమ్మలో ఇంత  భావుకత ఉందని తెలీదు నాకిప్పటివరకూ.  ఇప్పుడు అర్థమైంది, మీకు అమ్మ ఎందుకు స్నేహితురాలైందో.” సాలోచనగా తలాడిస్తూ అంది సమీర.

నన్ను మీ అమ్మదయఅని పిలిచేది. అప్పటికిచివరకు మిగిలేదిమేమిద్దరం కలిసి మూణ్ణాలుగు సార్లు చదివేసి, పుస్తకంలోని ప్రతీ పాత్రతో విపరీతమైన ప్రేమలో పడిపోయాం. నీకో గమ్మత్తు విషయం చెప్పనా!

నేను రాజీని  “రాజేశ్వరిఅని పూర్తి పేరుతో పిలిచినప్పుడు తన ముఖంలో విరిసే చిరు కోపం చూడాలి! తనకెందుకో అలా పూర్తి పేరుతో పిలవడం ఇష్టం ఉండేది కాదు. “మైదానంతో ఏకీభవించకేమో

అన్నట్లు రెండు పుస్తకాలు నువ్వు చదివేవా?!” అంది ఉదయిని

లేదన్నట్లు తలాడించిమీరు చెప్తుంటే తప్పక చదవాలని అన్పిస్తూందిఅంటూ 

ఇదేవిటీ, ఎండిన మల్లెఫూల మాల! మధ్య పేజీలోఅంది జాగ్రత్తగా పేజీని తిరగేస్తూ సమీర

దాదాపు ముట్టుకుంటే పొడై  రాలి పోయేట్లుంది

అది రాజీ నాకు పుస్తకంతో బాటూ ఇచ్చిన మల్లెపూల మాల.  వాళ్ల  పెరట్లోంచి గుప్పెడు మల్లెలు కోసి తీసుకు వచ్చి,  మాల కట్టి నా తలలో తురిమి ఎంత మురిసిపోయిందో చెప్పలేను. నా ముఖంలోకి చూసి మెటికలు విరిచి, నా బుగ్గ మీద ముద్దుపెట్టడం ఇప్పటికీ జ్ఞాపకం ఉంది.” 

వావ్ ఆంటీ, మీ ఇద్దరి స్నేహం చూస్తే అసూయగా ఉంది నాకుఅంది సమీర.

అలాంటి మీ అమ్మతో సంవత్సరానికి ఒక్కసారి మాట్లాడడానికి కూడా స్నేహితురాలికి తీరిక లేదు చూసేవా? “అని నిట్టూర్చి 

నీ పెళ్లికి కూడా రాలేక పోయాను. ఆరు నెలలయ్యిందా మీ పెళ్లయ్యి?” అంది ఉదయిని.

సమాధానంగా తలూపింది సమీర.

వస్తూనే మా సంగతులన్నీ చెప్పేసేను. నీ గురించి ఒక్క మాట కూడా చెప్పనివ్వలేదు. చెప్పుచెప్పు.. ఇక్కడ ఏం చేస్తున్నావు?”  అంది ఉదయిని

సెమెస్టర్ తో ఎమ్మెస్ పూర్తి అయిపోతుంది ఆంటీ. ఇక  ఉద్యోగం  వెతుక్కోవాలి”. అని దీర్ఘంగా నిట్టూర్చింది.  

.. స్పెషలైజేషన్ ఏవిటీ, అంకుల్ మరో  కొత్త కంపెనీ లో చేరే ఆలోచనలో ఉన్నారు. ఓపెనింగ్స్ ఉంటే చెప్తాను”.  

అందుకు సమాధానం చెప్పి,“మీరెప్పుడొచ్చారు యూఎస్ కి? తెలుగు ఇంత బాగా, మర్చిపోకుండా మాట్లాడుతున్నారు? అంది సమీర అంతలోనే.  

మన మాతృ భాషని మనం మర్చి పోవడం ఏవిటీ? నిజానికి ఇతర దేశాల్లో ఎన్నేళ్ళున్నా ఎవరూ స్వంత భాషని మర్చిపోరు. కొందరు అదేదో నామోషీ  అనుకుని మాట్లాడరనుకుంటా. అన్నట్లు మేమెప్పుడొచ్చాం అనడిగావు కదా. దాదాపు పదేళ్లవుతూంది.”

మీ పాప ఇక్కడే పుట్టిందయితే

.. అవును, “సహాయఇక్కడే పుట్టింది

, అమ్మాయి పేరేనన్నమాట మీ సంస్థకి కూడా.”

మీరుసహాయతో ఎంతో మంచి పని చేస్తున్నారాంటీ. రియల్లీ అప్రిషియేట్ యూ. ఇలా ఎవరైనా సహాయం చెయ్యక పోతే ఇంత దూరంలో, అమెరికా లో ఆడవాళ్లకి అనుకోని కష్టాలొస్తే ఎవరు ఆదుకుంటారు?” ప్రశంసా పూర్వకంగా అంది సమీర

నీ గురించి చెప్పు సమీరా, అమెరికా నీకు నచ్చిందా?”

నచ్చడమంటే, ఇక్కడ అలవాటు పడితే ఇంత కంటే హాయి ఏముంది చెప్పండి. యాడెఫెనెట్లీ లైక్ దిస్  కంట్రీ   మరి మీకు?”

వచ్చిన కొత్తలో ఎప్పుడు  వెళ్ళిపోదామా అని ఉండేది. కానీ ప్రశాంత్ తన కెరీర్ ని ఇక్కడ ఎంచుకున్నాడు. అన్నిటికంటేకుటుంబమే ముఖ్యంఅన్నది నా భావన. ఇక నా ప్రపంచాన్ని ఇక్కడ నేనే సృష్టించుకున్నాను.”

భలే బావుంది, మీతో ఎంత సేపు మాట్లాడినా మాట్లాడాలని అనిపిస్తూంది. ప్రశాంత్ అంకుల్ ఎంతో అదృష్టవంతులు.” అంటూ 

బొమ్మ ఎవరు వేసారు? మీ టేస్ట్ లో లేదు? అందిదగ్గరగా వెళ్లి సమీర.   

మా అబ్బాయి క్రాంతి. ఇప్పటి కాలపు చిత్రలేఖనం ఇలానే ఉంటుందంటాడు.ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం లో ఉన్నాడు. బొమ్మలు వేయడం వాడి హాబీ. ”

మీ అమ్మాయి పాటలు పాడుతుందా? “ అంది సమీర

అవును, అంత కరెక్టుగా ఎలా చెప్పావు?”

ఏం  లేదు, మీకున్న కళలు మీ పిల్లలిద్దరికీ చెరొకటీ వచ్చి ఉంటాయని ఊహించా”. అని నవ్వింది సమీర

ఉదయిని సెల్ ఫోను మోగింది.

ఒక్క నిమిషం సమీరాఅంటూ ఫోనందుకుంది ఉదయిని.

అంత వరకూ మమూలు గృహిణిలా ఉన్న తను హఠాత్తుగా ఒక ప్రొఫెషనలిస్టుగా మారిపోయింది.

అవతలి వాళ్లతో చక్కగా మంచి ఇంగ్లీషులో మాట్లాడుతూ మధ్య మధ్య నోట్ బుక్ లో చిన్నగా ఏదో నోట్ చేసుకుంటూ అపాయింట్మెంట్ వివరాలు చెబుతూంది

తలూపుతూ  మధ్య మధ్య తన వైపు చూస్తూ చెదరని చిర్నవ్వుతో మాట్లాడుతున్న ఉదయిని వైపే చూస్తూ ఉండాలనిపించింది సమీరకు.

మరీ బావుండదనిపించి కుర్చీలోంచి లేచింది.

హాలునానుకుని కనిపిస్తూన్న  ఆవరణలో అందంగా పేర్చిన గుండ్రని రాళ్ళు, మధ్య పచ్చని లాన్, మధ్య  చిన్న జలపాతాన్ని పోలిన నీటి ప్రవాహం. జలపాతమ్మీదికి అల్లిబిల్లిగా వాలిన పూలతీగల పందిరొకటి.

జీవితంలో తనకేది కావాలో, ఎలా కావాలో..  అవన్నీ సమకూరడం ఎంత అదృష్టంఅనుకుంది సమీర.

లాన్ కి అని వైపులా గులక రాళ్లమీద పేర్చినసహాయ”  అక్షరాలు.

సహాయ” –ఎంత మంచి పేరు! “ అనుకుంది సమీర.

అమ్మ తనని పట్టుబట్టి ఇక్కడికి ఎందుకు పంపించిందో ఉదయిని ని, వాళ్ళ ఇంటిని చూసేక అర్థమైంది.

సారీ సమీరా, చాలా సేపు పట్టిందిఅంది ఉదయిని.

అహాహా, అయాం ఒకే ఆంటీ, నేనే మీ వర్క్ సమయంలో వచ్చి ఇబ్బంది కలిగిస్తున్నానా?” అంది సమీర.

భలేదానివి, నిన్ను చూస్తే మీ అమ్మను చూసినట్టే  అనిపిస్తూంది. నువ్విలా రావడం నాకెంతో సంతోషంగా ఉంది తెలుసా?” అని

నీ కిష్టమైన స్వీటేవిటి చెప్పు చేసి పెడతాను. కొంపదీసి రాజీ లాగాసేమ్యా పాయసంఅని మాత్రం అనకు. తనెప్పుడూ అదే చెప్పేదిఅని గలగల నవ్వింది.

నవ్వినప్పుడు కొసల్లో కొంచెం పెద్దగా ఉన్న పన్ను నవ్వుకి మరింత అందాన్ని తెచ్చి పెట్టింది.

అదే చెప్పింది ఉదయినితో.

మీ మమ్మీ నన్ను ప్రతీ నిమిషం పొగడమని పంపిందా ఏవిటి”. మరలా నవ్వింది.

గది గోడ పొడవునా ఉన్న అద్దాల లోంచి వెలుతురు కిరణాలు ఏటవాలుగా హాలులోకి పడ్తున్నాయి.

ఒక కొత్త ఉత్సాహమేదో ఆవరించినట్లయ్యి గలగలా కబుర్లు చెప్తోంది సమీర.

పెయింటింగులు మీరు వేసినవే కదూ…..” 

సితార నాకెంతో ఇష్టం, మీరు నాకొక సారి వినిపించరూ…..”

అబ్బా హాయిగా ఇలా ఎవరింటికైనా వచ్చి ఎన్నాళ్లయ్యిందో…..”  గల గల మాట్లాడుతున్న సమీరని మందహాసంతో చూస్తూ

మంచి కాఫీ తాగుతూ, అలా యార్డ్ లో కూచుందాంపద అంది ఉదయిని.

కాఫీ తాగడం మానేసానాంటీ ”  అంది చిన్నగా పొట్ట తడుముకుంటూ సమీర అప్పటి దాకా ఉన్న హుషారు తగ్గిపోయి కొంచెం నిరసించిన గొంతుకతో.

ఏవిటీ, విశేషమా!” అంది దగ్గరగా వచ్చి ఉదయిని

బదులుగా తలాడించి, “కాఫీ తాగడం ఇష్టంగా ఉండడం లేదీ మధ్య. అస్తమాటూ వామిటింగ్ సెన్సేష న్. మొదట రెండు నెలలు  బాగా ఎక్కువగా అనిపించింది. కానీ ఇప్పుడు కాస్త నయమేలెండి. నాలుగు నిండేయి కదా. డాక్టరు చెప్పింది ఇక తగ్గుతాయని.”

ఓకే, బూస్ట్ నీకు, కాఫీ నాకు.” అని ఇంకా దిగులుగా ఉన్నట్లున్న సమీర దగ్గిరకి వచ్చి 

ఇలా చూడు సమీరా! సమయంలో ఇలా దిగులుగా ఉండ కూడదు. నీకేం కావాలో చెప్పు?” అంది ఉదయిని

నాకు విడాకులు కావాలి ఆంటీనెమ్మదిగా తలెత్తి, స్ఫుటంగా అంది సమీర.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.