అనువాదకులు ఎన్.వేణుగోపాల్ ముందుమాట (2003) 

ఇరవై అయిదేళ్ల తర్వాత బొలీవియా

-ఎన్.వేణుగోపాల్  

ఈ పుస్తకం ఇంగ్లీషు మూలం 1978లో, 25 సంవత్సరాల కింద వెలువడింది. అంటే ఈ పుస్తకం 25 ఏళ్ల వెనుకటి బొలీవియా గురించి వివరిస్తుంది. ఈ 25 ఏళ్లలో బొలీవియాలో చాలా మార్పులు జరిగాయి. బొలీవియా ప్రజల జీవన స్థితిగతులు ఇంకా దిగజారిపోయాయి. ఇటీవల బొలీవియా రెండు సంఘటనల నేపథ్యంలో వార్తల్లోకెక్కింది. ఇటీవలనే దేశాధ్యక్షుడు గోన్జాలో సాంకెజ్ దేశం వదిలి పారిపోయాడు. ప్రపంచ బ్యాంకు, ఐఎమ్ఎఫ్ ఆదేశాల మేరకు కొనసాగుతున్న రాజకీయార్థిక విధానాలకు వ్యతిరేకంగా విస్తృతంగా చెలరేగిన ప్రజా ఉద్యమం దేశాధ్యక్షుణ్ని పదవీచ్యుతుణ్ణి చేసింది. మూడు సంవత్సరాల కింద కొచబాంబాలో తాగునీటి వ్యవస్థను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం ప్రయత్నించినప్పుడు పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన చెలరేగి కాల్పుల దాకా దారితీసి చివరికి ప్రభుత్వం మంచినీటి ప్రైవేటీకరణ ఆలోచనను విరమించుకోవలసి వచ్చింది.

అంటే ఈ పుస్తకంలో దొమితిలా వివరించినట్లుగా అటు పాలకవర్గ దుర్మార్గం, ఇటు ప్రజల ప్రతిఘటనా పోరాటాలు బొలీవియాలో ఈ 25 సంవత్సరాలలో కూడా కొనసాగాయి. ఉధృతరూపం దాల్చాయి, అంతర్జాతీయ ద్రవ్య సంస్థల షరతుల మేరకు ప్రభుత్వాలు రాజకీయార్థిక విధానాలు తయారుచేయడం, ఆ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజలు సమరశీల ఉద్యమాలు చేపట్టడం, ఆ ఉద్యమాల మీద ప్రభుత్వాలు అతి భయంకరమైన నిర్బంధకాండను ప్రయోగించడం – ఈ బొలీవియా వర్తమానం మూడో ప్రపంచ దేశాలలోని ఏ ప్రాంతానికైనా, ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ కు కూడా అక్షరాలా సరిపోతుంది. ఈ పుస్తకం తెలుగులో పునర్ముద్రణ పొందుతున్న సందర్భంగా మరొకసారి బొలీవియా చరిత్రను అర్ధం చేసుకుందాం…

దక్షిణ అమెరికా ఖండం ఉత్తర భాగంలో ఒక చిన్న దేశం బొలీవియా, చిలీ, పెరూ, బ్రెజిల్, పెరాగ్వే, అర్జెంటీనా సరిహద్దులుగా, ఈ ఎనభై అయిదు లక్షల జనాభా గల దేశంలో ఆదివాసీ జనాభా అత్యధికం. వెండి, తగరం, చమురు నిల్వలు వంటి ఖనిజాలతో, రబ్బరు, పత్తి, కోకా ఆకు వంటి వ్యవసాయోత్పత్తులతో అతి సంపన్నమైన ఈ దేశపు ప్రజానీకం మాత్రం దుర్భర దారిద్ర్యంలో మగ్గిపోతున్నారు.

గత మూడు శతాబ్దాలుగా బొలీవియా ఖనిజసంపదను – మొదట వెండి, తరువాత గువానా ఆ తరువాత తగరం – బహుళజాతి సంస్థలు, అమెరికన్ పెట్టుబడి దోచుకుపోయాయి.

బొలీవియాలోని ఒక అత్యల్ప సంఖ్యాక పెత్తందారీ వర్గం, అమెరికన్ పెట్టబడి మాత్రమే ఈ ఎగుమతులలో లాభపడ్డాయి.  1960 నుంచి ఇక్కడి రైతాంగం చేత కోకా పంట పండించి ఆ ఆకును మాదక ద్రవ్యంగా వాడడంలో అంతర్జాతీయ పెట్టుబడి, మాదక ద్రవ్యాల వ్యాపారముఠాలు సొమ్ము చేసుకుంటున్నాయి. మరోవంక అమెరికన్ ప్రభుత్వమే మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాటం అనే ముసుగులో బొలీవియా ప్రభుత్వం మీద ఆంక్షలు విధిస్తోంది.  ఈ ఆంక్షల వల్ల, మాదకద్రవ్యాల వ్యాపార ముఠాల అక్రమ పద్ధతుల వల్ల బొలివియా రైతాంగం ప్రభుత్వం విధానాల పట్ల అమెరికన్ కుయుక్తుల పట్ల తీవ్రమైన ఆగ్రహావేశాలతో ఉంది.

బొలీవియా గని కార్మికవర్గం ఈ పుస్తకంలో చూపినట్లుగా మొదటి సమరశీలంగా, చైతన్యయుతంగా పోరాటాలు చేపట్టింది. నిజానికి 1980 కి ముందు నాలుగు దశాబ్దాల పాటు మొత్తం బొలీవియన్ ప్రజా చైతన్యానికే గని కార్మిక ఉద్యమం వెన్నుదన్నుగా ఉండేది. కాని 1985లో అంతర్జాతీయంగా తగరం ధరలు పడిపోవడం, బోలీవియన్ ప్రభుత్వం ఐఎమ్ఎఫ్ ఆదేశాల మేరకు ఆర్థిక సంస్కరణలు చేపట్టడంతో తగరం గనులు మూసివేయబడ్డాయి. వేలాది కార్మిక కుటుంబాలు వీధినపడ్డాయి. ఈ పుస్తకంలో దొమితిలా వర్ణించిన గని కేంద్రాలన్నీ మూతపడి కార్మికులు చెల్లాచెదురయ్యారు. దొమితిలా కుటుంబం కూడా కొచబాంబాకు తరలిపోయి కొత్త ఉపాధి చూసుకోవాల్సి వచ్చింది.

1952 విప్లవంతో ప్రజలు సాధించుకున్న విజయాలన్నింటినీ 1980ల లోని మితవాద ప్రభుత్వాలు తిరగదోడాయి. కార్మికుల హక్కులను రద్దు చేశాయి. ప్రభుత్వ రంగంలో కనీస వేతనాలను స్తంభింపజేశాయి. ధరలమీద, దిగుమతుల మీద ఉన్న నియంత్రణలను తొలగించాయి. ఉద్యోగ కల్పనను తగ్గించాయి. నిరసనలమీద నిర్బంధకాండను ప్రయోగించాయి. ప్రజాసంక్షేమం కన్నా ఎక్కువ ప్రాధాన్యతను విదేశీ రుణాల చెల్లింపుకు, సైనిక వ్యయానికి ఇచ్చాయి.

1991లో సుసాన్ రాన్స్ రాసినట్టు “అత్యంత సంపన్నులు నగరాలలోని కొన్ని ప్రదేశాలలో అత్యంత విలాసమైన ఎయిర్ కండిషన్ కార్లలో తిరుగుతుండగా, కెచువా రైతులు వీధుల్లో బిచ్చమెత్తుతూ కన్పిస్తారు. బూట్లు పాలిష్ చేస్తామని చిన్నారి బాలలు వెంటబడుతుంటారు. చెత్త కుప్పల మీద ఆహార పదార్థాల ఏరుకునే వీధిబాలలు అన్ని చోట్ల కన్పిస్తుంటారు. మత్తు మందులు నింపిన సిగరెట్లు అమ్మ జూపే వాళ్లు ఎక్కడబడితే అక్కడ ఉంటారు.”

ఆ తరువాత దశాబ్దంలో పరిస్థితి మరింత దిగజారింది. బొలీవియా రాజకీయార్ధిక విధానాలలో అమెరికా జోక్యం, ఐఎమ్ఎఫ్ జోక్యం మరింత పెరిగాయి. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాలను బొలీవియా మీద రుద్దడం జరిగింది. 1985 లో అప్పటి అధ్యక్షుడు విక్టర్ పాజ్ ఎస్టెన్ సొరో ద్రవ్యోల్బణాన్ని ఆపడానికి అనే పేరు మీద ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలను ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఇంకా ముందుకు తీసుకుపోయాయి. అక్టోబర్ 31 వరకు అధ్యక్షుడుగా ఉన్న సాంకెజ్ బొలీవియాలోని సహజ వాయువునంతటినీ అమెరికా, బ్రిటన్, అర్జెంటీనాలకు చెందిన బహుళజాతి సంస్థలకు తెగనమ్మడానికి 520 కోట్ల డాలర్ల పైప్ లైన్ ప్రాజెక్టును సిద్ధం చేశాడు. తమ సహజ వాయువును ఇట్లా అప్పనంగా అమెరికాకు అప్పగించడం పైన ప్రజా ఆగ్రహం అతి తీవ్రంగా వ్యక్తమయింది. రాజధాని నగరం లాపాజ్ తో సహా బొలీవియా అంతటా లక్షలాది మంది ప్రదర్శనలు జరిపారు. రాజప్రాసాదాన్ని ముట్టడించి అధ్యక్షుడు రాజీనామా చేయాలని, ఈ అవమానకరమైన పైప్ లైన్ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేవలం అక్టోబర్ రెండో వారంలో జరిగిన ఈ ప్రదర్శనల్లోనే 70 మంది ప్రదర్శనకారులు కాల్పుల్లో చనిపోయారు. సాంకేజ్ పారిపోయిన తర్వాత అధ్యక్షపీఠం ఎక్కిన కార్లోస్ మెసా పైప్ లైన్ ప్రాజెక్టు రద్దు చేశాడు. త్వరలోనే ఎన్నికలు జరుపుతానని వాగ్దానం చేశాడు. ఈ పరిణామాలు ఇలా జరుగుతుండగానే రైతాంగంలో కోకా పంట మీద ఆంక్షలకు వ్యతిరేకంగా ఆందోళన చెలరేగుతోంది.

గని కార్మిక ఉద్యమం బలహీనపడిపోయినందు వల్ల ప్రస్తుత ప్రజా ఆందోళనల్లో గని కార్మికుల పాత్ర గురించి కానీ, దొమితిలా పాత్ర గురించి కాని సరైన వివరాలు అందడం లేదు. 1989లో న్యూ ఇంటర్నేషనలిస్ట్ పత్రిక కోసం దొమితిలా గురించి సోఫియాటికెల్ రాసిన వ్యాసమే దొమితిలా గురించి అందుకున్న తాజా సమాచారం. ఈ పుస్తకాన్ని ఎన్నో అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో లాటిన్ అమెరికా జీవన పరిస్థితుల అధ్యయనం కోసం వాడుతున్నారు గాని ఆ అధ్యయనాలలో కూడా రచయిత ప్రస్తుత పరిస్థితి తెలియడం లేదు.

1980 వరకు దొమితిలా ఈ పుస్తకంలో వివరించిన జీవితమే గడిపింది. అప్పుడు ఒక సమావేశంలో పాల్గొనడానికి డెన్మార్క్ వెళ్లి తిరిగి వచ్చే సరికి బొలీవియాలో సైనిక కుట్ర జరిగి సైనిక పాలన మొదలైంది. దొమితిలా రెండున్నర సంవత్సరాలపాటు స్వీడన్ లో ప్రవాస జీవితం గడపవలసి వచ్చింది. 1986లో గనులు మూసివేసి కార్మికులందరినీ ఉద్యోగాల నుంచి తొలగించిన తరువాత దొమితిలా కుటుంబం కొచబాంబాకు తరలివెళ్లింది. ఈ పుస్తకం మీద వచ్చిన పదివేల డాలర్లతో  కొచబాంబాలో స్థిరపడింది. 1989 నాటికి దొమితిలా, ఆమె కుటుంబ సభ్యులు చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తూ పొట్టపోసుకుంటున్నారు. సోఫియాతో ఇంటర్వ్యూలో దొమితిలా చెప్పినట్టు “నా పుస్తకం వెలువడ్డప్పుడు దానిలో ఉన్న నాటకీయతను, మా అణచివేతను, మా పోరాటాన్ని ప్రతి ఒక్కళ్లూ ఆసక్తితో గమనించారు. ప్రస్తుత పోరాటం అంతే కఠినంగా ఉంది. కాని అంత కాల్పనికంగా లేదు. అందువల్ల బయటి ప్రజలకు ఆసక్తి పోయినట్టుంది. కాని బొలీవియన్ ప్రజలు తమ పోరాటం కొనసాగిస్తారు. పరిస్థితులు ఇప్పుడున్నట్టుగా కూడ ఉండబోవడం లేదు. ఇంకా ఇంకా కఠినం కాబోతున్నాయి.”

*****

మొయిమా వీజర్ ముందుమాట

1975 లో మెక్సికోలో అంతర్జాతీయ మహిళా సంవత్సరం సందర్భంగా ఐక్యరాజ్య సమితి ఒక  సమావేశం ఏర్పాటు చేసింది. అక్కడ నేను దొమితిల బారియోస్ ద చుంగారాను కలుసుకున్నాను. నాకప్పుడే ఈ కథనం గురించి ఆలోచన కలిగింది.

దొమితిలా బొలీవియన్ ఆండీస్ నుంచి వచ్చింది. ఆవిడ ఒక గని కార్మికుని భార్య. ఏడుగురు పిల్లల తల్లి. అక్కడి తగరం గనుల్లో కార్మికుల భార్యల సంఘం ఐన “సైగ్లో-20 గృహిణుల  సంఘం” తరపున ఆమె ఈ సమావేశానికి వచ్చింది. ఆమె పోరాట చరిత్ర వల్లా, నిబద్ధ కృషి వల్లా ఐక్య రాజ్యసమితి ఆమెను ఈ సమావేశానికి ఆహ్వానించవలసి వచ్చింది. ఈ సమావేశంలో బొలీవియా ప్రతినిధిగా చురుకుగా పాల్గొన్న ఏకైక కార్మికవర్గ స్త్రీ కావడంతో హాజరైనవారందరూ దొమితిలా భావాలతో ప్రభావితమయ్యారు. ఒక స్వీడిష్ పాత్రికేయురాలి మాటల్లో చెప్పాలంటే “అక్కడ మిగిలిన స్త్రీలు ఏ జీవితం గురించి ఉపన్యాసాలిచ్చారో, దొమితిలా ఆ జీవితం గడిపింది.” ఆమెకందిన గౌరవానికి కారణం అదే.

సమావేశానికి హాజరైన ఫలితంగానే ఈ పుస్తకం తయారైందని దొమితిలా భావిస్తోంది. నిజానికి ఈ కథనం దుర్భర వేదనకు గురవుతున్న జనాల అనంత ఘోష, స్త్రీ విమోచనోద్యమం మౌలికంగా ఎట్లా ప్రజానీకపు సాంఘికార్థిక రాజకీయ సాంస్కృతిక విముక్తితో ముడిపడి ఉన్నదో చెప్పి, ఆ క్రమంలో స్త్రీ పాత్రను ఈ నేపథ్యంలోంచి మాత్రమే పరిశీలించాలని ఈ కథనం స్పష్టంగా ప్రకటిస్తుంది.

ఇక్కడ నేను మీ ముందుంచుతున్నది దొమితిలా తనకు తానే వినిపించుకున్న దండకం కాదు. మెక్సికోలోనూ, బొలీవియాలోనూ నేను ఆమెతో జరిపిన ఎన్నో ఇంటర్వ్యూలు, అంతర్జాతీయ మహిళా సమావేశంలో ఆమె ఉపన్యాసాలు, చర్చలు, సంభాషణలు, కార్మిక బృందాలతో, విద్యార్థి బృందాలతో, యూనివర్సిటీ ఉద్యోగులతో, కార్మికవాడల ఇరుగుపొరుగు జనాలతో, మెక్సికోలో అజ్ఞాతంలో జీవిస్తున్న లాటిన్ అమెరికన్లతో, పత్రికలు, రేడియోలు, టెలివిజన్ల ప్రతినిధులతో ఆమె జరిపిన సంభాషణలు – అన్నీ కలిసిన ఉత్పత్తి ఈ కథనం.  వేరు వేరు వనరుల నుంచి సేకరించిన ఈ సమాచారాన్నంతా దొమితిలా నేనూ కలిసి సరి చేశాం. ఈ క్రమంలో కొన్ని ఉత్తరాలు కూడా పరిశీలించాం. ఇలా ఎన్నెన్నో ప్రయత్నాలవల్ల ఈ మౌఖిక చరిత్ర కథనం రూపొందింది.

దొమితిలా తాను జీవించిన నిర్దిష్ట పరిస్థితులకూ, తాను ఎవరి గురించి మాట్లాడుతున్నదో ఆ ప్రజలకూ తగినట్టు ఉంటుంది. వ్యక్తిగత సంభాషణల్లో ఆమె మాట్లాడే తీరుకూ, సమావేశాల్లో ఉపన్యాసాలకూ, లాంఛనప్రాయమైన సంభాషణల్లో చిన్న చిన్న బృందాలతో సంభాషణల్లో మాట్లాడే తీరుకూ చాలా తేడా ఉంటుంది. దీన్ని బట్టే ఈ పుస్తకంలో దొమితిలా మాటల్లో శైలిమారడం అర్ధం చేసుకోవచ్చుననుకుంటాను. ఈ శైలి మార్పు కొందరు పాఠకుల్ని ఆశ్చర్యపరచొచ్చు కూడా.

దొమితిలా భాష ప్రజల మనిషి ఐన ఒక స్త్రీ భాష. దాంట్లో ఆమె సొంత వర్ణనలూ, నుడికారాలూ, సొంత వాక్య నిర్మాణాలూ కనబడతాయి. వీటి మీద ఆమె చిన్నతనం నుంచీ అలవాటుపడిన ‘కెచువా’ భాష ప్రభావం ఉంది. ఈ కథనంలోని ఈ అంతర్లీన లక్షణమే మామూలు మాటల్లోని గొప్పదనాన్ని సాహిత్యానికి కానుకగా విశదీకరిస్తుంది.

ఇంతవరకూ మామూలు, పేద ప్రజానీకపు అనుభవాల లిఖిత క్రోడీకరణ చాలా తక్కువగా జరిగింది. ఈ కథనం ఈ అగాధాన్ని పూడ్చేసింది. మామూలు అనుభవాలు కూడా పునరాలోచనకూ, ముందుచూపుకూ ఉపయోగపడతాయనీ, ఆ రకంగా ఈ పుస్తకం బొలీవియన్, ఇతర లాటిన్ అమెరికన్ దేశాలు, ఇతర దేశాల ప్రజల కోసం పాటుబడుతున్న స్త్రీ పురుషులకు ఉపయోగపడుతుందనీ తెలుస్తోంది.

ఈ పుస్తకం ఒక పనిముట్టు. “రాబోయే తరానికి ఏదో ఒకరకంగా మన అనుభవాలు ఉపయోగపడాలనే కోరికతో, ఈ చిన్న మెత్తు కానుకను” ఇవ్వడానికి దొమితిలా ఒప్పుకుంది. “ఎందుకంటే మనం మన చరిత్ర నుంచే అనుభవాలు తీసుకోవడం ముఖ్యం”. ఏ విధంగానైతే “ఇతర ప్రజానీకపు అనుభవాలు తీసుకుంటామో అలాగే మనకూ “ఒక కథనం ఉండాలి”. ఈ కథనం మనకు “మన కార్యక్రమాల పరిశీలనకూ, విమర్శకూ” సాయపడుతుంది.

దొమితిలా జనజీవన పాఠశాలలో సానపెట్టబడింది. గని ప్రాంతంలోని గృహిణుల విసుగెత్తే, కష్టతరమైన రోజువారీ జీవితంలోంచే ఆమె – ఒక్క కార్మికులు మాత్రమే దోపిడీకి గురికావడం లేదనీ, వ్యవస్థ స్త్రీనీ, కుటుంబాన్నీ కూడ దోపిడీ చేస్తున్నదనీ గుర్తించింది. ఈ గుర్తింపే ఆమెను కార్మికవర్గ సంఘటిత పోరాటాల్లో చురుగ్గా పాల్గొనేట్టు చేసింది. తన చెల్లెళ్లతో కలిసి ఆమె తన ప్రజానీకపు జయాపజయాలను చవి చూస్తూ బతికింది. ఈ అనుభవ నేపథ్యం నుంచే ఆమె వాస్తవాన్ని వివరిస్తుంది. ఆమె చెప్పే ప్రతి అంశమూ జీవితంలోని ఒక్కో కోణం.

బొలీవియా చారిత్రక విశ్లేషణనుగానీ, గని కార్మిక ఉద్యమాన్ని గానీ, “సైగ్లో-20 గృహిణుల సంఘం” గురించి గానీ వివరిస్తున్నానని దొమితిలా అనుకోవడం లేదు. కేవలం ఆమె తాను గడిపిన జీవితమేమిటో, తన అనుభవాలేమిటో వివరిస్తుంది. కార్మికవర్గమూ, ప్రజా ఉద్యమమూ తన గమ్యం మీద పట్టుతెచ్చుకోగల పోరాటం కొనసాగింపు క్రమంలో తానేం నేర్చుకున్నదో దొమితిలా వివరిస్తుంది.

దొమితిలా ఏం చెప్పినా మనం ఇతర ఆత్మకథనాల్ని చూద్దాం. ఇదివరకే గనుల్లోనో, ఫ్యాక్టరీల్లోనో, మురికి వాడల్లోనో, పల్లెసీమల్లోనో ఉన్న స్త్రీ పురుషులు కొందరు తమ అనుభవాల కథనాలు వినిపించారు. దాంట్లో కథకులు తాము జీవించిన స్థితిగతుల గురించి చెప్పడం మాత్రమే కాదు, అవి అలా ఉండడానికి కారణాల గురించీ, ఆ పరిస్థితి పోగొట్టడానికి అవసరమైన పోరాటం గురించీ చైతన్యవంతంగా ఉండేవారు. ఈ అర్ధంలో దొమితిలా కథనంలో లోతైన పరిశోధనాత్మక చారిత్రక విశ్లేషణ ఇమిడి ఉంది. ఇది వాస్తవాలను ఒక విశాల దృక్పథం నుంచి వ్యాఖ్యానించే ప్రయత్నం.

అంటే ఈ కథనం విలువ తక్కువేమీ కాదు. మనం ఈ స్త్రీ మాట్లాడేది వినవలసి ఉంది. విని, ఆమె ఎలా బతుకుతుందో, ఎలా అవగాహన చేసుకుంటుందో, సంఘటనలను ఎట్లా వ్యాఖ్యానిస్తుందో అర్ధం చేసుకోవాల్సి ఉంది.

ఇక్కడ చెప్పిందేదీ బొలీవియా వాస్తవికతకు దూరమైంది కాదు. ఎందుకంటే దొమితిలా స్వీయ ప్రయాణ మార్గం కూడ బొలీవియా ప్రజల జైత్రయాత్రలో భాగమే.

అందుకనే నేనీ పుస్తకాన్ని మూడు భాగాలు చేశాను. మొదటి భాగంలో దొమితిలా తన ప్రజలను వివరిస్తుంది. వారి జీవన పరిస్థితుల్ని, పని పరిస్థితుల్ని వివరిస్తుంది. వాళ్లు సంఘటిత కార్మికవర్గ ఉద్యమంలో ఎలా సంలీనమయ్యారో వివరిస్తుంది. రెండో భాగంలో ఆమె తన ప్రజలు అనుభవించిన చారిత్రక నేపథ్యంలో తన జీవితాన్ని మన కళ్లకు కడుతుంది. మూడో భాగంలో 1976లో గనుల యదార్థ దృశ్యం చిత్రణ ఉంది. మరీ ముఖ్యంగా జూన్, జూలై సమ్మె తర్వాత గని పరిస్థితి వివరణ ఇందులో ఉంది.

ఇక దొమితిలా మాటలు వినండి.

మొయిమా వీజర్

డిసెంబర్ 30, 1976

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.