“నెచ్చెలి”మాట 

“రోజుకి ఇరవైనాలుగ్గంటలే”

-డా|| కె.గీత 

నన్ను చాలా మంది ఎప్పుడూ అడుగుతూ ఉంటారు “మీకు టైం ఎలా సరిపోతుందండీ” అని. 

నిజానికి సమయం మనకు ఎప్పుడూ సరిపోదు. మనమే సరిపెట్టుకోవాలి, జీవితంలో చాలా చాలీచాలని వాటిల్లాగే! 

ఇందులో ఓ గొప్ప విషయం ఏవిటంటే  ప్రపంచంలో అందరూ ఇక్కడ సమానులు కావడం! 

రాజూ పేదా తేడా లేనిది సమయం ఒక్కటే!! 

ఓహో! ఏ మనిషికీ మరో మనిషితో పోలిక లేకుండా ఎంతో  విలక్షణమైన ఈ ప్రపంచంలో ఏ హెచ్చు తగ్గుల్లేకుండా  ఓ విషయముందీ అంటే ఎంత బావుందో కదా!! 

అదలా ఉంచి అసలు విషయానికొద్దాం. 

మరి ఉన్న ఇరవై నాలుగ్గంటల్లో తలకు మించిన పనులు చెయ్యడమెట్లా? 

“ఆ… అడగంగానే చెప్పేస్తారు మరి”

“మరదే కిటుకు” 

“నాకు నిద్రాహారాలు లేవు” 

“పనులండీ…పనులు”

“ష్ … ఎవరికీ చెప్పకండేం”

ఇలా..  సవాలక్ష గొప్ప సమాధానాలమాటికేం గానీ విషయమేమిటంటే- 

ఉండాల్సిందొక్కటే – 

“క్రమశిక్షణ” 

ఓస్ ఇంతేనా. అనిపించే మాటైనా చాలా కష్ట సాధ్యమైనది  ఇది. క్రమశిక్షణ ఉంటే అన్నీ కుదురుతాయి. 

ఇంతకీ “క్రమశిక్షణ” అంటే ఏవిటో? అని భయపడేలా ఉన్న ఈ పదానికి  మొదటి అర్థం ఏవిటంటే 

“ఇచ్చట వాయిదా లేదు” 

అంటే దీని గురించి వివరంగా చెప్పడానికి కొంచెం బద్ధకంగా ఉంది.  ఇంకోసారెప్పుడైనా చెప్పుకుందాం అనకూడదు. 

అదన్నమాట! 

ఇక రెండో  అర్థం ఏవిటంటే

“ఒకేసారి పది పన్లు  చెయ్యబడును”  

అంటే ఒక చేత్తో వంట చేస్తూ , రెండో చేత్తో పిల్లాణ్ణి మొట్టికాయ కొడుతూ, చెవులతో  బాతాఖానీ ఫోను బకాయిలు తీర్చడంలాంటిదన్న మాట!

ఇక మూడో  అర్థం ఏవిటంటే

“టైమ్ టేబుల్ ”  

అంటే రోజూ ఒక అరగంట గార్డెను పని చేస్తే సంవత్సరం తిరిగే సరికి పంట చేతికొచ్చినట్టే కదా! 

ఆ… ఆగమ్మా ఆగు.  ఒక రోజంటే అనుకోవచ్చు, పోనీ నెల్లాళ్లు ఏదో ఆరంభ శూరత్వం కొద్దీను. 

మరి సంత్సరాల తరబడి ఇన్ని పనులు చెయ్యడానికి ఉత్సాహం ఎక్కడొచ్చి చస్తుందీ…. 

అదే మరి అసలు విషయం! 

చేసే ప్రతి పనీ “ఇష్టం” అయినదే చెయ్యాలి. ఇష్టం గానే, ఇష్టం తోనే చెయ్యాలి.

ఇదో “నెచ్చెలి” లా-

చల్లని వెన్నెల రాత్రి ఆరుబయట  నిశ్శబ్దంగా పారే సెలయేటి ఒడ్డున ఆహ్లాదంగా కబుర్లు కలబోసుకున్నట్టు 

“నెచ్చెలి” ని నెలనెలా రూపుదిద్దడం  ఓ అందమైన అనుభూతి!

ఇక్కడ రోజుకి ఇరవై నాలుగ్గంటలు లేవు. కాలమంతా ఇమిడి ఉంది!!

*****

Please follow and like us:
error

2 thoughts on “సంపాదకీయం-సెప్టెంబరు, 2019”

  1. మీ లాంటి క్రమశిక్షణ గల సంపాదకురాలి వద్ద మేము పనిచేయటం వల్ల మాకు కూడా ఎంతో కొంత అబ్బదా అన్న ఆశతో .కాలం విలువ తెలిసిన డాక్టర్ గీత గారికి అభినందనలతో,ముందు ముందు మీరు మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటూ
    ఇట్లు మీ వసుధారాణి.

    1. థాంక్యూ సో మచ్ వసుధ గారూ ! మనందరం కలిసి కాలాన్ని పంచుకోవడం ఎంతో బావుంది నాకైతే. చక్కని ధారావాహికను రాస్తున్నందుకు మీకు కూడా అభినందనలు!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *