ఉనికి పాట

ఓ వీధిదీపం నీడన

-చంద్ర లత    

అతనొక సామాన్యుడు.బడిపంతులు.అందమైన ప్రేయసి. కుదురైన జీవితం. కలల దుప్పటి కప్పుకొన్న యువకుడు.

ఆమె ఒక కేబరే గాయని. నటనావిద్యార్థి. ఒక గాయపడ్డ గృహిణి.వంటరి తల్లి. సాంప్రదాయాలకు ఆవలగా విచ్చుకొన్న గొంతుక.

అతనొక సైనికాధికారి. రాజద్రోహిగానిలిచిన దేశబహిష్కృతుడు. కరుకు నిబంధనల్లో విదిల్చిన సిరాచుక్క.

ఆమె ఒక కళాకారిణి. నియంతృత్వం గీసిన గీటు దాటి గొంతెత్తితే,మరణదండనే. పాడమన్న పాట పాడలేక, ఖండాంతరాలు చేరిన కాందిశీకురాలు.

భిన్నమైన మనుషులు,నేపథ్యాలు.

భిన్నమైన కాలాలు.దేశాలు.

ఈ నలుగురినీ ఒక్క గాటన కట్టింది.

ఒక అందమైన పాట.

అవి ప్రపంచ యుద్ధాల రోజులు. మనిషిని మనిషి నమ్మలేని రోజులు. చిన్నాభిన్నమైన పరిపాలనలు. కకావికలైన పౌరులు. విధ్వంసం.విద్వేషం. ముక్కలుముక్కలవుతున్న విలువలు. మాయమవుతున్న మనిషితనాలు. అనిశ్చితి.అభద్రత. కుప్పలు తెప్పలుగా విరుచుకుపడిన ఆశల శకలాలు. దేశం కాని దేశాలు.హద్దుల్లేని ఆకాంక్షలు. ఊపిరి పై నియంత్రణలు.

ఎవరి జీవన పోరాటమే వారి అస్తిత్వం. వారి ఉనికి.

ఈ నేపథ్యంలో, ఒక యువకుడి మధురభావన, ఎడబాటు కలిగించిన వేదన ఎవరు పట్టించుకొంటారు? లోకాలే మండి పోతోంటే,మట్టికొట్టుకుపోతోంటే, సున్నిత మనోభావాల కవిత్వానికి అక్కడ పనేమిటి? చోటెక్కడ?

ఆ బడిపంతులు, జర్మన్ దేశస్తుడు, సైనికుడు. హాన్స్ లీప్ .                                                                  

ఆ కేబరే గాయని , స్విట్జర్ ల్యాండ్ సరిహద్దుల్లోని  దిగువ జర్మనీవాసి. లెలె ఆండర్సన్.

ఆ సైనికాధికారి బ్రిటిష్ ఉన్నతాధికారి. మిత్రవర్గాల వాడు. నార్మన్ బెయిలీ స్టూవర్ట్.

ఆ కళాకారిణి జర్మన్లో పుట్టిన అమెరికన్ పౌరురాలు. హాలీవుడ్ దిగ్గజం. మార్లీన్ డీట్రిచ్. 

ఇంతకీ, ఆ పాట ప్రచార గీతము కాదు.ప్రభోదగీతం అంతకన్నా కాదు.

అనురాగం రంగరించిన ఒక ప్రేమ గీతం. ఒక ప్రియ రాగం.

ప్రేమ ,ఎడబాటు లతో  ప్రతి అక్షరం తడిచి ముద్దయ్యే పాట.

కలియికల కలల దారాలతో అల్లుకొన్న అందమైన పాట. లిలీ మార్లీన్.

 హాన్స్ లీప్  (1893 -1983)జర్మనీ లోని నౌకాశ్రయపట్టణం హాంబర్గ్ లో పుట్టాడు. ఒక మంచి చిత్రకారుడుకావాలని అనుకొనే వాడు.1915 లో యుద్ధంలో చేరమని ఆజ్ఞలు అందుకొనే నాటికి,హాన్స్ లీప్ బడిపంతులుగా పని చేస్తున్నాడు.  జర్మన్ సామ్రాజ్య సైనికుడిగా ఉన్నప్పుడే, “లాంతరు నీడలో యువతి” కి పదాలు అద్దాడు. 1917లో గాయాల కారణంగా లీప్ ను యుద్ధం నుంచి పంపివేశారు. 1937 లో , “ది లిటిల్ హార్బర్ ఆర్గాన్” పేరిట అచ్చయిన తన జర్మన్ కవితల పుస్తకంలో ఈ కవితను చేర్చాడు.  చిత్రకారుడు కావాలని అనుకొన్నా, జర్మన్ రచయితగా పేరొందాడు. అతని సుప్రసిద్ధ నవల , “గొడెకె సేవకుడు” (1925) కు ప్రతిష్టాత్మకమైన “కొలోన్ వార్తాపత్రిక ” బహుమతిని అందుకొన్నాడు. మొదట వ్రాసినప్పుడు “లాంతరు నీడలో యువతి” (1915)మూడు పాదాల కవిత. మళ్ళీ రెండు పాదాలు జతపరిచి ,”యువ సైనికుడి పాట”(1937) పేరిట  అచ్చువేసాడు లీప్. 

1938లో నొర్బెర్ట్ స్కల్జ్  ఈ కవితను పాటలా స్వర పరిచాడు. 1939లో లెలె ఆండర్సన్ పాడిన పాటను రికార్డ్ చేశారు.

 జర్మన్ భాషలో పాడిన ఈ పాట , సుమారు 48 భాషల్లోకి అనువదించ బడింది. దాదాపు 200 రకాలుగ పాడిన ఈ పాటను 2006 లో హాంబర్గ్ కు చెందిన “బేర్ ఫ్యామిలీ రికార్డ్” వారు పదిలపరిచారు. 

ఓ కళాకారుడిగా ఎదగాలని హాన్స్ లీప్    కలలు కనే రోజుల్లో, విరుచుకుపడిన యుద్ధం. అనివార్యంగా అనుసరించిన సైనికజీవితం. యుద్ధం మిగిలిచిన గాయాలు, యుద్ధరంగం నుంచి సెలవు ఇప్పిస్తే, గాయపడిన మనసుకు అతని కలం ఊరట అయ్యింది.ఊతం అయ్యింది. నవలాకారుడిగా  కవిగా ఎదిగాడు. అయినప్పటికీ,అందరి మనసులలో మిగిలింది ఒక గీత రచయిత గా .

లెలె ఆండర్సన్ (1905-1972) ప్రస్తుతం దిగువ జర్మనీ లోని బ్రేమర్ హావెన్ లో భాగమైన”లెహె ” నౌకాశ్రయ పట్టణంలో పుట్టింది.పదిహేడవఏట అయిన వివాహం, లెలె ను  ముగ్గురు పిల్లలకు తల్లిని జేసింది. పొసగని వైవాహిక సంబంధం నుంచి లెలె విడిపోయాక ,ముగ్గురి పిల్లల వంటరితల్లిగా, నటనా విద్యార్థిగా జీవితం మొదలెట్టింది. పేరెన్నిక గన్న బెర్లిన్  “కామెడీ కాబెరే” వేదికల మీద ప్రదర్షనలు ఇచ్చింది. అప్పుడు నొబెర్ట్ స్కల్జ్ తొ అయిన పరిచయం, . “లిలీ మార్లీన్” పాట గాయనిని చేసింది. 1939లో మొదటి సారిగా జర్మన్ భాషలో దీనిని రికార్డ్ చేశారు.1941 వరకు కేవలం 700 రికార్డులే అమ్ముడు పోయిన ఈ పాట రికార్డులు, రేడియో బెల్ గ్రేడ్  ప్రసారాలతో ఒక్క సారిగా మిల్లియన్ కాపీలు అమ్ముడయాయి. ఇంత స్థాయిలో అమ్మకం జరగిన మొదటి జర్మన్ పాట ఇదే.

నాజీ ప్రచార మంత్రి, జోసెఫ్ గోబెల్స్ ,ఈ పాట ప్రసారాలను వెంటనే నిలివేయమని ఆదేశించాడు. లెలె , నోబెర్ట్ లు గృహనిర్భంధం చేయబడ్డారు. కాన్సెంట్రేషన్ క్యాంపు కు పంపడం  ఖాయం అయ్యింది. నిజానికి, గోబెల్స్ కు ఆ పాటతో వచ్చిన పేచీ ఏమీ లేదు. మొదటి అభ్యంతరం . లెలెకు రోల్స్ లెబెర్మన్ ,తదితర యూదు కళాకారులతో ఉన్న సన్నిహిత సంబంధాల చేత ,లెలె ను యూదు సానుభూతి పరురాలిగా భావించడం. రెండవ కారణం. నాజీ ప్రచార సంగీతం లా  యుధ్ధోన్ముఖులను చేసే ఉత్తేజ భరితంగా ఉండక, ఈ పాట విషాదంలో ముంచెత్తేదిగా ఉందనీ, సైనికులను బలహీన పరిచేలా ఉన్నదని, రాగం పేలవం గా ఉన్నదని భావించడం. 

నాజీ ప్రచార సంగీతంలో లాలిత్యానికి స్థానం లేదు. రచయితలు, కళాకారులు.నట గాయక విద్వాంసులు,  నియంతలు పాడమన్న పాట పాడాల్సిందే.ఆడమన్న ఆట ఆడాల్సిందే.

ఈ గృహ నిర్భంధాన్ని ,పాటలపై నియంత్రణను తట్టుకోలేక , లెలె ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసింది.

అయితే,“లిలీ మార్లీన్” పాటకు శ్రోతలలో ఉన్న విపరీతమైన ప్రాచుర్యం చేత, గోబెల్స్, రొమ్మెల్ తమ పట్టు సడలించుకోవాల్సి వచ్చింది. నిజానికి, లెలె ను, నొబర్ట్ ను క్షేమంగా ఉన్నట్లు శ్రోతల ముందు నిలపడానికి , వారు ఎంతో తగ్గి, సమన్వయ పరుచుకోవాల్సివచ్చింది.అలాగే, లెలె , నొబర్ట్ లు కూడా.

నోబర్ట్ అప్పటికే , నాజీ ప్రచార శాఖకు కొంత , ప్రచార సంగీతాన్ని సమకూర్చి ఉండడం వలన, మరణం నుంచి  వెంట్రుకవాసిలో తప్పించుకొన్నాడు.

1942 లో గోబెల్స్  కఠిన నియమాలకు సరిపడేలా  , సైనిక ఢంకా మొదలయిన యుద్ధ సంగీత వాయిద్యాలను జతపరిచి ,లిలీ మార్లీన్ మిలటరీ వర్షన్ ను రికార్డ్ చేశారు. రొమ్మెల్ ఆ పాటను రాత్రివేళ మాత్రమే ప్రచారం చేసేందుకు పరిమితం చేశాడు. ప్రతిరాత్రి తొమ్మిది గంటల యాభై అయిదు నిమిషాలకు ఈ పాట ప్రసారం జరిగేది. ఆ సమయం సైనికులకు అనుకూలమైనది కావడం, ఇంటి నుంచి సందేశాలు అందడం ,పాట ప్రాచుర్యానికి  ఎంతో కలిసివచ్చింది.

ఆ క్రమంలోనే , లిలి మార్లీన్ ఇంగ్లీషు అనువాదం రికార్డు చేయ బడింది.

వారి ఇరువురి చేత కొన్ని ప్రచార గీతాలను రికార్డు చేయించారు. యుద్ధం అనంతరం , ఓ శిధిలమైన ఆసుపత్రి భవనం లో దొరికిన లెలె , లిల్లి మర్లీన్ పాటే తనకు ఆయువు పోసిందని చెప్పింది.యుధ్ధానంతరం,కొంత కాలం అజ్ఞాతంలోకి వెళ్ళి ,మరల గాయనిలా తన జీవితాన్ని కొనసాగించింది లెలె ఆండర్సన్.”ఆకాశానికి అనేక రంగులు ” పేరిట రాసిన పుస్తకంలో తన జీవిత అనుభవాలను పంచుకొంది. జర్మనీ లోని లాంగెఆన్ లో లెలె జ్ఞాపకార్థం ఒక శిల్పాన్ని మలిచి ఉంచారు.  లాంగెఆన్ లో ఓ వీధి దీపం కింద నిలబడిన లిలి మార్లీన్ లా పలకరిస్తుంది లెలె ఆండర్సన్.

రెండో ప్రపంచ యుద్ధం నుండి వందలాది యుద్ధ ట్యాంకులు, లక్షలాది  యుద్ధ ఆయుధాలతో పాటుగా ఒక శతృవు పాటను మిత్రపక్షాల వారు తీసుకెళ్ళారు. రెండో ప్రపంచ యుద్ధానికి ఒక “సూచికా శిలాజం “(index fossil) గా పేర్కొనే లిలి మార్లీన్ పాటను , హాన్స్ లీప్  కవితల పుస్తకంలో నుంచి తీసి , స్వరపరిచినవాడు , నొబెర్టొ స్కల్జె (1911-2002) సంగీతదర్షకుడు. అనేక ఒపెరాలకు,నాటకాలకు, సినిమాలకు, సంగీతప్రదర్షనలకు సంగీతాన్ని రచించాడు. లిలి మర్లీన్ పాటను స్వరపరిచినప్పటీకే అతను ప్రాచుర్యంలో ఉన్న సంగీతదర్షకుడు. లిలి మార్లీన్ ను నిషేధించి, అతనిని  గృహ నిర్బంధంలో ఉంచినపుడు, అతనిని కాపాడింది అంతకు పూర్వం అతను స్వరపరిచిన ఇతర దేశభక్తిపూర్వక పాటలు, లిలి మర్లీన్ కు గల ప్రాచుర్యం. నొబెర్టొ ధైర్యవంతుడు కాపోవడం వలననే, నాజీ ప్రచార మంత్రిత్వ శాఖతో సహకరించ వలసి వచ్చింది.నియంతల ఆదేశానుసారం , బరువైన లిలిమార్లీన్ ను తేలికపాట గా స్వరపరిచి ,తిరిగి రికార్డ్ చేసారు. అప్పుడే, ఇంగ్లీషు లోకి జరిగిన అనువాదాన్ని స్వరపరిచాడు.

లిలిమర్లీన్ ను ఇరుపక్షాల యుద్ధగీతంగా మార్చిన ఘనత కార్ల్ హైంజ్ రీంటన్ ది. యుగొస్లావియా ను స్వాధీన పరుచుని, “రేడియో బెల్ గ్రేడ్ ” ను నాజీ ప్రధాన ప్రచార కేంద్రంగా మలుచుకొంది.ఆ యుద్ధదాడిలో రేడియో స్టేషన్ లోని అన్ని రికార్డులు ధ్వంసం అయినా, నిషేదించబడి, ఒక సూట్ కేస్ అడుగున పడి ఉన్న లిలి మార్లీన్ రికార్డు మాత్రం పదిలంగా ఉన్నది. మరొక రికార్డులేవీ అందుబాటులో లేకపోవడంతో, నాజీ ప్రచారకార్యక్రమాల విరామ సమయంలో, కార్ల్ పదేపదే “లిలి మార్లీన్” ప్రసారం చేసేవాడు. అప్పటికి కేవలం 700 రికార్డులు మాత్రం అమ్ముడయ్యాయి.

రేడియో బెల్ గ్రేడ్ ప్రసారం మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే , ఈ పాట రికార్డులు మిలియన్ కాపీలు అమ్ముడు పోయాయి.

పాటతో ముడిపెట్టి , “ఇంటినుంచి సందేశాలు ” అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సైనికులు ఇళ్ళకి సందేశాలను పంపే వారు.అందుకొనే వారు. ప్రతిరాత్రి 10 గంటల వార్తలకు ముందు ,ఈ పాటను ప్రసారం చేసే వారు. రాను రాను ఈ పాట సైనికుల జీవితంలో భాగమై పోయింది.

ఆ సమయానికి సైనికులంతా, గూళ్ళకు మళ్ళిన పక్షుల్లా రేడియో చుట్టూ చేరిపోయే వారు. ప్రతిరోజూ రాత్రి తొమ్మిదిగంటల యాభై అయిదు నిమిషాలకు ఆ పూట నాజీ ప్రచార కార్యక్రమాలను ముగింపు గీతంలా లిలి మార్లీన్ పలకరించేది. భాషలకు అతీతంగా యూరోప్ లోని సైనికులంతా ,ఈ పాటను వినేవారు. ఎడారి. మంచు .మైదానం . అలసిన సైనికుల చేతుల్లో ,వెలిగీవెలగని సిగరెట్టు వెలుతురు , ఆకాశంలో మెరిసే తారలు, చుట్టూ చిమ్మ చీకటి ,ఎదురుగా రేడియో ఆడుతోన్ననట్టుగా  మిణుక్కుమనే చిన్నిబల్బు వెలుగు. నెమ్మదిగా,గాఢానురక్తితో,మత్తుగా,మార్దవంగా సాగే లెలె ఆండెర్సన్ గొంతుక. ఆ పూట సైనికులను నిద్రపుచ్చే గుళిక.

యుద్ధభూమి, ఆసుపత్రి, కాన్సెన్ ట్రేషన్ క్యాంప్.శరాణార్థి శిబిరాలు అన్ని చోట్లా ఈ పాట వినిపించబడింది.    

    రేడియో బెల్ గ్రేడ్  నాజీ ప్రచారాల్లో భాగంగా ఇంగ్లీషు ప్రసారాలను మొదలు పెట్టింది. “జర్మన్  కాలింగ్ ” పేరిట సాగే ఈ కార్యక్రమాలను నిర్వహించేవాడు నిర్వహించిన వారిలో బ్రిటిష్ వాడు నార్మన్ బెయిలీ స్టూవార్ట్. ఇతను బ్రిటిష్ ఉన్నత సైనికాధికారి. మొదట భారత దేశ బ్రిటిష్ సామ్రాజ్యం లో, పంజాబ్ రెజిమెంట్లో పని చేసి, సమస్యాత్మకంగా మారి,క్రమశిక్షణాచర్య కింద బ్రిటన్ కు తిరిగి వచ్చాడు. అతని జర్మన్ ప్రియురాలి కోసం, జర్మనీ లో అడుగుపెట్టి, జర్మనీ గూఢాచారి గా , నాజీ ప్రచార వేత్తగా మారిపోయాడు.మిత్రపక్షాల తరుపున పనిచేయడానికి వచ్చి, వారి గూఢాచారిగా మారిఫోయిన నేరానికి బ్రిటిష్ సామ్రాజ్యరాజద్రోహిగా భావించి, దేశ బహిష్కరణ కు లోనయ్యాడు. నాజీ ప్రచార శాఖలో భాగమయిన , రేడియో బెల్ గ్రేడ్ లో పని చేస్తున్న క్రమంలోనే, నాజీ నియంతృత్వ కార్యక్రమాలపై భ్రమలు తొలగి పోతూవచ్చాయి. వాటి పట్ల అయిష్టత పెంచికొన్నాడు. నాజీ ప్రచార వార్తలను ప్రసారం చేయడం ఇష్టపడక,చేయకపోతే తప్పని పరిస్థితిలో, ఇరకాటంలో పడిన నార్మన్, విరామ సంగీతంపై మక్కువ పెంచుకొన్నాడు .లిలి మార్లీన్ ను ఇంగ్లీషులోకి అనువదించాడు. నిర్భంధంలో ఉన్న లెలె , నొబర్ట్ లు  రేడియో బెల్ గ్రేడ్ కోసం లిలి మార్లీన్ రికార్డ్ చేసారు. ఎంతో అయిష్టంతో చేసిన ఈ పని, ఇరుపక్షలా సైనికులకు అత్యంత అభిమాన పాత్రమయ్యింది.ఇంటినుంచి సందేశాలను అందించే ఆ కార్యక్రమం సైనికుల భావోద్వేగాలతో ముడిపడిపోయింది. ఇంటితో ఇల్లాలితో పెనవేసుకొన్న తమ జీవితంతో ఒక సజీవ సంబంధం అయిపోయింది ఈ పాట. 

విరామం లేకుండా ప్రసారం చేసిన ఆ పాట , స్టాలిన్ గ్రాడ్ ను మిత్రపక్షాలు ముట్టడించడంతో, మొదటిసారిగా ,బెర్లిన్ మూడు రోజుల పాటు అన్నిరకాల వినోద కార్యక్రమాలను రద్దు చేసింది. 2 ఫిబ్రవరి 1943 న , దాదాపు 500 రోజుల వరుస ప్రసారం తరువాత ,మొదటి సారి లిలి మార్లీన్ మౌనం వహించింది. ఎంతో చిత్రంగా 3 ఫిబ్రవరి 1943 , లెలె ఆండెర్సన్ తన  నిర్భంధంలోనుంచి ఇంటికి పంపిన సందేశాన్ని BBC ప్రసారం చేస్తూ,

 “ఇల్లు.ఇల్లు.ఇల్లు.అది జర్మన్ సైనికులదేనా? మా అందరిది కాదా?” అంటూ లిలి మార్లీన్ కు పట్టిన అవస్థ ను ప్రకటించింది. అప్పుడే, ఇక   జర్మన్ లకు లిలి మార్లీన్ తోనే సందేశం పంపే సమయమ ఆసన్న మైందని ప్రకటించారు. లిలిమార్లీన్ స్వరంలో హిట్లర్ వ్యతిరేకసాహిత్యం వినిపించారు

బ్రిటన్ శరణార్ధి , జర్మన్   యూదు గాయని , లూసీ మాన్నెహం ,సరికొత్త  మాటల లిలి మార్లీన్ పాట తో , నియంత దురాగతాలకు మొదటిబాదితులయిన తమ పౌరులను, జర్మన్ సైనికులను వారి ఇంటికి ఆహ్వానించారు. చిధ్రమైన రుద్రభూమిని తిరిగి చిగురింపజేయాల్సిన సమయం అది.  ” అవమానం ,యుద్ధము నుండి విముక్తమైన మన దేశానికి తిరిగి రండి” అంటూ.

యుద్ధానంతరం ,కార్ల్ రాజద్రోహం నేరం కింద శిక్ష అనుభవించాడు. అతనికి మరణ దండన నుంచి తప్పించిందీ , అతనిలో కలిగిన నాజీ అయిష్టత పరోక్షంగా ప్రకటీంచుకొన్న లిలి మర్లీన్ పాటే.

అటు కవితగా పాటగా , గాయకులు స్వరకర్తలు ,రేడియో ప్రచారకులు నిర్భంధాలకు ,అనేకానేక మార్పులకు గురయిన ఈ పాట ఇంతగా పాచుర్యంలోకి రావడానికి, మిత్ర పక్షాల పాత్ర ఎంతో ఉన్నది.

అందుకు ముఖ్యమైన వ్యక్తి మార్లీన్ డీట్రీక్ (1901 -92). నాజీ ప్రచార కార్యక్రమాలలో పాల్గొనడానికి నిరాకరించి, అమెరికా చేరుకొంది. నటి.గాయని.ఆనాటికి అత్యంత పారితోషకం అందుకొన్న ప్రసిద్ధ హాలీవుడ్ నటీమణి. కాందిశీకుల అమెరికా చేరుకొన్న యూదుల సంరక్షణలోను,యుద్ధ నిధిసేకరణలోను  ప్రధాన పాత్ర పోషించింది. మిత్రపక్షాల సైనికుల కోసం విస్తృతంగా ప్రదర్షనలు ఇచ్చింది.”తన హృదయానికి దగ్గరయిన” లిలీమార్లీన్ పాత్రను పోషిస్తూ , మార్లీన్ డీట్రిచ్ పాడిన పాట మిత్రపక్షాలకు దగ్గరయ్యింది. ఆయువుపట్టు అయ్యింది. పితృభూమికి తిరిగి రమ్మన్న హిట్లర్ ఆహ్వానాన్ని, మార్లీన్ డీట్రీక్ తిరస్కరించింది.  మార్లీన్ డీట్రీక్ నాజీ దురాగతాలను ధైర్యంగా వ్యతిరేకించింది. లోకానికి బహిర్గతం చేసింది .అందుకు మార్లీన్ డీట్రీక్ తన ప్రదర్షనలనే వేదికగా చేసుకొంది. ఆమె ప్రదర్షనలల్లో ఆమె పాడిన లిలి మార్లీన్ పాట ఒక ముఖ్యమైన పాత్ర వహించింది.

ఒక యువ సైనికుడి దిగులులో పుట్టిన కవిత , ఇన్ని ఒడిదొడుకులలో ఆగుతూ ,సాగుతూ, ఒదుగుతూ ,ఎదుగుతూ, కాలాలను ఖండాలను దాటుకొని, మిత్రులలోకి చొచ్చుకుపోయి,మనుసులలోనాటుకు పోయిన, శతృవుల పాట గా,  లిలిమార్లీన్ ప్రస్తానం గురించి డాక్యుమెంటరీలు, సినిమాలు తీసారు. యుద్ధానంతర పునర్నిర్మాణంలోనూ లిలి మార్లీన్ ఒక ఊరటగా, ఆసరాగా మారింది., యుద్ధం మిగిల్చిన ఒక తీపి జ్ఞాపకం అయ్యింది.

ఇంతకీ లిలి మార్లీన్ ఎవరంటే , ఇద్దరు యువతుల పేర్ల కలయిక .హాన్స్ లీప్  నెచ్చెలి ముద్దు పేరు లిలి , ఆమె హాంబర్గ్ లో ఒక సరుకుల కొట్టు యజమానికి కూతురు.  ఇక మార్లీన్ , లీప్ స్నేహితుని నెచ్చెలి. ఒక నర్స్. సైనిక శిబిరాల గేటుకు ఆవలగా వారు వచ్చి,  వీధి లాంతరు నీడలో నిలబడి, సైనికుల కోసం వేచి ఉండడం, లోపల ఉన్న సైనికులను కలిసే వీలుకాక, నిరాశగా తిరిగి వెళ్ళడం. పొగమంచులోకి కరిగిపోయే వారి నడక. కాపలా సైనికుడైన హాన్స్ లీప్ మనసులో ముద్రించుకొని పోయాయి. వారి ఇరువురు యువతుల కలయికే లిలి మార్లీన్.

ఇంతకీ, ఈ పాట ఇంత ప్రాచుర్యం పొందడానికి కారణం ఏమంటారు? ప్రతి సైనికుడి మనసులలోనూ ఒదిగిన అ లిలి మార్లీన్ ప్రతి రూపమే, గాఢానురాగమే, ఇల్లు ఇల్లాలు మధురభావన.

లేదూ, యుద్ధశకలాలవుతూ, అనివార్యంగా చిన్నాభిన్నమవుతున్న ,  స్త్రీపురుష సంబంధాలలోని మార్పులలో , తనకు మాత్రమే స్వంతం అయిన తన స్త్రీ , తన కోసం మాత్రమే నీతిగా నిజాయితిగా వేచిఉండాలన్న ఆలోచనల ఇరుకుతనమా? ఆధిపత్య భావనా? అహంభావమా?

ఏది ఏమైనా,వాస్తవంలో  యుద్ధం సరికొత్త యూరోపియన్ మహిళను ఆవిష్కరిచింది. సాంప్రదాయాల చట్రాలన్నీ ముక్కలయ్యాయి. లెలె ఆండెర్సన్, మార్లీన్ డీటిచ్, లూసీ మాన్నెహాం  మూర్తిమత్వం పొందిన, స్వతంత్ర స్త్రీ మూర్తులకు ప్రతీకలుగా ఆవిర్భవించారు. నియంతలనే ధిక్కరించి,మరణం అంచులో నిలబడి, ఎదురొడ్డి పోరాడి , నిలిచిన వారికీ ఆయువుపట్టు “లిలి మార్లీన్” కావడం విశేషం.

యూరోప్ ,మెడిటేరీయన్ తీరం అంతా ఈ పాట విస్తరించింది. ఆఫ్రికా ఎడారిలోకి, సైబేరియా మంచు భూముల్లోనూ ఈ పాట ప్రయాణించింది.ఎక్కడ ప్రపంచ యుద్ధ సైనికుడుంటే అక్కడికి ఈ పాట చేరిపోయింది. భాష అడ్డం రాలేదు. ఎవరికి తోచిన పదాలతో వారు పాటను నింపుకొన్నారు. ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి, జరిగిన దారుణమారుణ హోమానికి, ప్రపంచం ముందు జర్మనీ దోషిలా నిలబడింది. ఓటమి, అవమానం, లజ్జలతో జర్మనీ కుంగిపోయింది.ప్రపంచమంతా జర్మన్ ను అసహ్యించుకొనే ఆ సమయాన, అందరూ ప్రేమించినది ఈ జర్మన్ పాట, లిలి మార్లీన్ నే.  

  ఏది ఏమైనా, వ్యక్తులయినా దేశాలయినా,   యుద్ధాలు గెలిచినా గెలిపించినా ,ఓడినా ఓడించినా ఆ శక్తి  దానితో ముడిపడిన మానవ సంబంధానిదే! మనిషిలో జీవితేచ్చను రగిలించే, సాటి మనిషితో  నాజూకు మానవ సంబంధమే. తనను తాను అసహ్యించుకొనే వేళలోనూ, జీవితం పట్ల గాఢానురక్తినీ, ప్రేమను , ఆశను కలిగించేదీ , ఆ అపురూప బంధమే. లిలి మార్లీన్ పాట ను చిరంజీవిని చేసింది ఆ జీవనానుబంధమే.

  ***

గాయని : లెలె ఆండర్సన్ (1939)

(https://www.youtube.com/watch?v=wh4qe0Hp6RU)

 1.

సైనిక శిబిరం ఎదురుగా,

పెద్ద వాకిలి గుమ్మం ముందర,

ఒక దీపస్తంభం ఉన్నది

అదింకా అక్కడే ఉన్నది

మళ్ళీ ఆ లాంతరు వెలుగులో కలుద్దాం మనం

మళ్ళీ ఆ దీపస్తంభం నీడన నిలబడదాం

సరిగ్గా లిల్లి మార్లీన్ లాగానే

సరిగ్గా లిల్లి మార్లీన్ లాగానే

2.

మన ఇద్దరి నీడలు ఒక్కటైనట్లుగా కనబడ్డాయి

మన ఇద్దరం ప్రేమలో మునిగి ఉన్నామని

అందరూ  అనుకొనేలా..

మనం ఆ లాంతరు నీడలో నిలబడ్డాం

అచ్చం లిల్లీ మార్లీన్ లాగా

అచ్చం లిల్లీ మార్లీన్ లాగా

3.

కాపలా సైనికుడు  అప్పుడే పిలుస్తున్నాడు.

వాళ్ళు చివరి విధులను సరిజేశారు.

” అది మీ మూడు రోజులను ఖర్చు పెట్టించేలాగా ఉంది”

” మిత్రమా, నేను ఇప్పుడే లోపలికి వచ్చేస్తాగా!”

సరిగ్గా అప్పుడేగా మనం వీడ్కోలు చెప్పుకొన్నాం.

నీతో కలిసి వచ్చేయ్యాలని ఎంతగా అనుకొన్నానో తెలుసా

నీతోనే, లిల్లీ మార్లీన్

నీతోనే , లిల్లీ మార్లీన్

4.

 నీ అడుగుల సవ్వడి నాకు తెలుసులే .

ఎంత అందంగా  నడుస్తావో నీవు.

ఆ అందమైన అడుగుల సవ్వడి

నా రాత్రులను జ్వలింపజేస్తోంది

మరిచిపోగలనా రోజుల్లో పడి.

చాన్నాళ్లయ్యిందిగా, 

మరి నా సంగతి మరిచిపోయారా?

నాకేదైనా జరిగితే ?,

నాలో ఏదో బాధ కలుక్కుమంటుంది,

లాంతరు దగ్గర నీ పక్కన నిలబడేది ఎవరు?

నీతో పాటు, లిల్లీ మార్లీన్?

నీతో పాటు లిల్లీ మార్లీన్?

5.

ఆ మౌన ప్రకంపనల్లో ,

ఆ మట్టి మైదానాల్లో

నన్ను మెలుకువగా ఉంచేది

నీ అందమైన అధరాల కలలేగా .

చీకట్ల మంచు దుప్పట్లు వీడగానె,

నేను ఆ లాంతరు పక్కన వచ్చి నిలబడనా,

అచ్చం  లిల్లీ మార్లీన్, నిలబడి నట్లుగా.

అచ్చం  లిల్లీ మార్లీన్, నిలబడి నట్లుగా.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.