కంప్యూటర్ భాషగా తెలుగు 

తెలుగు టైపు ప్రాథమిక దశ

 

-డా|| కె. గీత

“1923 అక్టోబర్ నెలలో గుంటూరు నుంచి శ్రీ దిడుగు వెంకట నరసింహారావు తెలుగు టైప్ రైటర్ తయారు చేయడానికి ఆర్ధిక సహాయం కోసం ప్రకటన చేశారు.  ఆ తరువాత అదే సంవత్సరం డిసెంబర్ నెలలో తెలుగులో మొదటి టైప్ రైటర్ తయారు చేయడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం తన వద్ద కూడా ఉన్నదని నిజాం రాజ్యంలోని భువనగిరి దగ్గర గ్రామమైన కొండగడప నుంచి ఆచార్య అనే వ్యక్తి ప్రకటన ఇచ్చారు.  

ఆ తరువాత 13 సంవత్సరాలకు ప్రజలకు అందుబాటులోనికి తెలుగు టైపు రైటర్ 1935లో ‘చిన్నమాంబాంధ్ర ముద్రలేఖిని’ రూపంలో వచ్చింది.” (సరసభారతి)

చివరికి  పానగల్ రాజ గారి కృషి వల్ల ఒకే టైపు రైటర్ తో ఇంగ్లీషు, తెలుగు రెండుభాషల్లోనూ టైపు చెయ్య గలిగిన టైపు రైటర్ తయారయ్యింది.

అక్కడి నుండి మొదలుకుని పదో తరగతి పాసైన ప్రతి విద్యార్థీ మొదటగా నేర్చుకోవలసిన సాధనమయ్యింది టైపు రైటర్. 1980 ల వరకూ  టైపు నేర్పటానికి ప్రతి వీధికీ  ఒక టైపు ఇన్స్టిట్యూట్ ఉండేది.  

ఏ ఆఫీసుకు వెళ్లినా ఇంతకు ముందు టైపు చేయడానికి ఓ టైపిస్టు  ప్రత్యేకంగా ఉండేవారు. 

టైపు చెయ్యడమే జీవనోపాధిగా ఉన్న  రోజుల్లో టైపు బాగా నేర్చుకుంటే టైపిస్టు ఉద్యోగాలు, దానితో బాటూ షార్ట్ హాండు కూడా నేర్చుకుంటే గుమాస్తా, సెక్రటరీ వంటి ఉద్యోగాలు రావడం చాలా గొప్పగా ఉండేది. 


ఇలా అర్థ శతాబ్దికి పైగా వర్థిల్లిన తెలుగుటైపు మిషనే  కంప్యూటర్లలో తొలినాళ్ల నాటి తెలుగు కీ బోర్డుకు భూమిక అయ్యింది. 

కంప్యూటర్లో తెలుగులో టైపు చెయ్యడానికి టైపు మిషన్లలా ఇంగ్లీషు అక్షరాల స్థానే తెలుగు అక్షరాలు ఉంటే సరిపోదు. టైపు మిషనులో టైపు కొట్టే అక్షరాలు ఎదురుగా తెల్ల కాగితమ్మీద ముద్రితమై వెంటనే బయటకు తీసుకునే వీలు ఉంటుంది.  కంప్యూటర్ కీ బోర్డు మీద టైపు కొట్టే అక్షరాలు తెర మీద కనిపించిన తర్వాత కాగితమ్మీద ప్రింటు చేసుకోవడానికి ఒక ప్రింటర్ కూడా అవసరం. టైపు మిషనుకి, కంప్యూటర్ కీ తేడా ఏవిటంటే టైపు మిషను ఒక్కసారి మాత్రమే ముద్రణ చేసుకోగలిగినది (కార్బను పేపర్లతో బహుశా: ఎక్కువలో ఎక్కువ రెండు మూడు కాపీలు). అయితే కంప్యూటర్ మీద ఒకసారి టైపు కొట్టినది ఎప్పటికీ  ఒక చోట దాచుకోవడానికీ, ఎన్ని సార్లయినా ఎన్ని ప్రింట్లయినా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది కంప్యూటర్ మీద తెలుగు టైపు చెయ్యడంతో ఉన్న ఒకానొక ఉపయోగం మాత్రమే.

టైపు మిషను వల్ల ఆఫీసు ఫైళ్లకి, పుస్తక ప్రచురణ, పత్రికలు, సినిమాలు, నాటకాలు వగైరాల రచనలకు మొ.న పరిమిత ఉపయోగాలుండేవి. 

మారుతున్న కాలానికనుగుణంగా కంప్యుటర్లో తెలుగు ఉపయోగాలు కూడా మారుతూ రావడం వల్ల 

తెలుగు టైపుకి  మహర్దశ వచ్చింది. 

ఉపయోగాల మాట అలా ఉంచితే తెలుగు కీ బోర్డుల తయారీకి తొలి దశలో జరిగిన ప్రయత్నాలు ఇక్కడ చూద్దాం. 

పైన చెప్పినట్లు కంప్యూటర్లో తెలుగులో టైపు చెయ్యడానికి టైపు మిషన్లలా ఇంగ్లీషు అక్షరాల స్థానే తెలుగు అక్షరాలు ఉంచితే సరిపోదు. 

తలకట్లు , ఒత్తులు ఎక్కడివక్కడ ఎగిరిపోకుండా పనిచెయ్య గలిగే పద్ధతి కూడా అవసరం. 

తెలుగు అక్షరాలే కీ బోర్డు మీద ముద్రితమై ఉండేలా “ఇన్‌స్క్రిప్టు కీ బోర్డు “ తెలుగు కీ బోర్డుకి  ప్రాథమిక దశ. ఇది టైపు మిషన్ల పద్ధతిలో  ప్రారంభమైన సాంప్రదాయిక కీ బోర్డని చెప్పవచ్చు. ఇది ఇప్పటి స్మార్ట్ ఫోన్ల లో  తెలుగు కీ బోర్డు, ఇంగ్లీషు కీ బోర్డు లుగా విడివిడిగా మార్చి మార్చి కనబడే పద్ధతి కి మాతృక. 

ఇన్‌స్క్రిప్టు (Inscript) అనే పదం ఆంగ్లంలోని ఇండియన్ స్క్రిప్టు (Indian Script) నుండి వచ్చింది. ఈ కీబోర్డు అమరికను భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్సు విభాగం (Department of Electronics) 1986లో తయారు చేసింది.  అయితే ఈ అక్షరాలనన్నిటినీ ఐఐఎస్‌సిఐ (IISCI) అనే ప్రామాణికంలో నిర్వచించారు. 

ఇంగ్లీషు అక్షరాల స్థానే ఉన్న ఇన్‌స్క్రిప్టు అక్షరాల ఓవర్ లే వాడడం ద్వారా మనం సాధారణంగా వాడే ఇంగ్లీషు క్వర్టీ (Qwerty) కీ బోర్డుతోనే  దీనిని వాడవచ్చు

దీనిలో ఇక్కడ చూపించినట్లు ఇంగ్లీషు క్వర్టీ కీ బోర్డులో ఒక్కొక్క మీటకీ ఒక తెలుగు అక్షరం లేదా గుణింతం జత చేయబడి వుంటుంది.

ఇన్‌స్క్రిప్టు కీ బోర్డు లో  ఏ అక్షరం ఎక్కడ ఉంటుందో అర్థం చేసుకోవడానికి, బాగా నేర్చుకోవడానికి,  సమయం పడుతుంది. ఆ తరువాత టైపు సులభంగా, త్వరగా చేయవచ్చు. 

కంప్యూటర్లో తెలుగు టైపు  విషయమై  టెక్నికల్ వివరాలు ఈ-మాట లో సురేశ్ కొలిచాల గారి వ్యాసం నుంచి యథాతథంగా ఇక్కడ ఇస్తూ వివరిస్తాను.

“కంప్యూటర్లు ప్రధానంగా అంకెలతో పని చేస్తాయి. ఒక్కో అక్షరానికీ లేదా వర్ణానికీ ఒక్కో సంఖ్యని కేటాయించి నిక్షిప్తం చేసుకొంటాయి. యూనీకోడ్ ప్రవేశానికి పూర్వం భాషలోని అక్షరాలకు సంఖ్యలను కేటాయించడానికి సార్వజనిక ప్రమాణంగా ఉన్న ASCIIలో 128 సంకేత స్థలాలు (code points) మాత్రమే ఉండేవి. ఇంగ్లీష్ భాషకు అవసరమైన అన్ని అక్షరాలు, విరామ చిహ్నాలను పూర్తిగా నిక్షిప్తం చేయడానికే ఈ సంకేత స్థలాలు సరిపోయేవి కాదు. ఆ తరువాత మిగతా యూరోపియన్ భాషలలోని అదనపు అక్షరాల కోసం నిర్మించిన Extended ASCII ప్రమాణాలలో 256 సంకేత స్థలాల వరకూ వాడుకోవచ్చు. ఆ రోజుల్లో ప్రత్యేకమైన టైప్‌సెటింగ్ (Typesetting) సాఫ్ట్‌వేర్ వాడితే గానీ తెలుగు వంటి మిగతా ప్రపంచ భాషలలోని అక్షరాలను నేరుగా చూపించడం సాధ్యమయ్యేది కాదు.”

ఇక్కడ ASCII (American Standard Code for Information Interchange) ఆశ్కి కోడ్ అంటే ఏవిటంటే, ఒక కంప్యూటర్ నుండి ఇంకొక కంప్యూటర్‌కు డేటా ఇచ్చి పుచ్చుకొనేందుకు వీలుగా ఉండేందుకు ఒక్కొక్క అక్షరానికి ఇవ్వవలసిన స్థిరీకరణ కోడ్‌ అన్నమాట. 

1972 ప్రింటర్ మాన్యువల్ నుండి ఆశ్కి (ASCII) పట్టిక ని ఇక్కడ చూడండి. 

ఇక తెలుగు టైప్‌ సెటింగ్ చరిత్రలో మొట్టమొదటి కృషి గురించి చూస్తే-

“కనూత్ నిర్మించిన టెక్ (TeX) టైప్‌ సెటింగ్ వ్యవస్థ ఆ రోజుల్లో యూనివర్సిటీలోనూ, పరిశోధనా సంస్థలలోను చాలా విరివిగా వాడేవారు. ఈ టెక్ (TeX) ముద్రణ వ్యవస్థ ఆధారంగా తెలుగు అక్షరాలు, ఒత్తులు, గుణింతాలకు అవసరమైన మెటాఫాంట్ (METAFONT) మాక్రోలతో, లాటెక్ (LaTeX)కు పొడిగింపుగా నిర్మించిన తెలుగుటెక్ (TeluguTeX) తెలుగు టైప్‌సెటింగ్ చరిత్రలో మొట్టమొదటి కృషి. దీన్ని 1990-1992 లో అయోవా స్టేట్ యూనివర్సిటీ ( Iowa State University) లో చదువుకుంటున్న లక్ష్మీ ముక్కవల్లి, లక్ష్మణ్ కుమార్ ముక్కవల్లి దంపతులు సృష్టించారు.

అయితే తెలుగుటెక్ (TeluguTeX) తమ తమ యూనిక్స్ మెషీన్లపై ఇన్‌స్టాల్ చేసుకొని దాన్ని పనిచేసేట్టుగా చేయడం ఎంతటి ప్రోగ్రామర్ కైనా కష్టసాధ్యంగానే ఉండేది. అంతే కాకుండా, ముక్కవల్లి వారు వాడిన ఫోనెటిక్ ఇన్‌పుట్ స్కీమ్ కొంత అసహజంగా, అనియతంగా ఉండేది.”  

“ఫోనెటిక్ ఇన్‌పుట్”  అంటే తెలుగుని ఎలా పలుకుతామో టైపు చెయ్యడం అన్నమాట. అంటే తెలుగుని పలికే పద్ధతిలో ఇంగ్లీషు లిపిలో టైపు చేస్తూ తద్వారా తిరిగి తెలుగు అక్షరాల్ని పొంద గలగడం అన్నమాట. ఇక్కడ కీబోర్డు మీద తెలుగు అక్షరాలు ఉండవు.  ఉన్న ఇంగ్లీషు అక్షరాలు, సంకేతాల తోనే తెలుగు అక్షరాలు సృష్టించబడతాయి. 

అయితే ఇందులో బోల్డు చిక్కులున్నాయి. ఆంగ్లభాషలో లేనివి, తెలుగుభాషకే ప్రత్యేకమైనవీ అయిన అక్షరాలని సృష్టించాలంటే మరేదైనా సులభమైన మార్గంతరం అవసరం. దీని గురించి వివరంగా వచ్చే నెల చెప్పుకుందాం. 

*****

 

Please follow and like us:

2 thoughts on “కంప్యూటర్ భాషగా తెలుగు-2(తెలుగు టైపు ప్రాథమిక దశ)”

  1. గీత గారు నమస్కారం.
    మీరు రాసిన “కంప్యూటర్ భాష గా తెలుగు ” ద్వారా ఎంతో చక్కటి సమాచారం తెలియచేసారు.
    మీ గురించి ఇంత ఆలస్యంగా తెలిసినందుకు నేను బాధ పెడుతున్నాను.
    ఇప్పుడు తిమిరిస జానకి అమ్మ గారి తో మాట్లాడుతూ ఎందుకో ఆవిడ రాసిన ఇల్లెరమ్మ జ్ఞాపకాలు చదువుతూ నా కళ్ళు మీ పేరు మీద ఆగిపోయాయి. చూస్తును కదా మీరో మూవింగ్ ఎన్సైక్లోపీడియా అని అర్ధం అయింది. .ఇక నుండి కొంచెం కొంచెంగా చదువుతూ ఉంటాను మీ వర్డ్ ప్రెస్ రచనలు,మీవి.
    మీకు హృదయపూర్వక అభినందనలు.

    1. శ్రీదేవిరమేష్ గారూ! మీకు నా రచనలు చదవాలన్న ఆసక్తి కలిగినందుకు అనేక నెనర్లు.

Leave a Reply to శ్రీదేవిరమేష్ లేళ్ళపల్లి Cancel reply

Your email address will not be published.