సోమరాజు సుశీల స్మృతిలో –

 ఇల్లేరమ్మకు నివాళి

   -తమిరిశ జానకి 

స్నేహసుగంధ పరిమళం….నిష్కల్మష హృదయం…..నవనీత సమాన మానసం చతురోక్తుల పలుకుల సంబరం కలగలిసి రూపుదిద్దుకున్న స్వరూపమే మాఇల్లేరమ్మ శ్రీమతి సోమరాజు సుశీలగారు. 1945లో తూర్పుగోదావరిజిల్లా సిద్ధాంతంలో జన్మంచిన సుశీలగారికి 1966 లో వివాహమయినది. అప్పటికి ఆవిడ ఎమ్.ఎస్.సి. పట్టా పుచ్చుకున్నారు. కొన్నాళ్ళు విజయవాడ మేరీస్టెల్లా కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేశారు. ఆతర్వాత శ్రీవారితో కలిసి పూనేలో ఉన్నప్పుడు అక్కడి నేషనల్ కెమికల్ లేబొరేటరీలో సైంటిస్ట్ గా చేశారు. డాక్టరేట్ తెచ్చుకున్నారు. పారిశ్రామికరంగంలో అడుగుపెట్టి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్త్రీ పారిశ్రామిక వేత్తగా ప్రముఖులచేత ప్రశంశలు  పొందారు. సుశీలగారు నిరాడంబరులు సౌమ్యులు. ఆవిడను చూస్తే ఇంత చదువుకున్నారా అని స్వంతంగా పరిశ్రమ నడుపుతున్నారా అని ఆశ్చర్యం కలగక మానదు. భాగ్యనగర్ లేబొరేటరీస్ స్థాపించారు. మహిళా ఎంటర్ ప్రెన్యూర్ అవార్డు గెలుచుకున్న ఘనత ఆవిడది.


యాభై సంవత్సరాలు దాటిన తర్వాత రచనారంగంలో అడుగుపెట్టిన సుశీలగారు మొదటి అడుగుతోనే ప్రముఖ రచయిత్రిగా పేరు గడించారు. ఇల్లేరమ్మ కధలతో ఆవిడ పేరు ఇల్లేరమ్మగా స్థిరపడిపోయిందనడంలో ఆశ్చర్యంలేదు. ఇల్లేరమ్మ కధలు కల్పితంకాదు ఆకధలన్నీ ఉన్నదున్నట్టు రాసిన మా ఇంటి కదలే అంటారు ఆవిడ. ఇల్లేరమ్మ కధలు ప్రతి ఒక్కరూ చదివవలసిన కధలు. అలాగే ఆకలంనుండి జాలువారిన చిన్నపరిశ్రమలు – పెద్దకధలు అనే ధారావాహిక పారిశ్రామికరంగంలో ఆవిడ ఎదుర్కొన్న కష్టాలకి ఒక రూపం. అవి కధలుకావు నా గోడు వెళ్ళబోసుకోవడమే అని ఒక్క ముక్కలో అనేస్తారు. స్వానుభవమ్మీద రాసినవి మరి. ఆలస్యంగా రచనలు మొదలుపెట్టినా రాసిన కధలన్నీ ఆణిముత్యాలే. పరిశ్రమలు , రచనలు మాత్రమే కాదు. వివిధ సామాజిక సేవా రంగాలలో ఎప్పుడూ ముందుంటారు  ఆవిడ.


రామసేతు ప్రాజెక్టులో యాక్టివ్ గా పనిచేశారు. తిరుమల తిరుపతి సంరక్షక సమితికి ఉపాధ్యక్షులుగా పని చేశారు. లయనెస్ క్లబ్ కి జిల్లా అధ్యక్షులుగానూ, వాలంటీర్ సర్వీస్ ఆర్గనైజేషన్ రాణి రుద్రమ ట్రస్టుకి మరియు అపరాజిత సేవాసమితి వాలంటీర్ సర్వీస్ ఆర్గనైజేషన్ కి రెండింటికీకూడా అధ్యక్షులుగా ఉన్నారు.


ప్రాంత్ సంపర్క్ ప్రముఖ్ లో పది సంవత్సరాలుగా పాలుపంచుకుంటున్నారు.రాష్ట్ర సేవికాసమితిలో 2005 నుండి సామాజికసేవ చేస్తున్నారు. ఎన్నో సెమినార్లు , వర్క్ షాపులలో అధ్యక్షులుగా వాలంటరీ వర్క్ చేశారు. మహిళలసాధికారత , స్వయుంఉపాధి,  విద్య ,సాంకేతికరంగంలో అభివృద్ధి ఇంకా ఇతరములైన సామాజిక అంశములపై ఎన్నో సభలలో ప్రసంగించారు.


సుశీలగారు హిందూధర్మం , సంప్రదాయాలను వివరిస్తూ మంచి రచనలు పాఠకులకు అందించారు .చిన్నపరిశ్రమల గురించి మాత్రమేకాదు ప్రముఖులైన శాస్త్రవేత్తలు విద్యావేత్తలు గురించిన పుస్తకాలు రాయడమే కాదు ప్రముఖ శాస్త్రవేత్త నాయుడమ్మ జీవితచరిత్ర రాశారంటే ఆవిడ గొప్పతనం మాటల్లో చెప్పలేనిది.
లక్ష్మీబాయి కేల్కర్ మరాఠీ భాషలో రాసిన రామాయణంపై  ప్రసంగాలను , ఆర్.ఎస్.ఎస్.లో ప్రముఖ సంచాలకులైన ప్రొఫెసర్ సింధునవలేకర్ ఇచ్చిన ప్రసంగాలను తెలుగులోకి అనువదించారు సుశీలగారు.


సామాజికంగానూ సాహిత్యపరంగానూ ఇంకా ఎంతో సేవ చేసే మనస్తత్వం ఉన్న సుశీలగారివంటి మంచిమనిషి హఠాత్తుగా సెప్టెంబర్ 26-2019న ఈలోకాన్ని విడిచి వెళ్ళిపోవడం మనందరికీ ఒక తీరని లోటు. జీర్ణించుకోలేని సత్యం. నమ్మకతప్పదు. ఆవిడకు మనందరి  తరఫునా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. 


*****   

 

ప్రయాణం

-సోమరాజు సుశీల

 
పెద్దతనం, ముసలి తనం, వృద్ధాప్యం అని అందరూ 
హడలగొట్టి చంపేసే ఆ దశ వచ్చేసిందా? అప్పుడే వచ్చేసిందా?
 
నిన్నగాక మొన్ననేగా మావయ్య కొనిచ్చిన కొత్త ఓణీ చూసి మురిసి ముక్క చెక్కలయిందీ !
ఎదురింట్లో అద్దెకున్న స్టూడెంట్ కుర్రాడు ఇంకా కాలేజీకి వెళ్ళడేమిటా 
అని విసుక్కున్నదెప్పుడూ… నాలుగు రోజుల క్రితమేగా!
 
ప్రతి పెళ్ళిచూపులకి సింగారించుకుని కూచుని, తీరా వాళ్లు జాతకాలు నప్పలేదని కబురు పెడితే 
తిట్టరాని తిట్లన్నీ అందరం కలిసి తిట్టుకుంటూ ఎంజాయ్ చేసింది నిన్న మొన్నేగా!
నాన్నని కష్టపెట్టకూడదని కూడబలుక్కుని, ఇంటి అరుగుమీద పెళ్ళి,
పెరట్లో కొబ్బరి చెట్టుకింద బూందీ, లడ్డూ, కాఫీలతో రిసెప్షనూ ఇచ్చి, 
ఇంటి ఇల్లాలినయి ఎన్నాళ్ళయిందనీ !
అందుకు తగ్గట్టే పెళ్లివారు ఒకే పట్టుచీర తెచ్చి అన్నిటికీ దాన్నే తిప్పితే, 
నలుగురూ నవ్వినందుకు పౌరుషం వచ్చి, ‘మేం బొంబాయిలో కొనుక్కుంటాం’ అని గొప్పలు పోయింది ఈ మధ్యనేగా !
 
అయినా ఏం లోటయిందని ?
వాయిల్సూ, జార్జెట్ లూ, బిన్నీలూ, బాంబే డయింగులూ, విమలలూ,
వెంకటగిరి , ఉప్పాడ, గద్వాల, గుంటూరు, బెనారసు, కంచి, మైసూరు, ధర్మవరం, మహేశ్వరం, ఒరిస్సా, అస్సాం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్… అబ్బ.. అబ్బబ్బ ఎన్ని రాష్ట్రాలని పాలించాం! ఎన్ని చీరలు కట్టాం!
 
ముగ్గురు పిల్లల్నేసుకుని రిక్షాలెక్కుతూ దిగుతూ, హాస్పిటళ్లూ, స్కూళ్లూ, పెళ్లిళ్లూ, పేరంటాలూ, పురుళ్లూ, తద్దినాలూ, నోములూ, వ్రతాలూ…ఎన్నెన్ని పండగలూ, ఎంతెంత హైరానాలూ….ఒక్కరోజయినా నడుం నొప్పని పడుకుని ఎరుగుదుమా, ఎవరైనా పలకరించడం విన్నామా?!
పాపాయ్, నానీ, చిట్టితల్లీ, బంగారం, అక్కా, వదినా, ఇదిగో, కోడలమ్మా, పిన్నీ, అత్తా, చిన్నమ్మా. అమ్మా, పెద్దమ్మా, అమ్మమ్మా, నానమ్మా, పెద్దమ్మమ్మా, పెద్ద బామ్మా, జేజమ్మా… అమ్మో ఎన్ని మెట్లెక్కాం! ఎన్నెన్ని పిలుపులకి పలికాం !
 
ఇంతట్లోకే పెద్దయిపోయామా! అప్పుడే అందరూ అమ్మగారనడం మానేసి మామ్మగారంటున్నారు!
అంటే అన్నారుగాని పాపం లేవబోతుంటే చేయందిస్తున్నారు! 
చేతనున్న చిన్న బ్యాగు తామే తెస్తామని లాక్కుంటున్నారు….
పదికిలోల బియ్యం అవలీలగా వార్చిన వాళ్లం! ఈ బరువొక లెక్ఖా, వాళ్లంత ముచ్చట పడుతుంటే కాదనడం ఎందుకని గానీ?
 
పెద్దయితే అయ్యాంగానీ ఎంత హాయిగా ఉంటోందో!
మండే ఎండల తర్వాత వాన చినుకు పడ్డట్టు…
ముసుళ్ల వానల ముజ్జిడ్డులు దాటి, వెన్నెల మోసుకొచ్చే చందమామ కనపడ్డట్టు…
గజ గజ లాడే చలి వణుకులు వణికాక వెచ్చటి కమ్మటి మట్టిగాలి పలకరించినట్టు…
ఎంత హాయిగా వుందో!
 
ఒకటే ఇడ్లీ తింటే గంటకే ఆకలేస్తుంది.. పోనీ అని రెండు తింటే అపరాహ్నమయినా అన్నానికి లేవబుధ్ధి కాదు!
ఆవకాయని చూస్తే బీపీ, మామిడి పండుని తల్చుకుంటే సుగరూ, పగలు కాస్త రెండు ముద్దలెక్కువయితే 
రాత్రికి మజ్జిగ చాలు… ఎంత తేలిక అవసరాలు!
 
సగం భోజనం మిగతా సగం మందులు .. అవి ఉండ బట్టే కదా ఇంకా మనగల్గుతున్నాం!
ఇంకొక పెద్ద విశేషం ఉందండోయ్, ఎవరికీ తెలియనిదీ మనం పైకి చెప్పనిదీ ..
మనం ఎవరికీ అక్కర్లేదు కాబట్టి మనకీ ఎవరూ అక్కర్లేదు! 
ఎవరూ మన మాట వినిపించుకోరు కాబట్టి మనమూ ఎవరి మాటా వినిపించుకోనక్కర్లేదు !
అంతా నిశ్శబ్ద సంగీతం!
ఏరుని ఎప్పుడూ గలగలా ప్రవహించమంటే కుదుర్తుందా? సముద్రం దగ్గర పడుతుంటే హాయిగా నిండుగా హుందాగా అడుగులేస్తుంది కదా!
 
అయినా ఎపుడేనా మనకి తిక్క పుట్టినపుడు అడ్డంగా, అర్ధం పర్ధం లేకుండా వాదించి ఇవతల పడచ్చు.
ఇంత వయసు వచ్చాక ఆ మాత్రం చేయ తగమా !
ఈ మధ్యనే నేను కనిపెట్టాను ఇంకొక పెద్ద విశేషం…అస్తమానం ప్రవచనాలు వింటూ హైరానా పడక్కర్లేదు.
మనకి చెప్పడం రాదు గానీ వాళ్ళు చెప్పేవన్నీ మనకూ తెలుసు!
కాబట్టి హాయిగా పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తూ కుళ్లు జోకులకి కూడా గట్టిగా నవ్వుకోవచ్చు. ఎవరూ ఏమీ అనుకోరు.
 
అవునూ… మనం కనపడగానే మొహం ఇంత చేసుకుని ఆనంద పడిపోయే మన పిన్నిలూ, బాబాయిలూ, అత్తయ్యలూ, మామయ్యలూ ఏమయిపోయారు? ఎప్పుడెళ్లిపోయారు?
’ పిచ్చిపిల్లా కొత్త మాగాయలో వేడన్నం కలుపుకుని, ఈ నూనె చుక్కేసుకుని రెండు ముద్దలు తిను’ అంటూ వెంటబడే వాళ్లెవరూ లేరే?
అంటే మనమే పెద్దవాళ్లయిపోయామన్నమాట! 
చూస్తూండగానే సాటివాళ్లు కూడా కనిపించడం మానేస్తున్నారు. కొందరుండీ లేనట్టే. లేకా వున్నట్టే. జీవితానికి విశ్రాంతి దానంతటదే వస్తోంది.
 
అయినా రైలెక్కాక కిటికీ పక్కన కూచుని దారిలో వచ్చే పొలాలూ, కాలవలూ, కుర్రకారూ, పల్లెపడుచులూ, టేకు చెట్లూ, భవనాలూ, వాటి పక్కనే గుడిసెలూ, అక్కడాడుకుంటూ చేతులూపే చిన్నారులూ, ఉదయిస్తూ అస్తమిస్తూ అలుపెరగక డ్యూటీ చేసే సూర్యనారాయణమూర్తులూ, మిణుకు మిణుకుమని హొయలుపోయే చుక్కలూ చూస్తూ ప్రయాణం ఎంజాయ్ చెయ్యాలి గానీ స్టేషనెప్పుడొస్తుందో అని ఎదురుచూడడం ఎందుకూ?
 
తీరా అదొస్తే ఏముందీ! జీవితమంతా పోగేసిన సామాన్లన్నీ వదిలేసి దిగిపోవడమేగా!
*****

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.